జమ్ము-కాశ్మీర్ హస్తకళలు

0
14

[డా. కందేపి రాణీప్రసాద్ గారి ‘జమ్ము-కాశ్మీర్ హస్తకళలు’ అనే రచనని అందిస్తున్నాము.]

[dropcap]భా[/dropcap]రతదేశంలోని పర్యాటక కేంద్రాలన్నింటిలోకి ప్రధానమైనదీ, అత్యంత విశిష్టంగా భావించేది కాశ్మీరు మాత్రమే. కాశ్మీరు అందాల గురించి మన కవులు, రచయితలు ఎన్నో పాటలు, కథనాలు రాశారు. మొఘల్ చక్రవర్తి షాజహాన్ కాశ్మీరును ‘భూతల స్వర్గం’గా పేర్కొన్నాడు. కాశ్మీరు లోయలో మొఘల్ చక్రవర్తులు ఏర్పాటు చేసిన ఉద్యానవనాలు ఎంతో సౌందర్యంగా కనువిందు చేస్తాయి. దాల్ సరస్సు పైన ఉండే హోస్ బోట్లలో నుంచి కాశ్మీర్ అందాల్ని తిలకిస్తే అద్భుతంగా అనిపిస్తుంది. షాజహాన్ కూడా దాల్ సరస్సు నుంచి కాశ్మీరాన్ని తిలకించి “భూమి మీద స్వర్గం ఎక్కడైనా ఉందంటే అది కాశ్మీరే” అని వ్యాఖ్యానించాడు. 15వ శతాబ్దంలో అక్పరు చక్రవర్తి అప్పటి కాశ్మీరీ పాలకుల్ని ఓడించి కాశ్మీరును కైవసం చేసుకున్నాయి. శ్రీనగర్ లోని మొఘల్ ఉద్యానవనాలు ఈ నాటిరీ ప్రముఖ పర్యాటక కేంద్రాలుగా విలసిల్లుతున్నాయి.

భారతదేశం లోని కేంద్రపాలిత ప్రాంతంగా జమ్ము-కాశ్మీరులో మొత్తం 20 జిల్లాలు ఉన్నాయి. 19వ శతాబ్దంలో రాజ పుత్రుల నుండి సిక్కులు, మరల సిక్కుల నుండి రాజపుత్రులు కాశ్మీరును కైవసం చేసుకున్నారు. 1947లో స్వాతంత్రం సిద్ధించినపుడు మహారాజా హరిసింగ్ కాశ్మీరును భారతదేశంలో విలీనం చేశారు. అప్పటి నుంచి జమ్ము కాశ్మీరు భారత దేశంతో ఒక బాగంగా మారింది.

పంచ భూతల స్వర్గంగా పేరుగాంచిన స్విట్జర్లాండు కన్నా కాశ్మీరు ఏమాత్రం తక్కువ కాదు. ప్రకృతి దృశ్యాలు, హీమానీ నదుల హిమాలయల శ్రేణులు, మరెక్కడా కానరాని పూల సొగసులు, అత్యంత పొడవు పెరిగే భారీ వృక్షాలు ఎంతో సౌందర్యం ఉన్నప్పటికీ వివాదాల కారణంగా పర్యాటక రంగంలో వెనకబడి పోయింది.

భారత్ పాకిస్తాన్ల మధ్య జరిగిన మూడు యుద్ధాలకు కాశ్మీరు వివాదమే కారణ భూతమయింది. కాశ్మీరు లోయలోని కొంతభాగం పాకిస్తాన్ అధీనంలో ఉన్నది. దీనిని ‘పాక్ ఆక్రమిత కాశ్మీర్’ అని అంటారు. కాశ్మీర్ లోని ‘ఆక్సాయ్ చిన్’ అనే ప్రాంతం చైనా దేశం ఆధీనంలో ఉన్నది. మిగతా భాగం మాత్రమే భారతదేశంలో ఉన్నది. ‘జమ్ వాయి మాత’ అనే రాజు పుత్రుల కులదేవత పేరు మీదుగా జమ్ము నగరం ఏర్పడింది. జమ్మూ నగరంలో హిందువులు ఎక్కువగా నివసిస్తారు. జమ్మూలో హిందూ దేవాలయాలు ఎక్కువగా ఉన్నాయి. జమ్మూ నగరంలో పది జిల్లాలు ఉన్నాయి.

కాశ్మీరు విభాగంలో పది జిల్లాలున్నాయి. ఇక్కడ వేర్పాటు వాదం ఉగ్రవాదం ఎక్కువగా ఉంటాయి. ఇక్కడ ముస్లిం మతస్తులు ఎక్కువగా నివసిస్తారు. కన్నులకింపైన పర్వత శ్రేణులు, పచ్చిక మైదానాలు, సెలయేర్లు, సరస్సులతో మేను పులకరించే ప్రకృతి సౌందర్యంతో పాటు బాంబుల మోతలు కూడా వినిపిస్తాయి.

