జీవన రమణీయం-124

0
7

[box type=’note’ fontsize=’16’] టీవీ, సినీరంగాలలో తనదైన ప్రత్యేక స్థానాన్ని ఏర్పర్చుకున్న సుప్రసిద్ధ రచయిత్రి బలభద్రపాత్రుని రమణి నిజజీవితంలోని అనుభవాల రమణీయమైన కథనం ‘జీవన రమణీయం‘ ఈ వారం. [/box]

[dropcap]నా[/dropcap] కో సెన్సార్ మెంబర్స్‌గా వున్న వాళ్ళల్లో నాకు బాగా తెలిసినవాళ్ళు వనజా ఉదయ్, శైలేంద్ర, ఈవిడ దువ్వూరి నరసరాజు గారి అమ్మాయి… అంటే ఫస్ట్ అడ్వొకేట్ జనరల్ ఆయన. ఈవిడ కూడా ఎడ్వకేట్. హైకోర్టులో లాయర్. నాతో నంది అవార్డ్స్ జ్యూరీలో కూడా సినిమాలకి పనిచేసింది. ఎస్. గోపాలరెడ్డి గారు ఛైర్మన్‌గా వున్నప్పుడు నాతో బాటు, శైలేంద్ర కుమారీ, బసిరెడ్డి గారూ.. ఈయన డిజిటల్ సినిమా అనే దాన్ని మన ఇండియాలో పరిచయం చేసినవారు! భార్యాపిల్లలూ ఉన్నతమైన పదవుల్లో యూ.ఎస్.లోని కాలిఫోర్నియాలో వుంటే, ఈయన సినిమా మీద పేషన్‌తో ఇక్కడ నానా తిప్పలు పడ్తూ ‘డిజిక్వెస్ట్’ స్థాపించారు!

‘అందరి బంధువయా’ సినిమా అంతా ఈయన ‘డిజిక్వెస్ట్’ లోనే డబ్బింగ్, ఎడిటింగ్ పూర్తి చేసుకోవడంతో ఈయనకి ఆ సినిమా విపరీతంగా నచ్చి, దానికి కథ, మాటలూ రాసిన నా మీద ప్రత్యేకమైన అభిమానం. ఆ అభిమానంతోనే ‘7 Days to Go’ అనే బాలల ఆంగ్ల చిత్రం నిర్మించినప్పుడు, ఆ చిత్రం తెలుగులోకి అనువదించే పని నాకు అప్పగించారు. మాటలు రాయడమే కాకుండా, డబ్బింగ్ కూడా పిల్లలతో నేను దగ్గరుండి చేయించాను. పిల్లలతో పని చెయ్యడం ఓ స్వీట్ ఎక్స్‌పీరియన్స్. ‘ఇంద్ర’ సినిమాలో చిన్న చిరంజీవిగా వేసిన ‘తేజ’ అందులో బాల నటుడు. ఈ చిత్రానికి ఉమాకాంత్ గారు దర్శకులు. ఇంకో తియ్యని అవకాశం ఈ చిత్రం ద్వారా నాకు లభించినది ఏమిటంటే పాటలు రాయడం. చాలా మంది రచయితలని పిలిపించి, ఆ పాటలు అన్నీ హిందీలో వున్నవి, అనూమాలిక్ సంగీత దర్శకత్వం లోవి, తెలుగులో అదే భావం చెడకుండా చెయ్యమంటే, ఎవరూ దగ్గరగా కూడా రాలేకపోయారు. అప్పుడు నేను చెయ్యి చేసుకోక తప్పలేదు… 6 పాటలూ, ఒక ఐటమ్ డాన్స్ సాంగ్‌తో సహా రాసాను. రాజేశ్వరీ సచ్‌దేవ్, పారూ గంభీర్ నటించారు.

