జైత్రయాత్ర-2

0
10

[శ్రీ కస్తూరి రాజశేఖర్, కస్తూరి వేణుగోపాల్ రచించిన ‘జైత్రయాత్ర’ అనే నవలని ధారావాహికగా అందిస్తున్నాము.]

[కాలేజీలో ఎన్.సి.సి. కేడెట్స్‌ని సమ్మర్ క్యాంప్ కోసం ఓ పల్లెటూరికి బయల్దేరదీస్తాడు ఎన్.సి.సి అధికారైన లెక్చరర్ వెంకట్రావు. కాలేజీ గ్రౌండ్ నుంచి బస్సు బయల్దేరబోతుంటే, ఉన్నట్టుండి పెద్ద శబ్దం అవుతుంది. డ్రైవర్ సడెన్ బ్రేక్ వేసి ఆపగా, రెండు పెద్ద మూటలతో ఆపసోపాలు పడుతూ బస్ ఎక్కుతాడు సుబ్రహ్మణ్యం. మూటలు దారికడ్డంగా ఉండడంతో, క్లీనర్ వాటిని తీసుకెళ్ళి బస్సు వెనుక ఉన్న డిక్కీలో పెడతాడు. ఇప్పటిదాక ఇక్కడే ఉన్నావుగా మళ్ళీ ఎక్కడికెళ్ళావని వెంకట్రావ్ అడిగితే, చక్కిలాలు, సున్నుండలు మర్చిపోయానని మా అమ్మమ్మ పనివాడికిచ్చి పంపిందని, అవి తెచ్చుకుని వస్తున్నానని అంటాడు సుబ్బు. వెంకట్రావు తన తిండి గురించి మాట్లాడుతుంటే పట్టించుకోకుండా వెళ్ళి తన మిత్రులు ఆంజనేయులు, శ్రీనివాస్‌తో కబుర్లకు దిగుతాడు. క్యాంపుకి బయల్దేరే ముందే పెట్టిన నిబంధన మేరకు అందరి దగ్గర నుంచి మొబైల్ ఫోన్స్ తీసేసుకుంటాడు వెంకట్రావు. తర్వాత బస్సు కేబిన్ నుంచి లాబీ లోకి వచ్చి – స్టూడెంట్స్‌ని ఉద్దేశించి మాట్లాడుతాడు. తాము వెళ్ళబోయే పల్లెటూరి గురించి, అక్కడ చేయాల్సిన సేవ గురించి చెప్తాడు. బస్సులో పిల్లలంతా కబుర్లు చెప్పుకుంటూంటారు. త్రిమూర్తులుగా పేరు పడ్ద సుబ్రహ్మణ్యం, శ్రీనివాస్, ఆంజనేయులు కాలేజీ అమ్మాయిల గురించి మాట్లాడుకుంటారు. కాలేజీలో ప్రిన్సిపాల్ కూతురు వనజని ఆంజనేయులు ముద్దు పెటుకున్న సంగతి ప్రిన్సిపాల్‍కి తెలిస్తే, తిరిగొచ్చేసరికి పనిష్‍మెంట్ సిద్ధంగా ఉంటుందని అంటాడు శ్రీనివాస్. నెలరోజుల పాటు ప్రపంచంతో మనకు సంబంధాలుండవనీ, సినిమాలూ, షికార్లూ, బార్లూ, గుళ్ళూ, దేవతలూ ఉండరని బాధపడతాడు సుబ్రహ్మణ్యం. వాళ్ళు ముగ్గురూ ఆలోచనల్లో పడతారు. తమ ఎన్.సి.సి. పెరేడ్ తాలూకు అనుభవాలు, వెంకట్రావుతో పరిహాసాలు తలచుకుంటారు. ఆడపిల్లలు ఫుట్‍బాల్ ఆడుతూంటే బాల్ త్రిమూర్తులు ఉన్న చోటకి వచ్చి పడుతుంది. దాన్ని తీసుకోడానికి వచ్చిన వనజని కామెంట్ చేస్తాడు ఆంజనేయులు. ఆమె వెళ్లి వాళ్ళ నాన్నకి కంప్లయింట్ చేస్తుంది. వెంకట్రావు వచ్చి, ఎన్.సి.సి. కేడెట్స్ అంటే, ఇలా అల్లరిచిల్లరగా ఉండకూడదని హెచ్చరిస్తాడు. తర్వాత అందరినీ పిలిచి తాము వెళ్ళబోయే సమ్మర్ క్యాంప్ గురించి చెప్తాడు. డ్రిల్ తరువాత కేడెట్స్ స్నాక్స్ తినడం అయ్యాకా, ఇంటికి వెళ్తాడు వెంకట్రావు. – ఇక చదవండి.]

