జానేదేవ్-8

0
11

[box type=’note’ fontsize=’16’] ముమ్మిడి శ్యామలా రాణి గారు వ్రాసిన నవల ‘జానేదేవ్!‘ సంచిక పాఠకులకు ధారావాహికంగా అందిస్తున్నాము. ఇది 8వ భాగం. [/box]

[dropcap]”అ[/dropcap]మ్మా… ఇంకా ఎంత సేపు… నీలూ వాళ్ల ఇంటికి వెళదామా?” అని హాలులో నుండే వంటింటిలోకి వినబడేలా కేకవేసాడు.

“వస్తున్నానురా… ఒక్క నిమిషం… అని గబగబా తయారయి క్యారీ బ్యాగ్‌తో వచ్చింది.

“చేతిలో ఆ సంచి ఏమిటమ్మా?” అన్నాడు.

“అదే రా…. మన చెట్లకి కాసిన బొప్పాయి కాయలు అరటిపండ్లు… కాసిన్ని కాయగూరలు…”

“ఇప్పుడు ఇవి తీసుకు వెళ్లాలంటావా?”

“దేవ్… ఇవి కాసి కాసి మనకి లెక్కలేకుండా ఉంది. కాని మన కాలనీలో అందరూ… ఎప్పుడు నేను ఏమైనా ఇస్తానా అని ఎదురుచూస్తున్నారు…”

చిన్నగా నవ్వుతూ అన్నాడు వాసుదేవ్… “అమ్మా… అక్కడ నీలు అమ్మగారు… మనల్ని చూసి ఎలా రియాక్ట్ అవుతారో తెలియాదు.”

“నువ్వేం కంగారుపడకు నాన్నా… పరిస్థితిని అర్థం చేసుకోగలను…”

నీలవేణి వాళ్ల ఇంటికి వెళ్లేటప్పటికి హాలులో సోఫాలో కూర్చోని పుస్తకం పట్టుకొని ఇంగ్లీషు పాఠం చదువుతూ అర్థం చెబుతుంది.

నీలవేణి ఎదురుగా చాప మీద కూర్చోని నలుగురు పిల్లలు శ్రద్ధగా నీలవేణి చేప్పే పాఠం వింటున్నారు.

సుమిత్రని, వాసుదేవ్‌ని చూసి వంట మనిషి రత్నం… నవ్వు మొఖంతో..

“రండమ్మా రండి… రండి సార్. అమ్మాయిగారు చెప్పారు… మీరు ఇంటికి వస్తారని. మా సీతకు ఇంగ్లీషు పరీక్ష రేపు… కాసేపు… చెప్పి పంపిస్తానన్నారు అమ్మాయిగారు… అమ్మాయిగారు చాలా మంచోరు… ఎలాగు సీతకి రోజు చదువు చెబుతున్నాను… దాని ఫ్రెండ్స్ ఉంటే రమ్మను అన్నారు. సీతతో చదువుతున్న పిల్లలు కూడా వస్తున్నారు. అమ్మాయిగారు చదువు చెప్పినాక మార్కులు బాగా వస్తున్నాయి… ఆ దేవుడు పది కాలాల పాటు అమ్మాయిగారిని చల్లగా చూడాలి” అని ఎదురుగా వచ్చి అంది.

రత్నం మాటలు విన్న నీలవేణి కంగారుగా బయటకు వచ్చి “వచ్చారా ఆంటీ…. రండి… రండి… రండి వాసూ…” అని రత్నం వైపు చూసి చిరుకోపంతో “వచ్చిన వాళ్లని లోపలకి రమ్మనకుండా… సోది మొదలు పెట్టావు. మా రత్నం మనుషులు కనబడితే చాలు… ఫుల్ స్టాప్ లేకుండా కబుర్లు చెబుతుంది. రండి…” అని అప్యాయంగా అంది.

“అయ్యో…. పరవాలేదు… మేము కూర్చుంటాం. పిల్లలకు పాఠాలు చెప్పమ్మా” అంది సుమిత్ర.

అప్పటికే పిల్లలు బ్యాగ్‌లో పుస్తకాలు సర్దుకొని “అక్కా బై” అని బయలుదేరారు.

