జీవన రమణీయం-158

4
6

[box type=’note’ fontsize=’16’] టీవీ, సినీరంగాలలో తనదైన ప్రత్యేక స్థానాన్ని ఏర్పర్చుకున్న సుప్రసిద్ధ రచయిత్రి బలభద్రపాత్రుని రమణి నిజజీవితంలోని అనుభవాల రమణీయమైన కథనం ‘జీవన రమణీయం’ ఈ వారం. [/box]

[dropcap]ఎ[/dropcap]వరి గురించీ నెగటివ్‍గా రాయడం ఇష్టం వుండకపోయినా, ఎందుకు రాసానంటే, ఎన్ని సంవత్సరాలు అయినా అలాంటి వ్యక్తుల ప్రవర్తన పరమాన్నంలో రాయిలా పంటి కింద కొస్తునే వుంటుంది, మధుర స్మృతుల మధ్యన.

మా రమక్క ఇంట్లో ఎనిమిది రోజులు వుండిపోయాను. ఇంకా వుందాం అనుకున్నా కానీ, జ్యోతిర్మయి “మొహమాటపడి అక్క దగ్గర వుండిపోకండి… మేం మీకోసం ఎదురు చూస్తున్నాం, ఇక్కడికి రండి” అని స్వంతవాళ్ళ కన్నా ఆప్యాయంగా మరీ మరీ పిలిచింది.

రమక్కా, శేషాద్రి బావగారు
శైలుతో మాల్‍లో

సాయిబాబా గుడిలో ముప్పవరపు సింహాచలం గారు సప్తాహం చేసారు హరికథలు. మొదటిరోజు అక్కతో వెళ్ళాను. డా. ఆళ్ళ శ్రీనివాసరెడ్డి గారి సతీమణి సుధ గారిని కూడా కలిసాను. తోటకూర ప్రసాద్ గారూ, ఎమ్.వి.ఎల్. గారూ అంతా వచ్చారు! పుంభావ సరస్వతులు సింహాచలం గారి గానం, హరికథా నైపుణ్యం గురించి నేనేం రాయగలను? చాలా ఆహ్లాదంగా వుంటుంది. తర్వాత రోజు డాలస్ లోనే వుండే మా కజిన్ బ్రదర్ వైఫ్ సత్య వచ్చి నన్ను గుడిలోనే కలిసింది. తను బ్యూటీషియన్‍గా వచ్చి అమెరికాలో స్థిరపడింది. తర్వాత మా బావ వచ్చి వుద్యోగం సంపాదించుకున్నాడు అని, మొదటి ట్రిప్‌లో డాలస్ వచ్చినప్పుడు చెప్పానుగా. సత్య, విజయా స్నేహితులు. విజయ BATA (బే ఏరియా తెలుగు అసోసియేషన్) ఫౌండర్ ప్రెసిడెంట్.

సత్య, విజయా, ఎబిఎన్ ఆంధ్రజ్యోతి ఎం.డి. రాధాకృష్ణ గారి భార్య కనకదుర్గా – వీళ్ళు ముగ్గురూ – చాలా క్లోజ్ ఫ్రెండ్స్. నిన్న (27 ఏప్రిల్ 2021) ఈ కాలమ్ రాస్తుండగా శ్రీమతి కనకదుర్గ, డైరక్టర్ ఆఫ్ ఎబిఎన్ ఆంధ్రజ్యోతి, చనిపోవడం చాలా విచారకరం.

సత్య టెంపుల్‍కి వచ్చినప్పుడు నేను తనని “మా డైరక్టర్ వి.ఎన్.ఆదిత్య కజిన్ సిస్టర్ మీనాక్షీ అనపిండి ఇంటికి తీసుకెళ్ళగలవా? వారింట్లో పి. సుశీల గారు వున్నారు. చిన్నప్పటి నుండీ ఆవిడని చూడాలని కోరిక. ఆ పాటలతోనేగా మన జెనరేషన్ అంతా పెరిగింది?” అన్నాను. సత్య ‘సరే’ అంది. సుశీల గారిని చూడాలని ఎవరికుండదూ? చాలా స్వల్పకాలం ఒకసారి ఎయిర్‍పోర్ట్‌లో చెన్నైలో పి. సుశీల గారి దగ్గరకు వెళ్ళి పరిచయం చేసుకుంటే, నేను రచయిత్రినని తెలిసి, చాలా ప్రేమగా మాట్లాడారు.

ఇప్పుడు మీనాక్షికి ఫోన్ చేసి వస్తున్నాం, అని చెప్పి వెళ్ళాను. ఆ వుత్సాహంలో నాకు తట్టలేదు కానీ పెద్ద వయసులో ఎవరైనా వస్తున్నారంటే వాళ్ళకి విసుగ్గా వుంటుందేమో, ఆరోగ్యం సహకరించదు కదా! మీనాక్షి దంపతులు చాలా ప్రేమగా మమ్మల్ని రిసీవ్ చేసుకున్నారు.

