శ్రీ విడ‌ద‌ల సాంబ‌శివ‌రావుకు జాషువా పుర‌స్కారం – ప్రెస్ నోట్

0
11

[dropcap]సా[/dropcap]హిత్యం స‌మాజ హితం కోరాలి.. క‌ళ.. క‌ళ కోసం కాదు.. ప్ర‌జ‌ల కోసం మ‌న‌గ‌ల‌గాలి. ఈ ప్రాథమిక అంశాల‌నే స్పూర్తిగా తీసుకొని గ‌త కొన్ని ద‌శాబ్దాలుగా చిల‌క‌లూరిపేట ప‌ట్ట‌ణానికి చెందిన‌ ప్ర‌ముఖ క‌వి, నాట‌క ర‌చ‌యిత‌, రంగ‌స్థ‌ల క‌ళాకారులు విడ‌ద‌ల సాంబ‌శివ‌రావు త‌న ప్ర‌స్థానాన్ని కొన‌సాగిస్తున్నారు. వీరి ప్ర‌తిభ‌ను గుర్తించి ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్ర అధికార భాషా సంఘం, ఆచార్య నాగార్జున విశ్వవిద్యాలయం 26 సెప్టెంబర్ 2023 మంగ‌ళ‌వారం నాడు సంయుక్తంగా నిర్వ‌హించిన మ‌హాక‌వి జాషువా 128వ జయంతి వేడుకల సందర్భంగా ‘జాషువా సాహితీ పురస్కారం’ను అందించారు. ఈ సంద‌ర్బంగా నిర్వ‌హించిన కార్య‌క్ర‌మంలో అవార్డును ఆచార్య నాగార్జున విశ్వవిద్యాలయం ఉప కులపతి రాజశేఖర్, రాష్ట్ర అధికార భాషా సంఘం అధ్యక్షులు విజయ బాబు విశ్వవిద్యాలయం ప్రాంగణంలో అంద‌జేశారు.

సాహితీ-క‌ళ‌రంగంలో స‌వ్య‌సాచి..

క‌విత‌, క‌థ, నాటక ర‌చ‌న‌, వివిధ అంశాల‌పై వ్యాసాలు ఇలా సాహిత్య రంగంలోనూ, సినిమా, నాట‌కాల్లో క‌ళాకారుడుగానూ విడ‌ద‌ల సాంబ‌శివ‌రావు స‌వ్య‌సాచిగా రాణిస్తున్నారు. హైస్కూల్లో చదివే రోజులలోనే ‘నటన’ పట్ల మక్కువ పెంచుకొని అప్పటి నుంచే ముఖానికి మేకప్ చేసుకోవడం ప్రారంభించారు. 1968లో ‘బాలచంద్రుడు’ ఏకపాత్రాభినయంతో ఆయ‌న‌ నటజీవితం ప్రారంభమైంది. 53 సంవత్సరాల వారి నటజీవితంలో ఆంధ్ర రాష్ట్రంలోని అన్ని పరిషత్తులూ, గ్రామ సీమలలోని పలు వేదికలూ వారికి సుపరిచితాలే. ప్రముఖ రచయితలు, వర్ధమాన రచయితలు రాసిన నాటికలు, నాటకాలలో అద్భుతమైన పాత్రనెన్నింటినో పోషించారు. ఉత్తమ నటుడుగా, క్యారెక్టర్ యాక్టర్‌గా వందలాది బహుమతులు పొందారు. విడదల వారు ప్రధాన పాత్ర పోషించిన ‘ధ్వంస రచన’ నాటిక 2008లో రాజమండ్రిలో జరిగిన ‘నంది’ నాటకోత్సవాలలో ఉత్తమ ప్రదర్శనగా ఎంపికై ‘బంగారు నంది’ బహుమతిని గెలుచుకుంది. 2002 హైదరాబాదులో జరిగిన నంది నాటకోత్సవాలలో వీరు టైటిల్ పాత్ర పోషించిన ‘వ‌ఱుడు’ నాటిక ఉత్తమ ద్వితీయ ప్రదర్శనకు ఎంపికై ‘రజత నంది’ బహుమతి పురస్కారం గెలుచుకుంది. ఆంధ్రా సోషల్ అండ్ కల్చరల్ అసోసియేషన్, చెన్నైవారు 2001లో నిర్వహించిన ఉగాది నాటికల కళాపరిషత్ ‘వుడు’ నాటికలోని పాత్రకు ఉత్తమ క్యారక్టర్ నటుడుగా గోల్డ్ మెడల్ పొందారు. రాష్ట్రస్థాయిలో ఉత్తమ నటుడుగా ఎక్కువ బహుమతులు సాధించిన నటుడికి ఇచ్చే ‘అత్యుత్తమ నటుడు’ పురస్కారాన్ని 2002లో ‘వబడు’ నాటికలోని దశరధరామయ్య పాత్రకు విడదల వారు ‘రాజమండ్రి – కళావాణి’ సంస్థ ద్వారా అందుకున్నారు. ఇంకా, నేటివరకూ ప్రతి సంవత్సరం నటుడుగా వివిధ పరిషత్తులలో ఉత్తమ నటనకు పురస్కారాలను అందుకుంటూనే ఉన్నారు. మ‌రోవైపు నాట‌క ర‌చయిత‌గా విడ‌ద‌ల వారిది వినూత్న శైలీ. ఆంధ్ర‌రాష్ట్రంలో ఎక్క‌డ ప్ర‌ద‌ర్శ‌నా జ‌రిగినా సంచ‌నాలు రేకెత్తించాయి. ‘పుణ్యభూమి నాదేశం’ (నాటకం), ‘తలారి తీర్పు’ (నాటిక) 2007 జనవరిలో నిజామాబాద్ రాజీవ్ గాంధీ ఆడిటోరియంలో జరిగిన నంది నాటకోత్సవాలలో ప్రదర్శింపబడి ప్రేక్షకుల ప్రశంసలు పొందాయి. అదే సంవత్సరం విడదల వారు ముఖ్యపాత్ర (దేవుడు) లో నటించిన ‘దేవుడా దేవుడా’ నాటిక కూడా ప్రదర్శించబడింది. ఈ విధంగా ఒకే సంవత్సరం నంది నాటకోత్సవాలలో రచయితగా, (నాటకం & నాటిక), నటుడుగా మూడు విభాగాలలో ఎంపిక కాబడి పాల్గొనటం ఓ అరుదైన విశేషంగా పేర్కొంటూ ఎందరో కళారంగ ప్రముఖులు ప్రశంసల వర్షం కురిపించారు. ఇప్పటికీ ప్రతి సంవత్సరం నటుడుగా, రచయితగా రంగస్థలంపై ఆయన ప్రతిభను కొనసాగిస్తూనే ఉన్నారు. ‘మట్టిమనిషి’ (ఈటీవి సీరియల్) లో అక్కినేని నాగేశ్వరరావు బావమరిదిగా, వియ్యంకుడిగా ఒక మహోన్నతమైన పాత్రలో 52 ఎపిసోడ్స్‌లో నటించడం జరిగింది. ‘శ్రీకారం’ (జెమిని సీరియల్)లో యమునకు తండ్రి పాత్రలో స్వాతంత్య్ర సమరయోధుడిగా నటించడం జరిగింది. ప్ర‌స్తుతం ఈటీవీలో ప్ర‌సారం అవుతున్న ‘రావోయి చంద‌మామ‌’లో ప్ర‌ముఖ పాత్ర పోషిస్తున్నారు. ఇంకా కొన్ని సీరియల్స్‌లో ముఖ్యమైన పాత్రలు పోషించడం జరిగింది. అలాగే ఆర్. నారాయణమూర్తి దర్శకత్వంలో ‘ఊరు మనదిరా’ చిత్రంలో తెలంగాణ రైతుగా ముఖ్యమైన పాత్ర పోషించడం జరిగింది. ఇంకా ‘దొంగోడు’, ‘సేవకుడు’, ‘జై’ తదితర సినిమాల్లో కొన్ని ముఖ్యమైన పాత్రలు పోషించారు.

