జానేదేవ్-1

1
12

[box type=’note’ fontsize=’16’] ముమ్మిడి శ్యామలా రాణి గారు వ్రాసిన నవల ‘జానేదేవ్!‘ సంచిక పాఠకులకు ధారావాహికంగా అందిస్తున్నాము. ఇది మొదటి భాగం. [/box]

[dropcap]టె[/dropcap]ర్రస్ మీద రూఫ్ గార్డెన్‌లో అందంగా పూలతో విరబూసిన మొక్కలని, పెద్ద పెద్ద తొట్టెలలో చెట్ల నిండా టమోటాలు, వంకాయలతో ఎంతో అందంగా కనబడుతున్న మొక్కలని చూస్తూ నడుస్తున్నాడేగాని వాసుదేవ్ మనసుకి అవేవి సంతోషాన్ని ఇవ్వలేదు. అదే ఒకప్పుడైతే అమ్మ ఎంతో కష్టపడి సంతోషంగా రూఫ్ గార్డెన్ పెంచుతున్నందుకు, అమ్మ హాబీని అభినందించేవాడు. ఇంటికి కావలసిన కాయగూరలన్నీ చెట్లకు కాస్తున్నాయి. ఇంకా మిగిలితే ఇరుగు, పొరుగు వాళ్లకి ఇస్తుంటుంది. ముఖ్యంగా రామానుజం శాస్త్రిగారికి సంచీనిండా కాయగూరలు పెట్టి కాలేజికి వెళ్తున్నప్పుడు ఇవ్వమంటుంది.

జేబులో సెల్ రింగ్ కావడంతో తీసి చూసిన వాసుదేవ్ కనుబొమలు చిరాగ్గా ముడిపడ్డాయి.

వసూ తనని అర్థం చేసుకోదేం? ప్రతీ మనిషి తను ఏదైతే అనుకుంటాడో అదే జరిగితే ఎంతో సంతోషిస్తాడు. తనంత అదృష్టవంతుడు ఎవరూ ఉండరునుకంటాడు. కాని జరగపోతే ప్చ్.. అసలు జరగకపోవడం వలనే కదా మనిషికి ఎన్నో బాధలు.. కష్టాలు..

చిన్నప్పటి నుండి వసూ తనతో కలిసి చదువుకుంది. తను ఏమిటో.. తన నేచర్ ఏమిటో అన్నీ వసూకి తెలుసు.

తెలిసి కూడా తనని వేపుకు తింటుంది ఏమిటి?

“ఏంటి దేవ్? నా గురించి ఆలోచిస్తున్నావా? పిచ్చి దానిని.. మళ్లీ పని గట్టుకొని అడగడం ఎందుకులే.. నా గురించి అని తెలుసు.. నీకు మంచి ర్యాంక్ రానందుకు నీకన్నా నేనే వర్రీ అవుతానని కూడా నీకు తెలుసు” అని వసుంధర అంటుండగానే చిరాగ్గా అన్నాడు వాసుదేవ్.

“నీ మాటలు వింటుంటే ఇప్పుడొస్తున్న దొంగ బాబాలు గుర్తు కొస్తున్నారు.”

వాసుదేవ్ మాట పూర్తి కాకుండానే కోపంగా గట్టిగా అరిచి అంది..

“నన్ను దొంగ బాబాలతో పోలుస్తావా? నా ఫ్రెండ్స్ అంటూనే ఉన్నారు. ఎందుకే దేవ్ అంటే అలా పడి చస్తావ్? చీప్ అయిపోతావు అన్నారు.. వాళ్లు అన్నది నిజమయ్యింది”.

నవ్వుతూ అన్నాడు.

“చప్పేది విను వసూ! బాబాలకి దివ్య శక్తులున్నాయి అని ప్రజలు నమ్ముతారు కదా?.. ఎందుకునుకున్నావ్.. భక్తుల ముఖకవళికలు చూసి అంచనా వేసి నీలాగే చెబుతుంటారు.”

“ఏదీ సిరియస్‌గా తీసుకోవు.. ఎమ్.సెట్‌లో మంచి ర్యాంక్ రాలేదు.. మెడిసిన్‌లో సీటు రాదు.. వసూకి దూరం అవుతానన్న బాధ కూడా లేదా నీకు?”

