జానేదేవ్-4

0
8

[box type=’note’ fontsize=’16’] ముమ్మిడి శ్యామలా రాణి గారు వ్రాసిన నవల ‘జానేదేవ్!‘ సంచిక పాఠకులకు ధారావాహికంగా అందిస్తున్నాము. ఇది నాలుగవ భాగం. [/box]

[dropcap]ఎ[/dropcap]దురింటి పెరటిలో బట్టలుతుకుతూ రాజేశ్వరరావు కనిపించాడు… గభాలున తల ఎత్తి చూసి… “వాసు బాబూ! వచ్చేసావా?… ఎంత ధైర్యం బాబూ నీకు? శబాష్!… హీరోవి… అన్నట్లు నిన్ను చూడడానికి రాలేదని ఏమి అనుకోకు… చుట్టాలొచ్చారు. బోలెడు పని… నాన్నగారిని అడుగుతునే ఉన్నాను.”

“పరవాలేదంకుల్!… అన్నట్లు బట్టలు మీరు ఉతుకుతున్నారు ఏమిటి? ఆంటీ లేరా”

“అయ్యో ఉంది… ఆదివారం కదా? కొత్త సినిమా వస్తుంటే చూస్తుంది… మీ ఆంటీ మహేష్ బాబు ఫ్యాన్ కదా?”

నవ్వుతూ అన్నాడు వాసుదేవ్ – “మీరు కాదా?”

కాస్త సిగ్గుపడిపోతూ… “నేను ఎన్‌టిఆర్‌గా‌రి ఫ్యాన్‌ని… తరువాతే జూనియర్ ఎన్.టి.ఆర్. ఫ్యాన్‌గా మారిపోయాను…”

“అలాగా…”

“అన్నట్లు… నేను బట్టలుతకడానికి కారణం చెప్పనే లేదు కదూ?… ఈ మధ్యన వంట్లో బాగుండక డాక్టరు దగ్గరకు వెళ్లాను. ఆఫీసులో కూర్చోని కూర్చోని పెద్ద బోషాణంలా పెరిగిపోయింది పొట్ట. డాక్టరు నా పొట్ట చూసి ఆశ్చర్యపోయి – ‘ఇది పొట్టా చెరువా?… ఈ పొట్టని అర్జంటుగా తగ్గించుకోకపోతే చాలా కాంప్లికేషన్స్ వస్తాయి. ఎక్సర్‌సైజులు చేయాలి. రోజూ వాకింగ్ చేయాలి అటు ఇటు తిరుగుతూ అప్పుడప్పుడు మీ ఆవిడకు పనుల్లో సహాయపడండి. ఈ మధ్య సర్వేలో కూడా కనుక్కున్నారు మన పనులు మనం చేసుకోవడం వలన ఆరోగ్యం బాగుంటుంది… మీరు బద్దకించారనుకోండి… ఈ బాన పొట్ట వలన… హార్ట్ ఎటాక్ వచ్చే ప్రమాదం ఉంద’ని అన్నారు. నువ్వు చెప్పు వాసుబాబూ! ఈ పెద్ద పొట్ట మోయడం నాకేమైనా సరదానా?… ఇక అప్పటి నుండి మీ ఆంటీ ఒకటే గోల… ఏడుపులు పెడబొబ్బలు, ‘నా పసుపు కుంకాలు దూరం చేస్తారా? అర్జంటుగా మీ పొట్ట తగ్గిపోవాలి. మీరు వందేళ్లు చల్లగా ఉండాలి’ అని ఇదిగో ఇలా బట్టలుతకమని… పప్పు రుబ్బమని, వంగొని ఇల్లంతా తుడిస్తే పొట్ట తగ్గుతుందని… ఒకటేమిటి అన్ని పనులు చేయిస్తుంది. ఒకవేళ చేయనన్నాననుకో, ‘నా పసుపు కుంకం దూరం చేస్తారా’ అని కంటతడి పెడుతుంది. నిజం చెప్పాలంటే మీ ఆంటీ బాధపడితే నేను చూడలేను… అసలు మీ ఆంటీకి… నేనంటే పంచప్రాణాలు వాసుబాబూ!… పిచ్చిదానిని బాధపట్టడం ఇష్టం లేక ఇదిగో ఇలా చేస్తున్నాను” అన్నాడు.

వాసుదేవ్‌కి నవ్వాగలేదు… అంకుల్ చాలా అమాయకుడు… బోళామనిషి.