అధ్యాయం-2

[dropcap]సు[/dropcap]బ్రహ్మణ్యం, ఆంజనేయులు, శ్రీనివాస్‌ల ఆధ్వర్యంలో క్లాసులో తెగ అల్లరి జరుగుతోంది. ఇంకా లెక్చరర్ రాలేదు. ఆడపిల్లలు అప్పుడే వస్తున్నారు. వనజ కూడా ఉండటం చూసారు.

“ఒరేయ్.. వనజ పెళ్ళికి అన్ని ఏర్పాట్లూ జరిగాయా?” హడావుడిగా అడిగాడు సుబ్రహ్మణ్యం.

“ఓ.. భేషుగ్గా.. నీకేమీ బెంగ అక్కర్లేదు.. ఇంక కన్యాదానమే మిగిలింది” అన్నాడు శ్రీనివాస్.

ఆడపిల్లలంతా బుద్ధిగా కూర్చున్న మిత్రత్రయాన్ని ఆశ్చర్యంగా అనుమానంగా చూస్తూ సీట్లలో కూర్చున్నారు.

అంతే. అదిరిపడి లేచారు. నీళ్లలా ఉన్న గ్రీజు.. బెంచీలపై ఉంది.

“ఓ హెల్.. బెంచీలమీద గ్రీజు పోశారు.. రాస్కెల్స్..”

“స్టుపిడ్స్”

“బ్రూట్స్”

“వీళ్లకు అక్కా చెల్లెళ్లు లేరా”

“కామన్‌సెన్స్ లేదు”

తిట్లూ, శాపనార్థాలూ, కోపాలూ అందరిలోనూ.. “ప్రిన్సిపాల్ గారితో చెబుదాం పదండి.”

“ఎవరని చెబుతాం? చెబితే ప్రిన్సిపాల్ గారు మాత్రం ఏం చేస్తారు? పైగా వీళ్ళు మరింత రెచ్చిపోతారు. అమ్మో.. వద్దు..”

వాళ్ళందరి మొహాలూ రోషంతో ఎర్రబడ్డాయి.

వెనక బెంచీల్లోంచీ ఈలలు, చప్పట్లు.

“యూ విల్ పే ఫర్ దిస్” అంటూ ఏడుస్తూ క్లాసులోంచీ వెళ్ళిపోయింది వనజ. మొగపిల్లలు నిర్లక్ష్యంగా చూసారు.

ఇంతలో థర్డ్ బెల్ కొట్టారు.

తెలుగు మాస్టారితో పాటు మళ్ళీ క్లాస్ లోకి అడుగుపెట్టింది వనజ.

***

తెలుగు మాస్టారు రామాచారిగారు నోట్లో నానుతున్న రాగానికి లయబద్ధంగా చేతిలోని పుస్తకంపై తాళం వేస్తూ లోపలి అడుగుపెట్టాడు. సహజంగానే కుర్చీ సరిగా ఉందో లేదో చూసి కూర్చున్నాడు. అప్పుడప్పుడు ఆ కుర్చీలో గుండుసూదులూ, పల్లేరు కాయలూ గురుదక్షిణగా వెలుస్తూంటాయి. అదీ ఆయన అనుమానం, అనుభవమూనూ..

పాఠం మొదలైంది. నల దమయంతిల కథ. హంస రాయబార ఘట్టాన్ని తన్మయత్వంతో ఆలపించసాగారు రామాచారి. ఆయన ఓ పౌరాణిక నటుడు. పాడకుండా పాఠం కూడా చెప్పలేదు. పాఠం ఆయన బాధ్యత. పాట ఆయన బలహీనత! పాత్రలో లీనమై గొంతెత్తి రాగాలాపన చేస్తాడు. ఆ రాగాలాపనలో ఒక్కోసారి శృతి పెంచి, శృతి మించి ఆవేశంతో నటించేస్తారు కూడా.

మిత్రత్రయానికి పాఠం పట్టటంలేదు. వనజ గురించి చర్చిస్తున్నారు.

“ఆ అమ్మాయి కెందుకురా అంత గర్వం? ప్రిన్సిపాల్ కూతురనా? తనో రంభ అనుకుంటోంది.”

“అసలు ప్రొద్దున వెంకట్రావు సర్ రాకపోతే ఓ ఆట ఆడించేవాళ్ళం”

“నా కలాంటి భయాలేం లేవు. అసలు మనమంటేనే లేడీస్‌లో పిచ్చి క్రేజ్” అన్నాడు ఆంజనేయులు.

