జీవన రమణీయం-128

0
10

[box type=’note’ fontsize=’16’] టీవీ, సినీరంగాలలో తనదైన ప్రత్యేక స్థానాన్ని ఏర్పర్చుకున్న సుప్రసిద్ధ రచయిత్రి బలభద్రపాత్రుని రమణి నిజజీవితంలోని అనుభవాల రమణీయమైన కథనం ‘జీవన రమణీయం‘ ఈ వారం. [/box]

[dropcap]ఈ[/dropcap] సంచిక నేను చాలా ఆలోచించి బాధతో రాస్తున్నాను. ఎందుకంటే సెప్టెంబరు 25, 2020 మన తెలుగువాళ్ళకి చాలా చెడ్డ రోజు! మన శ్రీపతి పండితారాధ్యుల బాలసుబ్రహ్మణ్యం గారు, మనం ‘బాలూ’ అని పిలుచుకునే గాన గంధర్వుడు మనలని వదిలిపెట్టి అందరాని అమరలోకాలకి, తన గానామృతంతో ఓలలాడించడానికి వెళ్ళిపోయారు!

మా మిత్రుడు డైరక్టర్ శివనాగేశ్వరరావు అనేవాడు, ఆయన జన్మదినం రోజున విష్ చేసేటప్పుడు “మీ పాట వినే ప్రతీ వాళ్ళూ, ఆ పాట అంతకాలం మీకు ఆయుష్షు ఇచ్చినా, వేల సంవత్సరాలు బ్రతుకుతారు” అని. అలాంటిది… అందరం ఏదో మన కుటుంబంలోని వ్యక్తి ప్రమాదకర పరిస్థితులలో ఆస్పత్రిలో వున్నాడు అన్నట్లే ప్రార్థనలు చేసినా, ఆ దేవుడికి కనికరం కలగక, తాను ఎంచుకున్న వజ్రాన్ని తన దగ్గరకి తీసేసుకున్నాడు!

నేను గతంలో నా కెరీర్ మొదలెట్టిన రోజుల్లోనే పరిచయం అయిన శ్రీ శివలెంక కృష్ణప్రసాద్ గారని చెప్పానుగా! ఆయన బాలూ గారికి కాస్త దూరంగా మేనల్లూడూ, చంద్రమోహన్ గారికి స్వంత అక్క కొడుకునూ. విశ్వనాథ్ గారు కూడా బాలూ గారికి వేలు విడిచిన కజిన్! వీళ్ళంతా ఆరాధ్యలు. లింగధారులని కూడా అంటారు. వీరు ప్రతి నిత్యం మెడలో లింగం ధరించి, పరమశివుడికి అన్నీ నివేదన చేస్తారు.

ఒక రోజు కృష్ణప్రసాద్ గారు చైన్నె నుండి ఫోన్ చేసి, “మీరు అంకుల్‌కి కథ చెప్పాలి. ఆయన గ్రీన్ పార్క్‌లో దిగారు” అని చెప్పినప్పుడు, నేను, “ఏ అంకుల్?” అని అడిగాను. “బాలూగారమ్మా” అనగానే నేను కెవ్వున అరిచి మేఘాలలో తేలిపోయాను. ఆ విషయం ఇంట్లో అమ్మకీ, అన్నయ్యకీ, ఎవరికీ చెప్పలేదు, ఎలాగైనా వస్తాం అంటారని, అంత ప్రేమ వాళ్ళకి! అసలు ఎవరికుండదు బాలూ గారిని కలవాలనీ? పైగా నేను కథ చెప్పడానికి వెళ్తున్నాను, కృష్ణప్రసాద్ గారు “ఓ రెండు గంటలు టైం ఇచ్చారమ్మా” అనగానే, ‘ఇది ఏ జన్మలో చేసుకున్న పుణ్యం?’ అనుకున్నాను.

