జననీ జన్మభూమిశ్చ

1
5

[dropcap]“ఏం[/dropcap] పిన్నీ! ఎలా వున్నావ్?” అన్నాడు జనార్ధన్ పలకరింపుగా.

“నువ్వా, జనార్ధన్. రా… రా… కూర్చో. ప్రొద్దుటే తొమ్మిందింటికే వచ్చేశావ్. రోజులాగా అలవాటు చొప్పున పెందరాడే లేచిపోయి తయారయ్యావా?”

“అవును. పిన్నీ ముప్ఫై ఏళ్ల అలవాటు కదా. రోజూలాగానే మెలకువ వచ్చేసింది. స్నానం, టిఫినూ అన్నీ పూర్తి చేశాను. ప్రభాకర్‌తో మాట్లాడదామని వచ్చాను.”

“ప్రభాకర్ స్నానం చేస్తున్నట్లున్నాడు. నువ్వూ, ప్రభాకర్ ఇద్దరూ నిన్నటితో రిటైర్ అయిపోయారు. ఏం, చేద్దామనుకుంటున్నావు మన ఊరు వెళ్లే ఆలోచన ఏమైనా వున్నదా?”

“మన ఊరా? అక్కడికెళ్లి ఏం చేస్తాం పిన్నీ? ఇన్నేళ్ల బట్టీ టౌనుల్లో అలవాటయిపోయింది. అక్కడికెళ్లి ఉండలేం. రిటైరైతే వచ్చిన డబ్బు మా దగ్గర చాలానే వుంది. నేనూ, ప్రభాకరూ ఆ డబ్బుతో ఏదైనా వ్యాపారం చేద్దామనుకుంటున్నాం.”

“చిన్నప్పటి నుంచి పాలూ నీళ్లలా కలిసిపోయారు. ఇద్దరూ ఒకే ఊళ్లో ఉద్యోగాలు చేశారు. ఇక్కడే ఇళ్లు, వాకిళ్లూ ఏర్పాటుచేసుకున్నారు. పిల్లల పెళ్లిళ్లూ చేశారు. వాళ్లని తలో దేశం పంపించారు. ఇప్పుడు తీరి కూర్చుని వ్యాపారం మొదలు పెడతారా? మీ ఇద్దరికీ చెరో అరలక్షా నెలకు పెన్షన్ వస్తుందని విన్నాను. చాలదా? ఈ వ్యాపారం ఆలోచన నీదా? ప్రభాకరదా?”

“ఇద్దరిదీ” అని జనార్ధన్ చెప్తుండగానే తడి టవల్ భుజం మీద వేసుకుని ప్రభాకర్ లోపలి నుంచి వచ్చాడు. ప్రభాకర్ భార్య కూడా అందరికీ కాఫీలు తెచ్చి ఇచ్చింది. ఆమె రెండు నిముషాలు వీళ్ల దగ్గర కూర్చుని వంటిట్లో పని వుందని వెళ్లిపోయింది.

“ఏమిట్రా ప్రభా? ఏదో వ్యాపారం చెయ్యాలన్న ఆలోచన వుందని జానార్ధన్ చెప్తున్నాడు నిజమేనా?”

“నిజమేనమ్మా ఇప్పుడు మన దగ్గర డబ్బుంది. దాంతో ఏం చేస్తే బాగుంటుందా? అని ఆలోచిస్తున్నాం.”

“ప్రభా! ఇప్పటి వరకూ ఉద్యోగం చేశావు. దాని కోసం ఇక్కడున్నావు. పిల్లల చదువులూ, పెళ్లిళ్లూ అయిపోయాయి. ఈ మధ్య నన్ను ఇక్కడికే తీసుకొచ్చావు. నాకిప్పుడు 80 ఏళ్లొచ్చాయి. ఇంకా ఎక్కువ రోజులు ఈ ఊళ్లో వుండాలని నాకు లేదు. మన ఊరు వెళ్లిపోవాలని వున్నది. మీరు అక్కడికే వస్తే బాగుంటుందిని నాకున్నది.”

“అమ్మా ఇంకా ఆ ఊరు వెళ్దామని అనొద్దు. నెమ్మదిగా ఇల్లు అమ్మేద్దాం. అలాగే పొలం కూడా బేరం పెడదాం. నీకిప్పుడు 80 ఏళ్లొచ్చాయి. మేమూ అరవైల్లో పడ్డాం. ఈ వయసులో ఆరోగ్య సమస్యలు ఎక్కువగా వస్తాయి. మన ఊళ్లో ఒకళ్లో ఇద్దరో ఆర్.యమ్.పి డాక్టర్లు వుంటారు. ఏదైనా అత్యవసరసమైతే వాళ్లేం చేస్తారు చెప్పు? గవర్నమంట్ హాస్పిటల్ వున్నా దాని వలన ఉపయోగం ఏమీ వుండదు. ఏ వస్తువు అవసరమయినా టౌన్‌కు పరుగెత్తుకురావాల్సిందే. పల్లెటూళ్లు ఇది వరకటి పళ్లెటూళ్లు కాదు. మీ కాలంలో నాటి ఆప్యాయతలూ, ప్రేమాలూ లేవు. ఇప్పుడు ఎవరి దారి వారిదే. ఊళ్లోనే సారా కొట్టు కట్టి పెట్టారు. అక్కడ మాత్రం ఎప్పుడు చూసినా జనమే. కూలీ, నాలీ చేసుకునే వాళ్లతో పాటు ఊళ్లో పనీ పాటా లేకుండా ఖాళీగా వుండేవాళ్లు కూడా దాందగ్గర చేరి తాగుతూ నానా రభస చేస్తున్నారట. ఊళ్లో ఇంకా ఎన్నో రకాల గొడవలు జరుగుతున్నాయని విన్నాను. అవన్నీ వింటుంటే ఊరి సంగతే ఎత్త బుద్ధి కావటం లేదు.”

