జీవన రమణీయం-122

1
10

[box type=’note’ fontsize=’16’] టీవీ, సినీరంగాలలో తనదైన ప్రత్యేక స్థానాన్ని ఏర్పర్చుకున్న సుప్రసిద్ధ రచయిత్రి బలభద్రపాత్రుని రమణి నిజజీవితంలోని అనుభవాల రమణీయమైన కథనం ‘జీవన రమణీయం‘ ఈ వారం. [/box]

గోపాల్ గారితో

[dropcap]రా[/dropcap]మానాయుడు గారు సుబ్బిరామిరెడ్డి గారికి ఫోన్ చేసి “మా రైటర్‌కి సెన్సార్‌ బోర్డ్‌లో మెంబర్ అవ్వాలనుంది, కొంచెం చూడండి” అని, నా రెజ్యుమీ కూడా ఆయన పి.ఏ. చేత ఫార్వార్డ్ చేయించారు. దాంతో ఎం.పీ. అయిన సుబ్బిరామిరెడ్డి గారు నా రెజ్యూమీ మీద సంతకం చేసి సెంట్రల్ బోర్డ్ ఆఫ్ సినిమా రిజిస్ట్రేషన్‌కి పంపించారని నాతో చెప్పారు. నేనీ సంగతి మర్చేపోయాను. ఓ రోజున పొద్దుటే గోపాల్ గారు ఫోన్ చేసారు. గోపాల్ గారు అంటే అప్పుడు లక్ష్మీపార్వతి గారి గెస్ట్ హౌస్‌లు మేనేజర్‌గా షూటింగ్‌లకి అద్దెకిస్తున్నారు. ఆయన క్రియేటివ్ కమర్షియల్స్‌లో కె.ఎస్.రామారావు గారి దగ్గర మేనేజర్‌గా చేసినప్పుడే నాకు పరిచయం.

గోపాల్ గారిది తణుకు. ఇప్పుడు తిరుగులేని హాస్యనటుడిగా ప్రఖ్యాతి గాంచిన బ్రహ్మానందం గారిని, లెక్చరర్‌గా పని చేస్తుంటే, తీసుకొచ్చి తనకి తెలిసిన వాళ్ళందరికీ పరిచయం చేసి, హైదరాబాదులో నిలదొక్కుకుని వేషాలు సంపాదించుకునేట్టు చేసిన మొట్టమొదటి వ్యక్తి! ఈ గోపాల్ గారి అబ్బాయి అనిల్ చాలా టీవీ సీరియల్స్‌లో నటించి పేరు తెచ్చుకున్నాడు. ఈయన ప్రత్యేకత ఏమిటంటే, దేవరకొండ బాల గంగాధర్ తిలక్ గారి ‘అమృతం కురిసిన రాత్రి’ మొత్తం శ్రావ్యంగా రాగయుక్తంగా పాడడం. పాత హిందీ పాటలు అయితే అదరగొడ్తారు. అలా నాకూ, మా సుమిత్రకీ అందరికీ గోపాల్ గారు స్నేహితులు. ఆ గోపాల్ గారు ప్రొద్దుటే ఫోన్ చేసి, “రమణి గారూ! మీ పేరూ, నా పేరు సెన్సార్ బోర్డ్ మెంబర్స్‌గా లిస్ట్‌లో వుందిట. మా కజిన్ చెప్పాడు” అని శుభ వర్తమానం అందజేసారు.

నేనెంతో సంతోషపడ్డాను. ఆ తరువాత సెన్సార్ ఆఫీసు నుండి, రీజనల్ ఆఫీసర్ గారు వచ్చి కలవమంటున్నారు అని ఫోన్ వచ్చింది. లకడీ కా పూల్‌లో వున్న ఆ ఫిల్మ్ డెవెలెప్‌మెంట్ కార్పోరేషన్ బిల్డింగ్ నాకేం కొత్త కాదు! మూడు టీ.వీ. నందుల జ్యూరీలు మెంబర్‌గా చేసాను! సెన్సార్ బోర్డ్ ఆఫీస్ కూడా అందులోనే వుంటుంది.

