జీవన జ్యోతి

13
9

[dropcap]వి[/dropcap]శ్వవిద్యాలయ ప్రాంగణం అంతటా గుబురుగా పెరిగిన పొదలు, దట్టంగా పెరిగిన చెట్లు, ఏపుగా పెరిగిన వృక్షాలు, వయసు పైబడిన వటవృక్షాలు, వాటన్నింటిని అల్లుకున్న లతలు, అన్నీకలిసి, ఏకంగా అందాల అశోక వనాన్ని తలపిస్తున్నాయి. ఆ సమయంలో, పాములా మెలికలు తిరిగి వనమంతా విస్తరించివున్న కాలినడక దారిలో స్త్రీలు పురుషులు, ఒంటరిగా కొందరు, గుంపులు గుంపులుగా మరికొందరు, అందరూ ఆరోగ్య పరిరక్షణ కోసం ఉల్లాసంగా, ఉత్సాహంగా, ఉదయపు నడకలో నిమగ్నమై వున్నారు. వర్షాకాలం కాబట్టి, ఉన్నట్టుండి కారుమబ్బులు కమ్ముకురాగా, వర్షపునీటిబొట్లు నేలమీదకు జాలువారు తుండగా, చిత్తడి వాన ప్రారంభమైంది. పక్షుల కిలకిలారావాలు సద్దుమణిగాయి. చెట్లు తలలాడిస్తూ లయబద్ధంగా నాట్యం చేస్తున్నట్లున్నాయి. అప్పటివరకు మెల్లగా వీస్తున్న పిల్లగాలులు, చలితోకూడిన ఈదురుగాలులుగా పరివర్తన చెందాయి. చూస్తుండగానే చిత్తడివాన కాస్తా జడివానగా మారింది. నడుస్తున్నవారంతా తలదాచుకునేందుకు అల్లంత దూరంలో ఉన్న భవనాలలోకి కొందరు పరుగులు తీస్తుండగా, దగ్గరలోవున్న వృక్షాల క్రిందికి చేరుకుంటున్నారు మరికొందరు. అలా చేరుకున్నవారంతా, పరిచితులా, అపరిచితులా, అనే తేడా లేకుండా స్థానిక, రాష్ట్ర, జాతీయ, అంతర్జాతీయ అంశాలపై చర్చించుకుంటూ, తమ తమ విషయపరిజ్ఞానాన్ని, వాక్చాతుర్యాన్ని, వాదనాపటిమను ప్రదర్శించడంలో ఎవరికివారే పోటీపడుతున్నారు.

అలా ఒక వటవృక్షం క్రిందకు చేరిన కొంతమందిలో, మన కథకు సంబంధించిన ముగ్గురు వ్యక్తులు కూడా వున్నారు. వారే సదానంద్, జగన్నాధం, మరియు రవిచంద్ర. వాళ్లు ముగ్గురూ సీనియర్ సిటిజెన్సే. పైగా మంచి స్నేహితులు కూడా. తరచూ కలుసుకుంటూ తమ స్నేహబంధాన్ని మరింతగా పెనవేసుకుంటున్నారు. ఉదయపు నడకలో మాత్రం ప్రతిరోజూ విధిగా కలుసుకుంటుంటారు వాళ్ళు. ఇక వాళ్ళ మధ్యన కూడా సంభాషణ రసవత్తరంగా కొనసాగుతుంది.

“మీరు ఎన్నైనా చెప్పండి.. పెద్దలు చెప్పినట్లు.. ఆరోగ్యమే మహాభాగ్యం!” అన్నాడు జగన్నాధం.

“అవును.. ఆరోగ్యం ఉంటేనే ఆనందం!” అన్నాడు రవిచంద్ర.

“ఎంత సంపద ఉన్నప్పటికీ, ఆరోగ్యం లేకపోతే ఏమీ లేనట్లే!” అన్నాడు సదానంద్.

“ఈ మధ్యనే ఒక శాస్త్రవేత్త చెప్పారు.. ప్రతిరోజూ ఒక ఆపిల్ పండు తింటే అనారోగ్యంతో డాక్టర్ దగ్గరికివెళ్ళే అవసరమే ఉండదట! అందుకే నేను క్రమం తప్పకుండా ప్రతి రోజూ ఒక ఆపిల్ తింటున్నాను!” అన్నాడు జగన్నాధం.

“నేనైతే.. ప్రఖ్యాత ప్రకృతి వైద్యనిపుణులు.. మీ ఆరోగ్యం మీ చేతుల్లో.. అని చెప్పినట్లు.. వారు చెప్పిన విధంగా ఆహారనియమాలను పాటిస్తూ, జీవనవిధాలను అనుసరిస్తూ, ఆరోగ్యాన్ని కాపాడుకుంటున్నాను!” అన్నాడు రవిచంద్ర.

