జీవన రమణీయం-13

2
8

[box type=’note’ fontsize=’16’] టీవీ, సినీరంగాలలో తనదైన ప్రత్యేక స్థానాన్ని ఏర్పర్చుకున్నసుప్రసిద్ధ రచయిత్రి బలభద్రపాత్రుని రమణి నిజజీవితంలోని రమణీయ అనుభవాల రమణీయమైన కథనం ‘జీవన రమణీయం‘ ఈ వారం. [/box]

[dropcap]పి[/dropcap]ల్లవాడు అలా మా ఇంటి నుండి హైవే కొచ్చి మాటలు రాక ఏడుస్తూ, వెనక్కి తిరిగి ఇంటికి రాలేక, నేరేడ్‍మెట్ బస్‌స్టాప్ కొచ్చి ఓ ముసలావిడని చూసి “అమ్మమ్మా… అమ్మమ్మ” అని వెంటబడితే, ఆవిడ “అయ్యో… ఎవరి పిల్లాడో బస్ ఎక్కేస్తున్నాడ”ని అక్కడ కూరలమ్మే షాప్ అతనికి అప్పజెప్పి బస్ ఎక్కేసిందట.

అదే నాకు మేలైంది! ఆవిడ వెనుక బస్ ఎక్కేసుంటే, ఆ సికింద్రాబాద్ అనే మహా సముద్రం లాంటి స్టేషన్‌లో దిగేసుంటే, ఏమై పోయేదో? ఇప్పటికీ రాస్తుంటే నా ఒళ్ళు చెమటలతో చల్లబడ్తోంది.

ఇంట్లో కాసేపటికి అమ్మమ్మ “క్రిష్ణేడే?” అంది. ఇల్లంతా వెతికాం. అందరిళ్ళలో వెతికాం. మూడేళ్ళు నిండిన పసికందు… లేడు… ఈయన ఇంటికొచ్చారు. నేను గొల్లున ఏడుస్తున్నాను! కాలనీ అంతా ఏకం అయింది. పెద్దవాళ్ళూ, చిన్నవాళ్ళూ అందరూ పిల్లాడిని వెతకడానికి అక్కడున్న కొండ మీదకి పరిగెత్తారు.

అంతకు ముందే ఓ ఏడో క్లాసు చదివే ఉమగారనే ఆవిడ కొడుకు, సెప్టిక్ ట్యాంక్ కోసం తవ్విన గుంటలో, నీళ్ళు నిండి వుండడంతో అందులో పడి మరణించిన మూడు రోజులకి తెలిసింది.

నేను ప్రతి సెప్టిక్ ట్యాంక్‌లో కర్ర పెట్టి పొడుస్తూ, “క్రిష్ణా… క్రిష్ణా” అని ఏడుస్తూ వెతికాను.

మా తోడికోడలూ, అన్నయ్య, దగ్గర బంధువులు వచ్చారు. నేరేడ్‌మెట్ పోలీస్ స్టేషన్‌లో కంప్లయింట్ ఇచ్చాం. వాళ్ళేం పట్టించుకోలేదు.

ఈ కూరగాయలమ్మే అతని దగ్గర పిల్లాడు కూర్చుంటే, ఇసక సప్లయి చేసే క్రిష్ణ అనే అతను వచ్చి, “ఎవరా పిల్లాడు?” అని అడిగి, “సరే నేను చూస్తా” అని మోటార్ సైకిల్ మీద ఎక్కించుకుని నాలుగు వీధులు తిప్పి, “ఇది మీ ఇల్లా? మీ ఇల్లా?” అని తిప్పి, తనకి వేరే పని పడడంతో, ఓ చాకలి వాళ్ళ ఇంట్లో దింపి “పెద్దింటి పిల్లాడిలా వున్నాడు… జాగ్రత్త!” అని వెళ్ళిపోయాడట.

ఇక్కడ మా ఆయన పిల్లాడిని సరిగ్గా చూసుకోనందుకు నన్ను బాగా తిట్టారు. నేను కొండ మీద ఒక అమ్మి ఒంటి మీదకి దేవుడొస్తాడనీ, సోది చెప్తుందనీ అంటే, భారతితో పరిగెత్తాను. అప్పటిదాకా ఏ మూఢ నమ్మకాన్నీ నమ్మని దాన్ని, ఎవరేం చెప్పినా నమ్మేట్టున్నాను!

ఆ అమ్మి ముగ్గేసి, మధ్యలో నిమ్మకాయ పెట్టి, కళ్ళు మూసుకుని, జుట్టు విరబోసుకుని వూగుతూ… “నీ బిడ్ద ప్రాణంతోనే వున్నాడు…” అంది. నా ప్రాణం లేచొచ్చింది. “దీపాలు పెట్టే వేళకి దొరుకుతాడు” అంది. “దొరికితే నీకు చీర పెట్టి దక్షిణ ఇచ్చుకుంటానమ్మా” అని, “ఎక్కడున్నాడూ?” అంటే “దక్షిణం వైపు” అని చెయ్యి చూపించింది.

