జైత్రయాత్ర-16

1
12

[శ్రీ కస్తూరి రాజశేఖర్, కస్తూరి వేణుగోపాల్ రచించిన ‘జైత్రయాత్ర’ అనే నవలని ధారావాహికగా అందిస్తున్నాము.]

[బావి పని చివరికి వచ్చేస్తుంది. బావి చుట్టూతా చప్టా కడుతున్న సమయంలో అక్కడున్న వనజ స్పృహ తప్పి పడిపోతుంది. వెంకట్రావు ఆమెని గబగబా డాక్టర్ దగ్గరకి తీసుకెళ్తే, అతను 500 రూపాయలు తీసుకొని, వనజని ఏమీ పరీక్షించకుండానే ఏదో మందు రాసిచ్చి, తమ మెడికల్‍ షాపులోనే కొనమంటాడు. ఆ మందు పేరు చూసి ఏదో అనుమానం వచ్చి, డాక్టర్‍ని మళ్ళీ అడిగితే, నన్ను అవమానించద్దని అంటాడు డాక్టర్. ఆ మాత్ర కొని వనజకి వేయగా, ఆమె పరిస్థితి ఇంకా తీవ్రమవటంతో సిటీ లోని హాస్పటల్‍లో చేరుస్తారు. అక్కడి డాక్టర్ వనజని ఊర్లో వేసిన టాబ్లెట్ గురించి తెల్సుకుని, అది నకిలీ మందు అనీ, దాన్ని ప్రిస్క్రైబ్ చేసిన డాక్టర్‍పై కంప్లైంట్ చేయమని సూచిస్తాడు. వనజ కోలుకున్నాకా, డా. పిచ్చేశ్వర్రావు మీద పోలీస్ కంప్లైంట్ ఇచ్చి మళ్ళీ గ్రామానికి వస్తారందరూ. శోభని కలవడానికి సుబ్బు వాళ్ళింటికి వెళ్తే, సుబ్బుని పాపయ్యశెట్టికి పరిచయం చేస్తుంది. సుబ్బుతో కాసేపు మాట్లాడి, ఉచిత సలహాలు చెప్పి బయటకు వెళ్తాడు శెట్టి. టిఫిన్ తిన్నాకా, శోభ తమ ఇంట్లో ఉన్న గోడౌన్ చూపిస్తుంది. ప్రభుత్వం ప్రజల కోసం చౌక ధరకి సప్లయి చేసిన బియ్యం, పప్పులు అన్నీ అందులో ఉండడం చూసి సుబ్బు విస్తుబోతాడు. అంతలో అక్కడ అతనికి ఓ వెండి కడియం కనిపిస్తుంది. అతనికేదో అనుమానం వస్తుంది. వెంటనే అక్కడ్నించి వచ్చేసి, అందరికీ చెబితే, అదేం పెద్ద విషయం కాదని అంటారు. శ్రీనివాస్ మాత్రం ఆ కడియం ప్రకృతిది అయి ఉండవచ్చని, దాన్ని ఎలాగైనా తీసుకురమ్మని సుబ్బుకి చెప్తే, సుబ్బు మళ్ళీ శోభ ఇంటికి వెళ్ళి చాకచక్యంగా ఆ కడియాన్ని తీసుకుని క్యాంపుకి వచ్చేస్తాడు. శీనయ్య తన ఇంట్లో ఒక్కడే కూర్చుని ఫారిన్ విస్కీ తాగుతుంటాడు. బ్యాగ్‍లో ఉన్న పదివేల రూపాయలని తడిమి చూసుకుంటాడు. తాగీ తాగీ సొమ్మసిల్లి పడిపోతాడు. మర్నాడు ఉదయం మిత్రత్రయం అక్కడికొచ్చి అతడి మీద నీళ్ళు గుమ్మరించి నిద్ర లేపుతారు. సాయంత్రం రచ్చబండ దగ్గర అతనికి సన్మానమని, రాయుడు గారికి. పాపయ్య శెట్టి గారికి, డాక్టర్ గారికి కూడా చేస్తున్నామని, తప్పక రావాలి చెప్పి వెళ్తారు. మిగతావారు రాయుడుకి, పాపయ్య శెట్టికి, డాక్టర్‌కి ఇవే మాటలు చెప్పి ఆహ్వానాలు అందిస్తారు. – ఇక చదవండి.]

అధ్యాయం-20

[dropcap]సా[/dropcap]యంత్రం ఐదు గంటలు.

అప్పటికే ఊరి ప్రజలంతా బావి దగ్గర సమావేశమయ్యారు. వారికి ఎదురుగా నాలుగు కుర్చీలున్నాయి. వెంకట్రావు రాయుడు, శెట్టి తదితరులతో కలిసి వచ్చాడు.

