జీవన రమణీయం-155

0
5

[box type=’note’ fontsize=’16’] టీవీ, సినీరంగాలలో తనదైన ప్రత్యేక స్థానాన్ని ఏర్పర్చుకున్న సుప్రసిద్ధ రచయిత్రి బలభద్రపాత్రుని రమణి నిజజీవితంలోని అనుభవాల రమణీయమైన కథనం ‘జీవన రమణీయం’ ఈ వారం. [/box]

[dropcap]నే[/dropcap]ను ముందు చెప్పానుగా, మా రెండవ అబ్బాయి మాస్టర్స్‌కి నార్త్ కరోలినా స్టేట్ యూనివర్సిటీకి ఫాల్‌లో వెళ్ళాల్సింది, వాడికి ఏక్సిడెంట్ అయి రిస్ట్ విరగటం వల్ల, ఆరు నెలలు వెనక్కి వెళ్ళి, మళ్ళీ స్ప్రింగ్‌లో ఆగస్ట్‌లో వెళ్ళడానికి ఖరారైంది. ఈ లోగా మాధవ్ దుర్భా మళ్ళీ NATA కల్చరల్ ఛైర్‌పర్సన్ అయి నన్ను ‘గెస్ట్’గా పిలిచాడు. నేను జూలై 4 నుండీ 6 వరకూ అట్లాంటాలో జరిగే నాటా సభల్లో తెలుగు సాహిత్య ప్రసంగాల్లో, టీవీ, సినిమా, సెన్సార్ విభాగాల గురించి మాట్లాడడానికి ఆహ్వానించబడ్డాను.

ఆగస్ట్ 12న కృష్ణకాంత్ రేలీ వస్తాడు, కాబట్టి, నేను ఆగస్ట్ దాక అమెరికాలోనే వుండేటట్లు నిశ్చయించుకున్నాను. మరి జూలై 4 నుండీ 6 వరకూ నాటా వారు అకామిడేషన్ ఇస్తారు కానీ, తర్వాత ఎలా అనే సందేహం నాకెన్నడూ కలగలేదు! ఎందుకంటే అంతమంది తమ్ముళ్ళు, అన్నలు, చెల్లెళ్ళూ వున్నారు. మా పెద్దమ్మ కూతురు రమక్క కూడా డాలస్‌లో వుంది!

ఈసారి అవధాని నరాల రామిరెడ్డి గారూ, రసరాజు గారూ, హరికథా భాగవతార్, తిరుపతి యూనివర్సిటీలో హరికథా విభాగం హెడ్ ముప్పవరపు సింహాచలంగారూ, ఆధ్యాత్మికవేత్త, గురువుగారు సుబ్రమణ్యం గారు, మరో రచయిత్రీ, ఆధ్యాత్మిక విభాగంలో మాట్లాడడానికి వెళ్తున్న వారూ మంగళగిరి ప్రమీలా దేవి గారూ… అందరం కలిసి వెళ్ళాం. జొన్నవిత్తుల రామలింగేశ్వర రావు గారు మాతో రాలేదు. ఆల్‌రెడీ అక్కడ వున్నారు.

మంగళగిరి ప్రమీలా దేవిగారితో రచయిత్రి

మా కృష్ణకి వచ్చేటప్పుడు తీసుకు రావలసినవీ, చెయ్యవలసినవీ, అన్నీ జాగ్రత్తలు చెప్పి నేను రెండవ తారీఖున రాజీవ్‍గాంధీ విమానాశ్రయం చేరాను. అప్పటికే రామిరెడ్డి గారూ, వడ్డేపల్లి కృష్ణగారూ మొదలైన వాళ్ళు వున్నారు. చెన్నై నుంచి ఘంటసాల రత్నకుమార్ గారు కూడా వచ్చి వున్నారు. మంగళగిరి ప్రమీలా దేవి గారూ, సుబ్రమణ్యం గారూ, వెన్నెలకంటి గారూ ఆప్యాయంగా పలకరించారు. కాసేపట్లో అవధాని గారూ, రసరాజు గారూ కూడా మాతో చనువుగా మాట్లాడ్డం మొదలుపెట్టారు! విమానాశ్రయం సాహిత్య సౌరభాలు గుబాళించింది!