మా అన్నయ్య రామూ స్కూటర్ వేసుకుని అటుగా వెళ్ళాడు.

ఇక్కడ చాకలి వాళ్ళింట్లో వాళ్ళు పెట్టిన పెరుగు అన్నం తినేసి, వాళ్ళ పిల్లాడితో ఆడుకుంటున్నాడట క్రిష్ణ. ఆ దంపతులు, సాయంత్రం టీ.వీ. స్టేషన్ రామంతాపూర్‌కి తీసుకెళ్ళి పిల్లాడిని టీ.వీ.లో చూపించి ప్రకటన ఇప్పిద్దాం అనుకుంటున్నారట.

వెతుకుతూ వెళ్ళిన మా రామన్నయ్యకి కూరగాయల షాప్ అతను, “పొద్దుగాల మా దగ్గర చాలా సేపున్నాడు. క్రిష్ణా మేస్త్రీ తీసుకెళ్ళాడు” అన్నాడుట.

క్రిష్ణా మేస్త్రీని అడిగితే “ఆ గ్రీన్ డ్రెస్‌లో చేతిలో ఎర్రబంతి బాబా?… చాకలి వాళ్ళ దగ్గర పెట్టాను. భయపడకండి” అన్నాడట. అతనే మా పాలిట ‘బాబా’ ఆ రోజు!

మా రామన్నయ్య చాకలి ఇంట్లో ఆడుకుంటున్న క్రిష్ణని చూసి, “క్రిష్ణా… రా” అనగానే, పరిగెత్తుకు వెళ్ళి, ఆ చాకలమ్మాయిని కౌగిలించుకుని ‘రాను’ అన్నాడుట.

వాళ్ళు మా అన్నయ్యతో పంపడానికి సందేహించారు.

ఇంట్లో ప్రొద్దుట నుండీ మా ఎవ్వరికీ గొంతులో పచ్చి గంగ లేదు! సొమ్మసిల్లి పడిపోయి భయంకరంగా బాబాని తిట్టడం మొదలుపెట్టాను! చివరకు మానవుడు చేసేది అదేగా! అసలా రోజు క్రిష్ణ దొరకకపోతే మా భార్యాభర్తలం ఒకర్నొకరం జన్మాంతం క్షమించుకునేవాళ్ళం కాదేమో!

“క్రిష్ణొచ్చాడు” అని మా పెద్దమ్మ కూతురు రమక్కా, అక్క పిల్లలూ అరిచేసరికీ నేను పరిగెత్తాను. అప్పటిదాకా  బిక్కమొహంతో స్కూల్ నుండొచ్చి, ఏడుస్తున్న నన్ను చూస్తూ కూర్చున్న అశ్విన్ కూడా పరిగెత్తుకొచ్చాడు!

క్రిష్ణ “అమ్మా” అంటూ నవ్వుతూ స్కూటర్ దిగాడు.

వాడిని గుండెలకి హత్తుకుని తనివితీరా ఏడ్చాను. ఆ రోజు నాకు భగవంతుడు ప్రపంచంలోకెల్లా అతి ఉత్తమమైన సంపదనిచ్చాడు… మా దంపతులంత ఐశ్వర్యవంతులు ఎవరూ లేరు!

ఏదైనా పోగొట్టుకున్నాకా దొరికితేనే కదా దాని విలువ ఆకాశమంతగా పెరిగిపోయేది! ఆనాటి నుండీ భగవంతుడి పట్ల నేను అతి కృతజ్ఞతగా మసలుతాను! ఆయన ఇచ్చిన పెన్నిధి అంతా ఇంతా కాదు! నాకేం ఇచ్చావ్? అని ఎన్నడూ అనుకోను.

ముసలితనంలో ఆ రోజు అమ్మమ్మ పడిన మనోవేదన అంతా ఇంతా కాదు! “నేను వుండీ చూసుకోలేకపోయాను. ఉన్నదే వాడిని చూసుకోడానికి” అని వెక్కి వెక్కి ఏడ్చింది పాపం.

సోది చెప్పిన అమ్మాయికి చేతి బంగారు గాజు ఇవ్వబోయాను. “రెండు మీ పాత చీరలు ఇవ్వండి చాలు” అంది. ఆమెని కౌగిలించుకుని భోరున ఏడ్చాను. బోలెడు చీరలిచ్చాను. డబ్బులూ, బియ్యం కూడా  మావారితో పంపించాను! వాళ్ళు పూరి గుడిసెలో వుండే రోజు కూలీలు! ఆమెకి మహత్యం వుందో లేదో అని హేతువాదులు నాతో వాదిస్తే చెప్పలేను… కానీ ఆమెలో ‘మాతృత్వం’ అనే మహత్యం వుంది! ఆమె ‘అమ్మ’! ఆమెకి సదా మొక్కుతాను.

