జీవన బాటలో నిరుద్యోగి

0
8

[dropcap]సా[/dropcap]మాజిక సమస్యల్తో మానసికంగా కృంగిపోయి, సూర్యం అర్థాంతరంగా ఆత్మహత్య చేసుకుని అప్పుడే సంవత్సర కాలం గడిచిపోయింది. నాలో సంఘర్షణ. ఆత్మ విమర్శ. వాడి చావుకి కారకులెవరు, కారణాలేంటి అని ప్రశ్నవేసుకుంటే దానికి వచ్చిన సమాధానం అస్తవ్యస్తమైన సామాజిక పరిస్థితులు, దానికి జత కలుపుతూ కుళ్ళిపోయి భ్రష్టు పట్టిన రాజకీయ వ్యవస్థ అని సమాధానం వస్తుంది.

నేటి రాజకీయ వ్యవస్థ అంటే నాకు అసహ్యం. నా ఉద్దేశంలో ఈ రాజకీయ నాయకులు రంగులు మారుస్తున్న ఊసరవెల్లులు. ఏ ఎండకు ఆ గొడుగు పట్టే స్వార్థపరులు. గంటకో చొక్కా మార్చిన విధంగా మాటిమాటికీ పార్టీలు మారుతారు. ఏ పార్టీలో ఉంటే తమ మనుగడ భవిష్యత్తు బాగుంటుందో అని ఆలోచించి గోడ దూకడానికి గోడ మీద కూర్చున్న గోడ మీద పిల్లలు అని నేటి రాజకీయ నాయకుల్ని గురించి నేను అనుకుంటాను.

ప్రతీ వారికీ పదవి కావాలి. ఎలక్షన్లలో నిలబడి గెలుస్తేనే పదవి. గెవలడానికి కోట్లకి కోట్లు ఖర్చు పెడ్తారు. గెలిచిన తరువాత పదవి కోసం ప్రాకులాడుతారు. ప్రజాసేవకే పదవి అంటారు. నా ఉద్దేశంలో ప్రజా సేవకి పదవే అక్కర్లేదు. దానికి అనేక మార్గాలున్నాయి. అయితే వాళ్ళు ప్రజాసేవ అనే ముసుగులో ఎలక్షన్లలో ఎంతో డబ్బు వెచ్చించి, గెలిచిన తరువాత పదవి పొంది ఖర్చు పెట్టిన దానికి పదింతలు సంపాదిస్తారన్న విషయం అందరికీ తెలిసిందే.

ధారాళంగా డబ్బు ఖర్చు చేసిన వాడికే ఎలక్షన్లలో సీటు. ఆ డబ్బు లేని వారు ఎంత మంచివారు, నిస్వార్థపరులు, యోగ్యులయినా ప్రజాసేవ చేయడానికి ఎలక్షన్లలో నిలబడాలంటే వాళ్ళకి రాజకీయాల్లో రావడానికి, ఎలక్షనల్లో నిలబడడానికి అవకాశమే ఉండదు. స్వతంత్ర అభ్యర్దిగా నిలచిన అంగబలం, ఆర్థిక స్తోమత లేక గెలవడం ఎండమావే.

ముఖ్యంగా పదవీకాంక్ష మహా చెడ్డది. అది మనిషిని అంధుడ్ని చేస్తుంది. వివేకాన్ని చంపేస్తుంది. అహం పెంచుతుంది. అధికార మదంతో చేయకూడని తప్పులు కూడా చేస్తారు ఈ రాజకీయ వాదులు. ఎన్నో అరాచకాలు సృష్టిస్తారు. అమాయకుల్ని తమ అధికార మదంతో అణచివేస్తారు. అందుకే ఈ రాజకీయ నాయకులన్నా రాజకీయ వ్యవస్థ అన్నా నాలో ఏదో తెలియని ఆవేశం, ఆవేదన, మనకి స్వాతంత్ర్యం సిద్ధించి ఏడు పదుల సంవత్సరాలు దాటినా నిరుద్యోగ సమస్యతో పాటు ఎన్నో సమస్యలు అలా పెరుగుతూనే ఉన్నాయి.

