జీవన రమణీయం-126

0
7

[box type=’note’ fontsize=’16’] టీవీ, సినీరంగాలలో తనదైన ప్రత్యేక స్థానాన్ని ఏర్పర్చుకున్న సుప్రసిద్ధ రచయిత్రి బలభద్రపాత్రుని రమణి నిజజీవితంలోని అనుభవాల రమణీయమైన కథనం ‘జీవన రమణీయం‘ ఈ వారం. [/box]

[dropcap]శ్రీ[/dropcap]నగర్ కాలనీలోని కెన్స్ హోటల్‌లో నేను మొదటిసారి సింగీతం శ్రీనివాసరావు గారిని కలిసాను… కానీ ఎన్నేళ్ళ నుండో మనకి చాలా పరిచయం వున్న మన ఇంట్లో మావయ్య లాగో, పెదనాన్న లాగో అనిపించారు. ఎంతో మృదు భాషణం, హాస్య చతురతా, చిన్న పిల్లల్లో చిన్న పిల్లాడిలా కలిసిపోయే ఆయన వృద్ధుల కంపెనీ పెద్దగా ఇష్టపడనని చెప్పారు. ఆయనని కలిసాకా నాకు ధైర్యం వచ్చింది.

అనంత శ్రీరాం చాలా జోవియల్. అప్పటికింకా భువనచంద్ర గారిని కలవలేదు. శేఖర్ బాషా అంటారు, రేడియో జాకీగా అతనికి 48 గంటల రికార్డు వుంది. అతనూ, ఈటీవీ సీరియల్స్‌లో కనిపించే ఓ అమ్మాయీ, నాకూ భువనచంద్ర గారికీ అమ్మాయీ అల్లుడూ అని చెప్పారు. నాకు – జరిగినదంతా మరిచిపోయి, నేను పాస్ట్ లోనే బ్రతుకుతుంటాననీ, కూతురు లవ్ మ్యారేజీ చేసుకుని, హాయిగా కాపురం చేసుకుంటున్నా, ఇంకా ఆ అమ్మాయికి మేనల్లుడితో ప్రదానం చెయ్యాలని పోరి భర్తని, ప్రతీ రోజూ ఎంగేజ్‍మెంట్ చేయిస్తుంటాననీ, పోలీస్ ఆఫీసర్ అయిన భర్త (భువనచంద్ర గారు) ఆ ఉత్తుత్తి ఎంగేజ్‌మెంట్‍కి జైల్లో వున్న ఖైదీలందరినీ పెరోల్ మీద తీసుకొస్తుంటారనీ – చెప్పారు. స్పెషల్‍గా మెన్షన్ చెయ్యాల్సింది ఏమిటంటే, రోహిణి గారు ఈ సినిమాకి స్క్రీన్ ప్లే, డైలాగ్స్‌లో సింగీతం గారికి సహకారం అందించి అసిస్టెంట్ డైరక్టర్‌గా పని చేయడం!

రోహిణి ఎంత మంచి నటో, ఆమె బాల తారగా వేసినప్పటి నుండీ మనందరికీ తెలుసు. ముఖ్యంగా ఆమె డబ్బింగ్ ఆర్టిస్ట్‌గా మారాకా ‘శివ’ సినిమాలో అమలకి చెప్పిన డబ్బింగ్ ఆ సినిమాకి ప్రాణం పోసింది. అమల అంటే క్రేజ్ పెంచింది. నేను డబ్బింగ్ ఆర్టిస్ట్‌ల పేర్లు చూస్తాను. ‘ఏ మాయ చేసావె’కి చిన్మయి డబ్బింగ్ సమంతాకి క్రేజ్ తెచ్చింది. సాయికుమార్ డబ్బింగ్ హీరో రాజశేఖర్‌కి లైఫ్ ఇచ్చింది అంటే అతిశయోక్తి కాదు! అలాగే సాయికుమార్ తమ్ముడు రవి ‘నిను వదల బొమ్మాళీ… నిను వదల’ అన్న డబ్బింగ్ సోనూ సూద్‍కి గొప్ప ఇమేజ్ తెచ్చింది. రోజా రమణి, సరితల డబ్బింగ్ కూడా ఎందరో హీరోయిన్స్‌కి పేరు తెచ్చిపెట్టింది! నా గొంతు చాలా బావుంటుందని అంతా అంటారు. మా గురువుగారు తీసిన ‘వెన్నెల్లో ఆడపిల్ల’కి కొన్ని సీన్స్ డబ్బింగ్ చెప్పాను. ‘వెల్‍కమ్ ఒబామా’కి నా స్వంత గొంతే. నేను ఆడియో నావెల్స్ చదివినప్పుడు కూడా యూట్యూబ్‌లో మంచి అప్లాజ్ వచ్చింది.

