జీవన రమణీయం-1

    8
    4

    [box type=’note’ fontsize=’16’] టీవీ, సినీరంగాలలో తనదైన ప్రత్యేక స్థానాన్ని ఏర్పర్చుకున్నసుప్రసిద్ధ రచయిత్రి బలభద్రపాత్రుని రమణి నిజజీవితంలోని రమణీయ అనుభవాల రమణీయమైన కథనం ‘జీవన రమణీయం’ వారం వారం. [/box]

    రాత్రి మా ఉమ ఫోన్ చేసి” కొత్త ఫ్లాట్‌లో పిల్లలని సెటిల్ చేశావా పెళ్ళయ్యాకా?” అంది.

    “ఫుల్‌గా ఫర్నిష్ చేసాకే పెళ్ళి చేసుకున్నారే. మనలా కాదు.. వంటింట్లో ఎయిర్ ఫ్రయర్ మైక్రోవేవ్ నుండీ ఫ్రంట్ రూమ్‌లో సోఫా టీవీ దాకా.. ఎటొచ్చీ కవ్వం, పట్టకారూ అట్లకాడా లాంటివే మనం కొని సర్దింది” అని చెప్పా.

    ‘మనలా కాదు’ అన్న మాటకి ఇద్దరం ఫ్లాష్‌బాక్‌లోకి వెళ్ళాం. పెళ్ళికి ముందే నేనూ ఉమా ఆనంద్‌బాగ్, ఆర్.కే.నగర్ అంతా తిరిగి నా కోసం ఇల్లు వెదుకున్నాం. రిజిస్టర్ ఆఫీస్ నుండి మా ఇంటికే వెళ్ళాలని నా పట్టుదల.

    “ఎవరెవరుంటారమ్మా” అనడిగేవారు.

    ” నేనూ, పెళ్ళయ్యాకా మా ఆయనా”

    ” పెళ్ళెప్పుడమ్మా?

    “వచ్చే నెలలో”

    “అయ్యాకే రామ్మా”

    చివరికి సింహాచలం అప్పలస్వామి గారు” మొన్నే మా అమ్మాయి పెళ్ళి చేసి పంపించానమ్మా.. ఇంకో అమ్మాయి వచ్చింది అనుకుంటా” అన్నారు.. వాళ్ళావిడ నరసమ్మ గారు” మీరు ఏవట్లూ?” అంది.

    ” బ్రాహ్మలం”

    “అయితే వద్దులే అమ్మా.. మేం.. ” అన్నారు.

    “నాకు మీ ఇల్లూ, మీరూ నచ్చారు” అన్నా.

    ఆయన రంగస్ధల నటులు. రైల్వేలో చేసేవారు, వాళ్ళమ్మాయి వెంకటలక్ష్మి అప్పట్లో దూరదర్శన్ నాటకాల్లో వేసేది.

    ఉమకి కుడా మూడు గదులూ, పెరట్లో బావీ, కొబ్బరి చెట్లూ, అరటి చెట్లూ తెగ నచ్చేసాయి… 175 రూపాయిలు అద్దె. ఎడ్వాన్స్ వద్దన్నారు. ఎగిరి గంతేసా. ప్రభాకర్‌కి ఫోన్ చేసా, సరే అనేసాడు.

    పెళ్ళయ్యాకా రిసెప్షన్‌కి అప్పలస్వామి దంపతులు కుడా వచ్చారు.

    ఉమా నేనూ ఏమేం కొనాలో లెక్క వేసాం.. అప్పటికే సత్యప్రియ నా ఇంటర్మీడియట్ క్లాస్‌మేట్ అక్కడ అద్దెకి వుంటోంది. దాని గైడెన్స్‌లో కొత్త కాపురానికి ఏంకావాలో రాసుకున్నాం.

    మా వారి ఫ్రెండ్స్ గోద్రెజ్ ఛైర్స్, ఫ్లాస్టిక్ బక్కెట్లూ, పవిత్రా స్టవ్ ఇచ్చారు. మాకవే పదివేలు.. చిక్కడపల్లి పోస్ట్ ఆఫీస్ పక్కనే ఓ షాప్‌లో గిన్నెలూ, ఇనప పట్టకారూ, కత్తిపీటా చాటా లాంటివి కొన్నాం. రొట్టెల పీట కొనమంటే “నాకు చాతకావు కదే” అన్నాను. “అన్నీ వస్తాయి.. నాకు రాలా?” అంది ఉమ. పెళ్ళిలో నాకు ఓ ఏడాది సీనియర్ అది.. దానికో చెల్లి విజయ. ఇద్దరూ బాస్కె‌ట్‌బాల్ ఛాంపియన్లు. మదరాసు నుండొచ్చారు. ‘బందిపోటు భీమన్న’, ‘కలవారి సంసారం’ సినిమాలు తీసిన దోనేపూడి బ్రహ్మయ్యగారి పిల్లలు. నేనూ “నాన్నగారు” అనే పిలిచేదాన్ని. విజయకి ఆట వల్లే రైల్వేలో వుద్యోగం వచ్చింది, స్పోర్ట్స్ ఆఫీసర్ పి.వి.రమణ నచ్చాడు… పెళ్ళి చేసుకున్నారు.. పి.వి.సింధూని మన దేశం కోసం కనిచ్చారు! మేం ఎత్తుకుని పెంచిన పిల్ల పి.వి.సింధు.