“రాజీ… బట్టలుతకడం అయిపోయిందా. టీ తాగుదువుగాని రా…” అని గబగబా పెరటిలోకి వచ్చిన భాగ్యలక్ష్మి వాసుదేవ్‌ని చూసి… “వచ్చావా వాసు బాబూ… నువ్వు మా ఎదురింటిలోనే ఉండడం… మా అదృష్టం… ఎదురిల్లు ఏమిటి ఈ వీధిలోనే ఉండడం.. ఈ కాలనీ అదృష్టం… అన్నట్లు నీతో ఒక సెల్ఫీ కావాలి వాసుబాబూ!… ఫేస్ బుక్‌లో లోడు చేస్తాను… బోలెడు లైకులు వస్తాయి” అంది సంతోషంగా.

పొరమారాడు వాసుదేవ్!…

“దేవ్!…” అని సుమిత్ర కేక వేయడంతో “అమ్మ పిలుస్తోంది” అని లోపలకి నడిచాడు వాసుదేవ్!

“అదేంటోయ్!… వాసుబాబుని అలా టపీమని సెల్ఫీ అడిగేసావు…” అన్నాడు రాజేశ్వరరావు.

“ఏం చేయమంటారు… మీ ఫోటో నా ఫోటోలు ఎన్ని పెట్టినా ఒక్కరూ లైక్‌లు కొట్టడం లేదు…”

 “నేనూ వాసుబాబు కలిసిన ఫోటో పెట్టాననుకోండి… బోలెడు లైక్‌లు కొడతారు… అన్నట్లు మీరు కూడా వాసుబాబుతో కలిసి సెల్ఫీ తీసుకోండి, బోలెడు లైక్‌లు వస్తాయి” అంది.

“పిచ్చిదానా? మన ఇద్దరికి ఎవరు లైక్‌లు కొట్టడం లేదని తెగ బాధపడిపోతున్నావు కదే?…” అన్నాడు…

“నేను కాదండి… మీరు సత్తెకాలం సత్తయ్య. నేను, మీరు విడివిడిగా వాసుబాబుతో సెల్ఫీ తీసుకొని ఫేస్ బుక్‌లో పెట్టాం అనుకోండి… వాసుబాబు హీరోలా ఉంటాడు… కిడ్నాపర్‌లను పట్టుకొని హీరో అయ్యాడు కదండీ… అందరూ బోలెడు లైక్‌లు కొట్టేస్తారు… నా బుర్ర ఎంత తెలివైందో అర్థం అయ్యిందా” అంది గర్వంగా.

ఆశ్చర్యంగా చూస్తూ ఉండిపోయాడు రాజేశ్వరరావు.

***

“ఈ జ్యాస్ తాగు నాన్నా!… నాన్న మాటలు గురించి ఆలోచించకు… అన్నట్లు నువ్వు పట్టుకున్న కిడ్నాపర్లలో ఒకడు తప్పించుకు పారిపోయాడట… ఆ దొంగ వెధవ కోసం గాలిస్తున్నారుట… నాకు అనుమానంగా ఉంది… ఒక వేళ పోలీసులే వాడిని కావాలని వదిలేసారంటావా?… అంది సుమిత్ర.

ఆశ్చర్యంగా చూసి… “ఛ!… ఛ!… అలా ఎందుకనుకుంటున్నావ్?…”

“ఎందుకేమిటిరా?… మినిస్టరు గారు… ఈ కేసు చాలా సీరియస్‌గా తీసుకున్నారట… ‘నా పాలనలో ఆడపిల్లలు దర్జగా హాయిగా… బ్రతకాలి… ఆ ముఠాను త్వరగా పట్టుకోవాల’ని అర్డరు జారీ చేసారు.”

“అలాగా!… అయితే పోలీసులు ఇంకా భయంగా కేసు డీల్ చేస్తారు… అలాంటప్పుడు అసలు కిడ్నాపర్‌ని ఎందుకు వదిలేస్తారు?…”

“ఎందుకేమిటిరా?… ఎక్కడో చదివాను… పోలీసులకు… దొంగలకు సంబంధం ఉంటుందట కదా… నేను ఎప్పుడో పేపరులో చదివాను. ఇప్పుడు పోలీసులు సస్పెండ్ కూడా అయ్యారు…”

ఆశ్చర్యంగా తల్లి వైపు చూసాడు… అమ్మ ఇంతలా ఆలోచిస్తుదని తెలియదు…

“ఏంటిరా? అంతలా ఆలోచిస్తున్నావ్ నేను చెప్పింది కరక్టే కదా?… ప్రాణాలకు తెగించి కిడ్నాపర్‌లను పట్టుకున్నావు… ఆ ముఠాను కూడా పట్టుకుంటే ఆ పిల్లలకు ధైర్యంగా ఉంటుంది… భయం లేకుండా… కాలేజీలకు ఉద్యోగాలకు వెళతారు…”

