జీవన రమణీయం-16

0
5

[box type=’note’ fontsize=’16’] టీవీ, సినీరంగాలలో తనదైన ప్రత్యేక స్థానాన్ని ఏర్పర్చుకున్నసుప్రసిద్ధ రచయిత్రి బలభద్రపాత్రుని రమణి నిజజీవితంలోని రమణీయ అనుభవాల రమణీయమైన కథనం ‘జీవన రమణీయం‘ ఈ వారం. [/box]

[dropcap]అ[/dropcap]లా నా మొదటి కథ ‘ముళ్ళబాట’ 1993లో విపులలో ప్రచురితం అయింది. ‘వైదేహి’ అనే అమ్మాయిని స్నేహితురాలు “ఎవరి వల్ల పెళ్ళి కాకుండా నీకీ గర్బం వచ్చిందీ? ఎందుకు తీసెయ్యకూడదూ?” అని అడిగితే ఆమె, “నా బిడ్డ… నా ఛాయిస్… అతనికేం సంబంధం లేదు… మాతృత్వం ఒక వరం…  నన్ను అనుభవించనీయండి… నా జోలికి రాకండి… తల్లీ తండ్రీ సమాజాన్నీ ఈ బిడ్డ కోసం వదిలేసుకున్నాను” అని చెప్పే కథ.

ఆ రోజు మా రమక్కా, అమ్మమ్మా, మా వారు కూడా చాలా ఆనందపడ్డారు. స్కూల్లో చెప్తే లలితా, సుశీలా అయితే ఎగిరి గంతేసారు… “త్వరగా నువ్వు రాస్తున్న ఈ ‘తృప్తి’ నవల ముగించు… చతుర కిద్దాం” అన్నారు.

అప్పుడే విపుల నుండి 200 రూపాయలు మనీయార్డర్ వచ్చింది. అప్పుడు నా జీతం నెలకి 500 రూపాయలు. ఏ పూట వెళ్ళకపోయినా 20 రూపాయలు నిర్దాక్షిణ్యంగా కోసేవారు.

శాయి, మురళీ గార్లు ‘రచన’ మేగజైన్ ప్రారంభిస్తున్నాం అని ప్రభలోనో ఎందులోనో ప్రకటించగానే మొట్టమొదటి చందా కట్టినవారు మా మావగారు బీ.వీ. చలపతి రావు గారు. శాయి గారికి ఆ అభిమానం ఇప్పటికీ వుంది పాపం!

నేను రచన బాగా చదివేదాన్ని. అందులో పడ్తున్న ప్రముఖ రచయితల పేర్లు చూసి, ‘ఎప్పుడైనా వీళ్ళని చూస్తానా?’ అనుకునేదాన్ని. రచనకి నేను ‘పెళ్ళి సందడి’ అన్న కామెడీ కథ పంపించాను. చాలా రోజులు ఏ సమాచారం అందలేదు.

మా లలితకి ఇద్దరు కూతుళ్ళు. ఇద్దర్నీ సాయి గ్రామర్ హైస్కూల్లోనే వేసింది. సౌమ్య మా అశ్విన్ కన్నా సంవత్సరం పెద్ద. రెండోది రమ్య మా క్రిష్ణకాంత్ కన్నా ఒక సంవత్సరం పెద్ద. రమ్య నా తరగతిలో చదివేది. ఇప్పుడు ‘దిల్ రమ్య’ అని ఆర్.జే.గా పేరు తెచ్చుకుంది. భద్రుకాలో లెక్చరర్‌గా ఉద్యోగం చేస్తోంది. సౌమ్య ఖాళీగానే ఉంది. పెళ్ళయి ఒక కొడుకు తనకి.

అప్పట్లో నాకు మనస్సు బాగా లేకపోతే పిల్లల్ని గ్రౌండ్‍లోకి తీసుకెళ్ళి ఆడిస్తుండేదాన్ని.  అలాంటప్పుడే మా పోస్ట్‌మేన్ రెడ్డి ఉత్తరాలు పట్టుకొచ్చి ఇచ్చాడు. నేను స్కూల్లో వుంటే స్కూల్‌కే పట్టుకొచ్చి ఇచ్చేవాడు. అందులో రచన నుండి కథ సెలెక్ట్ అయినట్లుగా వచ్చిన కార్డ్ కూడా వుంది.

