జానేదేవ్-3

0
12

[box type=’note’ fontsize=’16’] ముమ్మిడి శ్యామలా రాణి గారు వ్రాసిన నవల ‘జానేదేవ్!‘ సంచిక పాఠకులకు ధారావాహికంగా అందిస్తున్నాము. ఇది మూడవ భాగం. [/box]

[dropcap]“చూ[/dropcap]డండి… మీరు ఇలాంటి సమయంలో మమ్ములను గుచ్చి గుచ్చి అడగడం ఏం బావుండలేదు. అసలు ఏం జరిగిందో ఏమిటో మాకు తెలియదు. పార్టీ అని వెళ్లాడు” అని నిరంజనరావు అన్నంతలో…

“పార్టీనా? ఏం పార్టీ అండీ?…” అన్నాడు మరో విలేకరి…

“చెప్పండి సార్” అన్నాడు మరో విలేకరి.

“చూడండి… మా అబ్బాయి ఎలా ఉన్నాడో అని మాకు ఆత్రుతగా ఉంది… ఒకసారి వాడిని చూసుకోనివ్వండి” అంది సుమిత్ర.

“ఇంకా డాక్టర్లు మిమ్మలను చూడడానికి పిలవలేదు కదమ్మా?… అసలు మీ అబ్బాయి ఏం చేస్తున్నాడు, పార్టీకి వెళ్లాడు అంటున్నాడు… ఏం పార్టీ…” అన్నాడు విలేఖరి.

“ఎమ్.సెట్‌లో ర్యాంకులు వచ్చిన వాళ్లందరూ పార్టీ చేసుకుంటుంటే వెళ్లాడు…”

“అలానా?… మీ అబ్బాయికి ఇంజనీరింగ్‌లో సీటు వచ్చిందా?….”

“అయ్యో రామ! ఇంజనీరింగ్ అయితే మావాడికి వచ్చిన ర్యాంక్‌కి కళ్లు మూసుకుని వచ్చేది సీటు… ఎం.బి.బి.యస్. నాయనా?”

“అంటే మీ అబ్బాయికి సీటు రాలేదా?”

“చెప్పానుగా రాలేదు…”

“అయితే పార్టీకి ఎందుకు వెళ్లాడు?”

“ఏం? ఎం.సెట్‌.లో సీటు రాకపోతే పార్టీకి వెళ్లకూడదా…?” కోపంగా అన్నాడు నిరంజనరావు.

“ఆంటీ… దేవ్ ఎలా ఉన్నాడు… ప్రమాదం ఏం లేదు కదా?… నాకిప్పుడే తెలిసింది… అసలు తన గురించి ఏమనుకుంటున్నాడు? హీరోనా?… కిడ్నాపర్‌లను ఒక్కడు ఎలా ఎదుర్కోగలననుకున్నాడు… ఆంటీ!… ఏదీ సీరియస్‌గా తీసుకోడు… ప్రతీదీ కేర్‌లెస్‌గా తీసుకుంటాడు. ఇలా అయితే ఎలా ఆంటీ?…” అంది కళ్లల్లో నీళ్లు నిండుతుండగా వసుంధర.

“వసూ!… వాడి సంగతి తెలిసి… ఆంటీని అడుగుతావు ఎందుకు?… వాడికి నువ్వూ నేనూ, అమ్మ నాన్నా ఎవరు ఎవరు చెప్పినా వాడి బిహేవియర్ మారదు…”

“వాడు ఎలా ఉండాలంటే అలానే ఉంటాడు… ఏం చేయాలనుకుంటే అదే చేస్తాడు…” అని వాసుదేవ్ ఫ్రెండ్స్ అందరూ… తలో మాట అనసాగరు.

“వాసుదేవ్‌ని ఇంతమంది ఇష్టపడుతున్నారు… మీరందరూ చిన్ననాటి ఫ్రెండ్స్… మీరే వాడిని మార్చాలి” అంది బాధగా… సుమిత్ర.

