జీవన రమణీయం-149

0
9

[box type=’note’ fontsize=’16’] టీవీ, సినీరంగాలలో తనదైన ప్రత్యేక స్థానాన్ని ఏర్పర్చుకున్న సుప్రసిద్ధ రచయిత్రి బలభద్రపాత్రుని రమణి నిజజీవితంలోని అనుభవాల రమణీయమైన కథనం ‘జీవన రమణీయం’ ఈ వారం. [/box]

[dropcap]నే[/dropcap]ను చిన్నప్పటి నుండీ దేవుడిని నమ్ముతాను. మహిమలు విని నమ్ముతాను కూడా! కొన్నిసార్లు ఎంత బలమైన వ్యక్తిత్వం వున్న వ్యక్తులయినా, కొందరి చెప్పుడు మాటల వల్లా, ప్రభావం వల్లా వారి మాయలో పడి, వారు చెప్పేదంతా నిజం అని నమ్మడం జరుగుతుంది! ముఖ్యంగా రోగాల బారి నుండి విముక్తులు కావడానికీ, దారిద్ర్యం బారి నుండి తప్పించుకోడానికీ, గుళ్ళో పూజలూ, ఇంట్లో మొక్కులూ, జపాల వరకూ సరే, సాధువులూ, బాబాలూ, మత గురువులూ దగ్గరకి వెళ్ళి, వారు చెప్పే నివారణోపాయాలని విని, చెప్పినట్టల్లా చెయ్యడం చూస్తాం! నా జీవితంలో 1988 నుండీ 89, 90 వరకూ ఒక ఇంట్లో అద్దెకి దిగడం వలన, సత్యసాయిబాబా ప్రభావం బాగా వుండేది! భజనలూ, అను నిత్యం బాబా గారు చేసే మహిమలూ వీటి గురించే మాట్లాడడం; ఆ ఇంటి ఓనర్ ఇంట్లో తీర్థం ఇవ్వడం వలన జనం బాధలు పోగొట్టడం, ఎవరింట్లోనో విభూతి ధారగా, పటాల నుండి కురుస్తోందనీ, లేదా అమృతం పటాల నుండి జాలువారి కింద పెట్టిన గిన్నెల నిండా పొర్లుతోందీ, అమృత బిందువులు పటాల మీద మెరుస్తున్నాయి, ఈ తీరుగా విని నేనూ వారితో వెళ్ళి ఆ స్థలాలని దర్శించేదాన్ని! ఆ సమయంలో అవన్నీ నేను పరిపూర్ణంగా నమ్మాను… ఇప్పటికీ సత్యసాయిని నేను మనసులో ఆరాధిస్తాను. కానీ ఆయన భక్తుల ముసుగులో మా ఇంటి ఓనర్ లాంటి మోసగాళ్లు చేసే నీచమైన పనులు నేను తెలుసుకున్నాకా, ఆ భజనలకీ, వారింట జరిగే ప్రవచనాలకీ, తీర్థాలకీ దూరంగా, ఇల్లు మారి వచ్చేసాను. నాకు 20 ఏళ్ళకి పెద్దబాబు పుట్టాడు. 23 ఏళ్ళకి రెండవ బాబు పుట్టాడు. శ్రీనగర్ కాలనీ నుండీ, అలవాటయిన ఏరియా అని ఇల్లు మారి ఈ ఏరియాకి వచ్చేసాము. ఆ ఇంటి ఓనర్, ఆయన భార్యా చాలా భక్తిగా సత్యసాయి భజనలూ, ప్రచారంలోనే కాలం గడిపేవారు. వారికి ఇద్దరు పిల్లలు… నాకు ఓ నాడు అనుకోని విధంగా బిడ్దకి పాలిస్తున్న నన్ను ఎవరో, వేసిన తలుపు కన్నం గుండా చూస్తున్నట్టు అనిపించింది. నేను బాబును పడుకోపెట్టి బయటకి వస్తే, వడి వడిగా వెళ్ళిపోతున్న ఇంటాయన కనిపించాడు. నా భ్రమ అనుకున్నాను. ఇంకోసారి బట్టలు ఆరేస్తూ, నేను కిందకు చూస్తే, వరండాలో పడుకున్న ఆయన ముద్దు పెడుతున్నట్టు పెదవులు సున్నాలా చుట్టి సైగలు చేస్తున్నట్టు అనిపించింది! ఇంతలో ఆయన భార్య పిలవడంతో లేచి వెళ్ళిపోయాడు.

