జానేదేవ్-6

0
10

[box type=’note’ fontsize=’16’] ముమ్మిడి శ్యామలా రాణి గారు వ్రాసిన నవల ‘జానేదేవ్!‘ సంచిక పాఠకులకు ధారావాహికంగా అందిస్తున్నాము. ఇది 6వ భాగం. [/box]

[dropcap]సం[/dropcap]తోషం అద్దం ముందు నిలబడి ఒకటికి రెండుసార్లు తన రూపం చూసుకున్నాడు… కనుబొమలు చిట్లించి చూసుకున్నాడు… కరక్టే!… తలలో తెల్ల వెంట్రుకలు కనబడుతున్నాయి. అదేంటి ఇంకా వారం రోజులు కాలేదు… అప్పుడే డై పోతుందా? అని గభాలున బ్లాక్ పెన్సిల్ తీసి టచప్ ఇచ్చేసి…. ఒకసారి మరల అద్దంలోకి చూసుకొని మళ్లీ కనుబొమలు చిట్లించాడు.

ముఖంలో ముదరతనం కనిపిస్తుంది… కాస్త బుగ్గలు కూడ జారినట్లు అనిపిస్తన్నాయి… పొట్ట కూడ నేను ఉన్నానన్నట్లు టకప్ లోంచి కనబడుతుంది… ‘లాభం లేదు… జిమ్‌కి వెళ్లాలి లేకపోతే లేడీస్ ముందు తన పప్పులుడకవు… ప్చ్ ఇదే హీరోలైతే ఏ లండనో… యూరప్పో వెళ్లి అన్నీ సరి చేసుకుంటారు’ అని అనుకుంటూ టై సరి చేసుకున్నాడు.

“అబ్బా… ఏంటండీ… అవన్నీ మనకి అవసరమంటారా… కూతురు పెళ్ళయి అమెరికాలో ఉంది. దానికి కూతురు కూడ పుట్టి మిమ్మలను తాత, నన్ను అమ్మమ్మ చేసింది… ఈ వయసులో తలకి రంగులు…. టచప్‌లు చేసుకుంటే చూసేవాళ్లకి బాగుండదు” అంది అనసూయ.

“అనూ… ఉష్… గట్టిగా అనకు… కాలం మారిపోయింది… ఊరిలో ఉన్నదానివి. ఊరి మాటలే మాట్లాడతావు. నేను పెద్ద కంపెనీకి ఎం.డి.ని… ఫారిన్ నుండి పెద్ద పెద్ద సిటీల నుండి పెద్ద బిగ్‌షాట్స్ వస్తుంటారు… నేను స్మార్ట్‌గా హేడ్‌సమ్‌గా… నీట్‌గా ఉండాలి… నా కిష్టం లేకపోయినా… కంపెనీకి వచ్చే విఐపిలకు పార్టీలియ్యడం… అలాంటి వన్నీ చేయాలి. నేను తెల్లజుత్తు వేసుకొని… చమట కంపుతో ఆఫీసుకి వెళ్లానుకో నన్నెవరూ కేర్ చేయరు… Try to understand me” అని గభాలున అనసూయ దగ్గరకు వెళ్లి బుగ్గ మీద చిటిక వేసాడు సంతోషం.

“అయ్యో రామా!… ఎంత పని చేసారండి… కార్తీక పౌర్ణమి గుడికి వెళదామని స్నానం చేసి రెడీ అయ్యాను.”

పకపకా నవ్వి అన్నాడు.

“ఈ మాత్రం దానికే అపవిత్రం అయిపోతావా… అయినా ఆ దేవుడు నా భార్యని తాకొద్దనడానికి ఎన్ని గుండెలు.”

చంపలు వాయించుకొని… “అలా అనకండి… కాస్త నన్ను గుడి దగ్గర డ్రాప్ చేయండి… దీపాలు వెలిగించాలి.”

“విత్ ప్లెజర్ మేడమ్…”

ప్రేమగా అంది… “నేను చాలా అదృష్టవంతురానినండి… మీ లాంటి దేవుడి లాంటి భర్తని ఆ భగవంతుడు ఇచ్చాడు. పెద్దగా చదువుకోకపోయినా… నన్ను పెళ్లి చేసుకున్నారు… జన్మజన్మలకి మీరే నా భర్త కావలండి… అందుకే నేను ఎప్పుడూ పూజలు చేస్తాను” అంది…

‘పిచ్చిదానా!… ఊరినుండి వచ్చావు కాబట్టే ఊరి మీద నేను ఎన్ని వేషాలు వేస్తున్నా ఊ… ఆ… అనకుండా ఊరుకుంటున్నావు… సారీ అనూ… వచ్చే జన్మంటూ ఉండి… నేను మగాడిగా పడితే నార్త్ ఇండియన్ హీరోయిన్ లాంటి దానినే పెళ్లి చేసుకుంటాను. నా జన్మ ధన్యమయిపోతుంది’ మనసులో అనుకున్నాడు.

“ఏంటిండి…. అంత దీర్ఘంగా ఆలోచిస్తున్నారు? జన్మజన్మలకు అనసూయే నా భార్య కావాలనుకుంటున్నారు కదూ… మీ మనసు నాకు తెలుసండి అంది.”

