జానేదేవ్-5

0
9

[box type=’note’ fontsize=’16’] ముమ్మిడి శ్యామలా రాణి గారు వ్రాసిన నవల ‘జానేదేవ్!‘ సంచిక పాఠకులకు ధారావాహికంగా అందిస్తున్నాము. ఇది అయిదవ భాగం. [/box]

[dropcap]“బా[/dropcap]బీ! … బాబీ… నిన్నే కార్లు వస్తాయి…. అదిగో స్కూలు బస్సు… మైగాడ్! పక్కకు వెళ్లు.”

“ఓ మైగాడ్!… స్వామీ… స్వామీ… నా బాబీకి ఏం జరగకుండా చూడు” అని పైకే గట్టిగా అంటూ పిచ్చి దానిలా కుక్కపిల్ల కోసం పరిగెత్తసాగింది ఓ అమ్మాయి.

ఈ అమ్మాయిని ఎప్పుడు ఈ వీధిలో చూడలేదు. ఆ అమ్మాయికి ఆ కుక్కపిల్ల అంటే చాలా ఇష్టం అనుకుంటాను. ఎదురుగా కార్లు, స్కూటర్లు, ఆటోలు వస్తున్నా… చూసుకోకుండా పరిగెడుతుంది…. తమ ఇంటికి ఎదురుగా ఉన్న పెద్ద బంగళా ఎదుట ఆగి ఉన్న ప్యాకర్స్ అండ్ మూవర్స్ వైపు చూసేంతలో ఇంచుమించు డెబ్బై ఏళ్ళ వయసున్న పెద్దాయన వాకింగ్ స్టిక్‌తో జాగ్రత్తగా నడుస్తూ గేటు దగ్గరకు వచ్చి, “స్వీటీ!… తల్లీ… జాగ్రత్త… శంకర్ ఎక్కడున్నావురా” అని గట్టిగా అరవడం… “అయ్యా సామానులు గదులో పెట్టిస్తున్నానయ్యా…” అని వాడు రోడ్డు మీద పరిగెడుతుండగా బాబీని ఎత్తుకొని ఎదురు వస్తున్న ఆ అమ్మాయిని చూసి సంతోషంగా… “వచ్చారా అమ్మాయిగారూ… అందుకే బాబిని కొంచెం సేపు చైనుతో కట్టేద్దాం అన్నాను…” అని శంకర్ అన్నంతలో… “చప్… నీకు చైను వేసి ఓ మూల కూర్చోబడితే ఎలా ఉంటుంది శంకర్… పాపం బుజ్జి ముండ… దాని మెడకి చైనా… “అని బాబీని ముద్దులాడుతూ లోపలికి నడిచింది ఆ అమ్మాయి.

క్రొత్తగా ఇంటిలోకి వచ్చినట్లున్నారు అనుకుంటూ బాల్కనీలో నుండి గదిలోకి వెళ్లాడు దేవ్.

***

రోజులు దొర్లుతున్నాయి… ఆ రోజు గురువారం… స్నానం చేసి వచ్చి హాలులో సోఫాలో కూర్చుని టివి ఆన్ చేసాడు. సాయిబాబా పూజ కార్యక్రమం వస్తుంది…

 “నాన్నా దేవ్… సోమవారం నుండి కాలేజీకి వెళతానన్నావు కదా… ఆపద నుండి బయటపడ్డావు… ఒకసారి గుడికి వెళ్లి వద్దాం… చెప్పులు వేసుకో నాన్నా” అంది సుమిత్ర.

“గుడికా!… నువ్వెళ్లిరా అమ్మా.”

“అదేంటి నాన్నా అలా అంటావు… ఆ భగవంతుడి అనుగ్రహం ఉండబట్టే ఆ దొంగవెధవలు నిన్ను ప్రాణాలతో వదిలారు… లేకపోతే… అయినా… రామనుజం శాస్త్రిగారు… నీ ఆరోగ్యం కుదుటపడినాక గుడికి తీసుకురమ్మన్నారు…” పూలు, కొబ్బరికాయ పట్టుకొని గుమ్మంలోకి నడిచింది.

నమ్మకాలను మనిషి బాగా నమ్ముతాడు. ఎవరు ఎన్ని చెప్పినా… నమ్మకాలకు బానిస అవుతాడు… అనవసరంగా అమ్మని బాధపెట్టడం ఎందుకు… వెళితే సరిపోతుంది అని అనుకొని చెప్పులు వేసుకొని బయలుదేరాడు వాసుదేవ్.