వాస్త‌వ జీవ‌న చిత్రాలుగా విడ‌ద‌ల వారి ర‌చ‌న‌లు..

హైస్కూల్లో చదివే రోజుల్లోనే విడదల వారిలోని బావుకతను గుర్తించిన ఉపాధ్యాయులు కొందరు రచనలు చేయవలసినదిగా ప్రోత్సహించారు. గురువుల ప్రోత్సాహంతో అప్పటి నుంచే చిన్న చిన్న కథలు, కవితలు రాయడం ప్రారంభించారు. స్కూలు, కాలేజీ వార్షికోత్సవ కార్యక్రమాలలో ప్రదర్శించడం కోసం ‘నాటికలు’ రాసేవారు. వారు రాసిన కథలు, కవితలు కాలేజీ సావనీర్లో ప్రచురించబడ్డాయి. ఈ విధంగా రచనా వ్యాసంగంపై మక్కువ పెరిగింది. మన చుట్టూ వున్న సమాజంలో జరిగే సంఘటనలు విడదల వారిని ఎక్కువగా ఇన్‌స్పైర్ చేస్తూ వుండటం వలన వాస్తవికతకు ప్రాధాన్యత ఇచ్చి రచనలు చేశారు. వీరి రచనలన్నీ వాస్తవ జీవన చిత్రీకరణలే అని చెప్పడంలో ఎలాంటి అతిశయోక్తి లేదు. వివిధ పత్రికలలో బందగి, గమ్యం, ఆత్మబంధం, బంగారుతల్లి మొదలైన కథలు విడదల వారు రాయడం జరిగింది. 1000కి పైగా కవితలు వివిధ పత్రికలలో ప్రచురించబడ్డాయి.

నిరంత‌రం ర‌చ‌న‌లు, న‌ట‌న‌ల‌తో నిత్య నూత‌నంగా క‌నిపించే విడ‌ద‌ల సాంబ‌శివ‌రావుకు జాషువా పుర‌స్కారం ల‌భించ‌టం ప‌ట్ల ప‌లువురు ఆయ‌న‌కు అభినంద‌న‌లు తెలిపారు. రాష్ట్ర వైద్య ఆరోగ్య‌శాఖా మంత్రి విడ‌ద‌ల ర‌జిని, ఇత‌ర సాహితీ ప్ర‌ముఖులు అభినంద‌న‌లు తెలిపిన వారిలో ఉన్నారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here