జానేదేవ్-20

0
6

[box type=’note’ fontsize=’16’] ముమ్మిడి శ్యామలా రాణి గారు వ్రాసిన నవల ‘జానేదేవ్!‘ సంచిక పాఠకులకు ధారావాహికంగా అందిస్తున్నాము. ఇది 20వ భాగం. [/box]

[dropcap]ప[/dropcap]విత్రని చూసి షాకైయింది నీలవేణి. “రా… రా… పవిత్రా… నేనే మీ ఇంటికి వద్దాం అనుకుంటున్నాను…. పది సార్లు నీ గురించి చెప్పింది ఆంటీ. నేను ఊరు నుండి వచ్చే వరకు పవిత్రని కాస్త చూసుకోమని… పాపం ఆంటీ నీ గురించి తెగ బాధపడుతుంది… అయినా నువ్వేంటి, ఇలా ఏదో సమస్య వస్తే అలా డీలా పడిపోవడం ఏమిటి?… నీ సమస్య ఏమిటో పోనీ నాతో చెప్పు పవిత్రా” అంది.

“ప్చ్!… ఈ సమస్యను మీరెవరు పరిష్కరించలేరు నీలూ!” అంటూ, “నేను…. నేను సాల్వ్ చేసుకోవడానికే చూస్తున్నాను… ముందు అమ్మ ఎలా ఉందో చెప్పు. ఆ రోజు మా బాస్… ఎం.డి. రామ్‌లాల్‌ని చూపెడుతూండగా… అమ్మ అలా కావడం… ట్యాబ్ విసరడం… చాలా ఆశ్చర్యంగా ఉంది… ఇంతకు ముందు ఇలా ఎప్పుడైనా జరిగిందా నీలూ?” అంది పవిత్ర.

అక్కడే ఉన్న జగన్నాథం బాధగా అన్నాడు – “నా కూతురు మామూలుగా అయిపోయింది… నలుగురిలోకి వస్తుంది… అని ఎంతో పొంగిపోయాను. కాని దాని పరిస్థితి మళ్ళీ మామూలుగా అయిపోయింది… బంగారంలా ఉన్న కూతురు… ఉద్యోగంలో చేరిన కొద్దిలోజులకు ఇదిగో ఇలానే తన పరిస్థితి ఉండేది. మళ్లీ ఇలా అయిందేమిటమ్మా?… ” అని కళ్లల్లో నీళ్లు తుడుచుకున్నాడు…

“బాధపడకండి తాతయ్యా!… ఆంటీ తిరిగి మామూలయి… అందరితో బాగుంటారు… ఆంటీ ఏం చదువుకున్నారు తాతయ్యా?” అంది పవిత్ర…

“డిగ్రీ చేసి ఏవో కంప్యూటర్ కోర్సులు చేసిందమ్మా… ఏదో సాఫ్ట్‌వేర్ కంపెనీలో హెచ్.ఆర్.ఎ. గా చేరింది…. ఆ వెధవ ఉద్యోగం గురించి ఎందుకులే అమ్మా…. నా కూతురు గురించి తండ్రిగా నేను చెప్పేనమ్మా… ” అన్నాడు బాధగా.

“అలా అనుకుంటే ఎలా తాతయ్యా!… ఒకొక్కసారి గతం అనుకొని మనం గుర్తు చేసుకోకపోవచ్చు… కాని… ఆ గతం మన భవిష్యత్‌కి ఎంతో ఉపయోగపడుతుంది. చెప్పండి తాతయ్యా” అంది పవిత్ర.

“గతం మరిచిపోయి నా కూతురు బాగయిందనుకుంటే తిరిగి మాములయిపోయింది” అన్నాడు బాధగా జగన్నాధం.

ఎందుకలా అడుగుతుంది పవిత్ర? అమ్మ గతం తెలుసుకొని ఏం ప్రయోజనం? అర్థంగానట్లు పవిత్ర వైపు చూసింది నీలవేణి.

