జీవన రమణీయం-165

0
9

[box type=’note’ fontsize=’16’] టీవీ, సినీరంగాలలో తనదైన ప్రత్యేక స్థానాన్ని ఏర్పర్చుకున్న సుప్రసిద్ధ రచయిత్రి బలభద్రపాత్రుని రమణి నిజజీవితంలోని అనుభవాల రమణీయమైన కథనం ‘జీవన రమణీయం‘ ఈ వారం. [/box]

[dropcap]ఆ[/dropcap]డవాళ్ళూ తగిలారూ ఈ మోస్తరుగా! ఒకసారి రామానాయుడు గారు “రమణీ! ఈవిడ పేరు శ్రీదేవి, సినిమా తియ్యాలని వచ్చారు. ఈవిడకి నీ సాయం కావాలిట” అన్నారు. ఓ రచయిత్రిని ఎవరైనా ఏం సాయం అడుగుతారూ? కథ ఇమ్మనో, స్క్రీన్ ప్లే, సంభాషణలు రాయమనో తప్ప… “సరే” అన్నాను. ఆయన చెప్తే వేదమే నాకు!

ఈ శ్రీదేవి, ఎత్తుగా, దృఢంగా, పెద్ద పర్సనాలిటీ (బాడీ షేమింగ్ కాదు, ఆవిడని ఊహించుకుంటారనీ) నాతో ఒక ప్రతిపాదన చేసింది. “నువ్వు అల్లు అరవింద్ గారిని అడిగి, అల్లు అర్జున్ డేట్స్ ఇప్పిస్తే, నీకు కోటి రూపాయలు ఇప్పిస్తాను” అంది. ఈ మాట మా డ్రైవర్ కారు నడుపుతూ విన్నాడు… కారులో మాట్లాడడం, డ్రైవర్ వుండగా… చాలా తప్పు! నేను ఈ సంగతి అల్లు అరవింద్ గారి దగ్గరికి వెళ్ళి అమాయకంగా చెప్పాను. ఆయన ఆశ్చర్యంగా విని, పొలమారేదాక దగ్గుతూ, నవ్వి, “సరే సరే… ఏ మాత్రం డబ్బు వుందో కనుక్కోండి… మీకు కోటి రూపాయలు వస్తుంటే నేనెందుకు కాదంటానూ? ఇచ్చేది నేను కాదుగా! మంచి కథ తీసుకు రమ్మనండి” అన్నారు. నేను ఆనందంగా ఈ మాటనీ శ్రీదేవి గారి చెవిన వేసాను. ఆవిడ వెంటనే నా  డ్రైవర్‍ని కారు దిగమని, నన్ను గట్టిగా కౌగిలించుకుని బుగ్గ మీద ముద్దు పెట్టుకుంది. నేను మాట రాక షాక్ అయిపోయాను. అప్పుడు డ్రైవర్‍ని పిలిచి కారు ఎక్కమంది.

ఆ రోజు ఆవిడ ఆఫీస్‍కి వెళ్ళాను. మా ఉమా వాళ్ళింటే దగ్గరే. సాగర్ సొసైటీలో ఒకరింటి మేడ మీద. ఆవిడ నాతో, “రమణీ వెయిట్ చెయ్యి… నేను ఒక మీటింగ్‍లో వున్నా. 10 క్రోర్స్ డీల్ ఒకటి సెటిల్ అయ్యేదుంది” అంది.

నేను వెయిట్ చేస్తున్నా. బన్నీకి సరిపడా కథ చెప్పడానికి. ‘మహాదేవ్’ అనే డైరక్టర్ కూడా నాతో వచ్చాడు. ఆవిడ ఓ గదిలో నుండి బయటకి వస్తూంటే ఆవిడతో మా అసిస్టెంట్ డైరక్టరూ, ఇంకో కోడైరక్టరూ, నాయుడు గారి దగ్గర ఒకప్పుడు చేసి మానేసిన డ్రైవరూ వున్నారు. ‘వీళ్ళతోనా 10 కోట్ల డీల్ గురించి ఈవిడ మీటింగ్ పెట్టిందీ?’ అనిపించినా, ఆ డైరక్టర్‍ని “మేడంకి కథ చెప్పండి” అన్నాను.

“అబ్బా బోర్… నువ్వు నా ప్రాణం రమణీ! నువ్వు వింటే చాలు… ఇతని పని బన్నీని ఒప్పించడం, నన్ను ఒప్పించడం కాదు!” అంది. నన్ను చూడగానే “ఐ లవ్ యూ… నువ్వు నా ప్రాణం…” ఈ మాట ఎక్కువగా అనేది. సరే… నేను ఇంటికి వస్తూ వుండగా మా డ్రైవర్ అన్నాడు కదా! “అమ్మా కోటి రూపాయల మేడం కనీసం ఐదు రూపాయల టీ ఇప్పించలేదు మీకు… ఏం సినిమా తీస్తుందమ్మా? అసలు మీ పక్కన ఆ బాబు వున్నాడు కాబట్టి నేను లోపలికి రాలేదు కానీ, ఆమెతో మీరు ఒంటరిగా ఎక్కడికీ వెళ్ళకండి. ఆ వాచ్‌మెన్ చెప్పాడు, ఆఫీస్‍కి రెండు నెలలుగా అద్దె కట్టడం లేదట… కోటి రూపాయల మేడం, ఓనరు ఖాళీ చేయమని కేకలేసాడట” అన్నాడు.

