జీతము – జీవితాలు

0
7

విశ్వంలో తెల్లవారింది మొదలు ఎన్నో రకాల జీవితాలు.

ప్రతీ రోజూ సూర్యోదయాన్నే ఇంటి పనులు ముగించుకుని, కొడుకుని తీసుకుని పక్క ఊరిలో స్కూలుకి, ఉద్యోగానికి వెడుతుంది జానకి.

పెద్ద కొడుకు హాస్టల్‌లో ఇంజనీరింగ్ చదువుతున్నాడు. రెండో వాడికి గారం ఎక్కువ, హాస్టల్‌లో ఉండనన్నాడు.

భర్త చరణ్. వేరే కంట్రీలో ఉద్యోగము.

కుటుంబం కోసమే గాదు – తన అక్కల పెళ్ళి – తమ్ముడి చదువు అతనిదే బాధ్యత.

తెల్లారితే 2 కేజీల బియ్యం, 2 కేజీల కూర, పావు కిలో పప్పు ఉడకాల్సిందే. వంటమనిషీ, పనిమనిషీ పల్లెటూరి ఆచారాలు సాంప్రదాయాలు ఇంకా నడుస్తున్నాయి.

పండగ వచ్చిందంటే పాతిక కంచాలు లేవాల్సిందే.

చరణ్ ఆలోచించాడు. ఖర్చులు వద్దంటే ఎవరూ వినరు. తను వ్యతిరేకి అవుతాడు. తను వేరే కంట్రీకి వెళ్ళి సంపాదించాలనుకున్నాడు.

అయితే అప్పటికే ఇద్దరు పిల్లలు. వారిని గట్టెక్కించాలి.

జీవితం అంటే చదువు, ఉద్యోగం, సంపాదన, పెళ్ళి – తరువాత పిల్లలు. వారిని పోషించడానికి రకరకాల సంపాదనలు.

పిల్లల్ని చదివించాలంటే ఎన్నో లక్షలు కావాలి.

ఉమ్మడి కుటుంబ వ్యవస్థ ఆ ఇంట్లో ఇంకా ఉంది. అలాగని పెద్దవాళ్ళ మాట వినరు. ఎవరికి వారే నిర్ణయాలు తీసుకుంటారు, డబ్బుకి మాత్రం సంపాదించే ఒక్క చేతి మీదకి ఆధారం.  ఎవరికి ఏది తక్కువయినా కోపాలు, తాపాలు. పెళ్ళిళ్ళయిన అక్కలు బావలు అంతే, చిన్న పిల్లలూ అంతే.

జానకి ఈ పరిస్థితి తట్టుకోలేకపోయింది. తనని ఎవరూ ఒక వ్యక్తిగా చూడక, తన భర్త సంపాదన, తన ఉద్యోగం. తన చేతి కిందే రూపాయి మిగలదు. పిల్లల్ని ఎలా చదివించాలి? ఈ భావనతో ఆమె ప్రభుత్వోద్యోగం – రిటెన్ టెస్ట్‌కి అప్లై చేసింది. అందరూ గందరగోళం చేశారు. ఉద్యోగం వద్దని అల్లరి పెట్టారు.

జానకి వారి మాట వినలేదు. జాబ్ వచ్చినప్పుడు ఆలోచించవచ్చును అంది. వస్తే నువ్వు మానుతావా? అనే ప్రశ్న.

రుచిగా వంట చేస్తే – నీకు నచ్చినట్టు వండుకున్నావు అనే విమర్శ. ఆ ఇంటిలో దేనికీ ప్రశంసలుండవు. అన్నీ విమర్శలే.

అయినా సహనంగా జీవనం వెళ్ళదీస్తోంది.

ఈలోగా చరణ్ విదేశాలకు వెళ్ళాలనే నిర్ణయం ఆమె మనసును కలచివేసింది. భర్త లేకుండా అ ఇంటిలో ఎలా ఉండాలి? ఆ వ్యక్తులతో నిత్యం నరకమే. తిన్నంత తినడమూ, పారేసినంత పారేయ్యడం. కోపం వస్తే విమర్శించడం. అటువంటి జీవితం వారిది. సత్రం ఇల్లు.

