జీవన రమణీయం-148

1
7

[box type=’note’ fontsize=’16’] టీవీ, సినీరంగాలలో తనదైన ప్రత్యేక స్థానాన్ని ఏర్పర్చుకున్న సుప్రసిద్ధ రచయిత్రి బలభద్రపాత్రుని రమణి నిజజీవితంలోని అనుభవాల రమణీయమైన కథనం ‘జీవన రమణీయం’ ఈ వారం. [/box]

[dropcap]వే[/dropcap]రే మతం, వేరే దేశం పిల్లలని పెళ్ళి చేసుకోవడం వారి మతం, తల్లితండ్రులూ ఒప్పుకోరనీ, చాలా స్ట్రిక్ట్‌గా ఫాలో అవుతాం అనీ చెప్పాడు. లిల్లీని ఇద్దరం టాక్సీ ఎక్కించాం. టాక్సీ కదులుతుంటే నా కళ్ళల్లో, లిల్లీ కళ్ళల్లో కూడా నీళ్ళొచ్చాయి… దేశం కాని దేశంలో పోయి ఒంటరి ఆడపిల్ల వుద్యోగం చెయ్యాలి కదా మళ్ళీ… అని నాకు బాధేసింది. లిల్లీ ఇప్పుడు లాక్‌డౌన్ అని చాలా కష్టం మీద కువైట్ నుండి ఇండియా వచ్చింది. మళ్ళీ ఈ వారం కువైట్ వెళ్ళనుంది!

లిల్లీ వెళ్ళాకా, ఒంటరిగా రూంలో ఏం చేస్తానని, టాక్సీ పిలిపించుకుని మళ్ళీ గోల్డ్ సూక్‌కి వెళ్ళాను. అలా అలా తిరిగి మళ్ళీ నా చెవులకి రింగులు కొందామని వెళ్తే, గోల్డ్ ధర దిగి కనిపించింది. మళ్ళీ చైన్ కొన్నాను, రెండు తులాలది! ఒక స్మార్ట్ ఫోన్, మా మేనల్లుడి కొడుక్కి బట్టలూ, పెర్‍ప్యూమ్స్ కొన్నాను. ఇండియన్ రెస్టారెంట్‌లోకి వెళ్ళి చపాతీ కూరా తిన్నాను. బాగా చెయ్యి నెప్పి పుట్టింది, అన్ని పాకెట్స్ మోస్తుంటే. ఫెర్రీ ఎక్కాలి అనిపించినా, టాక్సీ పిలిచి ఎక్కి హోటల్ రూమ్ కొచ్చి నిద్రపోయాను. సాయంత్రం అవుతుండగా తయ్యారయి, రిసెప్షన్‍కి ఫోన్ చేసి చెక్ అవుట్ అవుతున్నానని చెప్పాను. అర్ధరాత్రి 12.30కి నా ఫ్లయిట్. హోటల్ లోనే బిజినెస్ సెంటర్‍కి వెళ్ళి మా పెద్దబ్బాయితో చాటింగ్ చేశా, కంప్యూటర్‍లో. నా ఫోన్ వేస్ట్ అయిపోయింది కదా! ప్రశాంతంగా నాలుగు రోజులు ఎఫ్.బి. లేకుండా, ఫోన్ లేకుండా వున్నానా అని ఆశ్చర్యం వేసింది.

శ్రీకాంత్ అనే తెలుగు అబ్బాయి ఆ రోజు మేరియట్‍లో ఫ్రంట్ డెస్క్‌లో వున్నాడు. “మేడం పూల్ దగ్గర కూర్చోండి… బావుంటుంది” అన్నాడు. థాంక్స్ చెప్పి, వెళ్ళి అన్ని ఫ్లోర్స్ దాటి పై ప్లోర్‍లో వున్న పూల్ దగ్గర పడుకునే ఈజీ చెయిర్ లాంటి దానిలో పడుకుంటే – నేను దుబాయ్‍లో ఒంటరిగా… ఈ టైంలో వుంటానని ఎన్నడయినా కలగన్నానా? అనిపించింది. అమెరికాలో ఒక్కదాన్నీ ఫ్లయిట్స్ మారుతూ తిరుగుతున్నప్పుడూ నాకీ ఆశ్చర్యం చాలాసార్లు కలుగుతుంది! స్వంత వూళ్ళో జూబ్లీహిల్స్‌లో బస్ స్టాండ్‍లో ఒంటరిగా నిలబడడానికి భయపడేదాన్ని!