పొలమారాడు సంతోషం… కొంత మంది మనుషులు వలన… వాళ్లడిగిన ప్రశ్నకి సమాధానం ఏం చెప్పాలో తెలియనప్పుడు వాళ్లే సమాధనం కూడా చెప్పేస్తారు… థాంక్ గాడ్… అనుకున్నాడు సంతోషం.

***

మోటారు బైక్ మీద కాలేజికి బయలుదేరాడు వాసుదేవ్. సిగ్నల్ పడడంతో ఆగాడు… సడన్‌గా ప్రక్కనే వచ్చి మెడికల్ కాలేజి బస్సు వచ్చి ఆగింది…

“ఏయ్ దేవ్!… నిన్నే దేవ్” అన్న పిలుపు వినిపించి గభాలున ప్రక్కకి తిరిగి చూసాడు…

మెడికల్ కాలేజి బస్సు కిటికీ దగ్గర కూర్చున్న వసుంధర నవ్వుతూ చూసి అంది…

“కాలేజికి వెళుతున్నావా… నేను ఫోను చేస్తే తప్ప నువ్వు ఫోను చేయవా… ఈ సన్‌డే వచ్చి నీ పని పడతాను.”

కంగారుగా అటు ఇటు చూసాడు.

“ఎందుకలా కంగారు పడుతున్నావు… నేనం అనకూడని మాట అనలేదు… సిగ్నల్ క్లియర్ కాడానికి టైమ్ పడుతుంది నన్ను బస్సు దిగి రమ్మంటావా… మా కాలేజి దగ్గర డ్రాప్ చేస్తావా?…” అంది.

“ఆ పని చేయకు… సాయంత్రం ఫోను చేస్తాలే” అన్నాడు.

“ష్యూర్…”

“ష్యూర్…”

సిగ్నల్ గ్రీన్ రావడంతో బస్సు కదిలింది… బైక్ బస్సు ముందు నుండే రయ్‌మని వెళ్లిపోయింది.

“సచ్చినోడు… వీడిలో ఏదో మాగ్నెట్ లాంటి శక్తి ఉంది… వాడు ఎంత దూరం మొయిన్‌టైన్ చేస్తున్నా దగ్గర కావాలనిపిస్తుంది” అనుకుంది వసు.

ఇంటికి వచ్చేటప్పటికి హాల్లో అమ్మతో మాట్లాడుతూ ఎవరో అమ్మాయి కనిపించింది వాసుదేవ్‌కి…

“హాయ్!…” అంది అమ్మాయి చొరవగా వాసుదేవ్‌ని చూసి…

“హాయ్!…” అన్నాడు వాసుదేవ్.

“మన ఎదురింటి బంగ్లాలోకి వచ్చేరు దేవ్… పేరు నీలవేణి…”

ఎందుకో తెలియదు కాని ఆ పేరు చెప్పగానే గభాలున ఆ అమ్మాయి వైపు చూసాడు వాసుదేవ్…

బంగారు ఛాయ, కష్టపడి రాత్రింపగలు తీర్చిదిద్దినట్లు అందమైన శిల్పంలాంటి రూపం… బ్లూజీన్స్ వైట్ టీషర్టు బుజాలవరకు జుత్తు… ఇంత అందమైన అమ్మాయికి ఆ పేరు ఏమిటో…

సెలయేరు పారుతున్న శబ్దం వినిపించి చూసాడు వాసుదవ్…

అమ్మాయి నవ్వుతోంది.

“నాకు అర్థం అయింది… మీ డౌటు… ఈ అమ్మాయి ఇంత మోడ్రన్‌గా ఉంది ఇలాంటి పేరు పెట్టుకుంది ఏమిటా అని కదూ?…”

“ఆ… అదేం కాదు” కంగారుగా అన్నాడు.

“నాన్నా! దేవ్!… నువ్వు కాలేజి నుండి వస్తావని బజ్జీలు చేద్దామని పిండి కలుపుతున్నాను… ఈలోగా నీలవేణి వచ్చింది… నేను పది నిమిషాల్లో బజ్జీలు చేసి తీసుకు వస్తాను… ఈలోగా అమ్మాయికి మన రూఫ్ గార్డెన్ చూపించు…” అని వంటగదిలోకి నడిచింది సుమిత్ర.

 “You are lucky …” అంది.

“ఎందుకు అన్నాడు?”

“నేను ఇంటిలోకి వచ్చినప్పటి నుండి చూస్తున్నాను మీ అమ్మగారు… ఎప్పుడు చూసినా మీతోనే కనిపిస్తుంటారు.”

చిన్నగా నవ్వి అన్నాడు.

“అందరి అమ్మలు… అఫ్‌కోర్స్ అందరూ కాకపోయినా చాలా మంది అమ్మలు పిల్లలతోనే వాళ్ల లోకంలా ఉంటారు. అందిరకన్నా మా అమ్మ కొంచెం ఎక్కువే.”

“అందుకే అదృష్టవంతులు అంటున్నాను.”

“ఏం మీ అమ్మగారు మీతో ఎక్కువ సమయం గడపరా.”

చివ్వున తలఎత్తిచూసింది… నీలవేణి కళ్ల నిండా నీళ్లు…

కంగారుగా అన్నాడు… “సారీ మీ అమ్మగారు…”

“నో… నో… అమ్మ ఉంది… కాని… కాని…”

“ఇక్కడ లేరా?”

