జైత్రయాత్ర-8

2
11

[శ్రీ కస్తూరి రాజశేఖర్, కస్తూరి వేణుగోపాల్ రచించిన ‘జైత్రయాత్ర’ అనే నవలని ధారావాహికగా అందిస్తున్నాము.]

[తనకి ఆ రోజు రెస్ట్ కావడంతో శ్రీనివాస్ ఒక్కడే పొలలా గట్ల వెంబడి నడుస్తుంటాడు. అందమైన ప్రకృతిని, పక్షుల కిలకిలారావలను ఆస్వాదిస్తూ వెళ్తున్న అతనికి ఓ చోట అందమైన యువతి కనిపిస్తుంది. ఆమె సౌందర్యాన్ని చూసి నోట మాట రాని స్థితికి చేరుకుంటాడు. కొద్దిసేపటి తరువాత ధైర్యం చేసి ఆ అమ్మాయి పేరు అడుగుతాడు. ఆమె కూడా తేరుకుని ఎవరు నువ్వు అని అడుగుతుంది. తత్తరపడతాడు. కొన్ని క్షణాల తరువాత గొంతు పెగుల్చుకుని ఎన్.సి.సి. అంటూ నీళ్ళు నములుతాడు. ఓహో.. ఆళ్ళ మడిసివా?.. వెరీ గుడ్ అని, తనకి కాస్త ఇంగిలీషు వచ్చు అంటూ నవ్వుతుంది. మళ్ళీ ఇంకోసారి ఆమె పేరు అడుగుతాడు. ప్రకృతి అని చెప్పి, శ్రీనివాస్ పేరు తెలుసుకుని అక్కడి నుంచి వెళ్ళిపోతుంది. ఆమెనే తలుచుకుంటూంటాడు శ్రీనివాస్. రాత్రయినా ఆమె తలపుల్లోంచి బయటపడకపోవడంతో, నాటు మందు తాగొచ్చావా అని సుబ్బు, అంజి అడుగుతారు. అంజి, సుబ్బు కాసేపు మాట్లాడుకుని నిద్రపోతారు. శ్రీనివాస్‍కి నిద్ర రాక బయటకు వస్తాడు. ఆరు బయట ఉన్న ఓ కుర్చీలో కూర్చుని, ప్రకృతిని తలచుకుంటూ, మనసులో మూగగా భావరాగాల్ని పాడుకుంటాడు. మర్నాడు ఉదయమే పాపయ్య శెట్టి రాయుడి ఇంటికి వస్తాడు. కబురె చేయకుండా వచ్చావేంటి అని రాయుడు అడిగితే, మీ ఇంటి కాకి మా ఇంటి మీద వాలింది, కబురందినట్టే అని అంటాడు. గ్రామంలో బావి తవ్వడానికి ఏర్పాట్లు జరిగిపోతుంటే, పట్టించుకోరేమని అడుగుతాడు శెట్టి. మంచిదే కదా అంటాడు రాయుడు. అదేంటని అడిగితే, అంతా తవ్వింతర్వాత మొదటి చేద మనమే వేద్దాం, గౌరవం దక్కించుకుందాం, ఫోటో తీయించుకుందాం అంటాడు రాయుడు. మరి సంపాదనో అని శెట్టి అడిగితే, తన ప్లాన్ వివరిస్తాడు. శోభ పరుగెత్తుకుంటూ బడి దగ్గరకు వస్తుంది. మొద్దబ్బాయిని పిలవమంటుంది. ఆ పేరుతో ఎవరూ లేరంటాడు వెంకట్రావు. ఉన్నాడండీ, లావుగా, బొద్దుగా, మొద్దులా ముద్దొస్తూ ఉంటాడని అంటుంది శోభ. వెంటనే ఆమె సుబ్రహ్మణ్యం గురించి అడుగుతోందని పోల్చుకుంటాడు వెంకట్రావు. సాయంత్రం గుడికి రమ్మని, దేవుడి కళ్యాణం చేయిస్తునామని, బాగా ప్రసాదాలు పెడతారని చెప్తుంది. మధ్యాహ్నం విద్య కొంతమంది గ్రామస్థులతో కలిసి బడి వద్దకు వస్తుంది. ఊర్లో ఎక్కడ బావి తవ్వితే నీళ్ళు పడతాయో, ఎక్కడ తవ్వితే అందరికీ ఉపయోగంగా ఉంటుందో చర్చిస్తారు. వెంటనే కొందరు కుర్రాళ్ళు పట్నం వెళ్ళి ఒక జియాలజిస్టుని పిల్చుకువస్తారు. అతని భూ పరీక్షలు చేసి వాటర్ పాయింట్‍లని మార్క్ చేసి వెళ్తాడు.  వెంకట్రావు రాయుడు ఇంటికి వెళ్ళి బావి తవ్వకానికి ప్రారంభోత్సవం మీరే చెయ్యాలని ఆహ్వానిస్తాడు. వస్తానని చెప్తాడు రాయుడు. సాయంత్రం మిత్రత్రయం గుడికి వెళ్తారు. అక్కడ సుబ్బుని చూసిన శోభ వాళ్ళ అమ్మ ధనలక్ష్మి సుబ్రహ్మణ్యం వంక చూస్తూ, మీది ఏ ఊరు, ఎవరబ్బాయివి అని అడుగుతుంది. హైదరాబాద్ నుంచి వచ్చమని, తన తండ్రి పేరు చెప్తాడు. ఆ పేరు వినగానే ధనలక్ష్మి ఆశ్చర్యపోతుంది. నీవు సదాశివ పర్వతాలు గుప్తా గారి కొడుకువా అని అడుగుతుంది. అవునంటాడు. తమకీ, వాళ్ళకీ చుట్టరికం ఉందని, సుబ్బు నాన్న తనకి అన్నయ్యని చెప్తుంది ధనలక్ష్మి. అంటే.. నీవు ఆవిడకి అల్లుడివన్నమాట అంటాడు శ్రీనివాస్. వీలున్నప్పుడల్లా ఇంటికి వచ్చి వెళ్ళమని సుబ్బుకి చెప్తుంది. పూజయ్యాక పూజారి ప్రసాదం ఇచ్చేసి, గర్భగుడికి తాళం వేసి వెళ్ళిపోతాడు. ప్రసాదాలు తినడం అయ్యాకా, సుబ్బుని తీసుకుని గదికి వెళ్ళిపోమని అంజితో చెప్పి, శ్రీనివాస్ పొలాల వైపు నడుస్తాడు. – ఇక చదవండి.]