“పిచ్చా.. ఎవరికీ”

“కొంపదీసి కరవరు కదా నువ్వేదురుపడితే?”

“పిచ్చి సన్నాసీ! క్రేజ్ అంటే తెలీదా.. అవున్లే.. ఏ పిల్లా నీ కోసం కలవరించదు గదా! నీకలాటి విషయాలు ఏం తెలుస్తాయి?” అన్నాడు ఆంజనేయులు కాలరెగరేస్తూ.

“ఓహో.. నీ కోసం పడి చస్తారన్నమాట” అన్నాడు శ్రీనివాస్.

“అసలు నా జాతకం చూసి నేను కలియుగంలో పుట్టిన కృష్ణుడినని చెప్పారట.. తెలుసా?”

“ఇంకా నయం.. కలియుగంలో పుట్టిన కలిగులా అనలేదు.. నీవు చాలా గొప్పవాడివన్నమాట”

“‘అన్న’ మాట కాదోయ్.. ఇది అంజి మాటోయ్ బడుద్దాయి.. నా కిస్సు కోసం ఎందరు మిస్‌లు వెయిట్ చేస్తారో నీకేం తెల్సు.. ఎక్కడిదాకో ఎందుకు.. వనజ దగ్గరికెళ్లి ఒకటివ్వమని అడిగాననుకో.. అంతే.. అమాంతం ఇచ్చేయ్యదూ..!?”

“ఏమిటీ.. చెంప దెబ్బ.. చెప్పు దెబ్బా?” అన్నాడు శ్రీనివాస్.

“అదేం నోర్రా శకున పక్షీ.. అయినా అదిచ్చిదేమిటీ.. మనమే తీసుకుంటాం” అన్నాడు ఆంజనేయులు రెచ్చిపోతూ.

“ఏంట్రోయ్.. మా ఇద్దరికీ తెలీకుండా వెళ్లి మందు కొట్టొచ్చావా ఏంటీ? ప్రిన్సిపాల్ ప్రిన్సెస్ – మన కాలేజీ బ్యూటీ ‘వనిజ’ని ముద్దెట్టుకునేంత మొనగాడివా?”

“ఒంటరిగా వెళ్ళేటప్పుడెప్పుడో ధైర్యం చేస్తాడేమోరా?”

“అదేం గొప్ప?”

“అదేం కాదు.. ఆమెకి తెలీకుండానే, అందరి ముందూ వనజని ముద్దెట్టుకుంటా.. కావాలంటే ఛాలెంజ్?”

“ఎస్.. ఛాలెంజ్.. నువ్వు గెలిస్తే మేమిద్దరం కల్సి రెండు వేలు ఇచ్చుకుంటాం.. లేకుంటే నీవు వేయి రూపాయలిచ్చుకో చాలు” అన్నాడు శ్రీనివాస్. ఓకే అన్నాడు సుబ్రహ్మణ్యం.

“డన్” అన్నాడు ఆంజనేయులు బొటన వ్రేలు చూపిస్తూ.

“ఐ పీటీ యూ బోత్.. అనవసరంగా నాతో పందెం కట్టి ఆనక అప్పులపాలు కావద్దు. ఆ తర్వాత మీ ఇష్టం” అన్నాడు ఆంజనేయులు చివరిసారిగా.

“భయంగా ఉందా ఓడిపోతానని? మరి పందేలు పౌరుషాలూ ఫోజులూ ఎందుకురా?” మందలింపుగా అన్నాడు శ్రీనివాస్.

ఆంజనేయులు ఆలోచనలో పడ్డాడు.. పందెం ఎలా గెలవాలా అని..

ఓ పక్క రామాచారి గారి రాగామృతం క్లాసుని ఆవరించి స్టూడెంట్స్‌ని ఆవలింతలు గురిచేసి ఆపై నిద్రలోకి జార్చింది..

ఆంజనేయులికి ఆ రాగం విసుగెత్తిస్తోంది. చేతిలో ఉన్న చాక్‌పీస్‌తో బల్ల మీద పిచ్చి గీతాలు గీయసాగాడు ఆలోచిస్తూ. రామాచారి రాగం ఆరున్నొక్క స్థాయి జేరేసరికి ఆంజనేయులు తన చేతి రెండు వ్రేళ్ళతో చాక్‌పీస్‌ని మధ్యవేలితో గాల్లోకి షూట్ చేసాడు అనాలోచితంగా.

ఆ ముక్క రామాచారికేసి వేగంగా దూసుకెళ్లి అయన నోట్లో దూరిపోయింది.