నాకు ఆ మీటింగ్‌లో తెలిసిన విషయం ఏమిటంటే – ఆల్‌రెడీ కోరుమామిడి అనే వూరులో రాజమండ్రి దగ్గర మెయిన్ షెడ్యూల్ అయిపోయింది. హీరో సంజీవ్, హీరోయిన్ ఊర్మిళా, ఈస్తబెన్ అనే ఫ్రెంచ్ బాబూ, రేచల్ అనే అమెరికన్ మహిళలతో సీన్స్ చాలా వరకు అయ్యాయి. ఇంక మా కామెడీ ట్రాక్, క్లైమాక్స్ మిగిలి వుందని.

రేచల్ అనే ఈ అమెరికన్ అమ్మాయి చాలా బాగా గ్రాస్ప్ చేసి, సింగీతం గారు చెప్పినట్లే నటించేది. తెలుగు కూడా తనే స్వంతంగా డబ్బింగ్ చెప్పుకోవటం, మన భారతీయ హీరోయిన్స్ గమనించాల్సిన విషయం. ఆమె ముంబైలో ఒంటరిగా నివసిస్తూ, మోడలింగ్ చేస్తూ, అక్కడ ఇళ్ళు లేక, రాత్రి పూట ఫుట్‌పాత్‍ల మీద నివసించే చిన్న పిల్లలకి బ్లాంకెట్స్ అవీ కొని పెట్టడం, వారిని బోర్డింగ్ హోమ్స్‌లో పెట్టడం చేస్తాననీ, మదర్ థెరీసా తనకి ఆదర్శం అనీ చెప్పినప్పుడు నాకు చాలా గౌరవం కలిగింది. మంచి పొడవుతో చాలా స్నేహశీలి ఆ అమ్మాయి రేచల్.

హీరోగా వేసిన సంజీవ్, కన్నడ అబ్బాయి. థియేటర్ నుంచి వచ్చాడు. చాలా బాగా నటించేవాడు. ఓ రెండు గుప్పెళ్ళు హైట్ వుంటేనా… అనిపించేది. ఇంక హీరోయిన్ అంటే కథ ప్రకారం ‘సరోగసీ’కి ఒప్పుకుని అమెరికన్ మహిళకి బిడ్డ కనిచ్చే తల్లి యశోద వేషం! సంజీవ్‌కి అక్క సినిమాలో. ఆమె మరాఠీ అమ్మాయి. ఊర్మిళ చాలా గొప్పనటి. కానీ ఆర్ట్ ఫిల్మ్స్‌లో మాత్రమే చేసేది. ఆమె భర్త మంచి డైరక్టర్, ప్రొడ్యూసర్‌ట మరాఠీలో. పూనేలో వుంటారు. ఆ సినిమా తర్వాత ఊర్మిళ నాకు మళ్ళీ ఢిల్లీలో నేషనల్ ఫిల్మ్ అవార్డ్స్ జ్యూరీలో నేనున్నప్పుడు, అక్కడ జరిగిన ఓ పెర్‌ఫార్మెన్స్‌లో కనిపించింది.

ఈ సినిమా గొప్ప ఇతివృత్తంతో కూడినదైనా, ఆల్‌రెడీ మరాఠీలో రావడం వలన, అనువాద చిత్రంగా మిగిలిపోయి, ఏ అవార్డ్‌కీ పంపడానికి లేకపోయింది.

ఇంక సినిమాకి మూలాధారమైన చిన్న పిల్లాడి పాత్ర పేరు కృష్ణ. ఇది ‘ఈస్తబెన్’ అనే నాలుగేళ్ళ పిల్లవాడు చేసాడు. వాడికో చిన్న తమ్ముడు కూడా వున్నాడు. షూటింగ్‌ కొచ్చేవాడు. ఒక పాటలో చిన్నప్పటి ఈస్తబెన్‍లా కనిపించాడు కూడా! ఈ పిల్లాడికి ఫ్రెంచ్‌లో అన్నీ వాళ్ళ అర్థమయ్యేలా చెప్తే చేసేవాడు, మాటలు కూడా విని చెప్పేసేవాడు! ఒక్కోసారి తిక్క పుట్టి ‘చెయ్యను’ అనేవాడు. వాళ్ళ నాన్న గొప్ప సహనంతో వాడిని ఆడించి, లాలించి, నిద్రపుచ్చీ ఒప్పించేవాడు! నైట్ సీన్స్ వుండేవి ఎక్కువగా. చిన్న పిల్లాడు నిద్ర ఆపుకోలేక పోయేవాడు. వాడు లేచేదాకా ఆగేవారు సింగీతం సార్. వాడు కొన్నే తినేవాడు. రోహిణి బాగా మేనేజ్ చేసేది. సీన్స్ చెప్పడం వాళ్ళ నాన్నకి, వాడిని నవ్వించడం… అదీ. చైల్డ్ ఆర్టిస్ట్‌గా చేసినప్పటి తన ఎక్స్‌పీరియన్స్ పనికొచ్చింది అనుకుంట. చాలా ముద్దుగా వుండేవాడు తను.