కాశ్మీరులో కవిత్వం, హస్తకళలు, జానపద నృత్యాలు ఎక్కువగా అభివృద్ధి చెందాయి. ఇక్కడి పురుషులు చేసే నృత్యంలో ‘దుమ్హల్’ పేరు గాంచినది. అలాగే కాశ్మీరీ స్త్రీలు చేసే ‘నృత్యంలో ‘రోఫ్’ ప్రఖ్యాతి చెందినది. వేసవి కాలపు రాజధారిగా శ్రీనగర్, మిగతా కాలాలలో రాజధానిగా జమ్మూ నిర్ణయించబడింది. ఇక్కడి వంటలలో పెరుగును ఎక్కువగా ఉపయోగిస్తారు. ఇక్కడి సాంప్రదాయిక కళల్లో సిల్క్ కార్పెట్లు, ఊలు కార్పెట్లు, రగ్గులు, షాల్స్, ప్రధానమైనవి. మట్టి కుండల తయారీ కూడా కాశ్మరీల ప్రధాన విద్యే. కాశ్మీరీలు తయారు చేసే స్వచ్ఛమైన గొర్రె ఊలుతో పశ్మీనా శాలువాలు ప్రపంచంలోనే షేరెన్నిక గన్నది. కాశ్మీరు వచ్చిన యాత్రికులు ఎవరైనా పశ్మీనా శాలువాలు కొనుక్కుంటారు. పూర్వకాలంలో రాజులు, రాణులు చలి కాలంలో ఈ పర్మీనా శాలువాలు ఉపయోగించేవారు.

ఇక్కడి తేనీటి పానీయాల్లో కేసర్ టీ, కహ్వ, ‘నూన్ చాయ్’ ప్రధానమైనవి. ఇక్కడు పశ్మీనా శాలువాలు కొనటానికి వెళ్ళినపుడు అక్కడి దుకాణంలో ‘కేసర్ టీ’ ఇచ్చారు ‘కాశ్మీరీ స్పెషల్ టీ’ అని చెప్పారు. ఈ టీ చూడటానికి పసుపురంగులో ఉన్నది. ఇందులో పాలు కలపలేదు. మనమిక్కడ తాగే గ్రీన్ టీ వలె నీళ్ళగా అనిపించింది. తియ్యగా ఉండే కాశ్మీరీ పలావ్‌ను రుచి చూశాం. హైదరాబాద్‌లో తిన్నదాని కంటే స్పైసీగా అనిపించింది. కాశ్మీరులో ఉన్న వారం రోజులూ అక్కడి వంటకాలను రుచి చూశాం.

కాశ్మీరులోని దుకాణాల్లో ఎక్కడ చూసినా రంగురంగు తివాచీలు కనిపిస్తాయి. ఇక్కడ తయారయ్యే తివాచీలు ప్రపంచ వ్యాప్తంగా ఎగుమతి అవుతాయి. మెత్తటి దారాల కలయికతో చేతిలోనే నేస్తారు. ఊలుతో తయారయ్యే స్వెట్టర్లు, షార్‌లు, టోపీలు అత్యంత ఆకర్షనీయమైన రంగుల్లో లభిస్తాయి. నేను తివాచీలైతే కోనలేదు గానీ స్వెట్టర్లు, మఫ్లర్‌లు, జాకెట్ల వంటివి కొన్నాను. అవి ఫర్ వలె బయటుకు దారాలు కనిపిస్తూ అందంగా ఉన్నాయి. వేసుకునే డ్రెస్సులకు మ్యాచింగ్‌గా స్వెటర్లు, మఫ్లర్‌లు టోపీలు ధరిస్తారు అక్కడివారు. అక్కడి చలికి రోజూ స్వెటర్లు ధరించాలి కాబట్టి మ్యాచింగ్ వేసుకుంటారు. వెరైటీగా అనిపించిన రెండు మూడు స్వెటర్లను డ్రస్స్ పైన ధరించే జాకెట్లు వంటి వాటిని తీసుకున్నాను. మా అబ్బాయిలు మాత్రం కొనుక్కోలేదు.

కాశ్మీరులో కాగితం గుజ్జు పరిశ్రమ కూడా ప్రధానమైనదే. కాగితాలను రోజుల తరబడి నీళ్ళలో నానబెట్టి వాటికి జిగురు పదార్థాన్ని కలిపి బొమ్మలు తయారు చేస్తారు. ఈ బొమ్మలకు బంగారంతో తయారైన రంగులను, పలుచటి బంగారు రేకులను అతుకుతారు. ఇటువంటి బొమ్మలు ఖరీదు ఎక్కువగా ఉంటాయి. కానీ ఇలాంటి బొమ్మల్ని పోలిన బొమ్మలు సాధారణ మార్కెటులో తక్కువ ధరలో తయారు చేసి అమ్ముతారు. కాగితపు గుజ్జుతో తయారైన అద్భుతమైన బొమ్మలు షోకేసుల్లో కొలువుదీరి రారమ్మని ఆహ్వానిస్తూ ఉంటాయి. నేనైతే కాగితపు గుజ్జు కళారూపాల్ని కొనలేదు. చిన్నతనం నంచి మా ఇంట్లో ఏవో ఒకటి కాగితపు గుజ్జుతో తయారు చేసే వాళ్ళం కాబట్టి నాకేమీ కొత్తగా అనిపించలేదు.

Image Source: Internet

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here