రాయుడు కుర్చీలంకరించాడు. చప్పట్లు కొట్టారు. బావికి కొద్ది దూరం వరకు రంగురంగుల కాగితాపు వరసలు, తోరణాలు కట్టబడి ఉన్నాయి.

అక్కడంతా పరిశుభ్రంగా ఉంచటంతో రాయుడు తదితరులు ఇది మన ఊరేనా అని ఆశ్చర్యంగా చూశారు.

పాపయ్య శెట్టి కూడా కూర్చోబోయాడు. ఎవరో గట్టిగా తుమ్మారు.

‘ఛీ.. ఛీ.. ఏమాత్రం జ్ఞానం లేదు ఈ అలగా జనానికి’ అని తిట్టుకుంటూ కూర్చున్నాడు.

ఇంతలో పోలీస్ వాన్ వచ్చి ఆగింది. రాయుడు బృందం ఆశ్చర్యపోయింది.

‘తాము కబురు పంపకుండా పోలీసులు రావటం ఇది రెండోసారి! ఎవరు పిలిచి వుంటారు? అసలు ఇప్పుడు పోలీసులతో ఏం పని?’

“కంగారు పడకండి రాయుడు గారు. ఈ రోజు మేము జరుపుకునే సభకు ఎస్ఐ గారిని కూడా పిలిచాము అంతే” అన్నాడు వెంకట్రావు.

ఇన్‌స్పెక్టర్‌కి ప్రత్యేకంగా వేరే కుర్చీవేశారు.

రాయుడు వెంకట్రావు తదితరుల కేసి అనుమానంగా, ఆవేశంగా చూశాడు.

‘తన ముందు చేతులు కట్టుకునే పోలీస్‌కు తనతో సమాన గౌరవం లభించడమా’ అనుకున్నాడు రాయుడు.

మిత్రత్రయం వెనగ్గా నుంచున్నారు. విద్యా వనజ స్త్రీలు నిలిచిన వైపు ముందు నిలబడ్డారు.

శీనయ్య మిగిలిన వాళ్ళు కుర్చీల వెనక్కి నిలబడ్డారు.

వెంకట్రావు కుర్చీలోంచి లేచి ముందుకు వచ్చాడు.

“ఈ వేళ శుభదినం. మీకు, మాకు, మనందరికి. మేము తలపెట్టిన కార్యక్రమం విజయవంతం అయింది. అందుకు మా కుర్రాళ్ళు ఎంతగా శ్రమించారో, అంతకుమించి మీ ప్రోత్సాహం లభించింది. కృతజ్ఞతలు! ఆకతాయిగా తిరిగే కుర్రాళ్ళల్లో ఇంత కార్యదీక్ష ఉంటుందని ఈ కార్యక్రమంలోనే నేను తెలుసుకున్నాను.

ఇంత సంతోష సమయంలో కూడా జరిగిన దుర్ఘటనని తలుచుకోక తప్పదు. మా ఆశయం ఆటంకపరిచేందుకు ఊరిదేవత బసివిని బలి చేశారు ఎవరో. మా వల్ల ప్రాణాలు వదిలిన ఆమె ఆత్మ శాంతికి ఓ నిమిషం మౌనం పాటించి ఆమె ఆత్మకు సంతాపం తెలపమని కోరుతున్నాను మీ అందర్నీ” అంటూ పెద్దల వంక చూశాడు వెంకట్రావు.

వాళ్ళు ‘తప్పదన్న’ట్టు లేచి మౌనం పాటిస్తూ నిలబడ్డారు మొసలి కన్నీళ్లు కారుస్తూ. తిరిగి అంతా కూర్చున్నారు. వెంకట్రావు మళ్ళీ ప్రారంభించాడు.

“మా నెలరోజులు కార్యక్రమంలో పది రోజుల కేవలం చర్చలతోనే గడిచిపోయింది. మిగిలిన 20 రోజుల్లోనే మరెన్నో ఆటంకాలు. కానీ అందరి పట్టుదల వల్ల ఆటంకాలు అధిగమించి బావిని త్రవ్వగలిగాము. ఈ కార్యక్రమంలో మాకు సహాయ సహకారాలు అందించిన విద్య గారికి ప్రత్యేక కృతజ్ఞతలు.

మరో విషయం. మేము మీకు చేసింది పెద్ద సహాయం ఏమీ కాదు. మీరు నిత్యం ఎదుర్కొంటున్న సమస్యల్లో ఒకదాని పరిష్కరించగలిగాము. అంతే! మరెన్నో సమస్యలున్నాయి. వాటిని మీరంతా సంఘటితంగా పరిష్కరించుకోగలరు. ఈ దేశం గ్రామాలకు పుట్టిల్లు. గ్రామాలు కళకళలాడినప్పుడే దేశం పురోగతిలో వేగం పెరుగుతుంది. దేశాభివృద్ధి అంటే మంగళ్‌యాన్ మాత్రమే కాదు. మంగళకరమైన గ్రామాభివృద్ధి కూడా!