ఉన్నట్లుండి రాగం ఆగిపోయింది. గొంతులో ఏదో అడ్డుపడ్డట్టయి రామాచారి ఉక్కిరిబిక్కిరి అయ్యాడు.

లాలిపాట ఆగిపోతే విసుగ్గా మొహం పెట్టె పసిపాపల్లా కమ్మటి నిద్రలో ఉన్న విద్యార్థులు నిద్ర లేచి ఆయనవంక విసుగ్గా చూసారు. ఆ పీరియడ్ అయిపోయిందో లేక ఆ రోజుకి కాలేజీ అయిపోయిందో తెలీని స్థితిలో ఉన్నారు వాళ్ళు.

రామాచారి గొంతులో ఉన్నది చాక్‌పీస్ అని తెలిసి రెండు వ్రేళ్లూ లోపలి దూర్చి మెల్లిగా బయటికి తీసి పక్కన పడేసాడు. వేసినవాడెవడో తెలీక కోపంగా క్లాస్ వేపు చూసాడు. కానీ అందరూ తనని కోపంగా చూస్తూ ఉండటంతో అవాక్కయ్యాడు.

ఇంతలో అటెండర్ ఏదో నోటీసు తెచ్చాడు. క్లాసంతా గందరగోళంగా తయారయ్యింది.

“ష్.. సైలెన్స్.. మీ కాలేజీ కల్చరల్ సెక్రటరీ మీ అందరికీ ఓ శుభవార్త పంపాడు. శనివారంతో కాలేజీ అయిపోతోంది కనుక ఆ రోజు సాయంత్రం వినోద కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. ఆసక్తి ఉన్నవాళ్లు వెళ్లి ఇప్పుడే పేర్లు ఇవ్వొచ్చు.” అని మళ్ళీ రాగాలాపన మొదలెట్టి కళ్ళు మూసుకుని తన్మయత్వంలో మునిగిపోయాడు.

పాఠం పూర్తయ్యింది. కళ్ళు తెరచి చూసిన రామాచారి ఆశ్చర్యంతో నోరు తెరిచాడు.

పేర్లిచ్చే నెపంతో క్లాసంతా ఎప్పుడో ఖాళీ అయ్యింది.

‘మరిందాకట్నుంచీ నేను పాఠం ఎవరికీ చెప్పినట్టు?’ అనుకునేసరికి మళ్ళీ గొంతులో ఏదో అడ్డం పడ్డట్లయ్యింది.

***

శనివారం.

ఇన్నిరోజులూ ఎలాంటి ప్రయత్నాలూ చేయకుండా విలాసంగా తిరుగుతున్నాడు ఆంజనేయులు. అతని సుబ్రమణ్యానికీ ఇటు శ్రీనివాస్‌కీ ఏమాత్రం అర్థం కావటంలేదు.

‘తామే గెలవటం ఖాయం’ అనుకుంటున్నారిద్దరూ.

సాయంత్రమైంది.

కాలేజీ ఆడిటోరియం స్టూడెంట్లతో నిండిపోయింది. సుబ్రహ్మణ్యం, శ్రీనివాస్ ఆంజనేయులు కోసం చూసారు. కనపడలేదు.

“అంజిగాడేడిరా.. వచ్చాడా? కనబడలేదు.”

“ఇందాకటివరకూ ఇక్కడే ఉన్నాడురా.. ఫోన్ వస్తే వెళ్ళాడు. మళ్ళీ కనబడలేదు.”

“ఓహో.. అయితే గాయబ్ అయిపోయి ఉంటాడు. ఎవరికో ప్లాన్ అప్పగించి ఉంటాడు. ఫ్లాప్ అయి ఉంటుంది.”

అమ్మాయిల వరసలో వనజ కనిపించింది. వాళ్ళని చూసి ఈలలు వేస్తూ వెళ్లి వెనక కుర్చీల్లో కూర్చున్నారు.

అంతే.. అదిరిపడి లేచారు. సీట్లలో చల్లగా ఏదో.. “ఏమిటది?”

“వర్షం పడలేదే?”

“నీళ్లతో కడిగినట్లు కూడా లేదే”

అనుమానంతో సీట్లని పరీక్షగా చూసారు.

సీట్లన్నీ పశువుల పేడ.. ఫ్రిడ్జ్‌లో ఉంచినట్టున్నారు. వాసన రావటం లేదు. అబ్బాయిల పాంట్ల వెనక అంతా అంటుకుని చికాకుగా ఉంది.

