జీవన రమణీయం-113

2
5

[box type=’note’ fontsize=’16’] టీవీ, సినీరంగాలలో తనదైన ప్రత్యేక స్థానాన్ని ఏర్పర్చుకున్న సుప్రసిద్ధ రచయిత్రి బలభద్రపాత్రుని రమణి నిజజీవితంలోని అనుభవాల రమణీయమైన కథనం ‘జీవన రమణీయం‘ ఈ వారం. [/box]

రేడియోలో ఇంటర్వ్యూ ఇస్తూ…

[dropcap]ఇం[/dropcap]కోసారి ‘తెలుగాట’ అనే కార్యక్రమానికి నన్ను గెస్ట్‌గా పిలిచి హరిహరకళాభవన్‍లో పిల్లలకి క్విజ్ పెడుతూ, “ఏదైనా వీరికి తెలుగు గురించి తెలీని ప్రశ్న వెయ్యండి రమణిగారూ?” అన్నారు.

నేను వెంటనే “మన తెలుగువాళ్ళు, అన్నింటికీ ‘ఆ… ఏముందీ సింగినాదం… జీలకర్రా’ అంటూ వుంటారు కదా! దానికి అర్థం తెలుసా? ఆ వాడుక ఎందుకొచ్చిందో?” అని అడిగాను.

అక్కడ పార్టిసిపెంట్స్ అయిన పిల్లలెవరూ జవాబు చెప్పలేకపోయారు. “నేనూ ఇదే మొదటిసారి వినడం… నాకూ జవాబు తెలీదు… చెప్పండి” అన్నారు ఆనంద్ గారు.

నేను చెప్పాను. “పూర్వం పల్లెటూళ్ళలో, సంతలో కానీ, వారానికి ఓసారి నిత్యావసర వస్తువులు తెచ్చి కానీ ఇళ్ళ ముందు అమ్మేవారు. అప్పుడు వారు వస్తున్నప్పుడు, బూరా వూదుతూ వస్తున్న గుర్తుగా వూరిలో కొచ్చేవారు. పని చేసుకుంటున్న ఆడవాళ్ళు ‘ఏమిటా శబ్దం?’ అని ఎవరైనా అడిగితే… ‘ఆ… ఏముందీ శృంగనాదం… జీలకర్రా’ అని జవాబిచ్చేవారు. అది ఎద్దు కొమ్ముతో వూదే బూరా. ఆ శృంగనాదం నెమ్మదిగా జనబాహుళ్యంలో పడి ‘సింగినాదం’గా మారింది!”

నా జవాబుకి అందరూ చప్పట్లు కొట్టారు. ఆ రోజు తెలుగాటలో పాల్గొన్నవారిలో గరికపాటి నరసింహారావు గారి అబ్బాయి గురజాడ కూడా వున్నాడు! అతనూ చెప్పలేకపోయాడు. బహుమతి గెలుచుకున్నాకా, అతనికి నా చేత బహుమతి ఇప్పించారు ఆనంద్ గారు. అప్పుడు అతనికి చెప్పా… “ఇది మీ నాన్నగారి ప్రవచనాలు విని తెలుసుకున్న విషయమే!” అని. ఒక జ్ఞాపకాన్ని కదిపితే, తేనెటీగల పట్టులా బోలెడు విషయాలు బయటకొస్తాయి అదీ ‘జుయ్’మంటూ!

