[box type=’note’ fontsize=’16’] జనవరి – మార్చ్ 2018 మధ్యకాలంలో వివిధ ప్రింట్, ఆన్‌లైన్ పత్రికలలో వచ్చిన తెలుగు కథలని విశ్లేషిస్తున్నారు ఎ. వి. రమణమూర్తి. ఈ శీర్షిక ప్రతి మూడు నెలలకు ఒక సారి ప్రచురితమౌతుంది. [/box]
కథా, కమామీషూ…
కథలు చదివేవాళ్లకీ, కథలమీద అడపాదడపా వచ్చే సమీక్షలు చదివేవాళ్లకీ చెప్పగానే వెంటనే గుర్తొచ్చే రెండువాక్యాలు ఉన్నాయి. మొదటిది: ‘కథల్లో వస్తువైవిధ్యం ఉంది’; రెండోది: ‘ఫలానా కథ శిల్పపరంగా కొత్తపోకడలు పోయింది.’ రెండూ కూడా చాలా బరువైన వాక్యాలు.
ఈ సమీక్షలలో అలాంటి వస్తువైవిధ్యాల గురించీ, శిల్పపరంగా కొత్తపోకడల గురించీ సాధారణీకరించిన స్టేట్‌మెంట్స్ ఏవీ ఉండవు అని హామీ ఇస్తున్నాను! కథ బాగుంటే, ఎందుకు బాగుందో – వీలైనంతవరకూ – క్లుప్తంగా మాత్రమే వివరించడం జరుగుతుంది. ఈ సమీక్ష ఉద్దేశ్యం తెలుగు కథ తీరుతెన్నుల మీద వ్యాఖ్యానం చేయడం కాదు. బాగున్నవనుకున్న కథలు కూడా మరుగున పడిపోతున్న పరిస్థితుల్లో, అలాంటి కథలని ముందుకి తీసుకొచ్చి, స్థూలంగా పాఠకులకు పరిచయం చేయడం ఈ సమీక్షల ఉద్దేశం. కథారచనలో మంచిప్రయత్నాలు చేస్తున్న రచయిత/త్రులకి, మనవంతు ప్రోత్సాహం అందించడం కూడా జరుగుతుందని ఆశ.
ఈ సంవత్సరపు మొదటి మూడునెలల కాలంలో మొత్తం 507 తెలుగుకథలు చదివాను. అందులో పదోవంతు కథలు ఈ సమీక్షలో ఉదహరింపబడటం – పాఠకుడిగా నా వ్యక్తిగతమైన అనుభవాల దృష్ట్యా – గొప్ప విషయమే! వీలైనంతవరకూ కథ ఏమిటనేది ఈ సమీక్షలలో చెప్పకుండా ఉండాలనే ప్రయత్నం కూడా చేసాను, కథ చదవదలచుకున్న పాఠకుల కుతూహలాన్ని చెడగొట్టకూడదని.
సంప్రదించిన పత్రికలు
ఎక్కువ కష్టపడకుండా దొరికే ఈ పత్రికల్లోని కథల ఆధారంగా ఈ సమీక్షలు రాస్తున్నాను. ఇందులో సగం పైగా పత్రికలు ఆన్‌లైన్‌లో ఉచితంగా దొరుకుతాయి కూడా!
అడుగు, అమ్మనుడి, అరుణతార, ఆంధ్రజ్యోతి ఆదివారం, ఆంధ్రప్రదేశ్, ఆంధ్రప్రభ ఆదివారం, ఆంధ్రభూమి ఆదివారం, ఆంధ్రభూమి మాసం, ఆంధ్రభూమి వారం (రెండు సంచికలు మినహా), ఈనాడు ఆదివారం, ఈమాట, ఉత్తరాంధ్ర, కౌముది, గృహశోభ, గో తెలుగు, చతుర, చినుకు, జాగృతి, తానా పత్రిక, తెలుగు వెలుగు, తెలుగుతల్లి కెనడా, తెలుగుపత్రిక, దక్కన్ ల్యాండ్, నమస్తే తెలంగాణ ఆదివారం, నవ తెలంగాణ ఆదివారం, నవ్య, పాలపిట్ట, ప్రజాశక్తి ఆదివారం, ప్రజాసాహితి, భూమిక, మధురవాణి, మన తెలంగాణ ఆదివారం, మనం ఆదివారం, మాతృక, మాలిక, వాకిలి, వార్త ఆదివారం, విపుల, విరసం, విశాలాంధ్ర ఆదివారం, విశాలాక్షి, విహంగ, సంచిక, సాక్షి ఆదివారం, సారంగ, సాహిత్య ప్రస్థానం, సుజనరంజని, సూర్య ఆదివారం, స్వాతి మాసం, స్వాతి వారం, హాస్యానందం.
నచ్చిన కథలు
బాగా నచ్చిన కథలు ప్రతి సమీక్షలోనూ మామూలుగా రెండుమూడైనా ఉంటాయి కానీ, ఈ మూడునెలల కాలంలో ఒకే ఒక్కటి ఆ స్థానంలో నిలబడగలిగింది. అయితేనేం, ఒక మంచికథని చదివిన తృప్తిని కలిగిస్తూనే, అలాంటి కథని చదివాక స్పష్టాస్పష్టంగా కలిగే ఆలోచనలలోకీ, సమాధానాలకంటే ప్రశ్నలే ఎక్కువగా ఉండే స్థితిలోకీ ఈ కథ పడేసింది.
ఒక దుఃఖం రాని సాయంత్రం (దగ్గుమాటి పద్మాకర్ – విశాలాక్షి, జనవరి 01)
బ్రెయిన్ డెడ్ అయినవాళ్ల అవయవాలని, వాళ్ల సమీప బంధువుల అనుమతితో అవసరమైనవాళ్లకి మార్పిడి చేయడం అనేది – భౌగోళిక పరిమితులని దాటుకుని మరీ – చాలా జీవితాలకి ఆశని కలిగించాల్సిన విషయం. కానీ, అవినీతి అనేది ప్రత్యక్షంగా, ప్రచ్ఛన్నంగా ఎక్కడబడితే అక్కడ వ్యాపితమై ఉన్న సమాజంలో ఇలాంటి ఆధునిక వసతులు ఎవరి జీవితాలకి ఆశని కలిగిస్తోందీ అన్నది అసలు ప్రశ్న అవుతుంది.
సతీష్, తన చెల్లెలి పెళ్లికి అవసరమైన డబ్బుకోసం తిరుగుతూ, చివరికి బాంక్ రుణం ఏదైనా దొరుకుతుందా అని ప్రయత్నిస్తాడు, తన తండ్రితో కలిసి. బాంక్ దానికి నిరాకరించడంతో అతనికి వ్యవసాయం మీదా, ఈ పరిస్థితుల మీదా ఉక్రోషం వస్తుంది. ఆ కోపాన్ని బైక్ డ్రైవింగ్‌లో చూపిస్తాడు, పెద్ద యాక్సిడెంట్ అవుతుంది.
రక్తం చాలా పోవడం వల్ల సతీష్‌కి బ్రెయిన్ డెడ్ కావడంతో, అతని అవయవాలని దానం చేయమని అతని అన్న రాజేష్‌ని డాక్టర్లు అడుగుతారు. అప్పటికే ఓ కోటీశ్వరుడి కొడుక్కి గుండె అవసరం. రాజేష్ అప్పటివరకూ జరిగిన విషయాల షాక్‌లోనుంచి ఇంకా తేరుకోలేదు. “నాకింకా కన్నీళ్లు కూడా రాలేదు,” అంటాడు, తనని అవయవాల దానం కోసం అడిగిన డాక్టర్‌తో. ఇది చదువుకున్నవారి సామాజిక బాధ్యత అన్న హాస్పిటల్ సూపరింటెండెంట్‌తో “మా తమ్ముడి ఆర్గాన్స్ తీసుకుని అమర్చుకునే కుటుంబానికి ఉండే సామాజిక బాధ్యత గురించి మీకు ఏమైనా తెలుసా?” అని ప్రశ్నిస్తాడు. తప్పులు చేయగలిగిన అధికారం మాత్రం కొంతమంది తమదగ్గర ఉంచుకొని, త్యాగాలు చేయాల్సిన బాధ్యతని మిగతా అందరికీ గుర్తుచేస్తూ ఉండటం ఈ వ్యవస్థలో ఉన్న తిరకాసు విషయం. నిజానికి దానం చేస్తున్న వ్యక్తి తప్ప, ఈ వరసలో ఉన్న మిగతా అందరూ తమ తమ సేవలకు చార్జ్ చేసేవారే!