“చిన్ననాటి ఫ్రెండ్స్ కాబట్టే చెబుతున్నాం ఆంటీ…”

“ఈ రోజు అమ్మాయిలను ప్రాణాలకు తెగించి కాపాడాడంటే… దేవ్ ఎంత గొప్పవాడో ఆలోచించు ఆంటీ… ఎదురింటిలో దొంగలు పడి దోచుకుపోతున్నది మనకి తెలిసినా, మన తలుపులు గట్టిగా వేసుకోవడానికి చూస్తాం కాని హెల్ప్ చేయం… రోడ్డు మీద దెబ్బలు తగిలి స్పృహ కోల్పోయి మనిషి కనబడితే 108 వచ్చి తీసుకు వెళుతుందనుకుంటాం కాని మన కారులో యాక్సిడెంట్ జరిగిన మనిషిని ఎక్కించుకోం…”

“నూటికో కోటికో వాసుదేవ్ లాంటి వాళ్లు ఉంటారు” ఆవేశంగా అన్నాడు ఫణి.

గబగబా చానెల్స్ వాళ్లందరూ ఫణి చుట్టూ చేరి “వాసుదేవ్ గారి గురించి ఇన్ఫర్మేషను మీ దగ్గర ఉంది… అతని గురించి కొంచెం చెబుతారా?…” అన్నారు.

రూమ్‌లో నుండి సిస్టర్ బయటకు వచ్చి “పేషంట్ తాలుకా ఎవరండి ఇక్కడ” అంది.

కంగారుగా సుమిత్ర, నిరంజనరావు వెళ్లారు.

“లోపలికి వెళ్లి చూడండి… పేషంట్‌కి స్పృహ వచ్చింది” అంది…

“పేషంట్ అనకమ్మా… బాధగా ఉంది… వాడి పేరు వాసుదేవ్!…”

ఒక్క క్షణం ఆశ్చర్యంగా చూసింది సిస్టర్.

“నాన్నా! ఎలా వున్నావు?…” ఆత్రుతగా దగ్గరకు వెళ్లి వాసుదేవ్ తల మీద చెయ్యి వేసింది సుమిత్ర…

“ఎలా ఉన్నావురా” అన్నట్లు చూసాడు నిరంజనరావు.

“నాకు… నాకు ఏం ఫరవాలేదమ్మా… బాగానే ఉన్నాను… నువ్వు కంగారుపడకు… మళ్లీ బిపి పెరుగుతుంది” అన్నాడు.

“ఆ విషయం ఆలోచించే వాడివయితే… ఇలా ఎందుకు చేస్తావురా? ఏది చేసినా ముందు వెనుకా ఆలోచించవా?…”

“బాగా చెప్పారు అంకుల్!… అదృష్టం బాగుండి… ప్రాణాలతో బయటపడ్డాడు… దేవ్!… నీ వెనుక… నీ వాళ్లు… ఉన్నారన్న విషయం మరిచిపోకు… దేవ్!… ప్లీజ్!… ప్రతీ విషయం కేర్‌లేస్‌గా తీసుకోకు…”

“అసలు నువ్వొక్కవడివి ఎలా కిడ్నాపర్‌లను పట్టుకోగలననుకున్నావ్?… దయుంచి ఇంకెప్పుడూ ఇలాంటి పనులు చేయకు” అంది బాధగా వసుంధర.

“అంత ఆలోచన ఉంటే ఇలాంటి పని ఎందుకు చేస్తాడమ్మా?”

“ఏంటి నాన్నగారూ… ఇలాంటప్పుడు ఆలోచించాలా?… అవతల నలుగురు అమ్మాయిలు… అమాయకులు, స్కూలు పిల్లలు నాన్నగారు… వాళ్లు కిడ్నాప్ అయ్యారని తెలిసి కూడా నేను ఎలా ఆలోచించాలి నాన్నగారూ…?” అన్నాడు ఆవేశంగా వాసుదేవ్!

“అలా అంటావు ఏమిటిరా?… ఆలోచించకపోతే జరగరానిది జరిగితే…” అంది కంగారుగా సుమిత్ర.

