జీవన రమణీయం-138

0
7

[box type=’note’ fontsize=’16’] టీవీ, సినీరంగాలలో తనదైన ప్రత్యేక స్థానాన్ని ఏర్పర్చుకున్న సుప్రసిద్ధ రచయిత్రి బలభద్రపాత్రుని రమణి నిజజీవితంలోని అనుభవాల రమణీయమైన కథనం ‘జీవన రమణీయం’ ఈ వారం. [/box]

[dropcap]ఆ[/dropcap]యన ఆరోగ్యం గురించి రోజూ ‘మధుమాసం’ టైం నుండీ మాట్లాడేవారు. “కేర్‍కి వెళ్ళొచ్చా… సోమరాజు గారు ఏమీ లేదన్నారు…” అనో; “హార్ట్ బీట్‌ని మానిటర్ చెయ్యడనికి చిన్న పరికరం అమర్చారు” అనో చెప్తూ వుండేవారు. కానీ ప్రతీసారీ అన్నీ నార్మల్ గానే వుండేవి. నాలుగు అంతస్తులకి లిఫ్ట్ చాలా ఏళ్ళు పెట్టించలేదు, సునాయాసంగా ఎక్కేవారు. ఒక షూటింగ్, డైరక్షన్ స్కూల్‍లో పెట్టినప్పుడు, నేను మెట్లు ఎక్కలేక ఆయాసపడితే, “మీ జనరేషన్ పుట్టి… ప్చ్!” అని నోటితో, లాభం లేదన్నట్లు సైగ చేసి ఎగతాళి చేసేవారు. 1936లో పుట్టి 2015 వరకూ కూడా, ఆఖరి రోజుల్లో తప్ప, ఆ సర్జరీ తర్వాత, ఎన్నడూ అస్వస్థతకి లోను కాలేదు! నడిచే మెట్ల మీదుగా అన్ని ఫ్లోర్‍లూ ఎక్కేవారు. ఓ సారి “మోకాళ్ళు ఎందుకో నొప్పిగా వుంటున్నాయి రమణీ” అంటే, “స్టూడియోలో ఇన్నేసి మెట్లు ఎక్కీ దిగుతుంటే మాకే వుంది, మీకు వుండదా?” అనేదాన్ని. అప్పుడు ఆయనకి 76 ఏళ్ళు! ఆ కాలం వాళ్ళు అలా బలంగా వుండేవారు. అలాగే, ‘నేనేం చిన్నపిల్లనా’ టైంలో కూడా ఆయన ఫోన్ చేసి “లొకేషన్స్‌కి వెళ్ళలేను. అంత ఓపిగ్గా లేదు” అంటే, నేను అది లైట్‍గా తీసుకున్నాను. పెద్ద వయసు వాళ్ళు రోజూ వారు వేసుకునే టాబ్లెట్స్ గురించీ, జరగాల్సిన కాలకృత్యాల గురించీ మాట్లాడ్తూ వుండడం మా ఇళ్ళల్లో కూడా చూసా! బహుశా ఓ వయసు వచ్చాక శషబిషలు లేకుండా అన్నీ అలా మాట్లాడేస్తూ వుంటారు అనుకుంటా! ‘పీకూ’ అనే సినిమా కూడా తీసారు హిందీలో ‘అమితాబ్ బచ్చన్’తో!

రాహుల్‍ని నేను సరదాగా “నిన్ను దత్తత తీసుకుంటాను” అనేదాన్ని. “తప్పకుండా… ఇప్పుడే వచ్చేస్తా” అనేవాడు. వాళ్ళ అమ్మానాన్నలకీ ‘మా రమణీ మేడం’ అని ఇంట్లో చెప్పేవాడు. దాంతో వాళ్ళూ నాతో చాలా ప్రేమగా వుండేవారు! అతనికో ‘హనుమాన్’ అనే అసిస్టెంట్ వున్నాడు. రాహుల్ అతన్ని ఓన్ బ్రదర్‍లా చూసుకుంటాడు. సినిమా విజయవంతం కాకపోయినా రాహుల్‍కి నా రైటింగ్ మీద విశ్వాసం అలా వుండిపోయింది. మా అబ్బాయి పెళ్ళి రిసెప్షన్‍కి పిలవగానే వచ్చాడు.