ఈ కథలోని రాజేష్ ప్రవర్తన అమానవీయంగా ఉన్నట్టు అనిపించవచ్చు. ఇలా అవయవదానాలు చేయడం పట్ల అతనికి సామాజిక బాధ్యత లేదనీ, ఏదో అజ్ఞానం వల్ల వచ్చిన పొగరు ఉందనీ అనుకోవడానికి లేదు. ఎందుకంటే, కొంత డబ్బు కూడా ఇస్తామని ఆశ చూపిన ఆసుపత్రి వర్గాలకి అతను సమాధానం చెబుతాడు. తమ అవసరాలను ఆయుధాలుగా వాడుకోవద్దనీ, అవసరమైతే తన అవయవాలను దానం చేయడానికి సిద్ధంగా ఉన్నాననీ, కానీ అవి “…ప్రభుత్వాసుపత్రులలో జరిగే ఆపరేషన్లకు మాత్రమే” ఉపయోగించాలనీ చెబుతాడు.
మానవత్వం ముసుగు లోపల జరిగే ఇలాంటి వ్యాపారాలని నిరసించే రాజేష్‌లాంటి వాళ్లు అరుదుగానే ఉంటారు కాబట్టి, అలాంటి అవయవదానాలు నిర్విఘ్నంగా జరిగిపోతూనే ఉంటాయి. జరగకూడదనీ కాదు. కాకపోతే, “ట్రాఫిక్‌లో ఆగిపోయిన ప్రజలందరూ, శబ్దం చేసుకుని వెళుతున్న ఆంబులెన్స్ ని చూసి – ఈ భూమ్మీద ఒక ప్రాణం నిలబడటంలో తమ పాత్ర కూడా ఉందని…” తృప్తిపడతారు.
చెబుతున్న కథమీద ఫోకస్ తప్పిపోకుండా, తన వాదనలని తార్కికంగా రాజేష్ పాత్ర ద్వారా రచయిత వినిపించిన పద్ధతి, కథా సంవిధానం కథని నిలబెట్టాయి.
బాగున్న ఇతర కథలు
సింహం చెట్టు (శ్రీరమణ – ఈమాట, జనవరి 01): ఏ వస్తువు బుర్రలో పడ్డా దానితో సర్కస్ ఆడేసే శ్రీరమణగారికి ఈసారి సాక్షాత్తూ సర్కస్సే కథావస్తువయింది. చిన్నపిల్లల దృష్టికోణంలోనుంచి వారి ఉత్సాహమూ, కబుర్లూ, ఆకతాయితనాలూ చెబుతూనే, తాతగారి ప్రహసనం, ఆయన బడీ గట్రాలు సందర్భోచితంగా చెప్పుకుంటూ వస్తారు. సర్కస్ సింహం మరణించడం, దాని అంత్యక్రియలూ, దాని సమాధి మీద మొలిచిన చెట్టూ అంత్యాకర్షణలు!
ఓ మూగమనసా! (వారణాసి నాగలక్ష్మి – కౌముది, జనవరి 01): ఇందులో ఉన్న కథకురాలి కథ ఏమిటన్నది ఓ ప్రతిఫలనం ద్వారా పాఠకుడు తెలుసుకునేట్టు చేయడం ఈకథలోని విలక్షణమైన ప్రయోగం. కథ చిన్నదే, విషయం కూడా దాదాపు అందరికీ తెలిసిందే. కానీ, ఇలాంటి వినూత్న ప్రయోగాలవల్ల, మామూలుగా మనం ఉపేక్షించే కథాంశాలు కూడా అలా తప్పిపోకుండా, ఒక్క క్షణం పాటు ఆలోచింపచేస్తాయి. కథని విలక్షణంగా చెప్పగల పద్ధతుల్లో ఇదోటి.
డోలీ (జగదీశ్ మల్లిపురం – సాక్షి ఆదివారం, జనవరి 07): ఆశలు చూపించి ఓట్లు సంపాదించే పార్టీలూ, అధికారంలో ఉండి ప్రైవేట్ వ్యక్తులకే లాభాలు ఆర్జించి పెట్టే ప్రభుత్వాలూ ఉన్నంతకాలం పరిస్థితులు ఈ కథలో ఉన్నట్టుగానే ఉంటాయి. వాంతులు చేసుకుంటూ మరణానికి దగ్గరవుతున్న ఆ గిరిజన యువకుణ్ణి కాపాడటానికి వర్షంలో (“గొడుగూ, గిడుగులతో…”, “సెల్‌ఫోన్ వెలుతురులో ఆకాశం ఉరుముతుండగా…”) మైళ్ల కొద్దీ దూరాల్ని నడిచి, మండల ఆసుపత్రిలో లాభం లేదంటే అక్కణ్ణుంచి జిల్లా కేంద్రానికి తీసుకువెళ్తే, చివరికి చేరింది శవమే. ఆ శవాన్ని మళ్లీ ఊరు చేర్చాలంటే, కనీసం ఒక్క ఆంబులెన్స్ కూడా దొరకని పరిస్థితి. చివరికి మళ్లీ డోలీ కట్టి వాళ్లు తిరుగుప్రయాణానికి ఉద్యుక్తులయ్యారు. ఈలోగా, నవసమాజ నిర్మాణం కోసం ప్రతిజ్ఞలూ, పోరాటాలూ జరుగుతూనే ఉన్నాయి. విషయం పరిచితమైనదే అనిపించినా, కథలో ఓ విషాదోద్విగ్నతని రచయిత ప్రతిభావంతంగా పోషించగలిగారు. నిర్వీర్యమయిపోయిన ప్రభుత్వాల ముందు, సత్సంకల్పాలున్న ఒకరిద్దరు వ్యక్తులు కూడా చేతకానివాళ్లలాగా ఎలా మిగిలిపోవాల్సి వస్తుందో చూపగలిగారు.
ప్రశ్న (గీతాంజలి – విహంగ, జనవరి 01): చిన్న చిన్న పిల్లలమీద కూడా అత్యాచారాలు జరుగుతున్న ఈరోజుల్లో తల్లిదండ్రులేం చేయాలి? ఇంకా పూర్తిగా ఊహకూడా తెలియని పసిపిల్లలకి వాళ్ల శరీరాలని ఎలా కాపాడుకోవాలో చెప్పి, వాళ్లని భయానికి గురిచేసి, వాళ్ల బాల్యపు అమాయకత్వాన్ని ఛిద్రం చేయాలా? అలా అని, వాళ్లని ఎడ్యుకేట్ చేయకపోతే వాళ్లమీద జరగగలిగిన దాడిని వాళ్ళు ఎలా పసిగట్టగలుగుతారు? సున్నితమైన వ్యథకి సంబంధించిన ఈ కథ బాగుంది, క్లుప్తత విషయంలో ఇంకొంచెం నిక్కచ్చిగా ఉండివుంటే మరింత బాగుండేది.
ఎవరిది బాధ్యత (నల్లూరి రుక్మిణి – అరుణతార, జనవరి 01): అందరూ మంచివాళ్లే. అందరికీ ప్రేమాభిమానాలు ఉన్నమాట కూడా నిజమే. కానీ, మనుషులు ఒకళ్లనొకళ్లు చూసుకునే పద్ధతుల్లోనూ, ఒకరి ప్రపంచంలోకి ఇంకొకరు చులాగ్గా ఇమిడిపోయే వెసులుబాట్లలోనూ కనిపించని మార్పులేవో వచ్చాయి. గ్లోబలైజేషన్ తరువాత మనుషుల మధ్య పెరిగిన ఆర్ధిక స్థితుల వ్యత్యాసాలు, కొన్ని కొత్త వర్గాలని కూడా సృష్టించింది. అలాంటి ఏదో ఓ కొత్తవర్గంలోకి తన కొడుకు చేరిపోవడం అనేది తమ బంధాన్ని పునర్నిర్వచిస్తోందని తెలీని తల్లి విజయమ్మ ఈ కథలో ఉంది. తన ప్రపంచంలో ఇమడలేని తల్లిపట్ల అవ్యాజమైన ప్రేమ ఉన్న కొడుకు కూడా ఉన్నాడు. కానీ ఇద్దరి మధ్యా ఆ పలచని తెర మాత్రం విజయమ్మకి అర్థం కాకుండా అలానే ఉండిపోతోంది. చాలా సున్నితమైన పాయింట్‌తో రాయబడ్డ ఈ కథని మరికొంత జాగ్రత్తగా నైపుణ్యంతో నిర్వహించి ఉంటే చాలా మంచికథ అయ్యేది. ఇప్పటికి పాయింట్ బాగుందని చెప్పుకోవాలి, అంతే!