“ఇక్కడే ఇంట్లో… గదిలో బెడ్ మీద ఉన్నారు… మీకు ఎలా చెప్పాలో తెలియడం లేదు… నేను చెప్పేకన్నా మీరు ఒకసారి వచ్చి చూస్తే అర్థమవుతుంది.”

రూప్ గార్డెన్ అంతా తిరుగుతూ చూస్తూ సంతోషపడిపోయింది. “చాలా బాగుంది గార్డెన్… ఇంత బాగా మెయిన్‌టెయిన్ ఎలా చేయగలుగుతున్నారు…” అంది.

“గార్డెన్ అంటే నాన్నగారికి చాలా ఇష్టం… రోజు ప్రొద్దున్న కనీసం ఒక గంటయినా గార్డెన్ వర్క్ చేస్తారు… ఇక అమ్మ కూడ గార్డెన్ వర్క్ చూసుకుంటుంది…”

“మరి మీరేం చేయరా?” అంది.

“నేను చేద్దామన్నా… చేయనివ్వదు…”

“అందుకే అన్నాను… మీరు లక్కీ అని…”

ఆ మాటలంటుండగానే ట్రేలో రెండు ప్లేటలు బజ్జీలు… నీళ్ల గ్లాసులు పట్టుకొని రావడం చూసి “ఆంటీ అయ్యో మీరు తెచ్చారా నన్ను పిలిస్తే నేను వచ్చేదానిని కదా” అని సుమిత్ర చేతిలో ట్రే అందుకుంది.

నవ్వుతూ అంది సుమిత్ర…

“నాకు అలవాటే… మా దేవ్ స్నాక్స్ తీసుకుంటున్నప్పుడు ఆ రోజు ఏ చెట్టులు ఏ పూలు పూసాయో ఏ కాయగూరులు ఈ రోజు కోసానో, ఎంత మంది ఫ్రెండ్స్‌కి పంపానో… ఇలాంటి పిచ్చాపాటి కబుర్లు మా దేవ్‌కి చెబుతుంటాను…. ఇంకా అలా చూస్తావు ఏమిటిరా. వేడిగా తినడం నీకు అలవాడు కదా తిను… చల్లారిపోతున్నాయి… తిను నీలూ…” అంది…

“నాకు చల్లారినవి తినడం అలవాటు ఆంటీ… వంటమనిషి రత్నం వండేసి వెళ్లిపోతుంది.”

ఆశ్చర్యంగా చూసి “అమ్మ… అన్నట్లు అమ్మ జాబ్ చేస్తున్నారా?”

“అమ్మా!” కంగారుగా అన్నాడు.

“నేను… నేనెం ఫీలవ్వడం లేదండి… ఆంటీకి… మీకు… అమ్మ గురించి ఎలా చెప్పాలో తెలియడం లేదు. జీవితంలో అందరికి మంచి జరుగుతుందని నమ్మకం లేదు. కొందరికి జీవితం పూల పాన్పులాగే ఉండొచ్చు. కొందరికి ముళ్ళ పాన్పులాగే ఉండొచ్చు… ముల్లుని ఏరుకొని అవతల పడేస్తూ జీవించాలని ఆశపడుతుంటారు… కాని అమ్మ జీవితంలో ఏం ఉందో ఎవరికి తెలియదు… నేను కడుపులో పడడం శాపమో… ఏమిటో కూడా తెలియదు… ఈ మధ్యనే అమ్మమ్మ చనిపోయింది… చనిపోయింది అనే కన్నా ఒక్కగానొక్క కూతురు పరిస్థితి ఏమిటో తెలియక పేరున్న డాక్టర్లు కూడ అమ్మ పరిస్థితి ఏమిటో తేల్చలేక పోవడంతో… కేవలం నన్ను పెంచి పెద్ద చేయడం కోసమే బ్రతికినట్లు బ్రతికింది అమ్మమ్మ. బ్రతుకుతూ అమ్మ చిన్న పిసరైనా మనుషుల్లోకి వచ్చి కలుస్తుంది ఏమో అని ఆశపడింది… అంతే కాదు నా ముద్దు ముద్దు మాటలు… చేష్టలు అమ్మలో చలనం తెస్తాయి ఏమో అని ఆస పడింది… ప్చ్… అమ్మ ప్రాణం ఉన్న…. ప్రాణం లేని రాతి బొమ్మలా ఉన్న తన కూతిరిని చూస్తూ మనోవ్యాధితో ప్రాణం విడిచింది అమ్మమ్మ.”

“అయ్యో!… ఏంటమ్మా ఇంత ఘోరం. సైన్స్ ఇంత అభివృధ్ది చెందింది… అమ్మ ఆరోగ్యం డాక్టర్లు బాగుచేయకపోవడం చాలా బాధగా ఉంది… రేపు నేను మీ ఇంటికి వస్తాను నీలూ” అంది బాధగా…

“ఏవండీ!… మీకు ఏ సహాయం కావాలన్నా… నన్ను అడగండి” అన్నాడు వాసుదేవ్…

“ష్యూర్!…. కాని నన్ను మీరు అనకండా నీలూ అంటే మీ హెల్ప్ అడగడానికి…”

ఇంకా నీలవేణి మాట పూర్తి కాలేదు… నవ్వుతూ “అలాగే నీలూ!… అని పిలుస్తాను… నన్ను వాసూ అనండి అన్నాడు….