ఎలక్షన్ల ముందు ఈ రాజకీయ నాయకులు ఇది చేస్తాం, అది చేస్తాం అని ప్రజలకు ఎన్నో వరాల జల్లులు కురిపిస్తారు. గెలిచిన తరువాత మరి అంతే సంగతులు. మొన్నటికి మొన్న గత ప్రభుత్వం గెలవడానికి ప్రతీ నిరుద్యోగికి నిరుద్యోగ భృతి రెండు వేలు ప్రకటించింది. గెలిచిన తరువాత ఆ విషయమే పట్టించుకోలేదు.

తిరిగి నాలుగేళ్ళు గడిచిపోయిన తరువాత తిరిగి ఎలక్షన్లు వస్తున్న సమయంలో ఆదరాబాదరాగా తిరిగి నిరుద్యోగ భృతిని తెరమీదకి తెచ్చింది. ప్రతీ నిరుద్యోగికి నిరుద్యోగ భృతి ఇస్తామని మొదట చెప్పిన వాళ్ళు నిరుద్యోగ భృతి ఇయ్యడానికి అనేక నిబందనలు పెట్టారు. అదీ రెండు వేల ఇస్తామన్న వాళ్ళు వెయ్యిరూపాయలకే పరిమితం చేసారు. ఆ ఇచ్చిందీ రెండు మూడు నెలలు మాత్రమే. ఆ తరువాత ఎలక్షన్లలో అదికార పక్షం ఓడిపోయింది. క్రొత్త ప్రభుత్వం వచ్చింది.

ఈ ప్రభుత్వం కూడా గత ప్రభుత్వంలా చేస్తుందా లేక నిరుద్యోగుల జీవితాల్లో వెలుగులు నింపుతుందో వేచి చూడాలి అని అనుకున్నాను. నిన్న మొన్నటి వరకు నేనూ ఓ నిరుద్యోగినే. ఈ మద్యనే ఓ ప్రైవేటు స్కూల్లో విద్యా బోధన చేస్తూ చిరు ఉద్యోగిగా మారాను. నిరుద్యోగ జీవితం ఎంత దుర్భరం. నా జీవితముయితే అంత దుర్భరంగా లేదు. సక్రమంగానే జరిగింది కాని సూర్యం జీవితం తలుచుకుంటేనే భయమేస్తోంది. సూర్యం గురించి ఆలోచన్లు నన్ను గతం వేపు తీసుకెళ్ళాయి.

***

హాస్పటల్ ప్రాంగణం. సూర్యం శవానికి పోస్టుమార్టమ్ జరుగుతుంది. సూర్యం బలవన్మరణానికి పాల్పడ్డాడు. వాడి మాటల్ని బట్టి వాడి పరిస్థితుల్ని బట్టి ఏ రోజున ఇలాంటి తొందరపాటు పని చేస్తోడని మొదటే అనుకున్నాను. ఎన్నో విదాల నచ్చజెప్పడానికి ప్రయత్నం చేసేను. హితబోధలు చేశాను. అయినా ప్రయోజనం లేకపోయింది.

హాస్పటల్ బయట కూర్చున్న నేను భావోద్వేగానికి గురవుతున్నాను. నా మనస్సులో చాలా బాధ కళ్ళల్లో కన్నీరు. సూర్యం తండ్రి రామశాస్త్రి కండువాతో కళ్ళు వొత్తుకుంటున్నాడు. ఆ సమయంలో అతని మీద నాకు జాలి కలగలేదు కదా, కసి కోపం కలిగాయి. ‘మీవల్లే సూర్యం తన నిండు ప్రాణాల్ని తీసుకున్నాడు’ అని గట్టిగా అరవాలనిపించింది. అలా చేయలేకపోయాను.