రెండో ఉత్తరం (కొట్టం రామకృష్ణారెడ్డి – నమస్తే తెలంగాణ ఆదివారం, జనవరి 28): పల్లెలకి తిరిగి వెళ్లిపోవాలనే ఇతివృత్తాలతో (ఈ సమీక్షాకాలంలో కూడా) చాలా కథలే వచ్చాయి. ఈ కథ కూడా అలాంటి వస్తువుతోనే ఉన్నప్పటికీ, కథని నడిపించే విషయంలో రచయిత కొంత సృజనాత్మకతని చూపారు. ముఖ్యమైన ఆ రెండో ఉత్తరం ప్రతివాళ్లూ తనది కాదనుకొని మరొకరికి అందజేయడం, తద్వారా మరికొంతమంది ఆ ఉత్తరం ద్వారా స్ఫూర్తి పొందటం అనేది ఈ కథలోని ఆ అదనపు విషయం. కాకపోతే, కథ చివరిభాగంలో నేరేటర్ విషయంలో రచయిత చిన్న పొరపాటు చేయడం వల్ల – కథ అర్థంకాకుండా పోతుందని కాదుగానీ – కథ ఒక చిన్న కుదుపుకి గురవుతుంది.
బైపాస్ (రాధిక – మాతృక, జనవరి 01): ఇంతకుముందు చాలామంది చెప్పిన నేపథ్యంలోనే మళ్లీ ఇంకో కథ చెప్పాలంటే రచయిత/త్రికి కొంత ఇబ్బంది ఉంటుంది. దాన్ని ఓ కొత్తపద్ధతిలో పాఠకులకి చేర్చాలిన అదనపు బాధ్యత తీసుకోవాల్సి వస్తుంది. అలాంటి బాధ్యతని సంపూర్ణంగా తీసుకొని, మారిపోతున్న పల్లెల చిత్రాన్ని చాలా గాఢంగా, ఆర్తితో చెప్పిన కథ ఇది. ముఖ్యపాత్రలు అనుకున్నవి నేపథ్యంలోకి వెళ్లిపోయి, ‘కథావశాత్తు’ తగిలిన పాత్రలు, సమస్యలు అసలు రంగం మీదికి రావడం, ఆ ఇమేజరీలోనుంచి ఒక ఆలోచనాత్మకమైన ముగింపుని చేరుకోవడం ఈ కథ సాధించిన విజయాలు. కథలలో టోన్ అనేది ఎలా పనిచేస్తుందో చెప్పటానికి ఈ కథని ఒక ఉదాహరణగా చెప్పుకోవచ్చు.
కవర్ పిక్ (కుప్పిలి పద్మ – నవ్య, జనవరి 03): విడాకులు తీసుకుని తల్లిదండ్రులు విడిపోయినప్పటికీ, ఆ పిల్లలకి అతను బయొలాజికల్ తండ్రి కాకుండా పోతాడా? జీవితంలో తన దారి తను చూసుకుని, అందర్నీ అన్యాయం చేసి వేరే అమ్మాయితో వెళ్లిపోయిన తండ్రి అక్కడితో ఊరుకున్నా బానే ఉండేది. అనవసరమైన షరతులు విధించాక, ప్రతిగా కూతురు కొన్ని పనులు చేయాల్సి వచ్చింది. ప్రస్తుతం అందరూ విరివిగా ఉపయోగిస్తున్న సామాజిక మాధ్యమాల పరంగా అల్లిన ఈ కథ, విషయాన్ని కొత్తనేపథ్యంలో చూపిస్తుంది కానీ, మగవాళ్లు – కొంతమందైనా – మేము ఆ పాత మగవాళ్లమే అని మళ్లీ మళ్లీ నిరూపించుకుంటూనే ఉంటారు.
పూజారి 2040 (రాణి శివశంకరశర్మ – ఆంధ్రప్రదేశ్, ఫిబ్రవరి 01): ఇంకో ఇరవై పాతికేళ్ల తర్వాత పరిస్థితిని ఊహించి రాసిన కథ. అప్పుటికి శూద్రులు, దళితులు కూడా పూజారులయ్యారు. మంత్రం స్పష్టంగా చదవగలుగుతున్నారు. వేదాలు పఠించారు. పౌరోహిత్యాలు చేస్తున్నారు. నిజానికి, ఇవన్నీ చేయగలిగిన బ్రాహ్మణులే కరువయ్యారు. వాళ్లంతా పొట్టచేతపట్టుకుని విదేశాలకి వెళ్లిపోయారు. అలాంటి ఓ పూజారి వాల్మీకి శర్మ. ఇంతటి ఔన్నత్యాన్ని తమకి ధారాదత్తం చేసిన అగ్రవర్ణాల వారి పట్ల అతనికి కృతజ్ఞత. ఈ కొత్తతరం వేదపండితుల మీద పరిశోధన చేయడానికి అమెరికానుండి మహీధరశాస్త్రి వచ్చాడు. బ్రాహ్మణ పండితుడు అంటూ ఎవరూ మిగలకపోయినా, వేదాన్ని పఠిస్తున్న కొత్తతరం పిల్లలని చూసి ముచ్చటపడ్డాడు. “పుట్టుకతో అందరూ శూద్రులే. సంస్కారం వల్ల మాత్రమే ద్విజులు – బ్రాహ్మలుగా మారుతున్నారు అన్నమాట నిజమైంది, మీబోటి వారిని చూస్తుంటే…” అని వాల్మీకి శర్మని చూసి మురిసిపోతాడు కూడా. అంతా బ్రహ్మాండంగా జరిగిపోతున్నదనుకుంటున్న కాలంలోనూ, జరుగుతున్నదేవిటో గ్రహించగల వాళ్లు కొంతమంది ఉంటారు. “మిమ్మల్ని పూజారులుగా చేయడంలో ఉన్న కుట్రని మీరు గ్రహించలేదు…” అన్నారు. “…వాళ్ల దరిద్రాన్ని మన నెత్తిన రుద్ది, వాళ్లు విమానంలో ఎగిరిపోయారు…” అని తెలుసుకున్నారు. కొత్తతరం పిల్లలు – వాల్మీకి శర్మ కొడుకులాంటి వాళ్లు – దీనికి పరిష్కారం కూడా కనిపెట్టారు. “బ్రాహ్మణులు వేటిని విడిచిపెట్టేశారో (మనం) వాటిని విడిచిపెట్టెయ్యాలి. వాళ్లు వేటిని పట్టుకున్నారో (మనం) వాటిని పట్టుకోవాలి… “ అన్న తండ్రికి తెలియజెప్పాడు. చివర్లో మహీధరశాస్త్రి నీళ్లల్లో పడి ఎందుకు చనిపోయాడో అర్థం కాని విషయమే అయినా, కథ ఇప్పటి వాస్తవాలని పరిగణనలోకి తీసుకొని, కాలక్రమేణా జరగవలసిన మార్పు పట్ల ఒక మంచి పరిశీలన చేసింది.
ఇల్లులో జీవించిన మనిషి (అద్దేపల్లి ప్రభు – సాహిత్య ప్రస్థానం, ఫిబ్రవరి 01): ఈ కథలో రామారావు ఆశ, హాయిగా బతకడానికి అవసరమయ్యే సక్రమమైన ఆశ కాకపోవచ్చు. ఆ ఆశ నెరవేరడానికి అతను తన జీవితకాలమూ, తన మీద ఆధారపడ్డ భార్యా పిల్లల జీవితకాలాలూ బలిపెట్టడం కూడా సరైన పని కాకపోవచ్చు. ఓ పిచ్చిపంతంతో జీవితాన్ని చేదువిషం చేసుకున్న రామారావుకి, చివరికి ఆ కల నెరవేరిన క్షణాన విరక్తే కలిగిందిగానీ, మరోటి కాదు. వస్తువుకి తగ్గ కథనంతో ఉన్న ఈ కథలో ఆగి మళ్లీ చదవాల్సిన వాక్యాలు కొన్ని ఉన్నాయి: “… ఆ కంపెనీ సబ్బు ఖరీదుగా, చాలా ఖరీదుగా అనిపిస్తోంది. తన సబ్బు పేదగా, దరిద్రంగా అనిపిస్తోంది. ఏమిటిది? ఈ అనిపించడం అనేదాన్ని ఎలా తయారుచేయాలి?”; “ఆ చింకిచాప మీద పడుకుని అర్ధశతాబ్దం తరువాత కాసింత వెలుగ్గా కనిపిస్తున్న భార్యాపిల్లల్ని చూస్తూ ఉండిపోయాడు.”
