ఘనంగా ‘జీవన మొగ్గలు’ పుస్తకావిష్కరణ

0
13

[dropcap]పా[/dropcap]లమూరు సాహితి ఆధ్వర్యంలో యువకవి తెలుగు తిరుమలేష్ రచించిన ‘జీవన మొగ్గలు’ పుస్తకాన్ని జిల్లా పరిషత్ ఛైర్మన్ స్వర్ణసుధాకర్ రెడ్డి ఆవిష్కరించారు. అక్టోబర్ 4 న మహబూబ్ నగర్ జిల్లా కేంద్రంలో గల వాగ్దేవి జూనియర్ కళాశాలలో నిర్వహించిన పుస్తకావిష్కరణ కార్యక్రమానికి ఆమె ముఖ్యఅతిథిగా విచ్చేసారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ పాలమూరు జిల్లా కవుల కాణాచి అని, జిల్లాకు చెందిన ఎంతోమంది కవులు, రచయితలు చక్కగా కవిత్వం రాస్తున్నారని కితాబిచ్చారు. నిరంతరంగా పుస్తకాలను వెలువరిస్తూ జిల్లా ఖ్యాతిని ఇనుమడింపచేస్తున్నారన్నారు. తెలుగు సాహిత్యంలో ఉన్న అనేక కవితా ప్రక్రియలలో జిల్లా కవులు రచనలు చేస్తున్నారన్నారు. ఉమ్మడి పాలమూరు జిల్లాలో ‘మొగ్గలు’ అనే నూతన కవితా ప్రక్రియ పురుడు పోసుకోవడం, దానిని సృష్టించిన డాక్టర్ భీంపల్లి శ్రీకాంత్ సర్వదా అభినందనీయుడన్నారు. ఇప్పుడు రాష్ట్రంలో ఎంతోమంది కవులు మొగ్గలు ప్రక్రియలో కవిత్వం రాస్తుండడం గొప్ప విషయమన్నారు.

సభకు అధ్యక్షత వహించిన ప్రముఖ కవి, రాష్ట్ర ప్రభుత్వ కాళోజీ అవార్డు గ్రహీత కోట్ల వెంకటేశ్వర్ రెడ్డి మాట్లాడుతూ తెలుగులో అనేక నూతన కవితా ప్రక్రియలు వచ్చినా ‘మొగ్గలు’ తన స్థానాన్ని సుస్థిరం చేసుకుందన్నారు. ఉమ్మడి తెలుగు రాష్ట్రాల కవులు మొగ్గలను నిత్యం పరిమళింపజేస్తున్నారన్నారు.

ప్రత్యేక అతిథిగా విచ్చేసిన ఇండియన్ రెడ్ క్రాస్ సొసైటి రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కె. మదన్ మోహన్ రావు‌ మాట్లాడుతూ ‘మొగ్గలు’ కవితా ప్రక్రియ మన జిల్లాలోనే ఆవిర్భవించడం జిల్లాకే గర్వకారణమన్నారు. తెలుగు సాహిత్యంలో ఎన్నో ప్రక్రియలు ఉన్నా మొగ్గలు ప్రక్రియలో నేటితరం కవులు విస్తృతంగా రాయడం గొప్ప విషయమన్నారు. ‘జీవన మొగ్గలు’ పుస్తకంలో మొగ్గలు నూతనంగా విరబూసేలా ఉన్నాయన్నారు.

గౌరవ అతిథిగా విచ్చేసిన జిల్లా పబ్లిక్ ప్రాసిక్యూటర్ బెక్కం జనార్ధన్ మాట్లాడుతూ సమాజాన్ని చైతన్యపరిచే విధంగా కవులు రచనలు చేయాలన్నారు. భావితరాలకు అవసరమయ్యే కవిత్వాన్ని కవులు సృజించాలన్నారు. జిల్లాలో ఆవిర్భవించిన నూతన కవితా ప్రక్రియ మొగ్గల్లో కవిత్వాన్ని నేడు ఎంతోమంది రాయడం మొగ్గల ప్రాశస్త్యాన్ని తెలుపుతుందన్నారు.

ఆత్మీయ అతిథి, మొగ్గల ప్రక్రియ సృష్టికర్త డాక్టర్ భీంపల్లి శ్రీకాంత్ మాట్లాడుతూ మొగ్గల కవితా ప్రక్రియలో ఇప్పటికీ 40 పుస్తకాలకు పైగా కవితాసంపుటాలు వెలువడ్డాయన్నారు. ఉమ్మడి తెలుగు రాష్ట్ర కవులు మొగ్గలు ప్రక్రియను విశేషంగా ఆదరిస్తున్నారని, ప్రతి రోజూ మొగ్గల్లో కవిత్వం రాస్తున్నారన్నారు.

పుస్తకాన్ని సమీక్ష చేసిన యువకవి బోల యాదయ్య మాట్లాడుతూ తెలుగు సాహిత్యంలో మొగ్గలు అనే నూతన కవితా ప్రక్రియ ప్రారంభమై ఐదు వసంతాలు పూర్తిచేసుకున్నదన్నారు. తెలుగు సాహిత్యంలో ఎన్ని ప్రక్రియలు వచ్చినా మొగ్గలు ప్రక్రియ మాత్రం నిత్యనూతనంగా విరబూస్తూనే ఉన్నదన్నారు. తెలుగు తిరమలేష్ రచించిన ‘జీవన మొగ్గలు’ పుస్తకంలో అనేక సామాజిక విషయాలను అక్షరబద్ధం చేశారన్నారు.

ఈ కార్యక్రమాన్ని బాదేపల్లి వెంకటయ్య నిర్వహించారు. ఈ కార్యక్రమంలో జిల్లా సీనియర్ కవులు వల్లభాపురం జనార్దన, మహ్మద్ ఖాజామైనోద్దీన్, వై.దేవదానం, కె.లక్ష్మణ్ గౌడ్, కూర హన్మయ్య‌, కమలేకర్ శ్యాంప్రసాద్ రావు, నందిగామ కిశోర్ తదితరులు పాల్గొన్నారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here