“అమ్మా! నీ ఆలోచన చాలా బాగుంది…. మంచి… చెడూ… ఒక్క పోలీసులలోనే కాదు ప్రతీ ఉద్యోగాలలో… వ్యాపారాలలో… అన్నింటిలో ఉంటుంది. ఎంతోమంది నిజాయితీపరులైన పోలీసు ఆఫీసర్లు ఉన్నారు… ఆ కిడ్నాపర్ల ముఠాను తప్పకుండా పట్టుకుంటారు…”

“అన్నట్లు అక్క ఫోను చేసింది… నిన్ను పిలుస్తానంటే… లేదు రాత్రికి మాట్లాడుతాను అంది.. నాన్నని, నన్ను… నిన్ను ఏమి అనవద్దని ఒకటికి పదిసార్లు చెప్పింది… ‘వాడు చెడ్డ పని చేసినట్లు ఎందుకు అనుకుంటారు…’ అని నాన్నకి క్లాసు తీసుకుంది” అంది నవ్వుతూ సుమిత్ర.

“అమ్మా! అక్క ఎందుకలా చేసింది?”

“ఎందుకేంమిటిరా? అలానే అడగాలి… అయినా ఈ ఇంట్లో మీ అక్క తప్ప నాన్నని ఎవరు అలా అడగలేరు. అన్నట్లు వసూ ఫోను చేసిందిరా… నీ సెల్ స్విచ్ఆఫ్ చేసి ఉందట… ఒకసారి పిలవమంది… ‘ఇంకా లేవలేదమ్మా పడుకున్నాడ’ని అబద్దం చెప్పానురా… మీ నాన్నలా వసూ కూడా క్లాసు తీసుకుంటుంది కదూరా?” అంది చిన్నగా నవ్వుతూ సుమిత్ర.

“థాంక్స్ అమ్మా… మంచి పని చేసావు…”

“వసూ మంచి అమ్మయిరా… నువ్వంటే పడిచస్తుంది. ఎంతమంది వసూ లాంటి వాళ్లు ఉంటారురా… చిన్ననాటి ఫ్రెండ్!… తరువాత ఒకసారి చెయ్యి…” అని అంది.

ఆలోచనల్లో పడ్డాడు. అమ్మ అన్నట్లు వసూ మంచి అమ్మాయే… కాని తన ఆలోచనలు, నావి పూర్తిగా విరుద్ధం… అయినా చిన్ననాటి నుండి… తమ ఇద్దరి మధ్య ఫ్రెండ్‌షిప్ పెరుగుతూనే ఉంది. గమ్మత్తుగా ఇద్దరి మధ్య గొడవలు జరుగుతూనే ఉంటాయి. కాని మరుక్షణం ఏం జరగనట్లే… దేవ్ అంటూ తనతో మాట్లాడడం చూసి ఫ్రెండ్స్ మొఖాలు తెల్లబెట్టేవారు…. అయినా తనకి ఎమ్‍సెట్‌లో మంచి ర్యాంక్ రాలేదని… తెగ వర్రీ అయిపోతుంది… అయినా ఎన్నాళ్లు వర్రీ అవుతుందిలే!… ఇద్దరి రూటులు వేరయ్యాయి గొడవలు కొట్లాటలు… అన్నీ తగ్గిపోతాయనుకుంటూ సెల్ తీసి వసుంధరికి ఫోను చేసాడు వాసుదేవ్!

“హమ్మయ్య!… ఫోను చేసావు… చాలా సంతోషం. ఎలా ఉన్నావు?… ఉండు వీడియో కాల్ చేస్తాను” అంటూ కట్ చేసింది. కొన్ని క్షణాల తర్వాత వాళ్ళిద్దరూ వీడియో కాల్ మాట్లాడుకుంటున్నారు.

“జరిగిందేదో జరిగిపోయింది… ఇక మీదట ఇలా సాహసాలు చేయకుండా… నేను చెప్పినట్లు చేస్తానని మాట ఇచ్చేవరకు వదలను” అంది వసుంధర.

“ చూడు వసూ!… ఇంకా పాత పంథాలోనే ఉన్నావా? ఏంటి చిన్న పిల్లలా… నువ్వు కాబోయే డాక్టరువి కాస్త ఆలోచించి మాట్లాడు…”

“నేను ఆలోచించిడం ఏమిటి?… నేవ్వే ఆలోచించు. నా మాట విని లాంగ్ టర్మ్‌లో జాయిన్ అయిపో!… నువ్వు ఎలాగైనా డాక్టర్‌వి కావాలి!… ప్లీజ్! దేవ్!… నాకోసం… నువ్వు డాక్టరు కావాలి!… నేను ఎన్ని కలలు కన్నానో తెలుసా? నన్ను డిస్సెపాయింట్ చేయకు.”

“వసూ!… పిచ్చిగా మాట్లాడకు… నా గురించి నువ్వు కలలు కనడం ఏమిటి? ఆశ్చర్యంగా ఉంది.”