అతడు (తల్లావజ్ఝల పతంజలిశాస్త్రి – వాకిలి, ఫిబ్రవరి 01): అతను ప్రపంచాన్నీ, ప్రపంచం అతన్నీ అర్థం చేసుకోవడంలో భేదాలున్నాయి. పనితప్ప మరోటి తెలియని అతనికి సెక్స్ అనేది ఒక అవసరం మాత్రమే అనే చిన్న కథాంశం, మంచి పనివాడితనంతో కొంత సంక్లిష్టంగా తయారయినా, అది కథాస్వాదనలో పెద్దగా ఇబ్బంది పెట్టదు.
తరాల అంతరం (పి గోపీకృష్ణ – ఆంధ్రభూమి వారం, ఫిబ్రవరి 15): ఆధునిక తరం పిల్లల్ని ఏమాత్రం బాధ్యతలేని మనుషుల్లా ఏకపక్షంగా చిత్రించడంలో సాంప్రదాయపు ఆలోచనాధోరణికి, సాహిత్యం కూడా అంతో ఇంతో ఇతోధికంగా సహాయం చేస్తూనే వస్తోంది – అక్కడక్కడా మినహాయింపుల్తో. అలాంటి మినహాయింపే ఈ హాయైన కథ. బాంకింగ్ నేపథ్యాన్ని ఆథెంటిగ్గా చిత్రించడమే కాకుండా, పాత్రలని నిర్మించడంలో తగినంత శ్రద్ధవహించి రాసిన కథ. చివర్లో ఓ హాస్యధోరణిలో ఉండే ముగింపు కథని పలుచన చేయకపోగా చెప్పదలచుకున్న పాయింట్‌ని బలంగా చెప్పినట్టయింది.
కప్పు కాఫీ (మధురాంతకం నరేంద్ర – ఆంధ్రజ్యోతి ఆదివారం, ఫిబ్రవరి 18): నైతికత గురించీ, విలువల గురించీ రాసినట్టుగా అనిపిస్తూ, చాలా సాధారణంగా కనిపించే ఈ కథలో ఓ శిల్పవిశేషం ఉంది. ఉత్తమపురుషలో ఈ కథని చెప్పే కథకురాలు, కథ మొదలైన కొద్దిసేపటికే మనం మనస్ఫూర్తిగా అంగీకరించలేని పాత్ర అని తెలిసిపోతుంది. భర్త ఒక పరాయి స్త్రీతో కాన్ఫరెన్స్ పనిమీద వేరే ఊరు వెళ్లాల్సి రాగా, “…నాకే మూలో అనుమానముందని జగన్ పసిగడతాడని” కథకురాలి “ఆదుర్దా.” అనుమానంతో కలగలసిన కథకురాలి ఈ అయిష్టం, పాఠకులకి కూడా ఆ పాత్ర మీద ఒక వ్యతిరేకతని కలగజేస్తుంది. అన్‌లైకబుల్ కారక్టర్. ఇలాంటి అన్‌లైకబుల్ ప్రొటాగనిస్ట్ తో కథని నడిపించి పాఠకుడిని మెప్పించడం కష్టమైన విషయం. ముఖ్యపాత్ర పశ్చాత్తాపంతో ముగించడం రొటీన్ విధానం కానీ, ఈ కథలో సుజాత అలాంటి పరిస్థితికి చేరుకోదు. నచ్చజెప్పే ధోరణిలో భర్త చెప్పే సైద్ధాంతిక విషయాలకి (“ముందుగా ఆ కోరికేదో మనస్సులో పుట్టాలి. అప్పుడే శరీరం దానికి సిద్ధమవుతుంది…”) విరుద్ధంగా ఉండే లోకప్రవృత్తి తన అలజడులకి కారణం అన్నది సుజాత కథ చివర్లో చెబుతుంది: “కొందరికి… చాలామందికి… మనస్సుకూ, శరీరానికీ లంకెవుండదనీ, దేని దారి దానిదేననీ చెప్పాలని ఉంది. కానీ, ఎలా?”. కానీ ఈ సత్యావిష్కరణ, తన స్వంత అనుభవమేనా? లేక లోకవ్యవహారాల్లోనుంచి సంపాదించిన జ్ఞానమా? దీనికి సమాధానం కూడా కథలోనే ఉంటుంది, కాకపోతే వెనక్కి వెళ్లి కొంచె వెతికి అన్వయం చేసుకోవాలి. సమస్య మూలాలు తెలుసుకున్న పాఠకుడు సుజాత పట్ల మొదట్లో చూపించిన వ్యతిరేకతని కథ పూర్తయ్యాక చూపించలేడు!
216 (జి ఉమామహేశ్వర్ – నవ తెలంగాణ ఆదివారం, ఫిబ్రవరి 18): మనసు ఉల్లాసంగా ఉంటే మనుషుల్నందర్నీ ప్రేమించాలనే ఉంటుంది. అయితే మనం బతికే ప్రపంచంలో మనల్ని మనలాగా ఉండనిచ్చే పరిస్థితులు అరుదుగా మాత్రమే తటస్థపడుతుంటాయి. డ్యూటీలో ఉన్న డ్రైవర్ అస్తవ్యస్త మన:స్థితి, పరిస్థితులు సర్దుకున్నాకే కొంచెం మెరుగైంది. అంతవరకూ- బస్సుకేమవుతుందో, అతని కూతురికేమవుతుందో అని పాఠకులని కూడా సీటు అంచున కూచోబెట్టి చదివించడం కథలోని విశేషం. (కథకి పెట్టిన శీర్షిక ఆసక్తికరంగా ఉందికానీ, అతికినట్టు మాత్రం లేదు.)
ప్రశ్న (ఎమ్ రమేష్ కుమార్ – ఆంధ్రజ్యోతి ఆదివారం, ఫిబ్రవరి 25): సన్నపురెడ్డి వెంకటరామిరెడ్డి ‘అతని బాధ’ లో వేసిన ప్రశ్నకి అనుబంధ ప్రశ్న ఇది. ఆ కథలోని పాత్రకి ఉరిశిక్ష పడుతుంది. ఈ కథలోని పాత్రకి ఏడేళ్ల జైలు శిక్ష పడుతుంది. కుటుంబంలో సంపాదిస్తున్న ఏకైక వ్యక్తిని తీసుకెళ్లి జైల్లో పెడితే, అంతవరకూ బయటి ప్రపంచం చూడాల్సిన అవసరం రాని భార్యాపిల్లల సంగతేవిటని ఈ కథలోని భార్య ప్రశ్నిస్తుంది. ఈ బాధలు మేము పడలేం, మమల్ని కూడా తీసుకెళ్లి ఆ జైల్లోనే కూచోబెట్టొచ్చు కదా అని ఆక్రోశంగా ప్రశ్నిస్తుంది. మన చట్టాల్లో రావలసిన సంస్కరణలేవో ఇంకా మిగిలేవున్నాయనీ, ఓ వందేళ్ల తర్వాత వెనక్కి తిరిగి చూసుకుంటే, మనం ఇప్పుడు బతుకున్నదంతా ఓ అనాగరికమైన కాలంలో అనీ అనిపించక మానదు, పై రెండు కథలు చదివితే. (ఈ కథలోని స్ఫూర్తికి పూర్తి విరుద్ధంగా ఈమధ్యనే అమెరికాలో ఒకటి జరిగింది. అదీ ఓ రచయితకి. కర్టిన్ డాకిన్స్ అనే అతనికి ఓ హత్య కేసులో శిక్ష పడగా, దాదాపు పదమూడు సంవత్సరాలుగా అమెరికన్ జైళ్లలో ఉంటున్నాడు. జైల్లో ఉబుసుపోక రాసిన కథలని మెచ్చుకుని ప్రముఖ ప్రచురణ సంస్థ ‘స్క్రిబ్‌నర్’ అతనికి 2016లో లక్షా యాభై వేల డాలర్లు ఇచ్చి 2017లో The Graybar Hotel అనే కథాసంకలనాన్ని ప్రచురించింది. ఆ డబ్బుని అతను తన పిల్లల చదువు ఖర్చుల కోసం డిపాజిట్ చేసాడు. అయితే, మిషిగన్ ప్రభుత్వం మాత్రం అతని శిక్షమీద ఇప్పటి వరకూ నాలుగు లక్షల డాలర్లు ఖర్చయ్యాయనీ, అతనికి వచ్చిన మొత్తం డబ్బుని ఆ ఖర్చులకి జమచేయాలనీ నోటీసిచ్చింది. అక్కడి ప్రభుత్వాలు మనకంటే రెండాకులు ఎక్కువే చదివినట్టున్నారు!)