పి. సుశీల గారితో రచయిత్రి

పి. సుశీల గారితో ఫొటో తీయించుకున్నాం. ఆవిడ వుత్సాహంగా లేరు. అది గమనించి, మేం ఆవిడ దగ్గర శలవు తీసుకుని, కాళ్ళకి దణ్ణం పెట్టి ఆ గది నుండి త్వరగా బయటపడ్డాం. ఆ తర్వాత మీనాక్షి పాట ఫేస్‌బుక్‌లో చాలా సార్లు విన్నాను. అతి మధురమైన గాత్రం ఇచ్చాడు భగవంతుడు ఆమెకి. మీనాక్షి పాట చాలా మధురంగా ఉంది, సుశీల గారి మొదటి రోజుల్లో, ఆవిడ గొంతు పలికినట్టు… సుశీల గారి లాంటి మహామహుల దర్శనం అవ్వాలంటే పూర్వజన్మ సుకృతం వుండాలి!

సత్య నన్ను గుడి దగ్గర వదిలి పెట్టి వెళ్తే, అక్కడి నుండి ఆహార్ అనే రెస్టారెంట్‌లో, మేం అంతా ఇండియా నుంచి వచ్చాం అని డా. ఆళ్ళ శ్రీనివాసరెడ్డి గారు డిన్నర్ ఇచ్చారు. మళ్ళీ చతురోక్తులతో రసరాజు గారూ, వెన్నెలకంటి గారూ, జొన్నవిత్తుల గారూ, తోటకూర ప్రసాద్ గారూ, ఎమ్.వి.ఎల్ గారితో సరదాగా సాగింది. సింహాచలం గారు ఎక్కడా భోం చెయ్యరు! ఆయనకు కొన్ని నియమాలున్నాయి. మావిడికాయా, పండూ వదిలేసాం అనడం విని, ఆయన నిబ్బరానికి మనసులో అబ్బురపడ్డాను! తెలుగువాళ్ళు ఆవకాయ లేకుండా తినడం కష్టం కదా!

డాలస్‌లో రెస్టారెంట్‌లో

డా. ఆళ్ళ శ్రీనివాసరెడ్డి గారు, మా రమక్క వాళ్ళ ఇంటి దగ్గర నన్ను డ్రాప్ చేసారు. మా బావగారూ, అక్కా లోపలికివచ్చి కాఫీ తాగి వెళ్ళమంటే, అప్పటికే చాలా ఆలస్యం అయిందని వెళ్ళిపోయారు. ఆయనెంతో సహృదయులు, స్నేహాభిలాషి. మొన్న మా అక్కకి కొంచెం ఆరోగ్యం నలతగా వుండి ఫోన్ చేస్తే, వెంటనే స్పందించి తగు సూచనలు చేసారు. అలాగే ఇండియాలో డాక్టర్లు అందరూ దరిదాపుగా ఆయనకి మిత్రులు. ఆయన గుంటూరు మెడికల్ కాలేజ్ ఆలమ్నీకి ప్రెసిడెంట్ కూడా కావడంతో అక్కడి ఓల్డ్ స్టూడెంట్స్‌కి ఈయన బాగా తెలుసు! అందులోనూ ఈ యోగాలోనూ, స్పోర్ట్స్ లోనూ, సాహిత్యం లోనూ, సాంస్కృతిక శాఖల్లోనూ చాలా ఏక్టివ్ కాబట్టి, ఆయన ఎక్కడుంటే అక్కడ సందడి అని పేరు! దేవుడు మంచి గాత్రము కూడా ఇచ్చాడు! కానీ నేను ఆశ్చర్యపోయేది మాత్రం ఆయన ధారణకి! ఎప్పుడో చిన్నప్పుడు విన్న కవితా, పాటా ఏదైనా ఆయన మరిచిపోకుండా ఇప్పటికీ పాడతారు. ఆ ‘రుచి’ మా కథలు, నవలల పట్ల లేదు అనుకుంటాను. ఇక్కడ కృష్ణక్కగా పిలిపించుకునే డా. కె.వి. కృష్ణకుమారి గారూ, జమున గారూ, లక్ష్మీపార్వతిగారూ అందరూ ఆయనను ఎంతగానో అభిమానిస్తారు! మొన్న ప్రముఖ రచయిత్రి డి. కామేశ్వరి గారికి ఆరోగ్యం బాలేనప్పుడూ, ఆయన ద్వారానే నాకు తెలిసింది. మిత్రులందరి యోగక్షేమాలూ ఆయన విచారిస్తుంటారు. అందమైన భార్య, ముచ్చటగా, ముద్దుగా వుండే పిల్లలూ, చక్కని కుటుంబం. ఈయన భార్య సుధ గారు, మా డా. లకిరెడ్డి హనిమిరెడ్డి గారికి మేనకోడలు కుమార్తె. ఆయన ‘మెర్సీడ్’ వెళ్ళినప్పుడు నవ్వుతూ చెప్పారు మాతో, “మా ఇళ్ళల్లో ఆడపిల్లలందరికీ ఇండియా డాక్టర్స్‌ని గ్రీన్‌కార్డ్‌తో ఎత్తుకొచ్చి, పెళ్ళిళ్ళు చేసాం” అని. డా. శ్రీనివాసరెడ్డి గారిది మున్నంగి. గుంటూరు డిస్ట్రిక్ట్.  అక్కడ వీరు తెలీనివారు లేరు అంటే అతిశయోక్తి కాదు! ఆయనలో పాజిటివ్ ఎనర్జీ తప్ప నెగటివిటీ ఎక్కడ వెతికినా కనబడదు! సమాజం పట్ల బాధ్యతతో స్పందించే డాక్టరు గారు పలు సేవా కార్యక్రమాలకి గాను గుప్త దానాలు చేస్తారు. మా వంశీ రామరాజు బాబాయ్ నెలకొల్పిన అంగవికలుర పాఠశాల, వేగేశ్నాకి చాలా సాయం చేస్తుంటారు.