అందుకేనేమో ఎవరో వస్తారని ఎదురు చూడటం కంటే మరొకరికి మార్గదర్శకులుగా మారే మార్గం కోసం చూడండి. ప్రగతికి కొత్త బాటలు వేయండి. ఇది మీ ఊరి సమస్యనే కాదు. ప్రతి ఊరి సమస్య. అందుకే, మా రాకలోని పరమార్థం మీలో ఆ స్ఫూర్తిని కలగజేయడం! అది గ్రహించండి.

ఇకపోతే చివరిగా మా వల్ల ఆహుతి అయిన బసివి ఆత్మకి మా వలనే న్యాయం జరగాలనే ఉద్దేశంతో పోలీసు వారిని అభ్యర్థించి ఈ కేసు పరిష్కరించమని కోరాం. వారి సమక్షంలోనే వారి అనుమతితోనే, ఈ సన్మాన సభలోనే పోలీసు వారి అనుమతితో కేసు విచారణ జరుగుతుంది. అందుకు సభాముఖంగా పోలీసు ఇన్‌స్పెక్టర్ గారి పర్మిషన్ కోరుతున్నాం.”

ఎస్ఐ లేచాడు “ఇన్ని సాహసాలు, ప్రజా సేవలు చేస్తూ ఉత్తమ పౌరులుగా దేశ అభివృద్ధికి కృషి చేస్తున్న ఈ యువ ఎన్.సి.సి. క్యాడెట్లనే కేసు విచారణ జరపమని నేను కోరుతున్నాను. ఇది ప్రైవేట్ సెటిల్మెంట్ కాదు. ప్రజా కోర్టు. దీన్ని నిర్వహించటానికి అన్ని అనుమతులూ తీసుకున్నాం. ఇక్కడ విచారణ తర్వాత అధికారికంగా న్యాయ సూత్రాల కనుగుణంగా కేసును కోర్టుకు సబ్మిట్ చేయటం జరుగుతుంది.. లా అండ్ ఆర్డర్ విషయంలో మేము పర్యవేక్షిస్తూ ఉంటాం” అంటూ కూర్చున్నాడు.

ఆంజనేయులు ముందుకు వచ్చాడు.

“ప్రతి చోట సన్మానం అనేది పెద్దల నుంచి ప్రారంభమవుతుంది. కానీ మేము చిన్న వారితో ప్రారంభిస్తున్నాం. శీనయ్యగారూ!” అంటూ పిలిచాడు ఆంజనేయులు.

“అయ్యా” అంటూ ఉత్సాహంగా ముందుకు వచ్చాడు శీనయ్య.

‘తనకి కూడా సన్మానం చేస్తారా ఏంటి?’ ఆశ్చర్య ఆనందాలతో తబ్బిబ్బవుతున్నాడు.

“ఈ ఉంగరం మీదేనా? చూడండి మాకు దొరికింది” అన్నాడు ఆంజనేయులు.

“అవును. నాదే” అంటూ తీసుకోబోయాడు శీనయ్య.

“ఆగండాగండి. మీదేనని ఎలా చెప్పగలరు?”

“దానిమీద ‘ఎస్’ అని గుర్తుంటుంది బాబూ! దాన్ని నాకు మన ఊరి డాక్టర్ గారు చేయించి ఇచ్చారు.”

“ఓహో అలాగా! మరి దాన్ని ఇంతకీ ఎక్కడ పారేసుకున్నారు?”

“ఎప్పుడు, ఎక్కడ ఎలా పోయిందో తెలియదు గానీ మొన్న మీ సుబ్రహ్మణ్యం శోభకిస్తుండగా చూసి అడిగాను. ఇచ్చాడు కాదు.”

“సుబ్రమణ్యం ఇలా రా!” అని పిలిచాడు ఆంజనేయులు.

అతను దగ్గరికి రాగానే “ఇది నీకు ఎక్కడ దొరికింది?” అని ప్రశ్నించాడు.

“బసివి చనిపోయిన ప్రదేశంలో”

“అంటే?”

“బావి దగ్గర”

“బావి దగ్గరే చనిపోయిందా బసివి?”

“ఆమె శవం బావి దగ్గర దొరికింది. అంతవరకే నాకు తెలిసింది” అన్నాడు సుబ్రహ్మణ్యం తెలివిగా.

“ఏమంటారు శీనయ్యా?”