ఆ కాలనీ మొదటిలోనే సాయిబాబా గుడి ఉంది. గుడికి వెనకవైపు రామానుజం శాస్త్రిగారి ఇల్లు ఉంది… రామానుజం భార్య గాయత్రి మడిగట్టుకొని ఎంతో భక్తిగా గుడిని శుభ్రం చేస్తూ ముగ్గులు పెడుతూ, పూలు మాల కడుతూ కనిపిస్తుంటుంది. వాళ్లకు చాన్నాళ్ల వరకు పిల్లలు లేకపోవడంతో దిగులుగా ఉండేవారు… ‘నీ సేవలు చేస్తూ బ్రతుకుతున్నాం… మాకు ఒక బిడ్డను ప్రసాదించు లేదా మాకు నువ్వే బిడ్డవనుకొని నీకు సేవలు చేస్తూ మా జీవితం ముగిస్తాం’ అనుకునేవారు. వాళ్లకు ఒక పాప పుట్టింది… ఆ దేవుడు తమ మొర ఆలకించాడని సంబర పడిపోతూ సాయిపల్లవి అని పెరు పెట్టుకున్నారు.

సాయిపల్లవి చాలా మంచి అమ్మాయి. చాలా నెమ్మదిగా అణుకువగా ఉంటుంది… కుందనపు బొమ్మలా ఉన్న కూతురిని చూసి రామానుజం శాస్త్రి, గాయత్రి పొంగిపోతుంటారు… పదోతరగతికి వచ్చింది… స్కూలులో తన తరగతికి ఫస్టు మార్కులు తెచ్చుకుంటూ ఉంటుంది. డాక్టరవుతానంటుందమ్మా సాయిపల్లవి అని గుడికి వచ్చిన వాళ్లకి అడిగినా, అడగకపోయినా చెబుతుంటాడు రామానుజం శాస్త్రి.

గుడిలోకి అడుగుపెట్టారు సుమిత్ర, వాసుదేవ్. అప్పుడే అక్కడికు వచ్చిన సాయిపల్లవి కళ్లల్లో నీళ్లతో… “నాన్నగారూ!… ఎవరూ నాతో రాఖీ కట్టించుకోవడం లేదు… నా ఫ్రెండ్స్ కిరణ్, రవి లకు రాఖీ కట్టబోతే… నువ్వు మా బెస్ట్ ఫ్రెండ్వి… అలానే ఉండు… అని చిరాకుపడ్డారు. ఈ రాఖీ ఎవరికి కట్టను” అంది.

ఏం చెప్పాలో తెలియక ఆలోచించే లోపునే ఎదురుగా సుమిత్ర, వాసుదేవ్ కనిపించడంతో సంతోషంగా… “ఇదిగో తల్లీ… ఆ భగవంతుడే స్వయంగా అన్నయ్యను నీకు పంపాడు… అమ్మా… రండమ్మా… బాబూ బాగున్నావా… చాలా గొప్ప కార్యం చేసావు నాయనా… నలుగురు ఆడపిల్లల జీవితాలను కాపాడావు. ఇలాంటి మంచి కార్యాలు చేయడానికి నీకు శక్తి సామర్థ్యాలు భగవంతుడు ఇవ్వాలని ఆ సాయిబాబాని రోజూ వేడుకుంటాను” అన్నాడు రామానుజం శాస్త్రి.

ఏం మాట్లాడాలో తెలియక చిన్నగా నవ్వుతూ వాసుదేవ్ చూసేంతలో “అయ్యో… పంతులుగారు అలా అనకండి… వాడి నాన్నగారికి… ఇలాంటివి చేసి వాడి ప్రాణం మీదకు ఏం తెచ్చుకుంటాడో… బాగా చదువుకొని ప్రయోజకుడు కాకుండా భవిష్యత్ పాడు చేసుకుంటాడు ఏమో అని భయపడుతున్నారు” అని సుమిత్ర అంటుండగానే…

“అన్నయ్యా!… అని గభాలున వాసుదేవ్ చెయ్య పట్టుకొని “రాఖీ కడతానన్నయ్యా” అని గభాలున రాఖీ కట్టి… “నాన్నగారు చెప్పింది నిజం అన్నయ్యా… నిన్ను అప్పుడప్పుడు చూసినప్పుడల్లా… ఇలాంటి అన్నయ్య ఉంటే ఎంత బాగుండును అని అనిపించేది… నీతో మాట్లాడాలని కూడా అనిపించేది… కాని నువ్వు ఎటూ చూడకుండా దేవునికి దణ్ణం పెట్టుకొని వెళ్లిపోయేవాడివి… ఒకటి రెండు సార్లు మీ ఇంటికి కూడా వచ్చి నీ కోసం చూసాను ఆంటీ నువ్వు ఇంట్లో లేవని చెప్పారు… నాకు ఇప్పుడు చాలా సంతోషంగా ఉందన్నయ్యా” అని గలగలా మాట్లాడింది సాయిపల్లవి.

