జీవన రమణీయం-131

0
4

[box type=’note’ fontsize=’16’] టీవీ, సినీరంగాలలో తనదైన ప్రత్యేక స్థానాన్ని ఏర్పర్చుకున్న సుప్రసిద్ధ రచయిత్రి బలభద్రపాత్రుని రమణి నిజజీవితంలోని అనుభవాల రమణీయమైన కథనం ‘జీవన రమణీయం’ ఈ వారం. [/box]

నా సాహిత్యాభిలాష గురించి మొదలు పెట్టి ఏదో రాసాను. నేను చిన్నప్పుడు చదివిన నవలలూ, వాటిలో కేరెక్టర్స్ – ఎందుకనో నా హృదయంలో హత్తుకుపోయాయి. శరత్ రాసిన ‘బ్రాహ్మణ పిల్ల’లో సంధ్యాధరి అమాయకుడైన తండ్రి ప్రియాబాబుని చూసుకునే తీరూ; ఎవరికి మలేరియా వచ్చినా క్వినైన్ మాత్రలు పట్టుకుని సంచితో వెళ్ళిపోయి హరిజనవాడలలో కూడా వైద్యం చేస్తుంటే ప్రియాబాబు, భార్య జగద్ధాత్రికి నలుగురూ తమ కుటుంబాన్ని వెలివేస్తారేమోనని భయం. అరుణ్ బ్రహ్మసమాజం వాడవడం వలన సంధ్య ప్రేమ బయటపెట్టకపోవడం, చివరికి నాటకీయంగా అసలు తన మూలాలు చూస్తే, సంధ్య బ్రహ్మణ పిల్లే కాదని తెలీడం… చివరి సీన్‌లో బృందావనం వెళ్ళే బండి కోసం ప్రియాబాబూ, సంధ్యా ఎదురు చూడడం… నాకెంతో నచ్చింది!

అలాగే ‘జ్ఞానద’, ‘కట్టు తెగిన పిల్ల’ పేరుతో కూడా ప్రచురింపబడింది. అందులో జ్ఞానద నల్ల పిల్ల. పెళ్ళి కెదిగింది. దానికి పెళ్ళి ఎలా అవుతుందో అని పెద్దమ్మ ఆమె రంగుని పరిహసిస్తుంటుంది. తల్లి అమాయకురాలు. భర్త పోయి మరిదీ, బావగార్ల పంచన చేరింది. మరిది కూతురు వాసంతి పట్నంలో చదువుతూ వుంటుంది. పైగా అందగత్తె! ఆమె ముందు తన నల్లని కూతుర్ని చూసుకుని ‘దీనికి పెళ్ళెలా అవుతుందో’ అని ఏడుస్తూ వుంటుంది. అతుల్ అందగాడు, వాసంతిని ఇచ్చి చెయ్యాలనుకుంటారు. అతను జ్ఞానదని సానుభూతిగా చూస్తుంటాడు. ఆమె ఒంటి రంగు నలుపైతే ఏం, ఆమెకు ప్రేమించే మనసుందిగా. శరత్ బాబు నవలల్లో ఈ ‘ప్రేమ’ని ఎంత అందంగా ఎంత సున్నితంగా చెప్తాడో! వాసంతిని పెళ్ళి చూపులు చూసుకోడానికి అతుల్ వస్తే, మొహం నిండా పేస్తర్లు‌గా పౌడర్ అద్దుకుని, చమ్కీ చీర కట్టుకుని, అసలే నల్లని పిల్లేమో, టైఫాడ్ వచ్చి తగ్గాకా, ఇంకా నల్లబడి, ఎముకల పోగులా అయిపోయి, జుట్టు ఊడిపోయి వికారంగా వున్న జ్ఞానద అతని ముందుకి వచ్చి నిలబడిందట… పెద్దమ్మ “చూసారా ఈ అప్సరసని, మా వాసంతి ముందు నిలబడే అర్హత కూడా లేనిది, ఎలా తయ్యారయి వచ్చిందో” అంటుంది… వాసంతి తల్లి, అంటే పిన్ని “అక్కా… దానికి భగవంతుడు చేసిన అన్యాయం చాలకనా…. నువ్వూ శిక్షిస్తున్నావు….” అంటుంది బాధగా. ఆ ఒక్క మాటతో ఆవిడ కేరెక్టరైజేషన్ ‘మఝ్‌లీ దీదీ’లో అక్క పాత్ర అంతగా ఎలివేట్ అయిపోతుంది. అతుల్ ఆమె వైపు చూస్తాడు…. జ్ఞానద సిగ్గుతో తల దించుకుని, పెద్దమ్మ మాటలకి ముడుచుకుపోతుంది… అతుల్‌కి జ్ఞానద అంటే అభిమానం… ప్రేమా వుంటాయి… ఆమె దగ్గరకి వెళ్ళి, ఒక్క మాటైనా అనునయంగా మాట్లాడితే, ఆమెని ప్రేమగా దగ్గరికి తీసుకుంటే ఎంత బాగుండేదీ అనిపించింది జాలితో, ఆ వయసులో. కాని శరత్ బాబు హీరోలు అలాంటి పనులు, ముఖ్యంగా పెద్దవాళ్ళ ముందు అస్సలు చెయ్యరు! … అత్త మృత్యుశయ్య మీదున్నప్పుడు అతుల్ వచ్చి జ్ఞానద తల్లితో “అత్తా! ఇవిగో అమ్మ గాజులు… జ్ఞానదకిస్తున్నాను” అంటాడు… అంతే నవల ముగుస్తుంది!