ఉక్రోషంతో పెద్దగా అరిచారు. “ఒరేయ్.. ఎవర్రా.. ఇది చేసింది..”

“దమ్ముంటే ఎదుటికొచ్చి నిలబడండిరా.. తేల్చుకుందాం”

ఒక్కసారిగా అమ్మాయిల వరసలోంచీ ఈలలు, చప్పట్లు..

సుబ్రహ్మణ్యం, శ్రీనివాస్ ఇతర అబ్బాయిలు అవమానంతో తల తిప్పుకుని బయటికి నడిచారు.

టాయిలెట్స్ దగ్గర పేడ మరకలు కడుక్కుంటుంటే ఎవరో వచ్చి అన్నారు – “ఒరేయ్ సుబ్బిగా.. అంజి గాడే వాళ్ళతో కలసి మనల్ని ఇరికించాడురా.. చూసావా.. టైమ్‌కి ఎస్కేప్ అయిపోయాడు”

సుబ్రహ్మణ్యం శ్రీనివాస్ మొహమొహాలు చూసుకున్నారు. “వాడి సంగతి దొరికినప్పుడు చూసుకుందాం” అనుకుని కదిలారు.

అమ్మాయిలంతా ఆనందంగా స్టేజి దగ్గరికి వెళుతున్నారు.

“అయితే దెబ్బకు దెబ్బ తీశావన్నమాట”

“కుక్క కాటుకు చెప్పు దెబ్బ..”

అబ్బాయిల్ని చూసి మళ్ళీ చప్పట్లు కొట్టారు. ఒకమ్మాయి అయితే ఈల వేసి అందరినీ ఉత్సాహపరచింది.

అబ్బాయిలు అవమానంతో కుంచించుకుపోయారు.

“ఎంత మోసం?”

“ఎంత ధైర్యం?”

“ఇంతకు తెగించారు?”

వాళ్ళ అవస్థ చూస్తూ వనజ మరింత సంబరపడింది.

సుబ్రమణ్యం శ్రీనివాస్ బృందం బిడియంగా చుట్టూ చూసారు. ఆడిటోరియంలో అందరూ తమనే చూస్తూ చప్పట్లు కొడుతున్నట్లనిపించింది. సైలెంట్‌గా తలవంచుకుని చివరి సీట్ల దగ్గరికి నడిచి ఓ మూలగా కూలబడ్డారు.

కాసేపట్లో స్టేజీమీద ప్రోగ్రామ్ అనౌన్స్ చేశారు.

“ఇప్పుడు ఫాన్సీ డ్రెస్ కార్యక్రమం”

అమ్మాయిలు రకరకాల వేషధారణతో రాంప్ వాక్ చేసి వచ్చి వరుసలో నిలబడుతున్నారు. ఒకరిని మించి మరొకరు అందంగా ఆకర్షణీయంగా తయారయ్యారు. ఇంతలో వనజ వచ్చింది.

చూపుల్తోనే స్వప్నలోకాల్లో విహరింపచేసే అందంతో, చూపరులకు మత్తెక్కిస్తూ దేవకన్యలా హంసగమనంతో మెల్లిగా నడచి వచ్చి వరుసలో నిలబడింది. ఆడిటోరియం చప్పట్లతో మార్మోగిపోయింది. తరువాత మరో అందమైన అమ్మాయి కాశ్మీరీ వేషంతో వచ్చినా పెద్దగా స్పందన రాలేదు. ఆమె వచ్చి వనజ పక్కన నుంచుంది.

వనజ వంక చూస్తూ, “నా టైమింగ్ బాగా లేదు. నన్నెవరూ పట్టించుకోలేదు. నేను నీ కన్నా ముందు వచ్చి ఉంటే బాగుండేది” అంది.

“అదేమీ లేదులే.. నీవు కూడా బాగున్నావ్.”

“నీవు అంటే సరా.. అమ్మాయిలు కూడా నిన్నే చూస్తున్నారు. నేనే మొగాడినయితే మొనగాడిలా నిన్నెత్తికెళ్లిపోయేదాన్ని. అయినా ఇంత అందం ఎవరి కోసమే?” అంటూ బుగ్గన ముద్దుపెట్టుకుంది.

ఆడిటోరియం చప్పట్లతో దద్దరిల్లిపోయింది. సుబ్రహ్మణ్యం బృందం కసిగా చప్పట్లు కొట్టింది.

“చూసావా? అందరి మనసులో ఉన్న కోరిక అది. అందుకే అన్ని చప్పట్లు”

వనజ సిగ్గుపడి లోపలి నడుచుకుంటూ వెళ్ళిపోయింది. వెంటనే తెర పడింది. మైకులో తర్వాతి ఐటెంగా సినిమా తార డాన్స్ అనౌన్స్ చేస్తున్నారు.