 “ఏం అవుతుందమ్మా… అంతగా అయితే నా ప్రాణం పోయేది… కాని నేను… నలుగురు అమ్మాయిలను రక్షించడానికి ప్రయత్నించానన్న తృప్తి ఉండేది.”

అప్పటికే తలుపు తెరుచుకొని చానల్స్ వాళ్లందరూ అక్కడ నిలబడి వాసుదేవ్ మాటలు విని…

“సార్! you have done a good job. మిమ్మలను ఆదర్శంగా తీసుకొని కొంతమందైనా ముందుడుగు వేస్తే ఆడవాళ్లు నిర్భయంగా తిరగగలరు… ఆడపిల్లలు దర్జగా హాయిగా చదువుకోగలరు” అన్నాడు ఒక చానెల్ వాడు.

“సార్… మీరు చూస్తే ఒక్కరే… వాళ్లు చూస్తే కిడ్నాపరు నలుగురు ఉన్నారు… వాళ్లని ఎలా ఎదుర్కోగలననుకున్నారు” అన్నాడు మరో చానల్ వ్యక్తి.

“వాళ్లు కిరాతకులు… వాళ్లకి ఒక మనిషి ప్రాణం తీయడం ఒక లెక్క కాదు. ఆ విషయం ఆలోచించలేదా మీరు” అన్నాడు మరో చానెల్ వాడు.

అసహనంగా అటూ ఇటూ చూసాడు. “ఆలోచించి చేస్తే నా కళ్లముందే కారు ఎటో వెళ్లిపోతుంది… నలుగురు అమ్మాయిల జీవితాలు నాశనం అయిపోతాయి… ఆ నిమిషంలో నా గురించి ఆలోచించలేదు. కాబట్టి ఆ కారుని వెంబడించి పట్టుకున్నాను” అన్నాడు…

“ఒకవేళ మీకేమైనా అయితే సార్” అన్నాడు చానెల్ వాడు…

“అయితే… అవ్వనివ్వండి… నేను అప్పటికే పోలీసులకు ఫోను చేసాను… పోలీసులోచ్చే వరకు పడేవాడిని… ఈలోగా పోలీసులొస్తారు… నా ప్రాణాలు పోతే నష్టం ఏమిటి?… ఎంతో మంది పోతుంటారు. అందులో నేను ఒకడిని.”

“దేవ్!…” అంది కోపంగా వసుంధర.

“వీడేంటి ఇలా తయారయ్యాడు… ఏ మనిషికైనా ముందు చూసుకునేది తన బాగోగులు… మనుషులు ఎన్నో రకాలుంటారు. ఒక్కక్కరు ఒక్కోరకంగా ఉండొచ్చు. కాని అందరిలో ఉండేది ప్రాణభయమే!… అన్ని విషయాల్లో జానేదేవ్ అంటాడు… వీడికి జీవితం పట్ల అవగాహన ఎప్పుడొస్తుందని అనుకునేవాడిని… కాని ఇక అలా అనుకొవలసిన పని లేదని ఇప్పడర్థమయిపోయింది…” అని తనలో అనుకున్నాడు నిరంజనరావు.

డాక్టర్లు, సిస్టర్ రావడంతో అందరూ ప్రక్కకు తప్పుకున్నారు…

అందరి వైపు కోపంగా చూసి అన్నాడు డాక్టర్.

“సిస్టర్!… వీళ్లందరిని లోపలికి ఎలా రానిచ్చావు? పేషంట్‌కి కావలసిన వాళ్లు తప్ప తక్కిన వాళ్లందరిని బయటకు పంపేయ్” అన్నాడు.

“ప్లీజ్!… అందరూ వెళ్లండి… మిమ్మలనే… ” అని చానల్ వాళ్లందరిని బయటకు పంపింది సిస్టర్…

“ఎలా వుంది?” అని వాసుదేవ్‌ని అడిగారు పెద్ద డాక్టరుగారు…

“బాగానే ఉంది డాక్టర్… I am ok” అన్నాడు.

 “You have done a good job” అన్నాడు పెద్ద డాక్టరుగారు.