“ఈరోజు గంట ముందే పిల్లలకు ట్యూషన్ మొదలు పెట్టానంటీ… కూర్చోండి. ఇప్పుడే వస్తాను. రత్నం రా” అని లోపలికి హడావిడిగా వెళ్లింది.

మంచం మీద అటు తిరిగి పడుకొని ఉంది. “అమ్మా ఒక్కరి లేస్తావా. ఆంటీ వాళ్లు వచ్చారు. నిన్ను చూడడానికి వచ్చారు… ప్లీజ్… లే అమ్మా…”

ఒకసారి నీలవేణి మొఖంలోకి తిరిగి శూన్యంలోకి చూడసాగింది జానకి.

ఆశ్చర్యంగా అంది రత్నం.

“అమ్మ అక్కడకెందుకు అమ్మాయిగారు… అమ్మ ఎవరినైనా చూస్తే కంగారుపడతారు కదా” అని రత్నం అంటుండగానే సుమిత్ర గదిలోకి వచ్చి… “ఎందుకు అమ్మని ఇబ్బంది పెట్టడం” అని జానకి దగ్గరకు వెళ్లి ఆశ్చర్యంగా చూసింది సుమిత్ర.

నీలవేణి తల్లి అంటే ఎవరు నమ్మరు… అక్క అంటే నమ్మేటట్లు ఉంది… చాలా అందంగా, సౌమ్యంగా అమాయకంగా కనిపించింది…

“నీలూ… అమ్మ పేరు?” అంది సుమిత్రి.

“జానకి…”

“అలాగా… నిజం చెప్పమంటావా నీలూ…. నీకు అమ్మలా లేదు… అక్కలా ఉంది… అక్కలా అనే కన్నా నువ్వు అమ్మ కవలపిల్లల్లా ఉన్నారు….” అని ఆవిడ ఎదురుగా కూర్చోని… “జానకిగారు… మేము మీ ఎదురింట్లో ఉంటాం…” అని అంది.

“ఆంటీ… అమ్మ… అమ్మ… ఎవరితో మాట్లాడదు… అతికష్టం మీద, నాతో, తాతయ్యతో రెండు మాటలు మాట్లాడుతుంది. ఏం అనుకోకండి ఆంటీ…” అంది నీలు.

“నీలూ… నేను అనుకోవడం ఏమిటమ్మా…” అని కూర్చోబెట్టడానికి ప్రయత్నిస్తున్న జానకికి తను కూడ కూర్చోబెట్టడానికి సహాయపడింది సుమిత్ర.

మొదటి రోజు స్కూలుకి వెళ్లిన పసి బిడ్డలు మొదటి సారిగా క్లాసులో ఎలా బిత్తర చూపులు చూస్తారో అలా కంగారుగా, భయం భయంగా అటు ఇటు చూస్తుంది జానకి.

“మీరు పదండి ఆంటీ… అమ్మని హాలులోకి తీసుకు వస్తాను” అంది నీలవేణి.

“లేదమ్మా…” అని ఇద్దరు చెరోవైపు జానకిని పట్టుకొని నడిపిస్తుండగా జానకి కాలు స్లిప్ అయి ముందుకు పడబోయి గభాలున సుమిత్ర చెయ్యి పట్టుకుంది…

‘తాతయ్య, రత్నం, తనని తప్ప ఎవరు దగ్గరకు వచ్చినా ఒప్పుకోదు…. కంగారు పడుతుంది. కాని ఈ రోజు ఆంటీ చెయ్యి పట్టుకుంది…. ఏంటి విచిత్రం’ అనుకుంది నీలు.

అప్పటికే హాలులో జానకిని తీసుకొని సుమిత్ర, నీలవేణి వచ్చారు.

ఎదురుగుండా దృశ్యాన్ని చూసి కంగారు పడింది నిలవేణి.

