జీవన రమణీయం-137

0
10

[box type=’note’ fontsize=’16’] టీవీ, సినీరంగాలలో తనదైన ప్రత్యేక స్థానాన్ని ఏర్పర్చుకున్న సుప్రసిద్ధ రచయిత్రి బలభద్రపాత్రుని రమణి నిజజీవితంలోని అనుభవాల రమణీయమైన కథనం ‘జీవన రమణీయం’ ఈ వారం. [/box]

[dropcap]త[/dropcap]న్వీ, పల్లెటూర్లో రాహుల్‍ని గుడికి తీసుకెళ్తూ వుంటుంది. “ఏ వూరూ? ఎవరబ్బాయీ?” అని తెలిసిన వాళ్ళు అడుగుతూంటారు… గుడిలో “గోత్రనామాలు చెప్పు బాబూ?” అంటే, “అవి తెలీదు… క్రిష్, ఫుల్ ఎడ్రస్ కావాలంటే సోషల్ సెక్యూరిటీ నెంబర్ ఇస్తాను” అంటాడు.

హీరోయిన్ నవ్వి, “దేవుడి గోత్రంతో పూజ చెయ్యండి… భారద్వాజస…” అని; రాహుల్‍కి చెప్తుంది “‘ఏం పేరూ? ఏం చదివావు?’ అని అడగలేదు చూసావా? ‘ఎవరింటికొచ్చావ్? ఎవరబ్బాయివ’ని అడిగారు వూళ్ళో అందరూ… అదే మా సోషల్ సెక్యూరిటీ … ఫలానా రామభద్రం గారి అబ్బాయో, పాపారావు గారి అబ్బాయో అంటేనే నీకు అస్తిత్వం… మాకు తెలిసినవాడే, మన వూరి వాడేలే అనే సెక్యూరిటీ!” అని.

ఇంకోసారి, ఇంట్లో హీరోయిన్ తల్లీ, పిన్నీ, అత్తా అంతా వంటలు చేస్తుంటారు! ఆ ఘుమఘుమ వాసనలకి రాహుల్ వంట గదిలోకి వెళ్ళి “వాహ్… నాకు ఆ వాసనకి ఆకలేస్తోంది. పెడ్తారా ఆంటీ?” అంటాడు… సన “ఒక్క నిమిషం” అని ప్లేట్లో వేడి వేడి గారెలు బాండీ లోంచి తీసి వేస్తూ, అతని కాళ్ళ కేసి చూసి గుడ్లెర్ర చేసి “ఏయ్… జోళ్ళతో వంటగదిలోకి వస్తావా? బుద్ధి లేదూ? అవునులే అమ్మా బాబూ నేర్పిస్తేగా ఇవన్నీ… మంచి ఇంటికి చెందితే, ఇవన్నీ అర్థమౌతాయి…” అని ఇంకేదో అనబోతుంటే, తన్వీ వచ్చి “ఏంటమ్మా ఇన్ని చివాట్లు పెడ్తున్నావ్? నిజంగానే అతనికి యూ.కె.లో ఇవన్నీ నేర్పించేందుకు ఎవరూ లేరు… పాపం అమ్మా నాన్నా లేనివాడు… ఎలా తెలుస్తాయి?” అంటుంది.

అప్పుడు సన బాధ పడ్తూ, “అయ్యో ఇవన్నీ తెలీక చివాట్లు పెట్టాను… చెప్పులిప్పేసిరా… వేడి వేడిగా పెడ్తాను… ఏమీ అనుకోకు నాయనా!” అని జాలిగా అంటుంది.

రాహుల్ “చివాట్లు తొందరగా పెట్టండి ఆంటీ… బావున్నాయి… మంచి వాసన” అంటాడు. తన్వీ నవ్వి, “చివాట్లు అంటే నువ్వు చూస్తున్నవీ, తినబోయేవీ కావు.. నువ్వు తిన్నవి… తిట్లు!” అని నవ్వుతుంది.

రాహుల్ కూడా నవ్వి “ఇవా? ఆంటీ మీరలా తిడ్తుంటే ఎంతో హాయిగా వుంది. మా అమ్మ వుంటే ఇలా తిట్టేది కదా… అమ్మలా అనిపించారు” అంటుంటే ఆవిడకి కన్నీళ్ళు వస్తాయి. “ఎంత పాపిష్టిదాన్నీ.. ఆకలితో వున్న బిడ్డని ఇలా తిట్టేసాను” అని!