తీరా టాక్సీ పిలిపించుకుని ఎక్కి పర్స్‌లో చూస్తే 70 దీరమ్స్ వున్నాయి. డ్రైవర్‍ని ఎన్ని దీరమ్స్ అవుతాయి అని అడిగితే 100 దీరమ్స్ అవుతాయి అన్నాడు. ఎ.టీ.ఎం. దగ్గర ఆపించి, నా డెబిట్ కార్దు పెట్టి 100 దీరమ్స్ తీసాను. అదే మినిమమ్ ఎమౌంట్ మరి!

టాక్సీ డ్రైవర్, నేను డబ్బు తీసేలోగా, నా సూట్‌కేస్‍తో పారిపోతాడేమో అన్న అనుమానం రాలేదు! ఇక్కడయితే వచ్చేది. అతను నేను ఎక్కడి నుండి వచ్చానో తెలుసుకుని, తన భార్యా పిల్లల గురించి చెప్పాడు. బంగ్లాదేశీట. ఎక్కువగా పాకిస్తానీ, బంగ్లా, ఫిలిప్పీన్స్ టాక్సీ నడుపుతారు! ఇండియన్స్ ఇళ్ళల్లో పనులూ, లేబర్ పనులూ చేస్తారుట.

ఎయిర్‌పోర్ట్ లోకి వెళ్ళి, విండో షాపింగ్ చేస్తూంటే, వీరేంద్రనాథ్ గారు కనిపించి, ఆయన తన ఎగ్జిక్యూటివ్ లాంజ్ లోంచి బయటకి వచ్చేసారు. “డెజర్ట్ సఫారీకి వెళ్తానన్నారు, వెళ్ళారా?” అని అడిగితే, “ఎక్కువ మంది మనుషులు లేక కాన్సిల్ అయింది ఆ ప్రోగ్రాం” అని చెప్పారు. చాలా మంది మా తరం వాళ్ళు ఆయనను గుర్తుపట్టి వచ్చి ఆటోగ్రాఫ్‌లు తీసుకుని వెళ్ళారు. మా ఫ్లయిట్ గేట్ మార్చబడిందని ఎనౌన్స్‌మెంట్ వినబడి అటు వెళ్ళాం. అలా మూడు సార్లు మార్చారు. మేం ఇద్దరం కబుర్లలో పడడం పట్టి టైమ్ గడిచిపోయింది.

నేను ఫ్లయిట్ ఎక్కాకా, బుర్ఖాలో ఒక ముస్లిం అమ్మాయొచ్చి నా పక్కన కూర్చుంది. “నేను ఎక్కడైనా కూర్చోవచ్చు కదా… సీట్లు ఖాళీగానే వున్నాయి…” అంది. “అలా వీలవదు” అన్నాను.

ఆమెని “మీది హైద్రాబాదా?” అని అడిగాను ఉర్దూలో. “అవును… కానీ పదేళ్ళ పిల్లగా వున్నప్పుడే దుబాయ్ మా మావయ్యతో వచ్చేసాను” అంది.

ఆమెకు సీట్ బెల్ట్ పెట్టుకోవడం రాలేదు. నేను ఆమెకి సీట్ బెల్ట్ పెడ్తుంటే, చక్కిలిగింతలుట, ఒకటే నవ్వు. ఆ తర్వాత ‘దాహం, దాహం’ అని లేచిపోతోంది. ఎయిర్ ఇండియా ఎయిర్ హోస్టెస్‌లు అసలే ధుమ ధుమ, బెల్ కొడ్తే వచ్చి “ఫ్లయిట్ టేకాఫ్ అవ్వాలి… అప్పటి దాకా ఆగాలి” అని వెళ్ళిపోయారు. ఈ పిల్ల ఆగడం లేదు, వెక్కిళ్ళు కూడా పెడ్తోంది. నేను నా పర్స్ లోంచి మింట్ పిప్పర్‍మెంట్ ఇచ్చాను. ఫ్లయిట్ కదిలాకా అందరికీ జ్యూస్ ఇచ్చారు. తాగి ఇంకోటి కావాలి అంది. నేను నా చేతిలో గ్లాసు ఇచ్చేసాను.