ఫకాలున నవ్వి అన్నాడు..

“ఏంటి?.. దూరం అవుతానని బాధ పడడం ఎందుకు? మీ మెడికల్ కాలేజికి కొంచెం దూరంలోనే నేను జాయిన్ కాబోయే కాలేజి ఉంది..”

“ఓరి దుర్మార్గుడా?… నీకు అసలు ఫీలింగ్స్ లేవు… చిన్నప్పుటినుంచి కలిసి చదువుకున్నాం… ఎంతో మంది ఫ్రెండ్స్ నీకు దూరం అయినా మాగ్నెట్‌లా నీకూడా ఉన్నాను… సడన్‌గా నీకు దూరం అవుతుంటే బాధ లేదా?”

“ఏంటి వసూ!… ఊరికే నస పెడతున్నావు? ఏదో ఈ లోకం విడిచి పెట్టి వెళ్లిపోతున్వావని. అయ్యో! నా ఫ్రెండ్ ఇక కనిపించదని బాధపడాలా?.. హాయిగా మెడిసిన్ చదుబోతున్నావ్?.. త్వరలో డాక్టర్‌వి అవుతావు.. బాధపడడం ఎందుకు?..” అన్నంతలో క్రింద నుండి తల్లి కేక వినిపించి, “అమ్మ పిలుస్తుంది” అని గబగబా క్రిందకి వచ్చాడు..

హాల్లో సీరియస్‌గా పేపరు చుట్టి చేతిలో పెట్టుకొని అటు ఇటు తిరగసాగాడు నిరంజనరావు.

డైనింగ్ టేబిల్ మీద టిఫిన్ ప్లేటులు పెడుతూ “నాన్నా!.. ఏంటి నాన్నా! మనసు బాధపెడుతుందా?.. నువ్వలా ఉంటే నేను చూడలేను. అనుకున్నవన్నీ జరగితే ఇంకేం ఉంది?.. మీ నాన్నకున్న నీతి నిజాయితీకి.. కష్టపడి పని చేసే దానికి ఎన్నో ప్రమోషన్లు రావలసింది..

నేను చిన్నప్పుడు ఎన్నో అనుకున్నాను.. ఎలాగైనా స్కూల్లో టీచర్‌గా బెత్తం చేత్తో పట్టుకొని పిల్లలకు పాఠాలు చెప్పాలని.. కాని కాలేకపోయాను.. అనుకున్నవన్నీ జరగవు.. బాధపడకు.. నీకు జీడిపప్పు వేసిన ఉప్మా ఇష్టం అని నెయ్యి బాగా పోసి ఉప్మా చేసాను.. తిను నాన్నా” అని అంది సుమిత్ర..

కంగారుగా తల్లి మొహంలోకి చూసాడు వాసుదేవ్! తల్లి కళ్లల్లో తడి చూసి కంగారుగా దగ్గరకు వెళ్లి.. అభిమానంగా సుమిత్ర భుజం మీద చెయ్యి వేసి “మైడియర్ మామ్!.. ఇంకా నువ్వు బాధ పడిపోతున్నావా?.. Take it easy mom. నేను చాలా లైట్‌గా తీసుకున్నాను.. కాని ఒకందుకే బాధ పడుతున్నాను.. డాడీ కన్నా ఎక్కువగా నేను డాక్టరు కావాలని నువ్వే ఎక్కువ ఆశపెట్టుకున్నావు. సారీ అమ్మా” అని వాసుదేవ్ అనగానే “అయ్యో.. నాన్నా.. నాకు సారి ఎందుకురా? ఏదో కాలనీలో నలుగురిలో నా కొడుకు డాక్టర్ అవుతాడని చెప్పాలని ఆశపడ్డాను. కాని వెధవ డాక్టర్ ఎవరికి కావాలిరా? వీధికి పది మంది డాక్టర్లు ఉన్నారు.. బోడి డాక్టర్లు.. నా బాధంతా నీ గురించే నాన్నా.. రాత్రలు పగలు ఏక బిగువున చదివావే.. కోడి కూసేవరకు చదివేవాడివి. అయినా నీకు ఎమ్.సెట్.లో సీటు రాలేదంటే నీ మనసెంత బాధపడిపోతుందోనని తల్లి మనసు గిలగిలా కొట్టుకుంటుందిరా” అంది.