మరుక్షణంమే వసుంధర అన్నమాటలు గుర్తు వచ్చాయి… “నేను పెళ్లాయ్యాక నిన్ను వాసూ అనే పిలుస్తాను… నేను ఒక్క దానినే నిన్ను అలా పిలవాలి. అన్నట్లు మన వెడ్డింగ్ కార్డులో వసూ వెడ్స్ వాసూ అని వేయిస్తాను…”

“చాలా టైమ్ అయింది… తాతయ్య నా కోసం చూస్తుంటారు… వెళ్తాను ఆంటీ… వాసూ…” అని అంది నీలవేణి…

“నీలూ… పగలైనా… రాత్రయినా… ఏ వేళయినా… మా సహాయం కావాలంటే ఫోను చెయ్… నాన్నా… నీలూకి ల్యాండ్ లైన్ నంబరు… అన్నట్లు నీ నెంబరు కూడ ఇవ్వు” అంది సుమిత్ర…

“నోటు చేసుకో నీలూ!… అని చేతిలో ఫోను లేకపోవడం చూసి… మీ ఇంటికి వచ్చినప్పుడు నోటు చేసుకుందువుగాని” అని వాసుదేవ్ అన్నంతలో…

“లేదు వాసూ… నాకెందుకో తేలియదు… ఫోన్స్… చాట్స్… ఆన్‌లైన్… ఇలాంటి వాటి జోలికి పోను… అవసరానికి మాత్రమే ఫోన్లు… కంప్యూటర్ వాడుతాను…” అని చిన్నగా నవ్వి… “ఏంటి ఈ అమ్మాయి సత్తెకాలం సత్తమ్మలాగుంది అనుకోకు” అంది.

“చాలా మంచి మాట చెప్పావు నీలూ… ఈ కాలం పిల్లలు ఫోన్లు, చాటింగ్‌లు… సెల్ఫీలు… ఇలా కాలాన్నంతా వృధా చేస్తున్నారు… అవసరానికి కన్నా ఆనందానికి వాటి మీద ఎక్కువ ఆధారపడిపోతున్నారు” అని సుమిత్ర అంటుండగానే…

“అమ్మా…” అని నవ్వు… “నీలూ అప్పుడుప్పుడు అమ్మ కొన్ని విషయాలకి క్లాసు తీసుకుంటూ ఉంటుంది.” అన్నాడు వాసుదేవ్…

నీలవేణి నవ్వుతూ చూసింది.

***

మోటార్ బైక్ మీద కాలేజికి బయలుదేరాడు వాసుదేవ్… మీధి చివరికి వచ్చేటప్పటికి గుడి ముందు బ్యాగ్ వేసుకొని… నిలబడి ఉంది సాయి పల్లవి.

సాయి పల్లవిని చూసి మోటార్ బైక్ ఆపాడు వాసుదేవ్.

“అన్నయ్యా… బాగున్నావా… ఆంటీ వచ్చింది గుడికి… నువ్వు రాలేదేం… నీకు ప్రసాదం పంపించాను… ఇచ్చిందా” అంది సాయిపల్లవి…

“ఆ… ఇచ్చిందమ్మా… మొత్తం తినేసాను… అన్నట్లు ఎప్పుడూ లేనిది… ఈ రోజు కనబడ్డావు… ఇంకా స్కూలుకి బయలుదేరలేదా.”

“లేదన్నయ్యా… రాణికి జ్వరం అట… రాలేదు ఇక్కడ నుండి నేను… రాణి ఇద్దరమే స్కూలుకి వెళ్లేది… ఎలా వెళ్లాలా ఒక్కదానిని బోరు… రోజూ కబర్లు చెప్పుకుంటూ నడిచి వెళతాం” అంది…

“అలాగా… సరే… ఈ రోజు నేను డ్రాప్ చేస్తాను రా… బైక్ ఎక్కు” అన్నాడు.

 “థాంక్స్ అన్నయ్యా!… అన్నయ్యా ఏం అనుకోనంటే ఒక్క మాట… రేపు ఒక్క రోజు కూడ స్కూలు దగ్గర డ్రాప్ చెయ్యవా? ఎల్లుండి ఆదివారం కదా సోమవారం రాణి స్కూలుకి వచ్చేస్తానంది…” అంది…

నవ్వతూ… “సరే… మరి మోటారు బైక్ ఎక్కు” అన్నాడు.

“థాంక్స్ అన్నయ్యా!…” అంది సంతోషంగా.

***

లైట్ ఆర్పి పడుకోవడానికి కళ్లు మూసుకున్నాడు వాసుదేవ్. నిద్రపట్టలేదు… ఎం.డి. సంతోషం గురించి చాలా విషయాలు సైదులు ద్వారా తెలుసుకున్నాడు. తను అనుకున్న ప్రకారం అయితే వాడిలో మార్పు వచ్చినా… టెంపరరీ అవుతంది తప్ప శాశ్వతంగా వాడు మారడనిపిస్తుంది. ఏం చేయాలి ఆలోచనల్లో ఉండగానే సెల్ రింగ్ అయింది.