“యువత… చాలామంది పక్క త్రోవలు పడుతున్నారు… డ్రగ్స్‌కి బానిసలవుతున్నారు… ప్రేమ అని అమ్మాయిల వెంట పడి… రిజెక్ట్ చేస్తే యాసిడ్ దాడులు చేస్తున్నారు. డాక్టర్!… మొన్న కనిగిరిలో చూసారా? నరరూప రాక్షసుల్లా ప్రవర్తించారు కుర్రాళ్లు. వాళ్లు చేసిన పని చూసి అందరూ రాళ్లతో కొట్టి వాళ్లని చంపాలంటున్నారు… “You are great Vasudev, నువ్వు యువతకి ఒక రోల్ మోడలివి” అని అభిమానంగా వాసుదేవ్ భుజం మీద చెయ్యి వేసారు అసిస్టెంట్ డాక్టర్!… ప్రక్కనే ఉన్న డాక్టరు వైపు చూస్తూ…

గభాలున నలుగురు ఆడపిల్లల తల్లిదండ్రులు వాసుదేవ్ దగ్గరకు వచ్చి… “ఎంత గొప్ప మనిషివి బాబూ నువ్వు… నాకెందుకు అని పోకుండా ఒక్కడివి ప్రాణాలు తెగించి నాలుగిళ్లల్లో సంతోషాన్ని నింపావు… నువ్వు మా పిల్లలను కాపాడకపోతే వాళ్ల జీవితం సర్వనాశనం అయిపోయేది… మేము బ్రతికి ఉన్న శవాల్లా బ్రతికే వాళ్లం… నువ్వు మా పాలిట భగవంతుడవయ్యా… అన్నారు.

చిన్నగా నవ్వాడు వాసుదేవ్!

“అన్నయ్యా!… ఎలా ఉందన్నయ్యా… నొప్పిగా ఉందా?” అభిమానంగా వాసుదేవ్ మంచం చుట్టూ నిలబడి అడిగారు నలుగురు అమ్మాయిలు.

చిన్నగా నవ్వాడు వాసుదేవ్!

అందరూ వెళ్లిపోయాక… నిరంజనరావు, సుమిత్ర, వసుంధర, కార్తీక్, ఫణి… మిగిలారు.

“ఆంటీ!… మీరు అంకుల్ ఇంటికి వెళ్లండి. నేను కార్తీక్ ఉంటాం… ఓకేనా కార్తీక్” అంది వసుంధర.

“నువ్వు? ఉంటావా? నువ్వెందుకు?… నేను ఫణి ఉంటాం… అంకుల్, ఆంటీని తీసుకొని మీరు ఇంటికి వెళ్లండి…” అన్నాడు కార్తీక్.

“నేను… నేను ఇంటికి వెళ్లను కార్తీక్… వాడిని వదిలి నేను ఇంటికి ఎలా వెళ్లగలను?” అంది సుమిత్ర…

“ఇక్కడ మీరు ఉండలేరు ఆంటీ… ప్రొద్దునే వచ్చేయండి… చెప్పండి అంకుల్… మేమైతే టిఫిన్లు తెచ్చుకొని తినేసి ఉండిపోతాం…” అన్నాడు ఫణి.

“వాళ్లు చెప్పింది కరక్టే!… వాసుదేవ్‌ని వాళ్లు చూసుకుంటాం అంటున్నారుగా… ప్రొద్దున్నే వచ్చేద్దాం… నువ్వు రా అమ్మా… ఇంటి దగ్గర డ్రాప్ చేస్తాను” అని వసుంధరవైపు చూసి అన్నాడు నిరంజనరావు.

“కార్తీక్, ఫణి ఉన్నారుగా!… నువ్వు వెళ్లమ్మా వసూ!… వాళ్లతో వెళ్లిపో” అన్నాడు వాసుదేవ్!