సూర్యం తండ్రి సూర్యాన్ని చదివించాడు. ఆర్థికంగా వెనకబడ్డ కుటుంబం అయినా సామాజికంగా అగ్రకులస్తుడు. అందుకే చదివినా తెలివి తేటలున్నా ఉద్యోగం రాలేదు. రిజర్వేషన్లు కూడా లేవు కదా ఈ రోజుల్లో ప్రతిభ ఉన్నా ఆ ప్రతిభ ఎవరికి కావాలి?

అవతల పౌరోహిత్యం రాక ఇవతల చదివిన చదువుకి ఉద్యోగం రాక సూర్యం చాలా కృంగిపోయాడు. తమ్ముడు పౌరోహిత్యంలో కాస్తో కూస్తో సంపాదిస్తూ ఉంటే రూపాయి డబ్బులు కూడా సంపాదన లేక తన అవసరాల కోసం తండ్రి దగ్గర చేయి జాపడానికి ఎంతో మథనపడిపోయే వాడు సూర్యం.

ఆ తండ్రి సూర్యం మీద జాలి చూపించాడా, అతనికి ఆసరాగా నిలబడ్డాడా లేదు. కొడుకుని ఈసడించుకునేవాడు. రూపాయి డబ్బులు కూడా సంపాదించలేని అసమర్థుడవి అంటూ అసహ్యించుకుంటూ కొడుకుని నానా మాటలు అనేవాడు, అవమానించేవాడు.

సూర్యానికి ఉన్న ముఖ్య స్నేహితుల్లో నేనొకడిని. అందుచేతే సూర్యం తన మనస్తాపాన్ని నా దగ్గర తెలియ చేసేవాడు. ఇటువంటి జీవితం జీవించే కన్నా చచ్చిపోతే మంచిది అనిపిస్తోంది అని అనేవాడు. వాడి మాటలు నాకు బాధ కలిగించేవి. “అలాంటి పిచ్చి పనులు ఎప్పుడూ చేయకు. రోజులు ఎప్పుడూ ఒకేలాగ ఉండిపోవు. నీకు మంచి రోజులు వస్తాయి” అని నేను వాడికి మనోనిబ్బరాని కలిగించే వాడిని. నా మాటలకి స్వాంతన పొందేవాడు.

ప్రకృతిలో పక్షులు రెక్కలొచ్చే వరకూ తమ పిల్లల్ని కంటికి రెప్పలా కాపాడుకుంటాయి. రెక్కలు వచ్చి ఎగరగానే నీ తిండి నీవు సంపాదించుకో అని తగలేస్తాయి. జంతువులు కూడా అంతే. మనిషి మాత్రం అలా చేయలేడు.

తన సంతానం ఆర్థికంగా నిలదొక్కుకునే వరకు ఆసరాగా నిలబడ్తాడు. జన్మనిచ్చినందుకు వాళ్ళకి అండగా ఉండక తప్పదు. అది తన బాధ్యత అని భావిస్తాడు. సూర్యం తండ్రి కొడుక్కి అండగా ఉండకపోగా కఠినమైన మాటల్తో కొడుకుని మానసికంగా చిత్రవధ చేశాడు. అదే నా బాధ.

నా విషయం తీనుకుంటే తండ్రికి తనంటే ఎంతో అభిమానం. ఓ పర్యాయం రాత్రి పదుకొండు గంటలయినా తను టి.విలో క్రికెట్ మ్యాచ్ చూస్తూ కూర్చున్నాడు. “ఆరోగ్యం పాడవుతుంది పడుకోకూడదారా” అన్నాడు తన తండ్రి. ఆ చిన్న మాటకే తను విపరీత అర్థాలు తీశాడు. తన ఆరోగ్యం గురించి చెప్తే ఆ మాటల్లో మంచి నిగ్రహించకుండా నెగిటిన్‌గా తీసుకున్నాడు. ఆ టి.వి తనుకొన్నది. ఆ టి.విని పాడుచేయకు అన్న భావాన్ని తను తీసుకున్నాడు. దాని మీద తనకి హక్కులేదు అందుకే తండ్రి అలా అన్నాడు. ఎంతేనా తను నిరుద్యోగి కదా అన్న నూన్యతా భావం తనలో చోటు చేసుకుంది. ఆ చిన్న మాటకే.

