జీవన జ్యోతి – పుస్తక పరిచయం

0
6

[dropcap]ప్ర[/dropcap]ముఖ రచయిత్రి పొత్తూరి విజయలక్ష్మిగారు రచించిన 15 కథల సంపుటి ఈ పుస్తకం.

***

“మిస్సమ్మ, గుండమ్మ కథల తర్వాత నవ్వడం మర్చిపోయిన తెలుగు వారికి, శ్రీవారికి ప్రేమలేఖ రాసిన అచ్చ తెలుగు ఆడపిల్ల కథ చెప్పి నవ్వడం గుర్తు చేసారు శ్రీమతి విజయలక్ష్మి. తెలుగు సాహితీ ప్రపంచంలో నవ్వుల రాణిగా ముద్ర వేసుకుని విజయవిహారం చేస్తున్న ఈ లక్ష్మి ఈమె వల్లూరు వారి ఆడపడుచు.  పొత్తూరి వారి కోడలు. మంచి మనసు కల ఇల్లాలు. నిత్య జీవితంలో కంటబడే అన్ని విషయాలలోని అంతరార్థాలను వెలికి తీయగల మేధావి. హాస్యం రాస్తే ఆమే రాయాలి, ఆమె రాస్తే హాస్యమే రాయాలి అన్నట్లుగా అభిమానుల మనసులో స్ఠానం సంపాదించుకున్నారు. తన ముప్ఫై సంవత్సరాల సాహితీ ప్రస్తానంలో 250కి పైగా కధలు, 20 నవలలు, అనేక సినిమా కధలు రాయడమే కాకుండా ఈనాడు ఆదివారంలో హాస్య కథలు; ఆంధ్రభూమి డైలీలో ‘కొంచం ఇష్టం,కొంచం కష్టం’, ఆంధ్రభూమి వీక్లీలో ‘జ్ఞాపకాల జావళి’తో, ప్రస్తుతం ఆంధ్రజ్యోతి ఆదివారంలో రాస్తున్న ‘నోస్టాల్జియా’తో మంచి కాలమిస్ట్‌గా కూడా పేరు తెచ్చుకున్నారు. ఇప్పుడు మీచేతి నలంకరించిన జీవన జ్యోతి కధా సంపుటిలో కేవలం హాస్యకధలే కాదు, మనసుని తట్టి లేపేవి, కన్నీళ్ళు పెట్టించేవి, కలవర పరచేవి, మెదడుకి పదును పెట్టేవి ఎన్నోరకాల విశేషాలున్నాయ్” అన్నారు సుశీల సోమరాజు.

***

“శ్రీమతి పొత్తూరి విజయలక్ష్మిగారి కథలు వేసవిలో వర్షం లాంటివి. చల్లగా హాయిగా ఉంటాయి. వారి కథలు ఆకళింపు చేసుకున్నవారికి ప్రపంచంలో దేనిని ప్రత్యేకంగా చూడాలో, దేనిని చూడకూడదో ఇట్టే తెలిసిపోతుంది.

క్షణం తీరికలేని ఈ కాలంలో ఓ క్షణం తీరిక చేసుకుని, విజయలక్ష్మిగారి కథలు చదివి చూడండి, శరీరానికీ, మెదడుకీ టానిక్‌లా పనిచేస్తాయి.

జీవితచక్రాలకి హాస్యం, వ్యంగ్యం ఆయిల్లాంటివి. ఆ రెంటినీ ఆదరించి, అభిమానిస్తే జీవితం సాఫీగా సాగిపోతుంది.

హాస్యం ఆశావాదం లాంటిది. వదులుకుంటే నిరాశలో కూరుకుపోయినట్టే! హాస్యాన్ని కాదనుకోకూడదు. కాదనుకుంటే ఆ తరం నాగరికతనీ, సంస్కతినీ చేజేతులా కోల్పోయినట్టేనని నేను భావిస్తాను” అన్నారు జగన్నాథశర్మ.

***

“అసలు రాయడమే చాలా కష్టం అంటే, రాసి ఎదుటి వాళ్ళని నవ్వించడం ఇంకా కష్టం. రాతలలో సరే, మాటలతో నవ్వించడం ఇంకా మరీ కష్టం… ఇన్ని కష్టాలూ మా వదిన సునాయాసంగా నవ్వుతూ చేసేస్తుంది!

ఎప్పుడైనా ఫోన్ చేసానా, మా కబుర్లకీ; ఆవిడ మాటలకి నా నవ్వులకీ, అటు వాళ్ళయనకీ ఇటు మా ఆయనకీ గడ్డాలు పెరిగిపోయి దీనంగా చూసేంత సమయం మాట్లాడుకుంటాం.. ఎన్నైనా ఎంత సేపైనా చెప్పి నవ్వించగలదావిడ!

శ్రీవారికో ప్రేమలేఖ రాసి సినిమా తెరకి హాస్యం అంటే ఇదీ అని కుండ బద్దలుకొట్టి ‘నభూతో నభవిష్యతి’ లాంటి సినిమా ఇచ్చింది!

ఇవన్నీ పక్కకి పెడితే మా వదిన మంచి గృహిణి, పిల్లలని ఉత్తమంగా తీర్చిదిద్ది పైకి తెచ్చిన తల్లి. ఓ మంచి అత్తగారూ, మురిపాల నానమ్మా, నాలాంటి వాళ్ళకి ఆత్మీయ స్నేహం… వెరసి ఓ మంచి మనిషి! ” అన్నారు బలభద్రపాత్రుని రమణి.

***

జీవన జ్యోతి (కథలు)

రచన: పొత్తూరి విజయలక్ష్మి

ప్రచురణ: తెలుగు ప్రింట్, (నవోదయ బుక్ హౌస్), హైదరాబాద్

పేజీలు: 120

వెల: రూ.100

ప్రతులకు: నవోదయ బుక్ హౌస్, కాచీగుడా, హైదరాబాద్. 040-24652387

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here