“ఆ పిల్లెవరోగానీ నా ముందుంటే నేనూ ఓ ముద్దిచ్చేవాణ్ణి” ఆనందంగా అన్నాడు శ్రీనివాస్.

“హలో” అని అమ్మాయి గొంతు వినిపించింది దగ్గరగా..

ఎవరో చేయి పట్టుకున్నట్లై వెనక్కు తిరిగి చూసాడు- చీకట్లోకి.. ఆ పిల్లే!

అంతలో లైట్లు వెలిగాయి. ఆ వెలుగులో ఆ అమ్మాయి వంక తేరిపారా చూసి అవాక్కయ్యారు సుబ్రహ్మణ్యం, శ్రీనివాస్.

ఆ పిల్ల – ఆంజనేయులు!

***

ప్రోగ్రాం పూర్తయింది.

మిత్రత్రయం ఇళ్లకెళ్లి ఫ్రెష్ అయి సిటీ సెంటర్‌లో కలుసుకున్నారు.

“ఏరా సుబ్బిగా.. పద బార్ కెళ్లాల్సిందే..” అన్నాడు ఆంజనేయులు.

“తప్పదుగా.. అయినా అదృష్టవంతుడివిరా అంజీ” మెచ్చుకోలుగా అన్నాడు సుబ్బిగాడు.

“ఆ సుందర సుకుమారి బుగ్గలు ఎరుపెక్కేలా ముద్దుపెట్టుకున్నందుకేనా?” అన్నాడు శ్రీనివాస్.

“అవునురా”

“ఆ ముద్దులో అనుభూతి ఉండదురా.. ముద్దును తేలికగా తీసెయ్యమాకు. ఇద్దరూ ఆర్తితో పెట్టుకున్న ముద్దు ఓ అందమైన అనుభవం. అయినా ముద్దంటే ఏమనుకున్నారు? ప్రేమ పరిచయానికి షేక్‌హ్యాండ్ లాంటిది.” బోధిస్తున్నట్లుగా అన్నాడు శ్రీనివాస్.

“సరే నడవండి.. బార్ కెళ్లే దారిలో గుడి బయట ‘దేవత’ల్ని దర్శించుకుందాం” అంటూ కదిలాడు ఆంజనేయులు.

దారిలో కనబడిన ఫ్రెండ్స్‌తో సినిమా కబుర్లూ, అభిమాన సంఘాల విశేషాలతో బాతాఖానీ కొడుతూ గుడి వద్దకు జేరారు.

లైట్ల వెలుగులతో వచ్చేపోయే భక్తులతో కళకళగా కల కలగా, గోల గోలగా వుంది అక్కడి వాతావరణం. మైకులోంచీ వినిపిస్తున్న భక్తి గీతం దారినపోయే వాళ్ళని ఆహ్వానిస్తున్నట్లు ఉంది. బయట కూర్చున్న ముష్టివాళ్లు ‘చెప్పుల మీద చిత్తం’ ఉన్నవాళ్ళకి కేర్‌టేకర్ లాగా కనిపిస్తున్నారు.

అందమైన ఆడపిల్లలు, తల్లులతో కలసి గుడికి వస్తున్నారు.

ఆంజనేయులు విసుగ్గా “ఒరేయ్ సుబ్బిగా.. దేవుడి సేవకెళ్ళేటప్పుడు పిల్లల పక్కన తల్లులెందుకురా?”

“నీలాంటి మగపీనుగులుంటారు గదా. అందుకే.. పిల్లలు తల్లులు కాకుండా జాగ్రతన్నమాట” అన్నాడు శ్రీనివాస్.

“ఒరేయ్ నీవు నాకు అపశకున పక్షిలా తయారయ్యావ్. అయినా నీవెందుకొచ్చావ్ ఇప్పుడు?”

“ఓయ్.. నావి వెయ్యి రూపాయలున్నాయ్ బార్ బిల్‌లో.. వద్దంటావా చెప్పు. నేనొక్కడినే ఎంజాయ్ చేస్తా నీ పేరు చెప్పుకుని”

“ఒరేయ్.. వదిలేయ్ రా.. మనం ఎప్పుడన్నా విడివిడిగా తిరిగామా, తాగామా? మీ గొడవ ఆపి అటు చూడండెహె” అన్నాడు సుబ్రహ్మణ్యం.