అధ్యాయం-10

[dropcap]సు[/dropcap]బ్రహ్మణ్యం ‘రన్నింగ్’కు బయలుదేరాడు. ఆ రోజు వెంకట్రావుతో తాను రోజూ రన్నింగ్ చేస్తానని ఎందుకు చెప్పాడో గానీ, ప్రతిరోజూ ప్రొద్దున్నే నాలుగుగంటలకల్లా లేపి రన్నింగ్‌కి పంపిస్తున్నాడు. ఈ శిక్ష ఏమిటో.. అనుకుంటూ ఈడ్చుకుంటూ వెళ్తున్నాడు. శోభ పరిచయమైనప్పట్నుంచీ ప్రొద్దున్నే బ్రష్ చేసుకుని వెళ్తున్నాడు తను ఏదో ఒకటి తినిపిస్తుందని..

పరుగెత్తుతూ శోభావాళ్ల ఇంటిదగ్గరకొచ్చి ఆగాడు. చివుక్కున కాలిమీద ఏదో కుట్టినట్టయి వంగి కాళ్ళకేసి తడుముకున్నాడు. పెద్ద నల్లటి గండుచీమ. కసుక్కున కొరికిందేమో పాదం ఎర్రగా అయ్యింది. ఉన్నట్టుండి గావుకేక పెట్టబోయి ఆగిపోయాడు సుబ్రహ్మణ్యం.

శోభ వేసిన ముగ్గు.. దయ్యంలా ఉంది. చీమ మీద జాలేసింది. ముగ్గు చూసి భయపడి పారిపోతుంటే తన కాలు అడ్డం వచ్చి ఉంటుంది. అది మాత్రం ఏమి చేస్తుంది. కుట్టేసి తన దారిన తాను పోయింది.

ఇంత చేసి శోభ కనపడలేదు. అందుకని తినడానికేమీ దొరకలేదు. నీరసం ముంచుకొచ్చింది.