“అవును పిన్నీ. ఈ విషయాలన్నీ నేనూ విన్నాను. ఇంక మనలాంటి వాళ్లం అక్కడకెళ్లి వుండలేం. ఇక్కడైతే ఏ వస్తువు కావాలన్నా డబ్బులు పెడితే దొరుకుతుంది. అక్కడ అన్నింటికీ వెతుక్కోవటమే. లేనిపోయిన ఇబ్బందులు కొనితెచ్చుకోవట మెందుకు? నువ్వింక ఊరికి వెళ్దామన్న ఆలోచన మర్చిపో.”

“చెడు వున్న చోట మంచి కూడా వుంటుందిరా. అక్కడుండే వసతులు అక్కడా వున్నాయి. పూర్తిగా అందరూ తాగుబోతులులే వుండరు. తాగుడు అలవాడు లేని మీలాంటి వాళ్లు వుంటారు. ఈ మధ్య కొంత మంది రిటైర్ కాగానే మన ఊరే వచ్చి ఇల్లు బాగు చేయించుకోవటమో, కొత్త ఇల్లు కట్టుకోవటమో చేస్తున్నారు. అలా పది పన్నెండు ఇళ్లు లేచాయి. వాళ్లంతా మన ఊరు టౌన్‌కు దగ్గరగానే వున్నది. గాలీ, నీరూ, పుష్కలంగా దొరుకుతుంది. ముఖ్యంగా ‘మన’ అనుకునే మనుష్యుల మధ్య వుండొచ్చని వాళ్లంతా అనుకున్నారట. మీరూ ఆలోచించండి.”

“మా ఇద్దరిలో ఎవరికీ ఆ ఉద్దేశ్యమే లేదు. ఇక్కడే ఏదో బిజినెస్ పెట్టుకుంటాం. నీ కోడలూ, జనార్ధన్ భార్యా కూడా ఇదే మంచిదంటున్నారు. నువ్వీ విషయాంలో ఇంకేం కలగజేసుకోవద్దు” అంటూ లోపలికెళ్లిపోయాడు.

“ఏం బిజినెస్ అనుకుంటున్నార్రా జనార్ధన్?”

“ప్రస్తుతం రియిల్ ఎస్టేట్ బాగున్నది పిన్నీ. భూములు ధరలు రోజురోజుకూ మారిపోతున్నాయి. కొంత భూమిని కొని ప్లాట్లుగా వేసి అమ్ముదామని వున్నది. మా ఇద్దరి దగ్గరున్న డబ్బు సరిపోకపోతే అటు మావాడు కానీ, ఇటు మీ మనమడు గానీ సర్దుతారు. డబ్బు కిబ్బందేం వుండదు. మంచి ఏరియా చూసి కొంటే త్వరగా అమ్ముడుబోతాయి. ఇవాళ ఒకటి రెండు చోట్లకు తిరిగి భూమిని చూసొద్దామని బయలుదేరుతున్నాం.” ఈలోగా ప్రభాకర్ రెడీ అయి వచ్చాడు. ఇద్దరూ కలిసి బయటకెళ్లిపోయారు.

***

సాయంకాలం ఏడుగంటలైంది. అమెరికా నుండి రాజీవ్ ఫోన్ చేశాడు. ఫోన్ రింగవుతుంటే సుభద్రమ్మ ఫోన్ తీసింది.

“ఏం ముసలమ్మా! ఏం చేస్తున్నావు! కులాసాయేగదా! ఇంట్లో అంతా బాగున్నరుగా. నీ కొడుకు, కోడలూ ఫోన్ తియ్యటం లేదు. అందుకే లాండ్ ఫోన్ చేశాను. వాళ్లిద్దరూ ఎక్కడికన్నా వెళ్లారా?”

“అందరం బాగానే వున్నాం. మీ నాన్నా ప్రొద్దుననగా ఎక్కడికో వెళ్లాడు. ఇంత వరకూ ఇంటికే రాలేదు. మీ అమ్మ ఏదో ఫంక్షనుందని సాయంకాలం బయటకెళ్లింది. ఫోన్ ఇంట్లోనే మర్చిపోయినట్లుంది. ఇక్కడే మోగుతున్నది. వచ్చాక నువ్వు ఫోన్ చేశావని వాళ్లకు చేప్తానులే. మీరంతా బాగున్నారు కదా?”

“ఆ… ఆ… బాగానే వున్నాం కాని నాన్న ప్రొద్దుననగా వెళ్లి ఇంకా రాకపోవటమేమిటి బామ్మా? నిన్ననే గదా రిటైరయ్యారు. రిటైర్మెంట్ కాగితాల పని ఏమన్నానా? అయినా చీకటి పడ్డాక ఏ ఆఫీసులుంటాయి?”

“అదేమో నాకు తెలియదు రాజయ్యా. ప్రొద్దున మన ఊరు జనర్ధన్ వచ్చాడు. అతను నీకు తెలుసుగా. అతనూ నిన్ననే రిటైర్ అయ్యాడు. ఇద్దరూ కలిసి ఏదో వ్యాపారం చేద్దామనుకుంటున్నారు. భూమి ఏదో కొని ప్లాట్లు వేసి అమ్ముతారంట. నాకీ విషయం జనార్ధన్ చెప్పాడు.”

“ఈ వయసులో వీళ్లకింత రిస్క్ ఎందుకబ్బా? హాయిగా తిని కూర్చోక.”

“మనిషన్నాక ఏదో పని వుండాలిగాని వీళ్లు మరీ ఆరాట పడిపోతున్నారనిపించింది. రాజయ్యా! నా మనసులోని మాట నీకు చెపుతున్నాను. నాకయితే మనూరు వెళ్లిపోయి ప్రశాంతంగా వుందామని వున్నది. మీ అమ్మానాన్నకు ఆ ధ్యాసే లేదు.”