ఫోను సైదులు దగ్గర నుండి… గభాలున ఎత్తి “హలో సైదులు” అన్నాడు.

“నేను బాబూ… నా కళ్ళతో ఎం.డి.గాడు ఎంత వెధవో… ఎంత లంచగొండో! ఎంత మంది ఆడవాళ్లని లైంగికంగా బాధపెట్టాడో తెలుసు…”

“చెట్టుకి చెద పడితే పట్టిన చోట మందు జల్లితే తగ్గుతుంది. కాని కొన్నాళ్లుకి వేరే చోట పడుతుంది. అంటే దాని అర్ధం చెట్టు మూలాల్లో చెద ఎక్కడ పట్టిందో ముందు చూసుకొని అక్కడ చెదకు మందు వేయాలి. అంతే కాని చెట్టు పైన కనిపించిన చెదుకు మందు జల్లినా అక్కడ చెద తగ్గి వేరే చోట చెద బయలు దేరుతుంది బాబూ.”

“సైదులూ నువ్వు చెప్పింది నిజం.”

“వాడు మందు వద్దు మొర్రో, ఆడవాళ్ల జోలికి వెళ్లను తల్లో అని వాడి నోటిలో నుండి మాటలు వచ్చే టట్లు చేయాలి బాబూ” అన్నాడు సైదులు.

“గుడ్ సైదులూ. చెడు పని ఒక్కడైనా చేయగలడు. మంచి పని చేయడానికి ఒక్కడు సరిపోడు. నువ్వు నాకు హెల్ప్ చేస్తానంటే వాడి ఆటకి ముగింపు పలికిస్తాను…”

“మేడమ్‌గారు చాలా మంచి మనిషి చెప్పాను కదు బాబూ… ఆవిడ గుళ్లు, గోపురాలు… స్వచ్చంద సంస్థలు… ఆశ్రమాలు చుట్టూ తిరుగుతుంటుంది…. అమ్మగారికి తోడుగా అప్పుడప్పుడు నన్నుపంపి…. వీడు పబ్బులు, బార్‌లు చుట్టూ తిరిగి…. ఆవిడతో డెలిగేట్స్ వచ్చారు మీటింగ్ ఉందని ఆబద్దం చెబుతుంటాడు. అమ్మగారికి ఒక్క కూతురే కావడంతో… ఇంకో బిడ్డకి మంచి భవిష్యత్ ఇవ్వాలని SOS Children village of Indiaలో ఒక చంటి బిడ్డని చదివించి ప్రయోజకుడిని చేసింది… ఆ బిడ్డ పేరు శివ… అమ్మగారికి శివ అంటే ప్రాణం… వాడికి అమ్మ అంటే ఎంత ప్రేమో మాటల్లో చేప్పలేను… శివ అంటే నాకు ఎంతో ఇష్టం. నిన్న దుబాయి నుండి ఫోన్ చేసాడు… అన్నట్లు ఉద్యోగం వస్తే కొన్నాళ్లు అక్కడ ఉద్యోగం చేస్తానని వెళ్లాడు… ‘అయ్యగారి తిక్క వేషాలు ఇది వరకే శివతో చెబితే దేవత లాంటి అమ్మగారికి బాధపేడితే దేవుడు క్షమించడు… మనం అయ్యగారిని మార్చగలమా బాబాయ్’ అన్నాడు…

ఆలోచిస్తే ఉపాయం దొరికింది… అయ్య గురించి చెడుగా ఎవ్వరు చెప్పినా మేడమ్ నమ్మదు… వీడు శ్రీరామ చంద్రుడి లాంటి వాడు అనుకుంటుంది మహాతల్లి. అన్నట్లు అమ్మగారింటే బోలండంత భయం ఉంది… అమ్మగారితోనే వాడి కళ్లు తెరిపించాలి” అని తను ఆలోచించిన ఉపాయం గురించి చెప్పాడు సైదులు…

వాసుదేవ్ ఆశ్చర్యపోయాడు… “నువ్వు చెప్పింది అనుకున్నది అనుకున్నట్లు జరిగితే ప్లాన్ సక్సస్ అవుతుంది…”

“తప్పకుండా సక్సస్ అవుతుంది బాబూ… నువ్వు శివలా మాట్లాడాలి… అయ్య నిజస్వరూపం అంతా చెప్పాలి…”

“ఇంకేం చెప్పకు… సైదులూ… ఇందులో నే చేసేదానికన్నా…. నువ్వు చేస్తున్న సహాయం ఎక్కువ…. మరి నా గొంతు మేడమ్ పోల్చుకొని శివ కాదనుకుంటే” అన్నాడు….

“నేను శివ గొంతు రికార్డు చేసాను బాబూ… నీకు పంపిస్తాను…”

“థాంక్స్ సైదులూ….”

“అలాగే బాబూ!…. ఎంతో మందిని బాధపెట్టి వాడు సంతోష పడుతున్నాడు…”

“సైదులూ!… నాకొకటి అర్థం అయింది నూతిలో కప్ప అదే ప్రపంచం అనుకుంటుంది… నాన్నగారిని బాధపెడుతున్నాడు వాడికి బుద్ది వచ్చేలా చేయాలని అనుకున్నాను కాని…. నువ్వు వాడి నిజస్వరూపం చెప్పాక నేను వాడి గురించి చాలా తక్కువ అర్థం చేసుకున్నానని తెలిసింది.”

