జానేదేవ్-15

0
9

[box type=’note’ fontsize=’16’] ముమ్మిడి శ్యామలా రాణి గారు వ్రాసిన నవల ‘జానేదేవ్!‘ సంచిక పాఠకులకు ధారావాహికంగా అందిస్తున్నాము. ఇది 15వ భాగం. [/box]

[dropcap]సె[/dropcap]ల్ రింగ్ కావడంతో తీసిన పవిత్ర… “హలో! ఎవరు?” అంది.

“నేను ప్రదీప్‌ని…”

“ప్రదీప్ నువ్వా… ఎలా వున్నావు?”

“ఫైన్! నేను… నేను ఎందుకు ఫోన్ చేశానంటే…”

నవ్వుతూ అంది పవిత్ర – “నువ్వు… నేను చాలాసార్లు మాట్లాడుకున్నాం…”

“అవును. కానీ… ఇప్పుడు నేను ఒక విషయం గురించి నిన్ను అడిగి తెలుసుకోవాలనుకుంటున్నాను పవిత్రా… నువ్వు యుఎస్‍ఎ నుండి వచ్చాకా నీతో మాట్లాడి మా పేరెంట్స్‌కి మ్యారేజ్‌కి ఓకె చెబుదాం అని మీ పేరెంట్స్ అన్నారు… ఓకె కూడా చెప్పేసారు. కానీ… ఎందుకో నీతో ఒకసారి మాట్లాడాలనిపించింది… ఎందుకంటే ప్రపోజ్ నేను చేశాను… పవిత్రా… ఈజ్ ఇట్ ఓకే ఫర్ యూ?” అన్నాడు.

ఒక్క నిమిషం మౌనం వహించి… “ప్రదీప్ నిన్ను పెళ్ళి చేసుకోవడానికి నో అని ఏ అమ్మాయైనా అంటుందా?… నీ గురించి అన్నీ తెలిసిన నేను ఎలా నో అంటాను?” అంది.

“థాంక్స్ పవిత్రా… ఐ యామ్ వెరీ హ్యాపీ…” అన్నాడు.

“ప్రదీప్! నీకు ఇంకా సంతోషం కలిగించే విషయం చెప్పనా?”

“ష్యూర్! చెప్పు”

“నువ్వు అబ్బాయివి కాబట్టి ప్రపోజ్ చేసావు… నేను అమ్మాయిని కాబట్టి ప్రపోజ్ చేయలేకపోయాను… మరి ఉంటాను. గుడ్ నైట్…” అని ఫోన్ పెట్టేసి చిన్నగా తనలో తాను నవ్వుకుంది.

పవిత్ర మాటలు విన్న ప్రదీప్  మనసంతా సంతోషంతో నిండిపోయింది.

“పవిత్రా!… నేనంటే నీకిష్టమే అన్న మాట ఎంత తెలివిగా చెప్పావు?… నీ మనసు నాకు తెలుసు… అందుకే నువ్వంటే నాకిష్టం. నిన్ను ఒకసారి చూడాలని ఉంది పవిత్రా…” అని మనసులో అనుకున్నాడు.

***

ప్రొద్దున్న ఆరుగంటలు కావస్తోంది.

కాఫీ కప్పు తీసుకుని పైకి వెళుతున్న పవిత్రని చూసి, “ఎక్కడికమ్మా కాఫీ… నాన్నగారికి ఇచ్చేసాను” అంది సుమిత్ర.

“తమ్ముడికి” అంది ప్రవిత్ర.

“అప్పుడే తాగడమ్మా… టిఫిన్ చేయడానికి వచ్చే ముందు తాగుతాడు” అంది సుమిత్ర.

“అమ్మా! వాడు తెల్లవార్లూ చదివాడు… అప్పుడే లేచి మళ్ళీ చదువుతున్నాడు. వేడి కాఫీ తాగితే రిలీఫ్‌గా ఉంటుంది.”

“వాడు అప్పుడూ అలానే చదివాడు… ఆ ఎంబిబిస్ సీటు రాలేదు కాని…” అంది సుమిత్ర బాధగా.

“అమ్మా!… అయిపోయిన దాని గురించి ఎందుకమ్మా… ఒక మాట చెప్పనా? వాడికి సైన్స్ సబ్జెక్ట్స్ ఇంట్రస్ట్ లేదు… నీ కోసం బైపిసి తీసుకున్నాడు.”