నా మనసులో నేను ఆలోచించుకుంటున్న మాటలే, అతనూ అన్నాడు. నాకు లేని తెలివి నా డ్రైవర్‍కు వుండబట్టి, వాచ్‌మెన్ దగ్గర ఆ మాత్రం కూపీ లాగాడు! నాకు ఇంకో విషయం తెలిసింది. ఆవిడ నన్ను ముద్దుపెట్టుకోవడం కూడా అతను చూసాడని! వెంటనే రామానాయుడి గారి ఫోన్ చేసి “ఎవరీ శ్రీదేవి? మీకెప్పటి నుండీ తెలుసు? నాకెందుకు అంటగట్టారు?” అని అడిగాను. ఆయన “శ్రీదేవి ఎవరూ? ఆవిడ పేరు నాగలక్ష్మి అని చెప్పిందే, ఎవరో సెంట్రల్ మినిస్టర్ తాలూకు… అంటే అర్థం కాలా? సెకండ్ సెటప్ అని చెప్పింది. ఏమోలే… ఆడవాళ్ళతో నీకేం ఇబ్బంది వుండదూ… నీకూ సినిమా వస్తే మంచిదే కదా! అని పరిచయం చేసాను. నాకు ఆ రోజే పరిచయం, అంతే!” అన్నారు.

ఆ తర్వాత అల్లు అరవింద్ గారికీ విషయం చెప్తే, “అరెరే కోటి రూపాయలు పోయాయే” అని నవ్వారు. తర్వాత “అందరినీ నమ్మకూడదు” అని చెప్పారు. మొదటి సగమే ఆయనకి చెప్పాను, రెండో సగం దాచేసాను. తర్వాత ఆవిడ ఎప్పుడు ఫోన్ చేసినా నేను తియ్యలేదు. మెసేజ్‍లు పెట్టేది, “మీ అబ్బాయికి కెనడాలో పెద్ద వుద్యోగం ఇప్పిస్తా, ఒక్కసారి మా ఇంటికి రా” అని. నేను బ్లాక్ చేసాను. చాలా త్వరగానే వదిలించుకున్నాను. మళ్ళీ ఆ తర్వాత ఎప్పుడూ నాకు ఫిల్మ్ నగర్‌లో ఎక్కడా కనబడలేదు! ఇంతకీ ఆవిడ పేరు శ్రీదేవా? నాగలక్ష్మా? ఇప్పటికీ నాకు తెలీదు!

అమ్మగారితో రచయిత్రి

సహజంగా నేను స్నేహశీలిని. ఎవరైనా ఆడవాళ్ళు మీరంటే మాకు చాలా ఇష్టం అంటే చాలు, వెంటనే స్నేహం చేస్తాను. వాళ్ళు పిలిస్తే ఇళ్ళకి కూడా వెళ్తాను. ఈ మధ్య కోవిడ్ కారణంగా ఒక ఏడాది ఇంట్లోనే నేనూ, మా వారూ గోడలూ, ఒకరి మొహాలు ఒకరు చూసుకుంటూ గడిపాకా, ఓ డాక్టర్ ఫ్రెండ్ “అక్కా… అందరినీ ఓసారి చూడాలనిపించి, చిన్న ఆత్మీయ సమాగమం ఏర్పాటు చేస్తున్నాను” అంటే, అటు నుంచి అటే మా అబ్బాయి ఇంటికి కూడా వెళ్ళొచ్చని నేనూ, మా వారూ వెళ్ళాము. ఆ డాక్టర్ నాకు చెల్లెలు లాంటిది. నేనన్నా, మా అశ్విన్ అన్నా తనకి చాలా ప్రేమ.

అక్కడొక లేడీ పరిచయం అయింది. “ఫేస్‍బుక్‌లో చూస్తుంటాను కానీ ఎప్పుడూ ఫేస్‌బుక్‌లో ఫ్రెండ్ రిక్వెస్ట్ పెట్టేటంత ధైర్యం చెయ్యలేదండీ, ఏమనుకుంటారోననీ” అంది. మంచి విద్యాధికురాలు. నేను వెంటనే నా స్నేహ హస్తం చాచాను. ఎఫ్.బి.లో రిక్వెస్ట్ పంపమని, అది వెంటనే ఏక్సెప్ట్ చేసాను.  మా ఐడ్రీమ్స్ అంజలి కూడా ఆ గెట్ టుగెదర్‍కి వచ్చింది. అందరం సరదగా మాట్లాడుకున్నాం. నా జోక్స్‌కి తెగ నవ్వారు. ఆ తర్వాత ఈ లేడీ నన్ను వాళ్ళింటికి ఇన్వైట్ చేసింది. మధ్యలో కొంత కోవిడ్ తగ్గడం వలన, చట్నీస్‌కి వెళ్దామా అంటే, “ఒద్దు… ఇంకా మనెవ్వరికీ సెకండ్ డోస్ వాక్సిన్ అవలేదు, ఓ డాక్టర్ వున్నాడు, అతనికి తప్ప” అని వాళ్ళింటికే డిన్నర్‍కి పిలిచింది!