ఎంత సౌకుమార్యం ఆ ముగింపులో….

‘తీరని కోరికలు’లో హేమ నళిని గుణీంద్రుడి ఎంగిలి విస్తరిలో భోంచేసి తల్లి సులోచనలో “ఇవాళ్టి నుండీ బ్రహ్మ సమాజం వాడైన గుణీదాకి కులం లేకపోతే, నాకూ లేదు… పోయింది” అంటుంది! సులోచన ఆమె ప్రేమని తట్టుకోలేక, సాటి కులీనుడైన సంపన్నుడితో హేమకి వివాహం చేసి నవద్వీపం పంపేస్తుంది…. భర్త పోయి హేమ తిరిగి వచ్చేసరికి ఇల్లు అతని బంధువులం అని చెప్పుకునే వాళ్ళతోటి నానా రచ్చగానూ ఉంటుంది… పని వాళ్ళని తీసేస్తారు… వరుసకి పిన్ని అయినావిడ అజమాయిషీ చేస్తూ, కూర్చుని తింటూ వుంటారు… హేమ వచ్చి గదిలో బలహీనంగా పడుకుని వున్న గుణీదాతో “ఏం పట్టించుకోవే గుణీదా?” అని అతని పాదధూళి దీసుకుంటుంది… గుణీదా ఒక్క డైలాగ్ కూడా ఎక్కువ మాట్లాడడు, తాళం చెవుల గుత్తి దీసి దిండు కింద నుండి ఆమె కిస్తాడు… శరత్ పాత్రలు అంతే! ఎక్కువగా మాట్లాడరు… పోట్లాడరు… ప్రేమిస్తే మనసులోనే వుంచుకుంటారు… డేమేజ్ జరిగిపోయాకా క్రైసిస్ మేనేజ్‌మెంట్ చేస్తారు. అసలు నవలల ఎత్తుగడే, మనని తమలో బాటు ఆ పరిస్థితిలోకీ, ప్రదేశంలోకీ లాక్కెళ్ళిపోతుంది… అట్మాస్‌ఫియర్ అంటాం కదా అదీ.

ఆనాడు ఏకాదశీ వుపవాసం, పచ్చి మంచినీళ్ళైనా ముట్టదు సులోచన…. కాళీఘాట్‌లో నిలబడ్డ ఆమె పక్కన, ఆమె చెంగు పట్టుకుని నిలబడ్డ పదమూడేళ్ళ హేమ “ఎక్కడికెళ్తున్నాం అమ్మా?” అని అడిగితే “నీ అన్న దగ్గరకి” అంది సులోచన. “నాకు అన్న వున్నట్లు చెప్పనే లేదే?” అంది హేమ.