ఓ సారి మా పెద్దమ్మ కూతురు మెహదీపట్నంలో వుంటుంది, చూసి వస్తాననీ, రెండు రోజులు అక్కడే వుంటాననీ ఇంటావిడతో చెప్పి, నేను ఇంట్లోకి వచ్చేసరికీ, ఆయన నా వెనకాలే వచ్చి, నన్ను చేతులు పట్టుకుని, “నువ్వు రెండు రోజులు వుండవద్దు, నేను వుండలేను… నిన్ను చూడకుండా వుంటే ప్రాణాలు పోతాయి… ప్లీజ్” అని, ఇంకో అడుగు ముందుకి వెయ్యబోయాడు. నా కంత బలం ఎక్కడి నుండి వచ్చిందో, బలంగా వెనక్కి తోసి, చెంప చెళ్ళుమనిపించా! నేను అప్పటికే బోలెడు నవలలు చదివి, మనుషుల నైజాలని అవపోశన పట్టినదాన్ని! పెన్ పట్టుకోలేదింకా, కానీ నాలో నిద్రాణమైన రచయిత్రి వుంది! పుస్తకాలు చదవకపోతే లోకం పట్ల అవగాహన వుండదు… ఇటువంటి వారి తీయటి మాటలకీ, వుచ్చులకీ పడిపోతారు! చాలా మంది స్త్రీలకి పక్కింటి బాబాయిగార్ల వల్లా, ఇంటి ఓనర్‍ల వల్లా, వయసు మళ్ళిన బంధువుల వల్లా ఇలాంటి అనుభవాలు జరుగుతాయి! కాని బయటికి చెప్పరు! కనీసం మొగుడికి చెప్పుకోరు… దానికి ప్రధాన కారణం… “నువ్వు సరిగా వుంటే, వాడు నీ వెనకాల ఎందుకు పడ్తాడు? నీలో తప్పు వుండే వుంటుంది… నవ్వుతూ మాట్లాడావేమో… రెచ్చగొట్టే చేష్టలు చేసావేమో…” అనే అనుమానపు వెధవల వల్ల ఆడది ఇలాంటివి బయటకు చెప్పుకోలేక మథనపడడం, లొంగిపోవడం, లేదా ఆత్మహత్య దాకా వెళ్ళడం చేస్తుంది! నేను ఆ కోవకి చెందిన దాన్ని కాదు కాబట్టి, వాడు “సారీ సారీ ఎవరికీ చెప్పకు….” అని నా కాళ్ళు పట్టుకున్నాకా… ‘భక్తుడి ముసుగులో ఆడవాళ్ళకి మాత్రమే ప్రత్యేకంగా తీర్థాలు ఇచ్చేది ఇందుకట్రా… నీ పని చెప్తా!’ అని మనసులో అనుకుని, అతని వెళ్ళగొట్టి తలుపేసుకుని, గ్లాసెడు మంచినీళ్ళు తాగి ఏం చెయ్యాలా అని ఆలోచించా!

