జీవన రమణీయం-143

4
5

[box type=’note’ fontsize=’16’] టీవీ, సినీరంగాలలో తనదైన ప్రత్యేక స్థానాన్ని ఏర్పర్చుకున్న సుప్రసిద్ధ రచయిత్రి బలభద్రపాత్రుని రమణి నిజజీవితంలోని అనుభవాల రమణీయమైన కథనం ‘జీవన రమణీయం’ ఈ వారం. [/box]

[dropcap]నే[/dropcap]ను సినీ పరిశ్రమలోకి రావడం నా భాగ్యం, నా అదృష్టం. ఏ చేదు అనుభవం జరగకుండా 23 ఏళ్ళు ఇందులో వున్నాను. కొత్తల్లో, ఒకటో రెండో జరిగినా అవి రాసుకొచ్చాను కదూ! కొన్ని చేదు నిజాలు కూడా మీతో ఇప్పుడు పంచుకుంటాను. ఈ మధ్య నేను కొన్ని వార్తలు వింటున్నాను. గాసిప్స్ కాదు. నమ్మకంగా, నాకు దగ్గర వాళ్ళైన అమ్మాయిలు చెప్పే మాటలు! సాధారణంగా నాకు తెలిసిన అమ్మాయిలొచ్చి “మీకు డైరక్టర్స్ చాలామంది తెలుసుగా మేడం… ఓ చిన్న వేషం ఇప్పించండీ… ఇంట్లో కష్టంగా వుందీ” అని అడుగుతూంటారు. అలాగే ఓ అమ్మాయిని, ఇరవై ఏళ్ళ కూతురు వున్న ఆవిడని, ఒకరిద్దరు డైరక్టర్స్ దగ్గరకి “నా పేరు చెప్పి వేషం అడుగు” అని పంపించాను. ఆ తర్వాత ఆవిడ వచ్చి “డైరక్టర్ గారు కమిట్‍మెంట్ అడిగారు మేడం” అంది. ఈ కమిట్‍మెంట్ మాట నాకు – నేను విమెన్ ప్రొటెక్షన్ సెల్ హెడ్ అయ్యేదాకా తెలీదు! “కమిటెడ్‍గా చేస్తానని చెప్పు… పని అలాగే చెయ్యాలిగా” అంటే ఒకరిద్దరు అమ్మాయిలు నెత్తి కొట్టుకుని ‘కమిట్‍మెంట్ అంటే వాళ్ళతో గెస్ట్ హౌస్‍కి వెళ్ళి గడపాలని అర్థం!’ అని వివరించాకా, నాకు అర్థమైంది. అలాగే ఈ అమ్మాయి వచ్చి చెప్తే, షాక్ అయ్యాను… అడిగిన వాడి వయసు ఈవిడ కన్నా పది, పన్నెండేళ్ళు చిన్న! “నిజమే చెప్తున్నావా?” అని అడిగాను. “ఔను మేడం… ఎప్పుడూ షేక్ హ్యాండ్ ఇచ్చి వెళ్ళిపోతారూ… అంతేనా అని హగ్ ఇవ్వమన్నారు…” అనగానే, నాకు కళ్ళు బైర్లు కమ్మాయి! అతను అలాంటి వాడని నేను అనుకోలేదు… నాకు వీళ్ళంతా చాలా గౌరవం ఇచ్చి, “అక్కా… అమ్మా” అని పిలిచే బ్యాచ్. వేరే అమ్మాయిలతో, ఆర్టిస్టులతో ఇలాంటి వెధవ వేషాలేస్తారని నాకు తెలీనే తెలీదు! “నిజంగా తెలీదా? సినిమా ఫీల్డులో ఇన్నేళ్ళుగా వుంటూ?” అని ఎవరైనా ఆశ్చర్యపోయినా, ఇది నిజం… వేషాలివ్వడానికి ఇలా అడుగుతారని నాకు తెలీదు! గతంలో కూడా నేను కోడి రామకృష్ణగారినో, పరుచూరి బ్రదర్స్‌నో అడిగి, ఆడా, మగా చాలా మందికి వేషాలిప్పించాను. అసిస్టెంట్ డైరక్టర్స్‌గా కూడా చాలామందిని పెట్టించాను. ఇప్పుడు వీళ్ళు ఎదురు పది, పన్నెండు లక్షలిచ్చి చేర్తున్నారట! అబ్బాయిలు అయితే డబ్బులూ, అమ్మాయిలు అయితే శరీరాన్ని అడుగుతున్నారని వినికిడి! ఇంకో అమ్మాయొచ్చి “మీరు చెప్పిన డైరక్టర్ కూడా కమిట్‍మెంట్ అడిగారు మేడం… సరే అన్నా కూడా వేషం ఇవ్వలేదు” అని చెప్పి ఏడ్చింది! ‘సరే’ అనడం కాదు, వెళ్ళొచ్చిందని ఆ ఏడుపుని బట్టి అర్థమైంది! “ఓ కంప్లైంట్ ఇవ్వండి, నేను ఏక్షన్ తీసుకునేట్లు చేస్తాను!” అన్నాను. ఆ అమ్మాయి “అమ్మో… ఇంక ఎవరూ మమ్మల్ని పెట్టుకోరు, కనీసం ఆఫీస్ మెట్లు ఎక్కనివ్వరు… మీకు తెలీదు మేడం… ఇది తరతరాలుగా సాగుతోంది” అన్నారు.