“ఆమె చనిపోయింది అని తెలియగానే నేను పరిగెత్తుకొచ్చానయ్యా! అప్పుడు జారిపోయే పడిపోయిందేమో” అన్నాడు శీనయ్య.

సుబ్రహ్మణ్యం మధ్యలో కల్పించుకుంటూ, “లేదు. శీనయ్య నాకు ‘ఎవరో బావిలో పడిపోయారు’ అని చెప్పగానే నేను అక్కడికి వెళ్లాను. అక్కడికి ఇంకా అతను రానేలేదు. అప్పుడే నా కాళ్ళలో గుచ్చుకున్న ఉంగరాన్ని తీసి జేబులో ఉంచుకున్నాను. తర్వాత శోభకి ఇవ్వబోతున్నప్పుడు శీనయ్య వచ్చి అది తనదేనని వాదించాడు. తర్వాత శ్రీనివాస్, ఆంజనేయులు వచ్చి దాని గురించి అడిగితే నేను చెప్పాను కూడా” అన్నాడు సుబ్రమణ్యం.

“ఆ సంగతి కాసేపు అలా ఉంచుదాం. శీనయ్యా! మీకు డాక్టర్ గారు అంత పెద్ద బహుమతి ఎందుకు ఇచ్చారు?”

“ఆయనకి నేను పని చేసి పెడుతుంటానని అభిమానంతో ఇచ్చాడయ్యా”

“ఏమిటి నకిలీ మందులు, రక్తపు సీసాలు సరఫరా చేయటమా మీరు చేసే చీకటి సహాయం?”

“కాదు.. కాదు..” గాబరాగా అరిచాడు శీనయ్య.

“మరి ఈ సీసాలు ఎవరివి?” విద్య దగ్గర ఉన్న కొన్ని సీసాలు తీసి చూపించాడు ఆంజనేయులు.

ఆ సీసాలో రక్తం ఉంది.

“అవి నావి కావు” అన్నాడు శీనయ్య.

“కావా?” రెట్టించాడు ఆంజనేయులు.

“కావు”

“శోభా” కేకేశాడు ఆంజనేయులు.

శోభ వచ్చింది.

“ఇది ఏమిటో చెప్పగలవా?”

“ఎందుకు చెప్పలేను! ఇవి శీనయ్యవి. ఆరోజు సుబ్రమణ్యం నన్ను ఊరు బయటకు తీసుకెళ్లి శీనయ్య వస్తే కాసేపు కళ్ళు మూయమన్నాడు. అంతలోనే శీనయ్య రావడం చూసి చెట్టు చాటుకు వెళ్ళిపోయాడు. అప్పుడు శీనయ్య చేతిలో ఆ సీసాలు ఉన్న సంచి చూశాను. నేను అతని కళ్ళు మూయగానే సుబ్రహ్మణ్యం ఆ సంచిని తీసుకెళ్ళిపోయాడు.”

“సరే, నువ్వు వెళ్ళు” అని శీనయ్య కేసి తిరిగాడు ఆంజనేయులు.

“ఇప్పుడేమంటారు శీనయ్య గారూ? ఇప్పటికైనా నిజం చెప్పండి.”

“అవునయ్యా, తప్పైపోయింది. క్షమించండి! ఆ డాక్టర్ గారు నాకు సీసాలు ఇచ్చి పంపించేవాడు. ఒక్కోసారి పట్టణం పోయింది నకిలీ మందులు కూడా తెచ్చావని అందుకే నాకు ఆ బంగారం ఉంగరాన్ని బహుమతి ఇచ్చాడు.” అంటూ నేరాన్ని అంగీకరించాడు శీనయ్య..

“ఆ డాక్టర్ మహాశయుడిని హాజరు పెట్టండి” అన్నాడు ఆంజనేయులు.

జనంలో ఉన్న డాక్టర్ మెల్లిగా జారుకుందామని చూశాడు. కానీ శ్రీనివాస్ అతణ్ణి పట్టుకుని ముందుకు తీసుకొచ్చాడు. డాక్టర్ అందర్నీ బెదురుగా చూశాడు.

“ఇక మీ విషయం చెప్పండి” అన్నాడు ఆంజనేయులు.

“ఏంటండీ చెప్పేది? గౌరవంగా బతుకుతున్న గ్రామ పెద్దలం. మమ్మల్ని సన్మానం పేరు చెప్పి మోసం చేసి ఇలా రచ్చ కీడుస్తారా? నా ప్రాక్టీస్‌ని దెబ్బ తీస్తారా. నీ మీద కోర్టులో పరువు నష్టం వేయకపోతే నేను డాక్టర్ని కాదు” అన్నాడు ఆవేశం నటిస్తూ పిచ్చేశ్వరరావు.

