జవాబు దొరికింది, కానీ!

0
14

[dropcap]శ్రీ[/dropcap]కళ చీటికీ, మాటికీ ఎప్పుడూ మొగుడ్ని తిడుతూనే ఉండేది. దానికో ప్రత్యేకమైన కారణం గానీ మరోటి కానీ ఉండేది కాదు. పెళ్ళైన కొత్తలో ఆమె బాగానే ఉండేది. వారి కాపురం చూసిన వారు, పప్పుబెల్లాల్లా బానే కలిసిపోయారని చెవులు కొరుక్కుని మరీ మురిసిపోయేవారు. తరవత్తర్వాత కర్పూరం, కందకాల్లా తయారయ్యారని చెవులు గిల్లుకుని లెంపలేసుకున్నారు. పెళ్ళైన మొదటి సంవత్సరం మెత్తగా పత్తిలా ఉన్న శ్రీకళ, రెండవ సంవత్సరం నుండీ ఇనప సుత్తిలా తయారైంది. శేఖరానికి కూడా ఆమె ఉన్నట్టుండి ఎందుకు ఇలా తయారైందో ఎంత ఆలోచించినా కొంచెం కూడా అంతు చిక్కలేదు. సంసారం సాగరంలా కాకుండా, ఓ సుస్వరంలా హాయిగా సాగిపోవాలంటే ఏం చేయాలి అనేది ఆమెకి వివరించే ప్రయత్నం చేసేవాడు. కానీ ఆ వివరణ మొదలయ్యీ కాగానే, కయ్యిమంటూ ఆమె రణానికి కాలు దువ్వుతుండడంతో, ఏం చేయాలో పాలుపోక ఆ ఆలోచనని విరమణ చేసుకున్నాడు.

అయితే అలా ఆమె ఊరికే నోటికొచ్చినట్టు తిట్టిన సందర్భాల్లో, ఆ మాటలు భరించలేక ఒకట్రెండు సార్లు చెంప దెబ్బ కొట్టాడు, మూడు నాలుగు సార్లు ఎదురు తిరిగి గట్టిగా మాట్లాడాడు. కానీ ఆ తర్వాత పరిస్థితులు మరీ వరస్ట్‌గా తయారయ్యేవి. అతని మీద కోపం తాలూకూ మంటతో వంట చేసేది కాదు. బట్టలు వాషింగ్ మిషన్‌లో వేసేది కాదు. ఇలా అన్నీ పనులతో పాటు, మాట్లాడ్డం కూడా మానేసి టీవి చూస్తూ కూర్చునేది. శేఖరం చేసేది లేక సారీ చెప్పి, తర్వాతో సిల్క్ సారీ కొనిచ్చి, ఆమెని గుచ్చి గుచ్చి బ్రతిమాలి, మరో సారి ఇలా జరగదని భరోసా ఇచ్చి మరీ శాంతింప చేసేవాడు. కానీ ఆ తర్వాత మళ్ళీ అంతా మామూలే. ప్రయోజనం ఏవీ ఉండేది కాదు. తర్వాత కూడా ఆమెది అదే తీరు. ఇక ఇలా ఆమెని ఇంత కంటే ఘాటుగా ఏమైనా అంటే, ఏం చేస్తుందో లేక ఏం చేసుకుంటుందో అనే భయంతో, ఆమెతో వాదించడం పూర్తిగా మానేశాడు.

ఆమె పనిగట్టుకుని కొత్త కొత్తగా కనిపెట్టి తిట్టే తిట్లకి నెమ్మెదిగా అలవాటు పడ్డాడు. ఆమె గొడవ చేసినపుడు గుడికెళ్ళేవాడు. ప్రశాంతత కోసం యోగా చేసేవాడు. మెడిటేషన్ క్లాసెస్‌లో కూడా జాయిన్ అయ్యాడు.ఇలా విజయవంతంగా ఆమెతో వేగుతూ సాగిపోతున్నాడు శేఖరం. అయితే, ఓ సారి ఆమెకి డెంగ్యూ వచ్చి బాగా సీరియస్ అయింది. శ్రీకళకి డెంగ్యూ కంటే, శేఖరమే ప్రమాదంగా తయారవుతాడని హడలి చచ్చింది. ఇపుడు తనని పట్టించుకోకుండా గాలికి వదిలేసి పగ తీర్చుకుంటాడేమో అని తెగ భయపడింది. కానీ శేఖరం, అలా విలనిజం చూపలేదు. ఆఫీసుకి సెలవు పెట్టి ఆమె దగ్గరే ఉండిపోయాడు. ఆమెకి కావాల్సినవన్నీ తానే ఆసుపత్రికి తెచ్చిచ్చేవాడు. అతను ఉండలేని సమయంలో వాళ్ళమ్మని ఉంచేవాడు. శ్రీకళకి ఇదంతా చాలా వింతగా అనిపించింది. ఆశ్చర్యం కూడా వేసింది. తర్వాత రెండు మూడు రోజులకి, ఆమె డిశ్చార్జ్ అయ్యాక ఆమెలో టన్నుల కొద్దీ మార్పు వచ్చింది. భర్త శేఖరాన్ని ఆడిపోసుకోవడం మానేసింది. ఎపుడైనా అతను మూడీగా ఉంటే పకోడీలు వేసి తినిపించేది. ఉత్సాహంగా కనిపిస్తే, ఊసులు చెప్పి ఉక్కిరి బిక్కిరి చేసేది. ఇలా అంతా నార్మల్ అయిపోయింది.