ఆ సమయంలో నా ఆలోచనా విధానం కూడా తప్పుగా ఉండేది. తను నిరుద్యోగి ప్రతీ విషయానికి తండ్రి మీద ఆదారపడి బ్రతుకుతున్నాడు. ఉద్యోగం దొరికే వరకూ ఇంట్లో గౌరవం ఉండదు. ఇది ఇగో సమస్య. మనిషితో పాటు ఇగో పెరుగుతుంది. మనిషికి కావల్సినవన్నీ లభిస్తూ ఉంటే ఎదుటి వాళ్ళ మాట వినం. అప్పుడు మనలో అహం వచ్చేస్తుంది. అందుకే ఆనాడు తండ్రి టి.వి ఆపు చేసి పడుకోమంటే తనలోని అహం వలన తండ్రిని సరిగా అర్థం చేసుకోలేకపోయాడు.

అంత చిన్న విషయానికే తను తండ్రిని అపార్థం చేసుకున్నాడు, అలాంటిది సూర్యం తండ్రి సూర్యాన్ని అలా మానసికంగా హింసిస్తూ ఉంటే ఎలా తట్టుకోగలడు.

ఈ మధ్య ఈ బలవన్మరణాలు ఎక్కువయిపోతున్నాయి. పంటలు సరిగా పండలేదని రైతులు, ఆర్ధిక పరిస్థితులు బాగులేవని కొన్ని కుటుంబాలు, ఉద్యోగాలు దొరకలేదని నిరుద్యోగులు, చదువుల వత్తిడి, స్కూలు యజామాన్యాల దాష్టికానికి విద్యార్ధులు, అత్తింటి ఆరళ్ళు సహించలేక ఆడబిడ్డలు…. ఇలా చాలా మంది అర్ధాంతరంగా ప్రాణాలు తీసుకుంటున్నారు. హాస్పటల్ దగ్గర ఉన్న ఎవరో అంటున్నారు. ఆ తరువాత ఆ గంభీరమైన వాతావరణంలో రాజకీయాలు చోటు చేసుకున్నాయి.

వాళ్ళ మాటల్ని వింటున్న నాలో బావోద్వేగం ఎమోషను. ఓ పర్యాయం చదువుకుంటున్న ముందు రాజకీయాల్లో పాల్గొంటూంటూ ఉంటే తండ్రి తనతో అన్న మాటలు గుర్తుకు వచ్చాయి. “విద్యార్థులకి రాజకీయ పరిజ్ఞానం ఉండడం మంచిదే కాని విద్యార్థి దశలో రాజకీయాల్లో పాల్గొనకూడదు. నీకు చాలా భవిష్యత్తు ఉంది” అని.

అయితే తను తండ్రి మాట విన్నాడా? ‘పార్టీ అధికారంలోకి వస్తే ఉద్యోగాలు రావచ్చు’ అనుకుని సూర్యం తను పార్టీ జండా పట్టుకుని తిరిగారు ప్రచారం చేశారు. అయితే ఏం లాభం పార్టీ అధికారంలోకి వచ్చినా ఉద్యోగాలు లేవు. నిరుద్యోగ భృతి లేదు.

నేను నిరుద్యోగిగానే మిగిలిపోయాను. సూర్యం అంతే. నా జీవితావసారల కోసం తండ్రి దగ్గర సిగ్గుతో చితికిపోతూ ఆత్మాభిమానం వదిలి పెట్టి నూన్యతా భావంతో చేయి జాచే దౌర్భాగ్య పరిస్థితి ప్రతీ నిరుద్యోగిది. తన తండ్రి తనకి నెల నెలా తన జీవితావసరాల కోసం డబ్బు ఇచ్చేవాడు. తన పరిస్థితి తండ్రికి తెలుసు కాబట్టి ఆ డబ్బు తీసుకోడానికి తను నూన్యాతా భావానికి లోనయ్యేవాడు. సిగ్గుతో గొంగళీ పురుగులా ముడుచుకుపోయే వాడు. ఈ వయస్సులో సంపాదించి తండ్రికి ఈయాలి. కాని తండ్రి దగ్గర తీసుకోవడమేంటి అని ఎన్ని సార్లు ఆత్మక్షోభతో, ఆత్మగ్లానితో తను అనుకున్నాడు.

