జీవన రమణీయం-141

4
8

[box type=’note’ fontsize=’16’] టీవీ, సినీరంగాలలో తనదైన ప్రత్యేక స్థానాన్ని ఏర్పర్చుకున్న సుప్రసిద్ధ రచయిత్రి బలభద్రపాత్రుని రమణి నిజజీవితంలోని అనుభవాల రమణీయమైన కథనం ‘జీవన రమణీయం’ ఈ వారం. [/box]

[dropcap]తె[/dropcap]ల్లారి స్నానం చేసి త్వరగా తయ్యారయి బ్రేక్‍ఫాస్ట్‌కి వెళ్ళాను. నిన్న రాత్రి ప్రోగ్రాం తాలూకూ కబుర్లతో సరదాగా బ్రేక్‌ఫాస్ట్ చేస్తుంటే, సత్యానంద్ గారు “మీరు ఫేస్‍బుక్ అప్‌డేట్స్ అంత తొందరగా ఎలా చేస్తారు? మీ ఫేస్‌బుక్ అప్‍డేట్స్ చదువుతుంటే తప్ప, నాకు ఇక్కడ నిన్న రాత్రి ఏం జరిగిందో, ఎవరెవరు మన ఫ్లయిట్‍లో వచ్చారో తెలీనే లేదు! అసలు టీవీలో కూడా సినిమాలు చూస్తూ ఆ నటి గురించి మీరు అప్‌డేట్ పెట్టే లోపు ఆ నటి వెళ్ళిపోయి, సీన్ అయిపోదా?” లాంటి ప్రశ్నలతో నన్ను ఆటపట్టించారు.

“మీరు నా సినిమా కథల గురించి ఎంతైనా రంధ్రాన్వేషణ చెయ్యండి, సిట్టింగుల్లో, అంతే కాని మిగతా విషయాల గురించి కాదు” అన్నాను సత్యానంద్ గారితో.

“…అలా కాదు, మీ గురించిన ఏ విషయమైనా నాకు ఇంట్రెస్టింగ్‍గా వుంటుంది” అన్నారు.

“మీ ఆనందమే నా ఆనందం. అలాగే కానియ్యండి అయితే!” అన్నాను. మిగతావాళ్ళు గొప్ప వుత్సాహంగా ఇదంతా వింటూ, నేను వుడుక్కుంటూంటే ఆనందించారు.

ఈ ట్రిప్‍లో అత్యంత ఆనందకరమైన సంఘటన భువనచంద్ర గారింటికి నేను వెళ్ళడం. అనుకున్నట్లే, అరవింద్ గారు కారు పంపించారు. నేను దిగగానే, కారు వెనక్కి పంపించేసాను వుంచుకోకుండా. ఎందుకంటే, ఆయన ఫ్లయిట్ రాత్రిది కాన్సిల్ చేసుకుని, మధ్యాహ్నమే వెళ్ళిపోవాల్సి వచ్చిందట.

భువనచంద్ర గారి భార్య సామ్రాజ్యలక్ష్మి గారిని చూడడం అదే మొదటిసారి! అయినా ఆవిడ స్వంత ఆడబిడ్డని చూసినట్లు ఆదరించారు. భువనచంద్ర గారి ఆరోగ్యం మెరుగుపడి తేటగా కనిపించారు. లక్ష్మిగారు వంట పూర్తి చేసేసారు. సాధారణంగా వాళ్ళు చాలా ఆలస్యంగా భోంచేస్తారు పగలైనా, రాత్రి అయినా, అని నాకు తెలుసు!

మూడు అంతస్తులుగా వున్న వారి ఇల్లు చాలా బావుంది. ఆయన డాబా మీదకి తీసుకెళ్ళి, అనునిత్యం పూతతో వుందే వేపచెట్టు నుండీ, అన్నీ చెట్ల గురించీ చెప్తూ చూపించి నాకు ఎన్నో ఫొటోలు కూడా తీసారు. కింద తన రీడింగ్ రూంకి తీసుకొచ్చి కొన్ని వందల ఫొటోలు చూపించారు. ఆకు మీద పడ్తున్న వర్షపు చినుకూ, ఆకు వెనకాల పెట్టి పురుగు గుడ్లూ, తన పూజా మందిరంలో మోక్షం పొందిన బల్లీ, అప్పుడే విచ్చుకున్న పువ్వూ, సూర్యకిరణం సోకిన పచ్చికా… ఇలాంటివి.  దీపావళి నాడు పిల్లల బాణాసంచా చూసుకుని ఆనందించేట్లు, ఇవన్నీ ఆయనకి ఆనందాన్ని ఇస్తాయని నాకు తెలిసింది! చాలా చిన్న పిల్లవాడి మనస్తత్వం ఆయనది. ఆయన అందుకున్న వందలాది అవార్డులు, రాసిన వేల పాటల కేసెట్లు, రాసిన డయిరీలు, కొని గ్రంథాలయంలో దాచుకున్న పుస్తకాలు అన్నీ వివరంగా చూపించారు.