“నేనైతే.. నా ఆరోగ్యం నా భార్య చేతుల్లో.. అంటాను!” అన్నాడు సదానంద్.

“ఆ! ఏంటి నువ్వు చెప్తుంది? నీ ఆరోగ్యం నీ భార్య చేతుల్లోనా! వినటానికే విచిత్రంగా వుంది!” అన్నాడు ఆశ్చర్యంగా జగన్నాధం.

“విచిత్రంగా కాదు.. విడ్డూరంగా కూడా వుంది!”అన్నాడు వంతపాలుకుతూ రవిచంద్ర.

“మీరు ఏమైనా అనుకోండి.. నా విషయంలో మాత్రం అదే నిజం! నా ఆరోగ్యం నా భార్య చేతుల్లోనే!” గట్టిగా చెప్పాడు సదానంద్.

“బాలనాగమ్మ సినిమాలో మాయల ఫకీరు ప్రాణం చిలకలో వున్నట్లు, నీ ఆరోగ్యం నీ భార్య చేతుల్లో వుండడమేంటి!!” అడిగాడు జగన్నాధం కొంచెం నవ్వుతూ.

“అదెలా సాధ్యమో కాస్త అర్థమయేట్లు మాక్కూడా చెప్పొచ్చుగా!” అన్నాడు రవిచంద్ర కొంచెం వెటకారంగా.

“అయితే.. ఉదయం నిద్ర లేచినప్పటినుండి రాత్రి నిద్ర పోయేవరకు మా ఇంట్లో జరిగే రోజువారీ విషయాల గురించి మీకు వివరంగా చెప్తాను! మచ్చుకు, నిన్నటి విషయాలు ఇప్పుడు చెప్తాను! అప్పుడు నేను చెప్పింది వాస్తవమో కాదో మీకే తెలుస్తుంది!” అన్నాడు సదానంద్.

“అయితే చెప్పండి!” కుతూహలంగా అడిగారు జగన్నాధం, రవిచంద్ర.

చెప్పడం మొదలెట్టాడు సదానంద్..

చెవులు రిక్కించి వింటున్నారు జగన్నాధం, రవిచంద్ర..

***

తెలతెలవారుతుంది. సూర్యుడు తన రాకకు సంకేతంగా, ముందుగా తన కాంతిపుంజాలను భూమిపైకి ప్రసరిస్తున్నాడు. సదానంద్ ఇంట్లో.. భక్తి టీవీలో ‘శ్రీ సూర్యనారాయణా! హరి సూర్యనారాయణా!!’ అనే భక్తి గీతం వీనుల విందుగా వినిపిస్తుంది. సదానంద్ భార్య, కల్పవల్లి, వంటగదిలో, ఆ రోజు ఉదయపు అల్పాహారం మరియు మధ్యాహ్న భోజనం తయారుచేసేందుకు కావాల్సిన పదార్థాలను సర్దిపెట్టుకుని, ఆ తరువాత, మరగ కాచివడపోసిన మంచి నీటిని సీసాల్లో నింపుతుంది. తనకోసం తానుగా పెట్టుకున్న అలారం ఆలాపించి అలసటతో ఆగిపోయి అయిదు నిమిషాలైనా, ముసుగుతన్ని ఇంకా గాఢ నిద్రలో మునిగితేలుతున్నాడు సదానంద్. అప్పుడు కల్పవల్లి సదానంద్‌ను తట్టిలేపుతూ..

“ఏవండీ! ఇక లేవండీ! లేచి తయారై వాకింగ్‌కి బయలుదేరండి! అక్కడ మీ స్నేహితులు మీ కోసం ఎదురు చూస్తుంటారు! లేవండి.. లేవండి..!” అని చెప్పింది. ఆ మాటలు విన్న సదానంద్ ఒక్క ఉదుటున లేచి నిలుచున్నాడు.

“అయ్యో! అదేంటండి!! అలా లేచారేంటండీ!! అలా లెగవడం చాలా ప్రమాదకరమండి!!!”

“ప్రమాదమా? అయితే మరింకెలా లెగవాలి?”

“మంచం మీదినుంచి లెగవాలనుకుంటే, ముందుగా మెల్లగాలేచి మంచం మీదనే కూర్చోవాలి. అలా ఒకటి లేక రెండు నిమిషాలు కూర్చున్న తరువాత మాత్రమే మంచం దిగాలి! అంతేకాని, అలా హఠాత్తుగా లేస్తే, అది గుండె మీద తీవ్రమైన ప్రభావం చూపుతుంది! శరీర కదలికలపై పట్టుకోల్పోయి క్రిందపడిపోయే ప్రమాదం వుంది!”