చిరుకోపంతో వాసుదేవ్ వైపు చూసింది వసుంధర…

“మీ ఇద్దరిలో ఎవరో ఒకరు వాడి దగ్గర ఉండండి… ఫోను చేస్తుంటాను. లిప్ట్ చేయండి” అన్నాడు నిరంజనరావు…

వాసుదేవ్ దగ్గరకు వెళ్లి… ప్రేమగా తల నిమిరి… కళ్లల్లో నీళ్లు నిండుతుండగా “జాగ్రత్త నాన్నా” అంది సుమిత్ర…

“దేవ్!… నన్ను ఉండమంటే ఉంటాను… చెప్పు” అంది దగ్గరగా వెళ్లి వసుంధర…

“ఇప్పుడు నీ కబుర్లు వినే ఓపిక నాకు లేదు… ప్లీజ్ వెళ్లవా?” అన్నాడు నవ్వుతూ.

ఉరిమినట్లు వాసుదేవ్ వైపు చూసి…“పదండి ఆంటీ… అంకుల్!… పదండి…” అంది…

“దేవ్! కార్తిక్ నీ దగ్గరుంటాడు. నేను వెళ్లి టిఫిన్ చేసి వీడికి తీసుకు వస్తాను” అని ఫణి అన్నంతలో… “ఇద్దరూ వెళ్లి… టిఫిన్ తిని రండి… నాకు నిద్ర వస్తుంది, పడుకుంటాను” అన్నాను.

“వాడు చెప్పింది కరక్టే… గబగబా వెళ్లి టిఫిన్ చేసి వచ్చేద్దాం… అన్నట్లు దేవ్!… ఈ సెల్ నీ దగ్గర ఉండనీయ్!… ఈలోగా అవసరం వస్తే నాకు చేయ్!…” అన్నాడు కార్తీక్…

అంతలో సిస్టర్ వచ్చి… వాలెట్, సెల్ తెచ్చి వాసుదేవ్ దగ్గర పెట్టి… “మీవే సార్… అన్నీ చూసుకోండి” అంది.

“ధాంక్స్ సిస్టర్!…” అన్నాడు చిన్నగా నవ్వుతూ వాసుదేవ్!

“సార్!… చిన్న రిక్వెస్ట్!…”

“చెప్పండి”

“డిశ్చార్జ్ అయినాక మీతో నాకు ఒక సెల్ఫీ కావాలి…”

“నాతోనా?” అన్నాడు ఆశ్చర్యంగా వాసుదేవ్…

“అవును… నేను ఈ రోజే ఒక నిర్ణయానికి వచ్చాను… నేను ఈ డ్యూటీలో ఉన్నంతవరకు మీలాంటి గ్రేట్ పీపుల్స్ ఎదురైతే సెల్ఫీ తీసుకోవాలని… అప్పుడు సెల్ఫీకి ఒక అర్థం వస్తుంది” అంది…

“అరె!… సిస్టర్!… నా గురించి మీరు ఎక్కువగా అనుకుంటున్నారేమో అని పిస్తుంది…” అన్నాడు…

“నేను కాదు సార్!… అందరూ అలానే అనుకుంటున్నారు… చానల్స్ అన్నింటిలో మీ గురించే వార్తలు వస్తున్నాయి” అని… వెళ్లిపోయింది.

“ఒరేయ్!… వాసుదేవ్!… సిస్టర్ చెప్పింది కరక్టురా… నువ్వు మా ఫ్రెండ్ అయినందుకు మాకు చాలా గర్వంగా ఉందిరా” అన్నాడు కార్తీక్.

“నోరుముయ్‌రా!… చివరికి నువ్వు కూడా అంటున్నావా?… మరి మొన్నటి వరకు… ప్రతీది జానేదేవ్ అంటామిటిరా? ఏది సీరియస్‌గా తీసుకోవా?… అన్నావ్.”

“అనలేదు అని అనలేదురా… అన్నాను… నిన్నటిదాకా నువ్వొక కేర్‌లెస్ ఫెలోవి… కాని ఇప్పుడు నీ మనసెంత గొప్పదో తెలిసింది.”

“ఒరేయ్ పొగడ్తలు… ఇబ్బందిగా ఉంటాయని… ఎవరో అంటే విన్నాను… నిజం ఇబ్బందిగా ఉంది… ఎప్పటి లాగే ఉండు” అన్నాడు నవ్వుతూ.