వచ్చేపోయే వాళ్ళల్లో చెవుల్లో పూలెత్తుకున్నవాళ్లనీ నుదుటున భూతవైద్యుడిలాగా విభూతి పెట్టుకున్న మెగా భక్తుల్నీ ఆటపట్టిస్తూ కాసేపు కాలక్షేపం చేశారు.

“ఇక పదండి రా.. మీరు దేవుడి మత్తులోపడి నన్ను మందు కొట్టనీకుండా చేస్తున్నారు” అన్నాడు ఆంజనేయులు.

“చ్చ.. చ్చ.. అలాంటిదేమీ లేదు. ఎక్కడైనా, ఎప్పుడైనా దైవదర్శనం తర్వాతే కదా తీర్థప్రసాదాలు.. దేవీ దర్శనం అయ్యింది. ఇక వెయ్యండి ముందడుగు” అన్నాడు శ్రీనివాస్.

కబుర్లు చెప్పుకుంటూ బార్ దగ్గరికొచ్చేసరికి రామాచారి గారి వయసులో ఉన్నప్పుడు కొన్న లాంబ్రెట్ట స్కూటర్ కనిపించింది.

“హా! హతవిధీ! ఈ కలియుగ రాముడు ఇక్కడికేల వచ్చినట్లు?” అంటూ బాధపడిపోయాడు ఆంజనేయులు.

“భక్తుడివి – ఆంజనేయుడివి నీవు వచ్చావ్ గా! ఇంకేం.. జాయింట్ గా కొట్టండి” నవ్వాడు సుబ్రహ్మణ్యం.

“అయినా పాఠం చెప్పేటప్పుడు పంతులుగానీ, మందు తాగేటప్పుడు మనవాడినోయ్.. గొప్ప, బీద భేదాలు గుర్తురానిది ఇక్కడేనోయ్. నా దృష్టిలో సోషలిజానికి నిఖార్సైన ఉదాహరణ మధుశాల ఒక్కటే. అందుకే ఇదంటే నాకంత ఇది” అన్నాడు శ్రీనివాస్.

“నిజమే.. అందుకే సొయ తెలీకుండా పోతుంది ఇక్కడికొస్తే” అన్నాడు ఆంజనేయులు.

“పడండిరా.. ఛీర్‌ఫుల్‌గా త్రీ చీర్స్ చెప్పేద్దాం గురూగారికి” అన్నాడు శ్రీనివాస్.

“అమ్మో.. నేను చస్తే రాను.. మీరెళ్ళండి” అన్నాడు సుబ్రహ్మణ్యం.

“ఆకారపుష్టీ, నైవేద్యం నష్టీ.. అన్నట్లు గున్న ఏనుగులా ఉన్నావ్, గుండె ధైర్యం లేకపోతే ఎలా బ్రతుకుతావురా? సరేలే.. ఏదో రకంగా ఆయన్ను సాగనంపి ఆ తర్వాతే మొదలెడదాం. పదండి” అంటూ లోపలి దారితీసాడు శ్రీనివాస్.

డిమ్ లైట్ల మసక వెలుతురులో ఉన్న బార్ హాల్‌లో ఓ మూలగా కూర్చుని మాన్షన్ హౌస్‌లో మత్తుగా మునిగి తేలుతూ, హరిశ్చంద్రుడి కాటి శీను పద్యాలు పాడుకుంటున్నాడు రామాచారి.

“కొడకో.. కొడకో..” అంటూ శోకరసాన్ని వొలకబోస్తున్నాడు.

“ఒరేయ్.. ఆ పద్యం వింటుంటే మనం చేసే పనికి, మా నాన్న ఏడుస్తున్నట్లుందిరా” బిక్కు బిక్కుగా అన్నాడు సుబ్రహ్మణ్యం.

“చచ్చిన మీ తాత పిలుస్తున్నట్లు లేదూ.. ఆయనో ప్రసిద్ధ గాయకుడు, నువ్వో పిచ్చి శ్రోతవి.. నోరు మూస్కో” కోపంగా అన్నాడు ఆంజనేయులు.

‘నోర్ముయ్యి’ అన్నమాట విని వెనక్కు తిరిగి చూసాడు రామాచారి. అక్కడో వెయిటర్ నిలబడి ఉన్నాడు.

అంతే!

కల్లుతాగిన కోతీ, రమ్ము తాగిన గుర్రం అయిపోయాడాయన.