“అసలు నువ్వు నిజంగా డాక్టర్ అయితే కదా బోగస్ సర్టిఫికెట్లతో, నకిలీ మందులతో, రాని వైద్యంతో ప్రజల ప్రాణాన్ని తీస్తున్న నువ్వు డాక్టర్ అని చెప్తే నమ్మటానికి మేము ఏమీ చదువు రాని అమాయకులం కాదు. నువ్వు ప్రజల రక్తం అమ్మి బతుకుతున్న నరరూప రాక్షసుడివని మాకు తెలుసు. చాలా? ఇంకా వివరాలు ఏమైనా కావాలా?” అని అడిగాడు ఆంజనేయులు నకిలీ డాక్టర్ కేసి చూస్తూ.

“ఏమిటి మీ ఉద్దేశం? లేనిపోని అభాండాలు వేసి ప్రజల్లో నన్ను కించపరుస్తున్నారు. నేను డాక్టర్ని కాదని ఎలా చెప్పారు మీరు?” డాంబికంగా ఎదురు ప్రశ్నించాడు సదరు నకిలీ డాక్టర్.

“ఓ అలాగా! అయితే మిమ్మల్ని డాక్టర్‌గా గుర్తించమంటారు. సరే! మనిషి చర్మంలో ఎన్ని పొరలు ఉంటాయో చెప్పగలరా?” అన్నాడు ఆంజనేయులు.

డాక్టర్ తడబడ్డాడు.

“మీరు మీకెందుకు చెప్పాలి? నేను చెప్పను” అన్నాడు మొండిగా.

“తెలిస్తే చెప్పక తప్పదు. తెలియకపోతే నేరాన్ని నువ్వు ఒప్పుకోక తప్పదు. నన్ను చూసి కాదు ఎదురుగా కూర్చుని ఉన్న ఎస్ఐ గారిని, ఆయన చేతుల్లో మీకోసం ఆత్రుత పడుతున్న బేడీలని చూసైనా సరే. ఏది కావాలో మీరే నిర్ణయించుకోవాలి, తొందరగా.”

“నాకు తెలీదు” అన్నాడు డాక్టర్.

“పోనీ మానవ శరీరంలోని రక్తమంతా కొలిస్తే ఎన్ని లీటర్లు ఉంటుందో చెప్పగలరా?”

డాక్టర్ మౌనం వహించాడు.

“మౌనం అర్ధాంగీకారం అంటారు. కానీ మీ మౌనాన్ని మేము పూర్తి అంగీకారంగా తీసుకొని మీరు మీ నేరాలని ఒప్పుకుంటునట్టుగా భావిస్తున్నాం. మరి ఏమీ తెలియకుండా డాక్టర్‌గిరి ఎలా వెలగబెడుతున్నారు? ఎంతమంది ప్రాణాలు మీ రాని వైద్యానికి బలయి రాలిపోయాయి? వివరంగా చెప్పండి” అన్నాడు ఆంజనేయులు కరుగ్గా.

ఇక తప్పదన్నట్టు మొదలు పెట్టాడు నకిలీ డాక్టర్. ఇంతలో రాయుడు కంగారు కప్పిపుచుకుంటూ లేచాడు.

“పోన్లెద్దూ! ఏదో పొట్ట తిప్పల కోసం పిచ్చి వేషాలు వేసి ఉంటాడు ఈసారికి వదిలేయండి” అన్నాడు రికమండేషన్ చేస్తున్నట్టు.

పెద్దరికం వెలగబడుతూ “చూసావా! నీ వెధవ పనులు ఎన్ని ప్రాణాలు తీశాయో ఇప్పటిదాకా! ఇక నువ్వు మా ఊర్లో ఉంటానికి వీల్లేదు. వెంటనే వెళ్ళిపో” అన్నాడు రాయుడు పిచ్చేశ్వర్రావు కేసి సైగలు చేసి.

“అలాగే సార్! ఇంతమంది అభిమానాన్ని పోగొట్టుకున్న నేను ఎంతో దురదృష్టవంతుడిని. మళ్ళీ జన్మంటూ ఉంటే ఒక మంచి మనిషిగా మళ్లీ ఈ గ్రామంలో పుట్టాలని కోరుకుంటున్నాను. వస్తాను” అంటూ మొసలి కన్నీరు కారుస్తూ జారుకోబోయాడు నకిలీ డాక్టర్.

“ఆగు! చేసిన పాపాలు ఎస్ఐ గారితో చెప్పుకుని, అత్తవారింట్లో కొంతకాలం పశ్చాత్తాపంతో గడపాలి. తప్పుకి శిక్ష అనుభవించాలి. అందాకా నువ్వు ఎక్కడికి వెళ్లేందుకు వీలు లేదు” అన్నాడు కర్కశంగా ఆంజనేయులు.

