[సత్యగౌరి మోగంటి గారు రచించిన ‘జలతాండవం..!!’ అనే కవిత పాఠకులకి అందిస్తున్నాము.]
[dropcap]ఏ[/dropcap] నోట విన్నా..
జలదిగ్బంధనం..
దిగ్భ్రాంతి మాటలే.!
ఎటు చూసినా..
పొంగి పొరలే ఏరులు
సముద్రంలో ఆటుపోట్లను
తలపిస్తున్న బీభత్సమైన
వరద వెల్లువ..!
ప్రజా జీవనాన్ని..
భయభ్రాంతులను..
చేస్తున్న ముంపు
కడగండ్లు..!
నిలువ నీడ లేకుండా
కుటుంబాలు..
చెట్టుకొకరు..
పుట్టకొకరుగా..
చెల్లాచెదరైన..
దుఃఖపు ఘడియలు..!
ఏమని చెప్పగలం..
ఈ వరద గాథలను..
ఎలా వర్ణించగలం..
ఈ దయనీయ స్థితిని!
ఆకాశం చిల్లుపడినట్టు
దారలు దారలుగా
వానకురుస్తుంటే..
వాగులు.. ఏర్లు..
పొంగి పొర్లుతుంటే,
భయంకర ప్రవాహం
వెల్లువెత్తి..
కట్టుకున్న ఆవాసాలను
కళ్లముందే కబళించేస్తుంటే..
ఆశలన్నీ ఆవిరై..
ఎటు చూసినా..
మహా సముద్రంలా
కనిపిస్తుంటే..
ఎలా వర్ణించగలం
ఈ ప్రళయకాల…
జలగండాన్ని..!?
రహదారులు తెగిపోయి..
దారులన్నీ నీటితో..
ప్రళయకాల రుద్రునిలా
ఉబికుబికి..
తాండవమాడుతుంటే..
ఊళ్లకు ఊళ్లన్నీ..
జల సమాధులైపోతుంటే
చేతికొచ్చిన పంటలన్నీ..
నీటమునిగిపోతుంటే..
కనులనిండిన చెమ్మతో..
చుట్టూ చీకట్లు ముసురుకుంటే
పగిలిన గుండెతో…
ఎలా వర్ణించగలం..!?
అయిన వారు – కానివారు
కళ్ల ముందే..
కొట్టుకుపోతుంటే..
నిరాశ నిస్పృహలు మనసును..
కమ్ముకుంటుంటే..
ఏదీ గమ్యం..
కనుచూపు మేరలో
కనబడటంలేదే..!
ఏరు ప్రయాణించే దారిని..
ఏళ్లకు ఏళ్లు..
పూడిక తీయకుండా..
వీలైనంత మేర జాగాలను..
ఆక్రమించేసి..
కలవాల్సిన
మరో ఏరును..
కలవవలసిన దారులను..
మూసేస్తే..
ఏరు.. తానేమీ చేయలేని..
నిస్సహాయతతో..
ఆగ్రహంతో..
మనుషులకు..
దారి లేకుండా చేసేసింది..!
ప్రకృతి ఏదైనా..
చెరువైనా..
ఏరైనా…
నదైనా..
వాటిని చూడవలసినట్టు..
చూడకపోతే..
మానవాళి.. బతుకింతే…
చెరువుల కబ్జా..
మనకు మిగిల్చింది విషాదం
డ్రైనేజీ వ్యవస్థలో లోపం..
అయ్యెను కదా-
మన పాలిట శాపం..!
ఇప్పటికైనా కళ్లు తెరిచి..
ప్రకృతితో మమేకమై..
జీవిద్దాం..!
సమతుల్యతను సంరక్షిద్దాం..
భావి తరాలనైనా..
కాపాడుకుందాం..!!