ప్రస్తుతం సినిమా ప్రత్యేకతలు చెప్పుకుంటున్నాం కాబట్టి, సింగీతం గారు సంగీతం చేసి, రాసిన పాటల గురించి చెప్పుకోవాలి. చాలా అందమైన బాణీల్లో సుమధుర గీతాలు రాసారు సింగీతం గారు. నెలకోసారి అయినా ‘స్టార్ మా’లో వచ్చే ఈ సినిమా మీరంతా చూసేవుంటారు… “ఆకాశం అంటేటి మేడుండే వూరు… భలేగా వుంటాది నాన్నా..” అనే పాట నాకు చాలా ఇష్టం! ఇంకో పాట ‘రేచల్’ కూడా ఇంగ్లీషులో పాడింది. మరో పాట నిజంగా చిన్న పాపతో పాడించారు. ఆ పాప జీ ‘సరిగమ’కి కూడా వెళ్ళింది. అలా ఎవరు చేయాల్సిన పని వాళ్ళు చెయ్యకుండా, భువనచంద్ర గారూ, అనంత శ్రీరాం, నేనూ ఏదీ రాయకుండా కేవలం నటులం కాగా, రోహిణి నటించడకుండా, డైరక్షన్ డిపార్ట్‌మెంట్‍లో పని చేస్తూ, సింగీతం గారు సంగీతం చేస్తూ, పాటలూ, మాటలూ రాస్తూ – సరదాగా సాగింది ఆ సినిమా.

షూటింగ్‌కి ఎక్కువ సంబరపడింది అప్పడు నా దగ్గర డ్రైవర్‌గా చేస్తున్న నరసింగ్ (అన్ని ఆస్పత్రులకీ నా పేరే పెడ్తారు అని సంబర పడిన పిచ్చి సన్నాసి పాపం! ‘నర్సింగ్ హోమ్’లని రాసుండడం చూసి). “అసలు మీ దగ్గర పనికి చేరిందే షూటింగ్‌ దగ్గర నుండి చూడ్డానికమ్మా” అని ఆనందపడ్డాడు. పాత డ్రైవర్ (మళ్ళీ ఇప్పుడు అతనే లెండి) కుమార్‌కి షూటింగ్స్ బాగా అలవాటు.

ఇంకా సంబరపడ్డ వాళ్ళు ఎవరంటే మా అమ్మ. అమ్మ నేను నవలలు రాయడం మొదలుపెట్టిన కొత్తలో “నీ నవల సినిమాగా వస్తే బాగుండునే” అంది. నేను వెంటనే “పిచ్చి కలలు కనకు… నాలాంటి రచయిత్రులు తెలుగులో కోకొల్లలుగా వున్నారు” అన్నాను. అమ్మ కోరికో, ఆశీర్వాదమో కానీ, నా మొదటి నవలే, కె.ఎస్. రామారావు గారు కొన్నారు. రెండవది ‘రేపల్లెలో రాధ’ సినిమాగా వచ్చింది. నేను టీ.వీ., సినిమా ఇండస్ట్రీకి సునాయాసంగా వచ్చేసాను. అమ్మ ఇంకో కోరిక నేను కెమెరా ముందు కనబడాలని. నేనే అందుకు డెడ్ ఎగైనెస్ట్ కాబట్టి, నెరవేరదు అనుకుంది! కానీ సింగీతం గారి రూపంలో ఆ కోరికా నెరవేరింది. ఆ సినిమా తర్వాత అవసరాల శ్రీనివాస్ ‘జ్యో అచ్యుతానంద’లో వేషం ఇచ్చాడు. అప్పుడు నేను అమెరికా, మా చిన్నబ్బాయి కాన్వకేషన్‌కి వెళ్తుండడం వల్ల ఒప్పుకునీ, డేట్స్ ప్రాబ్లమ్ వల్ల ‘సీత’ చేసిన అమ్మ వేషం వెయ్యలేకపోయాను. ఇంకా కొందరు కమర్షియల్ సినిమాల్లో అడిగినా, గ్రూప్‌లో నిలబడే వేషాలు, ఏ ప్రత్యేకతా లేకుండా… అందుకే వద్దన్నాను. పైగా మా పెద్దబ్బాయికి ఇష్టం లేదు!

(సశేషం)

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here