“గ్రామ పెద్దగా నేను చెప్తున్నా! పోనీద్దురూ” అన్నాడు మళ్ళీ గాబరాగా లేచి రాయుడు.

“ఓ! మీకు డాక్టర్ గారి మీద ప్రత్యేక ప్రేమాభిమానాలు ఏమిటో కాస్త తెలుసుకోవచ్చా?” అన్నాడు ఆంజనేయులు రాయుడు కళ్ళలోకి సూటిగా చూస్తూ

“ఛీ.. ఛీ.. నాకూ, అతనికీ సంబంధమా? అబ్బే, ఏదో మానవతా వాదంగా.. అంతే” అన్నాడు రాయుడు టక్కున కూర్చుంటూ.

అంతే! వీరభద్రుడిలా కళ్ళల్లో నిప్పులు రాల్చాడు ఆ నకిలీ డాక్టర్.

“అసలు నేను ఇలా మారటానికి కారణం ఈ రాయుడే! నా అసలు పేరు చంటి మల్లయ్య. నేను పట్నంలో కిళ్ళీ షాపు నడుపుకుంటూ, దగ్గుకి, జలుబుకి, జ్వరాలకు, ఏవో ఐదారు రకాల మందులు కూడా అమ్ముకుంటూ బతికేవాడ్ని. ఈ రాయుడు పట్నం పని మీద వచ్చినప్పుడల్లా నా దగ్గర సిగరెట్లు కొంటూ ఉండేవాడు. ఓ రోజు నాకు నకిలీ మందులు ఇచ్చి అమ్మమన్నాడు. మొదట నేను అంగీకరించలేదు. నా చాలీచాలని జీవితానికి ఎన్నో ఆశలు చూపాడు.

నాకు విలాస జీవితాన్ని చవిచూపి వదిలాడు. అంతే! నేను ఆ జీవితానికి తద్వారా రాయుడికి బానిస అయిపోయాను. చివరికి ఈ ఊళ్లో డాక్టర్ లేడనీ, లాభసాటి వ్యాపారం అని చెప్పి నాతో ఏ డాక్టర్ చేయని ఘోరాతి ఘోరమైన పాపాలను చేయించాడు”

ఆవేశంగా తనని కడిగేస్తుంటే-

“అబద్ధం! ఈ డాక్టర్ వేషగానికి పిచ్చెక్కింది. నమ్మకండి” అని అరిచాడు రాయుడు.

“మిమ్మల్ని అడిగినప్పుడు చెప్పండి. ఎందుకు అలా భుజం తడుముకుంటారు” అన్నాడు ఆంజనేయులు.

“ఇప్పుడు గౌరవనీయులైన పాపయ్య శెట్టి గారిని మన శ్రీనివాస్ సన్మానిస్తాడు” అన్నాడు ఆంజనేయులు ప్రక్కకి తొలగి.

‘తనని కూడా వాళ్ళలాగే పరువు తీస్తారా?’ లోపల భయంతో శెట్టికి ముచ్చట్లు పోయసాగాయి.

“శెట్టి గారూ.. మిమ్మల్నే” మళ్ళీ పిలిచాడు శ్రీనివాస్.

“ఆఁ.. ఆఁ… చెప్పండి” అన్నాడు శెట్టి ఉలిక్కిపడుతూ.

“శెట్టి గారూ! ఈ కడియాన్ని గుర్తుపడతారా? ఎవరిదో చెప్పగలరా?” అన్నాడు శ్రీనివాస్.

‘అనుకున్నంతా అయ్యింది. నా బతుకు బజార్న పడుతోంది’ లోలోపల ఏడుస్తూ శెట్టి –

“నాకెలా తెలుస్తుంది? మా ఇంట్లో ఈ కడియాలు కంకణాలు ఎవరూ వేసుకోరు” అన్నాడు శెట్టి.

“అలాగా పాపం! మీకు ఏమీ తెలియదు కదూ. ఒరేయ్ సుబ్రమణ్యం! ఈ కడియం నీకు ఎక్కడ దొరికింది?”

“శెట్టి గారి గోడౌన్లో”

“శీనయ్య గారూ..”

“అయ్యా”

“మీ ఊళ్లో ఈ కడియం ఎవరు వేసుకున్నారో చెప్పగలరా? నిజం చెప్తే నీకు శిక్ష తగ్గుతుంది”

“బసివిది బాబూ! ఈ శెట్టి మాటలు నమ్మి నా చేతులతోనే చేయరాని పాపాలు చేశాను. వీడితో కలిసి అన్యాయంగా బసవి పేనాలు తీశాను. అయ్యా! నాకు శిక్ష తగ్గించొద్దు. పెంచండి. ఉరిసిచ్ఛ వేయించండి” ఏడిచేసాడు శీనయ్య.