మళ్ళీ పరుగు మొదలెట్టాడు. దారిలో రాయుడు ఇంటిముందు మళ్లీ అలసట కోసం ఆగాడు. కళ్ళు తిరుగుతున్నట్టుగా ఉంది. ఓపిక తెచ్చుకుంటూ యథాలాపంగా రాయుడి ఇంటివైపు చూసాడు. అంతే..!

కళ్ళు బైర్లు కమ్మినయి. కళ్ళు నులుముకుని చూసాడు. నిజమే.. అక్కడ ప్రిన్సిపాల్ గారి అమ్మాయి వనజ! ఒక్క పరుగు తీసాడు.

అదే ఊపులో క్యాంపులో కొచ్చిపడ్డాడు.

“ఒరేయ్.. అంజి, శీనూ.. మిమ్మల్నే.. ఎక్కడ చచ్చార్రా?” అంటూ కుర్చీలో కూలబడ్డాడు.

వాడి అరుపు విని వచ్చి వాడి పరిస్థితి చూసి ‘వాడికేదో అయింద’ని మంచినీళ్లు తెచ్చి సుబ్రహ్మణ్యం మొహం మీద జల్లి గ్లాస్ చేతికిచ్చారు. అతను గ్లాసెత్తి గడగడా నీళ్లన్నీ తాగేసి కాసేపలా ఉండిపోయాడు. అప్పటికే తాగిన నీళ్లన్నీ చెమటగా మొహం మీదనుంచి కారుతున్నాయి. తల వ్రేలాడేసి దీర్ఘంగా శ్వాస తీసుకుంటున్నాడు. ‘వీడు కొలాప్స్ అవుతాడేమో’ అని భయంగా వాడి వంకే చూడసాగారు.

రెండు నిముషాలకి తేరుకున్నాడు సుబ్రహ్మణ్యం. తల అటూ ఇటూ తిప్పి, కళ్ళు పెద్దవి చేసి ఆవులించి వింత వేషాలన్నీ వేయసాగాడు.

“ఒరేయ్ సుబ్బిగా, ఏమయిందిరా నీకు? నీ ఊబకాయమేమిటీ – ఈ పరుగులేమిటి? కుర్చీలో పడిపోవటం ఏమిటీ? పొలికేకలేమిటీ? నువ్వు బ్రతికే ఉన్నావా?” అడిగాడు ఆంజనేయులు.

సుబ్రహ్మణ్యం ఆయాసం తీర్చుకుంటూ వాళ్ళవంక చూసాడు. ఇద్దరూ వాడి వంక ఆదుర్దాగా చూస్తున్నారు. మెల్లిగా పెదాల మీదకి చిరునవ్వు వచ్చింది. ఆ తర్వాతా మోహంలో ఎగ్జయిట్మెంట్..

మాట్లాడలేక నవ్వుతూ తల ఊపుతున్నాడు.

“ఏంటీ.. చెప్పరా.. నోరు పడిపోయిందేమోరా?”

“ఎహె.. పడిపోతే ఎందుకు నవ్వుతాడు?”

“దయ్యం పట్టిందంటావా?”

“అయ్యుండొచ్చు.. వాడి పిచ్చి చేష్టలు చూస్తే అలానే ఉంది..”

“అయితే మూగ దయ్యం అయ్యుంటుంది. అందుకే మాట్లాడలేకపోతున్నాడు.”

సుబ్రహ్మణ్యం ‘కాదు కాదు’ అంటూ తల చేతులూ ఊపుతున్నాడు. మిత్రులు తమ ధోరణిలో ఉండి పట్టించుకోవటం లేదు.

“వెంకట్రావు సార్‌కి చెబుదామా?”

“వద్దురా.. కర్ర తీసుకుని రెండు పీకితే దెబ్బకి దయ్యం వదులుతుందిట..”

“సుబ్బిగాడి అమ్మమ్మ చెప్పిందా?”

“కాదు మా అమ్మమ్మ చెప్పింది” అంటూ ఆంజనేయులు వెళ్లి మూలనున్న దుడ్డుకర్ర తెచ్చాడు.