చైన్నైలో భువనచంద్రగారింట్లో సిరివెన్నెలగారితో

ఓ అమ్మాయి ఏడుస్తూ “అమ్మాయికి ఇంజనీరింగ్ ఫీజు కట్టాలి మేడం, మా ఆయన నన్ను వదిలేసారు అని తెలుసుగా మీకు…” అంటూ ఏడ్చింది.

వీళ్ళంతా ఆర్టిస్టులు పాపం. పొట్టకూటి కోసం వస్తున్నారు. వేషం ఇస్తే రోజుకి పదిహేను వందల నుండీ పదివేల వరకూ రావచ్చు! కంప్లయింట్ ఇచ్చి పొట్ట కొట్టుకోవడం వీళ్ళకి ఇష్టం వుండదు. చిన్న చిన్న అబ్బాయిలు… ఇళ్ళల్లో అందమైన భార్యలు… ముత్యాల్లాంటి పిల్లలు… బోలెడు కోట్లు వచ్చి పడ్తున్నాయి, స్టార్ హీరోస్ సినిమాల వల్ల… మరిదేం కక్కుర్తి? అందులోనూ మీ తల్లుల్లాంటి వయసున్న వాళ్ళతో… తప్పు అనిపించడం లేదా? అందరూ కాదు, ఒకరిద్దరు ఇలా చేస్తున్నా తప్పే కదా! ఇంకో వుదంతం విన్నాను. ఒకప్పటి హీరో ఇప్పుడు తండ్రి వేషాలూ, కేరక్టర్ ఆర్టిస్ట్‌గా చేస్తూ “ఆవిడ్ని పెట్టారేంటి నా భార్యగా? నాకు నచ్చలేదు… కమిట్‍మెంట్‍తో వచ్చే వాళ్ళని పెట్టండి… పది రోజులు, ఔట్ డోర్ అంటున్నారు అసలే” అన్నాడనీ, అడ్వాన్స్ ఇచ్చిన ఆవిడని పిలిచి డైరక్టర్ ‘సారీ’ చెప్పి, “అడ్వాన్స్ వాపస్ ఇవ్వక్కర్లేదు కానీ… ఆయన ఫలానా తారే కావాలి అంటున్నారు అండీ” అని తీసేసారుట! “పెద్ద సినిమా, పెద్ద రెమ్యూనరేషన్… మా అమ్మకి కంటి ఆపరేషన్ చేయించచ్చు అనుకున్నాను మేడం” అని ఆవిడ కంట తడి పెట్టింది!