“ఇప్పుడైనా ఒప్పుకుంటారా నేరాన్ని?” శెట్టి కేసి చూస్తూ అన్నాడు శ్రీనివాస్.

“నిజమే.. నాకెప్పట్నుంచో ఆమె మీద కోరిక. రాయుడికి తెలీకుండా తీర్చుకోవాలి. అందుకే శీనయ్యకు డబ్బిచ్చి ఆమెని నా గోడౌన్‌కు రప్పించాను. కానీ ఆమె ఒప్పుకోలేదు. పెనుగులాటలో కోపంతో నేను గొంతు పిసికేసరికి చనిపోయింది. నాదొక్కటే తప్పేంటి మీ అందరి ముందు పెద్దమనిషిగా చలామణి అవుతున్న ఈ రాయుడు మాత్రం తక్కువ తిన్నాడా? అభం శుభం తెలియని అమాయకురాల్ని అనుభవించి ఊరిమీద వదిలేశాడు.. దుర్మార్గుడు” అన్నాడు కసిగా రాయుడు కేసి చూస్తూ.

“అబద్ధం! అన్నీ అబద్ధాలే! మీరు వాళ్ళ మాటలు నమ్మకండి. వీళ్ళందరూ అసూయతో నా మీద అబద్ధాలు అభాండాలూ రుద్దుతున్నారు” అన్నాడు రాయుడు కీచుగా అరుస్తూ.

“అరిస్తే లాభం లేదు రాయుడూ నిజం చెప్పక తప్పదు. ఇక చివరికి మిగిలింది మీరే చెప్పండి” గద్దించాడు వెంకట్రావు కల్పించుకుంటూ.

రాయుడుకు దిక్కు తోచలేదు. తలవంచక తప్పలేదు

“తరతరాలుగా ఈ ఊరికి మేమే పెద్దలం. మా మాటే శాసనం. పట్నానికి వెళ్లి చదువుకోని వచ్చిన తర్వాత పొలాలు చూసుకుంటూ నేను ఇక్కడే ఉండిపోయాను. మా అన్నయ్య చదువు పూర్తి చేసుకొని అక్కడే లెక్చరర్ ఉద్యోగంలోకి వెళ్లిపోయాడు.

నాకు పెళ్లి అయిన తర్వాత మా తల్లిదండ్రులు చనిపోయిన తర్వాత ఒక రోజున ప్రమాదవశాత్తు నా భార్య కూడా చనిపోయింది. దాంతో నాకు ఒంటరితనం భరించరానిదిగా తయారయ్యింది. అప్పుడే ప్రకృతిని చూడడం జరిగింది. ఆమె ఓ అనాథ. ఇంట్లో పనికోసం పిలిచి తర్వాత లొంగదీసుకున్నాను. అది బయటకు రాకుండా బసివిని చేసాను. కానీ ఆమెను నేను చంపలేదు. ఊరి జనాల అవసరాన్ని సొమ్ము చేసుకున్నానే కానీ నేరం చేయలేదు.”

“నిజమే.. మీరు ఆమెను చంపలేదు. మరి శీనయ్యకి పదివేల రూపాయలు ఎందుకిప్పించారు?”

“నేనా?” ఆశ్చర్యం నటిస్తూ అన్నాడు రాయుడు.

“శీనయ్యా.. నువ్వు నిజం చెప్పు” అన్నాడు వెంకట్రావు.

“అవునయ్యా.. నెలరోజుల క్రితం రాయుడు నన్ను టౌన్‌కి తీసుకెళ్లి అక్కడ ఒకరికి జామీన్ ఇప్పించాడు. చేసిన సాయానికి ప్రతిఫలంగా రెండు రోజుల క్రితం మళ్లీ నన్ను టౌన్‌కి పంపించి అక్కడ సతీష్ అనే అతనితో పదివేల రూపాయలు ఇప్పించాడు.”

“ఇప్పుడు ఏమంటారు రాయుడు గారూ?”

“ఇతను ఎవరికి జామీన్ ఇచ్చాడో తెలియదు. ఆ సతీష్ ఎవరో కూడా తెలియదు” అన్నాడు రాయుడు బింకంగా.

“ఎస్సై గారూ మీరు చెప్పండి”

“మిస్టర్ రాయుడూ! నీతో ఎన్నోసార్లు ఫోన్లో మాట్లాడి ఈ వ్యవహారం నడిపించిన సతీష్ ఇప్పుడు మాకు బందీగా ఉన్నాడు. మొన్న శీనయ్యకి పదివేల రూపాయలు ఇస్తున్నప్పుడు మేం పట్టుకున్నాం. వాడు మీ గురించి అన్ని విషయాలు చెప్పాడు.