నేను అప్పటికింకా స్కూల్ టీచర్‌నే, అందుకే వున్న వాటిల్లో, ఆకుపచ్చా, ఎరుపూ కలగలిపిన కలనేత పాటూరి పట్టుచీర కట్టుకుని వెళ్ళాను. ఇది 1998 నాటి సంగతి! చాలా బెరుకు, బెదురూ వుండేవి నా చూపుల్లో. ఇంకా సినిమా ఫీల్డు అంటే పెద్దగా తెలీదు! అసలు హోటల్‌కి వెళ్ళను కథ చెప్పడానికి కానీ, బాలూ గారు అనగానే ‘భగవత్స్వరూపమే’ అనుకుని ఇంక ఆలోచించలేదు.

అది 21 ఫిబ్రవరి 1998. నేరేడ్‌మెట్‌లో 16వ నెంబర్ బస్ ఎక్కి, సికింద్రాబాద్ స్టేషన్‌లో దిగి, అమీర్‌పేట్ గ్రీన్ పార్క్ హోటల్‍కి ఆటోలో వెళ్ళాను! ఇంత విపులంగా ఎందుకు చెప్తున్నానంటే అప్పటి నా ఆర్థిక పరిస్థితి అది! నేరేడ్‌మెట్ నుండీ గ్రీన్ పార్క్‌కి ఆటోలో వెళ్ళేదాన్ని కాదు.

గ్రీన్ పార్క్ హోటల్‌లో రిసెప్షన్‌లో బాలూ గారి పేరు చెప్పగానే, నా పేరు అడిగి రిసెప్షనిస్ట్, ఆయన రూంకి ఇన్‌ఫార్మ్ చేసింది. వెంటనే ‘రమ్మన్నారు’ అని రూమ్ నెంబర్ చెప్పింది. నేను లిఫ్ట్‌లో పైకి వెళ్ళి, ఆ రూమ్ బెల్ నొక్కేడప్పుడు, చేతులని కర్చీఫ్‌తో తుడుచుకుని, భయంగా నొక్కాను. వెంటనే తలుపు తెరుచుకుని ఓ పెద్దాయన, “రండమ్మా” అని ఆప్యాయంగా ఆహ్వానించారు. అది స్వీట్ రూమ్. లోపల నుండి బాలూ గారి స్వరం “రమణీ గారా విఠల్?” అని అంటే… శంకరాభరణంలో చెప్పినట్టు నా వెన్ను నరం వణికి ఎన్నో రాగాలు విన్న ఫీలింగ్. చెప్పులు విప్పే లోగా ఆయన బయటకి వచ్చి, “రండి… రండి… కృష్ణ చెప్పాడు…  You are very punctual… అని” అంటూ లోపల రూమ్ లోకి నడిచారు. నేను నమస్కారం పెట్టడం కూడా చూడలేదు. నేనెంతో ప్రిపేర్ అయి వెళ్ళాను కాళ్ళకి నమస్కారం పెడదామని… అసలు ఆయన గ్యాప్ లేకుండా “భలే తమాషాగా వుంటాయి కొన్ని విషయాలు వింటే. మీ ఇంటి పేరూ, నా లాగే పెద్దది, మా మాస్టర్‍లు పిలవలేక ఇబ్బందిపడ్తారని ఎస్.పీ. చేసేసా… అలా మీరు బి.పీ. చేసేస్తారా?” అని నవ్వారు. నేనూ నవ్వాను. ఆయన నాకు సోఫాలో సింగిల్ చైర్ మంచం దగ్గరగా లాగి “కూర్చోండి…” అని తను మంచం మీద కూర్చున్నారు. నేను గొంతు సవరించుకుని “మిమ్మల్నిలా కలవగలగడం…” అని చెప్పబోతుంటే “మా భాగ్యం కూడా… మీరు రమణీ భరద్వాజ్ ఏనా?” అన్నారు. “కాదు, రమణీ ప్రభాకర్” అన్నాను. అప్పట్లో అక్కినేని గారు మాత్రమే ‘రమణీ ప్రభాకర్’ అని పిలిచేవారు.

