జీవన రమణీయం-151

0
7

[box type=’note’ fontsize=’16’] టీవీ, సినీరంగాలలో తనదైన ప్రత్యేక స్థానాన్ని ఏర్పర్చుకున్న సుప్రసిద్ధ రచయిత్రి బలభద్రపాత్రుని రమణి నిజజీవితంలోని అనుభవాల రమణీయమైన కథనం ‘జీవన రమణీయం’ ఈ వారం. [/box]

[dropcap]”పి[/dropcap]న్నిగారూ… ఇవాళ నాగుల చవితి, నాగదేవత గుడికెళ్ళి పాలు పోద్దాం, మా వారు జీప్ పంపిస్తారు”

“పిన్నిగారూ ఇవాళ వైకుంఠ ఏకాదశి కదా… మా వారు జీప్ పంపిస్తారు, పొద్దుటే వెంకటేశ్వరుడిని దర్శిద్దాం…”

“ఇదిగోండి ఏకాదశి ఉపవాసం విడిచాను… ఉప్పుడు పిండి, వంకాయ పులుసు పచ్చడీ, ఇదిగోండి అనంతుడి వ్రతం వుజ్జాపన చేసాం.. సొజ్జప్పాలు…” ఇలా ప్రతీ రోజూ ఏడాదిలో వారింట్లో పూజలు, వ్రతాలూ, తద్దినాలూ. ఆవిడ మడికట్టు చీరా, వేలి ముడీ, నీరసం మొహం.

ఆవిడ పేరు సోమిదేవమ్మ అనుకుంటే, ఆయన్ని సోమయాజులు గారనుకుందాం! ఆయన ఎర్ర పట్టు పంచే, ఉత్తరీయం, అడ్డనామాలతో, ఆదిశంకరాచార్యలా మా అత్తగారికి పొద్దుటే దర్శనం ఇచ్చేవాళ్ళు! ఇంక మెయిన్ హీరోయిన్ వారి పెద్దమ్మాయి అలివేలు… ఆ పిల్లని చూస్తే మా అత్తగారు, నాతో పోల్చుకుని, ‘ఈ పిల్ల నా కోడలైతే, ప్రతీ రోజూ ఇంత కార్తీక సోమవారమే కదా… పార్వతీ దేవే ఇక్కడ తిరిగి పుట్టిందా?’ అన్నట్టు ఆ పిల్లను ప్రేమించేవారు! నేను డిగ్రీ ఫైనల్ ఇయర్ ఎగ్జామ్స్ చదువుతున్నానా, ఆ పిల్ల ఇంటర్‍మీడియట్ రెండో సంవత్సరం. పెద్ద వయసు తేడా లేదు… కానీ తల్లితో బాటు నాలుగింటికి లేచి తల స్నానాలూ, మడీ, కుంపట్లో బొగ్గులేసి, కాఫీలు, తొక్కుడు లడ్డూలూ, అరిశలూ చెయ్యడం… ఎప్పుడూ తన ఈడు వారితో స్నేహం చేసినట్టు కానీ, తిరిగినట్టు కానీ నాకు అనిపించలేదు!

ఆ పిల్లకో చెల్లి, ఈ చిన్నది అతి వాగుడు… పన్నెండేళ్ళకే “అయ్య దాని మొహమేడ్చా… నీ అందం కాకెత్తుకుపోనూ…” లాంటి ముదినాపసాని మాటలూ, ఇలా జీప్‍లో గుడులకి మడి కట్టుతో వెళ్ళడం, ప్రసాదాలూ, నైవేద్యాలూ. లాస్ వేగాస్‍లో మొదటిసారి కాసినోకి వెళ్ళిన వాళ్ళకి కళ్ళు గిర్రున తిరిగి “అబ్బా! ఇది కదా ప్రపంచం” అనిపించినంత ‘కిక్కు’ మా అత్తగారికి ఈ కుటుంబం ఎదురింట్లోకి రావడం వల్ల దొరికింది.

సరే… మా వారికీ, మావగారికీ “ఆ సోమయాజులు గారిని చూసి నేర్చుకోండీ… ఏం భక్తీ? ఏం ఆచారం?” అన్న క్లాసులు రోజూ వుండేవి! నన్ను ఏమీ అనలేక, “ఆ అలివేలు ఎవరింటికి వెళ్తుందో వాళ్ళు అదృష్టవంతులు… ఆ అమ్మాయిని చూస్తే ముచ్చటేస్తుంది!” అనేవారు పాపం! నాకు మాత్రం ఆ వయసులో ఈ నాలుగింటికే లేచి తల్లితో బాటు తలస్నానాలూ, ఉపవాసాలు ఏంటి? నేనూ మా ఉమా తిరుగుతున్నట్లు ఆటోలో రామకృష్ణా థియేటర్స్, ఆనందభవన్ హోటల్‍లో టిఫిన్స్ లేకుండా… ఓ ఎగ్జిబీషన్ లేదు… టాంక్‌బండ్ లేదు, ఆ అందానికి తగ్గ అలంకరణ లేదు… నీరసం మొహం, వేలి ముడీ అని తెగ జాలేసేది!

