జానేదేవ్-16

0
7

[box type=’note’ fontsize=’16’] ముమ్మిడి శ్యామలా రాణి గారు వ్రాసిన నవల ‘జానేదేవ్!‘ సంచిక పాఠకులకు ధారావాహికంగా అందిస్తున్నాము. ఇది 16వ భాగం. [/box]

[dropcap]మ[/dropcap]ధ్యాహ్నం వరకూ ఫోనులు మోగుతూనే ఉన్నాయి. రెండు దాటుతుండగా ఇంటికి వచ్చాడు వాసుదేవ్. అందరివైపు చూసి ఏదో తప్పు చేసినవాడిలా… “సారీ నాన్నా… అనుకోకుండా…” అని వాసుదేవ్ మాట పూర్తి కానే లేదు…

“లేదు దేవ్! యూ హావ్ డన్ ఎ గ్రేట్ జాబ్! నాకు చాలా గర్వంగా ఉంది” అని నిరంజనరావు అనడం చూసి షాకయ్యాడు వాసుదేవ్.

“ముందు ఫ్రషప్ అయి భోజనం చేయి నాన్నా” అంది ప్రేమగా సుమిత్ర.

“అప్పుడే భోజనం వద్దమ్మా” అని వాసుదేవ్ అనగానే… “జ్యూస్ తాగు తమ్ముడూ” అంది పవిత్ర.

అప్పుడే నీలవేణి, వసుంధర రావడం చూసి ఆశ్చర్యంగా చూశాడు వాసుదేవ్.

“కాలేజీలో మన ఫ్రెండ్స్ నీ గురించి ఒకటే చెబుతున్నారు… ఏంటి దేవ్! మంచి పనే చేశావ్ కాని ఎగ్జామ్ గురించి ఆలోచించాలి కదా?… ఇక్కడకు క్లాసు ఎగ్గొట్టి మరీ వచ్చాను” అంది వసుంధర.

“క్యారెట్ హల్వా చేసాను… వాసుదేవ్ ఇంత గొప్ప పని చేసాడు. స్వీట్ ఇవ్వాలనిపించి తెచ్చాను. అయినా తనకి క్యారెట్ స్వీట్ ఇష్టం కదా?” అని ఇబ్బంది పడుతూ అంది నీలవేణి.

‘అమ్మనీ!… ఎదురింట్లో దిగి నన్ను టెన్షన్‌లో పెడుతున్నావు కదే?… ఇది ఎక్కడికి దారితీస్తుందో? క్యారెట్ స్వీట్ దేవ్‌కి తినిపించి కాకిలా ఎత్తుకుపోవాలని చూస్తున్నావు ఏమో? ఇప్పటి వరకు నాకు శత్రువులు లేరు కాని నా ప్రథమ శత్రువు నువ్వే’ మనసులో కోపంగా అనుకుంది వసుంధర.

“వసూ! ఏంటమ్మా ఆలోచిస్తున్నావు? భోజనం చేశావా…?” అంది సుమిత్ర.

“లేదాంటీ!… ఇంటికి వెళ్ళకుండా ఇటే వచ్చేసాను” అంది.

“నువ్వు నీలూ!… నువ్వూ భోజనం చేసి వుండవు. ఎందుకంటే ఎప్పుడూ లేట్ గానే భోం చేస్తావు… ముగ్గురు కూర్చోండి… వడ్డిస్తాను” అంది సుమిత్ర.

“లేదాంటీ… నేను ఇంటికి వెళ్ళి భోం చేస్తాను” అంది నీలూ.

“అదేం కుదరదు… నువ్వు భోం చేస్తేనే నేను హల్వా తింటాను” అన్నాడు నవ్వుతూ వాసుదేవ్.

వసుంధరకి ఒళ్ళు మండిపోయింది… ‘నువ్వు ఫ్రాంక్‌గా మాట్లాడినా నేను తట్టుకోలేనురా… నీ అభిమానం, ప్రేమ… అన్నీ నాకే కావాలి… ఎందుకంతే నువ్వు నా ప్రాణం రా దేవ్’ అనుకుంది.

సైలంట్‌గా ఆలోచనల్లో ఉన్న వసుంధరని చూసి ‘రాక్షసీ!… అనుమానంతో ఏడ్చుకు చస్తావ్!… ఉండు… నిన్ను ఇంకా ఏడిపిస్తానో…’ అని మనసులో అనుకుని… “ఫ్రై చాలా బావుంది వేసుకో నీలూ!” అని రెండు స్పూనులు వేసి… “అమ్మ సాంబారు అంటే నీకిష్టం కదా! మొహమాటపడకుండా వేసుకో… అన్నట్లు కావాలంటే బాక్స్‌లో వేసి ఇంటికి తీసుకువెళ్ళు” అని వాసుదేవ్ అంటుండగానే కోపంగా డైనింగ్ టేబుల్ క్రింద తన కాలితో వాసుదేవ్ కాలు గట్టిగా తొక్కింది వసుంధర.