“మీ అందర్నీ అమెరికా రమ్మని నేనే చెబ్దామనుకుంటున్నాను. పోయిన సారి అమ్మ నాన్నా ఇక్కడికొచ్చినపుడు నాన్న చెప్పారు. నేను రిటైర్ అయిన తర్వాత మేమిద్దరమూ నీ దగ్గరికి వచ్చేస్తాంలే అని. వాళ్ల రావటం మాకూ అవసరమే. మేమిద్దరం ఉద్యోగాలకు వెళ్తే ఇంట్లో పిల్లల్ని కనిపెట్టుకుని వుంటారనుకున్నాను.”

“నేనొకదాన్ని వున్నానుగా రాజయ్యా. నా బాధ్యత వున్నంత వరకూ పాపం వాళ్లకు అక్కడికి రావటానికి వీలవదేమో. మన ఊళ్లో వుంటే నాకేం ఇబ్బంది వుండదు. వాళ్లకూ భయపడాల్సిన అవసరం వుండదు. ఎప్పుడెప్పుడు మనూరు వెళ్లి వుందాము అని నాకు చాలా బెంగగా వున్నది రాజయ్యా. నువైనా మీ అమ్మనాన్నలతో మాట్లాడు. నన్ను మన ఊరు పంపిస్తే వాళ్లు నీ దగ్గరకు రావచ్చు.”

“ఈ ఎనభై ఏళ్ల వయస్సులో నువ్వు ఒక్కదానివీ అక్కడకెళ్లి ఏం చేస్తావే? మా అందరికీ అదొక బెంగ అయి కూర్చుంటుంది.”

“పుట్టించిన దేముడు చూసుకోకుండా వదిలేస్తాడా? ఊళ్లోని మనింట్లో కూర్చుంటే ఎదురుగా రామాలయం కనడబడుతుంది. పెరట్లోకి వెళితే శివాలయం కనపడుతుంది. మన ఇల్లు రెండూ రోడ్లకూ, ఆని వుంటుంది కదా? ఆ గుళ్ల శిఖరాలు చూస్తూ, గుళ్లో మోగే గంటలు వింటూ, వీలున్నపుడల్లా గుళ్లోకి పోతూ పగటి పూట గీత చదువుకుంటూ హాయిగా వుంటాను రాజయ్య. పైగా మన ఊరు అన్నమమకారం, ఆ గాలి, ఆ నీరూ ఆ మనుషులూ అంతా చాలా ఇష్టంగా వుంటాయి. ఆనాడు రాములవారే చెప్పార్రా అబ్బాయ్. మన ఊరు, మనం పుట్టిన చోటు స్వర్గంకంటే ఎక్కువ అంతటి మహానుభావుడే అలా సెలవిస్తే మనం ఎంతరా? నువైనా అర్థం చేసుకో రాజయ్యా. మీరంతా బైటి ఊళ్లలో వుండి చదువుకున్నారు. పరాయి దేశాలకెళ్లి ఎంతో సంపాయించుకుంటున్నారు. మన ఊళ్లోనేమో సౌకర్యాలు లేవంటున్నారు. ఎవరికి వారు అందరూ ఊరు వదిలేసి వస్తే ఊరు బాగు ఎవరు పట్టించుకుంటార్రా? ఊళ్లో తాగుబోతులెక్కవయ్యారు. వైద్య సౌకర్యం లేదు. మనం వెళ్లొద్దు అని మీ నాన్న గట్టిగా చెప్తున్నాడు. ఇన్నాళ్లూ ఉద్యోగం చేశారు. ఇప్పుడు రిటైర్ అయ్యారు. మీ నాన్నా, జనార్ధన్ లాంటి వాళ్లు వచ్చి ఊళ్లో కాపురం పెట్టాలి. ఊరు మంచి చెడ్డలు కొంచెం ఆలోచించాలి. చెడు స్నేహాలు, చెడు అలవాట్లు జోలికిపోయే వాళ్లకు నాలుగు మంచి మాటలు చెప్పాలి. కొందరైనా విని బాగుపడతారు. చాన్నాళ్ల క్రిందట మా మేనత్తకూ చెప్పాను. నువ్వు చదివిన మన ఊరి స్కూలు సంగతి కాస్త పట్టించుకో అని. నేను చెప్పిన మాట తనక్కుడా మంచిదనిపించిది. ఆ మాట ప్రకారం ప్రతి సంవత్సరం స్కూల్ పిల్లలందరికీ నోటు పుస్తకాలు, వ్యాకరణం పుస్తకాలు, తెలియని పదాలు చూసుకోవటానికి కావలసిన పుస్తకాలు అన్నీ కొనిస్తున్నది. మనం పుట్టిన ఊరి ఋణం కొంతైనా తీర్చుకోవాలిరా. నా మాటలు బాగా జ్ఞాపకం పెట్టుకో. మీ నాన్నతో ఈ సంగతులు మాట్లాడు.”

“అలాగే మాట్లాడుతా కాని బామ్మా నీకో సంగతి చెప్పాలి. మన ఊరి కోటేశ్వర్రావుగారి అబ్బాయి ఇక్కడకు చదువుకోవటానికి వచ్చాడు. నన్ను కలుసుకున్నాడు. అతనికి కావలసిన సాయం నేను చాలా చేశాను. ఇప్పుడతని చదువు అయిపోయంది. ఇక్కడ ఉద్యోగం చెయ్యను తిరిగి ఇండియా వెళ్లిపోతాను. మనూళ్లోనేవుండి వూరికి కావలసిన పనులు చేస్తానని చెప్తున్నాడు. ఊళ్లోనే వుండిపోయే వుద్దేశం వుంటే ఇంత దూరం వచ్చి ఇంత చదువు చదువుకోవటం ఎందుకా అనిపించింది. కాని ఇప్పుడు నీ మాటలు వింటుంటే ఆ అబ్బాయి ఉద్దేశ్యం నాక్కొచెం కొంచెం అర్ధమవుతున్నది. నువ్వు చెప్పిన విషయాలను నేనూ ఆలోచిస్తాను. ఉంటాను బామ్మ.” అంటూ రాజీవ్ ఫోన్ పేట్టేశాడు.