మా అత్తగారు ఈ ఆదర్శ సంప్రదాయ కుటుంబం గురించి రోజుకో సారైనా మాకు లెక్చర్ ఇచ్చి “అలా వుండాలి, ఇమర్శగా” అనేవారు! ‘ఇమర్శ’ అంటే ఏమిటో ఆ పదానికి అర్థం ఏమిటో నాకు ఇప్పటికీ తెలీకపోయినా, ఆ సోమయాజులూ, సోమిదేవమ్మ గారూ ఇమర్శగా వున్నారని అనుకునేదాన్ని!

ఓ నాడు అమ్మ దగ్గరకి వెళ్ళినప్పుడు “నాకు అత్త పోరూ, ఆడబిడ్డ పోరూ కాదు. ఈ ఎదురింటి సోమయాజుల కుటుంబం పోరు ఎక్కువగా వుందే అమ్మా” అన్నాను.

అమ్మ కొంచెం నవ్వి, “ఆ సోమయాజులు గారూ, తారాదేవి ఇంట్లోనే (పేర్లు మార్చాను) వుంటున్నారుటగా, ఆఫీసులో చెప్పుకుంటున్నారు…” అంది. అమ్మ కూడా ఆర్.టి.సి.లోనే ఉద్యోగం చేసేదిగా!

“అంటే?” అన్నాను.

“పాపం… ఆ సోమిదేవమ్మ గారూ జపాలు, తపాలు అని మునిగితేలుతుంటే, ఈయన ఇక్కడ తార ఇంట్లోనే మధ్యాహ్నాలు గడిపేస్తున్నారు అని, కాలనీలో అందరికీ తెలుసు. పనిమనిషి మోసేసింది! అయినా మీ అత్తగారికి తెలీకపోవడం విచిత్రం… నువ్వేం అనకు… మనకెందుకు?” అంది.

ఆ తార ఇదివరకు మా దూరపు బంధువు బాబాయ్‍తో ఇలాగే ‘చిన్నిల్లు’ సెటప్ చేయిస్తే, ఆ వరుసకు నాకు పిన్ని అయిన ఆవిడ వచ్చి ఆలగోల పాలగోల చేసి, మొగుడికి వాళ్ళ బాబాయ్ ఇన్‌ఫ్లుయెన్స్‌తో తిరుపతికి ట్రాన్స్‌ఫర్ చేయించి తీసుకెళ్ళింది! తిరుపతి వెంకన్న అయినా అతని బుద్ధి మారుస్తాడనీ!

ఆ తారాదేవి గురించి నేను కూడా విన్నాను… కాబట్టి, తిరువళ్వార్‌లా పట్టుపంచే, పట్టినామాలుతో వుండే ఈయన అవతారం తలచుకుంటే, నాకు నమ్మబుద్ధి కాలేదు. మధ్యాహ్నం ఆ ఇంట్లో పని చేసే శ్యామలమ్మ వచ్చి, “ఆ పంతులు సంగతేం అడుగుతావ్? ఇంట్ల ఇంగ్లాలు (నిప్పు) కడుగుతుంది ఆ అమ్మ… మడీ… మడీ అని.. ఈయన ఆమ్లెట్లు తింటడు ఈడ… తారమ్మ తాన!” అని తేల్చి చెప్పేసింది!

నా మనసు అప్పటి నుండీ సోమిదేవమ్మ గారిని చూస్తే జాలితో నిట్టూర్చేది. అలివేలుతో ఓసారి “లవ్ స్టోరీ చదివావా, ఎరిక్ సెగల్‍ది?” అని బుక్ ఇచ్చాను. “మా నాంగారూ చూస్తే చమ్డా లెక్క తీస్తారు” అంది ‘లవ్’ అన్న మాట చూసి! ఓ పుస్తకం, సినిమా, ప్రపంచ జ్ఞానం లేకుండా ఆ పిల్లని అలా పెంచారు!

ఈలోగా  నేను పిల్లాడికి తొమ్మిదో నెల వచ్చాకా, మళ్ళీ మాకు అలవాటైన ఆనంద్‍బాగ్ ఏరియాలో ఇల్లు తీసుకుని వచ్చేసాం… ఆ తర్వాత కొన్నాళ్ళకి మా అత్తగారింటికి వెళ్ళిన నేను “జీప్ బాబాయ్ గారూ వాళ్ళు  బావున్నారా? పిన్నిగారు పూజలు చేస్తున్నారా? మొన్న శివరాత్రికి అభిషేకాలు చేసారా?” అని అడిగాను.