    ***

    అది పిట్ట కధ.. అప్పలస్వామి గారింట్లో మా తమాషాలూ, వాళ్ళబ్బాయి జాంబవంతుడి గురించి చెప్తాను! (అప్పుడు కస్తూరిబా గాంధీ కాలేజ్ లో బిఎ ఫస్ట్ ఇయర్ చదువుతున్నాం అన్నమాట)

    జాంబవంతుడని వాళ్ళ నాన్న సరదాగా అనేవారు. బాబ్జీ అతని పేరు. నా వయసు 19. నేను ఓణీలు వేసుకుని, కాలేజీకి వెళ్తున్నా నా కన్నా పెద్ద వయసు వాళ్ళు, పెళ్ళికాని పిల్లలు ‘ఆంటీ’ అనే పిలిచేవారు. మా ప్రియ మాత్రం నన్ను ‘ఆంటీ’ అనద్దు అనేది ఖచ్చితంగా.

    మా అత్తగారు మా పెళ్ళికి ఒప్పుకోలేదు. “ఆ నల్ల పిల్ల ఎలా నచ్చిందిరా?” అనేవారుట. కట్నం ఇవ్వడానికి నేను ఎగైనెస్ట్ కాబట్టి ఇదే సందని రిజిస్టర్ మేరేజ్‌కి పురిగొలిపాను. చేజ్ నవలలు చదువుతూ సిగరెట్లు వూదుతూ నన్ను రాగింగ్ చేసిన ఈ అబ్బాయి, మా అన్నయ్య ఫ్రెండ్, సిన్సియర్‌గా కంబైన్డ్ స్టడీస్ కోసమే వచ్చాడుట… ఓ రోజు మా ఇంట్లో కరెంట్ పోయింది. కరెంట్ తీగని కర్రతో కొట్టమన్నాను.  మా అమ్మమ్మ “ప్రభాకర్ చేత కొట్టిస్తున్నావేంటే?” అంది. “ఇంట్లో నిచ్చెన లేదు, పొడుగ్గా వున్నాడుగా” అన్నాను. నా ఫ్రెండ్స్ పడి పడి నవ్వారు!

    ఓ రోజు ఎవరూ లేని టైంలో మా అన్నయ్య ఫ్రెండ్స్ ఆమ్లెట్ వేసుకోవాలనుకున్నారు. వాళ్ళు డిగ్రీ చదువుతున్నారు. నేను 9 వ తరగతి, సడెన్‌గా ఇంటికొచ్చేసా… అన్నయ్య అమ్మకి చెప్తానని భయపడ్డాడు. ఈ అబ్బాయి “అట్లకాడేదీ?” అని నన్ను అడిగాడు. నేనీ విషయం అమ్మకి చెప్పడానికి పరిగెత్తా. తరవాత వీళ్ళకి అమ్మ రేవెట్టింది!

    ఓ రోజు వాకిట్లో ఇతను పెట్టిన సైకిల్ వేసుకుని వెళ్ళి ముంజలవాడికి డాష్ ఇచ్చా! వాడు తిట్టుకుంటూ ముంజలన్నీ ఏరుకుంటుంటే నేను సైకిల్‌తో పరారయి వచ్చేసా!

    స్కూల్లో నా శత్రువు ఆబేద్ అనేవాడు “ఆ పిల్ల ఇల్లు చూపిస్తా” అని తీసుకొచ్చాడు. నేను దుప్పటి ముసుగెట్టి పడుకున్నా. ముంజలవాడు సైకిల్ గుర్తు పట్టి “ఆ పిల్లేదీ?” అంటూ వచ్చాడు… “ఇది నా సైకిల్” అంటాడీయన.”కానీ ఓ అమ్మాయి తెచ్చింది” అంటాడతను. మొత్తానికి ఈయన మేటర్ అర్థమై వాడికి ముప్పై రూపాయిలిచ్చి పంపించినట్లు గుర్తు!

    లోపలికొచ్చి “నీ పని చెప్తా” అన్నాడు.

    అన్నయ్యతో మరునాడే “ఆ తెల్లబ్బాయి రౌడీ, సిగరెట్ తాగుతాడు. నువ్వు మాట్లాడద్దు” అన్నాను. మా అన్నయ్యకి నేనంటే కాస్త భయంలెండి! “నీ కెలా తెలుసు?” అన్నాడు. “పద్మశ్రీ చెప్పింది” అన్నాను. నా ఫ్రెండ్ పద్మశ్రీ ని ఇతగాడు ఏడ్పిస్తున్నాడని చెప్పింది! మనకి ఆ రోజుల్లో చాలా ఫాలోయింగ్ వుండేది, కానీ అమ్మమ్మకి జడిసి ఎవరూ ముందుకొచ్చేవారు కాదు! టెన్త్ క్లాస్‌లో ఎవీ శామ్యూల్ అనేవాడు “రమనీ నా రానీ” అని కవిత్వంతో ప్రేమలేఖ రాస్తే అమ్మమ్మెళ్ళి వాడిని హెడ్మాస్టర్ ముందే వుతికి “ఎవడ్రా నీకు తెలుగు చెప్తున్నదీ?” అని పనిలో పని మాస్టారుకీ ప్రైవేట్ చెప్పింది.