2017 నుండీ కొత్త కథలు అనే కథల సంపుటి పబ్లిష్ చేయించి, రచయిత(త్రు)ల అందరి చేతా కథలు రాయించి, మొదటిది 2017లో డా. సి.నారాయణ రెడ్డి గారి స్మృత్యర్థం, 2018లో రెండవది శ్రీమతి యద్దనపూడి సులోచనారాణి గారి స్మృత్యర్థం, 2019లో నటసామ్రాట్ డా. అక్కినేని నాగేశ్వరరావు గారి స్మృత్యర్థం పబ్లిష్ చేయించారు. 2020లో కరోనా కథలు మా అందరి చేతా రాయించి, బుక్ పబ్లిష్ చేయించారు. కానీ ఇంకా ఆవిష్కరణ కాలేదు.  ఆ నాలుగు సంపుటుల్లోనూ నా కథలు అచ్చవటం విశేషం (నాలుగవది తయ్యారు అవుతోంది). ఆ పుస్తకం సేల్స్ మీద వచ్చే ఆదాయం వేగేశ్న కివ్వడం విశేషం! శ్రీనివాసరెడ్డి గారికి ఈ పై ముగ్గురు ప్రముఖులతో చాలా అనుబంధం వుండేది. నాకూ చాలా గాఢ మైత్రి సులోచనారాణి గారితోనూ, నాగేశ్వరరావు గారితోనూ. వారిని ‘దివంగత’, ‘కీర్తిశేషులు’ అని ఇప్పటికీ అనలేకపోతున్నాను. నా ఫోన్ లోంచి కూడా వారి నెంబర్లు ఇంకా తియ్యలేదు!

వంశీ ఇంటర్నేషనల్ సంస్థ నుంచి సత్కారం

మా శేషాద్రి బావగారు నేనొస్తున్నానని తెలిసి, మొత్తం కుటుంబం అందరం కలిసి ఆస్టిన్ వెళ్ళాలనీ, కొన్ని ప్రదేశాలు నాతో కలిసి చూడాలనీ అనుకున్నారట! కానీ నా సాంస్కృతిక కార్యకలాపాలూ, నా మిత్రులతో ఇష్టాగోష్ఠులతో – వాళ్ళతో తగినంతగా సమయం గడపలేకపోయినందుకూ నిరుత్సాహపడ్దారని, మా అక్క చెప్పింది! ఏం చేద్దాం?… నాకు ఫ్రెండ్స్ సర్కిల్ పెద్దది! ఏ దేశం వెళ్ళినా, ఏ వూరు వెళ్ళినా బంధువుల కన్నా ముందు స్నేహితులే వస్తారు కలవడానికి! కానీ బావగారు డిన్నర్‍కి తీసుకెళ్ళారు శరవణ భవన్‍కి, తర్వాత మా కజిన్ కూతురు ఇంకో అమ్మాయి సంజన అని వీళ్ళ ఇంటి వెకనాలే వుంటుంది, వాళ్ళింటికి భోజనానికి వెళ్ళాం. శైలజ అనే ఫ్రెండ్, మా భువనచంద్ర గారి ద్వారా పరిచయం. వారింటికి భోజనానికి వెళ్ళాం. వారి అమ్మాయి చిన్మయి అని LBW (Love Before Wedding) అనే సినిమాలో హీరోయిన్‍గా కూడా చేసింది.

డాలస్‌లో కజిన్ కూతురు సంజనతో పిల్లలతో రచయిత్రి, అక్క బావగారు

ఇంక మా అక్కచెల్లెళ్ళకి బయటకి వెళ్ళడం కన్నా కూర్చుని కబుర్లు చెప్పుకోవడంలో వున్న ఆనందం అంతా ఇంతా కాదు! మా చిన్ననాటి అనుభవాలు నేను ఎన్నిసార్లు నా ‘కాలమ్ దాటని కబుర్లు’లో రాసిన, మిగతా కాలమ్స్‌లో రాసినా, నాకూ తనివి తీరదు! మా అమ్మమ్మగారు సూరంపూడి వెంకట రమణమ్మ గారి పెంపకంలో అందరం ఒకే చోట పెరగడం వలన మాకు చాలా సరదా సంఘటనలున్నాయి! అమ్మమ్మ కూడా తాతయ్య లాగే స్వాతంత్ర్య సమర యోధురాలు మరి!  

(సశేషం)

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here