“చెప్పండి తాతయ్యా!… ఆంటీ ఏ ఆఫీసులో వర్క్‌కి జాయిన్ అయ్యారు… పేరు ఏమిటి” అంది

ఒక్క నిమిషం ఆలోచనల్లోపడ్డాడు జగన్నాథం….

“ఆ…. గుర్తు వచ్చిందమ్మా… జానకి ఆ సాఫ్ట్‌పేర్ కంపెనీలో జాబ్ వచ్చిందని తెగ సంతోషపడింది… అడిగినవాళ్లకి అడగనివాళ్లకి తనకి జాబ్ వచ్చిందని చెప్పేది…. అది చాలా పెద్ద సాఫ్ట్‌వేర్ కంపెనీ ఆట… ఫారిన్‌లో కూడా ఆ కంపెనీలున్నాయని చెప్పేది… ఆ…. ఆ… గుర్తు వచ్చిందమ్మా పేరు ఆర్.ఎల్.సొల్యూషన్స్…..”

ఆ పేరు విన్న పవిత్ర తల మీద పిడుగు పడినట్లయ్యింది… కళ్లు తిరుగుతున్నట్లునపించింది…. ఒళ్లంతా చమటలు పట్టాయి….

“పవిత్రా! ఏమయింది?” అంది కంగారుగా నీలవేణి.

ఉలిక్కిపడి, ఆలోచనల నుండి తేరుకొని “ఎన్నాళ్లు పని చేసింది ఆంటీ?” అంది.

“ఎన్నాళ్లు పని చేసిందంటే కరక్ట్‌గా చెప్పలేనమ్మా…” కాని ఒకటి మాత్రం చెప్పగలను. ఎంతో సంతోషంగా ఆఫీసుకి వెళ్లి వచ్చేది. బోలేడు కబుర్లు చెప్పేది నాకు. వాళ్ల అమ్మకి, వాళ్ల ఎం.డి. గారు చాలా గొప్ప వ్యక్తి అని అనాథలు, వృధ్ధులంటే చాలా అభిమానం అని, వాళ్ళ కోసం ఎంతో డబ్బు ఖర్చు చేస్తున్నారని, చాలా మంచి మనిషి అని చెప్పేది.”

జగన్నాథంగారి మాటలు వింటున్న పవిత్ర ఆశ్చర్యపోయింది. కథలో మార్పులేదు… అదే కథ… గభాలున అంది…

“తాతయ్యగారు… తరువాత ఏం జరిగింది?”

ఒక్క నిమిషం ఆశ్చర్యంగా నీలవేణి జగన్నాథంగారి వైపు, పవిత్ర వైపు చూసింది.

“చెప్పండి తాతయ్యా…. ఆంటీ ఎప్పటి నుండి… అదే తన మొఖంలో సంతోషం… అన్నీ తగ్గిపోయి… బాధపడడం మొదలు పెట్టింది?” అంది పవిత్ర…

కంగారుగా ఆశ్చర్యంగా అన్నాడు జగన్నాథం – “ఆంటీ బాధపడిందని నీకెలా తెలిసిందమ్మా?”

ఒక్క నిమిషం కంగారుపడి సర్దుకొని అంది.

“అదే తాతయ్యగారూ… ఆంటీ ఇలా అయిపోవడానికి ముందు తనలో తాను ఏదో సమస్యతో సతమతమయి ఉండి ఉంటుందని నేను అనుకుంటున్నాను….”

“కరక్టుగా చెప్పావు తల్లీ… ఆఫీసన్నా ఆఫీసు నుండి ఫోను వచ్చినా కంగారు పడిపోయేది జానకి.”

‘అర్థం అయింది తాతయ్యా… ఆనాటి నుండి రామ్‌లాల్ తన పంజా విసురుతూనే ఉన్నాడు…. ఆడపిల్లలు బలి అవుతూనే ఉన్నారు’ అని మనసులో అనుకుంది పవిత్ర…

***

“ఎవరో తన జీవితంతో ఆడుకున్నారు. పైకి చెప్పకోలేక లోలోపల బాధపడలేక సూసైడ్ చేసుకుందనిపిస్తుంది. ఆ దుర్మార్గుడు ఎవరో తెలిస్తే వాడిని పొడిచి నేను జైలుకి వెళ్లేవాడిని” అన్నాడు కార్తీక్.