    ఇలా చింత బరికెతో వుతికితే ఎవరు మాత్రం నా వంక చూడగలరు?.. మా కజిన్ పెళ్ళి రేపనగా మేము కళ్యాణ మంటపంలో ముగ్గులు పెడ్తుంటే, సడెన్గా వచ్చి “నీతో మాట్లాడాలి” అన్నాడీ తెల్లబ్బాయి. మా అన్నయ్యని మాట్లాడద్దు అన్నాగా ఆ విషయం అనుకుని, పొగరుగా “ఏంటీ” అన్నా. “నిన్ను పెళ్ళి చేసుకుంటా సరేనా?” అన్నాడు. “సరేలే పో” అనేసా కనురెప్ప కొట్టే టైంలోగా!

    నిజంగా ఇంతే జరిగింది ఒట్టు!

    మా పెద్దమ్మ కూతురు ఈయనలాగే మంచి రంగు! అమ్మమ్మ “ఇంత రంగున్న పిల్లాడికి దాన్ని యిస్తే బావుంటుంది” అనేది. అక్క దగ్గర ఈయన ఎల్.ఐ.సీ చేస్తానంటే ఓ సారి వీళ్ళింటికి నేనే తీసుకెళ్ళా. అప్పుడు వీళ్ళమ్మ కాఫీ యిచ్చి బాగా మాట్లాడింది. సహజంగా ఆవిడ మంచి ఆవిడే, మొత్తం లైబ్రరీలో ఆవిడ చదవని నవల వుండేది కాదు! మాదిరెడ్డి సులోచనని “వదినా” అని పిలుచుకునే ఫ్రెండట – సీతాఫల్‌మండీలో వున్నప్పుడు! కానీ నా విషయం కొడుకు చెప్పగానే ఎర్రగా బుర్రగా వుండేసరికీ మా వాళ్ళు బుట్టలో వేసేసారు అనుకుందావిడ… నిజానికి మా అన్న అస్సాంలో వున్నాడు రెండేళ్ళుగా.  అమ్మకేం తెలీదు. ఎవరొచ్చినా వంట చేసిపెట్టడం ఆప్యాయంగా మాట్లాడ్డం తప్ప! నా ఫ్రెండ్స్, ఇంట్లో వాళ్ళూ “ఏదో సినిమాలు చూసి పెళ్ళి చేసికుంటా అని అడిగాడే అనుకో, అంత రెప్పపాటు కాలంలో నువ్వు జవాబు చెప్పడం అనసరమా?” అని కేకలేసారు. “బావుంటాడు, నా పెంకితనం అల్లరీ తెలుసు! అమ్మని ఇష్టపడ్తాడు.. చిన్నప్పటి నుండీ తెలుసు.. అందుకే అలా చెప్పా! ఓ సారి మాటిచ్చాకా తప్పను” అన్నా.. కానీ సేమ్ కాలనీలో వుంటూ మా అత్తగారిని తట్టుకోడం కష్టమే అయింది. మా అమ్మమ్మ ఈయనతో “రణపెంకి, కోపం ఎక్కువ, పంతం హెచ్చు, మాట పడదు, పట్టుదల ఎక్కువ, ఈ పిల్ల గురించి ఆనక చెప్పలేదు అనకు!” అని నచ్చచెప్పబోతే మా ప్రభాకరుడు “అయినా తనే కావాలి” అన్నాడు.

    ఓ సారి రెండు రోజులు ఈయన మా ఇంటికి రాకపోయేసరికీ నేను ఈయన ఫ్రెండ్స్‌ని అడిగాను “ఏమైంది ప్రభాకర్ రాలేదు? ” అని. “నీకు తెలీదా? జ్వరం” అన్నారు. నేను గబుక్కున లేచి చెప్పులేసుకుని బయల్దేరుతుంటే “ఎక్కడికే?” అన్నారు మా అమ్మా అమ్మమ్మా. “ప్రభాకర్ వాళ్ళింటికి” అనగానే, వాళ్ళు గుండెలు బాదుకుని, “వాళ్ళమ్మ తిట్టి పోస్తోంది, ఒంటరిగా వెళ్ళకు” అని అడ్డం పడినా నేను వినేరకమా?.. గబగబా వెళ్ళా.. మా అత్తగారు ఇల్లు ముత్యంలా వుంచేవారు, ఆవిడ తళతళలాడుతూ గంజి పెట్టిన చీరలో వుండేవారు…

    వంటగదిలో పనిలో వున్నారు. ఈయన సడన్‌గా నేను గేటు తీసుకుని లోపలికి వెళ్ళేసరికీ, నోట మాట రాక భయంగా వంటగది కేసి చూసి “ఎందుకొచ్చావ్?” అన్నారు.