వనజ, ఉదయ్ దంపతులతో

నేను వెళ్ళిన రోజే, రీజినల్ ఆఫీసర్‌తో మాట్లాడ్తున్న వనజా ఉదయ్‌ని చూసాను. ప్రదీప్ గారు ‘ముద్ద మందారం’ హీరోగానూ, వాళ్ళావిడ సరస్వతి గారు ఈటీవీలో నాకు పరిచయమే. ఈ వనజ భర్త, ఉదయ్ ప్రదీప్‌కి స్వంత తమ్ముడు. వనజ మన తెలుగు యూనివర్సిటీలో డాన్స్‌కి డెప్యూటీ డైరక్టర్. మంచి నృత్య కళాకారిణి. ఆరోజు పరిచయం అయిన వనజ, నన్ను అక్కగా, మావారిని ‘బావగారూ’ అని పిలుస్తూ, ఇప్పటికీ ఆత్మీయంగా మెలుగుతుంది. మార్వాడీ అమ్మాయి అయినా తెలుగింటి కోడలుగా, మావగారిని కంటికి రెప్పలా చూసుకుంటూ మంచి పేరు తెచ్చుకుంది. తెలుగు రాయడం, చదవడం కూడా బాగా వచ్చు. వాళ్ళకి ఒకే ఒక్క అబ్బాయి. ప్రస్తుతం లండన్‌లో చదువుతున్నాడు.

మొదటి రోజు రీజనల్ ఆఫీసర్ కూడా బాగానే మాట్లాడింది. కానీ సినిమా పరిశ్రమలో పని చేయడం వలన, నేనంటే ఆవిడకి అంతగా ఇష్టం వుండేది కాదు. సినిమా సెన్సార్‌కి రామానాయుడు గారు లాంటి ప్రముఖ నిర్మాతలు తప్పకుండా వారే స్వయంగా వచ్చేవారు. కొందరు కేవలం డైరక్టర్‌నీ, వారి మేనేజర్స్‌నో, కోప్రొడ్యూసర్స్ వుంటే వారినో పంపేవారు. 20 సంవత్సరాలుగా ఫీల్డ్‌లో పని చేస్తున్న నాకు అందరూ సామాన్యంగా తెలిసినవాళ్ళే వుండడంతో, ఆప్యాయంగా మాట్లాడేవారు. నేనూ లేచి నిలబడి గౌరవించేదాన్ని!

దానికీవిడ అభ్యంతరం చెప్తూ “మీరు సెన్సార్ బోర్డ్ మెంబర్… వాళ్ళతో అలా మాట్లాడకూడదు!” అనేది.

ఒకటి రెండుసార్లు చూసి, నేనూ గట్టిగా సమాధానం చెప్పాను “ఈ పోస్ట్ తాత్కాలికం… ఆ సినిమా రచయిత్రి పోస్ట్ నా వృత్తి… శాశ్వతంగా… వాళ్ళని గౌరవించడం నా ధర్మం” అని. ఎదురు చెప్పినా, కొంచెం పేరూ, గుర్తింపూ వున్నా ఆవిడకి వాళ్ళమీద కంటగింపుగానే వుండేది.