“ఒరేయ్ అన్నట్లు చెప్పడం మరిచిపోయాను… మన కాలేజీ వాళ్లందరూ… ఒకటే ఫోనులు… మన కాలేజీ ప్రిన్సిపాలు, లెక్చరర్స్…” అని ఫణి అంటుండగానే…

“వాళ్లెవరూ నా దగ్గరకు రాకుండా చూడండిరా, నాకు చాలా ఇన్‌కన్వీనియంట్‌గా ఉంది. అన్నట్లు మీరిద్దరూ టిఫిన్ తినేసి రండి” అన్నాడు.

ఫ్రెండ్స్ ఇద్దరూ బయటకు వెళ్లారో లేదో… వాసుదేవ్ ఫోను రిగయింది.

ఫోను తీసిన వాసుదేవ్ సంతోషంగా “అక్కా ఎలా ఉన్నావు?” అన్నాడు.

“ఏంటిరా?… నన్ను అడుగుతున్నావు… నువ్వు ఎలా ఉన్నావు తమ్ముడూ?… నాకు నిన్ను చూడాలని ఉంది రా!… వచ్చేయాలని ఉంది.”

కంగారుగా అన్నాడు… “ఏంటక్కా?… ఆ పని చేయకు… నేను బాగానే ఉన్నాను… అయినా ఈ విషయం నీకెలా తెలుసు. అమ్మా నాన్నగారు ఫోను చేసి చెప్పారా?…”

“లేదురా?… న్యూస్‌లో చూసాను… ఎందుకురా అంత సాహసం చేసావు?…”

“ఏంటక్కా? నువ్వు కూడా?…

“అవునురా!… నేను ఇలా అనకూడదు… నలుగురు అమ్మాయిలను కాపాడావు. కాని… అమ్మా, నాన్న వాళ్లు గుర్తొచ్చి అలా అన్నాను… తమ్ముడూ!… చిన్నప్పటి నుండి… నీ బిహేవియర్… నీ పనులు చూసి నాన్నగారు నిన్ను మందలించేవారు. కొంతమంది నిన్ను… వీడేంటిరా బాబూ… అన్నట్లు చూసేవారు… ఎందుకో తెలియదు తమ్ముడూ! నువ్వు ఏం మాట్లాడినా… ఏం చేసినా నాకు ఫర్‌ఫెక్ట్‌గా అనిపించేది. నిన్ను ఏమైనా అన్నవాళ్లని ఏదైనా అనాలనిపించేది… ఇక నాన్నగారిని అయితే తమ్ముడు చేసింది కరక్టే!… అవును… వాడికి అలా అనిపించింది… అందుకే అలా అన్నాడని… వాదించాలనిపించేది… కాని… అలా చేయలేకపోయాను… అయ్యో!… సారీరా తమ్ముడూ!… నీకు ఎలా ఉంది ఇప్పుడేం ప్రమాదం లేదు కదా?” అంది పవిత్ర.

“నేను బాగున్నానక్కా!…” అన్నాడు.

“తమ్ముడూ!… ఇప్పుడు చెప్పొచ్చో లేదో… నాకు తెలియదు కాని… నీకు ఒకటి చెప్పాలనుకుంటున్నానురా!…

ప్రతీ మనిషి ఎన్నాళ్లు బ్రతుకుతాడో తెలియదు. జీవితంలో ఎన్నో ఆటుపోటులు… ఎంత ఉన్నా, లేకపోయినా… బ్రతుకుతాడు… కాని ప్రతీ మనిషి తను మనసు చెప్పినట్లు నడుచుకుంటే ఆ మనిషి సంతోషంగా ఉండగలడు… ఎవరో చెప్పినట్లు నడుచుకుంటే ఆ మనిషి సంతోషంగా ఉండలేడు… ఒకవేళ సంతోషంగా ఉన్నట్లు నటించినా మనసు బాధ పెడుతూనే ఉంటుంది…