“నన్ను పట్టుకుని.. ఆఫ్ట్రాల్ ఒక సప్లయర్‌వి ‘నోర్ముయ్’ అంటావా.. ఎంత ధైర్యం రా నీకు? మీ ఓనర్‌ని పిలవరా.. నాకు పెళ్ళైన నాలుగోరోజునుంచీ నాలుగో సంతానం పుట్టేదాకా కట్టిన బిల్లంతా కక్కిస్తాను” అర్థం లేని ఆవేశంతో పేలిపోసాగాడు రామాచారి.

“అబ్బే.. నేనేమీ అనలేదండీ” మొత్తుకుంటున్నాడు వెయిటర్.

“నేనే అన్నానండీ” అని దీర్ఘం తీస్తూ వచ్చి కూర్చున్నాడు శ్రీనివాస్.

“ఎవడ్రా నీవు? ఒరేయ్ నేను తాగినప్పుడు నా పెళ్లాన్నే లెక్కచేయను.. ఇంకా నీవెంత?” అంటూ అతని వంక చూసి ఒక్కసారిగా ఉలిక్కిపడ్డాడు.

“మీ మిత్రత్రయం ఇక్కడికెందుకొచ్చిందిరా? అదీగాక నన్ను నోరు కూడా ముయ్యమంటారా? ఏరా వెధవల్లారా? మమ్మల్ని కాలేజీ బయట అన్నా బ్రతకనిస్తారా లేదా?” ఉక్రోషంగా అన్నాడు.

“చ్చ..చ్చ.. మిమ్మల్ని అంతమాట ఎలా అంటాం సార్.. ఇదుగో సుబ్బిగాడు మీ పద్యాలు విననీకుండా వాగుతుంటేనూ.. వాణ్ని అన్నాను – ‘ఒరేయ్ వెధవా.. మాష్టారి గార్ధభం సారీ గాంధర్వ గానాన్ని విని తరించారా’ అని. అంతే” సర్దిచెప్పాడు శ్రీనివాస్.

“అసలు మీరెప్పుడొచ్చారు? ఎందుకొచ్చారు?”

“మీరు ‘కొడకో..కొడకో..’ అని విలపిస్తున్నప్పుడు వచ్చాం.”

“అదే ఎందుకొచ్చారని అడుగుతున్నాను” తీక్షణంగా చూసాడు రామాచారి.

శ్రీనివాస్ ఏదో చెప్పబోయేంతలో, ఆంజనేయులు అందుకుంటూ “మీ మూడో కొడుకు గురించేనండీ”

“మూడో కొడుకా.. వాడికేమోచ్చిందీ?”

“అవునండీ.. వాడికొచ్చింది పొయ్యేకాలం.. అందుకే కనిపించకుండా పోయాడుట.. పంతులమ్మగారు ఊరూ వాడా చుట్టబెట్టేస్తూ కన్పించినవాళ్ళని కన్నీళ్లతో తడిపేస్తూ, పుత్రశోకంతో తల్లడిల్లిపోతోంది ఆ మహాతల్లి.. మమ్మల్ని చూసి మీరెక్కడైనా కన్పిస్తే చెప్పమంది. ఇక భయం లేదు. మీకు కన్పించారుగా. వెళ్లి మీరు ఇక్కడున్నారని చెప్పేస్తాం” అంటూ లేచాడు శ్రీనివాస్.

“ఒరేయ్ త్రాష్టుడా.. ఆగరా.. బాబూ.. ఆగు. ఇప్పుడు వెళ్లి సంగతి చెబితే.. నా పిల్లలు పితృశోకంతో బాధపడాల్సివస్తుంది.. నేనే పోతా..” వణికిపోతూ లేచాడు రామాచారి.

“అదేంటి సార్.. మీరలా భయపడతారు? మత్తులో ఉన్నప్పుడు పెళ్ళాన్నైనా లెక్కచేయనన్నారు?” ఆశ్చర్యంగా అడిగాడు సుబ్రహ్మణ్యం.

“ఇంకెక్కడి మత్తురా బాబూ.. అదెప్పుడో దిగిపోయింది.” అంటూ బయటికి పరుగెత్తాడు.

“హమ్మయ్య.. ఇక ఇక్కడే బైఠాయిద్దాం” అంటూ కుర్చీలు ఆక్రమించుకుని ఆర్డర్ చెప్పారు.

గ్లాసులు గాల్లో కలుసుకున్నాయి. చీర్స్ చెప్పుకున్నారు.

“ఆనందో బ్రహ్మా”

కొద్దినిమిషాల్లోనే మధులోకంలోకి మత్తుగా జారిపోయారు మిత్రత్రయం.

ఆ మరునాడే వాళ్ళు ఎన్.సి.సి. క్యాంపుకు బయలుదేరారు.

(సశేషం)

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here