ఆ పూట ఏదో తెలియని సంతృప్తి అనిపించింది సుభద్రమ్మకు. తన మనసులోని మాటలను మనవడితోనైనా చెప్పగలిగానన్న సంతోషం కలిగింది. రాజీవైనా తన గోడు ఆలకిస్తాడన్న ధైర్యం కలిగింది. రోజులు గడుస్తున్నాయి. ప్రభాకర్, జనార్ధన్ కలిసి చాలా చోట్లకు తిరిగి వచ్చారు. తిరగే కొందికీ దాంట్లో వున్న లోతుపాతులు అర్ధం కాసాగినవి. తమనుకున్నంత తేలిగ్గా ఏం లేదు ఈ రియల్ ఎస్టేట్ రంగం కూడా అనుకున్నారు. కాస్త ఊళ్లకు దగ్గరగా వున్న స్థలాల రేట్లు కొండెక్కి కూర్చున్నవి. దూరంగా వున్నవాటికి దారీ, డొంకా లేదు. ఇలాంటి స్థలాలను నమ్ముకుని ఎవరు మాత్రం కొనుక్కుంటారనిపిస్తున్నది. స్థలాలు చూపించే బ్రోకర్లు అంతు లేని కమీషన్లు అడుగుతున్నారు. వీళ్ల మాటలు నమ్మి మాత్రం తొందరపడి ఏవీ కొనగూడదనుకున్నారు. అమ్మకానికో స్థలం వుందని చెప్తారు. తీరా అక్కడికెళితే లేదు ఎవరో కొనేశారంటారు. లేదు అడ్వాన్స్ మాత్రమే ఇచ్చారు. మీరు ఇంకొంచెం ఎక్కువ పెడితే మీకే ఇప్పిస్తామని చెప్తున్నారు. ఇదంతా గందరగోళమనిపించి మరేదైనా ఆలోచిదామనుకున్నారు. ఈలోగా ఆమెరికా నుండి రాజీవ్ ఫోన్ చేశాడు. “నాన్నా మీరీ వయసులో ఎక్కువ టెన్షన్ పడే పనులేమీ పెట్టుకోవద్దు. ఎక్కువ రిస్క్ తీసుకోవద్దు. మీకంతగా స్థలం కొనుక్కోవలంటే మన స్వంతానికే ఏమైనా తీసుకోండి. ఆ మధ్య బామ్మతో మాట్లాడాను. మన ఊరు వెళ్లిపోవాలని గట్టిగా అంటున్నది. మీరు కాస్త ఫ్రీగా వున్నారు కాబట్టి మన ఊరు వెళ్లి అక్కడున్న ఇల్లు కాస్త రిపేర్ చేయించండి. మన ఊరు కోటేశ్వర్రావు గారి అబ్బాయి మొన్ననే ఇండియా తిరిగొచ్చాడు. ఇక మీదట మన ఊళ్లోనే వుంటానన్నాడు. అతను కాస్తతోడుగా బామ్మను కనిపెట్టుకుని వుంటానన్నాడు. మీరు నిశ్చింతగా బామ్మను ఊరికి పంపించొచ్చు.”

“నాయనమ్మ, మనమడూ కలిసి ఎప్పుడు మాట్లాడుకున్నార్రా? పల్లెటూళ్లు దాంతో పాటు మన ఊరు ఇది వరకులాగా వుందనుకుంటున్నారా? అక్కడంతా ఒకటే గొడవలు. మన బంధువులనే వాళ్లే కనపడితే చాలు ఎంత అసూయిగా మాట్లాడతారో మీకే తెలుసు? కనబడగానే ఆప్యాయింగా పలకరించటం దేముడెరుగు మీకేం నాయనా గవర్నమంట్ ఉద్యోగులు. ఇక్కడి పొలాలూ,ఇళ్లు వాకిళ్లు అలాగే వున్నాయి. మళ్లీ అక్కడ ఇళ్లు వాకిళ్లూ స్థలాలూ అన్నీ ఏర్పాటు చేసుకున్నారు. రేపు రిటైరయినా గవర్నమెంటు కూర్చోబెట్టి పోషిస్తుంది. పిలల్నెమో ఇంకా సంపాదించకురమ్మని దేశాలు పట్టించారు. కడుపులో చల్ల కదల కుండా కూర్చునే మహారాజులు. మీతో పోల్చుకుంటే మేమెంత? మట్టి పిసుక్కుని, మట్టినే నమ్ముకునే వాళ్లం. ఆ భూమి పండితేనే కడుపులోకి నాలుగు వేళ్లూ పోయేది. పండకపోతే అంతే సంగతులు. అంటూ ఇంకా నానారకాల మాటలు మాట్లాడతారు. ఊళ్లోకి పోవాలంటేనే అవన్నీ గుర్తుకొచ్చి ఆ ప్రస్తావనే మానుకున్నాను. ఇక్కడ అన్ని సౌకర్యాలతో ఉండటం చేతకాక మీ బామ్మ ఆ ఊరు పోతానంటున్నది. వద్దని చెప్పాల్సింది పోయి అక్కడకే పంపమంటావేమిటిరా?”