“రేపటి నుండి పని ప్రారంభిస్తాను.”

“బాబూ!… ఎట్టి పరిస్థితుల్లో నా పేరు బయటకు రాకూడదు…”

“ఆ భయం నీకక్కరలేదు సైదులు… ఒక మంచి పనికి సహాయం చేసావు… you are great…”

“అంత పెద్ద మాటలు వద్దు బాబూ… శివకి అన్నీ చెప్పాను మరి ఉంటాను” అన్నాడు…

ఒక మంచి పని చేయడానికి ఖద్దరు బట్టలు వేసుకున్న నాయకులో, బాగా చదువుకున్న విద్యావంతులో, బాగా డబ్బున్న ధనవంతులో కానక్కర లేదని సైదులుని చూసాక తెలిసింది…

మంచి పని చేయడానికి మంచి మనసున్న మనిషులైతే చాలు…

ఎప్పుడు తెల్లావారుతుందా?… నాన్నగారు ఆఫీసుకి వెళ్లినాక… గార్డెన్‌లోకి వెళ్లి చాలా జాగ్రత్తగా అనసూయగారితో మాట్లాడాలి… ఆలోచనలో ఉండగానే, నిరంజనరావు ఆఫిసుకి, కార్తీక మాసం గుడికి వెళ్లి వస్తానని సుమిత్ర గుడికి వెళ్లడంతో ఊపిరి పీల్చుకున్నాడు.

పోన్ చేద్దామని సెల్ తీసిన వాసుదేవ్‌కి చటుక్కున మనసులో ఆలోచన మెరిసి శివకి ఫోను చేసి అనసూయమ్మగారు శివతో ఎలా మాట్లాడుతాడో, ఆవిడతో శివ ఎలా మాట్లాడుతాడో అన్ని అడిగి తెలుసుకున్నాడు.

“అన్నా!… అమ్మ దేవత… అమ్మ లాంటి మనసు సమాజంలో కొంత మందికి ఉన్నా… నాలాంటి అనాథలకు కొంత మందికైనా అమ్మ దొరుకుతుంది… అమ్మ ప్రేమ, అభిమానం… అనురాగం అన్నీ దొరికి నేను అనాథనన్న బాధపోయి ఆనందం దొరుకుతుంది… ఎంతో మంచి మనసున్న అమ్మ మనసుకి బాధ కలుగకూడదు” అన్నాడు శివ.

“ష్యూర్ శివా మరి ఉంటాను” అని ఫోను పేట్టేసి “ఎంతో మంచి మనసున్న ఆవిడికి ఇంలాంటి చండాలుడు భర్త కావడం ఏమిటి…” అని అనుకొని గొంతు సవరించుకొని… అనసూయకి ఫోను చేసాడు…

“అమ్మా!… బాగున్నావా?… ఆ మధ్య కాలు నొప్పి అన్నావు తగ్గిందా” అన్నాడు.

“శివా!… నువ్వా?… గొంతు వేరేలా అనిపించింది, అంత ప్రేమగా నా బాగోగులు నువ్వు తప్ప ఎవరు అడుగరు శివే అనుకున్నాను…”

కంగారుపడ్డాడు వాసుదేవ్…

“చెప్పు శివా ఉద్యోగం ఎలా ఉంది… అన్నట్లు ఎప్పుడు వస్తావు…. సంవత్సరం దాకా రానమ్మా అన్నావు… నా మాట విని ఆరు నెలలు తరువాత శలవు పెట్టి ఇండియా వచ్చేయ్… ఎందుకో తెలుసా… మంచి అమ్మాయిని చూసి ఉంచుతాను… ఇండియా వచ్చి ఆ అమ్మయిని పెళ్లి చేసుకొని నీ కూడా తీసుకెళ్లు చక్కగా నీ బాగోగులు చూసుకుంటూ, రుచిగా వండి పెడుతుంది ఏమంటావు…”

“అమ్మ! ఎప్పుడు నా గురించేనా?”

“మీ గురించి ఆలోచించుకోవమ్మా?…”

నవ్వతూ అంది… “నాకే శివా…బంగారం లాంటి భర్త… నేనంటే ప్రాణం పెట్టే కూతురు వినోదిని… అత్తగారిని మామగారిని తల్లిదండ్రుల్లా చుసుకునే అల్లుడు ప్రవీణ్. కాస్త ప్రేమతో చిన్నప్పటి నుండి నిన్ను సాకినందుకు… దేవతలా చూసే నువ్వు… ఇంకేం కావాలి చెప్పు…” అంది.

“అమ్మా!… మీకు ఎలా చెప్పాలో తెలియడం లేదు… చెప్పకపోతే తప్పు చేస్తున్నాను ఏమో అని అనిపిస్తుంది. ఎందరికో సహాయం చేస్తున్న మీరు ఎప్పటికి బాగుండాలి…” అన్నాడు…

ఆశ్చర్యగా అంది “ఎప్పుడూ లేనిది క్రొత్తగా మాట్లాడుతున్నావు ఏమిటి శివా?… ఏదైనా మనసులో ఉంచుకొని బాధపడుకూడదు… ఏం జరిగింది…”

“అమ్మ… మీకు గుర్తుందా… మీకు SOSకి వస్తున్నప్పుడు నా ఫ్రెండ్ జాన్ ఉండేవాడు… వాడు పబ్స్‌లో DJ వాయిస్తాడు…”

“అలాగే… ఇప్పుడు ఆ విషయం ఎందుకు చెబుతున్నావు…”

“అమ్మా… నేను చెప్పే విషయం ముఖ్యంగా సార్ గారికి చెప్పకూడదు… మాట ఇస్తే చెబుతాను.”

