జీవన రమణీయం-140

0
11

[box type=’note’ fontsize=’16’] టీవీ, సినీరంగాలలో తనదైన ప్రత్యేక స్థానాన్ని ఏర్పర్చుకున్న సుప్రసిద్ధ రచయిత్రి బలభద్రపాత్రుని రమణి నిజజీవితంలోని అనుభవాల రమణీయమైన కథనం ‘జీవన రమణీయం’ ఈ వారం. [/box]

[dropcap]బా[/dropcap]లకృష్ణ గారు చిన్నా పెద్దా అని లేకుండా అందరితో కలుపుగోరుగా వుంటూ ‘If you trouble the trouble, the trouble troubles you’ లాంటి టంగ్ ట్విస్టర్లు చెప్పి నవ్వించారు.

కాట్రగడ్డ మురారిగారనే ప్రముఖ నిర్మాత గారితో ఎఫ్.బీ. స్నేహం నాది. నేను పప్పుచారు రెసిపీ పెడ్తే, దాన్ని ప్రింట్ తీసి వాళ్ళావిడకిచ్చి, పప్పుచారు కాయించుకున్నాననీ, నాకు బ్రహ్మాండమైన ఫాన్ అయ్యాననీ, చెన్నై వస్తే కలుస్తాననీ, తన కోసం తొక్కుడు పచ్చడి తెమ్మనీ చెప్పారు. అలాగే ఆయన నీలాంగర్ అనే మహాబలిపురం దగ్గరనున్న తన ఇంటి నుండి ట్రావెల్ చేసి వచ్చి, ఈ లాబీలోనే మా అందరితో, మధ్య మధ్య సంస్కృత పదాలతో జోక్‍లేస్తూ, సందడి చేసి, నేనిచ్చిన పచ్చడి తీసుకుంటున్నట్లు ఫొటోలు తీసుకున్నారు.

భువనచంద్రగారితో పాటు పలువురు ప్రముఖూలూ, చైన్నై వాస్తవ్యులకి పిలుపు అందక కినుక చూపించారు. భువనచంద్ర గారు అప్పట్లో అస్వస్థులుగా వుండడం వలన ఆయన్ని చూడ్డానికి వస్తానని చెప్పాను. ఈ విషయం చెప్తే అరవింద్ గారు తన కార్ ఇస్తానని చెప్పారు. ఆయన డ్రైవర్ మహాలింగం అప్పట్లో నన్ను వీసాకి కూడా తీసుకెళ్ళడం వలన నాకు పరిచయమే.

మేనేజర్లు నిమిషం తీరిక లేకుండా తిరుగుతూ మా అందరికీ సాయంత్రం ప్రోగ్రాంకి కార్లూ, పాస్‍లూ ఎరేంజ్ చేస్తూనే వున్నారు.

అందరం గదులకి వెళ్ళి, సాయంత్రం ఐదు గంటలలోపే తయ్యారయి లాబీలోకొచ్చి, తయ్యారుగా వున్నాం.

నేను వచ్చేసరికి కింద లాబీలో సిరివెన్నెల సీతారామశాస్త్రిగారూ, వాళ్ళావిడ పద్మావతి గారూ వున్నారు. వాళ్ళ కోసం కారు రాగానే “రా చెల్లాయ్” అని ఆయన తనకొచ్చిన కారులో ఎక్కించుకొని, ప్రోగ్రామ్ హాల్‍కి తీసుకెళ్ళారు.

కారు దిగేసరికీ వి.ఎన్.ఆదిత్యా, కె.ఎస్.రామారావు గార్లూ ఆప్యాయంగా ఆహ్వానిస్తూ ఎదురొచ్చారు. వాళ్ళు ముందుగా వెళ్ళి అన్ని ఏర్పాట్లు చేశారు! అలవాటుగా రెడ్ కార్పెట్ వున్న వైపు కాకుండా ఇంకో వైపుగా వెళ్ళాం! అలవాటుగా అని ఎందుకన్నానంటే, ఎందుకనో మా డ్రైవర్ కూడా ఏ ఫంక్షన్ అయినా, తెలుసుకోకుండా అలా బ్యాక్ గేట్ దగ్గరే నా కార్‍ని ఆపడం, కో ఇన్సిడెన్సో, నా తలరాతో ఏదో!