పేరు మారినా (పి రామకృష్ణ – ఆంధ్రజ్యోతి ఆదివారం, ఫిబ్రవరి 25): ఈ కథలోని నారాయణరెడ్డి, నారాయణగా మారాడు; అభ్యుదయ రచనలు చేసాడు. దళితుల పట్ల సానుభూతిని ప్రదర్శించాడు. కానీ వాస్తవంలో నారాయణరెడ్డిగానే మిగిలిపోయాడు. అలా ఎందుకు మిగిలిపోయాడు, ఎందుకు మారలేకపోయాడు అన్నదానికి ప్రత్యేకంగా కారణాలు చెప్పాల్సిన అవసరం కూడా లేదు, పాఠకుడు ఊహించగలిగిన విషయమే! ‘మీరెందుకు రాసారు’ అన్న ప్రశ్నకి Philip Roth అనే రచయిత చాలా నిఖార్సైన సమాధానం ఇచ్చారు: “[in order] to be freed from my own suffocatingly boring and narrow perspective on life and to be lured into imaginative sympathy with a fully developed narrative point of view not my own.” ఆ రెండో రూపం, నిజరూపం కావడం చాలా అరుదైన అదృష్టం!
భ్రమ (చిరంజీవి వర్మ అనే వత్సవాయి చిట్టివెంకటపతి రాజు – ఈమాట, మార్చ్ 01): కథని తాపీగా చెప్పడంలో రచయితకి రెండు ఇబ్బందులున్నాయి. ఎంత తాపీగా చెప్పాలో నిర్ణయించుకోవడం మొదటిదైతే, స్పీడు రీడర్లని ఆపి ఉంచగలిగే మెరుపుల్ని కథలో విరివిగా విసరగలిగి ఉండాలి. ఈ సూత్రాన్నేదో చక్కగా జీర్ణించుకున్న ఈ రచయిత, సరికొత్త రాజుగారి కథతో వచ్చారు. ఈ రాజుగారు ఓ నాటకాలమ్మాయి రేణుక మీద మనసు పడ్డారు, నిజమే. అలాగని హద్దులు మీరి అవకతవకలు చేసే మనిషి కాదు, అదీ నిజమే. ఆ అమ్మాయి నాటకం వేసి వెళ్లిపోయాక ఆయన ఎందుకు అలా కృంగి కృశించి చివరికి ఆ అమ్మాయి ఎక్కివచ్చిన బండినే చూస్తూ నశించిపోయారో కథలో ఉన్న పాత్రలకి కూడా అర్థం కాలేదు. మనం మన మన సొంత బుర్రల్తో కొన్ని సరదా ఊహాగానాలు చేసుకొని అదే జరిగుంటుందని భ్రమపడవచ్చు గానీ, అసలు నిజం తెలియకుండానే పోయిందే అనే నిరాశ ఎక్కడో మిగిలిపోయుంటుంది. అదీ అసలు బాధ!
డెడ్ ఎండ్ (మధురాంతకం నరేంద్ర – ఆంధ్రప్రదేశ్, మార్చ్ 01): అక్కడే- ఆ పసుపురంగు రెండస్తుల మేడలోనే తను చిన్నతనంలో అవమానాల పాలైంది. ఇప్పుడు అమెరికాలో సంపన్నుడిగా స్థిరపడ్డా, తన గత అవమానాల రూపంలో అది ఇంకా అలా నిలబడే ఉంది. అయితే, ఓడలు బళ్లయి, ఆ ఇంటి వారసులు చెట్టుకొకరూ పుట్టకొకరూ అయిపోయారు. తనకి చిన్నతనంలో జరిగిన అవమానానికి ప్రతీకారం తీర్చుకోవాలంటే, ఆ ఇంటిని సొంతం చేసుకోవాలి. దాని మీద అధికారం సంపాదించాలి. ఇప్పుడు తన దగ్గర డబ్బుంది, కానీ ఆ ఇల్లు అమ్మడానికి వచ్చే వారసుల్లో ఐకమత్యం లేదు. అన్నీ ఉండీ, ఇప్పుడా ఇంటిని సొంతం చేసుకోలేకపోవడం, అతని కథలోని డెడ్ ఎండ్. చక్కటి వస్తువు, సరిపడా కథనం, వెరసి మంచికథ – నిడివిని ఉపేక్షిస్తే!
అతని శీతువు (తల్లావజ్ఝల పతంజలిశాస్త్రి – నవ్య, మార్చ్ 21): దగ్గర్లో ఉన్నవాటిని చేజిక్కించుకుంటానికి యవ్వనంలో ధైర్యమో మరేదో లేకుండా గడిచిపోతే, దూరంగా ఉన్నవాటిని ఆశగా చూస్తూ మోకాళ్ల నెప్పుల్తో కూలబడాల్సిన వృద్ధాప్యం వచ్చిపడింది. ఆఖరికి జీవితం పట్ల ఆసక్తి కరిగి ఆవిరైపోగా, మిగిలింది కేవలం నిమిత్తమాత్రత. కథనంలోనూ, వడిలోనూ పాత్ర మానసిక స్థాయిని ప్రదర్శింపజేస్తూ కథని నడిపించడం ఇందులో నాకు కనిపించిన ప్రత్యేకత. మరోటి – గతాన్ని ముక్కలు ముక్కలుగా వాస్తవికంగా కథలో పేర్చిన పద్ధతి. ఇతివృత్తం చాలా సామాన్యమైనదే అయినా, దాన్ని చెప్పిన పద్ధతి కథకి చక్కగా అమరడం వల్ల మంచికథ అనిపిస్తుంది.
చర్చించవలసిన కథలు
ఇరవై ఒకటో వాడు (జి లక్ష్మి – ఆంధ్రజ్యోతి ఆదివారం, జనవరి 14)
ఈ కథలోని కథకుడు, పోరాటాల బాటని వదిలేసి భద్రజీవితాన్ని ఆశ్రయించానన్న అపరాధభావనకి లోనవుతుంటాడు. ఇలాంటి కథలు కొన్ని ప్రశ్నలకి తావిస్తాయి. భద్రజీవితాల్లో ఉండేవాళ్లంతా దోపిడీదారులేనా? పోరాటాలు చేసేవాళ్లందరూ ఉదాత్తమైన పనులే చేస్తున్నారు అన్న జనరలైజేషన్ సరైనదేనా? (ఈ సందర్భంలో పోరాటాల నేపథ్యాల్లో ఉండే నిర్లక్ష్యాలనీ, అవినీతుల్నీ ఈ సమీక్షలోనే ఉదహరించిన ‘అశ్రువొక్కటి’ అనే కథ – మనం ఆదివారం, మార్చ్ 25 & ఏప్రిల్ 1; రచయిత: వేణు నక్షత్రం – ఎత్తిచూపుతుంది). లేతప్రాయంలో ఉన్న పిల్లలని ఉద్యమాల్లోకి లాగి, వాళ్ల జీవితాలకి అర్ధాంతరంగా ముగింపు వాక్యాలు చెప్పేస్తున్నామని మరి అలాంటి మాస్టర్లకి కూడా అపరాధ భావన ఉందా? ఉంటుందా? విమల రాసిన ‘కొన్ని నక్షత్రాలు, కాసిన్ని కన్నీళ్లు’ కథలో అలాంటి పశ్చాత్తాపం కనిపిస్తుంది. ఇలాంటి విషయాలన్నీ కథని చదివాక చర్చించవలసిన విషయాలు.
క్రమం (వివిన మూర్తి – ఆంధ్రజ్యోతి ఆదివారం, జనవరి 28)
కె.ఎన్. మల్లీశ్వరి రాసిన ‘శతపత్రసుందరి’ కథలోని నీల పాత్రని ఆధారంగా చేసుకొని, ఆ పాత్ర దృక్పథాలకి వ్యతిరేకమైన దృక్పథాలున్న వ్యక్తి (ఆ పాత్ర తండ్రి) కోణంలోనుంచి చెప్పిన కథ ఇది. భావజాలాలమధ్య భేదాలు, ఘర్షణలూ- ఇవన్నీ మనకి తెలిసిన విషయాలే. అయితే, సాధారణంగా ఎవరి కథని వాళ్లే చెప్పుకోవడం న్యాయం అంటారు. అలా కాకుండా, ఒక పాత్ర కథని, ఆ పాత్రకి విరుద్ధమైన ఆలోచనావిధానం ఉన్న మనిషి చెప్పటం ఎంతవరకు సమంజసం? రెండోది ఏకపక్షం అంటాం కానీ, తరచి చూస్తే మొదటిది మాత్రం ఏకపక్ష కథనం కాదా? ఒక పార్శ్వాన్ని మాత్రమే చూపిస్తున్నట్టు కనిపించే ఇలాంటి కథలు, కథనబలం ఉంటే గనక, పాఠకులని ఆ దిశగా ప్రభావితం చేసే అవకాశం ఉందా? అలా ప్రభావితం చేయడం సరైన పనేనా? ఈ కథపై చర్చని రేకెత్తించే ఆసక్తికరమైన అంశాలు ఇవి.