నవ్వుతూ చూసి మరి “ఇన్ని రోజులు ఎంతుకు అన్నయ్యా అని పిలవలేదు…” అన్నాడు.

“మొన్నటిదాక అమ్మమ్మగారి ఊరిలో ఉంది కదు బాబూ… శలవులకు వచ్చేది… అమ్మా, నాన్నా పెద్దవాళ్లు అయిపోయారు… అందుకు సాయి పల్లవిని ఇక్కడ స్కూల్లో జాయిన్ చేసాను…” అన్నాడు రామానుజం శాస్త్రి.

“ఉండండి శాస్త్రిగారు… అన్నకి రాఖీ కట్టింది. బహుమతి ఇవ్వొద్దు… చూస్తూవేమిటరా… బహుమతి ఇవ్వు… డబ్బు ఇస్తే ఏమైనా కొనుక్కుంటుంది” అని సుమిత్ర అనగానే గభాలున జోబులో వాలెట్ కోసం చెయ్యి పెట్టి వాలెట్ పెట్టుకోవడం మర్చిపోయానని ఏదో ఆలోచన వచ్చిన వాడిలా… గభాలున చేతి వైపు చూసి వేలుకి ఉన్న సాయిబాబా ఉంగరం తీసి… సాయి పల్లవికిచ్చాడు వాసుదేవ్.

“అదేంటి బాబూ!… నీకు మెడిసిన్లో సీటు రావాలని ఆ ఉంగరం పూజలో పెట్టించి నీకు ఇచ్చారు అమ్మ. బహుమతికి ఏముంది బాబూ… ఇక నీతో మాట్లాడిందిగా మీ ఇంటికి సాయిపల్లవి వస్తూనే ఉంటుంది” అన్నాడు..

“ఏంటి అన్నకి మెడిసిన్ సీటు రావాలని చేయించిన సాయిబాబా ఉంగరమా… అయితే ఈ ఉంగరం నాకు కావాలి… నేను తప్పకుండా డాక్టరు చదివి అగ్రహారంలో డా.సాయిపల్లవి అని బోర్డు పెట్టి అందరికి మందులు ఇస్తాను అంది సంతోషంగా…

“తప్పకుండా నీకు వస్తుందమ్మా… ఇంత చిన్నప్పుటి నుండే డాక్టరు కావాలని నిర్ణయంచుకున్నవు… చాలా సంతోషం” అంది సుమిత్ర.

“అవును సాయీ!… పట్టుదల ఉంటే మనిషి ఏదైనా చేయగలడు… నిజం చెప్పాలంటే నేను డాక్టరు కావాలని అమ్మ, నాన్నా అనుకున్నారు. కాని మనస్పూర్తిగా నేను డాక్టరు కావాలని ఎప్పుడూ అనుకోలేదు… నువ్వు తప్పకుండా డాక్టరువి అవుతావు” అన్నాడు.

 “థాంక్స్ అన్నయ్యా…” అంది సంతోషంగా సాయిపల్లవి .

“చాలా సంతోషం బాబూ!… భగవంతుడి పాదాల దగ్గర పెట్టి ఆశీస్సులు పొందిన ఉంగరం ఫలితం ఇవ్వలేదని… నా పూజలో పొరపాటు దొర్లిందా అని భాదపడ్డాను… ముందు, వెనుకా అయినా భగవంతుడు అనుగ్రహిస్తాడని నమ్మే మనిషని నేను…” అన్నాడు రామానాధం శాస్త్రి.

ఇంటికి బయలుదేరారు సుమిత్ర, వాసుదేవ్.

“చూసావా నాన్నా!… తల్లిదండ్రులకు బిడ్డల మీద మమకారం పాలు ఎంత ఎక్కువగా ఆ భగవంతుడు పెట్టాడో… అయనో చిన్నపొరపాటు కూడా చేసాడు.”