మరో సీన్లో పొలం, తోటా అన్నీ చూపిస్తానని తన్వీ బాబాయి రఘుబాబు, రాహుల్‌ని తోటలోకి తీసుకెళ్తాడు… “అబ్బాయి లండన్ నుండొచ్చాడు, మన కొబ్బరి బొండాలు సత్తా చూపించు” అంటూ వరుసగా బోండాలు కొట్టి రాహుల్‌కి ఇప్పిస్తాడు! అతను మొదటిది బాగుందని తాగినా, రెండో బోండాం మొహమాటానికి తాగి, కడుపు వుబ్బిపోతుంది… “ఒద్దు… చాలు బాబోయ్” అని పరిగెడ్తూ, “రెస్ట్ రూం ఏదీ?” అని అడుగుతాడు. రఘుబాబు “ఇంటికెళ్తేనే రెస్ట్!” అంటాడు. రాహుల్ “అయ్యో అర్జెంటు…”అని వేలు చూపించి, “ఎక్కడ వెళ్ళాలి?” అంటే, అతను నవ్వుతూ, “ఒరొరే, పది ఎకరాల మామిడి తోటలో నీకు ఒకటికి వెళ్ళడానికి చోటే దొరకట్లేదురా?” అంటాడు…. “ఛీ! ఔట్ డోరా? నా వల్ల కాదు” అని గబగబా ఇంటికి పరిగెత్తితే, తన్వీ ఫ్రెండ్స్ ఆపేసి కబుర్లు చెప్తుంటారు. అతని బాధ వర్ణనాతీతమౌతుంది!

నేనేం చిన్నపిల్లనా సెట్‌లో

కామెడీ సీన్స్‌లో తాగుబోతు రమేష్, కాశీ విశ్వనాథ్, రాగిణివీ, బార్‌లో ఆలీ, వేణుమాధవ్‌దీ బావుంటాయి. బార్‍లో సీన్ అప్పటికింకా డైరక్టర్ అవని అనీల్ రావిపూడి చెప్పాడు.

నాయుడుగారి గొప్పదనం, ఒక్క సీన్ చెప్పినా నేను, “ఏమైనా ఇవ్వండి” అంటే “నీకు ఉపయోగపడ్డారా? అయితే సరే” అంటూ ఎంతో కొంత చెక్ రాసి ఇచ్చేవారు. ఆమని వచ్చాకా, వాళ్ళ ట్రాక్ అంతా హైదరాబాద్ నానక్‌రామ్‍గుడా లోనే చేసారు. సురేష్ బాబు ఆ లొకేషన్‌ కొచ్చి, “ఎవరా ఆర్టిస్ట్?” అని అడిగారు ఆమనిని గుర్తు పట్టక. ఆమని చాలా మంచి ఆర్టిస్ట్. ఇంకో విశేషం, చీరలన్నీ అందరికీ నేనే సెలెక్ట్ చేసి కొన్నాను, నాయుడిగారి పి.ఎ. విజయలక్ష్మితో వెళ్ళి. ఒక రెడ్ బోర్డర్ వైట్ గద్వాల పట్టు చీర చాలా నచ్చి తీసుకొన్నాను. అందరికీ పట్టు చీరలు తీసుకుని, ఆమనికి అన్నీ లైట్ కలర్ బెంగాలీ కాటన్స్ తీసుకున్నాను! సినిమా చూడండి, ఆమె చీరలు ఎంతో బావుంటాయి.

నాయుడు గారు నేను చీరలు తెప్పించాకా, అవి చూసి, “ఈ వైట్ అండ్ రెడ్ కాంబినేషన్ చీర నువ్వు తీసుకో” అని నా చేతిలో పెట్టారు. నేను వద్దు వద్దు అన్నా, ఆయన బలవంతం చేసి ఇచ్చారు! అది ఒక మధుర జ్ఞాపకం… ఎప్పుడు కట్టుకున్నా గుర్తుకువస్తారు.

ఆ చీరలు కొనేటప్పుడు ఆ షాప్ రామానాయుడిగారి కోడలు లక్ష్మిగారి ఫ్రెండ్‌దిట… అక్కడికి పురంధేశ్వరిగారు కూడా వాళ్ళ అబ్బాయి ఎంగేజ్‌మెంట్ కోసం వచ్చి  చీరలు కొంటుంటే నేనెళ్ళి పరిచయం చేసుకుని, ఎందుకొచ్చానో చెప్పగానే, “ఓ మీరు రైటరా? చాలా సంతోషమండీ” అని చాలా బాగా మాట్లాడారు.

