జీవన రమణీయం-118

4
4

[box type=’note’ fontsize=’16’] టీవీ, సినీరంగాలలో తనదైన ప్రత్యేక స్థానాన్ని ఏర్పర్చుకున్న సుప్రసిద్ధ రచయిత్రి బలభద్రపాత్రుని రమణి నిజజీవితంలోని అనుభవాల రమణీయమైన కథనం ‘జీవన రమణీయం‘ ఈ వారం. [/box]

[dropcap]సా[/dropcap]యికృష్ణ అంటే ‘బాబాయ్ హోటల్’లో హీరో వేషం వేసిన అబ్బాయి. నా తమ్ముడితో సమానం. చాలా మందిని నాకు పరిచయం చేస్తుంటాడు. తన పెళ్ళికి ముంబై వెళ్ళినప్పుడు కృష్ణదేవరాయలు గారిని పరిచయం చేసాడు కదా! ఒకసారి “మీకు మ్యూజిక్ అంటే ఇష్టం కదా… మీ ఇంటికి ఓ మ్యూజిక్ డైరక్టర్‌ని తీసుకొస్తున్నా” అన్నాడు. “ఎవర్ని?” అంటే “సోమరాజు గారనీ…” అన్నాడు.

నేను కాఫీ, టిఫిన్స్‌కి రెడీ చేసి ఎదురుచూస్తుండగా, రాజ్-కోటిలలో రాజ్‌తో పాటు మా ఇంటి ముందు కారు దిగాడు. ఆయన్ని ‘పాడుతా తీయగా’లో చూడడం వల్ల టీ.వీ.లో, గుర్తు పట్టాను. చాలా సంతోషపడ్డాను. “గువ్వా గోరింకతో” దగ్గర నుండీ వాళ్ళు చేసిన మ్యూజిక్ నాకెంతో ఇష్టం. వాళ్ళిద్దరూ విడిపోయాకా, కోటిగారు నా సినిమా ‘రేపల్లెలో రాధ’కి సంగీతం చేసారు. నేను ఆయన్ని చూసి ఆనందపడ్డాను. సోమరాజు గారు ఈటీవీకి ఒక టెలీఫిల్మ్ కానీ, సీరియల్ కానీ తియ్యాలనుకుంటున్నారు, అందుకే కథ కావాలంటే సాయికృష్ణ నా దగ్గరకి తీసుకొచ్చాడు. ఇలానే నన్ను రవిరాజా పినిశెట్టి, ఎస్.వి.కృష్ణారెడ్డి గార్లకి కూడా గతంలో పరిచయం చేసాడు. ‘ముద్దొస్తున్నావోయ్ గోపాలం’ అనే టెలీఫిల్మ్ వీరేంద్రనాథ్ గారు సాయిని హీరోగా పెట్టి తీయాలనుకున్నప్పుడు, ఆ ప్రొడ్యూసర్ ‘ముస్తాక్’ దగ్గరకీ తీసుకెళ్ళాడు. ఆ ముస్తాక్ ఇంట్లో ఏకంగా భోజనానికే పిలిచాడు. మాకు నమస్కారం పెడుతూ ఎదురొచ్చిన ఓ అందమైన స్త్రీని చూసి నేను నోరు తెరిచి వుండిపోయాను… ‘వహీదా రెహ్మాన్’ అని! కానీ ఆవిడ నవ్వుతూ “వహీదా మా చెల్లి” అంది. స్వంత అక్క కొడుకు ఈ ముస్తాక్. అతను నాకు కొంత అడ్వాన్స్ కూడా ఇచ్చినట్టు గుర్తు. ‘కథ పేరు నాదే వెయ్యాలి’ అని నేను అన్నానని, అతను వీరేంద్రనాథ్ గారితో చెప్తే, ఆయన – మా ఆయనా, పిల్లల ముందే నన్ను “అసలు పేరు వెయ్యమని ఎలా అడుగుతున్నారూ? సంవత్సరాలు సంవత్సరాలు తపస్సు చెయ్యాలి, తెర మీద సింగిల్ కార్డ్ పేరు పడాలి అంటే…” అన్నారు. నా కళ్ళల్లో నీళ్ళొచ్చినా, గురువు కదా, ఏమీ అనలేదు! సంవత్సరం తిరగకుండానే ‘రేపల్లెలో రాధ’కి , కథ బలభద్రపాత్రుని రమణి అని ట్రయిలర్స్‌లో సైతం వేసేట్టు చేసి, తెర మీద సింగిల్ కార్డ్, అప్పుడు ఫోన్ చేసి చెప్పా “చాలా సార్? ఎవరినీ చిన్న చూపు చూడకండి” అని! దానికి ఆయన “చూసావా? ఎలా రెచ్చగొట్టానో?… అందుకే పైకొస్తున్నావ్” అన్నారు. ఆ కత్తికి రెండు వేపులా పదునే!