ఈ సంచికకి ఈ వ్యాసం రాస్తుండగా, నిన్న ఆనంద్ కూచిభొట్ల గారి ఫోన్ వచ్చింది. ఆయన వూరకే చెయ్యరు, ఏదో పని వుంటే తప్ప. “రమణీగారూ, జూన్ నుండీ సెప్టెంబర్ దాకా సిలికానాంధ్ర పిల్లలకి శలవులు… ఎవరైనా ప్రముఖులతో మాట్లాడించి వారికి విజ్ఞానం అందించాలనుకుంటున్నాను… మీకు అల్లు అరవింద్ గారు బాగా తెలుసు కదా… ఆయన జూన్ 21న కాని 28న కాని 2020లో మాట్లాడగలరేమో అడుగుతారా? ఆయన ఎక్కువగా ఏ వేదిక మీదా ఎక్స్‌పోజ్ అయ్యే మనిషి కాదు గదా! ప్లీజ్, మీరు చెయ్యగలరు” అన్నారు. ఆనంద్ గారి మాట నేను తీసెయ్యలేను. కానీ అరవింద్ గారు పబ్లిక్‍లో ముఖాముఖీ మాట్లాడడం, ఎక్కువగా ఓపెన్ అప్ అవడం ఇష్టపడే వ్యక్తి కారు. నాకు ఆయన గురించి కొంచెం బాగానే తెలుసు. నేను సాధారణంగా, ‘అరవింద్ గారితో మీకు స్నేహం కదా… ఫలానా ఆడియో ఫంక్షన్‍కి పిలవాలి, ఫలానా మీటింగ్‌కి తీసుకురావాలీ… లేదా ఏదైనా రికమండేషన్ చేయించాలీ’ అని ఎంత క్లోజ్ ఫ్రెండ్స్ అడిగినా, రెండవసారి ఆలోచించకుండా ‘నో’ అని చెప్తాను. “‘బన్నీ’ (అల్లు అర్జున్)ని ఫలానా షాప్ ఓపెనింగ్‌కి పిలిస్తే, మీకు లక్ష రూపాయలిస్తాం… వాళ్ళ నాన్నని అడగండి” అని కూడా మొదట్లో నాకు ఫోన్‍లు వచ్చేవి! కానీ నాకు దేనికి పిలవాలో, దేని గురించి ఆయన్ని అడగాలో బాగా తెలుసు! ఆ ఫిల్టర్ వుండడం వలనే ఆయనా నా మాటకి విలువిస్తారు! ఆనంద్ గారు పరుచూరి గోపాలకృష్ణగారినీ, ఎల్.బి. శ్రీరాం గారినీ కూడా పిలవమన్నారు. వాళ్ళు కూడా బిజీగా వున్నారు కానీ నా మాట తీసెయ్యలేరు. మొదట అల్లు అరవింద్ గారి డేట్ బ్లాక్ చేద్దాం అని, కాల్ చేసాను. అలవాటుగా “ఐయామ్ నాట్ ది రైట్ పర్సన్ టు ఎడ్రెస్” అన్నారు. నేను వెంటనే “మీరు రైట్ పర్సన్… మీరు మాట్లాడాలి. ఇన్ని సక్సెస్‍లు సాధించిన ప్రొడ్యూసర్… ఇంత పెద్ద హీరోలని తయ్యారు చేసిన ఘనత మీది” అనలేదు! “ఓకే… థింక్ ట్వైస్. ఇది మన తెలుగు పిల్లల కోసం… అదీ ప్రవాస భారతీయుల కోసం” అని ఫోన్ పెట్టేసాను. నేను ఎవరినీ పెద్దగా వత్తిడి చెయ్యను. నన్ను ఎవరైనా అలా చేస్తే అసలుకే ఆ పని చెయ్యను. మర్నాడు ఆనంద్ గారితో, “అరవింద్ గారు ఇంట్రెస్టెడ్ కాదు… పరుచూరిగారితో మాట్లాడ్తాను” అన్నాను. దానికాయన “ఎలాగైనా ఒప్పించడానికి చూడండి రమణిగారూ, ఇక్కడంతా ఆయన పేరు వింటే ఎక్సైట్ అవుతారు” అన్నారు. ఆలోచించా… తెలుగు భాష కోసం ఓ గిడుగు రామ్మూర్తి గారిలా కష్టపడుతున్న మనిషికి మనం ఓ చిన్న సాయం చెయ్యలేమా! అని. “నా దగ్గర మిగిలిన రామబాణం ఒక్కటే నండీ, అదీ రేపు ప్రయోగిస్తా” అన్నాను.

“ఏమిటీ?” అడిగారు ఆనంద్ గారు.

“నేను చెప్తే మీరు నా మాట తీసెయ్యరు అని చెప్పేసా అంటా” అన్నాను.

దానికి ఆయన నవ్వి, “హా హా హా ప్లీజ్… అలాగే చెయ్యండి” అన్నారు.

నేను పరుచూరి గారితో మాట్లాడాకా, అరవింద్ గారి మీద రామబాణం ప్రయోగిస్తూ వాట్సప్‍లో మెసేజ్ పెట్టాను. “మీరు నా మాట కాదనరు అని వాళ్ళకి చెప్పేసాను. అయినా మీకిష్టం లేకపోతే ఒద్దు లెండి” అని. దానికి ఆయన స్మైలీతో “అలాగే రాత్రి పది గంటలకి కన్‍సర్న్‌డ్ పీపుల్‌ని నాతో మాట్లాడమనండి” అన్నారు.

ఆనంద్ గారు చాలా ఎక్సైట్ అయ్యారు. మాట్లాడాకా ఆ లింక్ నేనిస్తాను పాఠకులకి. అలాగా అల్లు అరవింద్ గారు నా మాట నిలబెట్టారు.