కోపంగా చేతిలో పేపరు సోఫాలో విసిరి “ఓ అదా నీ బాధ.. వాడి మనసేం బాధపడదు. రాత్రి పదయ్యేటప్పటికి మొద్దు నిద్రపోతావు. ఇంట్లో దొంగలు పడి దోచుకుపోయినా నీకు మెలకువ రాదు. తెల్లార్లు కోడి కూసేవరకు నీ కొడుకు చదివేయలేదు. కోడి కునుకులా కునుకతూ చదివాడు. బాగా చదివితే 5 వేల ర్యాంక్ ఎందుకు వస్తుంది?” అన్నాడు నిరంజనరావు.

“చాల్లేండి.. నిద్రవస్తే కునక్కుండా ఎలా ఉంటాడు. చదివేడా లేదా.. పరీక్ష బాగానే వ్రాసానన్నాడు. బిడ్డ ఎంత చిక్కి పోయాడో చూడండి. దిక్కుమాలినోళ్లకి 5వేల ర్యాంక్ ఇవ్వడానికి ప్రాణం ఎలా ఒప్పిందో?” అని బాధగా సుమిత్ర అనగానే.. “నోరుమూయ్యవే!… వాళ్లు దిక్కుమాలిన వోళ్లా?.. వాళ్లకి నీ కొడుకంటే పగ.. కోపం.. అందుకే 5వేల ర్యాంక్ ఇచ్చారంటావ్ ఖర్మరా బాబూ!.. ఈవిడతో?” అని నిరంజనరావు అన్నాడు.

“ఆయన మాటలేం పట్టించుకోకు… నాన్న బాగా చదివి చదివి నీరసపడిపోయావ్?.. కాస్త తేలేదాక కొడిగుడ్లు, కోడి కూర తింటే ఎప్పటిలా తేలిపోతావు. అన్నట్లు కోడి కూరలా చేయమంటావా? వేపుడు చేయనా?”

“చికెన్ ఫ్రై చేసి సాంబారు చేయ్ మామ్! సాంబారులో నంజుకోవడానికి చికెన్ ఫ్రై బాగుంటుంది.”

“మా నాన్నే… ఇంకా నేను రసం పెడదాం అనుకున్నాను… సాంబారు చేస్తాలే… అన్నట్లు ఇంకాస్తా ఉప్మా వేసుకోనాన్నా!…”

“రెండు సార్లు వేసుకున్నాను… ఫైవ్ స్టార్ హోటల్‌లో కూడ నువ్వు చేసినట్లు జీడిపప్పు ఉప్మా చేయలేరు. ఉప్మా అదిరిపోయింది అమ్మా” అని వాసుదేవ్ అంటుండగానే సెల్ రింగై.. తీసి.. “అదుర్స్.. కంగ్రాట్స్‌రా.. మన బ్యాచ్‌లో నాకూ ఫణిగాడికి మంచి ర్యాంక్ రాలేదు.. మీరందరూ త్వరలో డాక్టర్లు కాబోతున్నారు” అని వాసుదేవ్ అనడం చూసి పచ్చి వెలక్కాయి నోటిలో పడ్టట్టు చూసాడు నిరంజనరావు.

గబగబా నిరంజనరావు దగ్గరకు వచ్చి “ఇంకా అలా చూస్తారు ఏమిటిండి?.. వాడి మనసు ఎంత గొప్పదో చూడండి.. త్వరగా వెళ్ళి చికెన్ తీసుకురండి” అంది సుమిత్ర.

“సెలవిచ్చావుగా” అన్నాడు.

“ఏదనుకుంటే అదనుకోండి…”

“తెలుసురా!.. నాకు పెద్ద ర్యాంక్ వచ్చిందని ఊరికే వర్రి అయిపోతుంది వసూ!.. ఇప్పటి వరకు నన్ను తినేసింది” అని నవ్వుతూ.. “ఏంటి మిమ్ములను వేపుకు తింటుందా?.. వస్తానురా పార్టీకి.. రాకుండా ఎలా ఉంటాను” అని చెయ్యి కడుక్కొని.. “నాన్నగారూ! మా ఫ్రెండ్స్ అందరూ కలిసి చిన్న పార్డీ పెట్టుకున్నారు. నేను వెళుతున్నాను.. మోటారు బైక్‌లో పెట్రోలయిపోయింది. డబ్బులిస్తారా… ” అన్నాడు వాసుదేవ్!