అలా చాలామందిని సాయి పరిచయం చేయడం అలవాటే కాబట్టి, సోమరాజు గారు, అదే రాజ్ గారిని తీసుకురావడం నాకే మాత్రం ఆశ్చర్యం కలగలేదు! ఆయనకి నేను చెప్పిన ‘స్వర్గంలో ఖైదీలు’ అనే నా నవల చాలా నచ్చింది! “తీస్తే ఇదే తీస్తా” అన్నారు. ఆ తర్వాత పాపం సిన్సియర్‌గా ఆ కథ తీసుకెళ్ళి ఈటీవీలో బాపినీడు గారి దగ్గర ట్రై చేసారు. నాతో తరచూ “కథ ముగింపు ఇంకోలా వుంటే బావుంటుంది… ట్రాజెడీ చెయ్యచ్చు కదా” అని మాట్లాడ్తుండేవారు! ఆ తరువాత అది వర్క్ అవుట్ కాకపోయినా, రాజ్ గారు ఎక్కడ కనిపించినా, “ఆ కథ చాలా బాగా రాసారు” అనేవారు!

ఇంటర్వ్యూలలో మనుషులు కొద్దిగా వాస్తవాలు మార్చి చెప్తుంటారు. యస్.డి.లాల్ గారి అబ్బాయి మీర్ గారు, నాగభూషణం గారి అమ్మాయి భువనేశ్వరి భర్త. ఈటీవీ సుమన్ గారు ఆఖరిగా ఏక్ట్ చేసిన టెలీఫిల్మ్ ‘చూడు చూడు తమాషా’కి కథ ఇచ్చింది నేనైతే, డైరక్ట్ చేసింది ఆయన. టి.ఎన్.ఆర్. ఇంటర్వ్యూలో “సుమన్ గారు బలభద్రపాత్రుని రమణి గారి దగ్గర కథ తీసుకోండి అని చెప్పారు. మేడం ఏదో కథ చెప్పారు, మొదటి రాత్రి శోభనం గదిలో అమ్మాయి ఆయన కాళ్ళ మీద పడిపోవడం లాంటిది… అలా కాదు, రాముడూ భీముడూ లాంటి డబుల్ యాక్షన్ సినిమా చేద్దాం అన్నాను” అని ఏదో చెప్పారు.

ఎవరో లింక్ పంపిస్తే చూసాను. వాస్తవానికి నేను కాదు ఆ శోభనం గది కథ చెప్పింది. నేను మొదటి నుండీ సుమన్ గారికి కమర్షియల్‍గా హీరో ఓరియెంటెడ్ కథ చెయ్యాలనే వున్నాను. ఆయన డబల్ ఏక్షన్ అన్నప్పుడు, 70 సీన్స్ ఒక్క రోజులో చేసి, ఆయనతో బాటు రామోజీరావు గారి ఇంటికి వెళ్ళి, సుమన్ గారి గదిలో ఆ రాజమహల్‌లో కథ చెప్పాను. ఆయన వినగానే ఓకే చేసారు… అప్పటికి నాతో, మీర్ గారితో, జి.ఎమ్. కె.ఎస్.ఆర్.కె. ప్రసాద్ గారితో కూడా చాలా గ్యాప్ వచ్చించి సుమన్ గారికి. ఇన్నేళ్ళ తర్వాత ఆయన మా పేర్లు చెప్పి పిలిపించి, ఈ ప్రాజెక్టు ఇవ్వడం మా అందరికీ చాలా ఆనందాన్నిచ్చింది! నాకైతే రామోజీరావు గారి ఇల్లు చూడడం, ఆ వైభవం అంతా ఏదో మయ సభలో తిరుగుతున్నట్లు అనిపించింది!