సెన్సార్ బోర్డ్‌లో చాలామంది మెంబర్స్ వుంటారు. బయట వూళ్ళలో వుండేవారు, ముందుగా ఫోన్ చేసి, సెన్సార్ డ్యూటీ వేయమంటే, వరుసగా, ఒకటో రెండో సినిమాలు వేస్తారు. మామూలుగా స్త్రీలకి త్వరగా కాల్స్ వస్తాయి. ఎందుకంటే ఏ సినిమా అయినా నలుగురు సభ్యులు చూడాలి. అందులో ఇద్దరు జెంట్స్, ఇద్దరు లేడీస్ వుంటారు. జెంట్స్ ఇద్దరు లేకపోయినా ఫర్వాలేదు, కానీ లేడీస్ ఇద్దరూ ఖచ్చితంగా వుండాలి. అంతే కాదు, కట్స్ పెట్టకా, అవి అమలు జరిపారా, లేదా అన్నది, ఈ లేడీస్ ఇద్దరిలో ఒకరు వెళ్ళి చూడాలి. కొన్నిసార్లు థియేటర్స్‌కి వెళ్ళి ఆ సినిమా సర్టిఫికెట్ బయట డిస్‌ప్లే చేసారా లేదా, ఇక్కడ పెట్టిన కట్స్ అక్కడా అమలు చేస్తున్నారా లేదా థియేటర్ ప్రింట్స్ ఒరిజినల్‌వే పంపించారా అని చెక్ చేయాలి. సెన్సార్ బోర్డ్ మెంబర్‌గా మేం సినిమా థియేటర్‌కి వెళ్తే, సీటు లేకపోతే, ప్రత్యేకమైన సీటు ఏర్పాటు చేసైనా చూపించాలి. సీట్లు అయిపోయినా కూడా, ఎంత కొత్త సినిమా అయినా కూడా! అంతే కాదు, మనతో బాటు ఎవరొచ్చినా టికెట్ ఇవ్వాలి. సభ్యులకి ఫ్రీ! నేను ఎన్నో సినిమాలు నా సిట్టింగ్‌ల మధ్యలో సగం చూసొచ్చినవి కూడా వున్నాయి! మాకు సిట్టింగ్ ఫీజు రోజుకి ఎనిమిది వందలుండేది, తర్వాత సంవత్సరం వెయ్యి రూపాయలు చేసారు. మా ఆఫీసర్ ఒక్కోసారి రోజుకి రెండు సినిమాలు కూడా చూడమనేది! సిటింగ్ ఫీజు పెరగదు, అదే ఇస్తారు. ఈ సెన్సార్ నిబంధనలూ, కట్స్ పెట్టడానికి రూల్స్, రెగ్యులేషన్స్, బైలాస్ ఆనీ అన్నీ చదవాలి. తెలుగులోంచి ఏ ఇతర భాషలోకి సినిమా అనువదించబడినా, మేమే సెన్సార్ చేయాల్సొచ్చేది. రాను రాను ఆ రీజినల్ ఆఫీసర్‌కీ నాకూ గొడవలయి, నాకు కొత్త తెలుగు సినిమాలు వెయ్యడం మానేసి, భోజ్‌పురి, లంబాడా, ఇలాంటివి కూడా ఎక్కువగా వేసేది! కొన్ని సార్లు ఏ బాలకృష్ణో, నాగార్జునో “తూ ఆవత్ హై, జావత్ హై చోక్రీ” అనో, “తుమీ బిషూన్ మీఠా షోర్ హై” అనో మాట్లాడ్తుంటే, వెనుక నుండి పీలగా ఉన్న డబ్బింగ్ వాయిస్‌లతో చాలా నవ్వొచ్చేది. సహజంగా అన్ని వేళలా, అన్ని పరిస్థితుల్లో నవ్వుతూ వుండడం అలవాటు కాబట్టి, లంబాడా సినిమా అయినా ఆనందించిన సందర్భాలు ఎక్కువ. నేషనల్ అవార్డు జ్యూరీ మెంబర్‌గా వెళ్ళీనప్పుడూ మైథిలీ, కాస్యా, లవిఠీ, పాలికా… ఇంకా ఏదేదో పేర్లతో బోర్డ్ మీద 180 భాషల పేర్లూ, వాటిల్లో సినిమాలూ కూడా వుంటాయని తెలిసింది. ఒక్కొక్క ప్రాంతానికీ, ఒక్కో భాష కద మన ఇండియాలో… కన్నడంలోనే బైరీ, తుళూ సినిమాలు కూడా చూసాం… అలాగే అస్సామీ వుందంటే, దాని పక్క ప్రాంతంలో వేరే భాష వుంటుంది, అస్సామీస్ కాకుండా, అన్ని భాషాలలోను మన తెలుగు సినిమాలు అనువదించబడకపోయినా, కొన్నింటిలో డబ్ అవుతాయి.

రక్తం చూపించరాదు, ఆడువారిని కించపరిచే మాటలు మాట్లాడ్డం, కొట్టడం చూపరాదు, చిన్నపిల్లలని బాధించరాదు. జంతువులని మన వినోదం కోసం వాడరాదు. ఒక వేళ అవి కనిపించినా, ఏనిమల్ ప్రొటెక్షన్ డిపార్ట్‌మెంట్ నుంచి సర్టిఫికెట్ తెచ్చారా లేదా, అశ్లీల దృశ్యాలు, న్యూడ్‌నెస్, బూతులు వుండరాదు. ఏ మతం, కులం, జాతి వారినీ అవహేళన చెయ్యడం, మనోభావాలు కించపరచడం చేయరాదు… లాంటి చాలా రూల్స్ వుంటాయి. అవన్నీ మేం సీన్ నెంబర్స్, ఆ డైలాగ్, లేదా దృశ్యం రాసి పెట్టి, సినిమా అయిపోయాకా వచ్చిన నిర్మాతా దర్శకులతో కట్స్‌ని చెప్పి, ఆ కట్స్ ఒకటో రెండో అయితే ‘U’ సర్టిఫికెట్, ఫరవాలేదు కానీ పిల్లలతో చూడరాదు అనిపిస్తే ‘U/A’, అస్సలు పిల్లలు చూడరాదు అంటే ‘A’; ప్రదర్శనకే యోగ్యం కాదు అంటే అసలు సర్టిఫికెట్ ఇవ్వకపోవడం జరుగుతాయి.

నన్ను చాలామంది మిత్రులు “సెన్సార్ బోర్డ్ మెంబర్‌వి అంటే బాగా సంపాదన… కవర్స్‌లో డబ్బులు పెట్టి నిర్మాతలు కట్స్ పెట్టద్దు అని ఇస్తారటగా” అని అడిగారు!

(సశేషం)

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here