నవ్వుతూ అంది “అయ్యాగారికి… నాకు మధ్య సీక్రెట్స్ ఏమీ లేవు, ఉండవు కూడ… నీకు తెలుసు కదా?”

“నేను అలానే అనుకున్నానమ్మా… కాని జాన్ చెప్పే వరకు నాకు తెలియలేదు… అయ్యగారు ఇంచు మించు పబ్స్‌కి వస్తునే ఉంటారుట… మందు ఎక్కువగా తాగుతున్నారట…”

పకపకా నవ్వింది అనసూయ….

“శివా!… అమ్మ మీద అభిమానం ఎక్కువై అయ్యగారిని అనుమానిస్తున్నావు… ఆయన ఉద్యోగం అటువంటిది… పెద్ద పెద్ద వాళ్లు వస్తుంటారు… తప్పని పరిస్థితుల్లో తాగుతుంటారు… ఆరోగ్యం పాడవుతుందని మందలిస్తూనే ఉంటాను…”

“అమ్మా! అయ్యగారు చెప్పే మాటలన్నీ అబద్ధాలే… స్టాఫ్‌ని … పీడించి పార్టీలడగడం… లంజగొండులను ప్రోత్సహించి తను డబ్బు తీసుకొని ఇష్టం వచ్చిన జల్సాలు చేస్తున్నారమ్మా… నేను కొన్ని నా నోటితో చెప్పలేను… మీ కళ్లారా చూద్దురుగాని. జాన్ నా ఫ్రెండ్ కావడంతో… జరిగిన విషయాల్ని చెప్పాడు….”

“శివా!…” అంది బాధగా.

“అమ్మా! మీరు బాధపడవద్దు… అంతా మీ చేతుల్లోనే ఉంది… అయ్యగారికి మీరంటే చాలా ప్రేమ… మిమ్మలను బాధపెట్టరు…”

“నీకు పిచ్చికాని పట్టిందా శివా… ఇంత చేస్తున్నారని నువ్వే చెబుతున్నావు…”

“అవునమ్మా!… మీ చేతుల్లోనే ఉంది.”

ఆయన ఆడిన నాటకం ముసుగు తీస్తేస్తే తన తప్పు తెలుసుకుంటారు…”

“నిజం అంటావా శివా… యు.ఎస్.ఎ. నుండి వినోదిని, ప్రవీణ్‌ని పిలిపించమంటావా…” అంది బాధగా అనసూయ.

కంగారుగా అన్నాడు – “వద్దమ్మా… పొరపాటున కూడ మనిద్దరి మధ్య జిరిగిన విషయాలు బయటకు రాకూడదు. సార్ జాగ్రత్త పడిపోతారు… మీకు మళ్లీ ఫోను చేస్తాను… ఏం చేయాలో చెబుతాను… జాన్ నాకు మంచి ఇన్ఫర్మేషన్ ఇస్తాడు… అమ్మా…అంతా మంచే జరుగుతుంది… నేను మళ్లీ ఫోను చేస్తాను…” అన్నాడు.

“అన్నట్లు శివా… నేను ఫీడ్ చేసుకున్న నీ ఫోను నెంబరు రాలేదు… ముందు ఎవరిదో నెంబరు అనుకున్నాను” అంది అనసూయ.

కంగారుగా అటు ఇటు చూసాడు వాసుదేవ్…

“శివా!…” అంది తిరిగి…

“ఆ ఫోన్ కింద పడిపోయి… రిపేరుకి వెళ్లింది. క్రొత్త ఫోను తీసుకున్నానమ్మా…” అన్నాడు.

“సరే!… ఉంటాను శివా… నాకు చాలా బాధగా ఉంది… ఆయన తప్ప తోవలో నడుస్తున్నారంటున్నావు…”

“బాధపడకమ్మా… మీ తోవలోకి వస్తారు సార్” అన్నాడు.

“ప్చ్!.. అలా అనుకుంటేనే మనిషి బ్రతగలడు…”

“అమ్మా!… మీరు అలా మాట్లాడితే నాకు చాలా బాధగా ఉంది… ఎంతో మందిని ఆదుకుంటున్నారు… సహాయం చేస్తున్నారు… మీ మనసు చాలా గొప్పది… మీకు అంతా మంచే జరుగుతుంది…”

“శివా!… అవన్నీ నమ్మకాలు…”

ఏం మాట్లాడాలో తెలియని వాడిలా ఒక్క నిమిషం మౌనం వహించి… “అమ్మా… సార్… పబ్‌కి ఎప్పుడు వస్తారో చూసి వెంటనే మీకు ఫోను చేస్తాను… మీరు అప్పుడు అక్కడకు రావాలి…”

“శివా!… ముందు నేను చెప్పేది విను… అలాంటి చోటుకి నేను రావడం… నిజం చెప్పాలంటే నాకు చాలా ఇబ్బందిగా ఉంది… కాదు… రోతగా ఉంది… నువ్వు నా కూడా ఉండాలి…” అంది.