కైకాల సత్యనారాయణ గారితో

మా రైటర్స్ అసోసియేషన్‌లో నేను విమెన్ ప్రొటెక్షన్ సెల్ చైర్‍పర్సన్‍ని… ఒక్క అమ్మాయి కూడా వచ్చి కంప్లయింట్ ఇవ్వలేదు ఈ నాలుగేళ్ళలో… అసలు ఆ పరిస్థితులు రచయిత్రులకి రావు! వచ్చినా చెప్పరేమో అని ఇవి అన్నీ వింటుంటే అనుమానంగా వుంది! అందరూ అలాంటి వాళ్ళు కాదు… కానీ కొందరు డైరక్టర్లూ, ఊరూ పేరు లేని కొత్త ప్రొడ్యూసర్లూ, కొన్ని పెద్ద కంపెనీల్లో కేస్టింగ్ చూసే ప్రొడక్షన్ మేనేజర్లూ, కోడైరక్టర్లూ చిన్న చిన్న వేషాలు ఇవ్వడానికి కూడా కమిట్‍మెంట్ అడుగుతున్నారని అమ్మాయిలు చెప్తే విన్నాను… సినిమానే కాదు… టీ.వీ.ల్లో, వెబ్ సిరీస్‍లో కూడా! కానీ ప్రూఫ్‍లు ఏవీ? నిజంగా అడిగాడా… వేషం ఇవ్వలేదని వీళ్ళు కడుపు మంటకి ఇలా చెప్తున్నారా? ఎలా తెలుసుకోవడం? ఓ కోడైరక్టర్ చాలా మంచి అబ్బాయి. “నీ గురించి ఇలా విన్నాను నిజమేనా?” అని ఓసారి నేను అడిగితే, “మేడం నమ్మకండి… అస్సలు నటన రాని వాళ్ళకి, వేషం సూట్ అవని వాళ్ళకి ‘డైరక్టర్ గారు వద్దన్నారు’ అంటే వాళ్ళు బయటకి వెళ్ళి ప్రచారం చేస్తున్నారు!” అన్నాడు. అప్పుడు అతని మాటే నమ్మాను. కానీ ఇప్పుడు నేను పంపినావిడ వ్యక్తిత్వం నాకు తెలుసు. అబద్ధాలు చెప్పదు… అందుకే నమ్ముతున్నాను. చాలా బాధేసింది. “మరి నువ్వేం అనుకుంటున్నావమ్మా… కమిట్‍మెంట్ అయితే చెయ్యను అని చెప్పావా?” అని అడిగితే, ఆమె ఏడుస్తూ, “ఇల్లెలా గడుస్తుంది మేడమ్… పది నెలలు కరోనా వల్ల పనులు లేక మాడిపోయాం” అంది. పోస్ట్ గ్రాడ్యుయేషన్ చేసి, ఇంజనీరింగ్ చదివే పిల్లల్లున్న ఆవిడ, కేవలం డబ్బు కోసం ఇలా ఒప్పుకోవడం, అనైతికం అననా? “వెళ్ళి ఏ వుద్యోగమో, వంట పనో చేస్కో… శీలం ఎంత ఇంపార్టెంట్ తెలుసా?” అని క్లాస్ తీసుకోనా? అంటే నా ముందు తలలూపి, వెనకాల డబ్బుకి ఆశపడి అదే పని చేస్తారుగా! ఇలా చేసే తల్లుల్ని చూస్తూ, ఇంట్లో వయసొచ్చిన పిల్లలు ఎలా తయ్యారవుతారూ? అందమైన ఆడపిల్లలున్న తల్లులని కొందరు పిల్లల్ని పంపమని, హీరోయిన్ని చేస్తాం అనీ ఆశ పెడుతున్నారట! డబ్బు తప్ప ఇంకేమీ లేదా లోకంలో… డ్రగ్స్… స్త్రీ… ఈ రెండింటి మాఫియానే ప్రధానంగా చూపిస్తారు సినిమాల్లో కూడా! పది ఏళ్ళ పిల్ల కూడా ‘మాల్’ అని సంబోధించబడ్తోంది.. దాని మీద ఎక్స్‌పెక్టేషన్స్… వ్యాపారాలు! “నీకేవమ్మా, నువ్వు పని చెయ్యకపోయినా గడుస్తుంది… చూసేందుకు ఫ్యామిలీ వుంది… ఎన్నైనా చెప్తావు” అనేవాళ్ళున్నారు. కానీ ఈ అమ్మాయిలు గమనించాల్సింది ఒకటి… బస్సుల్లో, ఆటోల్లో తిరిగి మేం పని చేసుకున్నాం… కానీ ఇప్పుడు వీళ్ళకి ఒక సినిమాలో వేషం వెయ్యగానే కారు కావాలి, రెండు మూడు వేషాలు వెయ్యగానే ఈ.ఎమ్.ఐ. కట్టి ఫ్లాట్ కొనేసుకోవాలి. ఇవన్నీ కట్టడానికి నెలా నెలా డబ్బులొస్తాయా అనే ఆలోచన లేదు. స్పా… బ్యూటీ పార్లర్, మేకప్ అసిస్టెంట్, చూసిన డ్రెస్, బ్రాండెడ్ షూస్, హేండ్ బ్యాగ్స్, షాపింగ్ మాల్స్, ఫుడ్ కోర్ట్స్… ఇవన్నీ ఇన్‍స్టాల్‌మెంట్స్ మీదే… నెలా నెలా పని దొరక్క పోతే ఎలా అనే ఆలోచన ఉండదు! టీవీ, సినిమా ఎక్కడైనా… ‘షో’ బిజినెస్‍లో ‘షో’ ఆఫ్ కోసమే ఇలా కష్టాలు పడ్తారు! నా మాటలు హార్ష్‌గా వుండచ్చు. కానీ ఎన్నో సూసైడ్స్, ఎన్నో కథలూ టీవీ ఇండస్ట్రీలో చూసాకా ఇలా అంటున్నాను. ఇంత డాబు అవసరమా? ఉన్నంతలో కాళ్ళు చాపుకుంటే ఇన్ని బాధలు వుండవు కదా అని! విత్తు ముందా? చెట్టు ముందా? అన్నట్లు తప్పు అడిగే వాడిదే అని నేను అన్నా… వెళ్ళే అమ్మాయిలు వున్నారు కాబట్టే అడుగుతున్నారు వాళ్ళు… అనే వాదన కూడా వినిపిస్తోంది! ‘మీ టూ’ వల్ల కొత్తల్లో భయపడినా మళ్ళీ ఇప్పుడు ఎవరూ భయపడకుండా విశృంఖలంగా వున్నారు.  

తెలుగు సినీ దిగ్గజాలతో చెన్నైలో హోటల్ లీ మెరీడియన్‌లో లాబీయింగ్…

(సశేషం)

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here