“ఎవరో ఒకరిద్దరు అలా అన్నారని ఊరునే కాదనుకుంటే ఎలా నాన్నా? వాళ్ల మధ్యనే వుంటూ ఊరికుపయోగపడే పనులు చేస్తూవుంటే చదువుకోవాలి. మంచి ఉద్యోగం చెయ్యాలి. అలా చెయ్యి బట్టే కదా ప్రభాకర్ ఈ నాడింత వెసులుబాటుగా ఉండగలిగాడు. ఊరి కోసం చెయ్యిగలుగుతున్నాడు అని వాళ్లే అర్ధం చేసుకుంటారు క్రమంగా వాళ్లలో తప్పకుండా మార్పు వస్తుంది నాన్నా. మరో మాట నాన్నా. మీరు మన ఇల్లు రిపేర్ చేయించండి. మనది ఏటి ఒడ్డునున్న ఊరు. సముద్రానికీ కాస్త దగ్గరగానే వుంటుంది. ఆటుపోటులు వచ్చినపుడు సముద్రపు నీరంతా చొచ్చుకుని వచ్చి అటు ఏట్లోని నీళ్లలోను ఇటు మన ఊరి భూగర్భ జలాల్లోనూ కలిసి అంతా ఉప్పు నీరుగా అయిపోయిందటగా. తాగు నీటికీ అటు సేద్యానికీ ఉప్పనీటితో మన ఊరు వాళ్లు చాలా ఇబ్బందులు పడుతున్నారని తెలిసింది. అందుకని ప్రధానంగా తాగునీటి సమస్యను గురించి ఆలోచించాలి. ఊళ్లో వాటర్ టాంక్‌ని కట్టి నీటిని ఫిల్టర్ చేసే మోటార్లు పెట్టాలి. మన ఊరి పంచాయితీ చేసిన ప్రయత్నం అంతగా ఉపయోగపడలేదట. అందరూ కలిసి మరొక ప్రయత్నం చేయాలి. ఫిల్టర్ చేసిన నీరు ఇంటింటికీ పైపుల ద్వారా చేరవేయాలి. అలా చేస్తే ఊళ్లో వాళ్లకు తాగు నీటి సమస్య తీరుతుంది. టాంక్ అదీ కట్టటానికి మన స్థలం ఇవ్వండి. మేం కొంత మంది స్నేహితులం కలసి ఆ ప్లాంట్ కయ్యే ఖర్చును భరిస్తాం. ప్లాంట్ దగ్గర పనులు చూడటానికి మనిషి అవసరం వుంటుంది. అతనికీ జీత భత్యాలు ఏర్పాటు చెయ్యాలి,. కోటీశ్వర్రావుగారి అబ్బాయికి మీరు సపోర్ట్‌గా వుండండి. మన ఇల్లు రిపేర్ చేయిస్తే బామ్మ కోరిక తీరుతుంది. మీరు వెళ్లినప్పుడు మీరు వుండటానికీ వీలువుతుంది. ఆ తర్వాత రెండో విషయంమేంటంటే ఆ ప్రాంతపు మంత్రిగారితో మాట్లాడి సాగునీటికి మన ప్రాంతంలో ఒక లిఫ్ట్ ఇరిగేషన్ పధకాన్ని ప్రారంభింపచేయాటానికి అతని దగ్గర ప్లానులున్నాయి. అతనిక్కడ తన చదువుతో పాటు వీటన్నింటి గురించీ చాలా ప్రణాళికలు వేసుకున్నాడు. చాలా మందిని కలిసి మాట్లాడాడు. అతని ఉద్దేశాలు నాక్కూడా బాగా నచ్చనాయి. అతనిక్కావలసిన ఆర్ధిక సహాయాన్ని మేమిక్కడ నుంచి అందిస్తాం. అతనికింకో కోరిక కూడా వున్నది. రైతులు పండించిన ధాన్యాన్ని భద్రపరచుకోవటం కోసం మన ఊళ్లో సరైన గిడ్డంగులేవీ లేవు. ప్రభుత్వం కూడా ఇప్పటి వరకూ ఏం కట్టించలేదు. కనుక రైతులందరి కోసం ఒక సహకార గిడ్డంగి కట్టించాలని అతని తాపత్రయం. రైతులు తగుమాత్రపు అద్దెతో అక్కడ నిల్వ చేసుకోగలుగుతారు. ఈ పనులన్నీ పూర్తి చేయాలని అతనికున్నది. మీరీ పనుల్లో అతనికి మోరల్ సపోర్ట్ ఇవ్వండి. ఇవన్నీ నేను చెప్పనంత తేలిగ్గా అవవు. రైతులు కూడా చందాలు వేసుకోవాల్సి వుంటుంది. ప్రభుత్వామూ ఆర్థిక సహాయం అందించాలి. చాలా సమయం పడుతుంది. కానీ మనస్ఫూర్తిగా ప్రయత్నిస్తే సాధ్యపడతాయి. కాబట్టి ఇతరత్రా వ్యాపకాలు పెట్టుకోకుండా మన ఊరి సంగతి పట్టించుకోండి. జనార్ధన్ అంకుల్‌కి కూడా చెప్పండి. నాన్నా నేను మీకు చెప్పదగిన వాడిని కాదు. గ్రామాల్లో ఏ పనులు చేయబోయినా చాలా మంది రకరకాలుగా అడ్డుతగులుతారు. ముందుకు సాగనివ్వకుండా అడుగడునా కలగజేసుకుంటారు. అవన్నీ అతను స్కెచ్ వేసి చూపించాడు. అసూయాపరులుంటారని మొదట్లో మీరన్నారే. అలా లేని వాళ్ళు ఎక్కడున్నారు? కాని ఓర్పుగా అవన్నీ జయించుకు రావాలి. సహకార గిడ్డంగి కట్టటానికి చాలా స్థలం కావాలి. ఎవరైనా దాత లిస్తారేమో కనుక్కోండి. లేదా ఇద్దరి ముగ్గురి దగ్గర కలిపి అయినా రేటు కట్టి స్థలం తీసుకోవటానికి ప్రయత్నించండి. మీకిదంతా మొదట్లో విసుగ్గా, అర్థం లేని పని లాగా అనిపిస్తుంది. కాని మనసు పెట్టి ఆలోచించండి. ఆ తర్వాత తర్వాత మీరే ఆ పనుల్లో లీనమయిపోతారు. ఎందుకంటే ఆ అబ్బాయి స్కెచ్ వేసి చూపించినపుడు మాకు అదంతా నవ్వులాటగా అనిపించింది. కాని పాపం అతను చిన్నబుచ్చుకోకుండా అదే పనిగా చెప్పి మా మనసులకెక్కించాడు, ఇప్పుడు మేం పూర్తిగా అతనికి సహకరించాలని నిర్ణయించుకున్నాం. అలా నిర్ణయించుకున్న వాళ్లలో మన ఊరి వాళ్లు ఎక్కువ మందేం లేరు. వేర్వేరు ప్రాంతాలకు చెందిన వారు. వారంతా మా స్నేహితులు అంతే. మంచి మనసుతో సాయించేయటానికి ముందుకొచ్చారు. ఇదంతా మీరు నిదానంగా ఆలోచించండి. అమ్మతో ఈసారి మాట్లాడతాను వుంటా” అంటూ రాజీవ్ ఫోన్ పెట్టేశాడు.