ఆశ్చర్యంగా అన్నాడు వాసుదేవ్ – “అలా ఎందుకనుకుంటున్నావురా…”

“ఆ కారణం కాకపోతే వేరే కారణం ఏం ఉంటుందిరా. పెళ్లికాని అమ్మాయి ఎవరినైనా ప్రేమిస్తే, వాడు మోసం చేస్తే సూసైడ్ చేసుకుంటుంది. లేదా బలవంతంగా ఏ రోగ్ అయినా తన జీవితంతో ఆడుకుంటే సూసైడ్ చేసుకుంటుంది. అక్క ఎవరినైనా ప్రేమిస్తే ఖచ్చితంగా నాతో చెప్పేది… మా ఇద్దరి మధ్య ఎటువంటి రహస్యాలు లేవు… ఇక రెండోది… నేను అనుకున్నది అయి ఉంటుందిరా.”

కార్తీక్ అన్నట్లు అలా అయి ఉంటుందా?…. ఆవేశంగా భారంగా ఊపిరి పీల్చాడు… ఇంటికి బయలుదేరాడు.

ఇల్లు రావడంతో బైక్ ఆపుచేసి గబగబా నడిచి బెల్ కొట్టాడు. ఎన్నిసార్లు ప్రెస్ చేసినా తలుపుతీయకపోవడంతో గభాలున జేబులోని డూప్లికేట్ కీతో తాళం తీసి… గబగబా ఇల్లంతా తిరుగుతూ “అక్కా… అక్కా…” అని పిలిచాడు.

జవాబు రాకపోవడంతో అక్క ఏం చేస్తుంది? బయటకు వెళ్లిందా? ఎక్కడికి వెళ్లింది?… ఒకవేళ నీలూ వాళ్ళింటికి వెళ్లిందా? ఫోను చేద్దాం అనుకొని ఏదో గుర్తు వచ్చిన వాడిలా పవిత్ర రూమ్ దగ్గరకు వెళ్లి తలుపు తీయబోయాడు. లోపల నుండి గడియ వేసి ఉంది… ‘రూమ్‌లో ఉందే’ అనుకుని తలుపు మీద దబదబా కొడుతూ “అక్కా!… అక్కా” అని గట్టిగా పిలవసాగాడు. ఎంతకీ తలుపు తెరవక పోవడంతో రూఫ్ గార్డెన్‌లోకి పరిగెత్తి గడ్డపార తెచ్చి తలుపు పగల గొట్టి తలుపు తెరిచి ఎదురుగుండా దృశ్యాన్ని చూసి “అక్కా” అని గావుకేక వేసాడు వాసుదేవ్.

గబాలున వీధిలోకి పరిగెత్తి కారు స్టార్ట్ చేసి గుమ్మం వరకు తీసుకు వచ్చి, గదిలోకి పరిగెత్తి, రెండు చేతులతో లేవనెత్తబోయి, చేతి గుప్పిట్లో మడత బెట్టి ఉన్న పేపరు తీసి చదవబోయి, ఇప్పుడు కాదు ముందు అర్జంటుగా అక్కని హాస్పటల్‌కి తీసుకువెళ్లాలి… అని అమాంతంగా పవిత్రని రెండు చేతుల్లోకి తీసుకొని…. కారు దగ్గరకు నడిచాడు.

హాస్పటల్‌కి చేరుకున్నాడు.

“డాక్టర్!… అక్క ప్రాణానికి ఏం పరవాలేదు కదా? అక్కని బ్రతికించండి” అని చిన్న పిల్లవాడిలా ఏడ్చాడు.