ఓ రోజు, శేఖర్ ఆఫీసుకు వెళ్ళి పోయాక తన బీరువా తీసింది. సీక్రెట్ లాక్ అడుగున నెక్లెస్ బాక్స్‌లో ఓ ఉత్తరం తీసి మరో సారి చదివింది. ‘నేను ట్రాన్స్‌ఫర్ మీద వెళ్లిపోతున్నాను. కానీ నీ గుండెల్లో ఉంటానని నా నమ్మకం శేఖర్. నా నెంబర్ బ్లాక్‌లో పెట్టేశావ్, అందుకే ఇలా ఈ ఉత్తరం రాస్తున్నాను – నీ లత’ అని ఉంది. ఆ ఉత్తరం వంక కారంగా చూస్తూ, ‘వాళ్లిద్దరి మధ్యా ఏం జరిగిందో ఏమో తెలీదు. ఆమె రాసిన ఈ ఉత్తరం, ఆయన రోజూ ఆఫీస్‌కి పట్టుకు వెళ్ళే ల్యాప్టాప్ బాగ్‌లో దొరికింది. ఈ తాడూ బొంగరం లేని ఆధారం పట్టుకుని ఇన్నాళ్లూ ఇంత మంచి మనిషిని బాధ పెట్టాను’ అని తెగ బాధపడిపోయి, తనలో తానే నలిగిపోయింది. అయితే శేఖరం కూడా ఎప్పుడూ తనతో దూరంగా లేడు. అందుకే ఆమె ఆ తలా తోక లేని ఆ ఉత్తరం పట్టుకుని ఇవన్నీ చేయడం కరెక్ట్ కాదని అనిపించింది. అందుకే ఆ ఉత్తరాన్ని పర, పరా చించేసింది.

కొద్ది నెలల తర్వాత, ఓ రోజు సాయంత్రం ఆఫీసు నుండి ఇంటికి వచ్చిన శేఖరం నవ్వుతూ, “ఈరోజు భలే మంచి రోజు, నేను ఎప్పటి నుందో ఎదురుచూస్తున్న మేనేజర్ ప్రమోషన్ ఈ రోజే నాకు అనౌన్స్ చేశారు. పైగా లత కూడా మళ్ళీ ట్రాన్స్‌ఫర్ మీద మా ఆఫీస్ కే వచ్చింది”. అని ఓ క్షణం ఆగి, “ఓహ్, నీకు లత ఎవరో తెలీదు కదా, అందర్నీ ఆట పట్టిస్తూ ఉండేది. నన్నైతే చెప్పనక్కరలేదు. ఓ రోజు బాస్ బ్యాగ్‌లో తన ఫోటో పెట్టేసింది, అది వాళ్ళావిడ చూసేసిందట, దాంతో ఆయన కోపంతో లత ఉద్యోగం కూడా తీసేయబోయాడు. నాకు ఓ వాలంటైన్స్ రోజు గులాబీ ఇచ్చి ఐ.లవ్.యు చెప్పింది. తర్వాత గట్టిగా నవ్వేసింది. శాడిస్ట్ పిల్ల అంటే నమ్ము. ఇంకా పెళ్లి కూడా చేసుకోలేదట. ఇవాళ నా దగ్గరకి వచ్చి, ట్రాన్స్‌ఫర్ అయ్యి తను ఈ ఆఫీసు నుండి వెళ్లిపోయే ముందు, నాకో ఉత్తరం ఏదో రాశానని చెప్పింది. బహుశా నన్ను మళ్ళీ ఆట పట్టించడానికి అనుకుంటా. అందుకే నేను ఆమె చెప్పిన విషయం పెద్దగా పట్టించుకోలేదు. అయినా పెళ్ళైన నాకు ప్రేమ లేఖ వ్రాయడం ఏవిటీ? అన్నీ గాలి కబుర్లు”.అంటూ శేఖరం చెప్పుకుపోతున్నాడు.

అప్పటివరకూ చంద్రబింబంలా ఉన్న శ్రీకళ ముఖం ఒక్కసారే చంద్రముఖిలా మారిపోయింది. “అయితే ఆమె మీకోసమే వచ్చి ఉండొచ్చు, తను ట్రాన్స్‌ఫర్‌పై వెళ్లిపోయే ముందు, మీకు రాసిన ఉత్తరం మీ ల్యాప్టాప్ బ్యాగ్ లో పెట్టింది. అది నాకే దొరికింది. కనుక ముందు అర్జెంట్‌గా ఆ ఉద్యోగం మానేయండి” చెప్పింది ఎర్రగా చూస్తూ.

దాంతో శేఖరానికి, ఇదివరకటి ఓ ప్రశ్నకి జవాబు దొరికినట్టైంది. దాంతో హాయిగా నవ్వేసాడు. కానీ ఓ క్షణం తర్వాత “ఇదివరకటి ఓ ప్రశ్నకి జవాబు దొరికిందని ఓ పక్క మహా సంతోషంగా ఉన్నా, ఇప్పటికిపుడు వేరే ఉద్యోగం చూసుకోవాల్సి రావడం!” అంటూ అయోమయంగా శూన్యంలోకి చూశాడు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here