“ఎందుకు ఆశ్చర్యం?… నీ కోసం కలలు కనడం తప్పా చూడు దేవ్!… నేను నీ ఫ్రెండ్‌షిప్ కోసం… నీకోసం… నేను ఏమైనా చేస్తానని తెలుసు కదా? నువ్వు కూడా అందిరితో కన్నా నాతో ఫ్రెండ్లీగా ఉంటావే!…”

“అయితే” అన్నాడు…

“చూడు దేవ్!… మనసులో ఒకటి పెట్టుకొని… పైకి వేరేలా మాట్లాడడం నాకిష్టం లేదు. మనిద్దరి మధ్య జరిగిన విషయం మరిచిపోయావా?… ఎమ్‌సెట్ అయినాక నా మనసులో ఉన్నదంతా నీతో షేర్ చేసుకున్నాను గుర్తుందా?…”

దేవ్ ఆలోచనలో పడ్డాడు.

“దేవ్!… నా మీద నీ అభిప్రాయం ఏమిటి?” అంది వసుంధర.

ఆశ్చర్యంగా చూసి అన్నాడు.

“నా అభిప్రాయమా?… ఎందుకు?… నేనెమైనా విఐపినా? లెజెండ్‌నా?… అసలు నా అభిప్రాయంతో నీకు పనేంటి?…”

“ విఐపిలు, లెజెండ్‌లు నా గురించి చెబుతానన్నా నాకు అవసరం లేదు… నీతో పని ఉంది కాబట్టి అడుగుతున్నాను.”

“నాతో పనా?… ఏం పని ” అన్నాడు ఆశ్చర్యంగా దేవ్!

“మరీ ముద్దపప్పులా మాట్లాడకు దేవ్… నా మనసులో ఏం ఉందో నీకు తెలియదా…”

“నిజంగా తెలియదు…”

“అనవసరంగా కోపం తెప్పించకు… అయినా పిచ్చిదానిని… నీ నోటితో చెప్పించాలని ఆశ పడడం దండగ. నేను నీ ఫ్రెండ్‌షిప్ కోరుతున్నానని నీకు తెలుసు, అందుకే కదా… నువ్వు ఎన్ని తిక్కవేషాలు వేసినా భరిస్తూ వచ్చాను. ఇవన్నీ ఎందుకు చేస్తున్నాను… నువ్వంటే నాకు చాలా ఇష్టం… ఇష్టం అనడం సరికాదు ప్రాణం.”

కంగారుపడ్డాడు వాసుదేవ్…

“వసూ… ఏది మనం అతిగా ఇష్టపడకూడదు… అతిగా ఇష్టపడ్డాం అనుకో… అది దక్కలేదనుకో… అతిగా బాధపడాలి… అదే ప్రతీది లైట్‌గా తీసుకున్నాం అనుకో బాధ అన్నదే తెలియదు. నేను ఎమ్‌సెట్‌లో సీటు సంపాదించి… ఎలాగైనా డాక్టర్ అయిపోవాలని కలలు కన్నాననుకో… అది జరగలేదునుకో… ఈ రోజు నేను ఇలా ఉండేవాడిని కాదు… బాధపడుతూ డిప్రష్‌న్‌లోకి వెళ్ళిపోయి ఉండేవాడిని…”

“చాలు… చాలు… ఇక నువ్వేం చెప్పొద్దు… అసలు నీలో, నీ మనసులో నా గురించి ఏముందో తెలుసుకోవాలని అనుకోవడమంత బుద్ధి తక్కువ పని మరొకటి లేదు. నేను చెప్పవలసినది సిగ్గు ఎగ్గు లేకుండా చెప్పేస్తున్నాను… I love you Vasu… ఎంత అంటే చెప్పగలను… కొండంత… ఎందుకంట పిచ్చి అని నన్ను నేనే ప్రశ్నించుకుంటూ ఉంటాను… తిట్టుకుంటూ ఉంటాను కూడా… అందరూ చెబుతుంటారే… అఫ్‌కోర్స్ లవర్స్… ప్రేమ అని… యస్ కచ్చితంగా చెప్పగలను… నేను నిన్ను ప్రేమిస్తున్నాను వాసూ… నా మనసులో మాట చెప్పాను… కనీసం ఇప్పడైనా చెప్పు… నేనంటే నీకు ఇష్టమేనా?” అంది.

ఆశ్చర్యంగా చూసాడు.