‘వీడికీ ఊరు పిచ్చి బాగా తల కెక్కినట్లుంది. ఆ కోటేశ్వర్రావు కొడుకెవరో తెలుసుకోవాలి. అతని మాటలు రాజీవ్ పూర్తిగా నమ్మేశాడు. మాటలు అనుకున్నంత తేలికకాదు. ఊరికి అన్నీ అమర్చటానికి వీళ్ల వలన ఏమవుతుంది. అలాంటివి గవర్నమెంట్ చేయాల్సిన పెద్ద పెద్ద పనులు. ఒకళ్లిద్దరు పూనుకుంటే ఆయిపోతాయి అనుకుంటున్నారు. పిల్లకాకుల కేం తెలుసు ఉండేలు దెబ్బలు. ఇవన్నీ కట్టిపెట్టి నీ ఉద్యోగమేదో నువ్వు చూసుకో అని రాజీవ్‌తో ఈ సారి గట్టిగా చెప్పాలి. వచ్చిన డబ్బు వచ్చినట్లు దాన ధర్మాలకు ఖర్చుపెట్టేస్తే అంత దూరం అమెరికా వెళ్లి సంపాదించిన ఫలితమేముంటుంది. అయినా రాజీవ్ భార్య ఈ ఖర్చులన్నింటికీ ఎలా ఒప్పుకుంటున్నది. ఆ అమ్మాయి కిష్టం లేకపోతే కాపురంలో లేనిపోయిన మనస్ఫర్థలొస్తాయి. వీడికెలా నచ్చచెప్పాలా’ అన్న ఆలోచనలో పడిపోయాడు ప్రభాకర్.

***

బయట ఎవరో కాలింగ్ బెల్ కొట్టిన చప్పుడయితే తలుపు తీశాడు ప్రభాకర్.

“నమస్తే అంకుల్. నేను కోటేశ్వర్రావుగారి అబ్బాయి సుందర్ కుమార్‌ని. మన ఊరి నుండే వస్తున్నాను. రాజీవ్ గారు చెప్పారు. మిమ్మల్ని ఒక సారి కలిసి మాట్లాడమని. కొంత మంది డాక్టర్స్‌తో మాట్లాడి మన ఊరిలో మెడికల్ క్యాంప్ పెట్టించాలన్న ఉద్దేశంతో ఇక్కడి కొచ్చాను. తరుచూ మెడికల్ క్యాంపులు పెట్టించటం చాలా అవసరమనిపిస్తున్నది. పనిలో పనిగా మిమ్మల్ని కలిసి వెళ్తామని వచ్చాను” అన్నాడు.

సుభద్రమ్మగారు ఆ అబ్బాయిని గుర్తు పట్టింది. వాళ్ల ఇంట్లో వాళ్లనీ, ఊరి వాళ్ల యోగక్షేమాలూ అడిగి తెలుసుకున్నది. సుందర్ కుమార్‌ని చూసి తన మనమడు రాజీవ్‌ని చూసినంత సంతోపడింది.

“అంకుల్! రాజీవ్ గారు మీకన్నీ విషయాలు చెప్పే వుంటారు. నేను చేసే పనుల్లో మీ సహాయం చాలా అవసరమండీ. మీరు తప్పకుండా సహాయపడతారనే అనుకుంటున్నాను. నేనిలా వచ్చి మనూళ్లోనే వుండిపోవటానికి ముందుగా మా ఇంట్లో వాళ్లను ఒప్పించుకున్నాను. ఆ తర్వాత ఊరి వారందరితో వీటన్నింటి గురించి చర్చిస్తూనే వున్నాను. వాళ్లు నాకు తోడుగా వుంటారనిపిస్తున్నది.”

“నువ్విలా ఉద్యోగం, సద్యోగం లేకుండా ఊరు కోసం అంటూ తిరుగుతూ వుంటే నీకు గడిచేదెట్లా? నీకంటూ ఆదాయమేమీ అఖ్ఖర్లేదా? రేపు ఏ పిల్లా నిన్ను పెళ్లి చేసుకోవటానికి ముందుకు రాదు. ఇవన్నీ ఆలోచించుకున్నవా?” అంటూ ప్రభాకర్ సందేహాలను లేవనెత్తాడు.