అందరం డాలస్ వరకూ బాగానే వెళ్ళాం. అక్కడ నుండి ఏంకర్ ప్రదీప్ (ఇప్పుడు ప్రముఖుడయ్యాడు ఈ అబ్బాయి), ఘంటసాల రత్నకుమార్ గారూ, ఇంకా ఇద్దరూ వేరే ఫ్లయిట్ ఎక్కాల్సొచ్చింది. మేం అట్లాంటా చాలా తేలిగ్గా చేరుకున్నాం. నాకూ, మంగళగిరి ప్రమీలా దేవి గారికి వీల్ ఛైర్ పెట్టారు కాబట్టి, లగేజ్ చెక్ ఔట్ చేసి మళ్ళీ చెక్ ఇన్ చెయ్యాలంటే, ఆ వీల్ ఛైర్ అబ్బాయే చూసుకున్నాడు! అట్లాంటా రైట్ టైంకి చేరుకున్నాం.

కానీ డాలస్‍లో వేరే ఫ్లయిట్ ఎక్కిన ఘంటసాల రత్నకుమార్ గారూ వాళ్ళూ, ఫ్లయిట్ లేట్ అయి, చాలా ఆలస్యంగా వచ్చారుట పాపం! పైగా డొమెస్టిక్‍లో స్పిరిట్ ఎయిర్ లైన్స్ అవడం వలన, లగేజ్‍కి ఎక్స్‌ట్రా కట్టాల్సి వచ్చిందట! వాళ్ళు బ్రేక్ జర్నీ చేసొచ్చారేమో తెలీదు మరి!

మాధవ్ మమ్మల్ని రిసీవ్ చేసుకోడానికి ఎయిర్‌పోర్ట్‌కి వచ్చాడు. “మా తమ్ముడు రాలేదా?” అన్నాను. “అక్కా” అంటూ మా ఫణి డొక్కా కనిపించాడు. వంశీ రామరాజు గారి తమ్ముడు కూడా వచ్చారు… ఇంకా కొంతమంది నాటా కార్యవర్గ సభ్యులొచ్చారు.

డైరక్ట్‌గా మేరియట్‌కి వెళ్ళచ్చును కానీ, నేను మా అట్లాంటా తమ్ముడు ఫణి ఇంటికి వెళ్లాను. అప్పటికి గాయత్రి, ఫణిలకి పల్లవి తరువాత ప్రణవి కూడా పుట్టింది. పల్లవి పుట్టిన పదేళ్లకి! నేను మొదటిసారి వెళ్ళినప్పుడు ప్రణవి లేదు.

“అక్కా” అంటూ గాయత్రి వచ్చి కౌగిలించుకుంది, మొదటిసారిలా కొత్తలూ, ‘ఏవండీ’లు లేవు! రాత్రి పొద్దుపోయేదాక ఫణీ, నేనూ చాలా మాట్లాడుకున్నాం. ఈసారి బాలాంత్రపు రమణ గారూ, వారి శ్రీమతి శారదగారూ కూడా ఫణి ఇంట్లో వున్నారు. ఫణి అప్పుడు ‘పల్లకి’ షార్ట్ ఫిల్మ్ తీయాలనుకుంటున్నాడు. “అక్కా, బడ్జెట్ ఎంత అవుతుంది అంటావ్?” అంటే, నా 20 ఏళ్ళ సినీరంగ అనుభవంతో బడ్జెట్ వేసిచ్చాను. తర్వాత ఫణి ‘పల్లకి’ – మహామహులని – గొల్లపూడి మారుతీరావు గారినీ, ఎల్.బి.శ్రీరాం గారినీ, తనికెళ్ళ భరణి గారినీ, రాళ్ళపల్లి గారినీ – పెట్టి, డైరక్ట్ చేసి నిర్మించడం; బ్నిం గారు రచనా సహకారం, మాధవపెద్ది సురేష్ గారు సంగీతం, ఎస్.పి. బాలసుబ్రమణ్యం గారు నేపథ్య గానం, ఎమ్.వి.రఘు గారి కెమెరా పనితనం, ఇవన్నీ కలిపి అద్భుతంగా కోనసీమలో తీయడం ఒక ఎత్తైతే, ప్రత్యేక కృతజ్ఞతలులో ‘బలభద్రపాత్రుని రమణి’కి అని నా పేరు వేయడం ఒక ఎత్తు! ఎందుకంటే, నేను వేసిన బడ్జెట్ సరిగ్గా అంతే అవడం విశేషం!

తర్వాత మా ఫణికి ‘పల్లకి’కి గాను 2016లో స్వర్ణ నంది వచ్చింది!