తమ్ముడూ!… మనసు బాధ పెట్టే పని ఎప్పుటికీ చేయకు… నీకు ఎలా అనిపిస్తే అలా చెయ్యి… అదొక్కటే కాదు తమ్ముడూ!… నీ వలన ఎవరూ బాధపడకూడదు… నాకు తెలుసు!… నీ వలన ఎవరూ బాధపడరని… జీవితం సాగించడానికి… కొన్ని గోల్స్‌లను నిర్ణయించుకుంటే జీవితం చాలా బాగుంటుంది… నాకు చాలా గర్వంగా ఉంది…. నీలాంటి వాడు నాకు తమ్ముడుయినందుకు!” అంది ఉద్వేగంగా పవిత్ర.

ఏం మాట్లాడాలో తెలియలేదు దేవ్‌కి… చిన్నప్పటి నుండి… ఎన్నో విషయాలలో తనని వెనకేసుకు వచ్చేది పవిత్ర… కాని అక్క మనసులో తనంటే… ఇంత మంచి అభిప్రాయం ఉందని తెలియదు.

“తమ్ముడూ!…” నవ్వుతూ అంది, “బోరు కొట్టించానా?”

కంగారుగా అన్నాడు – “లేదక్కా!… నువ్వు నన్ను ఇంతలా అర్థం చేసుకున్నావని తెలియదు… థాంక్స్ అక్కా…”

నవ్వుతూ అంది…

“సరే!… రెస్ట్ తీసుకో!… అమ్మ చాలా కంగారు పడుతుంది… నాన్న సంగతి నీకు తెలుసు కాదా… కాసేపు అమ్మతో మాట్లాడుతాను. వాళ్లకి రేపు ఫోను చేస్తాను…”

మోహమాటంగా అన్నాడు… “థాంక్స్ అక్కా…”

ఫోను పెట్టేసాడు కాని… ఆలోచనలు బయలుదేరాయి…

కళ్లముందు అన్యాయం జరుగుతుంటే కళ్లు ముసుకొని ఎలా వెళ్లిపోగలరు ఎవరైనా? ఏమో!… తనైతే అలా చేయలేడు… ఆలోచనలతోనే… నిద్రలోకి జారుకున్నాడు.

మరునాడు పేపర్ల నిండా వాసుదేవ్ ఫోటోలు… చుట్టాలు, తెలిసిన వాళ్లు నిరంజనరావుకి ఫోను చేసి “వాసుదేవ్ ప్రాణాలకు తెగించి అమ్మాయిలను కాపాడడం నిజంగా అభినందించవలసిన విషయం. అన్ని పేపర్లలలో వాసుదేవ్ ఫోటోలు చూసి… చాలా సంతోషించాం” అని అన్నారు.

‘మన వాళ్లందరూ నిరంజనరావు కొడుకు అని చెప్పుకుంటున్నారు’ అని చెప్పడం మొదలు పెట్టారు.

సుమిత్ర కళ్లు తుడుచుకోవడం చూసి కొంచెం చిరాగ్గానే అన్నాడు నిరంజనరావు.

“వాడు చేసిన పనికి అసలు ప్రాణాలు పోవడమో, లేక… సంవత్సరమో… రెండు సంవత్సరాలో కాలు, చెయ్యి విరిగి మంచం మీద ఉండేవాడు… వాడికేం పరవాలేదు… బాగానే ఉన్నాడు… అనవసరంగా వర్రీ అయి బిపి పెంచుకోకు.”

“నా బాధంతా… మీరు వాడిని అర్థం చేసుకోలేదనే!… బంగారం లాంటి మనసు వాడిది” అంది బాధగా సుమిత్ర.