“వాడి మనసు బంగారం… నా కోసం… నా కోరిక తీర్చాలని బైపిసిలో చేరాడు… వాడిని చాలా కష్టపెట్టాను.”

“అమ్మా!… మళ్ళీ…. అంటున్నావు” అని నవ్వుతూ కాఫీ తీసుకుని వాసుదేవ్ రూమ్‍లోకి వెళ్ళింది.

***

“అమ్మా పవిత్రా… ఒక పేపరు, పెన్ను తీసుకొనిరా… ఎంగేజ్‌మెంట్‍కి ఏవేవి కావాలో, ఎవరెవరిని పిలవాలో లిస్ట్ తయారు చేద్దాం” అన్నాడు నిరంజనరావు.

“దేవ్‌కి ఈ రోజుతో ఎగ్జామ్స్ అయిపోతున్నాయి. రేపటి నుండి వాళ్ళక్క పెళ్ళిపనులన్నీ తనే చూసుకుంటానన్నాడండీ” అంది సుమిత్ర.

“అమ్మా!… ఖాళీగా కూర్చుని ఏం చేయను? చెప్పండి నాన్నగారూ..” అంది పవిత్ర.

“ఎంగేజ్‌మెంట్ పూజకి ఏం కావాలో మీ అమ్మ చెబుతుంది” అని, “సుమిత్రా నీ సెక్షన్ పూర్తయితే డిన్నర్‍కి కావలసినవన్నీ నేను చూసుకుంటాను” అన్నాడు నిరంజనరావు.

“బాగుందండీ!… లేడికి లేచిందే పరుగులా అవతల వంటింట్లో బోలెడు పని నాకోసం ఎదురుచూస్తుంది… ముందు మీ సెక్షన్ మొదలుపెట్టండి” అంది సుమిత్ర నవ్వుతూ.

“సరే!… త్వరగా పని ముగించుకుని రా.”

“మీరు చెప్పాలా? త్వరగా పని ముగించుకుని వస్తాను” అని… ఏదో గుర్తుకొచ్చిన దానిలా “పవిత్రా… లిస్ట్ వ్రాసే ముందు విఘ్నేశ్వరుడి పేరు వ్రాయమ్మా…” అని చెప్పి వంటగదిలోకి నడిచిందో లేదో… “ఆంటీ…” అంటూ నీలవేణి గబగబా లోపలికి వచ్చి గభాలున టి.వి. రిమోట్ తీసుకుని ఆన్ చేసి, “న్యూస్‌లో వాసుదేవ్ గురించి చెబుతున్నారు” అని టి.వి. వైపు చూసింది.

అందరూ కంగారుగా టి.వి.వైపు చూసారు.

“వాడికేం జరగలేదు కదా?… బిడ్డ తెల్లవార్లూ చదివాడు” అని అంటున్నంతలో…

న్యూస్ చదువుతున్న న్యూస్ రీడర్ “ఇప్పుడే అందిన వార్త!… యువత అల్లర్లు, సరదాలతో పాటు సామాజిక సేవలోనూ ముందుంటున్నారు… డిగ్రీ ఫైనల్ యియర్ పరీక్షలు వ్రాయడానికి వెళుతున్న వాసుదేవ్ అనే యువకుడు ఒక నిండు ప్రాణాన్ని కాపాడాడు… ఏ మాత్రం ఆలస్యం జరిగినా ఆ వ్యక్తి చనిపోయేవాడని, సమయానికి హాస్పటల్‍కి తీసుకువచ్చిన వాసుదేవ్‍ని డాక్టర్లు అభినందించారు. ఆ వివరాలలోకి వెళితే ఎగ్జామ్ వ్రాయడానికి మోటార్ బైక్ మీద వాసుదేవ్ వెళుతున్నాడు… సడన్‌గా మోటార్ బైక్ ఆగిపోవడంతో క్యాబ్ బుక్ చేసుకున్నాడు.

