జీవన రమణీయం-105

0
8

[box type=’note’ fontsize=’16’] టీవీ, సినీరంగాలలో తనదైన ప్రత్యేక స్థానాన్ని ఏర్పర్చుకున్న సుప్రసిద్ధ రచయిత్రి బలభద్రపాత్రుని రమణి నిజజీవితంలోని అనుభవాల రమణీయమైన కథనం ‘జీవన రమణీయం‘ ఈ వారం. [/box]

[dropcap]నే[/dropcap]ను మాటీవీలో పని చేసేటప్పుడు శైలజ అనే నా చిన్ననాటి స్నేహితురాలిని ఈటీవీలో తీసేస్తే ఇక్కడ వుద్యోగం వేయించా. ఇలాగే ఓసారి అనుష్క ఏదో ఇంటర్వ్యూ ఇవ్వడానికొచ్చింది. అప్పుడప్పుడే అనుష్క సినిమాల్లో ఫేమస్ అవుతోంది. శైలజ అనుష్కతో “మీరు చాలా అందంగా వున్నారు” అని మాట్లాడింది. ఆ తర్వాత నేను అన్నపూర్ణా స్టూడియోస్‌లో అనుష్కకి కథ చెప్పడానికి వెళ్ళాను అని తెలిసి, శైలజ “నా గురించి అనుష్క అడిగిందా?” అని అడిగింది. “లేదే?” అంటే, “అడిగే వుంటుంది. ‘మీరు చాలా అందంగా వున్నారు’ అని నేను చెప్తే చాలా సంతోషించిందిగా, నువ్వు దాస్తున్నావు నా దగ్గర” అనేసింది. జోక్‍గా కాదు, సీరియస్‌గానే. ఆమె పరిజ్ఞానానికి పాపం అలా అనిపించి వుంటుంది. వీటికి కారణం ఎక్స్‌పోజర్ లేకపోవడం, చాలా పెద్ద చదువులు చదువుకున్న సైంటిస్ట్‌లూ, డాక్టర్స్‌లో కూడా నేను కొన్నిసార్లు ఈ ఎక్స్‌పోజర్ లేక బుర్ర తక్కువగా మాట్లాడ్డం, ఎదుటి వాళ్ళని నొప్పించడం చూస్తూంటాను! అసలు చదువుకీ కామన్‌సెన్స్‌కీ ఎటువంటి సంబంధం లేదు! ఎక్స్‌పోజర్ మేధావులకి వాళ్ళ రంగాలలో వుంటుందే కానీ, ప్రాపంచిక విషయాలలో అసలుండదని గ్రహించాను!

మొదటి రోజు పల్లవి డాన్స్, ఫణి ప్రార్థనా గీతం వున్నాయి. గాయత్రి పల్లవిని చక్కగా తయ్యారు చేసి, తనూ అందాల భరిణలా తయ్యారయి వచ్చింది. అందరం ఒక దగ్గరే భోం చేశాము.

మాధవ్ మా తెలుగు లిటరరీ ప్రోగ్రామ్స్ ఎప్పుడెప్పుడున్నాయో చెప్పాడు. నేను సెన్సార్ బోర్డ్‌లో కష్టాల గురించి నవ్విస్తూ మాట్లాడాను. జ్యోతీ, కాంతీగారూ, నేనూ మిగతావాళ్ళు బోర్ కొట్టిస్తుంటే, వెనకాల కూర్చుని జోక్స్ వేసుకున్నాం. రఘునాథ్ కొత్తా గారు నా కథ ‘అపరిచితులు’ పడ్డ సావనీర్ నాకు ఇచ్చారు. చక్కగా సావనీరు ఎడిట్ చేసారు ‘కొత్తా’ దంపతులు.