“మీరలా కంగారు పడకండి…” అని వాసుదేవ్ అని, “సిస్టర్…” అని ఏం చేయాలో నర్స్‌కి చెప్పి, పవిత్ర చెయ్యి పట్టుకొని పల్స్ చూసి “కమాన్!…. ఇక్కడ కాదు, ఐసియు లోకి తీసుకు వెళ్ళండి” అని గబగబా ఐసియు వైపు అడుగులు వేసాడు డాక్టరు.

అయోమయంగా చూసాడు వాసుదేవ్… ఐసియులోకి పవిత్రని తీసుకువెళ్లారు…

‘అసలు ఏం జరిగింది. అక్క ఇలా ఎందుకు చేసింది’ అనుకుని, గభాలున జేబులో నుండి కాగితం తీసి చదవడం మొదలు పెట్టాడు.

“తమ్ముడూ!… అక్క ఇలా చేసింది ఏమిటి షాక్ అయ్యావా?… నా కోసం బాధపడి పోతున్నావా? నిన్ను బాధపెడుతున్నందుకు బాధగా ఉందిరా… అసలు సూసైడ్ చేసుకునే వాళ్లని చూసి బాధ పడేదానిని. కోపం కూడ తెచ్చుకునే దానిని… అసలు ప్రాణం తీసుకునే అధికారం వాళ్లకు ఎవరిచ్చారని…. కాని నా వరకు వచ్చాక గాని తెలియలేదు…”

“ఆడదానికి స్వాతంత్రం వచ్చిందన్నారు గాని ఎక్కడా రాలేదురా… మగవాడితో సమానంగా చదువుతున్నారు, ఉద్యోగాలు చేస్తున్నారు. వాళ్లకిష్టమున్నట్లు మోడ్రన్‌గా తయారవుతున్నారు కాని… వాళ్ల పరిస్థితి ఎక్కడ వేసిన గొంగళి ఉక్కడే ఉన్నట్లుంది. నిజం చెప్పాలంటే ఇంకా అధ్వానంగా ఉంది. నాలుగేళ్ల పసిబిడ్డ దగ్గర నుండి చర్చిలో నన్‌గా ఉన్న ఒక పెద్దావిడని కూడ మానవ రూపాల్లో ఉన్న మృగాలు వదలడం లేదు… నిర్భయ చట్టం ప్రవేశపెట్టినా నిర్భయంగా ఆడపిల్లలపై దాడులు జరుగుతున్నాయి. గ్యాంగ్ రేప్‌లు చేస్తున్నారు. అనుభవించి ప్రాణాలు తీసి మరీ అవతల పడేస్తున్నారు… ‘షీ టీమ్స్ పెట్టాం, ఈవ్ టీజింగ్ అరికటుతున్నాం… నిర్భయ చట్టం పెట్టాం… చిన్నారులను లైంగికంగా దాడి చేస్తే మరణ శిక్ష విధిస్తాం, కొత్త ఆర్టనెన్స్ తీసుకు వచ్చాం’ అని ప్రభుత్వం చెబుతున్నా మృగాలు సంఖ్య పెరుగుతూనే ఉంది.