“సరే! ఇకపై నువ్వు చెప్పినట్లే లెగుస్తానులే!” అంటూ బాత్రూమ్ వైపు నడిచాడు సదానంద్.

తయారై వాకింగ్‍కి బయలుదేరుతున్న సదానంద్ చేతిలో గత రాత్రి మంచినీళ్లతో నింపిన రాగిచెంబుని ఉంచి, ఆ నీళ్లు త్రాగి బయలుదేరమని చెప్పింది కల్పవల్లి. నిలబడే నీళ్లు త్రాగుతున్న సదానంద్‌తో.. “అవకాశం లేకపోతే తప్ప నీళ్లను కూర్చునే త్రాగాలి!” అని సలహా ఇచ్చింది కల్పవల్లి. కూర్చుని రాగిచెంబులో నీళ్లు త్రాగి “వెళ్ళొస్తాను” అని చెప్పి బయటికి నడిచాడు సదానంద్.

సదానంద్ తన మిత్రులతో కలిసి ముప్పావు గంట సేపు నడిచి, అక్కడేవున్న సిమెంటు బల్లపై కూర్చున్నాడు, పావుగంటసేపు లోకాభిరామాయణం మాట్లాడుకుని, ముగ్గురూ ఇంటిముఖం పట్టారు.

ఇంటికిచేరిన సదానంద్, ఆరోజు దినపత్రిక తిరగేస్తుంటే, కల్పవల్లి ఒక చిన్న ప్లేట్లో ఆరు తులసి ఆకులు, రెండు పచ్చి వెల్లుల్లి రెమ్మలు పెట్టి, టీపాయ్ మీద పెట్టింది. సదానంద్ అవి తినేలోపు, మసాలా దినుసులతో, అంటే, ధనియాలు, మిరియాలు, దాల్చినచెక్క, జీలకర్ర, పసుపు, అల్లం, వాము, సోంపు, బిర్యాని ఆకు, వాటన్నిటిని నానబెట్టి, కాచి, వడపోసిన కషాయాన్ని ఓ కప్పులో పోసి టీపాయ్ మీద పెట్టింది కల్పవల్లి. ఆ కషాయం త్రాగి. బాత్రూం లోకి వెళ్లి స్నానం ముగించుకుని వచ్చిన సదానంద్‍తో..

“అదేంటండి.. అప్పుడే స్నానం చేశారా!”

“అవును.. చేశాను!”

“స్నానాన్ని ఒక మొక్కుబడిగా, ఓ పనైపోయిందన్నట్లుగా చేయకూడదండి! గురువుగారు ప్రవచనాల్లో చెప్పినట్లు అత్యంత శ్రద్ధగా చేయాలి! సబ్బుతో శరీర భాగాలన్నిటిని బాగాతోమి మర్దన చేయాలి! అదే, మసాజ్ చేసినట్లు!! అప్పుడే సత్ఫలితాలు వస్తాయి!”

“సరేలే.. ఇకపై అలాగే చేస్తాలే!”

సదానంద్ పూజ ముగించుకుని వచ్చేలోపు డైనింగ్ టేబుల్‌పై ఒక ప్లేటులో కొన్ని కొన్ని కీరా, క్యారెట్, యాపిల్, బీట్రూట్, టమాటో ముక్కలు, మరో ప్లేటులో కొంచెం కొంచెం గుమ్మడిగింజలు, పొద్దుతిరుగుడుపూల గింజలు, జీడిపప్పు, కిస్మిస్, బెల్లం, ఖర్జూరా, నానబెట్టిన బాదం మరియు వాల్నట్స్‌ను ఉంచి, సదానంద్ తినేందుకు డైనింగ్ టేబుల్‌పై రెడీగా ఉంచింది కల్పవల్లి. సదానంద్ వాటన్నిటినీ తినేలోపే గోరువెచ్చని నీటిలో అరచెక్క నిమ్మకాయరసం, ఒక స్పూను తేనె కలిపిపోసిన పెద్ద గ్లాసును టేబుల్ పైనపెట్టింది. ఆ నీళ్లు త్రాగేలోపే, ఉదయం పూట వేసుకోవాల్సిన టాబిలెట్లను సదానంద్ చేతిలో పెట్టింది కల్పవల్లి. ఆ టాబిలెట్లను వేసుకుని, మొబైల్ని చేతికందుకుని, సోఫాలో కూర్చుని, ఈమెయిల్స్, వాట్సప్, ఫేస్‌బుక్ లను ఓ గంటసేపు చూసుకున్నాడు సదానంద్. అప్పుడు, రాగిపిండి, జొన్నపిండి, అవిసెపిండి, నువ్వుల పిండి, ఓట్స్ పిండి, అన్నింటిని కలిపి కాచిన జావలో, కొంచెం మజ్జిగ కూడా కలిపి, ఓ పెద్దగ్లాసులో పోసి, సదానంద్ చేతికందించింది కల్పవల్లి. సదానంద్ ఆ జావ త్రాగిన తరువాత, ఇద్దరూ కొంచెంసేపు కుటుంబ విషయాలు సరదాగా మాట్లాడుకున్నారు. ఆ తరువాత, ఒక కప్పు వేడి వేడి గ్రీన్ టీ ఇచ్చింది కల్పవల్లి.