తెల్లారి డొక్కా సీతమ్మ వారసుడి పెళ్ళాంగా మా గాయత్రి రెండు పెద్ద పెనాలు పెట్టి, పెసరట్టూ, ఉప్మా చేస్తోంది. ఆమె అలా వేస్తూనే వుంది!

నాకు ఫోన్ వచ్చింది వెన్నెలకంటి గారి నుండి, “చెల్లాయ్, ఎక్కడున్నావ్?” అని. నేను చెప్పగానే, “మేమూ వచ్చేస్తున్నాం” అన్నారు.

ఫణి డొక్కా ఇంట్లో – వెన్నెలకంటి గారు, బాలాంత్రపు రమణ దంపతులు, ఫణి, రసరాజు గారు, మాధవ్ దుర్భా, సింహాచలంగార్లతో రచయిత్రి

మా డాక్టర్ ఆళ్ళ శ్రీనివాసరెడ్డి గారి బాల్య స్నేహితులు ముప్పవరపు సింహాచలం గారు కూడా వచ్చి వున్నారు. రసరాజు గారు, వెన్నెలకంటి గారూ, మాధవపెద్ది సురేష్ గారూ అంతా ఒకేసారి రావడంతో, గాయత్రి అందాలరాముడిలో సావాలమ్మ సూర్యకాంతం పెసరట్లులా వాయి తర్వాత వాయి వేస్తూనే వుంది! వచ్చిన వాళ్ళు కబుర్లూ, హడావిడిలో లాగిస్తునే వున్నారు!

వాళ్ళల్లో ఈవేల్టి రోజున మంగళగిరి ప్రమీలా దేవి గారూ, వెన్నెలకంటి గారూ, ఇందాక తలచుకున్న గానగంధర్వుడు ఎస్.పి.బీ, గొల్లపూడి గారూ లేకపోవడం విచారకరం అనిపిస్తుంది, ఇది రాస్తుంటే! ఆ కబుర్లూ, ఆ హడావిడీలోనే మాధవ్, అపర్ణా, పిల్లలు, కుమార్ గండికోట, రామ్‍కుమార్ ఎడవల్లీ అనే ఇంకా కొందరు మిత్రులు రావడం జరిగింది!

అందరం లంచ్‍కి కన్వెన్షన్ హాల్ చేరుకున్నాం. వెళ్ళగానే కన్వెన్షన్ హాల్‍లో మా కోసం ఒక సంచీ తయ్యారుగా వుంది. అందులో ఓ మంచి వైన్ సీసా, సావనీర్ వున్నాయి.

తర్వాత లంచ్ కోసం డైనింగ్ హాల్‍కి వెళ్తే రజితా, ఝాన్సీ, అనసూయ, ప్రదీప్, జబర్దస్త్ కమేడియన్స్, సింగర్ సాహితీ, వాళ్ళాయనా, అంతా కనిపించారు. గాయత్రి వేసిన పెసరట్లు తిని వచ్చిన మాకు కడుపులో అస్సలు జాగా లేదు. అయినా ఏదో తిన్నాం అనిపించాం.

ఆ తర్వాత మాకు మేరియట్‍లో రూమ్స్ ఇచ్చారు. వెళ్ళి ఫ్రెష్ అప్ అయి, కొంచెం సేపు రెస్ట్ తీసుకుని బ్యాంక్వెట్‍కి వెళ్ళాలి. అంతకుముందే, “సావనీర్ ఎడిట్ చేస్తున్నాం, కథ పంపండి రమణీ గారూ!” అని జ్యోతిర్మయి కొత్తా ఫోన్ చేసింది. వాళ్ళ ఆయన రఘునాథ్ కొత్తా గారు ఎడిటర్. జ్యోతి తర్వాత నాకు చాలా ఆప్తురాలు అయిపోయింది. కానీ అప్పటికి వాళ్ళు తెలీదు. నేను ‘అపరిచితులు’ కథ రాసిచ్చాను. ఆ తర్వాత ముందటేడు అట్లాంటాలో కలిసాం. ఇప్పుడు మళ్ళీ కలిసాం. మాటల్లో “కృష్ణకాంత్ ఆగస్ట్‌లో వస్తున్నాడు, రేలీకి; అప్పటిదాక నేను యూ.ఎస్.లో వుండాలి, మా అక్కయ్య దగ్గర డాలస్‍కి వెళ్తాను” అనీ అంటే జ్యోతి వూర్కోలేదు. “మేం లేమా? కృష్ణ వచ్చేదాకా మా ఇంట్లోనే వుండాలి” అంది.