ఇది అంతా ఎందుకు చెబుతున్నానంటే ఒక మృగం… ముసలి మృగం నా జీవితంతో ఆడుకోవడానికి స్కెచ్ వేసింది…. నేను బలైపోయాను… ఆ మృగం ఎవరో కాదు… ఆరు పదుల వయసుకి దగ్గిర పడుతున్న రామ్‌లాల్… వాడి కేబిన్ ఎదురుగా ఉన్న భగవంతుడు సాక్షిగా ఎన్నో తప్పు పనులు చేసాడు…. చేస్తూనే ఉన్నాడు…. తన కేబిన్‌లోకి వెళ్లే ముందు తప్పనిసరిగా స్టాఫ్ అందరితో కలిసి దేవుడికి పూజ చేయిస్తాడు…. ప్రతీ రోజు శాస్త్రిగారు వచ్చి మంత్రాలు చదువుతాడు…. రామ్‌లాల్ గాడికి ఎన్నో సాఫ్ట్‌వేర్ కంపెనీలు, హోటల్స్… బోలెడు బిజినెస్‌లు ఎన్నో దేశాలలో ఉన్నాయి…. తెల్లని స్వచ్ఛమైన బట్టలతో, అప్పుడప్పుడు దేవి దీక్షతో కషాయ బట్టలతో, నుదుట ఎర్రని బొట్టు, మెడలో రుద్రాక్షమాలతో ఎంతో పెద్దరికంగా, పరమ భక్తుడిగా కనిపించే వాడు పరమ నీచుడు… దుర్మార్గుడు… అందరూ వాడిని దేవుడిలాగే చూస్తారు…. నేను అలాగే నమ్మాను. సోషన్ సర్వీస్ అంటూ మమ్మలను తీసుకు వెళ్లి… ‘చాలా అలసిపోయారు… చాలా టైమ్ కూడా అయింది… నా ఫామ్ హౌస్‌లో నైట్ రెస్ట్ తీసుకోండి’ అంటే… అలానే చేసాం… అక్కడే స్టాఫ్ మా కోసం ఎన్నో ఎరేంజ్‌మెంట్స్ చేసారు… ఇలా ఉద్యోగంలో చేరాక చాలా సార్లు సోషన్ సర్వీస్‌కి వెళ్లాం. ఒక్కనాడు ఆ దుర్మార్గుడు మాతో రాలేదు… బాత్ రూమ్‌ల్లో పెట్టిన హిడెన్ కెమెరాలతో మేము స్నానం చేస్తున్నప్పుడు… వాడి కళ్లు పడ్డ వాళ్ళ జీవితాలు ఇక నాశనం అయిపోయినట్లే… ఆ రోజు అనుకోకుండా ఆఫీసుకి లేట్ అయ్యాను… రోజులాగే… దేవుని గదిలోకి వెళ్లాను. శాస్త్రిగారు పూజ చేసి వెళ్లిపోయారు. స్టాఫ్ లేరు… కాని ఆ దుర్మార్గుడు ఉన్నాడు… అభిమానంగా తీర్థప్రసాదాలు ఇచ్చాడు… ‘థాంక్యూ సార్’ అన్నాను…. ‘థాంక్స్ చెబితే ఎలాగు?… నీకు నాకు మధ్య డీలింగ్స్ ఉండాలి…. ఇన్ని రోజులకు నా కల ఫలించింది’ అని పిచ్చి పిచ్చిగా మాట్లాడడం మొదలు పెట్టాడు. అప్పటికి గాని వాడి నిజస్వరూపం అర్థం కాలేదు… ‘రాస్కేల్!… దేవుని ముసుగులో భక్తుడిలా తయారై… వయసులో ఇలాంటి పనులు చేయడానికి నీకు సిగ్గు లేదు…’ అని గభాలున గదిలో నుండి బయటకు నడవబోయాను… గభలున నన్ను గట్టిగా పట్టిలాగి… కోపంగా… ‘ఇంకో మాట అన్నావంటే ప్రాణాలు తీయడానికి కూడా వెనుకాడను… కాని నీ ప్రాణాలు తీయను… ఎందుకంటే నాకు నచ్చినదానిని బోరు కొట్టేవరకు వాడుకోకపోతే పిచ్చెక్కుతుంది’ అన్నాడు.

‘నోరు మూయ్’ అని గభాలున వెళ్లబోతే పులిలా నా మీద పడి… ‘ఇది చూడు, నీ నోరు పడిపోతుంది… వద్దన్న వినకుండా నువ్వే నా వల్లో వాలుతావు…’ అని సెల్‌లో ఫోటోలు చూపెట్టడం మొదలు పెట్టాడు.

తమ్ముడూ… ఆ ఫోటోలు చూసి ఆ నిమిషంలో నా ప్రాణం పోతే బాగుండుననిపించింది.