“గడవదన్న భయమేం లేదంకుల్. ఉడంటానికి ఇల్లూ, తిండి పెట్టటానికి పొలమూ వున్నాయి. నేను చదువుకున్న చదువుతో ఇంట్లో వుండే కంప్యూటర్లో కొంత వర్క్ చేసి అప్పజెప్తాను. నాకు వీలున్నంత. నేను చేయగలిగినంత వర్క్ మాత్రమే చేస్తాను. డబ్బుకేం ఇబ్బంది వుండదు. సెల్ ఫోన్ కంపెనీల పుణ్యమా అని వాళ్లు వేసిన కేబుల్స్ ద్వారా నెట్ సౌకర్యం మన ఊళ్లో బాగానే వుంది. నా వర్క్ అయిన తర్వాత ఊరి గురించే ఆలోచిస్తాను. నా విషయంలో మీరేమీ సందేహించక్కర్లేదు. బంధాలు తెగ్గొట్టుకోకుండా మీలాంటి వాళ్లు ఊరికి వస్తూపోతూ వుంటే మంచిదండీ. కొంత మందైనా మిమ్మల్ని చూసి స్ఫూర్తి పొందుతారు. నేను చేసే పని పట్ల మీకు ఒక అవగాహన వస్తుంది. స్వంత ఊరి కొచ్చామన్న తృప్తీ మీకు కలుగుతుంది. మన ఊరి ప్రథాన సమస్య తాగునీటి సమస్య. అది ఎంత భయంకరమో మీకు తెలియంది కాదు. ఆ సమస్యను తీరుద్దామని నేను చాలా తాపత్రయపడుతున్నాను. దానికి మీలాంటి వాళ్లి ఆశీస్సులు కావాలి” అంటూ ఆగాడు.

“చిన్న వాడైనా సూందర్ అంత తాపత్రయపడుతున్నాడు. అతనేం చేప్తాడో పూర్తిగా విను ప్రభా” అన్నారు సుభద్రమ్మగారు

“మరేం లేదు బామ్మగారూ! మీ స్థలాన్ని రక్షిత మంచి నీటి పథకం కోసం ఇస్తే పని మొదలు పెట్టొచ్చు.”

“మన ఊర్లో ఆ స్థలం ఖాళీగానే వున్నది. రేట్లు పెరిగాయి కాబట్టి అమ్ముకుంటే నీ కోసమూ నాలుగు లక్షలు వస్తాయేమో కానీ మంచి నీళ్లటాంక్ కట్టటానికిస్తే కలకాలం పేరుండిపోతుంది. ప్రతి రోజూ ప్రతి ఇంటా మంచి నీళ్లు తాగే వాళ్లు నీ పేరు సుందర్ పేరూ చెప్పుకుంటారు. నా మాట విని ఒప్పుకో ప్రభాకర్” అంటూ వత్తిడి పెట్టింది సుభద్రమ్మ.

“నేనొకసారి ఊరికొస్తాను. నలుగురితో మాట్లాడతాను. ఇల్లలకగానే పండుగవుతుందా? స్థల మొకటే వుంటే సరిపోతుందా? మొటార్లు పైపులైన్లు. దాని మెయిన్‌టెయినెన్స్ కొక మనిషీ ఇలా ఎన్నో కావాలి. నీటిని శుద్ధి చేసే అసలా ప్లాంట్ సక్సెస్ అవుతుందో లేదో అవన్నీ నేను పరిశీలించాలి. చూద్దాంలే” అంటూ సుందర్ని పంపేశాడు.

“ఆ అబ్బాయి ముందేమిటి అత్తయ్యా స్థలం ఇచ్చేయ్య ఇచ్చెయ్యి అని వత్తిడి చేస్తారు. తర్వాత మనం మాట్లాడుకుని నిర్ణయిం తీసుకుంటాం కదా?” అన్నది కోడలు.

జనార్ధన్‌తో కూడా ఆలోచించాడు ప్రభాకర్.

“ముందు ఊరికెళ్లి పరిస్థితి చూద్దాం. పర్వాలేదు అనుకుంటే ఆ స్థలం ఇవ్వు. మీ నాన్నగారి పేరు మీద ఆ ప్లాంట్ కట్టించమను. మీ అమ్మ కోరికా తీరుతుంది.” అన్నాడు జనార్ధన్.

 ఆ తర్వాత ఊరికెళ్లారు ప్రభాకర్, జనార్థన్ ఇద్దరూ. ఊరి పరిస్థతి అర్థమయింది. “టౌన్ నుంచి మంచి నీళ్లు కాన్లు వస్తే కాని ఊళ్లో వాళ్లకు తాగునీళ్లు లేవు. వాడకానికి ఆ ఉప్పు నీళ్లుతో నేలాగో ఇబ్బంది పడుతున్నారు. సబ్బంతా విరిగిపోతుందని చెప్పారు. పశువులు కూడా ఆ ఉప్పు నీటిని తాగలేకపోతున్నాయి. స్నానం చేస్తే ఒళ్లంతా ఉప్పేసిపోతున్నదనీ చెప్పారు. పరిస్థితి ఇంత దారుణంగా వుందని అనుకోలేదు. ఇంకా ఆలస్యం చేయగూడదనుకున్నాడు. “స్థలం ఇచ్చేస్తాను, పని వెంటనే మొదలు పెట్టించండి” అని చెప్పాడు సుందర్‌తో.

నీటిని శుద్ధి చేసే ప్లాంట్ నుండి తమ ఇళ్ల వరకూ పైపులైన్ వేయించే ఖర్చు ఊళ్లో వాళ్లే భరించుకుంటామన్నారు. అందనంగా అయ్యే మరి కొంత ఆర్ధిక భారాన్ని మరి కొద్ది మంది వేసుకున్నారు. రాజీవ్ వాళ్లు కొంత మొత్తాన్ని పంపించారు. పనులు బాగానే జరుగుతున్నాయి. వచ్చి చూసి వెళ్లామని ప్రభాకర్‌కు సుందర్ ఫోన్ చేశాడు. స్థలమిచ్చిన దాతగా ఊళ్లోని వాళ్లు ప్రభాకర్‌ను బాగా గౌరవిస్తున్నారు. రెండు మూడు సార్లు అక్కడికి వెళ్లి చూసేటప్పటికి తన ఊరు, తన మనుషులూ అనే భావం ప్రభాకర్‌లో పెరగసాగింది. వెంటనే ఊర్లోని తన ఇల్లు రిపేర్ చేయించటం మొదలు పెట్టాడు. సుభద్రమ్మగారి సంతోషం చెప్పనలవిగాదు. రిపేర్ పూర్తయింది. సుభద్రమ్మగారు ఊరికి వచ్చేసింది. ప్రభాకర్ అప్పుడప్పుడూ వచ్చి వుంటానని చెప్పాడు. సుందర్ వాళ్లు కూడా కూర్చుని ఈ ఇంటిని తమ ఆఫీస్ లాగా ఉపయోగించుకుంటున్నారు.