“అసలు టాయ్‌లెట్ ఎంత వైభవంగా, ఎంత కళాత్మకంగా వుందండీ?” అంటే మీర్ గారు చాలా చాలా నవ్వారు. ఈ రోజుకీ నేనూ, మీర్ గారూ ‘మాటీవీ పరివార్ అవార్డ్స్’కి జడ్జెస్‌గా వెళ్తాం, చాలా స్నేహంగా వుంటాం. కానీ ఆ టీ.ఎన్.ఆర్ ఇంటర్వ్యూలో – ఆయన లేని సంగతి, కొంచెం నా కథని కించబరుస్తూ మాట్లాడినట్టు అనిపించి చాలా బాధపడ్డాను. బట్ ఆయన గొప్ప వెంకటేశ్వరస్వామి భక్తుడు. హిందువు కాకపోయినప్పటికీ,, ‘శివలీలలు’ డైరెక్ట్ చేసినప్పటి నుండీ నుదుట విభూతీ, కుంకుమ బొట్టుతో, ఆసలే ఆరు అడుగుల పైన హైట్ వుంటారేమో, చూడగానే ‘నమస్కారం’ పెట్టాలనిపిస్తుంది! ఆ రోజు అరవింద్ గారితో చిన్న మనస్పర్ధ వచ్చి, మనస్తాపం చెంది మరీ రామోజీ ఫిల్మ్ సిటీ వెళ్ళాను. నాకు బాగా గుర్తు! అయినా కథ బాగా చెప్పాను. చాలామందిలా త్రెడ్ వుంటే చాలు, నా దగ్గర కథ వుంది అనను.  నేను 70, 80 సీన్స్ రాసుకుంటేనే చెప్పగలను!

సోమరాజు గారి తర్వాత, మా సాయికృష్ణ ఫోన్ చేసి “‘సుజాత’ అని ఓ అమ్మాయికి  మీ ఫోన్ నెంబరు ఇచ్చాను. హెల్ప్ చెయ్యండి” అన్నాడు. “సరే” అన్నాను. ఆ అమ్మాయి వచ్చి ఓరిస్ బంజారాహిల్స్‌లో దిగింది. ఫోన్ చేసి లంచ్ టైంలో కలుద్దాం అంది. వెళ్ళి ఆ తెల్లని అమ్మాయిని కలిసాను. ఆమె అడిగిందేం చిన్న పని కాదు! “చిరంజీవి గారు రేడియో మిర్చీ ఛానెల్ లాంచ్ చెయ్యాలి, అది మీ వల్లనే అవుతుందని సాయి చెప్పాడు” అంది. అప్పటికి మళ్ళీ రేడియో స్టేషన్ల రెండవ ఆవిర్భావం ఇంకా జరగలేదు! అందరూ టీవీ ఛానెల్స్‌కి అంటుకుపోయి, సీరియల్స్ చూస్తున్నారు! “రేడియో మిర్చీనా? రేడియో ఎవరైనా వింటారా?” అన్నాను. “మళ్ళీ జనం రేడియోలకి ఎట్రాక్ట్ అయిపోయే టైం వచ్చింది” అంది…. చూసారా? ఎవరైనా భవిష్యత్తులో ఇలా ప్రజలంతా ఓ.టీ.టీ. ప్లాట్‌ఫార్మ్‌లకి కట్టుబడిపోతారు… సినిమా థియేటర్లలో సినిమాలు రిలీజ్ అవవు… కరోనా అనే కాల మహిమ వలన మనిషీ మనిషీ ఆరు అడుగుల దూరంలో నిలబడి ముక్కుకి మాస్క్ వేసుకు మాట్లాడ్తారు… లాక్‌డౌన్ ప్రపంచవ్యాప్తంగా జరుగుతుంది… అంతా ఇంటి గడప దాటకుండా పనులు చేసుకుంటాం… సినిమా హాళ్ళూ, రెస్టారెంట్లూ, షాపింగ్ మాల్స్, పబ్లిక్ ప్రోగ్రామ్స్, గెట్ టు గెదర్‌లూ వుండవు… అని ఏడాది క్రితం అంటే 2019లో ఎవరైనా చెప్తే నమ్మే వాళ్ళమా? అలాగే రేడియో గురించి సుజాత మాట్లాడితే నేను తెల్లబోయాను!

(సశేషం)

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here