ఇంక లేడీస్ అందరినీ గ్రూప్‍గా నిలబెట్టి ఫొటోలు తియ్యడం రఘునాథ్ గారి డ్యూటీ. ఆ ప్రహసనంకి బాగా నవ్వుకున్నాం. ఎవరి భార్య బాగా పడలేదేమో అని అనుమానం వచ్చినా ఆ భర్తలు మళ్ళీ తీస్తాం, ‘రీటేక్’ అనడం. లక్ష్మీపార్వతి గారు కూడా ప్రబంధాల గురించి అనర్గళంగా గంట సేపు స్పీచ్ ఇచ్చారు. ఆవిడకి సంస్కృతాంధ్రాల మీద పట్టు ఎక్కువ.

నేను స్వాతీ సోమనాధ్ ఎందుకు వచ్చిందో చెప్పలేదు కదు? ఆమె డాన్స్ బాలే ‘వాత్సాయన కామసూత్రాలు’ సీడీలు కావాలన్నారని పెద్ద ప్యాక్ తీసుకొచ్చింది. కానీ వీళ్ళు తీసుకున్నట్టు లేదు! వంశీ రామరాజు బాబాయ్‌తో ఈ విషయం ఆమె వరండా మీద చర్చిస్తుంటే విన్నాను.

వంశీ ఆర్ట్స్ థియేటర్స్ అనే సాంస్కృతిక సంస్థ స్థాపించిన రామరాజు గారిని నేను ‘బాబాయ్‌’ అని ఎందుకంటానంటే, ఆయన నాకు చిన్నప్పటి నుండీ తెలుసు! మా స్వంత బాబాయ్ సాయిభాస్కర్‌కి ఈయన మంచి స్నేహితుడు. వంశీ స్థాపించినప్పుడు మా బాబాయ్ ఈయనకి కుడి భుజంలా వ్యవహరించేవాడు! ఇంక రామరాజు బాబాయ్‌ అయితే ఎన్ని వేల సన్మానాలు చేసాడో తనకే తెలియదు! రోజూ ఒకరికి సన్మానం చెయ్యకపోతే తోచదు అంటారు. ఆయన కార్ డిక్కీలో కొన్ని మెమెంటోలూ, కొన్ని శాలువాలూ అను నిత్యం వుంటాయి. ఎక్కడ ఏ మనిషి దొరికినా, ‘మొబైల్ సన్మానాలు’ చేసేస్తూ వుంటాడు. ప్రతీ మనిషిలో ఏదో ఒక గొప్పతనం వెతికి సన్మానాలు చెయ్యడం ఆయన ప్రత్యేకత! ఇంక ఆయన శ్రీమతి సుధా రామరాజు భర్తకి తగ్గ ఇల్లాలు. ఇద్దరూ వేగేశ్నా అంగవికలుర అనాథాశ్రమం పెట్టి, అవిశ్రాంతంగా నిస్వార్థంగా సేవ చేస్తూ వుంటారు. ఆవిడ రచయిత్రి తెన్నేటి హేమలత గారికి మేనకోడలు. చంద్రమోహన్ గారి భార్య జలంధర గారికి కజిన్. అంతే కాదు, తెలుగు యూనివర్సిటీలో ఆవుల మంజులత గారు డైరక్టర్‌గా ఉన్నప్పుడు, డెప్యూటీ డైరక్టర్‌గా పని చేసారు. స్వతహాగా రచయిత్రీ, కవయిత్రీ. రచన రక్తంలో వుంది కదా! కానీ నిగర్వీ, స్నేహశీలీ. ఎంత సౌమ్యతా, సహనమో చెప్పలేము. వేగేశ్నకి వీళ్ళిద్దరే కాక అహోరాత్రాలూ, అకుంఠిత దీక్షతో పనిచేసే శైలజగారు ఒకరు. ఆవిడ తాండ్ర పాపారాయుడి వంశస్థురాలట!