“ఏంటి వాసూ!… ఏదో వినకూడని వార్త విన్నట్లు అలా అయిపోయావ్?… నేనంటే ఇష్టం లేదా?…”

“నువ్వంటే ఇష్టం లేకపోతే ఇన్నాళ్లబట్టీ నీతో ఫ్రెండ్‌షిప్ ఎందుకు చేస్తాను…”

వసుంధర మొఖం సంతోషంతో నిండిపోయింది…

“థాంక్యూ వాసూ… థాంక్యూ వెరీమచ్…”

“వసూ!… ఇష్టం ఉంటే ప్రేమ ఉన్నట్లా?… ”

“వాసూ! నువ్వింకేం చెప్పకు… ఇష్టంలో నుండే ప్రేమ పుడుతుంది…”

“లేదు వసూ!… తొందరపడకు… నన్ను ఆలోచించుకోనీయ్!… అయినా ఇప్పటి నుండి ప్రేమా పెళ్లి ఏమిటి?… ఇంకా చాలా సమయం ఉంది… ప్లీజ్!… వసూ!… ఎప్పటికీ… you are my best friend…”

“వాసూ!… నువ్వు కన్‌ఫ్యూజన్‌లో ఉన్నావు… you are loving me… ఇప్పుడు నాకు క్లారిటీ వచ్చింది… మనిద్దరికి ఒకరంటే ఒకరికి ఇష్టం ఉంది… అదే ప్రేమ… ఇప్పుడు నేనొక శపథం చేస్తున్నాను…”

కంగారు పడ్డాడు వాసుదేవ్. “శపధమా?… దేని గురించి…” అడిగాడు.

“మన ప్రేమ గురించి … నీ నోటితో నువ్వూ ‘I love you’” అని నాతో చెప్పేవరకూ… నేను ఈ విషయం గురించి మాట్లాడను…”

నవ్వూతూ అన్నాడు,  “థాంక్యూ!… చాలా మంచి నిర్ణయానికి వచ్చావు…”

కోపంగా చూసి బుంగమూతి పెట్టింది…

“సారీ వసూ!… నిన్ను ఏడిపించడానికి అలా అన్నాను.”

కోపంగా కుడి చేత్తో వాసుదేవ్ భుజం మీద ఒక దెబ్బ వేస్తున్నట్లుగా చెయ్యెత్తింది…. “చూడు… వాసూ!… మనిద్దరి జంట బ్రహ్మాండంగా ఉంటుంది… ఇద్దరం డాక్టర్లు అవుతాం… అన్నట్లు మన ఇద్దరి పేర్లు కూడా ఎంత బాగా కుదిరాయో చూడు… నేను వసూ.. నువ్వు వాసూ!… మన పెళ్ళి అయ్యేవరకూ… నిన్ను దేవ్ అనే పిలుస్తాను… అన్నట్లు మన వెడ్డింగ్ కార్డ్స్‌లో వసూ వెడ్స్ వాసూ అని వేయిస్తాను…”

“వసూ!… ఏంటి ఈ పిచ్చి అలోచనలు… అసలు ఒక ఆడపిల్ల… నీలా మాట్లాడుతుందా?… పెళ్ళి ఆలోచనలతో ఎం.బి.బి.ఎస్ ఎలా చదవగలవ్?… పోనీ ఒక పని చెయ్… చదువును ప్రక్కన పెట్టి పెళ్ళి చేసేసుకో.”

“దేవ్… అసలు ఈ పిచ్చి ఆలోచనలు ఇప్పుడు కాదు ఎప్పుడో మొదలయ్యాయి… ఏంటన్నావు?… ఒక ఆడపిల్ల ఇలా మాట్లాడుతుందా అని?… ఏం ఎందుకు మాట్లాడకూడదు… చేత్తో చున్నీ చుడుతూ తల దించుకొని… కాలి వేలితో నేల రాస్తూ సిగ్గుపడుతూ మాట్లాడాలా? అలా మాట్లాడడం నా వల్ల కాదు… అన్నట్లు చుదువును ప్రక్కన పెట్టి పెళ్ళి చేసుకో అన్నావు కదూ?… ఓకె నువ్వు పెళ్ళికి ఒప్పుకుంటే ఈ నిమిషంలో మన పెళ్ళికి ఓకె అంటూను… నువ్వు రెడీనా? అంది సీరియస్‌గా.

“ఓయమ్మో!… నిన్ను అర్జంటుగా డాక్టరుకి చూపెట్టాలి…” అన్నాడు కంగారుగా వాసుదేవ్…

“నన్ను కాదు… నిన్ను… ఇంత అందమైన అమ్మాయి తనంతట తానుగా… మనసులో మాట చెబుతుంటే… బెల్లం కొట్టిన రాయిలా… ఉలుకూ పలుకూ లేకుండా… అసలు… నీకో విషయం తెలసా? అబ్బాయి అమ్మయిని ఇష్టపడినా… అమ్మాయి అబ్బాయిని ఇష్టపడినా… లవ్ ప్రపోజల్ విషయంలో అబ్బాయే లవ్ ప్రపోజ్ చేస్తాడు… కాని మన విషయంలో అంతా రివర్స్… అయినా నిన్ను పట్టుకొని వేలాడుతున్నాను…”

“నేను చెప్పానా వేలాడమని” అన్నాడు నవ్వుతూ.