తాతయ్య జగన్నాధంగారు కండువాతో కళ్లు వత్తుకొవడం చూసి అంది…

“తాతయ్యా… మొదటిసారి మనింటికి వచ్చారు, కంగారు పడతారు… నువ్వే చెబుతుంటావుగా… కష్టాలు కలకాలం ఉండవు అని… అమ్మ… అమ్మలో… ఇన్నాళ్లు లేని మార్పు వస్తుంది…”

“తాతయ్య చాలా ఫ్రీగా, ఫ్రెండ్లీగా మాట్లాడుతున్నారు… ఆయన బాధని నాతో షేర్ చేసుకొని నీలూ” అన్నాడు వాసుదేవ్.

అప్పటికి జానకితో పాటు సుమిత్ర ఎదురు సోఫాలో కూర్చున్నారు….

గభాలున జానకి వైపు చూసాడు వాసుదేవ్. వాసుదేవ్ ఒక్క నిమిషం షాకైయ్యాడు…. నీలు అమ్మగారు పేషంటులా లేదు… నీలుకి జన్మ ఇచ్చిన దగ్గర నుండి తనలోకంలో తను ఉంటూ… ఎవరైన తనకి సపర్యలు చేస్తే చేయించుకోవడం… తినడానికి పెడితే తినడం…. మాట మంతీ లేకుండా ఉన్న ఆవిడ… ఇలా ఉండడం ఆశ్చర్య అనిపించింది. సైన్స్ ఎంతో అభివృద్ది చెందిన ఈ రోజుల్లో ఆవిడని నార్మల్ లైఫ్‌లోకి డాక్టర్లు తీసుకురాకపోవడం ఆశ్చర్యం అనిపించింది.

ప్లేటుల నిండా స్వీటులు, స్నాక్స్ పట్టుకొని… వచ్చి టీపాయ్ మీద పెట్టి… “వాసూ… తీసుకో, ఆంటీ మీరు కూడా” అని గభాలున ప్లేటులో నుండి స్నాక్ తీసి చిన్నగా విరిచి… తల్లి ప్రక్కనే కూర్చోని “అమ్మా… ఏది నోరు తెరువు…. నీకిష్టమైన పన్నీరు పఫ్…. తినమ్మా” అని తల్లి నోటిలో పెట్టింది నీలు.

ఆ దృశ్యం చాలా అపురూపంగా అనిపించింది వాసుదేవ్ సుమిత్రలకు.

“నీలూ….. అమ్మకి ఇష్టం అని నీకెలా తెలుసు….?”

చిన్నగా నవ్వి అంది…

“పిల్లలకు ఏం నచ్చుతుందో నచ్చదో తల్లికి తెలుస్తుంది కదు ఆంటీ… నాకు ఊహ తెలిసిన దగ్గర నుండి అమ్మమ్మ అమ్మకు తినిపించడం చూసాను. అమ్మమ్మ చనిపోయాక ఆ బాధ్యత నేను తీసుకున్నాను… అమ్మకి నచ్చనిది పెడితే రెండోసారి నోరు తెరవదు…. ఎంత ప్రయత్నించినా బుంగ మూతి పెడుతుంది… అయితే ఈజీగా తనకి ఏం ఇష్టమో నాకు తెలిసిపోయింది.”

“నీలూ…. నేను ఒక్కటి ఖచ్చితంగా చెప్పగలను… మీ అమ్మగారు తప్పకుండా కొన్నాళ్లలో మాములు మనిషవుతారు… ఈ మాత్రం ఆవిడ దగ్గర నుండి రెస్పాన్స్ వస్తే చాలు….. మన ప్రయత్నాలు మనం చెయ్యవచ్చు… రోజు రోజుకి ఎన్నో కొత్త ఇన్వెన్షన్స్ కనిపెడుతున్నారు సైంటిస్టులు…”

“థాంక్యూ వాసూ… అమ్మ నార్మల్ లైఫ్‌లోకి వస్తుందో లేదో నమ్మకం అలా ఉంచితే నీ మాట వింటే నాకు చాలా ఆనందంగా ఉంది” అంది నీలవేణి.