“నువ్వు వెళ్లడం ఏమిటిరా… అసహ్యంగా ఉంటుంది. ర్యాంక్ వచ్చిన వాళ్లందరూ సంతోషంగా పార్టీ చేసుకుంటారు.”

“నేనెందుకు అంటారేమిటండి?.. ర్యాంక్ రాకపోతే నా ప్రెండ్స్‌ని కలుసుకొని కంగ్రాట్స్ చెప్పడం మానేయాలా?.. అయినా మంచి ర్యాంక్ రాకపోతే పార్టీకి వెళ్లకూడదా?.. బర్త్‌డేలకి, మ్యారేజ్‌డేలకీ, యానివర్సీలకు.. అన్నింటికీ పార్టీలుంటాయి. చివరికి మనిషి ఈ లోకం విడిచిపోయినప్పుడు కూడా బోజనాలు పెడతారు. నాకు తెలిసినంతవరకు అదీ పార్టీయే. భోజనంలో స్వీట్, హాట్, నాన్‌వెజ్ కూడా పెడతారు” అని తండ్రి వైవు ఒకసారి చూసి తలదించుకొని “మందు సప్లయ్ కూడా ఉంటుంది. మనిషి చనిపోయి బాధలో ఉన్నప్పుడే ఇంత చేస్తున్నప్పుడు, ఆఫ్ట్‌రాల్ ర్యాంక్ రాలేదని పార్టీకి వెళ్లద్దంటారు ఏమిటి నాన్నా” అని దేవ్ అనగానే.. చిన్నగా నవ్వి “మహాప్రభో నీ లాజిక్ అర్థం కావడం లేదు.. వెళ్లు నాయనా! నీకు లేని బాధ నాకెందుకు? ఎన్‌జాయ్ చేసిరా.. నీ సంగతి మరిచిపోయాను. మంచి జరిగినా, జరగపోయినా మనం ఏదీ పట్టించుకోం కదా? ప్రతీదీ జానేదేవ్ అంటావు! ఎన్‌జాయ్ చేసిరా!” అని వ్యంగ్యంగా నిరంజనరావు అనగానే “చాల్లేండి!.. మీరు ప్రత్యేకించి చెప్పాలా? ఏమిటి?.. అన్నట్లు నాన్నా!.. దేవ్!.. పార్టీ నుండి వస్తున్నప్పుడు బట్టర్ ఐస్ క్రీమ్ తెచ్చుకో!.. ఫ్రిజ్‌లో ఇప్పుడే చూసాను అయిపోయింది.. డిన్నర్ అయినాక డిజర్ట్ తినడం నీకు అలవాటు కదా…?” అని సుమిత్ర అనగానే, “థాంక్యూ మామ్. ఇప్పుడే చూసాను!” అని రెండగులు వేసి “అన్నట్లు డాడీ ఐస్ క్రీమ్ తినరు కదా? బందరు లడ్డూ ఇష్టం కదా?.. తెస్తాలే.. అన్నట్లు నీకు హల్వా ఇష్టం కదా?” అని.. వాసుదేవ్ అండుండగానే “అదేంటి నాన్నా.. మా ఇద్దరికి తెచ్చి నువ్వు తెచ్చుకోవా? నీ కిష్టమైన బట్టర్ ఐస్ క్రీమ్ తెచ్చుకో” అంది సుమిత్ర.

“ఎమ్.సెట్‌లో మొదటి ర్యాంక్ వచ్చినవాడు కూడా ఇలా సెలబ్రేట్ చేసుకోడు. చిన్నప్పడే కాదు పెద్దయ్యాక కూడ వీడు అర్థం కావడం లేదు” అన్నాడు నిరంజనరావు.