‘అమ్మ రాక్షసి’ అని మనసులో అనుకొని, “అంతంత కళ్ళేసుకుని చూడకపోతే… నీకు కావలసినవి వేసుకు తినొచ్చు కదా! నువ్వు ఓల్డ్ గెస్ట్‌వే కదా! తనంటే క్రొత్త మనిషి” అన్నాడు వాసుదేవ్.

‘దుర్మార్గుడా! నేను ఓల్డ్ గెస్ట్‌నా’ అని మనసులో అనుకొని ఉరిమినట్లు వాసుదేవ్ వైపు చూసింది వసుంధర.

***

ఎంగేజ్‌మెంట్‌కి అందరినీ పిలిచారు. పవిత్ర, నీలవేణి మంచి స్నేహితులయిపోయారు… జానకికి ఒక పని అప్పగించింది పవిత్ర. ఆ పనిని ఎలా చేయాలో నీలవేణి, తను ఎదురుగా కూర్చుని మరీ నేర్పించింది పవిత్ర.

“పవిత్రా!… అమ్మ పొరపాటున ఒక దానికి ఒకటి చేస్తుందేమో! బాగుండదు కదా?” అంది నీలవేణి.

“నీలూ! ఈ భయమే ఉండకూడదు. ఇలా ప్రతి దానికి వెనుకడుగు వేస్తే ఇక ముందుకు అడుగులు ఎప్పుడు పడతాయి నీలూ!… మనం ఉంటాము కదా?” అంది.

“ఇంకా ఇక్కడే ఉన్నావా పవిత్రా!… లేమ్మా అందరూ వచ్చేస్తారు… లేచి తయారవ్వు… బ్యూటీషియన్‍ని తెప్పిస్తానంటే వద్దన్నావు… మరీ సింపుల్‌గా ఉంటే ఎలా పవిత్రా… చూడగానే పెళ్ళికూతురు అని గుర్తుపట్టే లాగుండాలి” అంది సుమిత్ర.

“అమ్మా! నీకు చాదస్తం ఎక్కువవుతోంది…. నేను రడీ అవుతానుగా” అని పవిత్ర అంటుంటగా డార్క్ మెరూన్ పట్టుచీర జాకెట్టుతో వంటి నిండా నగలతో వచ్చింది వసుంధర.

“రా అమ్మా వసూ!… చక్కగా తయారయ్యావు… అచ్చం పెళ్ళికూతురిలా ఉన్నావు… కొంచెం పవిత్ర రెడీ కావటానికి నీలూ, నువ్వు హెల్ప్ చెయ్యండి” అంది సుమిత్ర.

అప్పుడే హాలులోకి వచ్చిన వాసుదేవ్ వసుంధరని చూసి వస్తున్న నవ్వుని ఆపుకొని… “ఏంటీ అవతారం?… గంగిరెద్దులా ఉన్నావు… ఈ రోజంతా నిన్ను ఇలానే చూడాలా? అక్కా…. ఒక పెయిన్ కిల్లర్ టాబ్లెట్ ఉంటే ఇవ్వు…” అన్నాడు.

వసుంధర ముఖం మాడిపోయింది. అది చూసి గభాలున దగ్గరకు వెళ్ళి, “వసూ!… నిజంగా బంగారు బొమ్మలాగున్నావు… నిన్ను ఏడిపించాలని వాసుదేవ్ అలా అన్నాడు” అంది నీలవేణి.

“ఏం కాదు… నేను ఇలా తయారు కావడం దేవ్‌కి నచ్చలేదు…”

“ఎందుకలా అనుకుంటావు? నువ్వు ఎంత అందంగా ఉన్నావో తెలుసా? అలాంటప్పుడు నువ్వు బాగోలేవని ఎలా అంటాడు” అంది నీలవేణి.

‘ఏంటీ అమ్మాయి… చాలా ఫ్రాంక్ అనుకుంటాను… సాధారణంగా ఏ అమ్మాయి ఇంకో అమ్మాయిని నువ్వు బాగున్నావు అనదు’ అనుకుంది వసుంధర.