“బంగారం లాంటి మనసు బ్రతకడానికి, సరిపోదు. వాడికి జీవితం పట్ల సరియైన అవగాహన లేదు ప్రతీది కేర్‌లెస్! ఏం చేస్తే ఏం జరుగుతుందో, అని ఒక్క నిమిషం కూడా ఆలోచించడు. వాడి మాటలో చెప్పాలంటే జానేదేవ్!… వాడే ఆలోచనపరుడైతే ఎమ్.సెట్‌లో సీట్ రానందుకు కనీసం ఒక గంటైనా బాధపడి నలుగురి కోసం అయినా నాలుగు రోజులు మూలన కూర్చోనేవాడు. బాధ లేకపోతే… పోనీ… బాధపడవద్దు… కాని సిగ్గు, ఎగ్గు లేకుండా ఎమ్.సెట్‌లో సీటులు వచ్చి సంతోషంగా పార్టీ చేసుకుంటున్న వాళ్లతో ఎంజాయ్ చేయడానికి వెళ్లాడు… దాన్ని ఏమనాలి?” అన్నాడు బాధగా నిరంజనరావు.

“ఏమనాలో నాకు తెలియదు కాని… నాకు అర్థం అయింది…” అంది – “ఎప్పటికీ నా కొడుకు మీకు అర్థం కాడని…”

ఒక్క నిమిషం సుమిత్ర మాటలకి తెల్లబోయాడు. ఈవిడిది తల్లి ప్రేమ అనాలా… లేక పిచ్చి ప్రేమ అనాలా?…

“ఆలోచించినది చాలు గాని… రండి… ఏమైనా తిందురుగాని” అని వంట గదిలోకి నడిచింది సుమిత్ర.

రోజులు గడుస్తున్నాయి.

హాస్పిటల్ నుండి డిశ్చార్జి అయి ఇంటికి వచ్చాడు వాసుదేవ్!

“డాక్టరుగారు ఏమన్నారు? కాలేజికి వెళ్లొచ్చన్నారా? ఎప్పటి నుండి నువ్వు నార్మల్‌గా అవుతావో చెప్పారా?” అన్నాడు నిరంజనరావు.

“ఈ వీక్ రెస్ట్ తీసుకోమన్నారు నెక్స్ట్ వీక్ నుండి… కాలేజికి వెళతాను…”

“సరే!… నువ్వు డాక్టరో, ఇంజనీరో… లేక పెద్ద పెద్ద చదువులు చదివేసి నెం 1 స్థానంలోకి వెళ్లిపోవాలని ఆశపడడం లేదు… నీకంటూ ఒక జీవితం ఉంటుంది… ఆ జీవితం సాఫీగా సాగిపోవాలంటే… నీ కాళ్ళ మీద నువ్వు నిలబడాలి… గుర్తు పెట్టుకో వాసుదేవ్” అన్నాడు.

ఒక క్షణం తండ్రి కళ్లలోకి చూసి… “నేను… మిమ్మలను బాధపెడుతున్నానేమో అనిపిస్తుంది నాన్నగారూ… నేను తప్పకుండా చదువుకుంటాను… వర్రీ కాకండి” అన్నాడు.

“అలా చెప్పరా… ఆయన బాధంతా నీ గురించే… పిచ్చి మనిషి… నీకేం… రాజావి…”

“ప్రొద్దున్న నుండి పాలవాడు, పేపరు వాడు, కాయగూరలవాడు… అందరూ నీ గురించే అడుగుతున్నారు. ఒకసారి నిన్ను చూస్తాం అన్నారు… అన్నట్లు నీకు దిష్టి తీయాలి నాన్నా… అందరి కళ్లు నీ మీదే ఉన్నాయి” అని వంట గదిలోకి నడిచింది.

“నేను కాదు సుమిత్రా… నువ్వు పిచ్చిదానివి. అసలు వాడికి కాదు… నీకు జీవితం మీద అవగాహన లేదు… నీ వల్ల వాడు అలా తయారయ్యాడు” అని మనసులో అనుకున్నాడు నిరంజనరావు.

“నాన్న నా భవిష్యత్ గురించి చాలా బాధపడిపోతున్నారు… అసలు ఎందుకు అంత టెన్షన్ పడుతున్నారు?… నా కోసం కాకపోయినా నాన్న కోసం డిగ్రీ… పూర్తి చేయాలి” ఆలోచనలతోనే బెడ్ రూమ్ తలుపు తెరిచి బాల్కనీలోకి వచ్చాడు…

(సశేషం)

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here