అటువంటి క్లిష్ట పరిస్థితుల్లో చరణ్ విదేశాలకి వెళ్ళిపోయాడు.

తను చదువుకున్నది కాబట్టి జీవితాన్ని సమర్థవంతంగా తీర్చిదిద్దుకోవాలనుకున్నది. జీవితానికి ఎదురీదింది.

కాలం కలిసి వచ్చి ఉద్యోగం వచ్చింది. ఇంట్లో ఎవరికీ ఇష్టం లేదు. చరణ్ లేని జీవితం ఆ ఇంట్లో ఊహించుకుంటే బాధగా ఉంది. కానీ కలిసే ఉండాలి. ఎప్పుడయితే ఉద్యోగంలో చేరిందో, ఆనాడే అందరూ పూర్తిగా వ్యతిరేకమయ్యారు. అయినా మనిషికి కావలసింది డబ్బు.

“నీకు స్కూలు టైముకి వంట అవడం కష్టం. నీ వంట నువ్వు చేసుకుని క్యారేజ్ పట్టుకెళ్ళు” అంది అత్తగారు.

వాళ్ళకి వంటమనిషి తొమ్మిది గంటలకు వచ్చి వార్చి వెడుతుంది.

“నువ్వు ఉదయమే నీ క్యారేజ్ సర్దుకుని వెళ్ళవచ్చు. ఏదీ మేము వద్దు అన్నాము అని నిందలు వేయవద్దు. నీకే పెద్ద పీఠం.”

ఇటువంటి పరిస్థితుల్లో తనకి ఉద్యోగం అవసరము.

తన భర్తతో తను కలిసి ఉండాలనుకున్నది. కానీ కాలం అందుకు వ్యతిరేకంగా వున్నది. విడిగా ఉండాలన్నా కష్టమే.

అటువంటి క్లిష్ట పరిస్థితులలో పెద్దాడిని హాస్టల్‌లో పెట్టింది. రెండవ వాడిని కూడా తీసుకెళ్ళేది. అలా పెద్దాడి జీవితం హాస్టల్‌తో సరిపోతోంది. హైస్కూలు చదువు వరకు చిన్నవాడిని తనతోటే తీసుకెళ్ళాలి. తరువాత ఇంటర్ చదువుకి హాస్టల్ పెట్టాలి.

తేనెటీగ మాదిరి డబ్బు సంపాదించి తన కన్నవాళ్ళకు పెడుతున్నాడు చరణ్. భార్య ఉన్నదా, తిన్నదా, కట్టుకున్నదా, ఇవేమీ అవసరం లేదు.

తన పిల్లల్ని తాను పోషించుకోవాలి. తన జీతంతో కొంత, వాళ్ళు ఇమ్మన్నంత ఇచ్చేది.

చరణ్ ఇండియా రాగానే సూట్‌కేసులు అన్నీ అక్కలు, తల్లి చెక్ చేస్తారు. “ఏం తెచ్చావురా? దాని కెందుకు? అది సంపాదించుకుంటూంది. డబ్బు ఏదైనా తెస్తే ఇల్లు కొను, అంతేగాని డబ్బు దాచవచ్చు” అనేవారు.

తిన్నది, కట్టుకున్నది మన పాలు – దాచింది పిల్లల పాలు అనేది. వాళ్ళది వాళ్ళు సంపాదించుకుంటారు. భార్యాభర్తల అనురాగబంధం, ఆత్మీయ బంధం లేదు గాని మనీ బంధమే. మరేతర బంధం లేదు.