    “జ్వరంట కదా, చూడటానికొచ్చా, ఎలా వుంది?” అని కుర్చీ జరుపుకు కూర్చున్నా! అలికిడికి మా అత్తగారొచ్చి చూసి షాక్ తిన్నారు. నేను లేచి నమస్కారం పెట్టా… ఆవిడ కోపంగా చూసి గిరుక్కున తిరిగి వంటింట్లోకి వెళ్ళారు. “కాఫీలవేం వద్దండీ, ఇప్పుడే తాగొచ్చా” అన్నా. మా హీరో నెత్తి కొట్టుకున్నాడు. ఆవిడ పళ్ళేలు ఎత్తెత్తి పడేస్తూ “మాయదారి పిల్లులు.. తలుపు తీసుంటే చాలు…” అని గట్టిగానే సెటైర్లు వేసారు. కాసేపు కూర్చుని నేను ఈయనతో “గెట్ వెల్ సూన్” అని “మీ అమ్మగారిని పిలు, చెప్పెళ్తా” అన్నా. వాళ్ళమ్మని పిలిచారు.

    “వెళ్ళొస్తా”అనగానే, కోపంగానే రెండు జామపండ్లు నా చేతిలో పెట్టి బొట్టు పెట్టి “ఇలా ఎప్పడూ రాబోకు” అంది.

    “ఇలా రాను, కోడలిగానే వస్తాలెండి” అన్నాను.

    ఆ రోజు ఆవిడ నా చేతిలో పెట్టిన రెండు పండ్లూ పెరిగి పెద్దయి వృద్ధిలో కొచ్చారు!

    సరే మా అత్తగారు కని ప్రాణంగా పెంచుకున్న పిల్లాడు మాట వినలేదని బాధపడ్డారు.. ఒకటో నెంబర్ ఆవిడ కెందుకంట?.. నేను అటెళ్ళినప్పుడల్లా “అందంగా వున్న అబ్బాయిలకి ఎర వెయ్యనీకు. సోగ్గా తయ్యారవుతరీ పోర్లు” అనేది!.. అసలు ఒకటో నెంబర్‌కి మూడో నెంబర్ ఇంట్లో కట్టుకున్న భర్తా అతనితో ఇద్దరు సంతానం! ఒకటో నెంబర్ అతని భార్యని వెళ్ళగొట్టి అతనితో వుండేది.. ఎందుకో మరి ఆ భర్త ఏం అనేవాడు కాదు! మేం చిన్నపిల్లలం ఎవరు అసలు మొగుడో తెలిసేది కాదు.. ఆవిడకి ఇక్కడ ఒకటో నెంబర్ ఆయన మొదటి భార్య కూతురుతో బాటు ఇంకో ఇద్దరు పుట్టారు! మధ్యలో రెండో నెంబర్ ఇంట్లోకెవరొచ్చినా ఆవిడ రౌడీతనానికి జడిసి ఖాళీ చేసేసేవారు!.. తను ఇంటి ముందు కూర్చుని అందర్నీ తిట్టి వేళకి మూడో నెంబర్లో ముసలాయనకింత ముద్ద పంపించి తను పతివ్రతనని నిరూపించుకుంది.

    తన కూతురుకీ సవితి కూతురుకీ ఒకే పందిట్లో పెళ్ళి చేసింది.. ఎటొచ్చీ సవితి కూతురు కన్నా ఓ పదహారేళ్ళు పెద్దవాడూ, రెండో పెళ్ళివాడూ, పిల్లలున్నవాడూ ఆమె పెళ్ళికొడుకు!.. ఈ రోజుకీ ఆ అమ్మాయి (నా కన్నా చాలా పెద్దది) తండ్రిని కౌగలించుకుని ఏడుస్తూ వెళ్ళి టాక్సీ ఎక్కడం నాకు గుర్తుంది.. ఆ టాక్సీ ఎక్కిన పిల్ల మళ్ళీ ఎప్పుడూ మా కాలనీకి రాలేదు..

    వయసు వాడిని చేసికెళ్ళిన స్వంత కూతురు గోడకి కొట్టిన బంతిలా తిరిగొచ్చేసింది.. మొగుడితో పడక.. అందరినీ తిట్టే ఆ మహాతల్లిని ఎవరూ ఏమీ అనేవారు కారు.. తెగించిన రౌడీతనానికి అంత పవర్!

    .. మొత్తానికి మా బాబాయ్‌ని తీసుకుని వెళ్ళి మా అమ్మ మా అత్తగారిని బతిమాలినా, ఆవిడ పెళ్ళికి ఒప్పుకోలేదు!.. దాంతో మాకు రిజిస్టర్ మేరేజే శరణ్యం అయింది! మే 10 ముహుర్తం పెట్టారు.. బి ఏ సెకండ్ ఇయర్ పరీక్షలు.. పరీక్షలయ్యాకా ముహుర్తాలు లేవుట! ఎకనామిక్స్ ఎగ్జామ్‌కీ పబ్లిక్ ఎడ్మినిస్ట్రేషన్ ఎగ్జామ్‌కీ మధ్యన నా పెళ్ళి పెట్టారు! ఏర్పాట్లేం లేవుగా సాయంత్రం రిసెప్షన్ తప్ప! ఈ లోగా కాబోయే పెద్దాడబిడ్డా, తోడికోడలూ, బావగారూ నాకు బాగా క్లోజు అయిపోయారు!.. “పెళ్ళయి ఓ నలుసు కడుపులో పడ్తే అమ్మ తనే వచ్చేస్తుంది” అని మా వదినగారు చెప్పేవారు!