వాళ్ళు ఆ సంఘటన జరిగిన కొన్నాళ్ళకి ఎక్కడికో వెళ్ళిపోయారు. కేవలం నా కోసమే అప్పుడు వచ్చారనుకుంట!

మా అశ్విన్‌కి అప్పటికింకా వూహ రాలేదు. కాని తమ్ముడ్ని ఆ తరువాత ఎప్పుదూ వదిలి పెట్టలేదు. క్రిష్ణని స్కూల్లో వేశాకా, స్మాల్ ఇంటర్వెల్‌లో వెళ్ళి చూసుకునేవాడు. పెద్ద ఇంటర్వెల్‌లో కూడా వెళ్ళి చూసుకునేవాడు. వాడి లంచ్ బాక్స్ వాడి కిచ్చేసి, ఉట్టి కడుపుతో ఇంటికొచ్చి నాకు చెప్పేవాడు కాదు! అదే ప్రేమ తమ్ముడంటే ఇప్పటికీనూ!

మా తోడికోడలు తిరుపతిలో పొర్లుదండాలు మొక్కి, ఆ మొక్కు తీర్చుకోడానికి వెంటనే తిరుపతి వెళ్ళింది. అప్పటికి ఆవిడ ‘శాంతా బయోటెక్స్’లో హిపటైటిస్ వేక్సిన్ తయారు చేస్తుండేది. ఆవిడ సైంటిస్ట్. ఎవరెంత హేతుబద్ధంగా మాట్లాడినా కష్టాలొచ్చినప్పుడు ‘పైవాడి’ కేసే చూస్తాం. ఆర్తిగా వేడుతాం! ఆ వరం కూడా మననుండి ‘హేతువాదం’తో తస్కరిస్తే, ఈ జీవన వైకుంఠపాళిలో ఎలా గడి ఎక్కుతాం?

మా క్రిష్ణ ముద్దుగా మాట్లాడేవాడు. ‘తాతమ్మ కడుపు చల్లగా…’, ‘ఎల్లయ్య తాత కడుపు చల్లగా…’, ‘అమ్మ కడుపు చల్లగా’, ‘అత్త కడుపు చల్లగా…’ అని పాడేవాడు! ఎల్లయ్య తాత అంటే మా వాచ్‌మన్ అప్పుడు.

స్కూల్లో అడ్మిషన్‌కి తీసుకెళ్ళినప్పుడు కూడా, వీడికి రంగులూ, ఏబిసిడీలూ ఒకట్లూ అన్ని నేర్పించి తీసుకెళ్ళమా? అక్కడ ‘ఉమా టీచర్’ అని వుండేవారు. స్కూల్ కరెస్పాండెంట్. ఆవిడ్ని చూసి “మీ చీర బావుంది” అని నాలుగేళ్ళ వెధవ ఆవిడ్ని బుట్టలో వేసేసాడు. బ్రింజాల్ చూపించి “నేమ్ ఇట్?” అంటే, “మా అమ్మ ఇట్ట ఇట్ట కోసి, కూర చేస్తుంది… బాంతుంది… నీకొచ్చా?” అన్నాడు చాలా స్నేహంగా నవ్వుతూ. ఆవిడకి తెగ నవ్వొచ్చింది. పైగా మా అశ్విన్ అప్పటికే ఫస్ట్ క్లాస్‌లో ఉత్తమ విద్యార్థి… అలా క్రిష్ణకి డి.ఏ.వీ.లో సీట్ వచ్చింది. అదే రోజు మా ప్రియ కొడుకు కార్తీక్‌కీ ఇంటర్వ్యూ అయింది. వాడికి అన్నీ రాయడం వచ్చు… కాని బలపం గుప్పెటతో పట్టుకుని రాస్తున్నాడని ఇవ్వనన్నారు. అది కంట తడిపెట్టింది. మళ్ళీ ఉమా మేడం వచ్చి, ఆ అలవాటు మాన్పించవచ్చు అని చెప్పి కార్తీక్‌కీ సీట్ ఇచ్చారు.

కానీ క్రిష్ణలాంటి పిల్లాడి పెంపకం అంత ఈజీ కాదు. అశ్విన్‍లా కాదు వీడు! చాలా ప్రమాదాలు తెచ్చుకునేవాడు!

మా ఆయనకి “ప్లాంట్ జహీరాబాద్‌కి షిఫ్ట్ చేశాం. మీరూ వెళ్ళాలి” అన్నారు. ఆయన మొదట్లో జహీరాబాద్ అప్ అండ్ డౌన్ జర్నీ చేసేవారు.

    

1991లో మా ఇంటి గృహప్రవేశం అయింది. జీవితంలో ఓ పెద్ద మలుపు అక్కడే తిరిగింది… నేను సెయింట్ సాయీ గ్రామర్ స్కూల్‌లో టీచర్‌గా చేరడం…

 (సశేషం)

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here