హేమచంద్ర, బసిరెడ్డి గారితో నేను… ‘7 రోజుల్లో’ కోసం ‘కళ్ళు తెరిచిన మొదలు’ పాట రికార్డింగ్ సందర్భంగా

ఒరిజినల్ హిందీ సాంగ్ కైలాష్ ఖేర్ పాడినది తెలుగులో హేమచంద్ర పాడాడు. “కళ్ళు తెరిచిన క్షణమే” అన్న పాట. అలాగే దీప్తీచారీ రెండు పాటలు పాడింది. “Got the report card” అనే ఇంఘ్లీషు పాటా, “ఆట ఆడవే…” అనే ఐటమ్ సాంగ్. “తొలకరీ జల్లుల్లో” అనే పాట రెండు వెర్షన్స్… ఒకటి సాహితీ, రెండో మేల్ వెర్షన్ నరేంద్ర పాడారు. నాకు చాలా చాలా ఇష్టమైన పాట నేను రాసిన ‘నాలోని… ఈ చిన్న ఆశలకే.. కాటుక దిద్దానూ… కన్నీటి చివరలకూ… రంగులు పులిమానూ చిరునవ్వు అంచులకూ…’ అనే పాట! ఇలా అన్ని పాటలూ రాసి సింగిల్ కార్డ్ వేయించుకున్న మొదటి లేడీ లిరిసిస్ట్ ఖ్యాతి కూడా తెలుగులో మొట్టమొదటగా నాకే దక్కింది. ‘శ్రేష్ట’కి కూడా రొమేంటిక్ క్రైమ్ స్టోరీలో సింగిల్ కార్డ్ పడినా, అందులో ఒకే పాట వుంది!

ప్రీ-రిలీజ్ ఫంక్షన్‌లో రాజేశ్వరీ సచ్‌దేవ్‌తో
గాయనీగాయకులు సాహితీ, దీప్తిచారీ, నరేంద్రలతో
‘7 రోజుల్లో’ ఆడియో ఫంక్షన్
‘7 రోజుల్లో’ ఆడియో ఫంక్షన్‌లో

ఆ పాటల లింక్ నేను కింద ఇస్తాను మీకు. వినండి.

https://naasongs.com/7-rojullo.html

ఆ రికార్డింగ్ అప్పుడూ హేమచంద్రా, సాహితీ, దీప్తీ, నరేంద్రలతో దగ్గరుండి పాడించడం పాటలో చిన్న చిన్న మార్పులు చెయ్యడం… అదొక మధురానుభూతి. ఆ ‘7 Days to Go’ అనే ఆంగ్ల చిత్రం అన్ని ఫెస్టివల్స్‌లో ప్రదర్శింపబడి నాలుగు అంతర్జాతీయ అవార్డులు గెలుచుకుంది. ఆ విధంగా నేను అనూమాలిక్ సంగీత బద్ధం చేసిన సినిమాలో పాటలు రాసాను. డబ్బుల కన్నా అరుదైన అవకాశాలు ఎప్పుడూ నన్ను వెదుక్కుంటూ రావడం నా అదృష్టం!

***

రాసాని గారూ, గోపిని కరుణాకర్ అనే రచయితలూ, గోటేటి మోహన్ అనే జర్నలిస్టు ఆ నంది కమిటీలో నాతో బాటు వున్నారు. గోపాలరెడ్డి గారు అప్పుడు ‘రామదాసు’ చిత్రానికి కెమెరామెన్‌‌గా పని చేసున్నారు. నేను రామానాయుడు గారు నిర్మిస్తున్న ‘నేనేం చిన్నపిల్లనా?’కి కథ సమకూరుస్తున్నా. గోపాలరెడ్డి గారికి ఫోన్ చేసి మెడికల్ పరంగా కానీ, మరో విధంగా కానీ నేనే సాయం అడిగినా చేసారు. మనిషి చాలా సాత్వికులు. సహృదయులు. మా అబ్బాయి పెళ్ళికి దసపల్ల హోటల్ కన్సెషన్‌లో ఇప్పించారు అడగ్గానే. వారి శ్రీమతి మిఖేల కూడా చాలా మంచావిడ.

అమితాబ్ బచ్చన్‌తో మా జ్యూరీ సభ్యులు – ఎస్. గోపాలరెడ్డి గారు, శైలేంద్ర, వనజ, వెనుకగా నేను