“వసూ!… చీర కట్టుకోవడానికి కొంచెం హెల్ప్ చేస్తావా?” అని పవిత్ర అనగానే

“పద పవిత్రా!  నువ్వు నాకొక హెల్ప్ చేయాలి” అని పవిత్రతో పాటు గదిలోకి వెళ్ళి తలుపు గడియ వేసింది వసుంధర.

ఒక్కొక్కరు రావడం మొదలుపెట్టారు.

పంతులుగారు వచ్చి పూజకు ఏర్పాట్లు ప్రారంభించారు.

పెళ్ళివారు పండ్లు, పూలు, స్వీట్లు, పట్టుచీర పట్టుకొని వచ్చారు. నిరంజనరావు, సుమిత్ర, వాసుదేవ్ ఎదురువెళ్ళి ఆహ్వానించారు.

“మీరు చాలా అదృష్టవంతులండి, మీ అబ్బాయి వాసుదేవ్ గురించి టివి ఛానల్స్‌లో చూసాం. ఈ వయసులో పిల్లలు అల్లరి చిల్లరిగా బాధ్యత లేకుండా ఉంటారు… ఒక నిండు ప్రాణాన్ని కాపాడాడు” అన్నాడు నారాయణరావు.

ఏం మాట్లాడాలో తెలియనివాడిలా చిరునవ్వుతో చూసాడు నిరంజనరావు.

“హాయ్ వాసుదేవ్!” అన్నాడు ప్రదీప్.

“హాయ్ ప్రదీప్” అన్నాడు వాసుదేవ్.

“అయ్యో! దేవ్… బావగారూ అనాలి” అంది సుమిత్ర కంగారుగా.

“ఆంటీ! ఫార్మాలిటీస్ నాకిష్టముండదు… మేము ఎప్పుడూ ఎలా పిలుచుకునేవాళ్ళమో అలాగే పిలుచుకుంటాం… అన్నట్లు ఆంటీ… మీరు కూడా నన్ను అల్లుడిలా చూడకండి… మీ ఇంట్లో మనిషిని అనుకోండి” అన్నాడు ప్రదీప్.

“అవును వదినా!… మమ్మలను మీ కుటుంబ సభ్యులే అనుకోండి… ఎంతమాత్రం మగపెళ్ళివారం… మర్యాదలు చేయాలి… ఏవేవో చేయాలని అనుకోకండి… పవిత్ర లాంటి మంచి అమ్మాయి మాకు కోడలు కావటం కన్నా మాకింకేం అక్కరలేదు” అంది సావిత్రి.

“అయ్యో వదినగారు అలా అనకండి. మీ సంబంధం అవుతున్నందుకు మేము ఎంతో సంతోషపడుతున్నాం… సంప్రదాయం ప్రకారం మా ముచ్చటలన్నీ తీర్చుకోనివ్వండి..” అంది సుమిత్ర.

జానకి వచ్చిన ఆడవాళ్ళందరికి కుంకం శ్రద్ధగా పెట్టడం చూసి నీలవేణి ముఖం సంతోషంతో నిండిపోయింది.

‘అమ్మలో ఎంత మార్పు… ఈ మార్పుకు కారణం ఈ కుటుంబమే! వీళ్ళ అండదండలే లేకపోతే అమ్మలో ఇంత మార్పు వచ్చేదా?… వాసుదేవ్ ఎంత మంచివాడు… ఈ రోజుల్లో ఇలాంటి అబ్బాయిలు ఎంతమంది ఉంటారు?… వసూ చాలా అదృష్టవంతురాలు! వసూ లేకపోతే ఆడపిల్లగా సిగ్గుపడకుండా వాసుదేవ్‌కి తను లప్ ప్రపోజ్ చేసేది… ఎందుకంటే… ఈ కుటుంబం అంటే తనకి ఎంతో ఇష్టం… వాసుదేవ్ అంటే ప్రాణం…’ అనుకుంది నీలూ.

“నీలూ!… అందరికీ అన్నీ అందాయో లేదో చూడమ్మా… నాన్నా… ఆ చివర కూర్చున్న వాళ్ళకు అన్నీ అందాయో లేదో చూడు” అని కంగారుగా పవిత్ర రూమ్ దగ్గరకు వెళ్ళింది సుమిత్ర.

అప్పటికే రూమ్ తలుపులు తెరుచుకుని పవిత్ర, వసుంధర రావడం చూసి ఒక్క నిమిషం ఆశ్చర్యపోయింది.

వసుంధర కట్టుకున్న చీర, నగలు తీసేసి పవిత్రది పంజాబీ డ్రెస్ వేసుకుంది.