మంచి నీటి పథకం పూర్తియింది. ఇంటింటికీ శుద్ధి చేసిన తియ్యటి నీరు సరఫరా అవుతున్నది. సుభద్రమ్మగారు వెళ్లి ఆ గది మీద వ్రాసిన తన భర్త పేరు చూసుకుని ఎంతో తృప్తిపడింది. ప్రభాకర్ వచ్చినపుడు సుందర్ కూడా వచ్చి తన ప్లాన్ ఒక్కొక్కటి చెప్తూ వుంటాడు. “చేసింది ఆవగింజంతేనండి. చెయ్యాల్సింది చాలా వున్నది. మొన్న కొంత మందిమి వెళ్లి మంత్రిగారిని కలిసొచ్చాం. అంతే కాకుండా ఆయన్ని తీసుకొచ్చి మన పంట పొలాలను చూపించాం. అంతా ఎలా చవుడు వేసిపోయిందో వ్యవసాయాధికారి చేత కూడా చెప్పించాం. ముఖ్యమంత్రి గారి దృష్టికి తీసుకెళ్లి ఎత్తి పోతల పథకం శాంక్షనయ్యేటట్లు చేస్తానని హామీ ఇచ్చాడు. కొన్ని గ్రామాల భూములు అన్ని రకాల పంటలు పండించుకోవటానికి సాగులోకి వస్తాయి. 40, 50 కోట్లతో గ్రామాభివృద్ధి జరుగతుంది. కాబట్టి ముఖ్యమంత్రిగారు కూడా సానుకూలంగా స్పందిస్తారనే ఆశలు వున్నయండీ. త్వరలో ముఖ్యమంత్రిగారి రచ్చబండ కార్యక్రమమున్నదట. దాంట్లో అర్జీలు తయారు చేసి ఇవ్వమన్నారు. ఆయన కాళ్లు పట్టుకుని అయినా సరే మా భూములకావలసిన ఈ ఎత్తపోతల పథకాన్ని శాంక్షన్ చేయించి కాలవలు తవ్వించమని వేడుకుందామని అనుకుంటున్నాం. ఆయన ఒప్పుకుంటే రెండేళ్లలో మన భూములకు మంచి సాగు నీరు అందుతుంది. ఈలోగా స్థలాన్ని సేకరించి సహకార గిడ్డంగిని కట్టించే దానికి ప్రయత్నం చేస్తాం. మెడికల్ క్యాంపులు బాగానే సాగుతున్నాయి. కొంత మంది డాక్టర్లు ఉచితంగానే పరీక్షక్షలు చేయటమే కాకుండా కొన్ని మందులు కూడా తెచ్చిస్తున్నారు. నాకింకా చాలా ఆలోచనలున్నాయి అంకుల్. ఒక్కొక్కటీ సాధించటానికి ప్రయత్నం చేస్తాను” అన్నాడు పట్టుదల నిండిన కళ్లతో.

ఇలా వింటున్న కొందికే ప్రభాకర్‌లో కూడా ఉత్సాహం కలగసాగింది. ఇప్పుడు ఊళ్లో యువకులే కాకుండా పెద్దవాళ్లు కూడా ప్రతిచిన్నదానికి సుందర్ సలహానే అడగటం మొదలు పెట్టారు. అదంతా చూసి తను కూడా ఊరికి వచ్చేసి వీళ్ల మధ్యే వుంటే బాగుండునన్న నిర్ణయానికొచ్చాడు. భార్యకు చెప్పి ఒప్పించి ఇక్కడికి తీసుకు రావాలని గట్టిగా అనుకున్నాడు. తను కూడా సుందర్ చేసే పనుల్లో మనస్ఫూర్తిగా సాయపడాలనే అనుకుంటున్నాడు. ఈ మాట జనార్ధన్‌కు ఇంకా తమ మిత్రులేవరైనా వుంటే వారినీ ఊరికి వచ్చెయ్యమని చెప్తున్నాడు.

సుందర్ బ్యాచ్ వాళ్లంతా బామ్మగారూ బామ్మగారూ అంటూ ఇంట్లో తిరుగుతూ మధ్యమధ్యలో ఆవిడ సలహాలూ తీసుకుంటున్నారు. ఆవిడ కెంతో సంతోషంగా, సందడిగా వున్నది. ‘మా రాజయ్య కడుపు చల్లగా వుండాలి. వాడు తలుచుకోబట్టే నేను ఈ ఊళ్లో నా ఇంట్లో వుండగలుగుతున్నాననుకుంటున్నది. అంతే కాకుండా సుందర్ లాంటి వాళ్లకు సాయపడుతున్నాడు. నా కొడుకు లాంటి వాళ్లను కూడా ఈ పిల్లలే మార్చివేశారు. వీళ్లను చూసి మరి కొంత మంది ఊరి బాట పడతారు. ఊరు హాయిగా వుంటుంది. నా జీవితంలో ఇంకా నాకు ఇంత కన్నా కావలసింది ఏమీ లేదు’ అనుకుంటూ తృప్తిగా రోజులు వెళ్లదీస్తున్నది బామ్మ.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here