“ఏంటమ్మా?” ఆశ్చర్యంగా చూసాడు…

“నా ఫ్రెండ్ విమలకి ఒక్కడే కొడుకు… నెలలు నిండకుండానే పుట్టాడు. వాడిని బ్రతికించడం కోసం… తన శక్తినంతా ధారపోసి హాస్పటల్స్ చూట్టూ తిరిగి కొడుకుని బ్రతికించుకుంది… భర్త చుట్టాలు, అందరూ ‘నీ ఆరోగ్యం పాడైపోతుంది పీనుగులా అయిపోయావు… అయుష్షు ఉంటే బ్రతుకుతాడు… అయినా నీకు మళ్లీ పిల్లల్లు పుడతారు కదా…’ అని అంటున్నా ఎవరి మాట వినకుండా పెంచి పెద్ద వాడిని చేసింది… వాడు ప్రయోజకుడు అయి పెళ్లి చేసుకొని… అమ్మ నాన్న ఉండడానికి పెళ్లాం ఒప్పుకోవడం లేదని… ఓల్డేజ్ హోమ్‌లో పడేసాడు… ‘నా అడ్రస్సు మారింది సుమిత్రా… నీకు ఎప్పుడైనా తీరిక దొరికితే నా దగ్గరకు వస్తావు కదూ’ అంది విమల. పిల్లల పట్ల తల్లిదండ్రులకు అంత మమకారం పెట్టిన దేవుడు. తల్లిదండ్రుల పట్ల పిల్లలకు అంత ద్వేషం ఎందుకు పెట్టాడు… దేవుడు కూడ పొరపాటు చేసినట్లే కదా?”

చివరి మాటలు అంటున్నప్పుడు సుమిత్ర కళ్లు కన్నీటితో నిండాయి… మళ్లీ సుమిత్ర అంది.

“చిన్నా! విమల దగ్గరకు వెళ్లాలని ఉంది… దానితో కొంచెం సేపు గడపాలని ఉంది… అన్నట్లు దానికిష్టమైన కేసరి స్వీటు చేసి పట్టుకెళ్లాలి… ఇప్పుడు నీ ఆరోగ్యం బాగుందిగా… నువ్వు కాలేజికి వెళ్లాక నేను విమల దగ్గరకు వెళతాను” అంది…

“అమ్మా!… ఇంకా రెండు రోజులు అగడం దేనికమ్మా ఈ రోజే వెళదాం… నేను తీసుకువెళ్లనా” అన్నాడు .

“నువ్వా?…. నీకెందుకు నాన్నా శ్రమ.”

“శ్రమ అంటావేమిటమ్మామా? అమ్మని సంతోషంగా ఉంచడం నా బాధ్యత కదా.”

కొడకు పట్ల ప్రేమ పొరులుతుండగా వాసుదేవ్ వైపు చూసింది.

“అమ్మా… ఆంటీ నువ్వూ బాగా క్లోజా?”

“అవును నాన్నా… ఎలా అంటే వసూ చిన్నప్పటి నుండి నీ వెంటపడి తిరిగేది… ఆదివారం స్కూలు లేకపోతే ఏదో మిష పెట్టి మనింటికి వచ్చేసేది కదా… అచ్చం అలాగే విమల నాతోనే ఉండేది” అంది.

అమ్మ బ్రతికిపోయింది, వసూ మాగ్నెట్‌లా తనని అతుక్కుపోవాలని చూస్తుంది… చిన్ననాటి ఫ్రెండ్ అనుకున్నాడు… కాని ఫ్రెండ్‌షిప్ లోంచి ప్రేమ పుడుతుందని వాదిస్తుంది… వాదించే కొలది చిరాకు పుడుతుంది కాని కోపం రావడం లేదు. తన ఫ్రెండ్‌షిప్ వదులుకోవాలనిపించలేదు. ఇలాంటి ఫీలింగ్నే ప్రేమ అంటారా. చస్… ఇలా ఆలోచిస్తున్నాను ఏమిటి.

“నాన్నా!… దేవ్!… కాలేజిలో అనవసరమైన విషయాల జోలికి వెళ్లకు… డిగ్రీ మంచి మార్కులతో పాసైతే సివిల్ ఎగ్జామ్స్ వ్రాయవచ్చట కదా?”

తల్లి మాటలతో ఆలోచనల నుండి బయటకు వచ్చాడు వాసుదేవ్.

“ఏంటి నాన్నా! ఆలోచిస్తున్నావు? సారీ నాన్నా… నీ మీద చాలా ప్రెజర్ పెడుతున్నాం. మనిషి సమాజంలో గౌరవప్రదంగా, సుఖసంతోషాలతో బ్రతకాలంటే ఏదో ఒక జీవిత లక్ష్యం ఏర్పరుచుకోవాలి. ఆ లక్ష్యం సాధించడానికి మనిషి కష్టపడాలి… చెప్పడానికి బాధగా ఉన్నా చెప్పకతప్పడం లేదు నాన్నా” అని ఇల్లు రావడంతో గేటు తీసుకొని లోపలకి నడిచి తాళం తీసి హాలులోకి నడిచింది.