“సారీ… ఎందుకో ఆ పేరు గుర్తొచ్చింది” అని, “చెప్పమ్మా, బాలుడు మీ ఆధీనంలో నెక్స్ట్ రెండు గంటలూ… కానీ ముందుగా కాఫీ తాగండి” అని కాఫీ రాగానే ఆయనే అందుకుని స్వహస్తాలతో నాకిచ్చారు. నేను కాఫీ తాగుతుండగా, నా రచనల గురించి అడిగీ, తనకి తెలిసిన నవలల గురించీ, రైటర్స్ గురించి చెప్పీ, ‘ఈజ్’ చేసారు.

అప్పుడింక నేను కొత్తా, భయం, మొహమాటం పోయి ఫ్లో లోకొచ్చి కథ చెప్పాను. ఆయన సమక్షం ఎంతో హాయిగా, చిన్నప్పటి నుండీ మనింట్లో, మనతో బాటే వున్న వ్యక్తితో ఓ మావయ్య తోటే, అన్నయ్య తోటో వున్నట్లు అనిపించింది! నేను ఎంతో ప్రిపేర్ అయి వెళ్ళాను, ఆటోలో వెళ్తున్నప్పుడు, ఆయన పాట అంటే నాకిష్టమో… ఎంత థ్రిల్ అయ్యానో ఇలా వస్తుంటే, ఇంట్లో వాళ్ళకి చెప్తే, మా ఫ్రెండ్స్ ఉమా, లలితా, సుశీలలకి చెప్తే ఎంత థ్రిల్ అవుతారో అన్నీ… కానీ ఒక్క మాట కూడా చెప్పలేకపోయా… ఆయన తన సూట్‌కేస్ లోంచి ‘One Fine Day’ అనే ఇంగ్లీషు సినిమా స్క్రీన్ ప్లే పుస్తకం తీసి నా పేరు రాసి, కింద ‘అభినందనలతో బాలూ’ అని సంతకం పెట్టి ఇస్తూ “ఇది మనం చెయ్యాలమ్మా, మీరు కరెక్ట్ ఈ సబ్జెక్ట్‌కి, చాలా సున్నితమైన కథ” అని అందులో ఒకటి రెండు ఘట్టాలు, అందులో హీరో జార్జ్ క్లూనీలా ఏక్ట్ చేసి చూపిస్తూ, తనకి ఎంత నచ్చిందో చెప్పారు. ఆ సినిమా స్క్రీన్ ప్లే, టెరెల్ సెల్జెర్, ఎలెన్ సైమన్ చేశారు. డైరక్టర్ మైకేల్ హాఫ్‌మెన్. నేను ఆ పుస్తకం తెచ్చుకుని మంచి స్క్రీన్ ప్లే ఎలా చెయ్యాలో, ఎలా రాయాలో నేర్చుకున్నా!

నేను వచ్చేటప్పుడు ఆయన తలుపు దాకా వచ్చి నాకు బై చెప్తుంటే, అప్పుడు గమనించా చాలామంది ముందు గదిలో ఆయన కోసం వెయిట్ చేస్తూ వుండడం! ఆయనతో ఒక్క ఫొటో కూడా లేదు! ఎందుకంటే నా చేతిలో అప్పటికింకా చిన్న డబ్బా సెల్ ఫోన్ కూడా లేదు! తర్వాత కృష్ణ గారికి కాల్ చేసి ఎగ్జైట్ అయిపోతూ చెప్తే, “అంకుల్‌ని ఒక్క ఫొటో కావాలి అని అడగచ్చుగా… విఠల్ గారికి చెప్పేవారు” అన్నారు. అంత బుర్ర లేదు అప్పట్లో. పైగా కృష్ణ గారు నవ్వుతూ… “చాలా సెన్సిబుల్ రైటర్ రా కృష్ణా… ఈ సినిమా ఇండస్ట్రీలో ఇంత సెన్సిటివ్ సబ్జెక్ట్స్ ఎవరికి కావాలి? బట్ నువ్వు మాత్రం కరెక్ట్ జడ్జ్ చెయ్యడంలో” అన్నారట.