ప్రతి గురువారం ఆయన ప్రత్యేక మందిరంలో తీర్థానికి వచ్చే ఒకావిడ నా మనసులో మెదిలింది. ఆమె చాలా అందంగా వుండేది… ఇంట్లో మంచం మీదే వుండే పన్నెండేళ్ళ ఆడపిల్ల… ఆమె ఆ పిల్ల కోసం తీర్థానికి వచ్చినప్పుడు ఈయన తలుపు మూసి పూజలు చెయ్యడం నేను రెండు మూడు సార్లు చూసాను! ఇప్పుడా పూజలు ఎందుకో అర్థం అయ్యాయి… మా వీధి చివర ఒక పెద్దావిడ, ఒక రోజున నన్ను పేరంటానికి పిలిచి “మీ ఇంటాయన మీతో చాలా క్లోజ్‌గా వుంటున్నాడా? మీ అబ్బాయిని ఎత్తుకుని తెగ తిరుగుతున్నాడు… చిన్నపిల్లవి… చూడముచ్చటగా వుంటావు.. జాగ్రత్తమ్మా” అని బొట్టు పెట్టి పండూ తాంబూలం ఇచ్చింది. ఆవిడ అలా ఎందుకు అందో అప్పుడు ఆలోచించలేదు. ఇలా ఆలోచిస్తూ… నాలో ఏమైనా తప్పు వుందా? ఆయన సైగలు పట్టించుకోకపోవడం వలన నేను ఆమోదిస్తున్నాను ఆయన వెధవ వేషాలు అనుకున్నాడా? ఆలోచిస్తుంటే, నన్ను చాలాసార్లు పిల్లవాడిని ఎత్తుకొనే మిష మీద ముట్టుకోవడం, వాడి బుగ్గల మీద ముద్దు పెడ్తూ, “వీడు చాలా అదృష్టవంతుడు, అమ్మ పోలిక” అనడం లాంటివి మెదడులో సినిమా రీళ్ళలా తిరిగాయి! అంటే మెదడు అచేతనావస్థ నుండి ఆలోచించడం మొదలుపెట్టిందన్న మాట! ఇంతలో తలుపు చప్పుడైంది. తలుపు తీస్తే పనిమనిషి సులోచన వచ్చింది. “ఏంటమ్మా… రెండు రోజులు వుండరటగా వూళ్ళో?” అంది. సులోచన తక్కువ మాట్లాడే టైప్, పైగా తన మొహం ఎప్పుడూ సీరియస్‍గా వుంటుంది. నేనూ ఎక్కువగా మాట కలిపేదాన్ని కాదు. ఇంటి వాళ్ళ ఇంట్లోనూ తనే పని చేసేది. ఆమె గిన్నెలు తోముతుండగా వెళ్ళి నేను, “సులోచనా… ఇంటి ఓనర్ మంచి వాడేనా?” అని అడిగాను.

ఆమె ఓ నిమిషం నా వైపు చూసి, “ఆ భూదేవమ్మకీ, ఆయన పెళ్ళానికీ తెలవాలా వీళ్ళు తలుపులు మూసుకొనుడు ఏందో! ఆ ఇకఇకలూ, పకపకలూ ఏందో? నన్ను ఓ దినం ఎనక నుండి వచ్చి బిగ్గర పట్టిండు. ‘చెప్పు తీస్తా… లం… కొడకా’ అన్నా. అప్పటి సంది నాతో కరెష్టుగా వుంటడు, మొకం పక్కకి వేసుకుపోతాడు…” అంది.

నా గుండెలు అదిరిపోతున్నాయి వింటుంటే. “మరి వాళ్ళావిడతో చెప్పలేదా?” అన్నాను.

“ఆమె కెల్లే ఆడీ తీర్న సిత్తకార్తె కుక్క లెక్క అవబట్టిండు, ఆమె కన్నీ తెలిసే వూరుకుంటది! భూదేవమ్మ బిడ్డకి బాగాలేదని వస్తే, వీడు చేసే ఏసాలు ఆ అమ్మకి తెలవవా? అన్నీ తెలుసు… మగడు బంగ్లా కట్టిండు, కారు కొన్నడూ అని మురుస్తది, ఇయన్నీ పట్టించుకోదు… ఎప్పటికీ ఆ భజనలూ, ఆమె లీడరీ చేస్తే, ఆమె మాట విని ఎంట తిరిగేటోల్లూ వుండాలి… సాలు ఆమెకి!” అని కుండ బద్దలు కొట్టినట్టు ఇద్దరి కేరెక్టర్లూ చెప్పేసింది.