‘పెళ్ళి సందడి’ కథ ప్రచురణకి స్వీకరించడమైనదీ, వీలు వెంబడి ప్రచురిస్తాం అని ఉంది. ఇంక నా ఆనందానికి అవధులు లేవు! ఒకప్పటి భారతీ, ఆంధ్రపత్రికా, యువ  లాగా ‘రచన’ కూడా ఉత్తమ సాహిత్యపు విలువలతో వెలువడే పత్రిక! ఎగిరి గెంతేస్తూ, క్లాసులో పాఠం చెబుతున్న లలితకీ, సుశీలకీ అప్పటికప్పుడే వెళ్ళి ఈ విషయం చెప్పేసా! “నువ్వు తృప్తి త్వరగా పూర్తి చెయ్యి” అన్నారు మళ్ళీ.

మా ఇల్లు రూఫ్ వెయ్యడానికి సిద్ధం అవుతున్నారు. హేండ్ మోటార్ రోజూ నేను ఎత్తుకొస్తే, పైప్ చుట్ట అమ్మమ్మ మోసుకొచ్చేది. ఇద్దరం కలిసి ఇంటికి క్యూరింగ్ చేసేవాళ్ళం. అప్పుడు అమ్మమ్మ నాతో వాళ్ళు కాంగ్రెస్ మీటింగ్‌కి గుణదల నుండి లక్నో దాకా నడిచి వెళ్ళిన పాదయాత్ర చెప్పేది! నాకు ఒక రోజు అనుమానం వచ్చింది. “అమ్మమ్మా… నేనిలా ఇంటిపేర్లతో, ఊరి పేర్లతో సహా మీ మజిలీలు గుర్తుంచుకుని నా పిల్లలకీ, మనుమలకీ చెప్పలేను కదా… ఇదంతా రాస్తేనో?” అని

అమ్మమ్మ వెంటనే “మంచి ఆలోచన… రాయి, నేను మొదటి నుండీ చెప్తాను” అంది. ఆ రచన చాలా వేగంగా నా ‘తృప్తి’ నవల కన్నా ముందే పూర్తయ్యింది.

ఈలోగా స్కూల్లో కల్చరల్ ప్రోగ్రామ్స్, ఆరు నెలల పరీక్షలూ, తర్వాత ఫైనల్స్… బిజీ అవుతూ వచ్చాను. లలితా, సుశీలా నవల పూర్తి చెయ్యమని హెచ్చరిస్తూనే వున్నారు.

ఆర్.టి.సీ. కాలనీలో వుండే అత్తగారూ, ఆడబిడ్దా ఇల్లు మారి ఆనంద్‍బాగ్ వచ్చేశారు. మావగారు మా దగ్గరకొచ్చేసారు. ఇల్లాలుగా ఇంటి పనీ, వంట పనీ, స్కూలూ, పిల్లల చదువులూ, బంధువులతో బిజీగా గడుస్తుండేది. రచన కాస్త వెనుకబడింది.

ఆ సమయంలో ‘పెళ్ళి సందడి’  కథ రచనలో ప్రచురితం అయింది! మళ్ళీ నా మిత్రబృందంలో హుషారు… మలయాళీ పిల్లలయిన మణీ, బీనాతో సహా కేరింతలు. ఎంతో ఉత్సాహం! నా విజయం వారి విజయంగా భావించేవారు పాపం.

జీవితం అనుకోని మలుపులు తిరగడం అనే మాట నేను చాలాసార్లు వాడాలి నా జీవితంలో…

‘తీయ తెనుగు అను పల్లవికి’ అనే కవితల పోటీ ప్రకటించారు ఆంధ్రజ్యోతి వాళ్ళు. అప్పుడు తోటకూర రఘు ఎడిటర్ జ్యోతి పత్రికకి.

నేను స్కూలు లోనే ఆ ప్రకటన చూసి ఓ కవిత రాసి పంపించాను! ఆ కవితల పోటీకి జడ్జిగా యండమూరి వీరేంద్రనాథ్ కూడా వున్నారు. అప్పట్లో ఆయన ‘రైటర్స్ వర్క్‌షాప్’ ప్రారంభించారు. ఈ కవితలన్నీ కపాడియా లేన్‌లో వున్న ఆయన ఆఫీస్‌కి చేరాయిట!

స్వరూపరాణి అనే అమ్మాయి, బిందుప్రియ అనే పేరుతో చిన్న చిన్న కథలు రాస్తూండేది. ఆయన వర్క్‌షాప్‌లో శిష్యురాలు. ఆ అమ్మాయికి వీరేంద్రనాథ్ గారు నా కవిత చూఫించి, “ఈవిడెవరో ఎడ్రస్ మీ ఇంటి దగ్గరేలా వుంది. నేరేడ్‌మెట్ అని రాశారు. ఓసారి తీసుకొస్తావా? రచనలో స్పార్క్ వుంది” అన్నారట.