నేనేం చిన్నపిల్లనా సెట్‌లో

షూటింగ్‌కి ఎబ్రోడ్ వెళ్ళడం, ఈ సినిమాకి అనివార్యం! నాయుడు గారు ఎప్పుడూ “ఎల్లో ఫ్లవర్స్ వచ్చే సీజన్‌లో స్విట్జర్లాండ్ వెళ్ళాలి” అంటారు. నన్ను కూడా అడిగారు “వస్తావా?” అని. తన్వీ కూడా “మా అమ్మని వద్దు అంటున్నారు. మీరొస్తే బావుంటుంది” అని బతిమాలింది. ఎందుకో రాహుల్‍కీ, తన్వీకి పెద్ద ఫ్రెండ్లీ అట్మాస్ఫియర్ మొదటి నుండీ కుదరలేదు! “నేనూ వస్తాను” అన్నాను, ‘మధుమాసం’కి మలేషియా వెళ్ళినప్పుడు ఎంత బాగా చూసారో నాకు తెలుసు కాబట్టి! “సరే నీ పాస్‍పోర్ట్ కూడా రాజా కివ్వు” అన్నారు. సురేష్ కాంపౌండ్‍లో ‘రాజా’ అనే మేనేజర్ అంటే తెలీనివాళ్ళు వుండరు… రెండు నెలల క్రితం మా రాజా నిద్రలో హార్ట్ ఎటాక్‍తో మరణించాడు! మా అనీల్‍కి ‘సరిలేరు నీకెవ్వరూ’కి కూడా పని చేసాడు. అనీల్ కోసం అన్నపూర్ణ స్టూడియోకి వెళ్తే “మేడం గారూ” అంటూ నవ్వుతూ ఎదురొచ్చాడు. అదే ఆఖరిసారి నేను రాజాని చూడడం అవుతుందని అప్పుడు అనుకోలేదు! మేమందరం… అంటే సురేష్ ప్రొడక్షన్స్‌లో పని చేసిన వాళ్ళం అందరం రాజాని ఇష్టపడేవాళ్ళం. సరదాగా వుండేవాడు. పారడైజ్ బిరియానీ ఎక్కువగా తినే రాజా, సన్నబడాలని చేయించుకున్న బేరియాట్రిక్ సర్జరీ కూడా అతని ఆరోగ్యం దెబ్బ తీసింది. బ్రహ్మచారి అయిన రాజా, ఒక్కడే తన ఫ్లాట్‍లో మరణించాడు హార్ట్ ఎటాక్ వలన అని తెలిసింది.

కానీ నా స్విట్జర్లాండ్ ట్రిప్‍కి నాయుడిగారి అనారోగ్యం వల విఘ్నం ఏర్పడింది!

నేను కలిసిన కొత్తల్లోనే నాయుడిగారికి గతంలో ఒకసారి కేన్సర్ వచ్చి తగ్గిందనీ, అమెరికా వెళ్ళి వైద్యం చేయించుకుని వచ్చారనీ చెప్పారు ఆయన. అప్పుడు తనతో బాటు అమెరికాలో ఇల్లు తీసుకుని వుండి కోడలు లక్ష్మి ఎంత బాగా చూసుకుందో కూడా చెప్పేవారు. నాయుడుగారి కూతురు లక్ష్మిగారు (నాగచైతన్య తల్లి) కొంత రిజర్వ్‌డ్‍గా ఉంటుంది అని చెప్పేవారు. అయినా ఆయనకి కూతురంటే పంచప్రాణాలు. మా పాప ‘జెమ్’ అనేవారు. ఆమె గురించి చెప్తుంటే ఆయన కళ్ళు మెరిసేవి. కొడుకులు అన్నా చాలా ప్రేమే కానీ కోడళ్ళు లక్ష్మిగారూ, నీరజ గారూ అంటే కూతుర్ల కన్నా ఎక్కువ! “ఈ తోటంతా మా నీరజే వేసింది. స్టూడియో ఎకౌంట్స్ అన్నీ మా లక్ష్మి చూస్తుంది! నాకు శాలరీ ఇస్తారు… ఏ మాటకా మాట రమణీ… నేనూ రాజేశ్వరీ చేసుకున్న అదృష్టం నా కోడళ్ళు! ఇద్దరూ తెలివైన వాళ్ళూ, మేమంటే చాలా ప్రేమా… In that… I am very fortunate” అంటే నేను “మీరు ఎందులో ఫార్ట్యునేట్ కాదు కనుక? మీలా 150 పై చిలుకు సినిమాలు నిర్మించిన చరిత్ర ఎవరికైనా వుందా? మూవీ మొగల్ అనిపించుకున్నారా? ఇన్ని భాషలలో సినిమాలు చేసి ‘గిన్నీస్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డ్స్’లోకి ఎవరైనా ఎక్కారా?” అనేదాన్ని. ఈ ‘నేనేం చిన్నపిల్లనా?’ సినిమా తీస్తున్నప్పుడే ఆయనకి ‘దాదా సాహెబ్ ఫాల్కే’ అవార్డు వచ్చింది.

ఆ సంతోషం కూడా నాకు ఫోన్ చేసి, “ఫస్ట్ నీకు చెప్తున్నా… మన క్రూ కి రేపు వుదయం చెప్తాను” అన్నారు. అన్నింటికీ చిన్నపిల్లాడిలా సంతోషపడేవారు. ఆ అవార్డుకి ఢిల్లీ వెళ్ళేముందు చేసిన ఇంటర్వ్యూలలో నన్ను చూపించి, నా గురించి “మంచి లేడీ రైటర్… భలే సీన్స్ రాస్తుంది” అనేవారు. సత్యానంద్ గారంటే ఆయనకి చాలా ఇష్టం! ఢిల్లీ డ్రెస్ రిహార్సల్స్… అవార్డు తీసుకోవడం అన్నీ నాకు ఫోన్ చేసి చెప్పారు. అంత హుషారుగా వుండే ఆయనకి 2014లో మళ్ళీ జబ్బు చేసింది! 

రామానాయుడు గారు కొనిచ్చిన వైట్ అండ్ రెడ్ పట్టుచీరలో పివి సింధుతో

(సశేషం)

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here