చదివిచూడదగ్గ కథలు
పైన ఉదహరించిన కథలే కాకుండా, ఈ క్రింది కథలు కూడా ఏదో ఒక ఆసక్తికరమైన అంశాన్ని కలిగివున్న కథలే. వీటిని కూడా మీరు చదవొచ్చు.
పద్మావత్ సినిమా కథ చుట్టూ అల్లిన హాస్యం కాలంలో పయనం (మూలా రవికుమార్ – మధురవాణి, జనవరి 01). ప్రేమలో దెబ్బతిన్న అమ్మాయి, ఓ హిజ్రా చేత రక్షింపబడి, వాళ్లు ఎదుర్కొంటున్న సమస్యలకి సహాయంగా తనూ పోరాడాలని నిర్ణయం తీసుకోవడం ఒంటరి సమూహం (పి స్వాతి – అరుణతార, జనవరి 01) కథలో కనిపిస్తుంది. గుంపులు గుంపులుగా ఉండే సమూహాల్లో వ్యక్తులు వాళ్లవాళ్ల అవసరాల నిమిత్తం కలుస్తుంటారు, విడిపోతుంటారు, వాళ్లే పాలకులు, వాళ్లే పీడితులూ, వాళ్లే గడియారం ముళ్లతోబాటు తిరిగే జర్నలిస్టులూ, ఫాక్టరీ కార్మికులూ, విద్యార్థులూ, టీచర్లూ అందరూనూ! అని చెప్పిన కథ నగరంలో ఇంకొక రోజు (కె వి కూర్మనాథ్ – అరుణతార, జనవరి 01). కంకాళశాల (ఎమ్ వి రామిరెడ్డి – వాకిలి, జనవరి 01) కథ, ఆధునిక చదువులని చిత్రించే ఓ సర్రియలిస్టిక్ ప్రయత్నం. అమెరికాలో పిల్లలు తల్లిదండ్రులచేత అరవ చాకిరీ చేయించుకుంటున్నారు అనే రొటీన్ కథాఫిర్యాదుకు ఒక గట్టి జవాబిచ్చిన కథ ప్రవాహం (శ్రీనిధి యెల్లల – సాక్షి ఆదివారం, జనవరి 14). కోడిపందెం (కూనపరాజు కుమార్ – నవ్య, జనవరి 17) చిలికి చిలికి గాలివాన ఎలా అవుతుందో రాజులూ, కోడిపందాలూ నేపథ్యంలో కొంత హాస్యాన్ని మిళాయించి రాసిన కథ. నదీ.. నా గోదావరి.. నీతో ఒక రోజు (దాట్ల దేవదానం రాజు – మనం ఆదివారం, జనవరి 28) కథ, అసంపూర్ణ అజ్ఞానంతో ఆత్మహత్య చేసుకోబోయినవాడు, ఓ రోజు గోదావరితో గడిపి గడించిన జ్ఞానం గురించి – ఓ విభిన్నమైన నేపథ్యంలో.
నానమ్మగా పనికిరాని ముసలావిడ చివరికి స్థానం మారాక ఆయమ్మగా పనికొచ్చింది శిశుపాలిక (తుమ్మూరి రామ్మోహనరావు – కౌముది, ఫిబ్రవరి 01) కథలో. భూమికిందకూడా మనుషులు ఉన్నారూ, వాళ్లని అలా వదిలేయడమే మంచిదనే రిపోర్ట్ ఒకటి కథలో ఉంటుంది కానీ, అసలు ఈ కథ ఎవరు చెబుతున్నారనేదే పాతాళం (రవి కొప్పరపు – కౌముది, ఫిబ్రవరి 01) కథలోని అసలు రహస్యం. నీళ్లంటే భయం ఉన్న కథకుడికి ఒక ఉదంతం గుర్తుంది, అదంత బాగోలేదన్నదీ గుర్తుంది నీళ్ల బయ్యం (మాధవ్ కందాళై – ఈమాట, ఫిబ్రవరి 01) కథలోని కథకుడికి. స్వతంత్రాభిరుచులతో కూడుకున్న సొంతప్రపంచం ఒకటి ఉన్నంతకాలం ఏ బంధమూ లొంగుబాటు కిందకి రాదని గుర్తుచేసిన కథ స్వాధీన (మైథిలి అబ్బరాజు – తెలుగుతల్లి కెనడా, ఫిబ్రవరి 01). ఇంట్లోకూడా కాష్ రిజిస్టర్, సుప్రభాతం బుక్, సందర్శకుల/కదలికల రిజిస్టర్ లాంటివి మెయింటైన్ చేయించి, వాటిని ఆడిట్ చేసి రిపోర్ట్లు రాసే చాదస్తపు ఆడిటర్ గురించి హాస్యకథ కాదేదీ ఆడిట్ కనర్హం (బి నర్సన్ – తెలుగు వెలుగు, ఫిబ్రవరి 01). అఘాడీ (కె వరలక్ష్మి – చినుకు, ఫిబ్రవరి 01) కథలోని ద్వైదీభావం: ఓ జ్ఞాపకాన్నీ, దాని చిక్కదనాన్నీ అలానే ఉండనీయడమా, లేక వాస్తవాన్ని తవ్విపట్టుకుని ఆ పొడుగైన నీడలని చెరిపేయడమా అన్నది. గిఫ్ట్ (పి వి డి ఎస్ ప్రకాష్ – ఈనాడు ఆదివారం, ఫిబ్రవరి 04) కథలో- పిల్లల అభిరుచులతో నిమిత్తం లేకుండా సాకారం కాని తమ కలల్ని వాళ్ల మీద రుద్దడం తప్పని ఓ తండ్రి తెలుసుకుంటాడు. బయాలజీ పాఠాలని ఆధునిక పంచతంత్ర కథలుగా మార్చుకుని అర్థం చేసుకున్న కుర్రాడి కథ డాక్టర్ పంచతంత్రుడు (యాసీన్ – సాక్షి ఆదివారం, ఫిబ్రవరి 04). నో… (అనూరాధ నాదెళ్ల – ఆంధ్రజ్యోతి ఆదివారం, ఫిబ్రవరి 11) కథ చైల్డ్ అబ్యూజ్ జరగగల అవకాశాల గురించీ, ‘నో’ చెప్పటంలో ఉండాల్సిన దృఢత్వం గురించీ. “అన్నీ ఉన్నయ్యనుకోవటమేగానీ, మా అక్కకి ఏమీ తీరలేదు,” అని ఆ చెల్లెలు ఒక్కమాటలో తేల్చిచెప్పినా, ఓ జీవితకాలపు వ్యధ, న్యూనత ఆ అక్కది ఎక్కడిదాకా…? (నల్లూరి హేమకుమారి – ఈనాడు ఆదివారం, ఫిబ్రవరి 11) కథలో. ఇంకో మనిషిని ద్వేషించడం కూడా ఆ మనిషితో ఒక ఎమోషనల్ బాండ్‌ని ఏర్పాటు చేసుకోవడమేనని చెప్పిన చిన్నకథ పూల దొంగ (గుడిపూడి రాధికారాణి – మనం ఆదివారం, ఫిబ్రవరి 11). చావుకీ, బతుక్కీ, దోమకీ, కాటుకీ అన్నిటికీ ఆధార్ అడుగుతున్న దేశం గురించిన కథ లేతపచ్చ ఆకు (బమ్మిడి జగదీశ్వరరావు – సాక్షి ఆదివారం, ఫిబ్రవరి 18).