మోటారు బైక్ తాళాలు తీసుకొని వెళుతున్న వాసుదేవ్‌ని చూసి “జాగ్రత్త నాన్నా” అని, “ఏంటండి ఇందాక అన్నారు… అసలు వాడు అర్థం అయింది ఎప్పుడు? మీకు చిన్నప్పుడే అర్థం కాలేదు. బంగారం అండీ నా కొడుకు” అంది సంతోషంగా.

“నీకొక్కదానికి తప్ప ఇంకెవరికి వాడు అర్థం కాడు” అని సోఫాలో కూర్చొని.. భారంగా కళ్లు మూసుకున్నాడు నిరంజనరావు.

గతం కళ్లమందు మెదిలింది.

***

వాసుదేవ్ వయసు పది సంవత్సరాలుంటాయి. నిరంజనరావు, వాసుదేవ్ బజారుకి బయలుదేరారు. దారిలో హిందీ మాష్టారు కనబడి.. “మీ వాసుదేవ్ బొటాబొటి మార్కులతో హిందీ ఎగ్జామ్ ప్యాసయ్యాడు. ఇలా అయితే లాభం లేదురా!.. పబ్లిక్‌లో ప్యాసమార్కులు తెచ్చుకొని ప్యాసవుతావా ఏమిటి?.. అన్ని సబ్జెక్ట్‌లలో మంచి మార్కులు వస్తున్నాయి.. హిందీ సబ్జెక్ట్‌ కూడా కష్టపడి చదివి మంచి మార్కులు తెచ్చుకోరా” అంటే… “హిందీలో నాకు ఇలానే వస్తాయి… హిందీ పరీక్ష ప్యాసవుతాలెండి… అంతకన్నా ఎక్కువ మార్కులు నాకు అక్కరలేదు” అని కేర్‌లెస్‌గా అన్నాడు. ‘మీ అబ్బాయి బిహేవియర్ చాలా పిక్యూలయర్‌గా ఉంటుంది. ఏం జరిగినా జానేదో అన్నట్లు ఉంటాడ’ని హిందీ మాష్టారనగానే కంగారుగా.. “సారీ అండి.. నేను చెబుతాలెండి” అన్నాడు.

“నాకు హిందీ రాదు నాన్నా… ఇంట్రస్ట్ కూడా లేదు. అయినా పరీక్ష ప్యాసవుతున్నాను కదా? ఆ మార్కులు చాలు!… ” అని కేర్‌లెస్‌గా వాసుదేవ్ అనడం చూసి నిరంజనరావు ఆశ్చర్యపోయాడు.

నిరంజనరావు ఎదురింటిలో వుండే ఈశ్వరరావు తాగుబోతు. తాగి వచ్చి రోజూ భార్యతో గొడవ పడడం.. కొట్టడం చేసేవాడు. ఒక రోజు సడన్‌గా ఈశ్వరరావు చనిపోతే పరామర్శించడానికి నిరంజనరావు వెళ్లాడు.. తండ్రితో పాటు వాసుదేవ్ కూడా వెళ్లాడు. ఈశ్వరరావు భార్య ఒకటే ఏడుపు. అందరూ ఓదార్చసాగారు.

“ఎందుకాంటీ అంకుల్ కోసం ఏడుస్తారు? రోజూ మీతో గొడవపెట్టుకొని కొట్టేవాడు.. అంతే కాదు T.V సీరియల్స్ కూడ చూడనిచ్చేవాడు కాదు. అమ్మతో మీరు బాధపడుతూ చెబుతుంటే విన్నాను.. అంకుల్ మీద కోపం వచ్చింది. అంకుల్ పోవడమే మంచిది.. జానేదేవ్!… హాయిగా T.V సీరియల్స్ చూసుకోండి..!” అని వాసుదేవ్ అనగానే అక్కడున్న వాళ్లందరూ కంగారుగా ఒకరి ముఖాలు ఒకరు చూసుకొని, గుసగుసగా ఒకరితో ఒకరు “చిన్నపిల్లాడయినా కరక్టే చెప్పాడు.. బ్రతికి ఉండి ఆవిడ నరకం అనుభవించింది.. కాని.. టపీమని ఆ కుర్రాడు అలా అన్నాడేమిటి?” అనుకొని “తప్పు బాబూ!.. అలా అనకూడదని” అక్కడ వాళ్లు అన్నారు.