అమీర్‌పేట మీదుగా వెళుతున్నాడు. బస్ స్టాప్‌లో ఫ్రెండ్ రోహిత్ కనిపించడంతో అతన్ని ఎక్కించుకుని వెళుతున్నాడు. కొంచెం దూరం వెళుతున్నాడో లేదో క్యాబ్ డ్రైవర్‌కి చెమటలు పట్టి, ఎడం చేత్తో గుండె పట్టుకుని, కుడి చేత్తో డ్రైవింగ్ చేయడం గమనించి ‘ఏంటి అలా ఉన్నారు? ఒంట్లో బాగోలేదా’ అని వాసుదేవ్ అడగడం, ‘అవును బాబూ! ఛాతిలో భరించలేని నొప్పి’ అని చెప్పి డ్రైవర్ స్పృహ కోల్పోవడం చూసి – గభాలున కారు ఆపుచేసి, డ్రైవరును పక్క సీటులో కూర్చోబెట్టి స్పీడుగా క్యాబ్‌ని హాస్పటల్‌కి పోనివ్వడం చూసిన ఫ్రెండ్ వాసుదేవ్‌ని వారించి, ‘మనకి ఎగ్జామ్‌కి టైమ్ అవుతోంది. ఇంకా ఇరవై నిమిషాలే టైముంది. 108కి ఫోన్ చేయరా’ అని రోహిత్ అంటున్నా… పట్టించుకోకుండా ‘ఒరేయ్, నువ్వు దిగి ఆటోలో వెళ్ళిపోరా’ అని రోహిత్‌ని అక్కడే దించేసి డ్రైవర్‌ని హాస్పటల్‌కి తీసుకువెళ్ళి ప్రాణాలు కాపాడాడు. విషయం తెలిసిన ముఖ్యమంత్రిగారు, ఉన్నతాధికారులు అందరూ వాసుదేవ్‌ని అభినందించారు… అంతే కాదు వాసుదేవ్ ఎగ్జామ్స్ వ్రాస్తున్న కాలేజికి ఫోన్ చేసి… ఎంత లేటుగా వచ్చినా ఎగ్జామ్ వ్రాయడానికి అనుమతించమని చెప్పారుట…”

ఏడుస్తూ, ముక్కుని గట్టిగా వెనక్కి ఊపిరి లాగిన సుమిత్రని చూసి, “ఎందుకమ్మా? అలా బాధపడుతున్నావు” అని పవిత్ర అంటుండగానే, “రిలాక్స్ సుమిత్రా… ఇలా అయినదానికి కానిదానికి బాధపడిపోతావు… ఇప్పుడు ఏమయింది? ఆఁ… బిపి పెరిగిపోతుంది…” అన్నాడు నిరంజనరావు.

“చాల్లెండి… వాడు… నా కొడుకు బంగారం… మీరు అర్థం చేసుకోరు. అయినా అందరూ నా కొడుకుని పొగుడుతుంటే బిపి ఎందుకు పెరుగుతుందండీ?” అంది.

ఎదురింటి రాజేశ్వరరావు, భాగ్యలక్ష్మి గబగబా లోపలికి వచ్చి…. “చూస్తున్నారా టివి?… హీరోలాంటి కొడుకును కన్నారండి… అన్ని ఛానల్స్‌లోనూ వాసుదేవ్ గురించి మారుమ్రోగుతోంది” అన్నాడు రాజేశ్వరరావు.

“హీరోతో పోల్చుతారేమిటండి? సినిమాల్లోనే హీరోలు హీరోల్లా ఫోజు పెడతారు… వాసుదేవ్ బంగారం అండి… ఆణిముత్యం…” అంది భాగ్యలక్ష్మి.

వాళ్ళ పొగడ్తలకు అందరూ ఇబ్బందిగా చూసారు.

బాగోదన్నట్టు “కూర్చోండి” అన్నాడు నిరంజనరావు.

“కూర్చోడానికి రాలేదండి… టివిలో న్యూస్ చూసి అభినందించడానికి వచ్చాం” అన్నాడు.

“కాఫీ తెస్తానుండండి” అంది సుమిత్ర.

“అయ్యో మీకా శ్రమ అక్కరలేదండి. ఇప్పుడే తాగాం… అన్నట్టు ఎలాగూ వచ్చాం… సాంబారు చేస్తున్నాను… రెండు ములక్కాడాలు వేస్తే సాంబారు అదిరిపోతుంది…” అని మొహమాటంగా అంది.

“అయ్యో! రెండేమిటండి… బోలెడు మునక్కాడలు ఉన్నాయి. నేనే ఇద్దాం అనుకుంటున్నాను… పవిత్రా! మునక్కాడలు కోసి ఆంటీకి ఇవ్వు” అంది సుమిత్ర.

పవిత్ర వెళ్ళబోతుంటే… “అమ్మా పవిత్రా… ఆ చేత్తోనే కాస్త కరివేపాకు, కొత్తిమీర తీసుకురా తల్లీ… అవి వేస్తేనే సాంబారుకి రుచి…” అంది భాగ్యలక్ష్మి.