కర్ర ఎత్తి కొట్టబోతే, సుబ్రహ్మణ్యం కీచుగా అరిచాడు.

“మిమ్మల్ని తగలెయ్య.. ఆగండ్రా.. నాకు దయ్యం పట్టలేదురా.. దయ్యం వచ్చిందిరా ఈ వూరికి..”

“ఎవరూ?” అనుమానంగా అడిగాడు శ్రీనివాస్.

“వనజ రా..”

“ఏంట్రా..”

“అవునురా.. రాయుడిగారింట్లో కనిపించింది”

“నీవు స్పృహలోనే ఉన్నావా?”

“ఒరేయ్ వీడికి నిజంగానే దయ్యం పట్టిందిరా” అంటూ మళ్ళీ కర్ర ఎత్తాడు ఆంజనేయులు.

“నిజం రా.. నా శోభ మీద ఒట్టు”

ఆంజనేయులు ఆగిపోయాడు.

“నిజమా?” ఇద్దరూ ఒకేసారి అన్నారు.

“అవునురా.. నేను వస్తుంటే రాయుడిగారింట్లో వరండాలో తిరుగుతోంది.”

“ఈవూరి కెందుకట” అని, “నా కర్ధమైంది.. ఆ రోజు కాలేజీ డేలో నువ్వు పెట్టిన ముద్దు మరచిపోనట్లుంది. అందుకే పరిగెత్తుకొచ్చింది. ఒరేయ్ అంజి.. నోరు శుభ్రం చేసుకో.. మరో మంచి అవకాశం” అన్నాడు శ్రీనివాస్.

“ఛీ.. ఫోరా..” సిగ్గుపడుతూ అన్నాడు ఆంజనేయులు.

“ఖచ్చితంగా అందుకు కాదు” అన్నాడు సుబ్రహ్మణ్యం.

“మరి?”

“నీ మీద పగ దీర్చుకోవటానికి రాయుడిని సహాయం అడిగి ఉంటుంది. నిన్నిక్కడే లేపేస్తే అడిగేవాడెవడూ లేడు.”

“నిజంగానా?” భయపడ్డాడు ఆంజనేయులు.

వనజ వచ్చిందంటే సంతోషంగా ఉన్నా, రాయుడు ఇంట్లో ఉంది అనేసరికి అనుమానంగా ఉంది అతనికి.

“ఏమైనా సరే.. ఎలాగైనా వనజని ఈ రోజు కల్సుకు తీరాల్సిందే?” అన్నాడు శ్రీనివాస్.

“నోర్ముయ్.. ఇది అంజిగాడు అనాల్సిన డైలాగ్” అన్నాడు సుబ్రహ్మణ్యం.

“వాడు పెళ్లి చేసుకోను అన్నాడు కదరా?”

“పెళ్లి చేసుకోను అన్నాను కానీ కలుసుకోను అన్లేదుగా” లాజిక్ తీసాడు ఆంజనేయులు.

కాసేపటికి ఎన్.సి.సి క్యాంపు మొత్తానికి విషయం తెలిసింది. అందరూ మిత్రత్రయాన్ని చుట్టుముట్టారు.

“ఎందుకొచ్చిందిరా”

“అంజిగాడి కోసమేనా?”

“ఇష్టమా?”

“కాదు.. రాయుడితో చెప్పి కొట్టించడానికి” చెబుతున్నాడు సుబ్రహ్మణ్యం.

“ఒరేయ్ వెధవా.. నీ వెధవ ఊహలతో వాళ్లకి లేని ఆలోచనలు క్రియేట్ చెయ్యకు” అన్నాడు ఆంజనేయులు అసహనంగా.

“అదే జరిగితే మనం ఊరుకుంటామా?”

“మనవాణ్ణి కాపాడుకుంటాం”

“చక్రం అడ్డం వేసైనా సరే “

“మా అమ్మమ్మ ఇచ్చిన చక్రాలయితే నేనివ్వను” అన్నాడు సుబ్రహ్మణ్యం.

“నీ బొంద.. అవి ఇంకా ఎక్కడున్నాయి? ఎప్పుడో తినేసాం.”

“అవునా.. మరి నేను రోజా రాత్రి పూట బరువు చూస్తున్నానే?”