ఇంకా అక్కడుంటే ఏముంటాడో అని కంగారుగా వాసుదేవ్ చెయ్యిపట్టుకొని బయటకు తీసుకువచ్చి.. “ఏంటిరా?… నీ వెధవ వాగుడు.. ఎంత మాట పడితే అంత మాట అనడమేనా? మనిషి పోయి ఆవిడ బాధ పడుతుంటే.. అంకుల్ పోవమే మంచిది.. హాయిగా టి.వి సీరియల్స్ చూసుకోండి అంటావా? నీకు అసలు బుద్ధి ఉందా?… ” అన్నాడు కోపంగా నిరంజనరావు.

“నేనేం తప్పు అనలేదు… కరక్టుగానే చెప్పాను. పాపం ఆంటీ ఎన్నో సార్లు కళ్లనీళ్లతో బాధపడుతూ.. అంకుల్ గురించి బాడ్‌గా చెప్పింది.. అందుకే అలా అన్నాను..” అన్నాడు.

“లాభం లేదు వీడు… వీడి బుర్రకి ఏది అనిపిస్తే అది టపీమని అనేస్తాడు..”

ఆఫీసుకి నిరంజనరావు.. స్కూలుకి వాసుదేవ్ రెడీ అవుతున్నారు..

టి.వి.లో న్యూస్ వస్తోంది.. తెల్లవారు జామున 4 గంటలకి గుండెపోటుతో మంత్రి మాణిక్యాలరావుగారు మరణించారని.. ఆయన చాలా గొప్ప వ్యక్తి, పేదల పాలిట పెన్నిది.. అని ఆయన మరణం తీరని లోటని.. ప్రముఖలు ఆయన భౌతికకాయాన్ని దర్శించి.. సంతాపం తెలియజేస్తున్నారన్న వార్త విని.. ‘అరె.. నిన్న కూడ బహిరంగ సభలో మాణిక్యాలరావు అనర్గళంగా మాట్లాడాడు, ఇంతలో పాపం చనిపోయాడు” అని నిరంజనరావు అన్నాడు.

“పాపం అంటరేమిటి నాన్నాగారూ!… ఆ మంత్రి లంచగొండి, ప్రజల డబ్బు తిని బలిసిపోయాడని… పెద్ద స్కాంలో ఇరుక్కొని… కోట్లు ఖర్చుపెట్టి కేసు లేకుండా చేసుకున్నాడు కదా?.. ప్రజల సొమ్ము తిన్నవాడు.. పోతే ఎందుకు అందరూ బాధపడుతున్నారు.. జానేదేవ్ అనుకోవాలి” అని కేర్‌లేస్‌గా వాసుదేవ్ అనగానే కంగారుగా అన్నాడు నిరంజనరావు.

“ఉష్!… ఏమిట్రా ఆ మాటలు… అయినా ఈ విషయాలన్నీ నీకెలా తెలుసు?… ఇప్పటి నుండే పాలిటిక్స్ వంట పట్టించుకుంటున్నావా?..”

“మొన్న మీరు నాతో హోంవర్క్ చేయిస్తుంటే… మీ ఫ్రెండ్ ధర్మారావు అంకుల్ మన ఇంటికి వచ్చాడు కదా?… అంకుల్ ఎంత బేడ్‌గా మంత్రి గురించి చెప్పాడో?.. అందుకే అలా అన్నాను.”

నిర్ఘాంతపోయాడు నిరంజనరావు. “లాభం లేదు… వీడి ముందు ఏం మాట్లాడుకోకూడదు.”

“ఏంటి నాన్నా!… నేను చెప్పింది కరక్టేకదూ?”

“నోరుముయ్యారా!… అప్పుడే మంచి, చెడులు నిర్ణయించి స్థాయికి వచ్చేసావా” అన్నాడు కోపంగా..

“వాడు చెప్పింది కరక్టే కదండి.. ½ ఎకరం పొలం ఉన్నవాడు.. ఎంత ప్రజల సొమ్ము దోచుకోకపోతే కోటీశ్వరడవుతాడు.. పేపరులో, టి.వీలో వాడి ఆస్తులు లెక్కలు వేయడానికి ఎన్నో బృందాలు కష్టపడ్డారు.. పెద్ద అనకొండ అన్నారు కదండి? నా కొడుకు కరక్టే అన్నాడు..” అంది మురిపంగా వాసుదేవ్ వైపు చూస్తూ సుమిత్ర.