గభాలున ఆలోచనల నుండి తేరుకుంది నీలవేణి.

‘ఛ! ఛ! నేను ఇలా ఆలోచిస్తున్నానేంటి?’ అనుకుని, మరు నిమిషంలో ‘నేను వసూకి అన్యాయం చేయాలనుకోవడం లెదు… వాళ్ళిద్దరిని విడదీయాలని అనుకోవడం లేదు… ఏ మనిషైనా మనసుకు నచ్చిందే చేయాలనుకోవడం, దాని కోసం ఎంత కష్టం అయినా పడి నచ్చింది పొందడం మనిషి సహజ లక్షణం… కాని నేను ఆలాంటిదేం చేయడం లేదు… వసూ దేవ్‌ల ప్రేమకి నేనెప్పుడు అడ్డుపడను…’ అనుకుంది.

“నీలూ!… ఇప్పుడు బాగున్నాను కదూ? నాకు ఇలా ఉండటమే ఇష్టం… కాని ఎప్పుడు వాసుదేవ్ ఇలానే చూస్తున్నాడు కదా అని అలా తయారయ్యాను. దేవ్‍కి నచ్చనప్పుడు ఎందుకని అన్నీ తీసేసాను” అంది వసుంధర.

“అయ్యో!… అంత బాగా తయారయ్యావు… అనవసరంగా తీసేసావు” అంది నీలవేణి.

“లేదులే!… నీకర్థం కాదు కాని అక్కడ ఎంగేజ్‌మెంట్ అయిపోతుంది పద” అంది వసుంధర.

***

ఎంగేజ్‌మెంట్ అయిపోవడం… అందరూ డిన్నర్ చేసి వెళ్ళిపోవడం జరిగింది.

ప్రదీప్, పవిత్రా రూఫ్ గార్డెన్‌లో ఎదురెదురుగా కూర్చున్నారు.

“ఆర్.ఎల్. సొల్యూషన్స్‌లో జాబ్ రావడం చాలా హేపీగా ఉంది ప్రదీప్… ఎందుకంటే నా ఫేవరెట్ సబ్జెక్టుల మీద ప్రాజెక్టుకి టీమ్ లీడర్‌గా సెలెక్ట్ కావడం… కాని ఒకందుకు వర్రీగా ఉంది. మ్యారేజ్ అయ్యేటప్పటికి ప్రాజెక్టు కంప్లీట్ అయితే పరవాలేదు…” అంది.

“నో… నో… పవిత్రా… నేను డిపుటేషన్ మీద యు.ఎస్.ఎ. వెళుతున్నాను… తరువాత మూడు నెలలు అనుకుంటాను… ముహూర్తాలు లేవని పంతులుగారు చెప్పారని అమ్మ అంది… నేననుకోవడం మన పెళ్ళి సమయానికి నీ ప్రాజెక్ట్ అయిపోతుంది… నేను మా ఆఫీసులో బాస్‍ని ఒక రిక్వెస్ట్ చేశాను… యుఎస్ నుండి వచ్చాకా ఇక్కడే కొన్నాళ్ళు జాబ్ చేస్తానని… బాస్ ఓకే చెప్పడం కూడా జరిగిపోయింది. అమ్మా నాన్నా ఇద్దరూ మన పెళ్ళి కోసం ఎంతో ఎదురు చూస్తున్నారు… అంతే కాదు వాళ్ళిద్దరూ కొడుకూ కోడలు సంతోషంగా ఉండాలని ఆశ పడుతున్నారు… కొన్నాళ్ళయినా వాళ్ళు మనతో ఉంటే వాళ్ళ కోరిక తీరుతుంది కదా? నువ్వు హాయిగా జాబ్‌లో జాయిన్ అవ్వు పవిత్రా” అన్నాడు ప్రదీప్.

“ఏంటి ప్రదీప్! అలా అంటున్నావు… వాళ్ళెప్పుడూ మనతోనే ఉండాలి… నా పేరెంట్స్ నాకు ఎంతో, వాళ్ళూ నాకు అంతే!”

“ఎలా చెప్పగలం పవిత్రా… మా ఆఫీసు వాళ్ళు నన్ను ఎప్పుడైనా స్టేట్స్ పంపించవచ్చు. చెప్పలేం కదా?” అన్నాదు ప్రదీప్.

“అయితే వాళ్ళు లోన్లీగా ఫీలవకుండా నేను వాళ్ళ దగ్గర ఉంటాలే ప్రదీప్” అంది.

గభాలున దగ్గరకు వెళ్ళి పవిత్ర చెయ్యి పట్టుకొని… “నేను లోన్లీగా ఉండాలా పవిత్రా?” అన్నాడు.