ఎంత సేపు వణికిపోయానో, ఏడ్చానో నాకే తెలియదు. అయినా లేని ధైర్యం తెచ్చుకొని… ‘దుర్మార్గుడా నీ బండారం ఇప్పుడే పోలీసులతో చెబుతాను… నీ బ్రతుకు బజారుకి ఈడుస్తాను….’ అన్నాను. తోక తొక్కిన తాచులా లేచాడు…. ‘నువ్వు అడుగు బైట పెట్టగానే యూ ట్యూబ్‌లో పెడతా…. అది చూసే నువ్వే కాదు మీ వాళ్లు కూడా నీతో కలిసి చస్తారు… అది ఒ.కే అయితే ఒ.కే. అన్నట్లు నీకో ఆఫ్‌ర్ కూడా ఇస్తున్నాను…. కనీసం ఒక రెండేళ్లు నేను చెప్పినట్లు చేస్తే జీతం కాక మరో రెండు లక్షలు ఎక్స్‌ట్రా ఇస్తాను… కాదు కూడదు అంటే నీ బ్రతుకు బజారుపాలవుతుంది…. నీలాగే కస్సు బుస్సు అన్నవాళ్లు కిమ్మనకుండా పిల్లల కోసం నేను చెప్పినట్లు చేస్తున్నారు…. కాదు అన్న వాళ్లు కాటికి వెళుతున్నారు… అబ్బబ్బ… టైమ్ వేస్ట్ చేయకు… ఓ.కే అనుకుంటే ఫామ్ హౌస్‌కి వచ్చేయ్… నా కారు పంపిస్తాను, కామ్‌గా కారు ఎక్కి వచ్చేయ్. లేదా దిక్కుమాలిన ప్లాన్‌లు వేసి ఏమైనా చేసావో… అనుకున్న టైమ్‌కి కారు రాకపోయినా…. నీ ఫోటోలన్నీ బజారులో అందరూ చూడడానికి పనికివస్తాయి… నీకు ఇంకో ఆప్షన్ లేదు… యస్ అనవలసిందే… రేపు వచ్చేయ్!… ఎందుకు నీకు టైమ్ ఇచ్చానో తెలుసా? నీ మైండ్ నాతో కలవడానికి సమయం పడుతుంది కాదా?… ఫైనల్‌గా చెబుతున్నాను…. నన్ను నువ్వు ఏమీ చేయలేవు… వీరనారిలా ఏదైనా చేసినా పోలీస్ డిపార్టమెంట్ నా చేతిలో ఉంది. నువ్వు ఏం చేయలేవని నాకు తెలుసు… ఇలాంటి ఫోటోలు ఏ ముఖం పెట్టుకొని ఎవరికైనా చూపెట్టగలవు? దాని బదులు నాకు ఓ.కే చెప్పడం బెటర్ అనిపిస్తుంది’ అని గభాలున దగ్గరకు లాక్కొని హగ్ చేసుకోబేతే శక్తినంతా కూడదీసుకొని వాడిని ఒక్క తోపు తోసి ఇంటికి వచ్చాను.

ఏ అక్కా ఇలాంటివి తమ్ముడితో చెప్పదు… అయినా చెప్పాను… ఎందుకనుకున్నావు?…. అసలే నువ్వు… నీకు నచ్చనిది జరిగితే ఎలా రియాక్ట్ అవుతావో నాకు తెలుసు…. కాని…. నువ్వు ఈ అక్క కోసం… నీ కోపాన్ని ఆవేశాన్ని అణుచుకోవాలి. ఎందుకో తెలుసా? అక్క మాన ప్రాణాలు కాపాడవలసిన బాధ్యత తండ్రి తరువాత తోబుట్టువుకే ఉంది… అక్కని వాడన్నట్లు అంగట్లో పెట్టకు… వాడికి చాలా పెద్ద నెట్‌వర్క్ ఉంది… నిమిషాల్లో ఆ ఫోటోలు వైరల్ అవుతాయి… విషయం తెలిస్తే నాకు జరిగిన అన్యాయానికి, అవమానం భరించలేక అమ్మా నాన్నా ఆత్మహత్య చేసుకుంటారు… అల్లుడు చెడ్డవాడు తిరుగుబోతు అయితేనే బాధను భరించలేక, కూతురు బ్రతుకు నాశనం అయిందని ఆత్మహత్య చేసుకున్న వాళ్లు ఉన్నారు… కృంగి కృశించి పోతున్నవాళ్ళూ ఉన్నారు. నిన్ను కోరేది ఒక్కటే!… నేను లేని లోటు అమ్మా నాన్నగార్లకి తెలియకుండా నువ్వు భర్తీ చేయాలి… వాళ్ల ప్రాణాలన్ని నీ మీద పెట్టుకొని బ్రతకాలి… అన్నట్లు ప్రదీప్ గుర్తు వస్తున్నాడు తమ్ముడూ!