“అలా చెబితే బాగుండేది… నీ మీద ఇంట్రస్ట్ కూడా తగ్గిపోయేది…”

“ఓహో అర్థమయింది… మీ అమ్మాయిలు… అంతా రివర్స్‌లో ఆలోచిస్తారు కదా ? … అయితే రేపటి నుండి… కొందరి అబ్బాయిల్లా నీ వెంట పడతాను… అప్పుడైనా… పెళ్ళి… లవ్… టాపిక్‌లు మానేస్తావు.”

ఫకాలున నవ్వి అంది… “How I am lucky… ప్లీజ్!… అలా చేయవా?…”

కంగారుగా అన్నాడు – “అలా నీ వెంట పడితే నన్ను కేర్ చేయకపోదునన్నావు కదా?… మళ్ళీ ఇప్పుడు ఇలా అంటున్నావు ఎంమిటి?… నీకు నిజంగా క్రేక్.”

“కరక్టుగా చెప్పావు… నువ్వుంట నాకు పిచ్చి… క్రేక్…. నువ్వు అందరిలా కాదు దేవ్!… some thing special. నువ్వు నా వెంట పడినా, పడకపోయినా నువ్వు లవ్ చేస్తున్నా, చేయకపోయినా, నేను మాత్రం ఫిక్స్ అయిపోయాను దేవ్.”

“దేనికి ఫిక్స్ అయిపోయావ్” కంగారుపడ్డాడు వాసుదవ్…

“రామాయణం అంతా విని రాముడికి సీత ఏమవుతుందని అడిగినట్లు …. నా మనసులో ఫీలింగ్స్ అన్నీ నీతో షేర్ చేసుకుంటే… దేనికి ఫిక్స్ అయ్యావని అడుగుతావేంటి దేవ్!… పెళ్లంటూ చేసుకుంటే నిన్నే చేసుకుంటాను…”

“ఇదెక్కడి గోలరా బాబూ!…”

“ఎంత మాట అన్నావు? నిజం చెప్పు? నేనంటే ఇష్టం లేదా?…”

“ఎందుకు లేదు…you are my best friend…”

“థాంక్స్! ఈ ఒక్క మాట చాలు! నీ నోటిలో నుండి I love you vasu అనే వరకు ఎన్నాళ్లయినా వెయిట్ చేస్తాను…”

“వసూ!… ఇష్టం అంటే ప్రేమ అంటున్నావు ఏమిటి?”… చిరగ్గా అన్నాడు.

“దేవ్!… నువ్వున్నట్లు మనం పెళ్లి చేసుకునే స్థాయికి ఇంకా రాలేదు. కాని ఒక్కటి మాత్రం కచ్చితంగా చెప్పగలను… నేనంటే నీకు ఇష్టమే!… నేను నీ బెస్ట్ ఫ్రెండ్‌ని… ఇంతకన్నా కావాలసినది ఏముంది… ఇష్టంలోంచే ప్రేమ పుడుతుంది… స్నేహం లోంచి ప్రేమ పుడుతంది… ఎంతోమంది… మా ఆయన భర్తలా కాకుండా నాతో మంచి ఫ్రెండ్‌లా ఉంటాడని చెబుతుంటారు. ఇంత కన్నా క్లారిటీ ఇంకా ఏం కావాలి దేవ్!” అంది వసుంధర.

“నీ లాజిక్ నాకేంటో అర్థం కావడం లేదు… నేను నీలా క్లారిటీగా లేను…. ముందు మన చదువులు కానీయ్!… తరువాత ఆలోచిద్దాం…”

“ థాంక్స్! దేవ్!… ఆ మాట అన్నావు బాగుంది.”

“ దేవ్!… చాలా టైమ్ ఇచ్చాను… ఫ్లాష్ బ్యాక్ అంతా గుర్తువచ్చిందా?… చాలా తీసుకున్నావు. ఓకే… నీ కోసం కలలు కనడం… నువ్వు లాంగటర్మ్ తీసుకోని డాక్టరు కావాలని అనుకోవడం తప్పేం లేదు… ప్లీజ్… దేవ్… నేను చెప్పిన విషయం గురించి బాగా ఆలోచించు దేవ్” అన్నంతలో…

“వసూ!… అక్క ఫోను చేస్తుంది… మళ్ళీ నీకు ఫోను చేస్తాను… ” అని గభాలున ఫోను కట్ చేసి మంచం మీద వాలాడు…

‘మైగాడ్!… వసూకి పిచ్చి ముదురుతుంది. తగ్గించాలి… తనంటే అంత పిచ్చి ఏమిటి?… సమయానికి అక్క ఫోను చేస్తుందని అబద్దం చెప్పి ఫోను కట్ చేసాను… అయినా … వసూ తనని అంత లవ్ చేస్తుంటే తనకేం అనిపించదేమిటి ? అయినా వసూకి ఏం తక్కువ?… అందం ఉంది… బాగా చదువుతుంది… అన్నింటికన్నా, ముఖ్యమైనది… వసూ చాలా మంచిది… కాని…’ ఇలా సాగాయి వాసుదేవ్ ఆలోచనలు.