జ్యోతిర్మయి కొత్త తో రచయిత్రి

సింహాచలం గారూ, నేనూ చాలా ఆత్మీయులం అయిపోయాం. ఆయన హరికథ చెప్తుంటే, మనం అలా స్పెల్ బౌండ్ అయి వింటూ వుండిపోతాం,  ముఖ్యంగా శ్రీరాముని వంశం గుక్క తిప్పుకోకుండా చెప్తుంటే, నేను రికార్డ్ చేసాను కూడా! రామ్ ఎడ్లవల్లి ఈ అబ్బాయి కూడా ఫణీ, మాధవ్ లాగా మరో తమ్ముడు అయ్యాడు.

రామ్ ఎడవల్లి తో రచయిత్రి

ఆ అబ్బాయి ఇంట్లో ఒక్కడే ఉంటాడని, సింహాచలం గారిని పెట్టారు. ఆయన తన పాకశాస్త్రం అంతా చూపించి, రామ్‍కి మంచి భోజనం వండిపెట్టారుట. అక్కడి నుండి మేరియట్‌కి వచ్చి ఇద్దరూ ఒకే రూమ్ లోనే వున్నారు. రూమ్ మేట్స్ అన్నమాట! భలే సరదాగా గడిచింది.

మరునాడు జూలై నాలుగు. నేషనల్ ఇండిపెండెన్స్ డే. బాలాంత్రపు రమణ గారూ, శారద గారూ, సుబ్రమణ్యం గారూ, సుద్దాల అశోక్ తేజ గారూ, మంగళగిరి ప్రమీలా దేవి గారూ అందరం షటిల్ ఎక్కి కన్వెన్షన్ హాల్‍కి వెళ్ళడానికి, వచ్చి బస్ ఆగే చోట నిలబడితే, ఎంతకీ బస్ రాలేదు. టైం అయిపోతోందని మేం లెఫ్ట్ రైట్ కొడుతుంటే, ఇండిపెండెన్స్ డే సెలెబ్రేషన్స్‌లో భాగంగా పెద్ద ర్యాలీ వెళ్ళింది మా ముందు నుండి. అలా నేను వరుసగా నాలుగు ఇండిపెండెన్స్ డేలు యూ.ఎస్.లో వుండడం విచిత్రం!

కబుర్లు చెప్పుకుంటూ మూడు కిలోమీటర్ల దాకా నడుచుకుంటూ వెళ్ళాం. తెలుగు సాహిత్య కార్యక్రమాలన్నీ చాలా పద్ధతిగా జరిగాయి, మాధవ్ దుర్భా నేతృత్వంలో. ఫణి తను కండక్ట్ చేసే షార్ట్ ఫిల్మ్ కాంటెస్ట్‌కి నన్ను జడ్జ్‌గా రమ్మన్నాడు. వివాహ వేదిక నిర్వహిస్తున్న శుభాంజలీ వెలగా కూడా నన్ను ముఖ్య అతిథిగా పిలిచారు! ఇంకో రెండు సభల్లో పిలిచారు! అన్నీ చూసుకుంటూ, నరాల రామిరెడ్డి గారి అవధానం మిస్ అవకుండా, మీగడ రామలింగేశ్వరరావు గారి పద్యావధానం చూసి, నేను మాట్లాడవలసిన టాపిక్‍లు హాస్య చతురతతో మాట్లాడి అలరించి, ఆఖరి వరుసలో కూర్చున్న మా వి.ఎన్.ఆదిత్య (డైరక్టర్)ని గుర్తు పట్టి పలకరించి కూర్చున్నాను.

శుభాంజలీ వెలగా గ్రూప్‌తో రచయిత్రి
నాటా సాహిత్య వేదిక

ఆ సభలో వంగూరి చిట్టెన్‍రాజు గారూ, గిరిజ గారూ, వంశీ రామరాజు గారూ కూడా వున్నారు. ఒక రచయిత తెలుగు సాహిత్యంలో లబ్ధప్రతిష్ఠుల గురించి మాట్లాడుతూ, అందులో ఎక్కడా యద్దనపూడి సులోచనా రాణి గారి గురించీ, యండమూరి వీరేంద్రనాథ్ గారి గురించీ, మల్లాది వెంకటకృష్ణమూర్తి గారి గురించీ మాట్లాడకపోవడంతో నేను చాలా అసహనాన్ని వ్యక్తపరిచాను. కమర్షియల్ రైటర్స్ అంటే చాలామందికి అలుసు!  

(సశేషం)

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here