“దేవ్ చెప్పింది నిజమే నీలూ…. అమ్మ త్వరలోనే మామూలవుతుందన్న నమ్మకం నాకు కలుగుతుంది… నాకు సైన్స్ గురించి పెద్దగా తెలియదు. కాని ఎన్నో ఏళ్లు కోమాలో ఉన్న వాళ్ళే మామూలు అవుతుంటారు…. అమ్మ చాలా మంచి మనిషి…. సెన్సిటివ్ అయి ఉండొచ్చు. నువ్వు చెప్పిన దాని బట్టి చూస్తే తనకి జరిగిన అన్యాయం తట్టుకోలేకపోతుంది” అంది సుమిత్ర.

“అవును తల్లి…. నా కూతురు జానకి చాలా అమాయకురాలు… నలుగురిలోకి రావడానికి భయపడే మనస్తత్వం…. చదువులో చురుకు. చాలా తెలివైనది… అందుకే చదివింది… ఫ్రెండ్స్ అందరూ ఉద్యోగానికి అప్లై చేస్తుంటే తను అప్లై చేసింది. తన ఒక్కదానికే వచ్చింది. సంతోషంగా చేరింది. కాని ఉద్యోగం చేసే చోట నలుగురితో కలవడానికి ఇబ్బంది పడేది… నాతో చెప్పేది… వాళ్ల అమ్మ దగ్గర వాపోయేది… ఉద్యోగం మానేయమని కూడా అన్నాం…. కాని విధి వక్రించి…. చూస్తుండగానే నా కూతురు మనోవ్యాధితో గదిలో నుండి బయటకు వచ్చేది కాదు…. పరిస్థితి తెలుసుకోవడానికి ఎంత ప్రయత్నించినా నోరు విప్పలేదు…. తరువాత తల్లి అయిందని తెలిసి షాకయ్యాం…. అప్పటికే తను శిలలా అయిపోయింది. భయపడిపోయేది…. వణికిపోయేది… ఎవరిని దగ్గరకు రానిచ్చేది కాదు… ఎంత మంది డాక్టర్లకు చూపించామో చెప్పలేం… జానకిని మాములు మనిషి చేయలేకపోయారు కాని ఇదిగో ఇలా మా కళ్లముందు ఉంచారు” ఆవేదనగా అన్నారు.

“తాతయ్యా… మీరే చెబుతున్నారు… మనుషులని దగ్గరకు రానీయని ఆవిడ ఇప్పుడు నలుగురి మధ్య కూర్చున్నారు… ఇంప్రూవ్‌‍మెంట్ ఉంది… తప్పకుండా ఆంటీ మాములు అవుతారు” అన్నాడు దేవ్.

“అంతకన్నా సంతోషం మాకు వేరే లేదు… నేను పోయేలోగా నీలు తల్లిగా జానకి అనుకుంటే చాలు…”

“కాలం ఎప్పుడు ఒకేలాగ ఉండదండి… ఏ నిమిషంలో ఏం జరుగుతుందో చెప్పలేం… మంచే జరుగుతుంది… మేము మీకు అండగా ఉన్నామన్నా విషయం మరిచిపోకండి…” అని సోఫాలో నుండి సుమిత్ర లేవబోయింది… గభాలున జానకి సుమిత్ర చెయ్యి గట్టిగా పట్టుకోవడం చూసి అందరూ ఆశ్చర్యపోయారు…

నీలవేణి కళ్లలో నీళ్లు… ఇది కలా నిజమా… ఇదే మొదటిసారి అమ్మ ఇలా వేరే వాళ్ల చెయ్యి పట్టుకోవడం… ఎవరిని ప్రక్కన కూడా కూర్చోనివ్వదు…

గభాలున వంగి జానకి మొఖంలోకి చూస్తూ “మళ్లీ వస్తాను జానకి…” అని సున్నితంగా జానకి చెయ్యిలో నుండి తన చెయ్యి తీసుకుంది సుమిత్ర.

“తాతయ్యా… మీ ఎదురింట్లోనే మేము ఉన్నాం. ఏ చిన్న అవసరం వచ్చినా నేను వస్తాను…. మీరు ఏ దిగులు లేకుండా ప్రశాంతంగా ఉండండి… మీరు అనుకున్నది మీ కళ్లతో చూస్తారు… మా ప్రయత్నం మేము చేస్తాం. బై నీలూ” అన్నాడు.