    పెళ్ళికి పది రోజుల ముందే సరోజిని అమ్మమ్మ వచ్చేసింది.. నాకెలా అమ్మమ్మో తెలీదు కానీ పప్పులుసు ఆవిడలా ఎవరూ పెట్టలేరని మా అందరికీ తెలుసు!.. పప్పుపులుసు పెట్టి చారెడు వెల్లుల్లి పాయలూ కరివేపాకూ వేయుంచి పైన వేసేది. తియ్యగా బెల్లం కుడా వేసేది. పెళ్ళిరోజు ప్రొద్దుట కూడా మా అందరికీ కలిపి ముద్దలు పెట్టి రిజస్టర్ ఆఫీస్‌‍కి పంపడం నాకు గుర్తు!.. నాకు పసుపు రాసి స్నానంచేయించాకా, మా ఉమ జడకి పూవులు చుట్టింది. మొహానికి ఏ పూతలూ లేవు.. కాటుకా కళ్యాణంబొట్టూ, బుగ్గన చుక్కా తప్ప!.. మా మావగారు రహస్యంగా మూడొందలు పంపారు నాకు.. పట్టుచీర కొనుక్కోమని..

    మా వంట క్రిష్ణమూర్తిని బంగారం పన్ను క్రిష్ణమూర్తి అని కూడా అనేవారు! అతను కేవలం వంటవాడే కాదు మా అక్కలకి సంబంధాలు కుడా చూసాడు. సైకిల్ మీద వచ్చేవాడు. మా పెద్దక్క పెళ్ళిలో ఆ తాళం చెవి తల కింద పెట్టుకుని పడుకుంటే మా అన్నలు( అప్పటికి చిన్నవాళ్ళు) అతను నిద్ర పోగానే, ఆ తాళం చెవి తీసికుని సైకిల్ తీసుకెళ్ళిపోయేవాళ్ళు. అతనికీ స్టోర్ రూం ఇన్చార్జ్ మా అమ్మమ్మకీ నిత్యం గొడవ.. ” క్రిష్ణమూర్తీ నువ్వు బోలెడు చింతపండు ముద్దలు వేస్ట్ చేస్తున్నావు.. వినాయకుడి లడ్డూ అని నీ తలకాయంత చేసి ఇంటికి పట్టుకుపోతున్నావు.. కాఫీపొడికి లెక్క చెప్పాలి” అంటూ.

    “రమణమ్మ పెళ్ళా? నాకు సాపు పెట్టాలి” అంటూ వచ్చేసాడు.

    అక్కడ నాతో కబుర్లాడితున్న మా ఆయన్ని” కొంచెం మాట్లాడు బాబూ” అని అమ్మ లోపలికి వెళ్ళింది. రేటు మాట్లాడిపెట్తాడు అనుకుందిట!.. ఈయన లడ్డూల సైజ్ పెద్దగా వుండాలి, కాజాలు మిగిలేట్లు చెయ్యండి” అని మాట్లాడి పంపేసారు.

    అమ్మ రాగానే “అన్నీ మాట్లాడేసా సత్యవతిగారూ”అన్నారు. ” ఏం అడిగాడూ? అసలే గడగ్రాహీ?” అంటే “అబ్బ! నేనిస్తాగా మీకెందుకు?”అన్నారు. అమ్మకి అల్లుడి సంగతి తెలిసింది.. ఇప్పటికీ అంతే! వస్తువు కొనేటప్పుడు బేరం ఆడ్తారేమో కానీ లేబర్ దగ్గర బేరం ఆడరు! చాలా జాలి.

    పెళ్ళికి ప్రొద్దుటే మా మరియన్ వచ్చి బ్లాక్ అండ్ వైట్ లో కొన్నీ, కలర్ లో కొన్నీ ఫొటోలు తీసాడు.. వీడియోలవీ లేవు!కార్లో మా అమ్మా నాన్నా నాతో బాటు మా అత్త కూతుళ్ళిద్దరూ, మా అన్నయ్య ఫ్రెండ్స్ రిజిస్టర్ ఆఫీసుకి వెళ్ళాం.

    మా బావగారూ తోటికోడలూ, ఆడబిడ్డా, అన్నయ్యగారూ వచ్చారు. మా తోటికోడలు ఓ సంతకం, మా హనుమంతన్నయ్య ఓ సంతకం పెట్టారు!

    మేం దండలు మార్చుకున్నాకా ముహుర్తం చూసి అమ్మ తాళి కట్టించింది. స్వీట్లు పంచాకా కామత్ హోటల్‌కి భోజనానికి వెళ్ళాం!