ఈ బసిరెడ్డి గారు, ఇందిరా గాంధీ హెయిర్ స్టైల్‌లో వుందని శైలేంద్రని ‘మిసెస్ గాంధీ’ అనీ, నాకు ఉస్మానియా బిస్కెట్స్ ఇష్టం అని, నన్ను ‘మేడం ఉస్మానియా’ అనీ పిలిచేవారు. చాలా సరదాగా మేమిద్దరం జోక్స్ వేస్తూ కొన్ని బోర్ సినిమాలను కూడా ఎంజాయ్ చేసాం! నేను లేట్‌గా వెళ్తే గోపాలరెడ్డి గారు “సందడే లేదు… మీరు త్వరగా రావాలమ్మా” అనేవారు. చెప్పాగా… డబ్బులు తప్ప మిగతా అన్నింటిలో నేను గొప్ప జాతకురాలిని. అందరూ మంచివాళ్ళూ, స్నేహశీలురూనే నా చుట్టూ వుంటారు. ఆ ఏడు ‘శ్రీరామరాజ్యం’కి ఉత్తమ చిత్రం, ఉత్తమ నటి నయనతారా, ఉత్తమ నటుడు ‘దూకుడు’ మహేష్ బాబూ ఇచ్చాం. అల్లాణి శ్రీధర్ కూడా మా జ్యూరీలో వున్నారు. నయనతారకే ఎందుకు ఇవ్వాలి? ఉత్తమ నటి అని కొంత చర్చ జరిగింది… ఫలితాల రోజున. మొత్తం నెల రోజులు చూసాం అన్ని చిత్రాలూనూ. చంద్రవదన్, ఐ.ఎ.ఎస్. గారు మాకు మేనేజింగ్ డైరక్టర్, ఎఫ్.డి.సీ. అప్పుడు. నా వైపు చూసారు, ఎక్స్‌ప్లైన్ చెయ్యమన్నట్టు గోపాలరెడ్డి గారు. నేను చెప్పాను… “మిగతా సినిమాల్లో నాయికల్లా, బోలెడు కాస్ట్యూమ్స్‌తో, బోలెడు లొకేషన్స్‌లో, ఎగిరెగిరి గెంతులెయ్యకుండా, చెట్టు కింద కన్నీరు పెడ్తూ, అప్పడప్పుడు కళ్ళెత్తి, వాల్మీకి వేషం వేసిన అక్కినేని నాగేశ్వరరావుగారితో ఆయన డైలాగ్స్‌కి ప్రత్యుత్తరం కళ్ళతోనే ఇస్తూ, బాపూ గారి కుంచె వేసిన వర్ణచిత్రంలా సహజంగా నటించింది నయనతార. కేవలం కళ్ళతో నటించటం అంత ఈజీ కాదు!” అని. అందుకు అందరూ కన్విన్స్ అయ్యారు, ఛార్మీకే ఇవ్వాలి అని ఏదో దెయ్యం సినిమాలో నటనకి అని పట్టునట్టిన ఒక వ్యక్తి తప్ప! ఆయన మా ఇండస్ట్రీకి చెందిన వ్యక్తి కాదు, పైగా నాకు ఎంత పడకపోయినా, మా సెన్సార్ బోర్డ్ అధికారిణిని అనకూడని మాటలన్నాడు అతన్ని తీసేసిందని. సాటి స్త్రీని తిట్టేవాడిని నేను గౌరవించలేను… అందుకేనేమో అతని పేరు ఎంత ప్రయత్నించినా నాకు గుర్తు కూడా రావడం లేదు! ఆ ఏడు నాగేశ్వరరావు గారంతటి మహానటుడికి ‘ప్రత్యేక జ్యూరీ అవార్డు’ ఇచ్చాం శ్రీరామరాజ్యంలో వాల్మీకి పాత్రకి! నిజానికి జొన్నవిత్తుల గారికే అవార్డు రావలసింది ఆ పాటలకి గాను అని అందరం అనుకున్నాం. ‘పొడుస్తున్న పొద్దు మీద నడుస్తున్న కాలమా పోరు తెలంగాణమా’ అనే గద్దర్ పాటకీ, ఉత్తమ దర్శకుడిగా ‘జై బోలో తెలంగాణా’కీ ఎన్. శంకర్‌కూ అవార్డ్స్ వచ్చాయి. స్మృతి ఇరానీ ఆ సినిమా ప్రధాన భూమిక పోషించారు. చిత్రంగా నేను జాతీయ అవార్డ్స్ జ్యూరీలో వున్నప్పుడు ఆవిడ సెంట్రల్‌లో సినిమాటోగ్రఫీ మినిస్టర్. స్థూలంగా 2011 నంది అవార్డుల విషయాలివి.

(సశేషం)

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here