సంతోషంగా తలూపింది నీలవేణి.

***

గదిలోకి వచ్చిన వాసుదేవ్ మంచం మీద ఉన్న సెల్ చూసి…. ‘అరె సెల్ మరిచిపోయాను. ఎవరైనా ఫోను చేసారేమో’ అని గభాలున సెల్ తీసి చూసి షాక్ అయ్యాడు.

పది మిస్స్‌డ్ కాల్స్…

కంగారుగా ఫోను చేసి…. “హలో వసూ…. ఏమయింది…. మన ఫ్రెండ్స్ అందరూ బాగున్నారు కదూ?” అని అడిగాడు.

కోపంగా అంది వసుంధర – “వాళ్లకేం నిక్షేపంలా ఉన్నారు… మీ ఇంటికి వచ్చాను…. లాక్ చేసి ఉంది… ఎక్కడికి వెళ్లావు?”

“ఇంటికి వచ్చావు…. సరే… నేను లేకపోతే అన్ని సార్లు ఫోను చేయాలా…?”

“ఎంతో కష్టపడి నీకిష్టమైన క్యారెట్ హల్వా చేసాను… ముందు నా ప్రశ్నకు సమాధానం చెప్పు ఎక్కడికి వెళ్లావు…?”

“ఎదురింటి నీలూ వాళ్ల ఇంటికి వెళ్లాం. అమ్మ కూడా వచ్చింది. వాళ్లు…” అని చెప్పబోతున్న వాసుదేవ్ మాటకి అడ్డు పడి… “ఏంటి నీలూ వాళ్ల ఇంటికి వెళ్లావా… అంత వరకు వచ్చిందా వ్యవహారం? ఇదెక్కడ దాపురించిందిరా బాబూ… గద్దలా ఎత్తుకెళ్లిపోయేటట్లు ఉంది… ఫస్ట్ ఇయర్ మెడిసిన్ ఎంత కష్టమో తెలుసా… నేను చదువులో పడి కొట్టుకుంటుంటే నువ్వు హాయిగా ఎన్‌జాయ్ చేస్తున్నావా?”

“కాసేపు నోరు మూస్తావా… పిచ్చి పట్టిన దానిలా మాట్లాడుతున్నావు… నువ్వు మాట్లాడింది… ఒక్క మాట కూడ అర్థం కావడం లేదు.”

“ఎందుకు అర్థం అవుతుంది…. నన్ను మరిచిపోయావు… ఇప్పుడు నా మాటలు అర్థం కావడం లేదంటున్నావు… ఆ నీలునో… గీలునో… నా నుండి నిన్ను దూరం చేసి గద్దలా ఎత్తుకు పోవాలనుకుంటుంది ఏమో… నేను రాబందులా దాన్ని పీకేస్తాను… ఏమనుకుంటుందో…”

“ముందు నోరు మూస్తావా ఛ… ఛ… మరి ఇంత చండాలంగా ఆలోచిస్తున్నావు ఏమిటి? She is my best friend… అక్క ఫోను చేస్తోంది” అని అనగానే…

“ఎప్పుడూ నేను నీతో మాట్లాడుతున్నప్పుడే అక్క ఫోను చేస్తుందంటావు… ఈ సన్‌డే మనం కలుస్తున్నాం” అని వసుంధర అంటుడగానే గభాలున ఫోను పెట్టేసి… ‘రాక్షసి… మరీ పిచ్చిదానిలా తయారవుతుంది… హు….’ అనుకుని, నోటితో గాలి వదిలి… ‘ఫోనులో తనని వేపుకు తింటుంటే అక్క ఫోను చేస్తుందని బాగా తప్పించుకుంటున్నాను…’ అని నవ్వుకుంటూ బట్టలు చేంజ్ చేసుకున్నాడు.

‘దుర్మార్గుడా… నీకోసం ఓ ఆడపిల్ల వెంట పడుతుంది, లవ్ చేస్తుందని సంతోషించకుండా చిరాకు పడతావు ఏమిటిరా. అయినా నిన్ను అనవసరంగా అనుమానిస్తున్నాను ఏమో. నీ మనసులో ఆ పిల్ల పట్ల ఏమీ లేకపోబట్టే ఆ మహా తల్లి ఇంటికి వెళ్ళావని చెప్పావు. నిజంగా నువ్వు బంగారం రా…’ అని మనసులో సంతోషంగా అనుకంది వసుంధర.