    నేను సినిమాలోలా పసుపు బట్టలతో పూలదండలతో మా అత్తగారూ మావగారూ దగ్గరకి వెళ్ళాలని సరదా పడ్డాను! ఈయన ఒప్పుకోలేదు.. “నాకేనా పంతం లేనిది? ” అన్నారు. సాయంత్రం రిసెప్షన్, మరినాడు పబ్లిక్ ఎడ్మినిష్ట్రేషన్ పరీక్ష! మా దోస్తులు పుస్తకాలతో సహా వచ్చారు. సారస్వత్ పరిషద్‌లో అయింది రిసెప్షన్.. బంధువులంతా వచ్చారు. మా క్రిష్ణమూర్తి వంట అదరగొట్టాడు. అసలు వెజిటబుల్ బిరియానీ చేస్తే మా క్రిష్ణమూర్తే చెయ్యాలి. మసాలాలు చిన్న త్రాసుతో కొలిచి చేసేవాడు!

    అన్ని శుభకార్యాలలో ఏదో ఓ వంక పెట్టకుండా వెళ్ళని మావయ్యలో పెద్దమ్మలో వుంటారు కదా?మా మావయ్య అలాగే తను వచ్చేసరికీ దధోజనం అయిపోయిందని వంక పెట్టాడు. ఆ మావయ్యే మొన్న మా అబ్బాయి పెళ్ళిలో బ్రేక్‌ఫాస్ట్‌కి లేట్‌గా వచ్చి” పొంగలి అయిపోయుందటే” అన్నాడు మిగతా నాలుగు రకాలూ వేసికుని. ఆ మాత్రం అలిగే వాళ్ళుండాలి లెండి! మా పెద్దమ్మ ఇప్పుడు లేదు కానీ ఆవిడ స్వంత కూతుళ్ళ పెళ్ళిలో కుడా మజ్జిగ పుల్లగా వుందనో కాఫీ చిక్కగా లేదనో అలిగితే, అమ్మా మా రెండో పెద్దమ్మా పరిగెత్తుకెళ్ళి అక్కగారి అలక తీర్చేవారు!

    మా నాన్న నా చెయ్య పట్టుకుని “అల్లుడికి దిష్టి తగిలేను.. ఇంత అందమైన అల్లుడు బంధువుల్లో ఎవరికీ లేరు.. భలే సెలక్ట్ చేసికున్నావ్ కంగ్రాట్స్” అన్నారు. మా నాన్నగారు నా ముందెప్పుడూ నన్ను మెచ్చుకునేవారు కాదు! కానీ మా అత్తలూ బాబాయిలు చెప్తారు – “ఎవరేం పని చేసినా మా అమ్మాయిలా చెయ్యలేరు.. మా అమ్మాయి బంగారం” అనేవారుట! అసలు నన్ను పొగడడానికే వాళ్ళ ఇళ్ళకి వెళ్ళవారని వాళ్ళ అలక!!

    మరునాడు ప్రొద్దుటే లేచి పరీక్షకి పరిగెత్తాను!

    మా కస్తూరిబా గాంధీ కాలేజ్ నిండా చెట్లుండేవి.. మా ఆయన అక్కడ వెయిట్ చేసారు! ముందటేడు మా అన్నయ్య పెళ్ళి మా కాలేజ్లోనే చేసాం!

    ఇక్కడ మా ప్రిన్సిపాల్ విద్యారాణి గారి గురించి చెప్పాలి!.. నాకు పెళ్ళికి ముందు ప్రీ ఫైనల్స్ అప్పుడు చికెన్ పాక్స్ వస్తే నన్ను ప్రత్యేకంగా కూర్చోపెట్టి పరీక్ష రాయించి, మథ్యలో వచ్చి కొబ్బరి నీళ్ళు తాగించి చూసుకునేవారు! మా ఇంటి పేరు ఒకటే (పుట్టింటిది) అంకరాజు అనీ దూరపు చుట్టరికం వుందనీ కాదు.. ఆవిడ ఏ పిల్ల నైనా అలాగే చూసుకునేవారు! ఆవిడ అంతే…మంచి మేడం.

    నాకు మా కాలేజ్ అన్నా ఆ చెట్లన్నా భలే ఇష్టంగా వుండేది. క్రికెట్ ప్లేయర్ జయసింహ గెస్ట్ హౌస్ కుడా అందులోనే వుండేది, కాంపౌండ్ వాల్ లేకుండా. నాతో బాటు నమిత అనే ఇంకో అమ్మాయికి కూడా మే 10 న పెళ్ళయింది. ఎంత సిగ్గేసిందో లెక్చెరర్స్ ముందు పరీక్ష రాస్తుంటే.

    మా తెలుగు మేడంకి నేను ఫేవరెట్. కిళాంబి జ్యోతీర్మయి గారు. ఫ్రెంచ్ సెకండ్ లాంగ్వేజ్ అని ఫిలప్ చేసి వెళ్తూ, ఆవిడ వసు చరిత్రలో గిరికని రాగయుక్తంగా వర్ణిస్తుంటే, విని సెకండ్ లాంగ్వేజ్ తెలుగు అని మార్చేసుకున్నా! అక్కడే జీవితం ఓ మలుపు తిరిగింది.