“ఒరేయ్ వెన్కమొహమా! బరువు చూస్తున్నావ్ కానీ లోపల యేమివున్నాయో చూడట్లేదుగా?”

సుబ్రహ్మణ్యం కోపంతో ఊగిపోతూ

“ఆఁ! నా ఆస్తిని ఇలా కాజేస్తారా? మీ మీద కోర్టులో కేసు వేస్తా. మిమ్మల్నీ.. మిమ్మల్నీ..” ఆ తర్వాత మాటరాక నిలబడి పోయాడు.

“పోన్లేరా సుబ్బీ.. వాళ్ళూ మనవాళ్ళేగా.. వదిలేయి.. నీకేమీ నష్టం లేదుగా.. దీనికి మూడింతలు మీ శోభ తెచ్చి నోట్లో కూరిందిగా.. ఇది వదిలేసి ఇంక కదులు.. పల్లె తెరమీద మరో బొమ్మ కనిపించబోతోంది” అన్నాడు శ్రీనివాస్ నవ్వుతూ.

***

వనజ గుడికి బయలుదేరింది. అలవాటు పడ్డ దారిలా నేరుగా గుడికి జేరింది. మిత్రత్రయం ఆమెకి ఏమాత్రం అనుమానం రాకుండా చెట్ల చాటునుంచీ, ఇళ్ల చాటునుంచీ ఆమెను అనుసరించారు.

తన వెనుక గుడి గంట మ్రోగేసరికి ఉలిక్కిపడి వెనక్కితిరిగి చూసింది వనజ.

ఆంజనేయులు ఏమీ ఎరగనట్టు భక్తితో దేవుడికి దండం పెట్టుకుంటున్నాడు.

“నువ్వా?” ఆశ్చర్యంగా చూస్తూ అడిగింది వనజ.

ఆంజనేయులు కళ్ళు తెరచి

“ఆఁ.. నేను దేవుణ్ణి కోరితే, దేవత దిగి వచ్చిందే?” తన్మయంగా అన్నాడు ఆంజనేయులు. శ్రీనివాస్, సుబ్రహ్మణ్యం దూరంగా చెట్టు చాటునుంచీ చూస్తున్నారు.

“ఏమిటీ వింత శ్రీరామా?.. నేను ఘోటక బ్రహ్మచారినని తెలుసు. అయినా, నీ భక్తుడిని, సాక్షాత్తూ కలియుగ ఆంజనేయుడిని పరీక్షించడానికేనా ఈ పరీక్ష?” పెద్దగా కేక పెట్టాడు.

ఎవరైనా వస్తారేమోనన్న భయంతో చప్పున వచ్చి చేత్తో అతని నోరు మూసింది వనజ.

“ఏమయ్యా రామచంద్రా! సీతమ్మ తల్లి నిన్నిలా చేత్తోనే నోరు మూసిందా? ఆ మాత్రం తెలీని ఆ దేవతనెందుకు పంపావయ్యా బాబూ! ఏ రంభ, ఊర్వశి నో పంపితే పోయేది గదయ్యా?” మూసిన నోటితోనే పెద్దగా అనటానికి ట్రై చేస్తున్నాడు.

“భక్తా.. ఆంజనేయులూ” అని వినిపించింది.

“ఆహా!.. నా జన్మ ధన్యమైంది!.. సీతమ్మ తల్లీ! కనికరించావా? నన్ను పిలుస్తున్నావా? నా కొక చక్కని చుక్కని ప్రసాదిస్తున్నావా? ఇదిగో.. వస్తున్నా” అంటూ గర్భ గుళ్ళోకి గంతేయబోయాడు.

“చాల్లే.. ఆపు నాటకాలు.. నేను.. వనజని” అంది పట్టుకుని ఆపుతూ..

“ఇక్కడున్నావేమిటి?”

“మా రాయుడు బాబాయ్ గారింటికి వొచ్చా సెలవలకి”

“ఆ.. రాయుడు గారు మీ బాబాయా?” తడబడుతూ, “వనజా.. ఆ రోజు కాలేజీలో.. హే.. హే.. ఏదో సరదాకి..”

“సరదాకి?..”

“హి హి సరదాకి..”

“ఏమిటి సరదాకి?” కోపంగా అంది వనజ.