ఉభయకుశలోపరి (ఇంద్రగంటి శ్రీనివాసశాస్త్రి – కౌముది, మార్చ్ 01) కథ పాత అలవాట్ల మధుర జ్జాపకాలని కొత్తతరం గుర్తించి గౌరవించిన ఆహ్లాదం. అవతలివాళ్ల కాపురం గురించి అభిమానానుమానాలతో తల్లడిల్లి పేద్దకథ నడిపిన ఇందు కథ ఒక వోర! (ఆర్ దమయంతి – ఈమాట, మార్చ్ 01). కథానాయకుడు తనవాళ్లని ఎదిరించి ఆ పెళ్లి చేసుకుని, కష్టాలు పడుతున్న విషయం కూడా గ్రహించకుండా హాస్యాన్ని పంచడం ఈ చరిత్ర ‘ప్రేమ’ సిరాతో (రమాదేవి జాస్తి – తెలుగు వెలుగు, మార్చ్ 01) కథ. డిగ్నిటీ ఆఫ్ లేబర్ గురించి హుందాగా రాసిన ప్రవాస కథ పాకీవాడు (ఆర్ శర్మ దంతుర్తి – సుజనరంజని, మార్చ్ 01). రాజయోగం (జి ఉమామహేశ్వర్ – పాలపిట్ట, మార్చ్ 01) సమర్థుడైన రాజు ప్రజల గుండెల్లో నిలిచిపోతాడని సుయోధనుడి పరంగా చెప్పిన కథ. ఆడపిల్లలు పెద్దపిల్లలు కావడం గురించి, వ్యథతో కూడిన కథ పన్నెండో మైలురాయి (ఎమ్ ఎమ్ వినోదిని – అరుణతార, మార్చ్ 01). తల్లిదండ్రుల్లో ఒక్కళ్లనే ఎన్నుకోవలసిన అవస్థ ఎదురైతే (‘ఎ హార్స్ వాక్స్ ఇన్‌టూ ఎ బార్’ నవలలోని ఓ భాగం కూడా ఇలాంటి సమస్యని చిత్రిస్తుంది. కానీ చంద్రశేఖరరెడ్డి ఈ కథని చాలా ఏళ్ల క్రితమే రాసిన విషయం ఈ సమీక్షకుడికి వ్యక్తిగతంగా తెలుసు!), పిల్లలు ఏం చేయాలి అన్న ప్రశ్నకి సరైన సమాధానం లేదన్న కథ మిగిలిందెవరు? (టి చంద్రశేఖరరెడ్డి – సాక్షి ఆదివారం, మార్చ్ 04). కారు కొని కష్టాలు పడుతున్నవాడికి ఉచిత సలహాలు ఒక అవమానం అయితే, అంతకుమించిన అవమానం మరోటి జరుగుతుంది వెతికి చూడండి, ఎవడైనా దొరక్కపోడు! (పొత్తూరి విజయలక్ష్మి – సంచిక, మార్చ్ 18) కథలోని కథానాయకుడికి. పేషెంట్, తనకి ఉన్న జీవించే హక్కుకి వ్యతిరేకంగా డిఎన్‌ఆర్ మీద సంతకం పెట్టినా (దాదాపుగా అన్నీ ఆర్థిక కారణాలే), అతని కవిత్వం మీద అభిమానం కొద్దీ ఖర్చులు తనే భరిస్తానని ట్రీట్‌మెంట్ చేసిన డాక్టర్ కథ డి ఎన్ ఆర్ (మధు చిత్తర్వు – సంచిక, మార్చ్ 18). ఆసక్తికరమైన ఫాంటసీ కథనపు తోట వెలుగుపూలు (భగవంతం – ఆంధ్రజ్యోతి ఆదివారం, మార్చ్ 25). అడవుల్లో పోరాటాలు చేసే ఉద్యమకారుల దైన్యజీవితం వేరూ, ఆ ఉద్యమాలకి అనుబంధంగా ఉండే నగర కార్యాలయాలలో సానుభూతిపరుల దర్జాలు వేరూ అని చెప్పిన కథ అశ్రువొక్కటి (వేణు నక్షత్రం – మనం ఆదివారం, మార్చ్ 25 & ఏప్రిల్ 1).
కథాహాస్యం
ఒక వెబ్ పత్రికలో వచ్చిన కథలోని లేడీ డాక్టర్ భర్త కూడా డాక్టరే. ఆయన బ్రీఫ్‌కేస్‌లో అనుమానాస్పదంగా ఒక అమ్మాయి ఫొటో ఈ లేడీ డాక్టర్‌కి కనిపిస్తుంది. అనుకోకుండా ఆ అమ్మాయి సదరు డాక్టరమ్మగారి దగ్గరికే పేషెంట్‌గా వస్తుంది. పేరు: దీప, పరిస్థితి: గర్భవతి, అవసరం: రొటీన్ చెకప్. ఆ సమయంలో లేడీ డాక్టర్ గారి స్వగతం: “డెలివరీకి వచ్చినపుడు ఆ దీపని ఆపరేట్ చేసి ఆమెకు యుటిరస్ రిమూవ్ చేస్తే సరి ఇక భవిష్యత్తులో మరే స్త్రీకి ఈ అమ్మాయి వల్ల ముఖ్యంగా తనకు తమ కుటుంబ పరువు ప్రతిష్టకు ఎలాంటి మచ్చ వుండదు. సమస్య వుండదు.” (యుటెరస్ తీసిపారేస్తే అక్రమసంబంధాలన్నీ ఆగిపోతాయన్నమాట!). ఇంకా ఉంది, అప్పుడే అయిపోలేదు. ఆ అమ్మాయి డెలివరీకి వచ్చినపుడు “…ఆపరేషన్‌కి రెడి చేయండి సెడేటివ్ ఇవ్వండి అని చకచక ఆర్డర్లు పాస్ చేసింది [డాక్టర్] హరిత.” కథ ఇక్కడితో అయిపోయింది కానీ, చివరికి ఇలాంటి డాక్టర్ చేతిలో ఆ అమ్మాయి కూడా పాపం అయిపోయిందో ఏమిటో అని అనుమానం వస్తుంది!
విదేశీ కథాసాహిత్యం
ఇంకెక్కడో కథలు రాసేవారు ఎలా రాస్తున్నారు, కథలు కొత్తగా ఎలా చెబుతున్నారు అని గమనించడానికి అందుబాటులో ఉన్న ఇంగ్లీష్ పత్రికలలోని కథలని చదువుతుంటాను. అనువాదాలు వెంటనే జరగవు కాబట్టి యూరోపియన్ సమకాలీన కథాసాహిత్యం చదవడం అసంభవమైన పని. చివరికి, అమెరికన్ పత్రికలలో ఇప్పుడొస్తున్న కథలు మాత్రమే మనం పరిశీలించగలిగిన కథలు. వాటిల్లో The New Yorker, Harper’s, The Paris Review, The Atlantic రెగ్యులర్‌గా కథలకోసం చదివే పత్రికలు.
ఈ సంవత్సరం ప్రారంభంలో అమెరికాలోని న్యూయార్కర్ పత్రిక, సాదియా షెపర్డ్ (Sadia Shepard) రాసిన ‘ఫారిన్ రిటర్న్డ్’ అనే కథని ప్రచురించింది. ఈ కథ మేవిస్ గలాంట్ (Mavis Gallant) రాసిన The Ice Wagon Going Down the Street స్ఫూర్తితో రాసానని సాదియా స్వయంగా చెప్పుకున్నప్పటికీ, ఈ కథ అసలు కథకి మక్కీకి మక్కీ కాపీ అని పెద్ద దుమారం చెలరేగింది. చాలా కొద్ది వ్యవధిలోనే న్యూయార్కర్ పత్రిక కథల విషయంలో సంచలనం రేగడం ఇది రెండోసారి (మొదటి వివాదం Kristen Roupenian రాసిన “Cat Person” అనే కథ గురించి. ఇది ది న్యూయార్కర్, డిసెంబర్ 11 2017 సంచికలో ప్రచురించబడింది. ఇది సైద్ధాంతికమైన విషయాల గురించి గొడవ.) షెపర్డ్, గలాంట్ రాసిన రెండు కథలూ చదివాక, మాతృకలోని విషయమే అనుసరణలోనూ ఉన్నా, అందులో ఉన్న ఇంకేదో ఇందులో లేదన్నది అర్థం అవుతుంది. అసలు ఇలా తిరిగిరాయాల్సిన అవసరం ఆ రచయిత్రికి ఎందుకు వచ్చిందో. ఈ పున:కథనం ఏం సాధించిందో మాత్రం అంతుపట్టని విషయం. (ఫ్రాన్సీన్ ప్రోజ్ చేసిన విమర్శ, ఫేస్‌బుక్‌లో: https://goo.gl/UEvct3 )
ఇక ఈ సమీక్షా కాలంలో వచ్చిన కథల్లో నాకు నచ్చిన కథలు:
Mrs. Crasthorpe (William Trevor – The New Yorker, Feb 26)
ఈ నాలుగుపేజీల అద్భుత ప్రపంచంలో ఉన్న సాధారణమైన విషయం ఏవిటంటే, ఇదో విలియం ట్రెవర్ తరహా మంచికథ కావడం. అసాధారణమైన విషయం ఏమిటంటే, కథని పాఠకుడు ఎంత వేగంతో చదవాలో రచయిత కాస్త అటూయిటుగా నిర్ణయించి, ఆ ‘పేస్’ని కూడా కథలోనే చొప్పించడం. కథని గబగబా చదువుకుంటూ వెళ్లేవాళ్లకి, సగం పైన కథ చదివినా ఏవీ అర్థం కాదు. అక్కడికి ఆపేసి, బ్రేక్ తీసుకుని, మళ్లీ నెమ్మదిగా చదువుకుంటూ రావాల్సిందే! కథలో ఉన్న సారం అంతా పాఠకుడి లోలోపలకి ఇంకడం కోసం ట్రెవర్ ఈ పద్ధతిని అవలంబించారేమో అనిపిస్తుంది. (ఈ శిల్పాంశం కేవలం నా కల్పన మాత్రమే. దీనికి ఎలాంటి సాహిత్య సిద్ధాంతాలూ లేవు, నాకు తెలిసినంతవరకూ… )
కథకి ఎంతమాత్రం వివరాలు అవసరమో అంతమాత్రం చెప్పి, కొన్ని విషయాలని పాఠకులకి వదిలేసి వాళ్లని సహరచయితలని చేసేసి, ఓ ప్రేమరాహిత్యం గురించి భావరహితంగా చెప్తూ, అలాంటి భావరాహిత్యం పట్ల ఇంకో పాత్ర సిగ్గుపడటం అనేది స్థూలంగా ఇతివృత్తం. ఏదో గ్రహపాటు వల్ల ఇలా (ఇలా అంటే ఈ క్రమంలోనే అని కాదు. గతితప్పడానికి ఎన్ని కారణాలు లేవు!) గతితప్పిన జీవితాలలోని విషాదాన్ని కప్పేసి ఉంచే పైపొరలని మాత్రమే చూపిస్తూ, అసలు విషయాన్ని తగిన సమయంలో మరింత విషాదాత్మకంగా – ఓ పశ్చాత్తాపంతో సహా కలిపి – చూపడం ఈ కథలో విలియం ట్రెవర్ చాలా చులాగ్గా చేసినట్టు కనిపించే పని.