టీ త్రాగుతూ.. “బ్రేక్‌ఫాస్ట్ మరీ హెవీ అనిపిస్తుంది కల్పవల్లి!” చెప్పాడు సదానంద్.

“అవుననుకోండి! కానీ, మన పెద్దలు ఏం చెప్పారో తెలుసా? బ్రేక్‌ఫాస్ట్‌ను కింగ్‌లా తినాలట! లంచ్‍ని సాధారణ వ్యక్తిలాగా తినాలట! డిన్నర్‌ని ఓ బెగ్గర్ లా తినాలట!” నవ్వుతూ చెప్పింది కల్పవల్లి.

“ప్రతీదానికీ ఏదో ఒకటి చెప్తావు! అయినా, నువ్వు చెప్పేదంతా సమంజసమే అనిపిస్తుందిలే!” నవ్వుతూ ఒప్పుగోలుగా చెప్పాడు సదానంద్.

మొబైల్ చూసుకుంటున్న సదానంద్‌తో..

“ఏంటండీ? ఎప్పుడూ ఆ మొబైల్‍లో గంటల తరబడి చూసుకుంటారేంటి? మరీ అంతగా చూడకండి! కళ్ళ నొప్పులతో పాటు తలపోటు కూడా వస్తుంది. పోను పోను కంటి చూపు కూడా మందగిస్తుంది. నరాలు బలహీనపడతాయి. ఇన్ని అనర్థాలను చేజేతులా కోరికోరి, కొని తెచ్చుకోవడం అవసరమా? ఆలోచించండి!” కొంచెం కటువుగానే చెప్పింది కల్పవల్లి.

“సరే! మొబైల్ చూడ్డం తగ్గిస్తాన్లే!” అయిష్టంగానే చెప్పాడు సదానంద్.

“అన్నట్లు.. మీరు ప్రతి సంవత్సరం చేయించుకునే యాన్యువల్ మెడికల్ హెల్త్ చెకప్ ఈ నెల్లోనే చేయించుకోవాలి కదా!” గుర్తుచేసింది కల్పవల్లి.

“అవును.. ఈ నెల్లోనే చేయించుకోవాలి! నా ఇద్దరి స్నేహితులతో కూడా మాట్లాడి, ఒక డేట్ ఫిక్స్ చేసుకుని, ముగ్గురం కలిసి ఈ నెల్లోనే చేయించుకుంటాము! బాగా గుర్తుచేశావు!” మెచ్చుకోలుగా చెప్పాడు సదానంద్.

చూస్తుండగానే మధ్యాహ్న భోజన సమయం ఆసన్నమైంది. రైస్, ఆకుకూర పప్పు, పుట్టగొడుగుల ఇగురు, రసం, పెరుగుతో కూడిన సాధారణ భోజనం తృప్తిగా తిని, కల్పవల్లి అందించిన టాబిలెట్లు వేసుకొని,కొంచెంసేపు నిద్రపోయేందుకు పడకగది వైపు నడుస్తున్న సదానంద్‍తో..

“అలా భోజనం తిన్న వెంటనే పడుకోకూడదండి. ఓ పది పదిహేను నిమిషాల తరువాత పడుకోవాలి. ఆ సమయంలో అటూ ఇటూ నడిస్తే మరీ మంచిది!” సలహా ఇచ్చింది కల్పవల్లి. ఆ సలహాను తూచా తప్పకుండా పాటించాడు సదానంద్.

నిద్రలేచిన తరువాత, కల్పవల్లి అందించిన గ్రీన్ టీ త్రాగి, ఆరోజు దినపత్రికలోని మిగతా వార్తలను చదివి, కొంతసేపు మొబైల్ చూసుకుని, ఆ తరువాత టీవీలో సినిమా చూస్తున్నాడు సదానంద్, కల్పవల్లితో కలిసి.