“నాన్నా వాసూ!… ఒక సారి ఇలా రా నాన్నా” అని సుమిత్ర కేకవేయడంతో వంట గదిలో ఉన్న సుమిత్ర దగ్గరకు వెళ్లాడు వాసుదేవ్.

“నాన్నగారు ఎక్కడమ్మా, బయటకు వెళ్లారా?…”

“లేదురా?… ఆయన మనసేం బాగుండలేదు…”

కంగారుగా చూసి అన్నాడు – “నా గురించేనా?… పాపం నాన్న… నేను డాక్టర్ అవుతానని చాలా ఆశపెట్టుకున్నట్లున్నారు…”

“ఛ!… నీ గురించి కాదురా!… ఆయన ఎప్పుడూ నీ గురించి ఏదీ గట్టిగా అనుకోరు… రాత్రుళ్ళు పగళ్ళు కష్టపడి చదవడం చూసి తప్పకుండా నువ్వు డాక్టరువి అవుతానవుకున్నాను… అయినా ఈ రోజుల్లో డాక్టర్లు పరిస్థితి ఏం బాగుండలేదు… ఎండి చదివిన అబ్బాయి… మన కాలనీలో హాస్పిటల్ పెడితే ఎవరూ వెళ్లడం లేదు… మన వెనకాల ఉన్న బస్తీలో ఎవడో ఆర్.ఎం.పి. డాక్టర్ అట… వాడు రెండు చేతుల సంపాదిస్తున్నాడు… ఇలా ఉంది లోకం…”

అమ్మ మనసు గొప్పది అంటే ఇదే కాబోలు… తనకి ఎం.బి.బి.యస్‌లో సీటు రాలేదని… తను బాధపడకూడదని అలా చెబుతుంది.

“అన్నట్లు అక్క చదువు పూర్తి అయినాక ఇండియా వచ్చేస్తుంది కదూ?… అక్కకి మంచి సంబంధం చూడాలి. ఏలూరు నుండి ప్రకాశం మావయ్య మంచి సంబంధం ఉందని ఫోను చేసాడు… ఇక నువ్వు బాగా చదువుకొని మంచి ఉద్యోగం తెచ్చుకుంటే మాకు అంత కన్నా కావలసినది ఏముంది?” అంది.

ఆశ్చర్యంగా తల్లి వైపు చూసాడు… స్టవ్ మీద ఉన్న కూర కలుపుతూ ఉంది.

అమ్మ మనసులో ఇన్ని ఆలోచనలు ఉన్నాయా?

“అమ్మా!… ఇంతలా ఆలోచిస్తున్నావు ఏమిటి? అక్కని పెళ్లిచేసుకోవడానికి అబ్బాయిలు క్యూ కడతారు. ఇక నేనంటావా?… నేను బాగా చదివి మంచి ఉద్యోగం తెచ్చుకుంటాను.”

“అయ్యో!… ఇదంతా నా ఆలోచనలు కాదురా… మీ నాన్న ఇప్పటి వరకు నాతో అన్న మాటలు… ఇంతకీ ఆయన బాధ అంతా ఎందుకనుకున్నావు? మీ నాన్న ఎంత సిన్సియర్‌గా ఉద్యోగం చేస్తారో నీకు తెలుసు కదా?… ఆయనతో పాటు ఉద్యోగం చేస్తున్న వాళ్లు కోట్లల్లో ఆస్తులు వెనకేసారు… నీతి నిజాయితీ మనిషికి ప్రాణం, ఊపిరి లాంటివిని నమ్ముతారు… కాని ఈ మధ్యన వచ్చిన ఎం.డి. సంతోషం మీ నాన్నని చాలా ఇబ్బంది పెటుతున్నాడు… వాడికి… రాత్రి అయ్యేటప్పటికి ముక్క, మందు కావాలట… ప్రతీ రోజూ ఆఫీసులో వంతుల వారిగా వాడికి పార్టీ ఇస్తునే ఉంటారుట… మీ నాన్న సంగతి తెలుసు కాదా ?… అలాంటివి ఒప్పుకోకపోవడంతో మీ నాన్న మీద పీకల దాకా కోపం పెట్టుకున్నాడట… లంచగొండులను. సరిగా వర్క్ చేయని వాళ్లని వదిలేసి మీ నాన్న మీద అయిన దానికి, కాని దానికి ఏదో ఒకటి అనడం చేస్తున్నాడట… పాపం అయినా మీ నాన్న పట్టించుకోలేదు… కాని ఇప్పుడు క్రొత్త సమస్య వచ్చిపడింది. మీ నాన్న కాన్ఫిడెన్షియల్ రిపోర్ట్ వాడే వ్రాస్తాడట… నా గురించి నువ్వు పట్టించుకోనప్పుడు… నీ గురించి నేను పట్టించుకోవాలా అన్నాడట… ఎంత దారుణం?… లోకంలో దుర్మార్గం ఎంతగా ప్రబలిపోయింది? మీ నాన్న బాధంతా… వాడు కాన్ఫిడెన్షియల్ రిపోర్ట్ బాగా వ్రాయకపోతే ప్రమోషన్ ఆగిపోతుంది…”