ఇలా మొదలవుతుంది. ఆ కలకత్తా వీధుల గుండా, మనం గంగా స్నానం చేసి వస్తున్న సువాసినులనూ, పూర్వ సువాసినులను తప్పించుకుంటూ, ఇరుకు దారులూ, మెట్లూ ఎక్కిపోతూనే వుంటాం….. కుండలో నుండి దీసిన రసగుల్లాలూ, ఉపవాసం వుపసంహరించుకోడానికి వండే చేపముక్కలూ, వేడుకల్లో మిఠాయిలు చేసే కలకత్తా వంట వాళ్ళూ, అభిమానమే ఆభరణంగా వుండే ఆడపిల్లలూ, ఇంటావిడ మాట వినే మతిమరుపు ప్లీడర్ మొగుళ్ళూ, తోటికోడళ్ళ పిల్లలనీ, తన పిల్లల మాదిరిగానే ప్రేమించీ, గద్దించీ ఇల్లు సవరించుకునే ‘సుశీల’లూ, సవితి మరిదిని, స్వంత కొడుకులా చూసుకునే ‘నారాయణి’ లాంటి వదినలూ, ‘రాముని బుద్ధిమంతతనం’లో లాంటి పెంకి మరుదులూ, ‘బిందుగారబ్బాయి’లూ, భర్తకి తనని విడిచి పెట్టాకా, ఆయన వేరే మనువు తాలూకు పిల్లవాడిని ప్రేమించే ‘నవవిధాన్’లో ఉషలూ, బృందావనంలో అనురాధలూ, కొందరు ‘చరిత్రహీన్’లూ; “నా లాంటిది దొరికితే… పెళ్ళాడుతావా? ఎక్కడుంటుంది దేవాదా?” అనే పార్వతీలూ… ఆ వయసులోనే నన్ను తెగ ప్రభావితం చేసి వదిలి పెట్టేసాయి… అదే కారణం నా హీరోలు ఎక్కువ మాట్లాడకపోవడానికీ; నాయికలని వుడికించి, కవ్వించి, వారి మనసులో మాట వారే చెప్పేట్లు చెయ్యడానికీనూ! అమ్మాయిలంటే అత్యంత సౌందర్యంగా వుండక్కర్లేదు, అని నాకు చిన్ననాడే ‘జ్ఞానద’ చదివినప్పుడు అర్థమైంది. ‘ప్రేమ’ అంటే అలౌకికంగా కూడా వుండచ్చు, అతి పవిత్రంగా కూడా ఆరాధించచ్చు అనీ తెలిసింది. అప్పటి సమాజం…. అందులో ఎదురు తిరిగే భావాలున్న అమ్మాయిలు, లోకానికి వెరసే అబ్బాయిలు, అత్యంత సంపన్నులయ్యీ, ఏ పక్కింటి లలితలకో, అల్మారా తాళాలు ఇచ్చి, ఆరాముగా కూర్చునే ‘పరిణీత’లో శేఖర్ దాలూ, …. గయ్యాళ్లి రాసమణులు, నమ్మిన బంట్ల లాంటి అన్నాకాళీలు, గోముఖ వ్యాఘ్రాల్లాంటి గోలోక చటర్జీలు. అమాయకంగా వుండే సురేంద్రలూ, అన్నీ తెలిసీ బందీలై పడివుండే ‘బడదీదీ’ మాధవీలూ, ఎటు వెళ్తున్నామో తెలినీ ‘శ్రీకాంత్’లూ వాళ్ళంతా నా మనసులో పాతుకుపోయి, బలమైన పాత్ర చిత్రణలు అంటే ఎలా వుండాలో నేర్పాయి.