“ఈవిడొకర్తీ.. కొడుకు ఏది చేసినా.. ఏం అన్నా కరక్టే అంటుంది.. అసలు వీడు ఏంటో నాకర్థం కావడంలేదు…”

“సరేలెండి… అర్థం కాకపోతే మరేం పరవాలేదు” అని వంటింటిలోకి వెళ్లింది.

చిన్నప్పటి నుండి ఝలక్‌ల మీద ఝలక్‌లు తినిపిస్తున్నాడు. ఇలా అయితే వీడు జీవితంలో ఎలా పైకి వస్తాడు..? దేశం కోసం పాటుపడకపోయినా, పెద్ద చదువులు చదవకపోయినా, సమాజంలో తల్లిదండ్రులకు కొడుకుగా పేరుప్రఖ్యాతలు తీసుకురాకపోయినా, వాడి జీవితం అయినా ఒక గాడిలో పడుతుందా?

***

ఫ్రెండ్స్ అందరూ రెస్టారెంట్‌లో కలుసుకుంటారు. అందరితో సరదాగా, సంతోషంగా మాట్లాడటం చూసి ఎవరికి వారే లోలోపల ఆశ్చర్యపోయారు.

“ఏంటిరా రామ్.. వసూ రాలేదా” అన్నాడు.

“వచ్చిందిరా!… వసూ బాగా అప్సెట్ అయింది.”

“దేనికి?” అన్నాడు.

“దేనికి అంటావేమిటి?… నీకు పెద్ద ర్యాంక్ వచ్చిందని తెగ్ వర్రీ అయిపోతుంది… ఇప్పటికి రెండు సార్లు వెళ్ళిముఖం కడుక్కొని వచ్చింది.”

“ఎందుకు?..”

“అబ్బబ్బ.. ఏదీ సీరియస్‌గా తీసుకోవు.. నువ్వంటే పడి చస్తుంది కదరా?.. నీకు మంచి ర్యాంక్ లేదని, తనకి నువ్వు దూరం అవుతావేమో అన్న బెంగ అనుకుంటాను.. వసూ కళ్లు ఎర్రగా అయిపోయాయి.. ఇప్పటికి ఎన్నిసార్లు ముఖం కడిగిందో” అన్నాడు.

“అయ్యో!.. అనవసరంగా మేకప్ పోయి ఉంటుంది” అన్నాడు నవ్వుతూ..

అప్పుడే అక్కడకు వచ్చిన వసుంధర ఆ మాటలు విని షాకై.. “ఎగతాళి చేస్తున్నావా… చెయ్యి… నీలాంటి వాడితో స్నేహం చేసినందుకు నా చెప్పుతో నేను కొట్టుకోవాలి” అంది.

సీరియస్‌గా ఒక్క నిమిషం చూసి.. “అది.. నా గురించి.. నీకు పూర్తిగా తెలుసు.. ఎప్పుడూ నిన్ను నాతో ఫ్రెండ్షిప్ చేయమని అడగలేదు..”

మహానుభావా!.. ఇందులో నీ తప్పు ఉందనడం లేదు. నేనే నీ వెంట పడ్డాను.. సిగ్గు ఎగ్గు లేకుండా చిన్నప్పటి నుండి.. ఎందరో ఫ్రెండ్స్ నీకు దూరం అయినా నేను మాత్రం.. నిన్ను వదలలేదు.. నువ్వు మాత్రం నాతో comfort గా ఉండలేదా? ప్రతీ దానికి ముందు వెనకా వసూ… వసూ అని పిలవలేదా?”

“అయితే ఇప్పుడేమంటావ్?”

“ఒక్క నిమిషం నా గురించి ఆలోచించమంటున్నాను. నీ కోసం… ఎన్ని కలలు కన్నాను?..”

“వసూ…” గట్టిగా అరిచాడు.

“ఎందుకలా అరుస్తావు?… నేను ఏమైనా కాని మాట అన్నానా?… కలలు కనకూడదా?… నేరమా?”

(సశేషం)

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here