ఇంజనీరింగ్ చదివినప్పటి నుండి ఇప్పటి దాక ఇంచుమించు ఏడేళ్లు బట్టి వన్‌సైడ్ లవ్ చేస్తున్నాడు…. నేనంటే ప్రాణం… తన గురించే నాకు బాధగా ఉంది… నా చావు మిష్టరీ కాకూడదు… తను క్రొత్త జీవితాన్ని ప్రారంభించినా మనసులో ఏ మూలో నా గురించి బాధపడుతూనే ఉంటాడు… సిగ్గు విడిచి పెట్టి చెబుతున్నాను తమ్మూడూ… తనంటే నాకు ప్రాణం… తను అన్నేళ్లుగా నన్ను ప్రేమిస్తున్నానని తెలిసి ఎంతో పొంగిపోతున్నాను…. గర్వపడుతున్నాను…. తనతో లైఫ్ ప్రారంభించాలని ఎదురు చూస్తున్నాను… అందుకే ప్రదీప్‌కి గుండె దిటవు చేసుకోమని చెప్పి నాకు జరిగిన అన్నాయం చెప్పు I miss him అన్నానని చెప్పు… ఇంకో మాట…. అమ్మ నాన్నకి జరిగిన అన్యాయం చెప్పకు… తట్టుకోలేరు… ఇంకో మాట తమ్ముడూ! జానకి ఆంటీ ట్యాబ్‌లో వాడి ఫోటో చూసి పిచ్చిదానిలా అరుస్తూ ఎందుకు విసిరి కొట్టిందో తెలుసా? ఆంటీ వాడి దగ్గిరే పని చేసింది… వాడికి బలైపోయింది… ఇప్పటికీ చాలా చాలా వ్రాసాను… ఆ ఫోటోలు అనుక్షణం కళ్లల్లో కనబడి చిత్రహింస అనుభవిస్తున్నాను… ఇక భరించలేను… ఈ అక్క బ్రతుకు వీధిలో పెట్టకు.. నిదానంగా ఆలోచించు… పవిత్ర అని పేరు పెట్టుకున్నందుకు నలుగురు దృష్టిలో నన్ను అపవిత్రని చేయకు తమ్ముడూ… అమ్మా నాన్నలని జాగ్రత్తగా చుసుకో… నీ అక్క పవిత్ర….”

ఉత్తరం చదివిన వాసుదేవ్ శరీరం కొయ్య బారిపోయింది. గుండెలో అగ్ని పర్వతాలు బ్రద్దలవ్వసాగాయి… కళ్లలో కోపోద్రేకాలు చోటు చేసుకొని తీక్షణంగా చూడసాగాయి… పిడికిలి బలంగా బిగుసుకుంది. మెరుపు వేగంతో వెళ్లి రామ్‌లాల్‌ని ఒకే దెబ్బతో నరికి చంపేయాలని ఆవేశంతో ఊగిపోసాగాడు… కాని అంతలోనే పవిత్ర చివరలో వ్రాసినది గుర్తు వచ్చి ‘అక్కా… నువ్వు పవిత్రవేనక్కా…. రోడ్డు మీద నడిచి వెళుతుంటే పిచ్చి కుక్క వెంటబడి కరిచి బట్టలు చించితే ఆ మనిషిది తప్పెలా అవుతుంది? అలా అని ఊరుకుంటే ఆ పిచ్చికుక్క కనబడిన వాళ్లందరిపై దాడి చేస్తూనే ఉంటుంది… దాన్ని వెంబడించి, పరిగెత్తించి కుయ్యో మొర్రో అని అరుస్తూ ప్రాణాలు వదిలేలా చేయాలి…. యస్… అంతే… ముందు నువ్వు బ్రతకాలక్కా’ అనుకుంటూ ఆవేశంగా లేచి ఆత్రుతగా ఐసియు వైపు చూడసాగాడు. ఎంత కంట్రోలు చేసుకున్నా, ఆగక ఆవేశంతో శ్వాస భారంగా తీసుకోసాగాడు. ఐసియు నుండి డాక్టరు బయటకు రావడంతో కంగారుగా దగ్గరకు వెళ్లి “డాక్టరుగారూ…. అక్క ఎలా ఉంది? ప్రాణాపాయం లేదని చెప్పండి డాక్టరుగారు” అన్నాడు.