రైల్లో చేతులూ, కాళ్ళూ లేకుండా అడుక్కుంటున్న పిల్లలని కూడా తీసుకొచ్చి రామరాజు బాబాయ్ ఇక్కడ చేర్చుకుని, చదువు చెప్పించి వాళ్ళకి ఆపరేషన్లు చేయించి, వాళ్ళ కాళ్ళ మీద వాళ్ళు నిలబడేట్లు చేస్తారు. అందులో ఒకడు “చిరంజీవిని చూపిస్తా అంటే నీ వెంట వస్తా” అంటే, అలాగే చేసారు. ఎంతమంది అమ్మాయిలకో జైపూర్ కాళ్ళు కూడా పెట్టించారు. నాతో సెన్సార్ బోర్డ్‌లో కూడా ఒక ఫిజికల్లీ ఛాలెంజెడ్ ఆవిడ పద్మావతి బోర్డ్ మెంబర్‌గా వుండేది. అంటే… ఎంత పైకి తిసుకొచ్చారో ‘వేగేశ్న’ పిల్లల్ని ఆలోచించండి!

ఇలా ఎంతో మంది గొప్ప వ్యక్తులు నా జీవితంలో అడుగడుగునా తారసపడడం వలన జీవితం చాలా వేగవంతంగానూ, వుత్సాహభరితంగానూ సాగిపోతోంది. ఈ మధ్యనే గీతా ఆర్ట్స్ అనే అల్లు అరవింద్ గారి నిర్మాణ సంస్థలో, అల్లు అరవింద్ గారి చేత వంశీ రామరాజు గారు నాకు ‘భానుమతీ రామకృష్ణ’ అవార్డు ఇప్పించారు! అది నేను మరిచిపోలేని రోజు. అరవింద్ గారు నా గురించి ఎంతో బాగా మాట్లాడారు. నా మొట్టమొదటి సినిమా ‘రేపల్లెలో రాధ’కి కూడా కథా రచయిత్రిగా వంశీ ‘డైరక్టర్స్ ఛాయిస్’ అవార్డు అందుకున్నాను. ఆ రోజు కూడా నేనెన్నటికీ మరిచిపోలేను… ఆ ఫంక్షన్‌లో పరుచూరి వెంకటేశ్వరరావు గారు, శిల్పకళా వేదికలో “ఈ రోజు అవార్దులు హీరో హీరోయిన్లతో కాదు, రచయితలతో మొదలు పెడదాం, కథ సినిమాకి మొదలు, అదే ప్రాణం కూడా!” అని మొదలు నాకు ఇప్పించి ప్రారంభించారు. ‘రేపల్లెలో రాధ’ సినిమా నాకు మిగిల్చిన తీపి జ్ఞాపకం ఆ వంశీ ‘డైరక్టర్స్ ఛాయిస్’ అవార్డు!

నాటాలో మరునాడు లిటరరీ ప్రోగ్రామ్‌లో భాగంగా గరికపాటి నరసింహారావు గారి అష్టావధానం ఏర్పాటు అయింది. అది ప్రధాన వేదిక మీద ఏర్పాటు కావడం, సినిమా తారలను చూడ్డానికి సామాన్యంగా వచ్చేటంతమంది ఈ అవధానానికి రావడం విశేషం! నా మొదటి అమెరికా ప్రయాణంలో రాళ్ళబండి కవితా ప్రసాద్ గారి అవధానానికి స్టేజ్ ఇచ్చి, తొందర పెట్టి దింపేయడం, తెలుగు సాహిత్యం తెలిసిన మా అందరికీ ఎంతో మనస్తాపం కలిగించింది. ఇక్కడ మాత్రం మా ఫణి అసందర్భ ప్రలాపంతో, గరికపాటి గారి జనరంజకమైన పాండిత్యంతో చాలా బాగా జరిగింది. కెమెరామెన్‌గా నా ‘పద్మవ్యూహం’ సీరియల్ హీరో నవీన్ కనిపించి చాలా ఆశ్చర్యపరిచాడు నన్ను!

(సశేషం)

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here