‘సుధా శరశ్చెంద్రము’ అని రోమేశ దత్తుడు అనే రచయిత రాసిన నవల నేను చాలా చిన్నప్పుడు చదివాను. అందులో “మామిడికాయ పచ్చడిలో కారం, పాలల్లో బెల్లం భలే పసందుగా కలుపుతుంది నా భార్య” అనే వాక్యం నాకు గుర్తుండిపోయింది.

నేను మొదటగా చదివిన డిటెక్టివ్ నవల ‘ఉషారాణి’. ఎవరు రాసారో తెలీదు కానీ, ఉషారాణి చేతిలో వున్న పేకముక్కలని గురి చూసి కొడ్తే, ఆ అంచులకున్న బ్లేడ్ తగిలి, అవతల వున్న దుర్మార్గులు చస్తూ వుంటారు. అలాగే నేను చదివిన జానపదాలు. ‘సహస్ర శిరశ్ఛేద అపూర్వ చింతామణి’. “నమ, మర్షీ, వాలీ, యావా పట్టణాల్లో నీకు ఈ శిరశ్ఛేదాలకి కారణాలు తెలుస్తాయి” అని పేదరాశి పెద్దమ్మ చెప్పిన మాటలతో నవలంతా సాహాసాలు చేస్తాడు హీరో. భలే అద్భుతంగా సాగుతుంది కథనం.

మా మీర్ హుస్సేన్ గారి తండ్రిగారు ఎన్.డి.లాల్ గారు ఆ సినిమా తీసారని తర్వాత తెలిసింది. ఇంటర్‍మీడియెట్‌లో వున్నప్పుడు స్వాతి అనుబంధ నవల ‘కాటేసిన కారుణ్యం ‘అని చదివాను. ఎవరు రాసారో తెలీదు… అలాగే పరిమళా సోమేశ్వర్ గారి ‘పిల్లలతో ప్రేమయాత్ర’. మొన్న అమృతలత అవార్డు పరిమళ సోమేశ్వర్ గారికీ నాకు ఇస్తాం అని ఎనౌన్స్ చేసినప్పుడు నేను ఎంతో ఆనంద పడ్డాను, ఆవిడతో స్టేజ్ పంచుకోగలుగుతాను అని…. కాని మనం ఒకటి తలిస్తే విధి ఒకటి తలిచి కోవిడ్ అడ్డుపడింది.

నేను చాలా సార్లు చదివిన నవల ‘స్వీట్ హోమ్’, రంగనాయికమ్మ గారిది. హాస్యం ఆవిడలా రాసే వాళ్ళు ఆ తర్వాత మళ్ళీ పుట్టలేదు. ఎందుకనో ఆవిడ ‘జానకి విముక్తి’ లోనూ, ‘చదువుకున్న కమల’ లోనూ, ‘కళ్ళు తెరిచిన సీత’లో కూడా హాస్యం రాసారని నాకు చాలా చోట్ల అనిపించింది!

ఇంక యద్దనపూడిగారి ‘కీర్తి కిరీటాలు’ అయితే ‘నవల అంటే ఇలా రాయాలి’ అని, ఆ వయసులో ‘చెంపల్లో వెచ్చని ఆవిర్లు’ పూయించి, గింగిరాలు తిప్పేసింది. ఆవిడ నవలలన్నీ చదివినా మొదలుగా నేను చదివిన ఈ నవల నాకు ప్రత్యేకం. అలాగే యండమూరి గారి ‘పర్ణశాల’ అంతగా మనసుకి హత్తుకుపోయిందెందుకనో… మల్లాదిగారిని కాస్త లేట్‌గా పెళ్ళ‍యి పిల్లలు పుట్టాకా చదివాను. ‘అందమైన జీవితం’, ‘మందాకినీ’ నేను చాలా సార్లు మళ్ళీ మళ్ళీ చదివాను.

అప్పట్లో నేను యర్రంశెట్టి శాయిగారి ‘హ్యుమరాలజీ’, ‘ప్రేమ షరతులు’లో భవానీ శంకర్‌నీ ఎక్కువగా ఇష్టపడేదాన్ని! 

(సశేషం)

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here