మాట్లాడకుండా ఒక్క సారి వాసుదేవ్ కళ్లల్లోకి చూసాడు… మరు నిమిషం బుజ్జగింపుగా భుజం మీద చెయ్యి వేసి “చూడు మిష్టర్… నాకూ ఒక సిస్టర్ ఉంది… ఆ బంధం గురించి నాకు తెలుసు… మీ సిస్టర్ చాలా స్లీపింగ్ టాబ్లెట్స్ వేసుకుంది… సమయానికి తీసుకొచ్చావు. మా ప్రయత్నం మేము చేస్తున్నాం. We hope she will survive. Let us wait and see” అని వెళ్లిపోయాడు.

సిస్టర్ రాగానే గభాలున దగ్గరకు వెళ్లి అడిగాడు “నేను చూడడానికి వెళ్లొచ్చా సిస్టర్”

“సారీ!… ఎవరిని అప్పుడే లోపలికి పంపిచవద్దని డాక్టరుగారు చెప్పారు…. మరో ఐదు నిమిషాల్లో మళ్లీ డాక్టరుగారు చెకప్‌కి వస్తారు” అంది

ఏం చెయ్యాలో తెలియని వాడిలా అటు ఇటు తిరగసాగాడు… సెల్ రింగ్ కావడంతో ఎత్తి షాకయ్యాడు… అమ్మ దగ్గర నుండి ఫోను…

“నాన్నా! ఎలా ఉన్నారురా… ఇక్కడ ఉన్నాను కాని నా మనసంతా అక్కడే ఉంది… అక్కే గుర్తు వస్తుందిరా… అది ఎప్పుడు ఇలా డల్‌గా లేదు… ఏదోలా ఉందిరా… అలా పవిత్ర ఉండడం తట్టుకోలేకపోతున్నానురా… ఏం చేస్తావో నాకు తెలియదు… మేము వచ్చేటప్పటికి నా కూతురు ఎప్పటిలా ఉంటాలి…. పవిత్రతో ఒకసారి మాట్లాడాలని ఉందిరా…” అని సుమిత్ర అనగానే వాసుదేవ్ కంగారుగా – “వద్దమ్మా…” అన్నాడు.

“పోనీలే… రేపు మాట్లాడుతానే” అంది.

“రేపే రేపు కూడా వద్దమ్మా”

“అదేంటిరా అలా అంటున్నావు…”

“అది… అది… అక్క… ఇప్పడిప్పుడే మాట్లాడుతుంది.. మీరు వచ్చేటప్పటికి అక్కని మాములుగా చేయాలని ట్రై చేస్తున్నాను… ఇప్పుడు నువ్వు మాట్లాడావు అనుకో, అక్క మళ్లీ డిస్టర్బ్ అవుతుంది. అమ్మా… చుట్టుప్రక్కలున్న గుడులన్నీ చూసి రండమ్మా… తొందరేం లేదు… మరి ఉంటానమ్మ” అని గభాలున సెల్ ఆఫ్ చేసాడు.

(ఇంకా ఉంది)

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here