సినిమా పూర్తయేసరికి రాత్రి భోజనాన్ని రెడీ చేసింది కల్పవల్లి. బాత్రూంలో రిఫ్రెష్ అయి వచ్చి డిన్నర్ తినేందుకు ఉపక్రమించాడు సదానంద్, కల్పవల్లి వడ్డిస్తుండగా. రెండు చపాతీలు, ఒక అరటిపండు, కొన్ని జామకాయ ముక్కలు, కొన్ని బొప్పాయి ముక్కలు, కొన్ని దానిమ్మగింజలు, తిని, ఆ తరువాత ఓ గ్లాసెడు మజ్జిగ త్రాగి, డిన్నర్ ముగించి, టాబిలెట్లు వేసుకున్నాడు సదానంద్.

ఇద్దరూ కలిసి టీవీలో వార్తలు చూశారు. కొంచెంసేపు మొబైల్ చూసుకున్నారు. కల్పవల్లి నిద్రపోయేందుకు పడకగదిలోకి వెళ్ళింది. సదానంద్ మాత్రం ఇంకా టీవీ చూస్తూనే వున్నాడు.

అప్పుడే అక్కడకు వచ్చిన కల్పవల్లి, సదానంద్‍తో..

“ఏవండీ! ఇంకా ఎంతసేపు చూస్తారు ఆ టీవీని! మీరు ఉదయం పెందలాడే లేవాలంటే, రాత్రి పెందలాడే పడుకోవాలి! చూసింది చాలుగాని, ఇక ఆ టీవీ కట్టేసి, వచ్చి పడుకోండి!” కరుకుగా చెప్పి, రుసరుసలాడుతూ పడకగది వైపు విసురుగా వెళ్ళింది.

మారుమాట్లాడకుండా టీవీ కట్టేసి సదానంద్ కూడా పడక గది వైపు నడిచాడు.

***

చెప్పడం ఆపేసిన సదానంద్,.. ఓ నిట్టూర్పు విడిచి..,

“విన్నారుగా! ఇప్పుడు చెప్పండి.. నా ఆరోగ్యం నా భార్యచేతుల్లో ఉన్నట్లా.. లేనట్లా?” అడిగాడు, జగన్నాధం, రవిచంద్ర లను.

“హ్యాట్సాఫ్ టు యువర్ మిసెస్ అండి! ఇప్పుడు మీ ఆరోగ్య రహస్యం ఏంటో మాకు తెలిసింది! నా ఆరోగ్యం నా భార్య చేతుల్లో.. అని మీరు చెప్పిన మాటలు ముమ్మాటికీ నిజమే!” అన్నాడు జగన్నాధం.

“మీ ఆరోగ్య విషయంలో ఇన్ని జాగ్రత్తలు తీసుకుంటున్న మేడం గారి ఋణం, మీరు ఏ విధంగా తీర్చుకుంటారు?” అడిగాడు రవిచంద్ర.

“వాస్తవానికి, ఎల్లవేళలా నా బాగోగులు చూసుకుంటూ, నా ఆరోగ్యాన్ని కాపాడేవిషయంలో ఎన్నో జాగ్రత్తలు తీసుకుంటున్న, తన ఋణం తీర్చుకోవడం చాలా కష్టమే! కానీ నా వంతుగా, తన ఆరోగ్య విషయంలో, నేనుకూడా అన్ని జాగ్రత్తలు తీసుకుంటాను! ఒకటిమాత్రం గట్టిగా చెప్పగలను.. ఎట్టి పరిస్థితుల్లో కూడా తను కంటతడిపెట్టకుండా ఉండేట్లు చూసుకుంటాను. ఏది ఏమైనప్పటికీ, తనను ఎల్లప్పుడూ ఆనందంగా, సంతోషంగా, తృప్తిగా, ఉంచేందుకు నా శాయశక్తులా ప్రయత్నం చేస్తూనే ఉంటాను. ఆ ప్రయత్నంలో, నేను కృతకృత్యుడనయ్యేందుకు, ఆ భగవంతుడ్ని మనసారా ప్రార్థిస్తాను!” ఉద్వేగంగా చెప్పాడు సదానంద్.

అప్పటికే, వాన వెలిసింది. అందరూ ఇళ్లకు బయలుదేరుతున్నారు.

సదానంద్, జగన్నాధం, రవిచంద్ర.. లు కూడా బరువెక్కిన హృదయాలతో, నెమ్మదిగా ఇంటి దారి పట్టారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here