“అమ్మా!… నేనొకటి అడుగుతాను… కరెక్ట్ సమాధానం చెప్పాలి… తరువాత నువ్వు అడిగినదానికి సమాధానం చెబుతాను” అన్నాడు నవ్వుతూ వాసుదేవ్…

“ చెప్పు నాన్నా!..” అంది.

“ఇదేనమ్మా! ఇంత ప్రేమగా ఎప్పుడూ ‘నాన్నా’ అని అంటావు ఎందుకు.”

ఒక్క క్షణం కొడుకు కళ్లలోకి చూసింది… కళ్లల్లో తడి చోటు చేసుకుంది…

ప్రతీ మనిషికి మొట్టమొదటి బంధం… అమ్మా, నాన్నా. ఆ బంధం తరువాతే అన్ని బంధాలు… నేనొక్కదాన్నే మా అమ్మ, నాన్నలకు. అమ్మా నాకు పదేళ్ళప్పుడే కేన్సర్ వచ్చి చనిపోయింది… మళ్లీ పెళ్లి చేసుకుంటే వచ్చే ఆవిడ నన్ను కష్టపెడుతుందేమో అని నాన్న మరి పెళ్లి చేసుకోలేదు… నాతోనే తన జీవితంలా నన్ను అల్లారు ముద్దుగా పెంచారు… నేనంటే నాన్నకి ప్రాణం… నాన్నా… నాన్నా అని అంటూ ఒకటికి పదిసార్లు పిలుస్తూ ఉండేదానిని… అందరూ నాన్న కూచి అనేవారు… అంత ప్రాణపదంగా చూసుకునే నాన్నని భగవంతుడు తీసుకు వెళ్లిపోయాడు.

నువ్వు నా ఒడిలోకి వచ్చిన వెంటనే ఎంతో బాధలో ఉన్ననా మనసుకి పట్టరాని సంతోషం కలిగింది… సంతోషంగా నిన్ను హృదయానికి హత్తుకున్నాను… అనుకోకుండా ‘నాన్నా…’ అని పిలిచాను… నిజం చెప్పాలంటే నువ్వు పుట్టాక నాన్న లేరన్న బాధ ఎటో పోయింది… నాన్నా అని నిన్ను పిలుచుకుంటూ ఉంటే నా మనసుకి ఎంతో సంతోషం… నువ్వడిగిన ప్రశ్నకి కరక్ట్‌గానే సమాధానం చెప్పాననుకుంటున్నాను.”

“అమ్మా!… నీ మనసు అర్థం అయింది… నా గురించి మీరు ఎప్పుడు బాధపడేలా నడుచుకోను… నేను బాగా చదువుకొని మంచి ఉద్యోగం తెచ్చుకుంటాను.”

“చాలా సంతోషం నాన్నా… ఈ మాట నాన్నతో చెబుతాను…”

కంగారుగా అన్నాడు.

“వద్దు అమ్మా… కొన్ని విషయాలు ముందుగా చెబితే బాగుండవు…”

“సరే నాన్నా…” అంది.

కాలేజికి వెళ్లి వస్తున్నాడే కాని వాసుదేవ్ ఆలోచనల నుండి ఎండి సంతోషం తప్పించుకోలేకపోతున్నాడు.

‘ఇతరుల జీవితాలతో ఆడుకుంటూ నువ్వు సంతోషంగా ఉంటానంటే ఎలాగ సంతోషం. నీ సంతోషం… షేడ్ చేయాలంటే ఏం చేయాలి. మా నాన్నగారి ఒక్కరి సమస్యే కాదు… నీలాంటి బాచ్ వాళ్లకి ఓకే. పాపం తక్కిన వాళ్ల సంగతి… లాభం లేదు సంతోషం… త్వరలోనే నీ సంతోషానికి ముగింపు పలికేసి ఓ మూలన కూర్చోబెట్టి సంతోషం ఏంటి ఇంత విచారంగా ఉన్నాడని అందరూ అనుకునేలా చేయాలి’.

“నాన్నా! దేవ్! భోజనానికి రా” అని సుమిత్ర పిలవడంతో గదిలో నుండి వచ్చి డైనింగ్ టేబిల్ దగ్గర కూర్చున్నాడు. ఎదురుగా నిరంజనరావు కూర్చోని… “ఎలా ఉందిరా కాలేజి” అన్నాడు.

“బావుంది నాన్నగారు.”

చిన్నగా నవ్వి అన్నాడు నిరంజనరావు.