పవిత్ర అన్నీ కోసి కవరులో వేసి భాగ్యలక్ష్మి కిచ్చింది.

“థాంక్స్ తల్లీ…! అన్నట్లు వాసుదేవ్‌తో చెప్పు… సాయంత్రం వచ్చి వాసుదేవ్‌తో సెల్ఫీ దిగుతాం” అని, “ఫేస్‌బుక్‌లో ఎన్ని పోస్టులు పెట్టినా ఒక్క లైక్ రావడం లేదు… వాసుదేవ్‌తో సెల్ఫీ దిగి ఫేస్‌బుక్‌లో పెడితే వందల లైక్‌లు వస్తాయి” అని…

“మరి వస్తాం అండి… అన్నట్లు మీరు చాలా అదృష్టవంతులండి… పుణ్యం కొద్దీ పురుషుడు, దానం కొద్దీ బిడ్డలంటారు… పుణ్యం చేయబట్టి దేవుడి లాంటి భర్తను నాకు భగవంతుడు ఇచ్చాడు. క్రిందటి జన్మలో దానాలు చేసి ఉండను… ఆ భగవంతుడు బిడ్డలను ఇవ్వలేదు… ప్చ్! ఈ జన్మలో దానాలు చేస్తూనే వున్నాను…” అని ఒక నిట్టూర్పు విడిచి బయటకు అడుతు వేసింది భాగ్యలక్ష్మి.

“బాధపడకే… నాకు నువ్వు, నీకు నేను…” అని ఓదారుస్తూ వెనకాలే నడిచాడు నిరంజనరావు.

“ఆంటీ వాసుదేవ్ రియల్లీ గ్రేట్… ఫైనల్ ఎగ్జామ్స్ అని కూడా చూడకుండా ఒక మనిషికి హెల్ప్ చేయడం… చాలా గొప్ప విషయం… టివిలో వాసుదేవ్ పేరు విని ఒకటే పొంగిపోతూ తాతయ్యతో చెబుతోంది అమ్మ… ఛానల్స్ వాళ్ళు కాలేజీ దగ్గర కాపు కాసారట. ఎగ్జామ్ వ్రాసి బయటకు వచ్చిన వెంటనే వాసుదేవ్ ఊపిరి సలపనివ్వరు” అంది నీలవేణి.

“అసలు ఇంత ఫాస్ట్‌గా ఈ న్యూస్ ఎలా  బయటకు వచ్చింది? ఏది ఏమైనా… దేవ్‌ని ఎగ్జామ్ వ్రాయడానికి ఎలౌ చేయడం చాలా లక్కీ” అంది పవిత్ర.

“ఇదంతా రోహిత్ పని పవిత్రా… వేరే ఛానల్‌లో రోహిత్ గురించి చెప్పారు… తన ఫ్రెండ్ ఒక మనిషి ప్రాణం నిలబెట్టడానికి ఫైనల్ ఎగ్జామ్ అని చూసుకోకుండా హెల్ప్ చేశాడని… ఆలస్యం అయినా ఎగ్జామ్ వ్రాయడానికి ఎలౌ చేయాలని ఛానల్స్ వాళ్ళకి చెప్పాడట…” అంది నీలవేణి.

“ఆ అబ్బాయి చేసిన పని వలన ఈ రోజు దేవ్ పరీక్ష వ్రాయగలుగుతున్నాడు… వాడికింకా జీవితం పట్ల అవగాహన రాలేదు…” నిరంజనరావు మాట ఇంకా పూర్తి కానేలేదు… “ఏంటి నాన్నగారు! అలా అంటున్నారు… జీవితం పట్ల అవగాహన ఉండాబట్టే ఒక జీవితం అర్థాంతరంగా ముగిసిపోకుండా డ్రైవరు ప్రాణాలు కాపాడాడు” అంది పవిత్ర.

“అవునంకుల్!… పవిత్ర చెప్పింది కరెక్ట్… ఎంతమంది వాసుదేవ్‌లా ఆలోచిస్తారు? సమాజంలో ఎక్కడ చూసినా మోసాలు, అన్యాయాలు, ఒకరిని పడగొట్టి మరొకరు నిలబడాలని, ఆస్తులు పెంచుకుంటూపోవాలని, తను, తన కుటుంబం తప్ప ప్రక్కవాళ్ళకి కనీసం మాట సహాయం కూడా చేయడానికి ఇష్టపడని మనుషులున్న ఈ కాలంలో తన ఫైనల్ ఎగ్జామ్ గురించి కూడా ఆలోచించకుండా డ్రైవరు ప్రాణాలు కాపాడాడంటే వాసుదేవ్ చాలా గొప్ప వ్యక్తి అని మనం సంతోషపడాలి” అంది నీలవేణి.