“ఆ కొడుకు సదూకోడు, ఫెయిల్ అయితుంటడు, ఆ బిడ్ద తనలో తాను ఏడుస్తా, అమాస వస్తే కేకలు పెడ్తుంటది… కాలేజీ సదివే పిల్లా! ఈళ్ళు ఏరేటోళ్ళకి తీర్దాలు ఇచ్చుడూ… వూదీ పెట్టుడూ ఏందమ్మా? ఎవరు నమ్ముతరు? మీలాంటి సదూకున్నోళ్ళు తప్ప” అంది. తర్వాత నా మొహం చూసి “మీ అంత సిన్న వయసులో వున్న ఆమె, సక్కగున్నామె ఇంట్లకి అద్దెకి వచ్చిందని, అందరూ బుగులు పడ్తున్నారు… ఆడు సక్కనోడు కాదమ్మా… జాగర్త” అంది సులోచన.

సులోచన ఎంతో క్లారిటీ వున్న మనిషి. ఆ కుటుంబం మొత్తం అసహజంగా వుండడాన్ని నేను ఎందుకు కనిపెట్టలేకపోయానా? అని ఆలోచించాను. ఎంతో అందంగా వుండే, డిగ్రీ చదివే ఆ కూతురు ఎప్పుడూ మూడీగా “భయం… భయం” అంటూ ఏడుస్తూ వుండేది! ఆ పిల్లాడు ఇంకా హైస్కూలే… చదువు రాదు కానీ వాడొక్కడే కాస్త సహజంగా అల్లరి చేస్తూ, బావుండేవాడు! ఆ ఇంటావిడకి మొగుడి సంగతి చెప్తే లాభం లేదని తెలిసింది! నేను పిల్లలిద్దరినీ తీసుకుని ఇంటికి తాళం పెట్టి అక్క దగ్గరకి వెళ్ళాను.

ఆటోలో మెహదీపట్నం వెళ్తున్నంత సేపూ గుండె అదిరిపోతూనే వుంది. అనుకుంటాం కానీ ఆడవాళ్ళకి ఇలాంటి సంఘటనలు జరిగినప్పుడు చాలా భయం వేస్తుంది! నేను చాలా ధైర్యస్తురాలిని అని నా అభిప్రాయం. ఇలాంటిది, సినిమా ఇండస్ట్రీ కొచ్చాకా, ఒకే ఒక్కసారి మళ్ళీ జరగడం, అప్పటికి ధైర్యం రావడం వలన నేను సరైన బుద్ధి చెప్పడం సదరు వ్యక్తికి జరిగింది!

పెళ్ళికి ముందు నాతో వెధవ వేషాలు వేసినవాళ్ళు కుర్రాళ్ళు కాబట్టి, వెధవ వేషాలు సహజం అనుకుని నేను అమ్మమ్మకో, అన్నయ్యకో చెప్పి, వాళ్ళ వైపు చూడకుండా నా జాగ్రత్తలో నేను వుండేదాన్ని! కానీ మా అమ్మ ఆఫీసులో పని చేసే ఒక ఆయన, భార్యా, ఇద్దరూ పిల్లలు వున్న వ్యక్తి… నాకు స్కూటర్ మీద లిఫ్ట్ ఇస్తానని చెప్పి, నన్ను తాకడం, “నువ్వెంత బావుంటావో తెలుసా… నిన్ను ప్రేమిస్తున్నాను” అనడం, నేను భయపడి అమ్మతో చెప్పినప్పుడు, అమ్మ నాతో ఒకే మాట చెప్పింది. “మగాడు, తాత వయసు అయినా, కొడుకు వయసు అయినా, వాడికో వయసు వచ్చాకా మగాడే! మనం జాగ్రత్తగా వుండాలి. 100% భద్రత వుందని ఏ వ్యక్తి వల్లా భావించకూడదు! ఎంతటి మంచి వాడికైనా, దైవ భక్తుడికైనా ఈ మాయరోగం పుట్టచ్చు” అంది.  

(సశేషం)

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here