ఆంజనేయులు జావకారిపోయాడు.

“అదే.. ఏదో సరదాకి మిత్రులంతా నిన్ను ముద్దు పెట్టుకుంటే.. అని బెట్ కట్టారు.. అందుకని.. నిన్ను ముద్దుపెట్టుకున్నాను..”

“పెట్టుకుంటే..?”

“పెట్టుకుంటే.. ఆబ్బె.. నాకు చెడు ఆలోచన లేదు.. అందుకే.. మీ బాబాయికి చెప్పకు.. నన్నేమీ చేయకు..”

వెక్కిళ్ళతో “నేను.. నేను చాల మంచివాడిని వనజా.. ప్లీజ్.. సారీ.. థాంక్స్.. అన్నీ.. సరేనా?” వణికిపోతున్నాడు.

“నాకు నీలాంటి పిరికివాళ్ళంటే ఇష్టం ఉండదు. తప్పు చేసినా నిజాన్ని ధైర్యంగా చెప్పేవాడే ఇష్టం. తెలిసిందా?..”

‘తెలిసింద’న్నట్టు బుద్ధిగా తలా ఊపాడు చేతులు కట్టుకుని.

“అది సరే గానీ, మీరంతా ఇక్కడున్నారేమిటి సెలవల్లో?”

“అయ్యో.. నీకు తెలీదా? ఎన్.సి.సి తరపున మేమంతా ఈ వూర్లో శ్రమదానానికి వచ్చాం. కానీ, ఇలా ఒళ్ళు గుల్ల అవుతుందని అనుకోలేదు. ఎరక్కపోయి వచ్చి ఇరుక్కుపోయాం”

వనజ నవ్వింది, “బద్దకస్తుడికి పనెక్కువని పెద్దవాళ్ళు ఊరికే అన్నారు.. నేను మా బాబాయికేం చెప్పనులే.. భయపడకు. బట్ సో లవ్లీ టు మీట్ యు.. లవ్ యు..” అంటూ వెళ్ళిపోయింది. చివరి మాటలు వినకుండా..

‘హమ్మయ్య.. మంచిగానే ఉంది. రాయుడికి చెప్పను అంది. అది చాలు..’ అనుకుంటూ దేవుడికి నమస్కారం పెట్టుకున్నాడు.

“కంగ్రాట్స్ రా అంజిగా” మిత్రులు భుజం మీద గట్టిగా చరిచేసరికి ఉలిక్కిపడ్డాడు ఆంజనేయులు.

“మీ ప్రేమ మండినట్టే ఉంది.. కాస్త ఉంటే నా మూతి, పళ్ళు రాలేవి.. ఇంతకీ కంగ్రాట్స్ ఎందుకురా?”

“ఎందుకంటే మా ప్రేమ మండినా, నీ ప్రేమ పండిందిరా..”

“అంటే..” అర్థం కాక అడిగాడు ఆంజనేయులు.

“వనజ ఏముందో వినలేదా?”

“వాళ్ళ బాబాయికి చెప్పను అంది. అందుకా కంగ్రాట్స్?” ప్రశాంతంగా ఊపిరి పీల్చుకుని అన్నాడు.

“ఓరి వెర్రి పీనుగా.. లవ్ యు.. అందిరా.. నీ మట్టి బుర్ర అలాంటివి పట్టించుకోలేదులే..”

“అయినా మీరు దూరంగా చెట్టు చాటున ఉన్నారుగా.. మీకెలా వినపడిందీ?”

“ఒరేయ్ నీ చెంప పగులుతుందేమోనని దూరంగా ఉన్నాంగానీ, నవ్వుతూ మాట్లాడితే ఆగుతామా.. ఆ గోడ వెనక నక్కి వినేశాం.”

“హుర్రే” అంటూ ఆంజనేయులు ఆనందంతో ఎగిరే సరికి ‘టంగ్’మని గంట నెత్తికి కొట్టుకుని గణగణ మంటూ మ్రోగింది. ‘అబ్బా చచ్చాను’ అంటూ తలా పట్టుకున్నాడు.

“ఛస్తే చచ్చావ్ గానీ ప్రేమగంటలు మ్రోగినయిలేరా” అన్నాడు శ్రీనివాస్.

(సశేషం)

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here