కంగారుగా అన్నాడు శివ.

“అమ్మా… నేను వస్తే ఎలా అయ్యగారు నన్ను పోల్చుకుంటారు… ఒక వేళ నేను దుబాయి నుండి వచ్చిన చాలా గొడవ చేస్తారు.”

“అలా అయితే నన్ను చూస్తారుగా?…”

“సారీ అమ్మా… ఇలా చెప్పవలసి వస్తుంది… మీరు బురఖా వేసుకోవాలి… లేదా గెటప్ అయినా మార్చేయాలి. సార్‌ని రెడ్ హెండడ్‌గా మీరు పట్టుకుంటే… సార్ మీ చెప్పుచేతల్లోకి వచ్చేస్తారు…”

“అంతేనంటావా?…”

“అవునమ్మా మీరేం కంగారు పడకండి. మీకు తోడుగా నా ఫ్రెండ్‌ని పంపిస్తారు.”

“ఏంటో శివా!… పుణ్యం కొద్ది పురుషుడని మా నాయనమ్మ ఎప్పుడూ అంటూ ఉండేది… నా భర్త శ్రీరామచంద్రుడు అని అనుకున్నాను కాని ఇలా…”

“అమ్మా… మీరింకేం ఆలోచించి మనసు పాడు చేసుకోవద్దు.”

“ఎంత బలమైన ఇనుమైనా సమ్మెట దెబ్బ పడితేనే సాపుగా వస్తుంది. కొలిమిలో కాలిస్తేనే…. మనకు కావాలసిన ఆకారం వస్తుంది… ఇక మనుషులెంత అమ్మా…”

“ఏమో శివా!… నువ్వు దుబాయి వెళ్లి చాలా మారిపోయావు… నీ మాటలు నాకు ధైర్యన్ని ఇస్తున్నాయి… కొడుకుగా నీ బాధ్యత నెరవేర్చుకుంటున్నావు… సార్… తన తప్పు తెలుసుకోకపోతే… తప్పుడు మనిషితో కలిసి నేనుండలేను. నాకేంటి బంగారం లాంటి కూతురు, కొడుకు ఉన్నారు” అంది బాధగా అనసూయ.

“అమ్మా… మీరు ఇలా డీలా పడకండి… ఎంతటి మనిషైనా ఎప్పుడో ఒకప్పుడు ఏదో ఒక తప్పు చేస్తుంటాడు… ఆ తప్పు తెలుసుకున్న వాడు మనిషవుతాడు…”

“శివా!… నువ్వు చాలా ఎదిగిపోయావు. నాకు చాలా సంతోషంగా ఉంది… మరి ఉంటాను.” అని ఫోను పెట్టేసింది.

నాలుగు తెల్ల వెంట్రుకలు కనబడితే కంగారు పడిపోయి తలకి రంగు వేసుకోవడం… మీసం ఇలా ఉందేమిటి ట్రిమ్ చేసుకోవడం… రంగు రంగు షర్టులు, టీషర్టులు వేసుకోవడం నాలుగు రోజుల కొకసారి వేసుకున్న డ్రస్సులకి ఏ కళ్లద్దాలు సూట్ అవుతాయో ఒకటికి పది సార్లు అద్దంలో చూసుకొని కళ్లద్దాలు పెట్టుకోవడం, షర్టు టక్ చేసాక కంగారుగా అరరె… పొట్ట ఏంటి ఇలా చిన్న సైజడు కుండలా కనబడుతుంది… ఛ…ఛ… పొట్ట తగ్గించేయాలని చచ్చి చెడీ బస్కీలు చేయడం అన్ని ఒక్కసారి అనసూయకి గుర్తు వచ్చాయి.

‘అర్థం అయింది… మీ వేషాలు… ఫారిన్ నుండి డెలిగేట్స్ వస్తున్నారని… పార్టీలుంటాయని… కంపెనీ ఎం.డి.ని నేను స్టయిల్‌గా ఉండకపోతే ఎలా అని టింగురంగడిలా తయారై వెళుతుంటే, సరేలే అనుకున్నాను కాని సరసాలడడానికి సిగ్గు, ఎగ్గు లేకుండా వెళుతున్నారని అనుకోలేదు… శివ చెప్పినట్లు ఎంతటి బలమైన ఇనుమును సాపుగా చేయడానికి సమ్మెట దెబ్బలు అవసరం అన్నట్లు, మీరు మారకపోతే… తోడపాశం ఒక్కటే కాదు అట్లకాడ వాతలు పెట్టి మొఖం అంతా వాతలు పెడతాను… మీ ముఖం చూడడానికి అందరూ బయపడి తల ప్రక్కకు తిప్పుకుంటే, కుళ్లి కుళ్లి మీరు ఏడ్వాలి…

చదువు… సంధ్యా లేని ఊరిలోని మనిషి, అనసూయ అని నన్ను తక్కువ అంచనా వేసావు సంతోషం… నేను తలచుకుంటే అపరకాళికనై అమాంతంగా అప్పడంలా నలిపిపడేయగలను. జాగ్రత్త…’ ఆవేశంగా తనలో అనుకుంది అనసూయ.

(సశేషం)

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here