అలా బాలూ గారిని కోప్రొడ్యూసర్‌గా మొదటిసారి కలిసి కథ చెప్పిన అదృష్టం నాకు దక్కింది. ఆ తరువాత ‘ఊయల’ షూటింగ్ జరిగేటప్పుడు వెళ్ళి, అది కృష్ణ ప్రసాద్ గారి సినిమానే కాబట్టి, బాలూ గారూ మేకప్ అవుతున్నప్పుడు అక్కడే కూర్చుని మాట్లాడేదాన్ని. “వీడికీ (కృష్ణప్రసాద్‌కి), వీళ్ళ ఆంటీకీ (బాలూగారి శ్రీమతి సావిత్రి గారికీ) మేకప్ అక్కర్లేదమ్మా… ఎర్రగా వుంటారు… మరి నాకు కావాలి కదా!” అన్నారు. ఆయన భార్యని పొగుడుతూ, చాలా గౌరవిస్తూ అనేక సందర్భాలలో మాట్లాడేవారు. తర్వాత అమ్మ అడిగిందని ‘పాడుతా తీయగా’ షూటింగ్‌కి సారథి స్టూడియోలో తీసుకెళ్ళాను. మా పెద్దమ్మ గారు కూడా వచ్చారు. ఆయన ఫస్ట్ విరామంలో నన్ను చూసి గుర్తు పట్టి, స్టేజ్ మీద నుండే “రమణీ గారూ బావున్నారా? ఇలా ముందుకొచ్చి కూర్చోండి” అన్నారు. మా ఇంట్లో వాళ్ళు చాలా ఆనందించారు. అమ్మనీ, పెద్దమ్మనీ పరిచయం చేసాను.

ఓసారి రాగసప్తస్వరం తరఫున అనాథ పిల్లల కోసం షో చేసారు. నేను కంపీర్ చేసానా ప్రోగ్రామ్. “అనాథ పిల్లలు అనద్దు… వాళ్ళు భగవంతుని బిడ్డలు…” అన్నారు. ఆయన పుట్టిన రోజు ఆ రోజు… జూన్ 4.

ఆ తరువాత నేను మా టీ.వీ.లో పని చేసేటప్పుడు ఓ ఫంక్షన్ కొచ్చి, “ఏమ్మా బావున్నావా?” అని దూరం నుండే పలకరిస్తూ వచ్చి దగ్గరకు తీసుకున్నారు.

నేను మా టీవీలో పని చేస్తున్నట్లు తెలిసాకా, ఓ రోజు సడెన్‌గా ఫోన్ చేసారు. “నేనమ్మా, ఎస్.పీ. బాలసుబ్రహ్మణ్యాన్ని… ఎలా వున్నారూ? I need a small favour…” అని ఆయన మొదలుపెట్టగానే, ‘బాలూ’ గారికి నా నుండి ఫేవరా? అని మూర్ఛ వచ్చినంత పనైంది… “నా మిత్రుడు ఒకరున్నారు హ్యూస్టన్‌లో… వంగూరి చిట్టెన్‌రాజు గారని, ఆయనకి మీ వల్ల ఒక సహాయం కావాలి” అని చెప్తే, “ఆయన నాకూ చాలా కావలసినవారేనండీ” అన్నాను.

“అవును మీరంతా రచయితలుగా” అన్నారు.

తర్వాత సుమిత్రా పంపన వాళ్ళ పక్క ప్లాట్ కొనుక్కున్నారు. సుమిత్ర భర్త శివరాంకి చరణ్ మంచి మిత్రుడయ్యాడు. బాలూ గారూ నేను లిఫ్ట్‌లో కలిసినా, కారిడార్‌లో కలిసినా చాలా ఆప్యాయంగా పలకరించేవారు.

ఆయన మిత్రుల కోసం తన చాతనైనంత సహాయం చేసేవారు. ‘నా వల్ల కాదు’ అని సాధారణంగా అనేవారు కాదు. అలా వెళ్తూ వెళ్తూ సుమిత్రా వాళ్ళ ఇంట్లోకొచ్చి, కూర్చుని పక్కింటి వాళ్ళలా మామూలుగా కాఫీ తాగి కబుర్లు చెప్పి వెళ్ళిన రోజులున్నాయి.

నిరాడంబరుడూ, నిగర్వీ అయిన అసాధారణుడు ‘బాలు’ గంధర్వుడు!

(సశేషం)

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here