నా పరిస్థితే అలా ఉంటే సూర్యం పరిస్థితి మరీ హీనం. ప్రభుత్వం ఎలక్షన్ల మాట ఇచ్చిన ప్రకారం నిరుద్యోగ భృతి ఇస్తే బాగుండేది. కొంత వెసులుబాటు కలిగేది. అలా కాలేదు. తండ్రి దగ్గర చేయి జాచడానకి నామోషి. ఆ తండ్రి కొడుక్కి డబ్బు ఈయక్కర్లేదు, చీదరించుకోకుండా ఉంటే చాలు. సూర్యం ఓ పచారీ కొట్టులో పద్దులు వ్రాసి ఎంతో కొంత సంపాదించుకునేవాడు. అయినా డబ్బుకి ఇబ్బందే.

అందుకే ఒక్కొక్కసారి నిరాశగా నిర్లిప్తంగా మాట్లాడేవాడు. నిరుద్యోగ భృతి అవతల లభించక ఇవతల ఉద్యోగాలు రాక చాలా మంది నిరుద్యోగులు సూర్యంలా ఆత్మహత్యలు చేసుకుంటున్నారు. మరి కొందరు నిరాశా నిస్పృహల్తో ఎలాగో అలాగ జీవితం గడిపేస్తున్నారు. నా ఆలోచన్లు ఇలా సాగిపోతున్నాయి.

పోష్టుమార్టమ్ ఇంకా పూర్తవలేదు. రాత్రంతా నిద్రలేదు. కళ్లు మండుతున్నాయి.కళ్ళు మూతలు పడ్తున్నాయి. ఇంతలో ఏదో కలకలం. బలవంతంగా కళ్ళు తెరచి చూశాను. పోస్టుమార్టమ్ పూర్తయింది. పోస్టుమార్టమ్ చేసిన సూర్యం నిర్జీవ శరీరం నిండా కట్లు. ముఖం తప్ప ఏ భాగం కనిపించటం లేదు. ముఖంలో ప్రశాంతత అగుపిస్తోంది.

‘ఇక తను ఎవ్వరికీ భారం కాదు. ఎవరి చేత ఇక పై అవమానాలు ఎదుర్కునే పరిస్థితి లేదు’ అన్న భావం వల్ల కాబోలు సూర్య ముఖంలో ప్రశాంతత అని అనుకున్నాను. భావోద్యేగం ఆపుకోలేక నాలో ఉన్న బాధంతా తన్ను కొచ్చింది. దుఃఖం రూపంలో బయట పడింది. ఏడుస్తున్నాను. ప్రక్క నున్న ఎవరో నా బుజం మీద చేయి వేసి ఓదార్చే ప్రయత్నం చేస్తున్నారు. సూర్యం నిర్జీవ శరీరం శ్మశానానికి తీసుకెళ్తూ ఉంటే నేను బాధగా భారంగా ఇంటి వేపు అడుగులు వేశాను.

***

వర్తమానంలోకి వచ్చిన నాకు – ఆనాటి పరిస్థితులే ఇంకా కొనసాగుతున్నందున విచారం ముంచుకొచ్చింది. వ్యతిరేక పరిస్థితులను అధిగమించి జీవితంలో నిలదొక్కుకోగలనా అనిపించింది.

ఆత్మహత్య పలాయనం..ఓటమికి సూచన..తాను ఎన్నటికీ పలాయనవాది కాడు. ఎట్టి పరిస్థితులలో నయినా ఎదిరించి నిలబడి పోరాడతాడు..నిశ్చయించుకున్నాడతడు.. అడుగు ముందుకువేశాడు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here