ఏం మాట్లాడాలో తెలియనిదానిలా ఒక్క నిమిషం మౌనం వహించి “మనమందరం సంతోషంగా ఉండడానికి ప్రయత్నిద్దాం ప్రదీప్! వయసులోనున్న మనకి ఎవరి సహాయం, సహకారాలు అక్కరలేదు కాని… పెద్దవాళ్ళకి ఒకరి అండదండలు చాలా అవసరం…” అని అంది.

“ఇందుకే పవిత్రా! నేను నిన్ను ఎంతో లైక్ చేసింది. యూ ఆర్ గ్రేట్”

“ప్రదీప్! నా గురించి నీకు ఏం తెలుసని గ్రేట్ అంటున్నావు?”

“నాలుగేళ్ళు ఒకే క్లాసులో కలిసి చదివాం… మనిషిని చూడగానే అతను ఎలాంటివాడో కొందరు అంచనా వేస్తారు. నాలుగేళ్ళు నీ మనస్తత్వం… ప్రవర్తన… అన్నీ చూసాను. అప్పుడు నేను ఏమనుకునేవాడినో తెలుసా? ఈ అమ్మాయికి అందచందాలతో పాటు దేవుడు మంచి మనసు కూడా ఇచ్చాడు అని అనుకునేవాడిని” అన్నాదు ప్రదీప్.

ఒక్క నిమిషం ప్రదీప్ వైపు చూసి నవ్వుతూ, “ఒక అమ్మాయి గురించి నువ్వలా అనుకోవడం తప్పు కదూ?” అంది.

కంగారుగా చూసాడు ప్రదీప్.

“సారీ ప్రదీప్!… సరదాగా అన్నాను… నువ్వలా అనబట్టే ఈ రోజు నీ వైఫ్ అవుతున్నాను… ఐ యామ్ వెరీ లక్కీ… నేను జీవితంలో భగవంతుడిని ఏమీ కోరను” అంది.

“థాంక్యూ! థాంక్యూ పవిత్రా… థాంక్యూ వెరీ మచ్” అన్నాడు సంతోషంగా.

అందరూ వెళ్ళిపోయాక జానకి, నీలవేణి ఇంటికి వెళ్ళడానికి బయలుదేరారు.

వసుంధర కూడా బయలుదేరింది.

జగన్నాధం గారు సంతోషంగా అందరి వైపు చూసి… “చాలా సంతోషంగా ఉందమ్మా… నా కూతురిని మనిషిని చేశారు… బాబూ! వాసుదేవ్!… మరి వెళతాను… జానకీ రా అమ్మా… మందులు వేసుకోవాలి” అని అనగానే తండ్రి వెనకాలే నడిచింది జానకి.

వసుంధర, నీలవేణి గేటు వరకూ నడిచారు.

“అన్నట్లు వసూ!… ప్రొద్దున్న వచ్చిన గెటప్ తీసేసావేం?… ఎప్పుడూ లేనిది నువ్వలా తయారయి వచ్చేటప్పటికి సరదగా నిన్ను ఏడిపించాలనిపించి అలా అన్నాను… నిజంగా బాగున్నావు… అనవసరంగా చేంజ్ చేసావు. ఐ యామ్ సారీ” అన్నాడు వాసుదేవ్.

ఒక్కసారిగా షాకయ్యింది వసుంధర. “ఏడిపించడానికి అన్నావా… యూ…” అని కోపంగా వాసుదేవ్ వైపు చూసింది.

“నేను చెప్పేనా? చాలా బాగున్నావనీ… వాసుదేవ్ సరదాగా అన్నాడు” అంది నీలవేణి.

ఆశ్చర్యంగా నీలవేణి వైపు చూసి, “నీకలా ఎలా అనిపించింది?” అంది.

“నేను చెప్పనా?… నీలూది పాజిటివ్ థింకింగ్… నీకూ నీలూకీ అదే తేడా” అన్నాడు.

ఉరిమినట్లు చూసింది వాసుదేవ్ వైపు.

కార్ డ్రైవ్ చేస్తోంది కాని ఒకటే ఆలోచనలు… ‘నీలూని పాజిటివ్ థింకింగ్ అని దేవ్ పొగుడుతున్నాడా> దుర్మార్గుడా!… రాత్రి ప్రశాంతంగా నిద్ర పోకుండా టెన్షన్ పెట్టావు కదారా…’ మనసులో అనుకుంది వసుంధర.

(ఇంకా ఉంది)

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here