వాడికి అవసరమైనప్పుడల్లా నకిలీ ఐడెంటిటీలతో ఫోటోలు మార్చి నేరస్థులకి జామీన్ ఇప్పించేవాడివి. ఈ ఊళ్లో నీ మాట వింటున్న మనుషుల్ని చదువురాని అమాయకుల్ని తీసుకెళ్లి వీళ్ళ ఫోటోలు పెట్టి, సంతకాలు పెట్టించి జామీను ఇప్పించి నువ్వు డబ్బులు దండుకునేవాడివి. వీళ్ళకి చిల్లర విసిరివాడివి.

మొన్న వెంకట్రావు గారు స్టేషన్ నోటీస్ బోర్డులో సతీష్ ఫోటో చూసి వివరాలు అడిగారు. ఆ సందర్భంలో జామీన్ ఇచ్చిన వాళ్ళ ఫోటోలు చూస్తూ శీనయ్యను గుర్తుపట్టారు. నీవు సతీష్‌తో ఫోన్లో మాట్లాడిన విషయం నీ ఫోన్ నెంబర్ కాల్ డేటా ద్వారా బయటికి తీశాం. ఇది చాలా.. ఇంకా కావాలా?”

రాయుడు తల వంచుకున్నాడు. పోలీసులు వచ్చి నలుగురికి సంకెళ్లు తగిలించి జీప్ ఎక్కించారు.

విద్య ముందుకు వచ్చి “ఇన్నాళ్లకు ఈ వూరికి పట్టిన పీడ వదిలింది. ఈ రోజు మా వూరికి నిజమైన పండగరోజు.” అంటూ ఊరి యువకులకు చూసి

“ఇప్పుడు మనం వెంకట్రావు గారికి వాళ్ళ బృందానికి సన్మానం చేయాలి “ అంది.

“అమ్మో! సన్మానమా” అంటూ భయపడిపోయాడు సుబ్రహ్మణ్యం.

అందరు పెద్దగా నవ్వారు.

***

మరుసటి రోజు ఉదయం.

ఊరు ఊరంతా స్కూల్ దగ్గర జేరారు.

ఎన్.సి.సి. క్యాంపు ముగించుకుని వెంకట్రావు బృందం తిరుగు ప్రయాణమవుతోంది. విద్య వారికి దారిలో కావలసిన ఆహారాన్ని ప్యాక్ చేయిస్తోంది. ఆంజనేయులు, వనజ లగేజీ లన్నీ బస్సు లోకి ఎక్కిస్తున్నారు.

శోభ ఏడుస్తూ సుబ్రహ్మణ్యంను చూస్తూ జామకాయి కొరికి ఇచ్చింది. సుబ్రహ్మణ్యం ఆమెను ఓదారుస్తూ మళ్ళీ తాను అమ్మవాళ్ళతో వస్తానని చెప్పి జామకాయ తినసాగాడు.

వెంకట్రావు ఊరివాళ్లందరికీ వీడ్కోలు చెప్పి బస్సు ఎక్కాడు. అందర్నీ పరికించి “శ్రీనివాస్ ఎక్కడ?” అని అడిగాడు అనుమానంగా.

శ్రీనివాస్ బావిదగ్గర పెయింటింగ్ పూర్తి చేసి లేచాడు. మరొక్కసారి బావి గోడలమీద తాను వ్రాసింది చదివాడు.

‘ప్రకృతి ప్రాణ ధార’ – తృప్తిగా చూసి పరుగెత్తుకుంటూ స్కూల్ దగ్గరికి వచ్చి బస్సు ఎక్కాడు.

విద్య, ఊరి జనాలు చేతులు ఊపి వీడ్కోలు చెబుతుండగా బస్సు బయలుదేరింది. వెంకట్రావు డ్రైవర్ ప్రక్కన కూర్చున్నాడు.

అప్పుడే వినిపించింది పెద్ద శబ్దం. డ్రైవర్ బస్సు ఆపాడు.

వెంకట్రావు ఉలిక్కిపడి బస్సు లోపల చూశాడు. సుబ్రహ్మణ్యం జామకాయ తింటున్నాడు.

‘మరింకేమైందీ’ అనుకుంటూ బయటకు చూశాడు.

రెండు సంచుల నిండా అరటిపళ్ళు, తినుబండారాలు పట్టుకుని శోభ అరుస్తోంది – “బావా… బావా.. తీసుకో” అంటూ.

అందరూ పెద్దగా చప్పట్లు కొడుతూ నవ్వారు.

జైత్రయాత్ర సాగింది.

(సమాప్తం)

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here