వాణిశ్రీ, గీతాంజలి గార్లతో
జయంతి గారితో
జమున గారితో

నేను లోపలికి వెళ్ళాక, అవార్డీస్‌ని ముందర వరసల్లో కూర్చోబెట్టారు. నేనూ, సుద్దాల అశోక్ తేజ గారి మిసెస్ నిర్మలగారూ ఒకే వరుసలో కూర్చున్నాం. పాత తరం హీరోయిన్‍లు బి. సరోజా, కృష్ణకుమారి, రాజశ్రీ, కాంచనా, రాధ, అంబిక, వాణిశ్రీ, మాధవీ కనువిందు చేసారు. కమలహాసన్, బాలచందర్ గార్లని చూడగానే నా మనసు ఆనంద తరంగితం అయింది. అరవింద్ గారిని అడిగాను లోగడ – ‘నేను బాలచందర్ గారి ఏకలవ్య శిష్యురాలిని… ఆయన్ని ఒకసారి కలిపించండి!’ అని. దానికి ఆయన “చదువుకునే రోజుల్లో ‘అరంగేట్రం’ సినిమా చూసి కలుసుకోవాలని నేను వుబలాటపడ్డ ఒకే ఒక డైరక్టర్ బాలచందర్. తప్పకుండా కల్పిస్తాను” అన్నారు గానీ, ఆ రోజు రాలేదు! కమల్‌హాసన్‌ని మాత్రం కలిపించారు.

శివమణితో

శివమణి డ్రమ్స్‌తో చెవుల తుప్పు వదిలించేసాడు. కానీ తర్వాత మన పాడుతా తీయగా, సరిగమ సింగర్స్ పాడిన గంటన్నర సేపు సాగిన మెడ్లీ, శృతి లేకుండా కొంత బోర్‍గా సాహింది. ఫేమస్ సింగర్స్ అంతా (టీ.వీ., సినిమాల్లో పాడేవాళ్ళు) అటు పదిహేనుమందీ, ఇటు పదిహేనుమందీ నిలబడీ, ఒకళ్ళు ఆపితే ఒకళ్ళు అందుకుని పాడుతూ వుంటే భరించలేక ప్రేక్షకులు హాహాకారాలు చేసారు! (అదంతా రికార్డెడ్ ట్రాక్ అట… మధ్యలో ఆపితే… ప్రోగ్రాం మొత్తం రసాభాస అవుతుందని, ప్రేక్షకులు స్టేజ్ దిగిపోమన్నా వినకుండా పాపం సింగర్స్ కంటిన్యూ చేయాల్సొచ్చిందని తర్వాత తెలిసింది నాకు)

అలా పాడుతున్నప్పుడు, ఆర్. నారాయణమూర్తి ఆవేశంగా స్టేజ్ మీదకి వెళ్ళి సుమంగళి అనే సింగర్ చేతి లోంచి, ఫోర్స్‌డ్‍గా మైక్ లాగేసుకున్నారు! తెలివిగా సి. కళ్యాణ్, రామారావు గార్ల లాంటి నిర్వాహకులు సౌండ్ తీసేసారు. అయినా ఆయన ఆగలేదు. రెండోసారి మళ్ళీ బాలూగారు మాట్లాడుతుండగా వచ్చి “ఇది వందేళ్ళ పండుగలా లేదు, ఆడియో ఫంక్షన్‍లా వుంది, ఇదేనా మనం చూపించాల్సిందీ?” అని అరిచి గోల చెయ్యబోతుంటే, సి.కల్యాణ్ ఆయన్ని బలంగా పట్టుకొని స్టేజ్ దింపేసారు. అప్పుడు ఆయన సౌత్ ఇండియా ఫిల్మ్ చాంబర్ అధ్యక్షులు. “ఆర్. నారాయణమూర్తిగారిని ‘వందేళ్ళ పండగ’లోంచి తొలగిస్తున్నాం” అని సింపుల్‍గా అనౌన్స్ చేసేసారు. “మీరు తొలగించేదేంటి… నేనే వుండను” అని నారాయణమూర్తిగారు వెళ్ళిపోయారు. వజ్రోత్సవం చేసినప్పుడూ ఇలాంటి అపశృతులు దొర్లాయి, కాబట్టి సినిమా ఇండస్ట్రీలో ఇవి కామనే!