లక్ష్మీ కాత్యాయిని, శాంతి గారు, కాంతిగార్లతో ఆనంద్ గారింట్లో

ఆనంద్ గారింటికి ఓ ముప్ఫై మందిదాకా యువకులూ, యువతులూ వచ్చారు ఆ రోజు మీటింగ్‍కి. అందులో లక్ష్మీ కాత్యాయిని కూడా వచ్చింది. మీకు గుర్తుండి వుంటే నేను ఓసారి విమెన్స్ డే సందర్భంగా ఎఫ్.ఎమ్. రెయిన్‍బో లో ఈ అమ్మాయి ఇంటర్వ్యూ చేస్తుంటే, విశ్వనాథ్ గారు ఫోన్ చేసారు. ఈ అమ్మాయి లైన్‍లో పెట్టి వెయిట్ చేయించింది. “నేను శంకరాభరణం డైరక్టర్‍ని” అని ఆయన చెప్తే, ఇద్దరం షాక్ తిన్నాం. ఆయన కార్లో వెళ్తూ, నేను మాట్లాడ్డాం రేడియోలో విని, ఓపిగ్గా లైన్ దొరికే దాకా ట్రై చేసి, “అమ్మా, నాకు ఆ ‘లీడర్’, అదే మీ తాతగారి జీవిత చరిత్ర కావాలి” అనడం, నేనూ లక్ష్మీ కాత్యాయినీ కూడా జీవితంలో మర్చిపోలేని సంఘటన! కొన్ని అపురూప స్మృతులు అలా యాదృచ్ఛికంగా జరిగి, తలచుకున్నప్పుడల్లా కితకితలు పెడ్తాయి! ఓసారి బాలసుబ్రమణ్యం గారు నాకు ఫోన్ చేసి, “నేనమ్మా బాలూని… అదే పాటలు పాడే బాలసుబ్రమణ్యాన్ని…” అనడం నా జీవితంలో మరో సువర్ణ ఘట్టం… ఆయన చిట్టెన్‍రాజుగారికి మాటీవీలో సీరియల్ కావాలని, నేను మాటీవీలో క్రియేటివ్ కన్సల్టెంట్‍గా పనిచేస్తున్నప్పుడు ఫోన్ చేసారు! కానీ ఆయనతో నాకు బాగానే పరిచయం వుంది. నా జీవితంలో మొదటిసారి నేను కథ చెప్పడానికి గ్రీన్ పార్క్ హోటల్‌ కెళ్ళి రెండు గంటలు కథ చెప్తే విన్న ప్రొడ్యూసర్ ఆయన! అదే గ్రీన్ పార్క్ హోటల్‍కి వెళ్ళి నేను కె. విశ్వనాథ్ అనే లెజండరీ డైరక్టర్‍కి ‘లీడర్’ పుస్తకం ఇచ్చి, ఆయనతో బోలెడు కబుర్లు పంచుకుని వచ్చాను అనుకోండి ఆ తర్వాత! ఆ లక్ష్మీ కాత్యాయిని ఇప్పుడు ‘నెట్‌ఫ్లిక్స్’లో జాబ్ చేస్తోంది.

దశరథాంజనేయులుగారు,కాంతి గారు, కిరణ్ ప్రభ గార్లతో

ఇంకో ముఖ్యమైన వ్యక్తి దశరథ ఆంజనేయులు గారు కూడా ఆనంద్ గారి ఇంటి కొచ్చారు ఆ వేళ! ఈ దశరథాంజనేయులు అనే కాంబినేషన్‍లో, దశరథుడ్నీ, ఆంజనేయుడినీ కలుపుతూ పేరు పెట్టిన ఆయన తల్లిదండ్రుల టేస్ట్‌కి నేను ఆశ్చర్యపోయాను. ఈయన చాలా పెద్ద బిజినెస్‍మేన్. రాజమౌళికి కజిన్. ‘ఈగ’ సినిమా గ్రాఫిక్స్ అన్నీ వీళ్ళ స్టూడియోలోనే జరిగాయి. చాలా నిగర్వి మనిషి! ఇవన్నీ కాదు కానీ కిరణ్ ప్రభ గారికి ఆత్మీయ నేస్తం ఆయన. వారింట్లో నుండి ఆ రోజు కరివేపాకు కూడా తెచ్చినట్టు గుర్తు! ఆ తర్వాత మేం ఆనంద్ గారింట్లోనే లంచ్ చేసి, ఓరియంటల్ థియేటర్‍లో దశరథాంజనేయులు గారితో ‘ఈగ’ సినిమాకి వెళ్ళాం. ఇంకో విషయం, ఆనంద్, శాంతి గార్ల అమ్మాయి అనూష లంగా ఓణీలని కలిపి ‘ఓలే’ అని డ్రెస్ డిజైన్ చేసి బొటిక్‍లో పెట్టడం చూసి నేను చాలా ముచ్చట పడ్డాను.

మన ఇండియాలో మన పిల్లలలో సైతం తెలుగు చదవడం, రాయడం మరిచిపోతున్న ఈ రోజుల్లో, అమెరికాలో పిల్లలకి ఛందస్సులతో సహా తెలుగు నేర్పడం, వాళ్ళు నేర్చుకోవడం చూసి నేను మెచ్చుకున్నాను. మా జానకక్క కూడా ‘మా బడి’ తెలుగు అధ్యాపకురాలు అని తర్వాత తెలిసింది.

విజయ అసూరి, కాంతిగారు, కిరణ్ ప్రభగార్లతో…

‘ఈగ’ సినిమా మేం చాలా ఎంజాయ్ చేశాం ఆ చిన్న థియేటర్‍లో.

(సశేషం)

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here