రాహుల్ రవీంద్రన్‌తో

తర్వాత అతను సుశాంత్‍తో తీసిన ‘చి.ల.సౌ’ అనే సినిమాకి నన్ను ప్రివ్యూకి తీసుకెళ్ళి, వాళ్ళ అమ్మా అప్పాతో బాటు పక్కన కూర్చుని చూపించాడు! అది అతనికి చాలా మంచి చేసింది! నాకా స్క్రీన్‍ ప్లే నచ్చింది. కామెడీ టైమింగ్స్ కూడా అదిరాయి. అందుకే నేను నేషనల్ ఫిల్మ్ ఎవార్డ్స్ జ్యూరీలో వున్నప్పుడు, కళ్ళు మూసుకుని ‘చి.ల.సౌ’ సినిమాని స్క్రీన్ ప్లే అవార్డ్స్‌కి అర్హమైనదిగా స్టీరింగ్ కమిటీకి రికమెండ్ చేసా. ‘మహానటి’కి గాను కీర్తీ సురేష్‌కీ, స్క్రీన్ ప్లే కి గాను రాహుల్‍కీ, ఇంకో నాలుగు విభాగాలలో మన తెలుగు సినిమాకీ అవార్డు రావడం, వారి ప్రతిభా, నా కృషీ వల్ల సాధ్యం అయ్యాయి. నేను 66వ నేషనల్ అవార్డ్స్‌లో జ్యూరీ మెంబర్ కాకపోతే ‘కీర్తీ సురేష్’కి ఉత్తమ నటీ, ‘మహానటి’కి రీజనల్ బెస్ట్ పిక్చర్ అవార్డు వచ్చినా, మిగతా ఎవార్డ్స్ రాహుల్‌తో సహా, ఎవరికీ వచ్చేవి కావు! ఎవరూ శ్రద్ధ పెట్టి రికమెండ్ చేసేవారు కారు.

కీర్తి సురేష్ నేషనల్ అవార్డు తీసుకునేటప్పుడు ఉత్తమ నటిగా… ఆమె జ్యూరీ మెంబర్‌గా

సినిమా షూటింగ్‌కి వాళ్ళు స్విట్జర్లాండ్‍ వెళ్ళారు. నేను కొన్ని కొన్ని స్టిల్స్ చూసి చాలా నిరాశకి లోనయ్యాను. ఎడిటింగ్‌లో కూడా నాయుడిగారితో “నా కథ ఇలా అనుకోలేదు” అనేదాన్ని! ఆయన కూడా నిరాశకు లోను అయ్యారు. హీరోయిన్ చాలా పెద్దగా వుంది! ఆమె విడిగా బావున్నా, తెరకి సూట్ అవలేదు. టోటల్‍గా డైరక్టర్ సునీల్ కుమార్ రెడ్డిగారు తన స్వంత కథలూ, తన జోనర్ లోనే కంఫర్టబుల్, ఇలాంటి జోనర్‍లో కాదని మాకు అర్థమయింది. కెమెరామెన్‌తో నాయుడిగారికీ, మా మేనేజర్ రాజాకీ అందరికీ ప్రాబ్లమ్స్ వచ్చాయి. ఎందుకో డీటైల్స్ లోకి వెళ్ళను కానీ, ఆ చిత్రం ఎంతో ఎక్స్‌పెక్టేషన్‍తో తీస్తే, విజయవంతం కాకపోవడం నాకు పెద్ద దెబ్బ! నాయుడిగారికి అది చివరి చిత్రం కావడం దురదృష్టం! శ్రీలేఖ చేసిన పాటలు అన్నీ చాలా బావుంటాయి. ముఖ్యంగా అనంత్ శ్రీరామ్ రాసిన ‘నేనేం చిన్నపిల్లనా?’ అన్న పాట స్కూల్ పిల్లలు తమ ఏనివర్సరీలకీ, వాటికీ నృత్యం చేయడం నేను యూట్యూబ్‌లో చూస్తూ వుంటాను! సరిగ్గా ఆ సినిమా పూర్తి అయి రిలీజ్ ముందే ఏదో స్ట్రయిక్ వచ్చి సినిమాల రిలీజ్‍లు ఆగిపోయాయి. ‘అత్తారింటికి దారేది’ కూడా రిలీజ్ కావలసింది కాస్తా ఆగిపోయింది!

జయలలిత తమిళనాడు సి.ఎమ్.గా వందేళ్ళ సినిమా పండుగ వుత్సవాలు చేస్తూ తెలుగు పరిశ్రమలో ప్రముఖులని ఆహ్వానించడం జరిగింది. ఆ నిర్వహణ, అల్లు అరవింద్ గారూ, కె.ఎస్. రామారావు గారూ చూసుకున్నారు. నన్నూ రికమెండ్ చేశారు. ఎన్ని సినిమాలు చేసానని కాదు కానీ, తెలుగు సినిమా రచయిత్రిగా, కథా, స్క్రీన్ ప్లే, మాటలూ, పాటలూ అన్ని విభాగాల్లో పని చేసిన పేరు నా ఒక్కదానికే వుంది! Only female Telugu cinema writer for story and screen play ప్రస్తుతం! అనువాద సినిమాలకి మాటలు రాస్తున్నది అనురాధా ఉమర్జీ.