“బావుంటుంది కాలేజి… ఎందుకు బావుండదు నేనడిగింది చదవు ఎలా ఉంది.”

“ఓ అదా, నా కిష్టమైన సబ్జెక్టులు చదవడం చాలా హేపీగా ఉంది.”

“అలాంటప్పుడు ఈ విషయాం ముందే చెప్పలేకపోయావా.”

“అదీ… అమ్మ నేను డాక్టరు కావాలని…”

ఇంకా వాసుదేవ్ మాట పూర్తి కానేలేదు…

“నాకు నువ్వు ఐఎఎస్ కావాలని ఉంది… అయిపోతావా.”

ఏం మాట్లడాలో తెలియని వాడిలా ఒక్క నిమిషం మౌనం వహించాడు.

“సరేలెండి… ఎప్పుడూ అర్థం కాకుండా మాట్లాడుతారు… అసలు వాడిని ఎప్పుడు అర్థం చేసుకుంటారో” అంది సుమిత్ర…

“నాకు అర్థం కాకపోయినా పరవాలేదు… నీకు అర్థం అయిందిగా…”

“సరే లెండి… అన్నట్లు పై వీధిలో వెంకటయ్యగారి ఇంట్లో… దొంగలు పడ్డరట… ఎవరో ఇద్దరు దొంగ వెధవలు అడ్రస్ కావాలని రెండు, మూడు సార్లు వెంకటయ్యగారింటికి వెళ్లి రెక్కీ నిర్వహించారట.”

“ఆనూ పానూ తెలుసుకొని అర్థరాత్రి ఇంటిలో చొరబడ్డారు…”

“ఈ వీధిలో ఉండి పై వీధిలో సమాచారం నీకెలా తెలిసింది.”

“ఎలా? ఏమిటండి మన పనిమషి వదిన వెంకటయ్యగారిట్లో పని చేస్తుందట… ఇది అంతా ఎందుకు చెప్పానంటే… దొంగ వెధవలు పగలు రెక్కీ నిర్వహించి రాత్రుళ్లు దొంగతనాలకి వస్తున్నారట… మీరు తెల్లారగట్లే లేచి గార్డెన్లో తిరుగుతుంటారు… ఏ వెధవైనా… ఏ అడ్రసో కావాలని… మీతో మాటలు కలపగలడు… జాగ్రత్త… తలుపులు వేయండి… లోపల దూరగలడు” అంది సుమిత్ర.

“ఉహు… నాకు చెప్పడం కాదు… ఏ జానాభా లెక్కలనో, నెట్ రావడం లేదని కంప్లయిట్ ఇచ్చారనో, లేకపోతే ఆధార్ కార్డు వెరిఫికేషన్ అనో ఏదో ఒకటి చెప్పి వస్తే… వచ్చిన వాళ్లకి నీళ్లు, కాపీలు, టీలు ఇవ్వడం అలవాటు… చూసుకో…” అన్నాడు నిరింజనరావు.

వాసుదేవ్‌కి వాళ్ల మాటలు ఏవీ వినిపించడం లేదు… రెక్కీ… ఆ మాటే చెవిలో గింగురుమంటున్నాయి… ‘థాంక్స్ అమ్మా… నువ్వు ఆ టాపిక్ తేవడం మంచిదయింది…’ అనుకున్నాడు

“నాన్నా! దేవ్!… ఇదిగో లంచ్ బాక్స్… నీకిష్టమైన ఆలూ పరోటా, ఎగ్ పెట్టాను… ఫ్రెండ్స్ కిచ్చేసి కడుపు మాడ్చుకోకు… ఆపరేషన్ కూడా అయింది” అని టేబిల్ మీద పెడుతూ అక్కడ లంచ్ క్యారియర్ చూసి కంగారుగా అంది..

“వయసు పెరుగుతున్న కొలది ఆయనకి మతిమరుపు పెరిగిపోతుంది… పోనీ ఆఫీసు క్యాంటిన్ నుండి తెప్పించుకుంటారా అనుకుంటే బయట ఫుడ్ తినడానికి ఇష్టపడరు” సుమిత్ర అనకున్నంతలో… అంతా విన్న వాసుదేవ్… “అమ్మా నాన్నగారికి లంచ్ ఇచ్చేసి కాలేజికి వెళతాను” అని లంచ్ బాక్స్ తీసుకొని బయలు దేరాడు.

ఆఫీసులో అడుగు పెట్టేటప్పటికి అటెండర్ సైదులు ఎదురయ్యాడు… గబాలున వాసుదేవ్ చేతిలో లంచ్ క్యారియర్ తీసుకొని… “బాగున్నారా సార్… సార్ గారి గదిలో పెడతాలెండి…” అన్నాడు.