“ఆఁ… అఁ… అవును… అవును…” అన్నాడు నిరంజనరావు ఏం అనాలో తెలియక.

“చాలా బాగా చెప్పావు నీలూ!… అందుకే వాసుదేవ్ నిన్ను బాగా లైక్ చేస్తాడు” అంది పవిత్ర.

“అన్నట్లు… ఆయనతో చెప్పండి… పరీక్ష వ్రాసి వచ్చాక వాడిని నాన్న మందలిస్తారో ఏమో…” అంది సుమిత్ర.

“ఇంతమంది వాడిని మెచ్చుకుంటుంటే తండ్రిగా నాకంతకన్నా ఆనందం ఏముంది?” అన్నాడు.

ఫోన్ రింగ్ కావడంతో ఫోన్ ఎత్తిన నిరంజనరావు ‘హలో’ అన్నాడు…

“నేనండి గురునాథాన్ని… అభినందనలు… బంగారం లాంటి కొడుకుని కన్నారు… అన్ని ఛానల్స్‌లో వాసుదేవ్ గురించే చెబుతున్నారు… ఏదైనా డబ్బుతో కొనగలం… కొన్ని కష్టమైన పనులు శక్తిని ఉపయోగించి చేయగలం లేదా ఇన్‌ఫ్లూయన్స్ ఉపయోగించి చేయగలం… కానీ వాసుదేవ్ లాంటి మనసు ఎన్ని కోట్లు పెట్టయినా కొనలేం. భగవంతుడు అంత గొప్ప మనసుతో వాసుదేవ్‌ని పుట్టించాడు… మీరు అదృష్టవంతులు… వీలు చూసుకుని వస్తాను. మరి ఉంటాను…” అని ఫోన్ పెట్టేసాడు.

వెంటనే మళ్ళీ ఫోన్ రింగైతే ఎత్తి హలో అన్నాడు.

“కంగ్రాట్స్ నిరంజనరావు గారు! కోహినూరు డైమండ్ లాంటి కొడుకు పుట్టాడు. వాసుదేవ్ మేధావి…  మానవతావాది… పిట్ట కొంచెం కూత ఘనంలా… కుర్రాడే అయినప్పటికీ కుర్రచేష్టలు చేయకుండా, శివుడు మూడో నేత్రం తెరిచినట్లు, తన మనసెప్పుడూ తన కళ్ళెదుట జరుగుతున్న అన్యాయాలను అరికట్టాలని చూస్తుంటుంది.

ఎవరో మహానుభావుడు అన్నట్టు… పేరు గుర్తు రావడం లేదు కాని… మంచిపనులు చేయడానికి రాజకీయ నాయకులు, డాక్టర్లు, ఇంజనీర్లు, సామాజిక కార్యకర్తలు కానక్కరలేదని నిరూపిస్తున్నాడు… మన సమాజానికి ఇటువంటి యువత ఖచ్చితంగా కావాలి. హీ ఈజ్ గ్రేట్. నిరంజనరావుగారూ… మా అనసూయ సాయంత్రం మీ ఇంటికి రావడానికి ప్రోగ్రాం వేస్తోంది. మరి ఉంటాను” అన్నాడు సంతోషం.

మళ్ళీ ఫోన్ రింగ్ కావడంతో అందరూ కంగారుగా ఒకరి ముఖాలు ఒకరు చూసుకున్నారు.

“నేను రిసీవ్ చేసుకోనా నాన్నా?” అంది పవిత్ర.

“లేదమ్మా! నేను చూసుకుంటాను. మీ పని మీరు చూసుకోండి” అని అన్నాడు నిరంజనరావు.

అందరూ హాలులో నుండి వెళ్ళిపోవడంతో, ఎవరైనా ఉన్నారేమో అని అటు ఇటు చూసి ఎవరూ లేకపోవడంతో కళ్ళల్లో నిండిన కన్నీటిని తుడుచుకొని… ‘యూ ఆర్ రియల్లీ గ్రేట్ మై సన్’ అని మనసులో అనుకున్నాడు నిరంజనరావు.

(ఇంకా ఉంది)

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here