పెద్ద సుస్తీ చేసి తగ్గింది, అస్వస్థతగా, బెడ్ మీద పడుకుని వుంటారని అనుకుంటూ వెళ్ళాను, కానీ, ఆయన నన్ను చూడగానే వుత్సాహంగా ఎదురొచ్చి, ఇల్లంతా తిరుగుతూ, ఇవన్నీ గొప్ప ఆసక్తిగా అణువు అణువూ నాకు ఇంట్లో చూపిస్తూ మాట్లాడారు.

సామ్రాజ్యలక్ష్మి గారు మంచి రుచికరమైన వంటలు చేసారు. నేను వాళ్ళలాగా లేట్‍గా తినను కాబట్టి, మొహమాటం లేకుండా భోం చేశాను.

నేను భువనచంద్ర గారింటికి వెళ్తుండగా, వి.ఎన్.ఆదిత్య ఫోన్ చేసి, “అక్కయ్య గారూ, నేను సిరివెన్నెల గారినీ, వాళ్ళనీ తీసుకుని బాపూ గారింటికి వెళ్తున్నాను. మీరూ వస్తారా అని శాస్త్రి గారు అడగమంటున్నారు” అన్నాడు. నేను “లేదు, భువన్‍జీ తో కాస్త ఎక్కువ టైం గడపాలి, రాలేను” అని చెప్పాను. “అయితే, మేమూ వస్తాం” అన్నారు. వాళ్ళు అన్నమాట ప్రకారం బాపూ గారింటి నుండి సరాసరి రెండు అవుతుండగా భువనచంద్ర గారింటికి వచ్చేసారు. సాయంత్రం ఐదు గంటలకి సిరివెన్నెల గారి ఫ్లయిట్‍ట. నేను కొంచెం లేట్‌గా సాయంత్రం ఏడున్నరకి వేయించుకున్నాను.

సిరివెన్నెలగారు, పద్మావతి గారు, వి.ఎన్.ఆదిత్యలతో భువనచంద్ర గారింట్లో

సిరివెన్నెల గారు వస్తూనే భువనచంద్ర గారికీ, లక్ష్మి గారికి ‘అన్నయ్యా, వదినా ఆశీర్వదించండి’ అని కాళ్ళకి దణ్ణం పెట్టి, ఆ తరువాత భువనచంద్ర గారిని గట్టిగా కౌగిలించుకుని “నాకొక్క మాట కూడా చెప్పలేదే ఒంట్లో బాగోలేదని? రమణి చెప్పేదాక తెలీనే తెలీలేదు!” అన్నారు. “ఇప్పుడు బాగానే వుందిగా తమ్ముడూ” అని భువనచంద్రగారు అంటే, “అవును… మంద మంద… వందలాది గొంతులతో మీ కోసం ప్రార్థించే వుంటారు. ఆ దేవుని తరమా మీకు ఆయుష్షు ఇవ్వకపోడానికీ?” అన్నారు సిరివెన్నలన్నయ్య. నిజానికి మా అమ్మే పెద్ద ఉదాహరణ. మొత్తం గాణ్గాపూర్, అక్కల్‍కోట, పండరీపూర్, తుల్జాపూర్, షోలాపూర్, షిర్డీ, పెద్ద ట్రిప్ వేసి శ్రీ దత్తుడిని సేవించింది. ఆయన కోసం ఆపకుండా దివ్య పూజ చేసింది! సిరివెన్నలన్నయ్య వాళ్ళూ, ఆదిత్యలతో “భోం చేసెయ్యండి” అని ‘సుబ్బులు గారు’ అని ఆయనచే పిలవబడే లక్ష్మి గారు అడగగానే వాళ్ళు రెడీగా ‘సరే’ అన్నారు. లీ మెరీడియన్ బఫే కన్నా ఆత్మీయుల ఇంటి పప్పు అన్నం ఆనందం కదా! భువన్‌జీ హోటల్ నుంచి కారం పులుసూ, ఏదో కూరా తెచ్చారు. కానీ నిజానికి సుబ్బులు గారు చేసిన టమాటా పప్పు, వంకాయ కారం పెట్టిన కూరా, రసం, పులిహోరానే అందరికీ సరిపోయాయి. ఎటూ నేను ముందే తినేసి కూర్చున్నాను. అందరి కలిసి ఇబ్బడిముబ్బడిగా కబుర్లు చెప్పేసుకున్నాం. ఒక వంక సిరివెన్నెలన్నయ్యకి ఎయిర్‍పోర్ట్‌కి వెళ్ళే టైం అవడంతో బయల్దేరాల్సి వచ్చింది. సుబ్బులు గారు నాకూ, సిరివెన్నెల గారి భార్యకీ మంచి చీరలు పెట్టారు.