అందరూ భోజనాల దగ్గర కూర్చున్నారు…. ఫోను రింగ్ కావడంతో గభాలున డైనింగ్ టేబిల్ దగ్గర నుండి లేచింది సుమిత్ర.

“అమ్మా… నేను చూస్తాను. నువ్వు కూర్చో” అని వాసుదేవ్ అంటుండగానే సుమిత్ర వెళ్లి ఫోను ఎత్తింది.

“ఆంటీ… సాయంత్రం మీ ఇంటికి వచ్చాను. ఇంటికి తాళం వేసి ఉంది… దేవ్‌కి ఇష్టమని క్యారెట్ హల్వా చేసాను. బాక్స్ కిటికీ దగ్గర పెట్టాను…. స్వయంగా నేనే చేసాను… వాసుకి పెట్టండి” అంది వసుంధర.

నవ్వుతూ అంది సుమిత్ర – “ఏం…. అంకుల్, నేను తినకూడదా?”

“అయ్యో సారీ ఆంటీ…. అంకుల్ మీరు తినండి… రేపు ఫోను చేస్తాను ఎలా ఉందో చెప్పండి… ఉంటాను” అని ఫోను పెట్టేసింది.

గబగబా కిటికీ దగ్గరకు వెళ్లి బాక్స్ తీసుకుని డైనింగ్ టేబిల్ దగ్గరకు వచ్చింది.

నిరంజనరావు, వాసుదేవ్ అర్థంగానట్లు సుమిత్ర చేతిలో నున్న బాక్స్ వైపు చూసారు.

నవ్వుతూ అంది సుమిత్ర – “వీడికి ఇష్టమని వసూ క్యారెట్ హల్వా చేసి తెచ్చిందండి… ‘ఇంటికి తాళం వేసి ఉందని కిటికీలో పెట్టాను, దేవ్‌కి హల్వా పెట్టండి’ అని ఫోను చేసి చెప్పింది వసుంధర.”

పొలమారాడు వాసుదేవ్.

‘రాక్షసి… నీలుకి పోటీగా హల్వా చేసింది… అనుమానం మందు పుట్టి తరువాత వసూ పుట్టింది… ఇంటికి రానీ ఈ సారి బాగా ఏడిపించి పంపిస్తాను…’ అనుకున్నాడు.

“ఏంటి నాన్నా… ఆలోచిస్తున్నావు? వసూ ఇచ్చన హల్వా తిను…. మళ్ళా ఫోను చేసి హల్వా తిని దేవ్ ఏం అన్నాడని అడుగుతుంది” అంది నవ్వుతూ సుమిత్ర.

“ఆ అమ్మయికి ఇంకా వీడు గుర్తుండడం చెప్పుకోదగ్గ విషయమే… స్టడీస్‌లో బిజీగా ఉండి కూడా…” అని నిరంజనరావు అంటుండగానే “బాగుందండి చిన్ననాటి స్నేహితులు. L.K.G నుండి ఇప్పటి వరకూ కలిసి చదువుకున్నారు” అంది సుమిత్ర.

‘మీకు తెలియదు నాన్నా… వసూ… కుళ్లుబోతు. మాగ్నెట్‌లా నన్ను పట్టుకుంది…’ అని తన మనసులో అనుకున్నాడు వాసుదేవ్.

“మంచిదే… స్నేహాన్ని మించిన బంధం మరోకటి లేదు… వసూ మంచి అమ్మాయి. చక్కగా చదువుకుంటుంది. స్నేహాన్ని మరిచిపోకుండా దేవ్‌తో టచ్‌లో ఉండడం ఆ అమ్మయి మంచితనానికి నిదర్శనం. ఏమంటావు దేవ్?” అన్నాడు నిరంజనరావు.

కంగారుగా “ఆ….ఆ…” అన్నాడు వాసుదేవ్.

(సశేషం)

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here