అసలు ఆ ప్రయాణంలో ఎయిర్‍పోర్ట్ నుండే చాలా సందడి మొదలయింది! ఎటు చూసినా ఆర్టిస్టులు, ప్రొడ్యూసర్‍లు, రచయితలు, డైరక్టర్‍లు! పాతా కొత్తా మేలు కలయిక!

అసలు ఎయిర్‍పోర్ట్‌లో స్టాల్స్‌లో పని చేసే వాళ్ళు సైతం… కళ్ళు ఎటు చూడాలో తెలీక అవస్థ పడ్డారు. మా శిల్పా చక్రవర్తి ఏంకర్… రెడ్ కార్పెట్ మీద వచ్చేవాళ్ళని ఇంట్రడ్యూస్ చెయ్యడానికి! లిస్ట్‌లో నేను వస్తున్నానని పేరు చూసి, వెంటనే ఫోన్ చేసింది, “పెద్ద పెద్ద వాళ్ళ గురించి నాకు చెప్తారా…. రాసుకుకుంటాను” అని. “సరే నేను లీ మెరీడియన్‍లో వుంటాను, నువ్వూ?” అంటే పామ్ గ్రూప్ అనో ఏదో చెప్పింది! అసలు మాకు ఇచ్చిన హోటల్ మాత్రం నేను చెప్పలేను అంత అద్భుతంగా వుంది!

ఫ్లయిట్ లో పూరీ జగన్నాథ్, చార్మీ, ఇంకా సీనియర్ ప్రొడ్యూసర్స్, కమేడియన్స్ అందరం కలిసి వెళ్ళాం. ముఖ్యంగా అప్పటికే శతాధిక వృద్ధుడు రాఘవ గారు, ‘ఇంట్లో రామయ్య వీధిలో కృష్ణయ్య’, ‘తరంగిణి’, ‘ఆహుతి’ లాంటివి తీసిన నిర్మాతగారూ, వంద సినిమాలు తీసిన నాకు ఆప్తులైన కోడి రామకృష్ణ గారూ కూడా వుండడం చాలా బావుంది. ఆయన పట్టుదల ఎలాంటింది అంటే, ఒకేసారి పెరాలసిస్, హార్ట్ ఎటాక్ వచ్చి కాలు పడిపోయినా ఆయన కూడా వీల్ చైర్ తీసుకోలేదు. వంద ఏళ్ళ రాఘవ గారూ తీస్కోలేదు!

శతాధిక వృద్ధులు నిర్మాత రాఘవగారితో
ప్రముఖ దర్శకులు కోడి రామకృష్ణగారితో

హరిశ్చంద్ర అనే మూకీ సినిమాగా పుట్టిన బిడ్డ ‘అలంఆరా’ నుండీ మాటలూ పాటలూ నేర్చి, మనని తరతరాలుగా అలరిస్తూ వందో పుట్టిన రోజు జరుపుకుంటున్న ఈ శుభ సందర్భాన్ని, ఉత్తరాదిన ఒకసారీ, దక్షిణాదిన ఒకసారీ పండుగ జరుపుకున్నారు! దక్షిణాది భారతీయ ఫిల్మ్ చాంబర్ వాళ్ళు సెప్టెంబర్ 21 నుండీ 24 వరకు ఈ ఉత్సవాలు జరుపడానికి నిర్ణయించారు.

పగలే చుక్కలు పొడిచినట్లున్న ఎయిర్‍పోర్ట్‌కి నేను 2014 మే 22 పొద్దుటే 6.30 కల్లా వెళ్ళడం వలన చాలామంది మా టీవీ కళాకారులు కూడా కనిపించి, ఏవో ఇంటర్-ఛానెల్ కాంపిటీషన్స్ కోసం చెన్నై వెళ్తున్నాం అని చెప్పారు. ఎయిర్‌పోర్ట్‌లో నేనూ, సుద్దాల అశోక్ తేజ గారూ, వారి శ్రీమతి నిర్మలా, బ్రేక్‌ఫాస్ట్ చేస్తుంటే “ఇంతమంది సినిమా వాళ్ళు ఇంత పొద్దుటే ఎక్కడికి వెళ్తున్నారు సార్?” అని ఆ దోశ వేసే అబ్బాయి అడిగితే, “సినిమా సెంటినరీ సెలెబ్రేషన్స్” అన్నారు అశోక్ తేజ. నేను “సినిమా చూస్తాంగా… దానికి వంద ఏళ్ళ పుట్టినరోజు” అని చెప్పా. ఆ స్టాల్స్ వాళ్ళంతా చాలా వుత్సాహంగా వున్నారు. “మేమూ మీతో వస్తే బావుండు” అన్నాడతను! సినిమా తెర మీద నుండి నేల మీద కొచ్చి నడుస్తున్నట్లే వుంది మరి! 

(సశేషం)

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here