రాఘవగారి లాంటి వయసు మించిన వృద్ధులని సైతం మొత్తం ప్రోగ్రాం అయ్యేదాకా వుంచి, అవార్డు ప్రదానం చెయ్యడం లాంటి చిన్న చిన్న తప్పులతో, మొత్తానికి ప్రోగ్రాం అయిపోయింది. నాడూ నేడూ పాటలకి నృత్యాలు బావున్నాయి.

రాఘవ గారినీ, అల్లు అరవింద్ గారినీ, సత్యానంద్ గారినీ, అశ్వనీదత్తు గారినీ, సుద్దాల అశోక్ తేజ గారినీ, మొత్తం సీనియర్ నటీనటుల్నీ అందరినీ సత్కరించడం అయ్యేసరికి పన్నెండు అయింది!

అరవింద్ గారు నన్ను చూసి, “హోటల్‌లో దించమంటారా?” అన్నారు. ఆయనా, అశ్వనీదత్ గారూ కలసి వెళ్తున్నారు. “నా హోటల్ వేరు కదా!” అన్నాను. “దింపి వెళ్తాం” అని అంత లేట్ అయినా నన్ను భద్రంగా అరవింద్ గారి కార్ ఎక్కించుకుని, ఇద్దరు పెద్దవాళ్ళూ, ప్రోగ్రాంలో జరిగిన రసాభాసా, తప్పులూ గురించి మాట్లాడ్తూ, నన్ను లీ మెరీడియన్ దగ్గర దింపి వెళ్తూ అరవింద్ గారు “మంచి హోటల్ ఇచ్చారు మీకు. మాకు దిక్కుమాలిన చోటు ఇచ్చారు” అన్నారు. నాకు చాలా ఆనందం వేసింది. అసలు నేను ఫిల్మ్ ఫీల్డ్ కొచ్చాకా జ్యూరీస్‍లో వున్నప్పుడూ, అవుట్ డోర్ షూటింగ్స్‌కి వెళ్ళినప్పుడూ, స్టార్ హోటల్స్‌లో వుండడం ఎంతో బావుంటుంది. నేనూ, మా వారూ ట్రావెల్ చేసినా, ‘బయట తిరుగుదాం’ అని ఆయన అన్నా, ‘వద్దు, నేను హోటల్ రూంలోనే వుంటాను, మీరు వెళ్ళండి’ అనేదాన్ని. కానీ ఈ లీ మెరీడియన్ రూం‍లో నేను ఆ రెండు రోజుల్లో వున్నది చాలా తక్కువ సేపు! లాబీలో పెద్దలందరితో సరదా కబుర్లే ఎక్కువ ఆకర్షించాయి… ఇప్పుడు అవి నెమరేసుకుంటుంటే, ఆ క్షణాలు గడిపిందీ నేనేనా? అనిపిస్తుంది. మళ్ళీ అలా ఆరాముగా, గంటల తరబడీ మాట్లాడ్డానికి గొల్లపూడి గారూ, రావి కొండలరావు గారూ, గణేశ్ పాత్రో, రాఘవ గారి లాంటి పెద్దలు వస్తారా? అవి సువర్ణ ఘడియలు. నేనెంతో అదృష్టవంతురాలిని.

అంత రాత్రి అయినా నేను హోటల్‍కి వెళ్ళేసరికీ బఫేలో పుడ్ వుందని రిసెప్షన్‌లో చెప్పారు. నేను పెరుగన్నం, ఫ్రూట్ సలాడ్ తిని రూమ్‍కి వెళ్ళి పడుకున్నాను. పిల్ల బ్యాచ్ చాలామంది రాబట్టి నా రూంకి కారిడార్లో నడిచి వెళ్తుంటే, వాళ్ళ ఉత్సాహం, కేకలూ, నవ్వులూ వినిపిస్తూనే వున్నాయి. ముత్యాల సుబ్బయ్య గారు నా రూం ఎదురుగానే, ఎదురుపడి పలకరించారు.  

(సశేషం)

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here