“థాంక్స్ సైదులూ… నాన్నగారు…” అనేంతలో

“మీటింగ్ జరుగుతుంది బాబూ… ఉన్నాడు కదండి ఎండి… మహానుభావుడు… అందరిమాట అలా ఉంచండి… వాడి నోరు తడపడం లేదని సార్ గారిని ఇబ్బంది పెడుతున్నాడు… వీడు ఇలాంటి వాడు, కాని పాపం అమ్మగారు దేవతండి… ఆ తల్లికి వీడి వేషాలు తెలియదు” అని ఏదో గుర్తు వచ్చిన వాడిలా… “అయ్యో క్షమించు బాబూ ఎండిగాడి ఆగడాలు ఎక్కవయిపోతున్నాయి… పండగ వస్తుందని లోను పెట్టుకుంటే… లోను శాంక్షన్ చేసాను… పార్టీ లేదా అని అడిగిన నీచుడు” అన్నాడు.

గభాలున అటు ఇటు చూసి “సైదులూ… ప్రతీ దానికి… ఏదో పరిష్కారం ఉంటుంది… ఆ పరిష్కారం ఏదైతే సూదంటురాయిలా ఎండికి తగులుతుందో మనం ఆలోచించి వాడి ఆట కట్టాలి. నువ్వు నాకు హెల్ప్ చేస్తే… ఎండి సంతోషం అందరి మీద మందు ముక్క కోసం ఆధారపడి పబ్బం గడుపుకుంటూ ఎంజాయ్ చేస్తున్నావాడిని… కాలు విరిగిన కుక్క కుయ్యో మొర్రో అంటున్నట్లు, వీడిని ఓ మూల కూర్చోబెడతాను” అన్నాడు వాసుదేవ్.

“అయ్యో బాబూ… వీడి గురించి మీకు పూర్తిగా తెలియలేదు… దేవుడి లాంటి మనిషి మీ నాన్నగారు ఇంట్లో చెప్పి ఉండరు. మందు ముక్కే కాదు మగువల పిచ్చి కూడ ఉంది… ఆఫీసులో ఆడవాళ్లను ఏదో ఒక వంకతో తన కేబిన్లోకి పిలిపించుకొని వెకిలి మాటలు ఆడి లైన్లో పెట్టాలని చూస్తాడు… కొందరు అపరకాళికల అవతారం ఎత్తి వాడి రెండు బుగ్గలు బూరెల్లా వాయగొట్టిన వాళ్లు ఉన్నారు… వార్నింగ్ ఇచ్చిన వాళ్లు ఉన్నారు… ఈ మధ్యన ఆడవాళ్ల పరువు తీసే జాస్మిన్ అనే వాడి పిఎ చెట్టాపట్టాలేసుకొని వాడితో తిరుగుతుంది. మేడమ్ దేవత… పూర్వకాలం మనిషి… పతియే ప్రత్యక్షదైవం అనుకునే ఇల్లాలు… వీడి పాపం ఎప్పుడు పండుతుందో బాబూ.”

“కంగారుపడకు సైదులూ వాడి పాపం పండే రోజు స్టార్ట్ అయింది.”

“ఎలా బాబూ!…” అన్నాడు కంగారుగా సైదులు…

“ఎలాగో తెలుసుకోవాలంటే నువ్వు… ఆఫీసైనాక నేను చెప్పిన చోటుకి వస్తే… అంతా చెబుతాను…”

 “తప్పకుండా వస్తాను బాబూ… కాని వాడు మహాముదురు… కుక్క వాసన పసిగట్టినట్లు… వాడు… తన చుట్టూ ఏం జరుగుతుందో ఒక కంట కనిపెడుతూనే ఉంటాడు. అసలు విషయం బయటపడిందనుకోండి… అసలే నా ఉద్యోగం పర్మనెంట్ కాలేదు… ఇప్పటికే నాతో ఇక్కడ ఇంటి దగ్గర గొడ్డు చాకీరీ చేయించుకుంటున్నాడు నిమిషాల్లో పీకి పారేస్తాడు.”