అప్పట్లో లాండ్‌లైన్ ఫోన్ కూడా చాలా గొప్ప గొప్ప వాళ్ళకే వుండేది! 1993 నాటి మాట. ఆ అమ్మాయి ‘సరే సర్’ అందట.

స్వరూపరాణి ఓనాటి సాయంత్రం దీపాలు పెట్టేవేళ, కొత్తగా ఇళ్ళు పూర్తవుతున్న, ఖాళీ ప్లాట్లు ఎక్కువా, ఇళ్ళు తక్కువా వున్న మా కాకతీయనగర్‌లో వున్న ఇంటికి, ఎగుడుదిగుడు రోడ్ల మీద, చిన్న పాపని భుజాన వేసుకుని వెతుక్కుంటూ వచ్చింది!

“ఎవరండీ?” అన్నాను.

“యండమూరి వీరేంద్రనాథ్ గారు పంపించారు” అంది. నాకు ఆ పేరు వినబడగానే సృహ తప్పినంత పనైంది. పడబోయి ఆపుకున్నాను!

“కూర్చోండి… ఏం అన్నారు?” అని అడిగాను. ఆ పేరు మళ్ళీ వినాలని. “యండమూరి వీరేంద్రనాథ్ గారు పంపించారు… మీ కవిత ఆయన చూశారు… నేనూ ఇక్కడే ఉంటాను. గుండ్ల పోచంపల్లి స్కూల్లో టీచర్ని… మా పాప…” అని ఏదేదో చెప్తున్నా నేను వినిపించుకోవడం లేదు.

1985లో “మా అక్క పెళ్ళికి యండమూరీ, మల్లాది వస్తున్నారు… మా బావగారికి క్లోజ్ ఫ్రెండ్సట!” అని నా బి.ఎ.లో క్లాస్‌మేట్ బాల అనే అమ్మాయి అంటే, నేనూ ఉమా జ్వరంతో వున్న మంత్స్ బేబీ మా అశ్విన్‌‍ని తీసుకెళ్ళి, రాత్రి ముహూర్తం, సచ్చిదానందాశ్రమంలో, తెల్లార్లూ కూర్చోడం, వాడికి జ్వరానికి పారసిట్‌మాల్ వేస్తూండడం గుర్తొచ్చింది! ‘ఇంకా వస్తారు… ఇంకా వస్తారు’ అన్న మా ఆశలు అడియాశలయ్యాయి. ఆ బాధ నుండి తేరుకోడానికి చాలా కాలం పట్టింది! ఏ సినిమా ఏక్టర్‌నీ కూడా చూడాలని అంతగా కోరుకోలేదు… మల్లాదీ యండమూరి గార్లను చూడాలని కోరుకున్నంతగా!

“నా కవిత చదివారా? ఏం అన్నారు?” అనే పదే పదే ఆ అమ్మాయి నోట “తీసుకురమ్మన్నారు…” అనే మాట విన్నాను. ఎంతో తృప్తిగా అనిపించింది.

(నా జీవిత కథంటూ రాస్తే నీ పేరు అందులో తప్పకుండా రాస్తాను అని స్వరూపరాణికి నేను అప్పట్లో మాటిచ్చేశాను! అది ఇప్పుడు తీరుస్తున్నాను.)

ఆ అమ్మాయికి కాఫీ ఇచ్చాను. అమ్మమ్మ కూడా సంతోషపడింది. పిల్లలకి చాక్లెట్స్ ఇచాను. అమ్మ ఆనందంగా ఉందని మాత్రం వాళ్ళకి తెలిసింది. ఈయన ఆ రోజు ఆఫీసు నుండి చాలా లేట్‌గా వచ్చారు. ఆ అమ్మాయి వాళ్ళ ఇంటి ఎడ్రెస్ ఇచ్చేసి ఆదివారం ప్రొద్దుట పది గంటలకల్లా కలిస్తే వీరేంద్రనాథ్ గారి ఆఫీసుకు తీసుకువెళ్తానని చెప్పి వెళ్ళిపోయింది.

భారతి దగ్గరకు పరిగెత్తుకెళ్ళి “వీరేంద్రనాథ్ నా కవిత చదివారుట… తీసుకురమ్మని ఒక స్టూడెంట్‌ని పంపారు” అన్నాను.

భారతి మొహం మారిపోయింది.

(సశేషం)

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here