ఇంతలో “డాక్టర్ ఎవరైనా వున్నారా?” అని ఎనౌన్స్‌మెంట్  ఇచ్చారు. ఎవరో ముసలాయనకి మైల్డ్ హార్ట్ ఎటాక్ వచ్చిందట. ఈ పిల్ల పేరు జెన్నత్. “ఏం అంటున్నారు? విమానం పడిపోతోందటా?” అని అడిగింది. నేను ఆ అనుమానానికి తల కొట్టుకుని, విషయం చెప్పాను. వెంటనే “హా! అల్లా… కిందకి దింపమనండి విమానాన్ని. ఇలా నేలా, ఆకాశం కాని చోట్ల ఎలా పోతాడు పాపం” అంది.

“ఆయన్నే అడగాలి నాకేం తెలుసు” అనబోయి, తమాయించుకుని, “ఏం కాదు, భయపడకు. విమానం ఎక్కడంటే, అక్కడ ఆపకూడదు” అన్నాను. ఆమె భయపడ్తోందని మాటల్లోకి దించి, “మీ ఇంట్లో ఎవరెవరుంటారు?” అన్నాను.

“ఇద్దరు ఆపాలు, ఇద్దరు అన్నలూ, నేను, నా తరువాత ఒక చెల్లీ, తమ్ముడూ… ఇంకా ఎంతమంది పుట్టారో నేను వెళ్ళాకా, తెలీదు” అంది. నిజమే, పది ఏళ్ళ పిల్లగా వెళ్ళిందట మరి! “అక్కడ ఏం పని చేసేదానివి?” అడిగాను. “మా మామా పిల్లల్ని చూసేదాన్ని, వంట చెయ్యడం, మిగతా పనులు కూడా వచ్చు” అంది. ఆమె తెల్లని చేతులు చూస్తుంటే, ఆమె మొహం కూడా ఖచ్చితంగా అందమైనదే అయి వుంటుంది అనిపించింది.

“నువ్వు ఇలా బురఖాలో వుంటే, నీ కోసం వచ్చిన మీ నాన్నా, అన్నలు నిన్ను ఎలా గుర్తుపడ్తారు?” అన్నాను. “నేను గుర్తు పడ్తాను వాళ్ళని… ఫొటోల్లో చూసాను” అంది.

ఫుడ్ వచ్చాకా, రుచి చూసి, “ఏం బాగాలేదు” అంది. “తిను, ఆకలి వేస్తుంది మళ్ళీ” అని నా ప్లేట్ లో ఫ్రూట్స్ కూడా ఆమెకే ఇచ్చాను. తింది.

నేను అంత అర్ధరాత్రి తినే సాహసం చెయ్యక, పెరుగు ఇస్తే అది మాత్రం తిన్నాను. ఆమె బురఖా లోంచే తింటుంటే, ఆశ్చర్యంగా చూసాను.

నేను రాజీవ్‍గాంధీ ఇంటర్నేషనల్ ఎయిర్‍పోర్ట్‌లో దిగి జెన్నత్ కోసం చూస్తే, బ్యాగేజ్ బెల్ట్ దగ్గర కనిపించలేదు. బయటకొచ్చేసరికి మా వారూ, వీరేంద్రనాథ్ గారూ మాట్లాడుకుంటూ కనిపించారు.

మా డ్రైవర్ కారు తెచ్చి, నేను ఎక్కుతుండగా, జెన్నత్ బురఖాలోంచి నాకు చెయ్యి ఊపుతూ, కొద్దిగా బురఖా ఎత్తి, నవ్వుతూ కనిపించింది. నవ్వుకున్నాను.

లిల్లీకి ఇంటికి రాగానే మెయిల్ ఇచ్చాను – ‘నువ్వెళ్ళాకా మళ్ళీ గోల్డ్ సూక్‌కి వెళ్ళొచ్చాను, క్షేమంగా చేరాన’ని. తను ఎయిర్‍పోర్ట్ నుండి హోటల్ రూంకి ఫోన్ చేసి, లిఫ్ట్ చేయలేదని కంగారు పడిందట. ఇంటికొచ్చేదాకా మా వారికి దుబాయ్ ఎంత బావుందో చెప్తూనే వున్నాను!  

(సశేషం)

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here