    అలా మా ఆయనతో కలిసి చెట్ల కింద నడుస్తూ వెళ్తుంటే అమ్మాయిలంతా “నమస్తే జీజాజీ!” అంటూ ఈయన్ని రాగ్ చేసారు! మేము హోటల్ కెళ్ళి భోజనం చేసి సాయంత్రం ఇంటికొచ్చి మరునాడు తిరుపతి కెళ్ళడానికి సూట్‌కేస్ సర్దుకున్నాం!

    జీవితంలో చాలా పెద్ద కోరికలుండేవి కావు.. వుద్యోగం చేసి తనకి హెల్ప్ చెయ్యాలని తప్ప! పెళ్ళికి ముందే సగం జీతం వాళ్ళ అమ్మా నాన్నలకివ్వాలి, మిగిలిన దాంతో పొదుపుగా వుండాలి అనేసుకున్నాం. పెళ్ళికి నాకు పది నైలెక్స్ చీరలొచ్చాయి, అమ్మ రెండు పట్టు చీరలు కొంది. నేను సెలవల్లో టైపిస్ట్ వుద్యోగం చేసి రెండు పట్టుచీరలు కొనుక్కున్నాను!

    లేమి అంటే తెలీదు.. జీవితం పచ్చగా పూచిన తంగేడులా వుండేది.

    తిరుపతి నుండి వస్తూనే మేం అద్దెకి తీసుకున్న అప్పలస్వామి గారింట్లోకి వెళ్ళిపోయాం.

    ఈయన బనీన్‌తో బావి దగ్గరకి వెళ్ళినా ఆంటీ “దిష్టి తగుల్తుంది షర్ట్ వేసుకో బాబూ” అనేది! అందరూ ఫారెనర్ అనుకుంటున్నారని మురిసిపోయేది.

    అంకుల్ వాళ్ళబ్బాయిని జాంబవంతుడనేవారు.. “ప్రతి షర్టూ ఓ చెయ్యి పొడుగు ఓ చెయ్యి పొట్టీ కుడ్తాడు టైలర్, వీడు కొలతలిచ్చేటప్పుడు సూపర్‌స్టార్ కృష్ణలా ఒంకరగా నిలబడతాడు” అని తిట్టేవారు. సన్యాసిరావు ఆంటీ తమ్ముడు. డ్రామాలకి మేకప్‌మేన్.  అంకుల్, పక్కింటి అప్పారావుగారు ఇద్దరూ రంగస్ధల నటులు. పద్యాలూ పాటలూ సాయంత్రాలు!.. ప్రియా ప్రసాద్‌లు వచ్చేవారు రోజూ.

    (నా కాలేజీ ఐడెంటీ కార్డ్ మీద మా విద్యారాణి మేడం సంతకం చూడండి కాలేజ్ ఫ్రెండ్స్‌తో, నాటకంలో ఫొటో)

    ***

    శ్రావణ శుక్రవారానికి అమ్మ తీసుకొచ్చింది. పేరంటం పిలవడానికి వెళ్ళి, ఈయనకి చెప్పకుండానే మా అత్తగారింటికి వెళ్ళి కాళ్ళకి దణ్ణం పెట్టాను. ఆవిడ కోపంగానే వున్నారు. కోపం తీరేదాకా అన్నీ అననిచ్చా” పేరంటానికి రండి” అని బొట్టు పెట్టా. మావగారొచ్చి నన్ను చూసి” ఏమ్మా?” అన్నారు. దణ్ణం పెట్టా. “మీ వదిన గారూ తోడికోడలూ వస్తారులే నేనెందుకు?” అన్నారు అత్తగారు. వస్తారని నేనూ అనుకోలేదులెండి!

    మా బావగారిల్లు దగ్గరే. టీవీలో సాగరసంగమం చూడ్డానికి తయ్యారవుతున్నాను ఓ సన్‌డే… మా వారికి ఏక్సిడెంట్ అయిందన్న వార్త మోసుకొచ్చాడు ఈయన కొలీగ్!

    మా ఆయనకి కాలర్ బోన్ ఫ్రాక్చర్ అయింది. నేను భయపడి తెగ ఏడ్చాను. డాక్టర్ మా బావగారింట్లోనే ప్రాక్టీస్ పెట్టినబ్బాయి మురళీ. ‘ఫ్రాక్చర్లో కాలర్ బోన్ విరిగిన వాళ్ళు అదృష్టవంతులు, త్వరగా అతుక్కుంటుంది’ అని ఓదార్చాడు. వాళ్ళన్నయ్య మాచిరాజు కామేశ్వరరావు చందమామలో కధలు రాసేవారు. మా ఇంటి వెనకాలే వుండేవారు. అప్పట్లో రచయితలంటే పిచ్చి నాకు!.. ఓ ఫ్రెండ్ అక్కయ్య పెళ్ళికి యండమూరీ, మల్లాదీ ఇద్దరూ వస్తారంటే నేనూ మా ఉమా వెళ్ళి తెల్లవార్లూ కూర్చున్నాం! అన్నీ అబద్ధాలు.. ఉక్రోషంతో ఏడుపు కుడా వచ్చింది!.. ఇప్పుడు ఆ ఇద్దరూ నాకు అత్యంత ఆప్తులు. అస్తమానం కలుస్తూనే వుంటాం. యండమూరి గారితో కలిసి ఎన్నో సీరియల్స్‌కి పని చేసా. మల్లాది గారి భార్య పద్మజ నా క్లోజ్ ఫ్రెండ్!