“నీకు హైదరాబాదులో కూడా పుట్టిల్లు వుందమ్మా శ్రీనగర్ కాలనీలో, ఎప్పుడైనా బావగారితో వచ్చి, ఒక పూట భోం చేసి వెళ్ళు” అన్నారు నాతో సిరివెన్నెల గారు! వి.ఎన్. ఆదిత్య వెంటనే, “మా ఇంటికీ ఆవిడేనండీ ఆడబడుచు” అన్నాడు. సిరివెన్నెలన్నయ్య నాకు “అల్లరి కృష్ణమ్మ… బొజ్జ నిండా కబుర్లే!” అని నాకు కితాబులిచ్చి, అప్పటికప్పుడు ఓ పాట కూడా కట్టి పాడారు!

మళ్ళీ లీ మెరీడియన్‍ కొచ్చి నేనూ, నాతో బాటూ ఆదిత్యా, లాబీలో కూర్చున్న పెద్దలతో కూర్చున్నాం. సత్యానంద్ గారు మళ్ళీ నన్ను ఆటపట్టించారు “ఇప్పుడేం అప్‌డేట్స్ పెడ్తారు ఎఫ్.బీ.లో?” అని. నిజానికి నేను ఎఫ్.బీ.లో పెట్టిన ఫొటోసేగా ఇప్పుడు నేను దాచుకొన్న నిధి నిక్షేపాలూ! ఇంతలో మేనేజర్లు సాయంత్రం కాకతీయా షెరటాన్‍లో జరిగే అక్కినేని జన్మదిన వేడుకలకి పాస్‍లు పట్టుకొచ్చి ఇచ్చారు. మురారిగారు ముందర రోజు అవార్దుకు పేరు పిలిచినా రాలేదు, అందుకోలేదు. కానీ నా ఊరగాయ అందుకుని “ఇది నాకు విలువైన అవార్డు” అని మెసేజ్ చేసారు! ఈసారి వడ్డేపల్లి కృష్ణ గారూ, పరుచూరి గోపాలకృష్ణ గారూ, కోడి రామకృష్ణ గారూ కూడా గొల్లపూడి గారు, సాయినాథ్, విశ్వనాథ్ గారూ, సత్యానంద్ గార్లతో కలిపి కబుర్లు పంచుకున్నారు.

నేను వెండి సరస్వతీదేవిని భువనచంద్ర గారికీ, వినాయకుడిని మురారిగారికీ ఇచ్చాను. ఇద్దరూ వారి వారి పూజామందిరాలలో పెట్టుకున్నాం అని చెప్పారు.

సాయంత్రం నేను రెడీ అయ్యాక, మళ్ళీ అందరం కార్లలో, కాకతీయాలో అరేంజ్ చేసిన అక్కినేని బర్త్‌డే పార్టీకి వెళ్ళాం.

అక్కడ నా కళ్ళు సరిపోనంత అందం కనిపించింది! జయంతి, వాణిశ్రీ, గీతాంజలీ, ప్రభా, కాంచనా, సుహాసినీ ఇంకా ఎందరెందరో తారామణులు కళకళలాడ్తూ తమతో స్టెప్ లేసిన అక్కినేని గారి జన్మదిన సంబరాలకి తయ్యారయి వచ్చారు. నాకైతే సావిత్రి గారి అమ్మాయి విజయ చాముండేశ్వరి గారితో ఫొటో తీయించుకుంటే, ఆవిడ పక్కనే నిలబడ్డంత సంతోషం కలిగింది.

కాంచన గారితో
సావిత్రి గారమ్మాయి విజయ చాముండేశ్వరి గారితో

మా గురువులు పరుచూరి బ్రదర్స్, పోకూరి బాబూరావు గారు, రేలంగి నరసింహారావు గారూ, కోడి రామకృష్ణ గారూ, భీమినేని శ్రీనివాసరావు గారూ, వందేమాతరం శ్రీనివాస్ గారూ, సాయికుమార్ గారూ అందరం ఒక రౌండ్ టేబుల్ చుట్టూ కూర్చున్నాం. ఎవరు ఎంటర్ అయినా మమ్మల్ని పలకరించే వెళ్ళాలన్న మాట!

పరుచూరి సోదరులతో
పరుచూరి గోపాలకృష్ణగారితో

ముఖ్యంగా చెప్పుకోవలసింది జయలలిత గారి ప్రవేశం…. ఒక మహారాణి దర్బార్‍లో కొస్తున్నప్పుడు చేసే హడావిడి కనిపించింది. ఎవరూ ఎదురెళ్ళకూడదు. సెల్ ఫోన్స్ వుండకూడదు, ఒక మూడు అడుగుల దూరం వరకు కటకటాల లాంటిది పెట్టి పెద్ద పెద్ద ప్రొడ్యూసర్లని కూడా వాటి వెనుక కూర్చోపెట్టారు!  

(సశేషం)

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here