సంపాదకీయం జనవరి 2020

0
6

[dropcap]సం[/dropcap]చిక పాఠకులకు నూతన ఆంగ్ల సంవత్సర హార్దిక, ఆర్థిక శుభాకాంక్షలు.

గత సంవత్సరం సాధించిన విజయాలను తలచుకుంటూ చేసిన పొరపాట్లను అర్థం చేసుకుంటూ భవిష్యత్తు గురించి ఆలోచిస్తూ ముందుకు సాగుతోంది సంచిక. పాఠకులను ఆకర్షించేందుకు సరికొత్త రచనలను అందించాలని తపనపడుతోంది సంచిక. ఎన్నెన్నో అందించాలన్న ఆలోచనలున్నా వాటిని అర్థం చేసుకుని అక్షర రూపం ఇచ్చే ఉత్సాహం కల రచయితల లేమి స్పష్టంగా తెలుస్తోంది.

రచనలు ఆరంభించిన తొలినాళ్ళలో వుండే పాషన్ ఈనాటి యువ రచయుతలలో ద్యోతకమవటంలేదు. రాయకముందే ప్రపంచాన్ని మలుపు తిప్పుతుంది తమ రచన అన్న ఆత్మవిశ్వాసంతో వారు సాహిత్య రంగంలో అడుగుపెడుతున్నారు. ఆత్మ విశ్వాసానికి అహంకారానికి నడుమ సున్నితమైన రేఖ వుంటుందన్న గ్రహింపును ప్రదర్శించటంలేదు. ఒక వయసు దాటిన రచయితల్లో ఆరంభం నాటి ఉత్సాహాన్ని ఆశించటం దురాశే అవుతుంది. దాంతో ఎన్నో అనుకున్న రచనలు పాఠకులకు అందించటంలో ఆలస్యం అవుతోంది. ఇది కాస్త నిరాశ కలిగించే విషయం. ఈ సంవత్సరమయినా ఆసక్తి ఉత్సాహం కల యువ రచయితలు రంగప్రవేశం చేస్తారని సంచిక ఆశిస్తోంది. ఆసక్తి వున్న వారికి ఉత్సాహాన్ని ప్రోత్సాహాన్ని ఇచ్చేందుకు సంచిక సిద్ధంగా వుంది.

యువ రచయితలను తయారుచేయటంలో భాగంగా సంచిక కావలి చైతన్య జూనియర్ కళాశాల విద్యార్ధినులు ‘కులంకథ’ కథల సంకలనంపై రాసిన అభిప్రాయాలను వరుసగా ప్రచురిస్తోంది. ఇలా ఇతర విద్యా సంస్థలలోనూ విద్యార్ధినీ విద్యార్ధులకు కథ, వ్యాసం, సమీక్ష పోటీలు నిర్వహించి వారి రచనలను సంచికలో ప్రచురించి ప్రోత్సహించేందుకు సంచిక సిద్ధంగా వుంది. ఆసక్తి కల అధ్యాపకులు సంచికను సంప్రదిస్తే ఈ దిశలో ముందుకు వెళ్ళవచ్చు.

ఈ సంవత్సరం సంచిక ఘండికోట బ్రహ్మాజీరావు గారి చివరి రచన ‘శ్రీపర్వతం’ సీరియల్‌గా ప్రచురిస్తుంది. తెలుగులో చరిత్ర ఆధారంగా రచనలు వచ్చాయిగానీ చారిత్రిక పరిశోధనలు ఎలా సాగుతాయి, తవ్వకాలలో సాధకబాధకాలను వివరిస్తూ అల్లిన రచనలు లేవు. శ్రీపర్వతం అలాంటి తొలి రచన. నాగార్జునసాగర్ ప్రాంతంలో జరిగిన తవ్వకాల ఆధారంగా తెలిసిన చరిత్ర చుట్టూ అల్లిన అందమయిన నవల ఇది. పాఠకులు ఈ రచనను మెచ్చుతారన్న నమ్మకంతో సంక్రాంతి నుంచి ఈ నవల ధారావాహికను ఆరంభిస్తున్నాము.

అలాగే, ఉగాది నుంచి టిప్పు సుల్తాన్ జీవితం ఆధారంగా అల్లిన చారిత్రాత్మక రచన ధారావాహిక ఆరంభమవుతుంది. ఇంకా, బలభద్రపాత్రుని రమణి, ముమ్మిడి శ్యామలారాణి వంటి సుప్రసిద్ధ రచయితలు సంచిక కోసం ప్రత్యేకంగా సృజించిన రచనలు సంచిక పాఠకుల కోసం సిద్ధంగా వున్నాయి.