“నువ్వు అనవసరంగా భయపడకు సైదులూ… అసలు ఎట్టి పరిస్థితుల్లో నీ పేరు బయటకు రాదు… అన్నట్లు ఇందాక ఏమన్నావు కుక్కతో వాడిని పోల్చకు… మా నాన్నలాంటి ఎందరో మంచి మనుషులను ఏడిపిస్తున్నవాడిని విశ్వాసం గల కుక్కతో పోల్చకూడదు…”

“అవును బాబూ నువ్వు చెప్పింది కరక్టే… జిత్తులమారి నక్కలాంటివాడు…”

“సరే…” అన్నాడు నవ్వుతూ…

ఇంటికి వచ్చిన వాసుదేవ్… హాలులో సోఫాలో మౌనంగా కూర్చోని చేతి మీద గడ్డం ఆన్చి కళ్ళు మూసుకొని ఉన్న తండ్రి వైపు చూసాడు.

మనసుకి బాధపెట్టే విషయం జరిగితే ఎవరితో మాట్లాడకుండా మౌనంగా కూర్చుంటారు నాన్నగారు… ఏం జరిగింది. ఎం.బి.బి.యస్.లో జాయిన్ కాకుండా డిగ్రీలో జాయిన్ అయ్యానని బాధపడుతున్నారా… నా భవిష్యత్ ఎలా ఉంటుందో అని ఆలోచిస్తున్నారా… ఈ మధ్యన బాగానే ఉంటున్నారు… ఆలోచనలతో తన రూమ్‌లోకి వెళ్లి బ్యాగ్ టేబిల్ మీద పెట్టి ఫ్రెషప్ అయి తల్లి కోసం చూసి… వంటింటిలోకి నడిచాడు.

స్టవ్ మీద చపాతీలు కాలుస్తోంది సుమిత్ర.

“అమ్మా” అన్నాడు.

వెనక్కి తిరిగి చూసింది.

“నాన్నగారు అలా ఉన్నారు ఎందుకు? ఏదైనా ప్రాబ్లమా? నా గురించి కాదు కదా?”

“ఛ!… ఛ!… అవేం మాటలు నాన్నా… ‘వాడు గట్టి ప్రయత్నం చేస్తే వాడు అనుకున్నది సాధించగలడు… ఎందుకో తెలియదు కాని… ఏదో ఒకటి సాధించి జీవితంలో పైకి వస్తాడనిపిస్తుంటుంది సుమిత్రా’ అని అన్నారు.

చిన్నగా నవ్వాడు… “నమ్మమంటావా అమ్మా.”

“అయ్యో… వట్టినే చెబుతున్నానుకున్నావా. నా మీద ఒట్టు” అని… “కాదు కాదు నీ మీద ఒట్టు… ఏ తల్లి కైనా పిల్లల మీద ఉన్నంత ప్రేమ మరెవరి మీద ఉండదు…”

“సారీ అమ్మా… సరే… నా గురించి కాదు, అయితే దేని గురించి నాన్న అలా ఉన్నారు?”

“చెప్పాను కదా? నాన్నగారి ఎండి సంతోషం… ఈసారి గట్టిగానే అడిగాడట… ‘నీ కాన్ఫిడెన్స్ వ్రాయాలా వద్దా. నేనెమైనా లంచం లక్షలడిగినా… నా నోరు తడపవయ్యా, కాస్త నాకు కిక్ వచ్చేటట్లు చూడవయ్యా అని అడిగాను… అన్నట్లు ఇప్పటి వరకు నాకు బాకీ పడ్డ పార్టీలన్నీ కౌంట్ చేస్తూనే ఉన్నాను… అన్నీ కలిపి సమర్పించుకో… నేను బ్రహ్మాండంగా నీ కాన్పిడెన్స్ వ్రాసి పడేస్తాను… చిన్న ఇష్యూని పెద్దది చేయకు’ అన్నాడట… వాడు అడిగినట్లు చేయడం ఇష్టం లేక ప్రమోషన్ వదులు కోవడం బాధనిపించి అలా ఉన్నారు. నాన్న సంగతి తెలుసు కదా కాసేపు అలా ఉంటారు…” అంది.

“నాన్నగారు అలా ఉన్నారని నువ్వు బాధపడకు నాన్నా. అంతా మంచే జరుగుతుంది… షిరిడీ వస్తానని మొక్కుకున్నాను కూడ… ఆ భగవంతుడే ఎండి సంతోషంకి బుద్ది వచ్చేలా చేస్తాడని ఆశపడుతున్నాను.”

గభాలున తల్లి మొఖంలోకి చూసాడు. ఆ కళ్లల్లో దేవుని పట్ల అపారమైన నమ్మకం కనబడుతుంది.

ఏ మనిషికైనా నమ్మకం కలిగించడానికి అవతల మనిషి కష్టపడాలి కాని… అపనమ్మకం కల్గించడం చాలా సులువు…

“నిజం అమ్మా… నీ నమ్మకం ఖచ్చితంగా నిజం అవుతంది.”

(సశేషం)

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here