    .. ఇంతకీ ఈయన చెయ్యి విరిగినప్పుడు మూలుగుతూ “అమ్మా” అన్నారు.

    “వెళ్ళి మీ అమ్మగార్ని తీసుకురండి, కావాలంటే నేను వెళ్ళిపోతా” అని మా వదిన గారిని బతిమాలా. ఆవిడ వెళ్ళి చెప్తే మా అత్తగారు ఏడుస్తూ వచ్చారు. కొడుకుని దగ్గరకు తీసికున్నారు కానీ నాతో మాట్లాడలేదు! కాఫీ ఇస్తే తాగలేదు. “నాకు బానే వుంది” అని మా ఆయన చెప్పాకా వెళ్ళారు. నేను బాగానే చూసుకున్నా. కాలేజీ ఎగ్గట్టి అన్నం కూడా కల్పి నోట్లో పెట్టేదాన్ని.. విరిగినది ఎడమ భుజం అయినా! నాకు చాలా రోజులు చపాతీ వత్తడం వచ్చేది కాదు. ఓ రోజు చపాతీలు చెయ్యమన్నారు. ఓ ఫ్రెండ్‌ని కూడా పిలుచుకొచ్చారు పైగా. కూర అద్భుతంగా చేసా.. కానీ చపాతీ కంచంలో వేస్తే అవి క్రికెట్ బ్యాట్‍లా గట్టిగా వున్నాయి. ఇద్దరూ కాసేపు పీకి ట్రై చేసి వదిలేసి, “పద హోటల్ కెళ్దాం” అన్నారు. ముగ్గురం వెళ్ళాం. మా అమ్మని చూడాలనుందని అర్ధరాత్రి కూర్చుని ఏడ్చి తెల్లారే వెళ్ళానోసారి రెండు బస్సులు మారి! కానీ ఇంటికి తాళం. ఫోనులు వుండేవి కావు. ఏడుస్తూనే వెనక్కొచ్చా.. మా ఇల్లు తెరిచి వుంది. మా అమ్మ ఇల్లు శుభ్రం చేస్తోంది, నా కోసం వంట కూడా చేసుకొచ్చింది. ఎంత ఆనందమేసిందో, కౌగిలించుకుని చాలా సేపు ఏడ్చా! ఎంత బెంగ వుండేదో అప్పట్లో! చాలాసార్లు అయిందలా.. అమ్మ ఆఫీస్‌కి ఫోన్ చేసేదాన్ని.

    మా ఇంటి వాళ్ళ అమ్మాయికి ఉత్తరాల్లో నా గురించి రాసేవారుట, ఆ అమ్మాయి వైజాగ్ నుండి వచ్చి “నాకెంత ఈర్షగా వుందో నిన్ను మా అమ్మా నాన్నా పొగుడుతుంటే” అంది. తరువాత నాకు మంచి ఫ్రెండ్ అయిపోయింది. తనకో క్లోజ్ ఫ్రెండ్ వుండేది శారదని. తను ఈయన ఫ్రెండ్ (బ్యాట్ లాంటి చపాతీ పెట్టానే) కృష్ణ ప్రసాద్‌ని చేసుకుంది ఇంటి వాళ్ళమ్మాయి. వెంకటలక్ష్మిని నానీ అనేవాళ్ళు. అప్పట్లో దూరదర్శన్‍లో స్టేజ్ నాటకాల్లో ఏక్ట్ చేసేది. నవలల గురించి తెగ మాట్లాడుకునేవాళ్ళం ఇద్దరం. నాకు అప్పుడు ప్రపంచం తెలీదు. నానీ కెన్ని తొలుసో అనుకునేదాన్ని అమాయకంగా! మనకంటూ ఓ దిశ ఆ దేవుడు నిర్దేశించాడని అప్పుడు తెలీదుగా.. పై వాడు గొప్ప ఫిక్షన్ రైటర్!

    నాకు నెల తప్పిందని తెలిసాకా అప్పుడు మా అత్తగారు వచ్చారు. నన్ను చూసి “బంతిలా వుండే పిల్ల ఎలా అయిపోయిందో.. నీ వంటా నీ తిండీ ఏడిసినట్టుంది, నా మనవడు పండులా పుట్టాలి పద మనింటికెళ్దాం” అన్నారు.

    నాకు నా ఇల్లూ , స్నేహితులూ, ఇంటి వాళ్ళనీ వదిలి వెళ్ళడం ఇష్టంలేదు.. అయినా తప్పలేదు!

                                                                                           (ఈ రమణీయం ఇంకావుంది)

    LEAVE A REPLY

    Please enter your comment!
    Please enter your name here