“ప్రమోషన్ రావడం వలన స్కేల్ పెరిగి జీతం చాలా పెరుగుతుందట… అంతే కాదు రిటైరయినప్పుడు చాలా బెనిఫిట్స్ వస్తాయట… రిటైరయినప్పుడు అందే డబ్బు చాలా ఎక్కవ రావడంతో పాటు పెన్షన్ చాలా ఎక్కువ వస్తుందట… ఒక్క ప్రమెషన్ వలన ఇన్ని బెనిషిట్స్ ఉన్నాయి. అక్క పెళ్లి, నీ చదువు… వీటన్నింటికి ఆ డబ్బు చాలా అవసరం… ఆ ఎండి చూస్తే కాన్ఫిడెన్షియల్ రిపోర్ట్ బాగా వ్రాసేటట్లు లేడని ఇప్పటి వరకు నాన్న తెగ బాధ పడ్డారు… పోనీ వాడు అడిగనందదో ఇచ్చేయండి, మీరు తాగకపోతే పోయారు అంటే… నేను మందు పోయాలా అంటున్నారు… కొన్ని కొన్ని చూసీ చూడనట్లు పోవాలంటే నా మాట వినరు…” అంది సుమిత్ర.

“ఎందుకు వినాలమ్మా?… ఏమైనా వాడు చేసేది మంచి పనేనా? సిగ్గు లేని వెధవ… నాన్నదే కరక్టు… కష్టపడి నిజాయితీగా పని చేస్తున్నందుకు ప్రమోషన్ ఇవ్వకుండా అడ్డుకుంటాడా?… వాడి పని అయిపోయింది…”

“పని అయిపోవడం ఏమిటిరా?” అంది కంగారుగా సుమిత్ర.

గబుక్కున అలా అన్నందుకు కంగారుపడి… “అంటే… నాన్నలాంటి మంచి మనిషిని బాధపెడుతున్నందుకు వాడికి ఏదో ఒకటి అవుతుందని అన్నాను” చెప్పాడు.

“వద్దులే నాన్నా!… అవన్నీ భగవంతుడే చూసుకుంటాడు” అంది.

ఒక్క నిమిషం తల్లి వైపు చూసాడు… తల స్నానం చేసి… తలకి తువ్వాలు కట్టుకొని పసుపు వ్రాసుకున్న మొఖం మీద ఎర్రని కుంకం… ఎర్రని జరీ చీర…. చేతుల నిండా పసుపు ఎరుపు గాజులతో.. అమ్మవారిలా కనిపించిది…

“అమ్మా!… నువ్వేం దిగులు పడకు… నేనున్నానుగా” అన్నాడు.

“నువ్వేం చేయగలవు నాన్నా!… ఆ భగవంతుడే వాడి కళ్లు తెరిపించాలి…”

తల్లికి దేవుడు మీద ఉన్న నమ్మకానికి జాలి పడుతూ… “అవునమ్మా… చూడు. త్వరలో వాడు కళ్లు తెరుచుకుంటాడు” అన్నాడు.

వాసుదేవ్ అలోచనలతో అటు ఇటు తిరుగుతూ నాన్న సిన్సియర్ వర్క్‌ని, నిజాయితీని మెచ్చుకోకుండా; నాన్న మనసుని బాధపెడుతున్నాడా? ఎం.డి. సంతోషంని ఆంజనేయ మంత్రం చదువుకునేలా చేయాలి. ఏం చేస్తే వాడు త్రోవలోకి వస్తాడు?… అమ్మ అన్నట్లు ఆ దేవుడే కళ్లు తెరిపిస్తాడని అనుకోవడం అవివేకం… అలానే అయితే దేశంలో అరాచకం, అవినీతి, అధర్మం… అడుగడుగునా అంటు వ్యాధిలా ఎందుకు వ్యాపిస్తుంది… నిజాయితీపరుడు నీడ లేకుండా అవినీతిపరుడు అందలం ఎలా ఎక్కగలడు?…

(సశేషం)

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here