రచయిత్రి అత్తగారు

“ఆ… ఆయన అభిషేకాల్లోనే మునిగి తేలుతున్నాడు… ఈ పిచ్చిది ఇక్కడ స్నానాలతో నానిపోయి, ఉపవాసాలతో శుష్కించిపోతోంది. ఆయన ‘నీ మొహం చూడాలంటేనే విసుగేస్తోంది’ అని ఆ తార ఇంట్లోనే జల్సా చేస్తున్నాడట!” అని కోపంగా చెప్పారు! నాకు చింతామణి సినిమా గుర్తొచ్చింది! జమున ఎంత చక్కగా వీణ వాయించినా, పాదపూజ చేసినా, ఎంత అందంగా వున్నా, ‘స్వామీ స్వామీ’ అని ఎంత దేవుడిలా చూసినా – మరి వారాంగన చింతామణి, భానుమతి ఆకర్షించినట్లు! మొత్తానికి మా మావగారికీ, నాకూ “ఆ ఎదురింటి వాళ్ళు చూడండి… ఎంత మడీ? ఎంత ఆచారం?…” బ్యాండ్ తప్పింది.

ఇలా అన్నీ అర్ధోక్తిలో ఆపేస్తున్నాను ఏంటి అనుకుంటున్నారా?… మా పాత ఇంటి ఓనర్, నా వెంటబడి ‘ప్రేమిస్తున్నాను, నిన్ను చూడకుండా బతకలేను’ అన్న ఆయన్ని నేనూ, మా వారూ ఏమీ అనకుండా తేలిగ్గా వదిలిపెట్టేసి, ఇల్లు మారి వచ్చేసి, మేం ఇల్లు కట్టుకున్న కొత్తలో ఓ రెండేళ్ళ తరువాత, శివరాణి అనే ఆవిడ మా పాత ఇంటి దగ్గరే వుండేది, ఆవిడ ఓనాడు కలిసి, మా ఎడ్రస్ తెలుసుకుని, వచ్చి “మీరు వచ్చేసాకా ఆ తీర్థాల బాబాని, మీ తరువాత ఇంట్లోకి వచ్చినావిడ మొగుడు చితక్కొట్టాడు… వాళ్ళావిడతో పిచ్చివేషాలు వేసాడుట!” అంది. నేను నవ్వి “మా వారికా పని తప్పింది… లేకపోతే ఈయనే కాళ్ళూ చేతులూ విరగ్గొడ్తానన్నారు” అని సంగతి చెప్పాను. ఆవిడ “మీతో ఏవీ వెధవ వేషాలు వెయ్యకపోతే విచిత్రం కానీ, వేస్తే ఏం విచిత్రం? ఆ పిచ్చి కుటుంబాన్ని ఇంకా అందరూ నమ్ముతూనే వున్నారు.. శివుడు కలలోకొచ్చి ‘పూర్వ జన్మ పాపఫలం వల్ల నీ భర్తపై అపవాదు పడి అలా దెబ్బలు తిన్నాడు అని చెప్పాడు’ అని చెప్పుకు తిరుగుతోందావిడ” అంది శివరాణి.

నాకైతే ఆ పతివ్రతని చెప్పుతో కొట్టాలనిపించింది! ఆవిడ వల్ల ఎందరు ఆడవాళ్ళు మానసిక వ్యథ అనుభవిస్తున్నారు. పిచ్చి కుక్కలా ఈవిడ వూరి మీదకి వదిలిపెట్టేసింది… అదీ దేవుడి పేరుతో. నామాలు పెట్టుకుని, పట్టుపంచె కట్టుకుని ‘తీర్థం ఇస్తా, చేతులు చూస్తా…’ అనే వాళ్ళని అస్సలు నమ్మకూడదు! నా చిన్నప్పటి నుండే మగపిల్లలు ఆడపిల్లలకి లైన్ వేయాలంటే, “ఏదీ నీ చెయ్యి చూడనీ! నాకు పామిస్ట్రీ తెలుసు” అంటూ చెంబిస్త్రీ కూడా రాని వాడు అనడం, నాకు అనుభవమే!

ఇలా దేవుడిని అడ్డు పెట్టుకుని తమ మానసిక రుగ్మతలు దాచిపెట్టి, లోకాన్ని మోసం చేసేవాళ్ళు ఒకరైతే, ఇంకొకరు తమలోని పశుప్రవృత్తిని తీర్చుకునేవాళ్ళు అయివుంటారు… అలాంటి వాళ్ళు కాకమ్మ కబుర్లూ, దేవుడి మహిమలు కల్పించి చెప్తుంటే నమ్మాలనిపిస్తుంది! మా ఇంటి ఓనర్‌కి ప్రతి గురువారం సత్యసాయిబాబాతో పర్సనల్ మీటింగ్ వుండేది! ఈయన పుట్టపర్తి వెళ్తే ఇక్కడ మాట్లాడిన టాపిక్ అక్కడ ఆయన కంటిన్యూ చేసేవారుట!  

(సశేషం)

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here