ఆ పని బాగాలేదు, ఈ పని బాగాలేదు. సరిగ్గా నేర్చుకో… ఇదే వారి మాట. కోడలిగా తన బాట తాను ఏర్పాటు చేసుకోవాలి. ఇంక ఈ పెళ్ళి ఎందుకు? అత్తగారు తన కొడుకుని తన గుప్పిట్లో పెట్టుకుంది.

ఆడపడుచులు ఆజ్యాలు పోసేవారే గాని కోడలని, వదిన అని ఆనందించేవారు లేరు. అత్తరికాలు, ఇంటి పెత్తనాలు వదులుకోలేదు.

జానకి ఆలోచనలు పరిపరి విధాల పోతాయి. అందుకే ఆటోలో వెళ్ళడానికి ఇష్టపడుతుంది. స్కూలుకి స్కూటర్‌పై వెళ్ళదు. చిన్న చిన్న పనులకి మాత్రమే స్కూటీ వాడుకొంటుంది.

భర్త ప్రేమ లేకపోయినా అత్తింటి బాధ్యతలు, పిల్లల పెంపకము కోసమే జీవిస్తోందా? వాళ్ళు ఏమన్నా తను ‘అయ్యా ఎస్’ అనాలి. వారు మాత్రం ‘అయ్యో పాపం’ అని అనరు. “దాని సంపాదన దానికుంది, దాని బ్రతుకు దానిది” అంటారు.

కుటుంబం కోసం, భర్త ప్రేమ కోసం, ఆడది ఎప్పుడూ ఆరాటపడుతుంది. జానకి లాంటి జీవితాలు ఇవ్వాళ ఎంతోమంది ఆడవాళ్ళు గడుపుతున్నారు. బాధలు పడుతూ కుటుంబాలు గడుపుతున్నారు. తేనెటీగలా శ్రమిస్తుంది.

ఒక ప్రక్క ఆడది ఆకాశపు అంచుల్ని తాకుతోందంటారు. అయినా అందరి సమస్యలు, జీవితాలు ఒక్కలా ఉండవు.

బయటకు వెళ్ళిన ఆడదాన్ని విమర్శించడమే ధ్యేయంగా ఉన్నారు. పిల్లలు ఎప్పుడు చదువులు పూర్తి చేసుకుంటారా, తను వాలంటరీ పెడదామా అన్నది ధోరణి. వండుకోడం – తినడం – ఉద్యోగం చెయ్యడం – అంతా యాంత్రికంగా మారిపోయింది.

చరణ్ రాకకోసం ఎదురుచూస్తోంది.

జానకికి మంచి జరగాలని ఆశిద్దాము. కానీ ఈ సమాజంలో జానకిని మించి బాధలు పడేవారున్నారు. వారికి ఉద్యోగాలు, సంపాదనలు ఉండవు. అత్తింటి పనులు చేసి, అత్తింటి మెప్పు కోసం ఎదురుచూస్తూ, పచ్చడి మెతుకులు తింటూ పడి ఉన్నవారెందరో. భర్త ప్రేమ కోసం ఎదురుచూస్తూ జీవించడమే వారి ధ్యేయం. ఇప్పటికీ, ఇలాంటి బాధలు పడుతున్న స్త్రీలెందరో. వారందరు జీవితాల్లో సమస్యల నెదుర్కోవడమే.

జానకి తన జీవితాన్ని ఒక ఛాలెంజ్‌గా తీసుకుని ఎదురుచూస్తోంది. ఫోన్‌లో మాట్లాడడం కూడా తన అత్తింటివారికి ఇష్టం ఉండదు.

మనసు చంపుకుని కుటుంబం, సాంప్రదాయం కోసం కట్టుబడి స్త్రీలు జీవిస్తున్నారు. పురుషులు మాత్రం మహారాజులాగా జీవిస్తున్నారు.

చరణ్ లాంటి ఎందరో మగవారు అటు తల్లికి ఇటు భార్యకి మధ్య నలుగుతూ – కుటుంబాలకి దూరంగా – సంపాదనలో బ్రతుకుతూ జీవితాన్ని గడుపుతున్నారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here