జనవరి నెలనుంచీ నెలకొకసారి సత్యవతి దినవహి సంచిక కోసం ప్రత్యేకంగా రూపొందించిన ‘పద ప్రహేళిక’ను పాఠకులకు అందిస్తున్నాము. కోడిహళ్ళి మురళీమోహన్ అందిస్తున్న పదసంచిక ప్రతి ఆదివారం అందుతుంది. ప్రతినెల ఒకటవ తారీఖున అందే ‘పద ప్రహేళిక’ అదనం.

1 జనవరి 2020 సంచికలోని రచనలు:

కాలమ్స్:
రంగులహేల-22 – పరమ సత్యం – అల్లూరి గౌరిలక్ష్మి​

వ్యాసాలు:
అశ్వత్థామ – అంబడిపూడి శ్యామసుందర రావు

కథలు:
దత్తత – బెహరా వెంకట సుబ్బారావు
ప్రేమికులమన్న కులమున్న లోకంలో… జి. రంగబాబు
తిమిరనాశని – ఎ. మోహన్ మురళీ కుమార్
ఏదైనా వీలైతేనే – పి.ఎల్.ఎన్. మంగారత్నం
మల్లిక – జొన్నలగడ్డ సౌదామిని

కవితలు:
అభిప్రాయ భేదం – శ్రీధర్ చౌడారపు
స్నేహస్పర్శ – డా. కోగంటి విజయ్
కొత్త రెక్కలు – జయంతి వాసరచెట్ల
అమ్మ చిరునామా – కాకర్ల హనుమంత రావు
శీర్షిక లేని కవిత – బత్తిన కృష్ణ

పుస్తకాలు:
వై… – పుస్తక విశ్లేషణ – కొత్తపల్లి ఉదయబాబు
నాన్నకో ‘బహుమతి’ – పుస్తక పరిచయం – సంచిక టీమ్

గళ్ళ నుడికట్టు:
పద ప్రహేళిక 1: దినవహి సత్యవతి

నాటిక:
అభయం – పి.యస్.యమ్. లక్ష్మి

సంచిక ఆరునెలలకొకసారి ప్రచురించే సంకలనాలు తెలుగు సాహిత్య ప్రపంచంలో అందరి ఆదరణను సంపాదించటం అత్యంత ఆనందం కలిగించే విషయం. ముఖ్యంగా ‘కులం కథ’ పుస్తకానికి లభిస్తున్న ఆదరణ, తెలుగు పాఠకుడు నాణ్యమయిన పుస్తకాన్ని ఆదరిస్తాడని, సాహిత్య పెద్దలు, విమర్శకులకన్నా గొప్ప విచక్షణ తెలుగు పాఠకులకుందని నిరూపిస్తుంది. సంచిక-సాహితీ ప్రచురణల సంకలనాలకొక గుర్తింపు వచ్చింది. ఒక ప్రామాణికత ఏర్పడింది. ఈ క్రమంలోనే ఈ ఉగాదికి విడుదలయ్యే సంకలనం తెలుగుభాషకు సంబంధించిన కథల సంకలనం. తెలుగు భాష ఔన్నత్యం, తెలుగు భాషని సజీవంగా నిలిపేందుకు  ప్రణాళిక, మాతృభాష ప్రాధాన్యం వంటి అంశాలు కేంద్రంగా కల కథలను సంకలించాలన్నది ఆలోచన. రచయితలు ఈ అంశం కేంద్రంగా కల తాము రచించిన కథలను పంపవచ్చు. అలాగే తమకు తెలిసిన మంచికథలు ఈ అంశం ఆధారంగా సృజించినవి తెలపాలని మనవి. రచయితలు ఈ అంశంగా కొత్త కథ రాసి పంపితే వాటిని సంచికలో ప్రచురిస్తాము. మా ప్రామాణికాలలో వొదిగితే సంకలనంలోనూ చేరుస్తాము. మా ఇతర సంకలనాలలాగే ఈ సంకలనమూ విజయవంతమవటంలో తోడ్పడాలని మనవి.

 నూతన సంవత్సరంలోనూ పాఠకులు రచయితలూ సంచికను ఆదరిస్తారని తమ సలహాలు, సూచనలు, రచనలతో సంచికను పరిపుష్టం చేస్తారని ఆశిస్తున్నాము.

సంపాదక బృందం

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here