జీవన పోరాటం

22
8

[box type=’note’ fontsize=’16’] “జీవితమే ఓ పోరాటమనీ, మనిషికి మనుగడ ఉన్నంతవరకూ తప్పదని వివిధ దశలలోని జీవన యుద్ధాలను ప్రస్తావిస్తున్నారు దాసరి సుబ్రహ్మణ్యేశ్వరావు “జీవన పోరాటం” కవితలో. [/box]

[dropcap]వి[/dropcap]చిత్రమైనదీ జీవితం అందులో
విచిత్రమైనదీ పోరాటం
అనుదినం అనుక్షణం
ఎందుకో తెలియదు.
ఏం బావుకుందామనో తెలియదు
దానికి అంతమెక్కడో అసలే తెలియదు.

బాహ్యప్రపంచంతో సంబంధం లేక
తల్లి కడుపులో ఏమనుభవించావో
అంతే ! అదే సుఖం అదే హాయి
మళ్లీ పొందవు జీవితంలో తిరిగి ఆ హాయి

అయినా ఎంత తల్లైతే మాత్రం
ఎన్నాళ్లు మోస్తుంది నిన్ను
తెచ్చి పడేసిందీ జీవిత సాగరంలో
సాగించు నీ జీవనసమరం అంటూ.

నులివెచ్చని తల్లి ఒడిని వీడి
భగ్గు – భగ్గు – మనే ఈ ప్రపంచంలో
ఇమడటానికై సాగించే పోరాటం – అది పసితనం
పెరుగుతున్న నీతోబాటే
పెరుగుతోంది నీ పరిధి
అమ్మా, నాన్న, అక్కా, చెల్లి ,అన్నాదమ్ములందరి
హృదయాల్లో ఏర్పర్చుకున్నావు ఒక స్థానాన్ని
అంతటితో వురుకున్నావా ?
చుట్టూ ప్రపంచం మీద పడ్డావు
సంఘజీవి నంటూ –

ఐదో ఏటే అడుగిడేవు
విద్యార్థి జీవితంలోకి
దాంతో మొదలవుతుందొక చిత్రమైన పోరాటం
జయం వరించిందా, యినుమడించిన
ఉత్సాహంతోనూ – అపజయం వరించిందా
తెచ్చుకున్న ఉత్సాహంతోను
ఒక్కొక్క మెట్టే ఎక్కావు

అంతంలేని నిశీధిలో ఆగేవు
ఏమైతేనేం జీవితంలో అదొక చక్కని దశ
బాదర బందీలు లేని దశ
పోరాటం సాగించినంత కాలం
కసురుకున్నా విసుక్కున్నా
చివర్న అయ్యో అప్పుడే అయిపోయిందా!
అనుకునే దశ.

అడుగు పెట్టేవు ఇప్పుడు
అసలైన జీవితంలోకి
ఉధృత మవుతోంది నీ పోరాటం
జీవితం అంటే నిర్వచనం తెలియదు
ఏవో చేసేయ్యాలనే తపన –
చేయలేవు –
కాళ్లూ చేతులూ కట్టి పడేస్తుంది
నీ నిస్సహాయత
ఎటు చూసినా సమస్యలే
మొదట నీ కాళ్ళ మీద నీవు
నిల్చుందికై సాగిస్తావు పోరాటం
ఎప్పటికో ఒకప్పటికి
ఏదో ఒక దారి
దొరక్కపోతుందా అన్న ధైర్యం
నచ్చినా నచ్చకపోయినా
విధిగా స్వీకరిస్తావు దాన్ని

అప్పటికే జీవన సమరంలో
అలసి ఉన్న నీవు
జీవితంలో ఎన్నో ఎదురు దెబ్బలు తిన్నావు
అప్పటికే సగం చచ్చిన మనిషివి
అంతటితో వూరుకున్నావా ?

అన్నిటికంటే లోతైన
సంసార సాగరంలోకి దూకేవు
ఎదురీదడానికి ప్రయత్నించావు
తెలిసికూడా.

తినడానికి తిండి సమస్య
కట్టుకోవడానికి గుడ్డ సమస్య
ఉండడానికి గూడు సమస్య
మనిషికి మనుగడే సమస్య

వీటికితోడు –
నీ మీద ఆధారపడి నీ చుట్టూ వున్న
మనుష్యులొక సమస్య.
రేపు మీద పెట్టుకున్నావు
నీ ఆశలన్నీ.

ధైర్యంతో ఎదురీదబోయావు
ఒకదాని మీద ఒకటి
అలల్లా వచ్చి పడ్డాయి బాధ్యతలు
ఒకటి పూర్తవుతే మరొకటి
అయినా సముద్రపుటలలు
ఆగుతాయని చూస్తారా ఎవరైనా
నీ భ్రమ గాని !

ఒకదానితో ఒకటి పోటీపడి
ఆకాశపుటంచుల్ని అందుకోవాలని
ప్రయత్నిస్తున్నాయి. అయినా
సాగించేవు నీ జీవన సమరం
బాధ్యతాయుతుడైన యోధునిలా

నీ గురించి నీవు విస్మరించేవు
నీ బాధ్యతల్ని గుర్తుపెట్టుకున్నావు
ఒకదాని తర్వాతొకటి నిర్వర్తించేవు
గొర్రెతోక సామెతని రుజువు చేసేవు
అప్పటికే నెరిసి పోయింది నీ తల
వంగిపోయింది నీ నడుం
ఉడిగిపోయింది సత్తువ
సాగించేవు ఇంత సుదీర్ఘమైన పోరాటం
ఏమి సాధించేవు జీవితంలో
అనుదినం అనుక్షణం
ఆశ, నిరాశ, నిస్పృహ, నిస్సహాయతల
మధ్య కొట్టుమిట్టాడేవు
జీవితానికి పరమార్థమేమిటో తెలియదు
ఒక జడత్వం ఆవహించింది
ఏదో చెయ్యాలనే ఆ తపన చచ్చి పోయింది
ఏం చేసినా నీ చేతిలో లేదు
ఆ విధాత చేతిలో
కీలుబొమ్మలా ఆడడం తప్పదని
నిన్ను నువ్వు సరిపెట్టుకున్నావు

అయినా ఎందుకో తాపత్రయం
మనిషికి మనుగడ ఉన్నంత కాలం
తప్పదు మరి
అందుకే అనిపిస్తుంది
చిత్రమైనదీ జీవితం అందులో
విచిత్రమైనదీ పోరాటం
అనుదినం అనుక్షణం
ఎందుకో తెలియదు
ఏం బావుకుందామనో తెలియదు
దానికి అంతం ఎక్కడో అసలే తెలియదు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here