Seeing Ershadi (Nicole Krauss – The New Yorker, Mar 05)
అబ్బాస్ కిరోస్టామీ తీసిన ‘టేస్ట్ ఆఫ్ చెర్రీ’ సినిమా, ఈ కథకి నేపథ్యం. సినిమాలోని ప్రధాన పాత్ర ‘బాదీ’ (హొమాయూన్ ఎర్షాదీ అనే నటుడు ఈ పాత్రని పోషించాడు), ఆత్మహత్య చేసుకోవాలని నిర్ణయించుకొని, తను చనిపోయాక మట్టిపోసి పూడ్చిపెట్టే మనిషి కోసం వెతుకుతుంటాడు. డబ్బు ఆశ చూపించినా ఇద్దరు ముగ్గురు తిరస్కరించగా, చివరికి ఒక మనిషి అతనికి దొరుకుతాడు. చివరికి సినిమాలో ఏమవుతుందీ, అసలు సినిమా ఎలా ఉంటుందీ- ఇవన్నీ పక్కనపెడితే, నటుడు ఎర్షాదీ మొహంలో కనిపించే నిస్సహాయతా, నిరాశా, దాన్ని దిగమింగుకునే ప్రయత్నమూ – ఈ చిత్రాలు మనల్ని ఓ పట్టాన వదిలిపెట్టవు. ఈ సినిమానీ, అందులో ఎర్షాదీ నటననీ చూసి వాటిని మరిచిపోలేనంతగా ప్రభావితురాలై, ఆ విషాదంతో అవ్యక్తమైన అనుబంధాన్నేదో ఏర్పరచుకున్న కథకురాలు ఈ కథలో ఓ పాత్ర కాగా, ఇదే సినిమాని చూసి అంతగానూ ప్రభావితురాలైన స్నేహితురాలు మరో పాత్ర. ఒకే సినిమా ఇద్దరు వ్యక్తులమీద తన ప్రభావాన్ని ఎంత విభిన్నంగా ప్రసరిస్తుందో కథలో చూపిస్తూ, ఒక మనిషి మీద అలాంటి ప్రభావం ఎప్పుడూ ఒకే తీరుగా ఉండదనీ, మన మనఃస్థితులని బట్టి దాని ప్రభావం కూడా మారుతూ ఉంటుంది అనేది ఈ కథలోని వస్తువు. కొంత వాస్తవికతనీ, కొంత తాత్వికతనీ కలగలిపి ఇన్ని విషయాలని మరికొన్ని విషయాలతో కలిపి ఒకే కథలో చెప్పడం రచయిత్రి నికోల్ క్రాస్ అవలీలగా చేయగలిగారు. ముఖ్యంగా సినిమా ముగింపులోని ఓ విషయాన్ని ఈ కథ ముగింపులో వాడుకున్న పద్ధతి – మనకి కనిపించే చీకటి కేవలం చీకటే కాదనీ, కనుక్కుంటే అందులోనూ కనిపించేవో వినిపించేవో ఉంటాయన్న ఆశావాదాన్ని – ఒక్కటే మరో ఎత్తు. (ఈ కథని చదవడం మొదలుపెట్టాక, కథని ఆపేసి, సినిమాని చూసి, అప్పుడు మిగతా కథని చదివి, కథ ముగింపు చదివాక సినిమా ముగింపు మరోసారి చూడాల్సి వచ్చింది! మొత్తం మీద ఈ ఒక్క కథని పూర్తిచేయడానికి ఒకరోజు పట్టింది!!)
The Boundary (Jhumpa Lahiri – The New Yorker, Jan 22)
ఝుంపా లాహిరి దాదాపు నాలుగేళ్ల తర్వాత రాసిన కథ ఇది. వలస ప్రజల దీనావస్థల గురించి ఇంకో కథా అనిపించినా, కథని మినిమలిస్టిక్‌గా చెప్పిన తీరు బాగుంది. ఇటాలియన్ భాషలో మొదట దీన్ని రాసిన రచయిత్రి, తనే దాన్ని ఇంగ్లీష్‌లోకి అనువదించడం మరో విశేషం.
Violations (Catherine Lacey – Harper’s, Mar 01)
మనుషులు విడిపోయినా- వాళ్ల మధ్యన తెగీ తెగనివీ, అతికీ అతకనివీ, కనీ కనిపించనివీ సన్నటి దారాల పోగులేవో మిగిలిపోయే ఉంటాయి. ఈ కథలోని అబ్బాయీ అమ్మాయీ విడిపోయినా, ఒకళ్లని ఒకళ్లు నిందించుకోవడానికి బోలెడన్ని కారణాలున్నా, ఇద్దరి మధ్యా ఉండే మిత్రశత్రుత్వం మనకి కనిపిస్తూనే ఉంటుంది. పేరాలబాటు సాగిపోయే వాక్యనిర్మాణమూ (అలాంటి వాక్యాలలో ఎన్ని వివరాలని పొందుపరచవచ్చో ఈ కథలో గమనించవచ్చు…), కథలోని కథలూ సాధారణంగా ఒక సంక్లిష్టతని సృష్టించాలికానీ, అదేమిటో ఈ కథలో అవే బాగున్న విషయాలు అనిపిస్తాయి. ఈ వచనానికి ముచ్చట పడి ఈ రచయిత్రి కథలు ఇంకేవేవి దొరుకుతాయీ అని వెతికి పట్టుకుని మరీ (ఈ సంవత్సరం ఆగస్ట్ లో ఈ రచయిత్రి మొదటి కథాసంపుటం ‘Certain American States’ విడుదల కానుంది.) – Because You Have To (Harper’s, Aug 2017), UR Heck Box (The Oxford American, Fall 2017) అనే రెండు మంచి కథలను మళ్లీ చదివాను!
No More Maybe (Gish Jen – The New Yorker, Mar 19)
సరళమైన వాక్యాలతో కథలోకి లాగేసి, పాఠకుడిని చాలా తేలిగ్గా తనలోకి పొదువుకొనే కథ ఇది. అమెరికాలో స్థిరపడుతూ ఉన్న చైనీయుల గురించి రాసిన ఈ కథలో కొంత హాస్యమూ, కొన్ని భావోద్వేగాలూ, జ్జాపకశక్తిని కోల్పోతున్న మామగారూ, ఇంగ్లీష్ నేర్చుకుంటున్న అత్తగారూ, మధ్యలో రేసిజం – ఇలా చాలా విషయాలమీద ఈ కథ సులువుగా నడిచిపోతూ ఉంటుంది. ముగింపులో కొంత మెలోడ్రామాని చొప్పించినట్టుగా అనిపించడం ఒక్కటే ఈ కథకి ఉన్న చిన్న లోపం.
ఇవీ ఈ మూడునెలల కాలపు కథావిశేషాలు. మీకు నచ్చిన కథల గురించి మీరూ చెప్పండి. ఇక్కడ కామెంట్ల రూపంలోనో, మరో వ్యాసరూపంలోనో!
మరో సమీక్షతో జులై మొదట్లో మళ్లీ కలుద్దాం!
ఎ. వి. రమణమూర్తి