ఐడ్రీమ్స్ అంజలి ఏదో షూటింగ్‍‍లో వుంటే, నేను చేసి “మరీ కొత్తవాళ్ళు, ఒక్కదాన్నీ ఏం వెళ్తాను? నువ్వూ రా” అన్నాను. అంజలికి నేనంటే ప్రేమతో కూడిన భయంతో కూడిన భక్తి అని చెప్తూ వుంటుంది. పాపం అలసిపోయి, వచ్చి నన్ను పిక్ చేసికుని, తన కార్లో, వాళ్ళింటికి తీసుకెళ్ళింది. ఆవిడొక్కతే వుంటుంది ఆ ఫ్లాట్‍లో. లోపల అన్నగారు వున్నారు అంది. మాకు కనిపించనే లేదు! చాలా సరదగా మాట్లాడింది. ఒక సైకియాట్రిస్ట్‌కి చెప్పుకున్నట్లు తన జీవితంలోని విషాదం గురించి చెప్పింది! ఆమె మొదటి హజ్బెండ్ తల్లి, మా అమ్మకి స్నేహితురాలు! అని మాటల మధ్య తెలిసింది. నేను ఆమెని చాలా ఓదార్చి, “జీవితంలో ఒంటరితనం ఎప్పుడూ ఫీల్ అవద్దు, నేనున్నాను… ఏం కావాలన్నా చేస్తాను” ఇలా చాలా ఓదార్పు నిచ్చాను. ఆ వచ్చిన డాక్టర్‌కి లిఫ్ట్ లోంచి, వీళ్ళ ఇంట్లోకి కాలు పెట్టే లోపే, ఏదో ఫోన్ వచ్చి, “హాస్పిటల్‍లో ఏదో ఎమర్జెన్సీ” అని వెళ్ళిపోయాడు. అంజలి మాత్రం, “ఏదో లేడీ వాయిస్ వచ్చింది మేడం… వాళ్ళావిడేమో…” అంది. అంతకన్నా లోతుల్లోకి వెళ్ళను! ఎందుకంటే వీళ్ళిద్దరితో నాకు అంత పరిచయం లేదు. తిరిగి వచ్చేటప్పుడు కూడా ఆవిడ నన్ను దగ్గరకు తీసుకుని, “మీ లాంటి గొప్ప ఫ్రెండ్స్ దొరకటం ఎంత లక్కీ, చాలా థాంక్స్” అని చెప్పి, వాళ్ళ ఫ్లాట్స్ కింద బోలెడు ఫొటోలు తీయించుకుంది నాతో!

రచయిత్రి అభినందన సభ

ఇది జరిగాకా, ఒకటి రెండుసార్లు మెసేజ్‍లు చేసుకున్నాం. మా ‘తోడూ నీడా’ రాజేశ్వరి గారి ఫోన్ నెంబరు అడిగింది. ఎవరో ఫ్రెండ్‍కి ద్వితీయ వివాహం కోసం, ఇచ్చాను. అంతా బావుంది. ఒక వారం తర్వాత మెసేజెస్‍కి రిప్లై లేదు. నేను ఫోన్ చేస్తే తియ్యలేదు!

ఆ రోజు రాత్రి ఇంటి దగ్గర నన్ను దింపుతూ, మా అంజలి “ఆవిడలో ఏదో తేడాగా వుంది మేడం.. మీరు ఫ్రెండ్‌షిప్ చేసేటంత విషయం లేదు ఆవిడలో…” అంది. అక్కడున్న కాసేపట్లో తన అందాన్ని బోలెడు సినీతారలతో తానే పోల్చుకుంటూ మాట్లాడడం అంజలికి నచ్చలేదు! నేను అవేం పట్టించుకోలేదు. కానీ ఆవిడ వాట్సప్‍లో మెసేజ్‌లు చూడనప్పుడు, ఆ డాక్టర్ ఫ్రెండ్‌ని “ఆవిడకేం అయిందీ? ఎందుకు మాట్లాడడం లేదు నాతో?” అని అడిగాను మెసేజ్‍లో. “నాకు తెలీదండీ” అన్నాడు. ఈవిడ వాట్సప్‍లో “I am very busy” అని పెట్టింది. అంతే కాదు, బ్లాక్ చేసింది. “ఎందుకు ఇలా చేసిందీ?” అని నేను కొంచెం మెదడు బద్దలు కొట్టుకున్నాను… కానీ అంజలి “ఆవిడ అత్తగారు మీ అమ్మకి ఫ్రెండ్ అన్నారుగా… ఈవిడ చెప్పిన వాటిల్లో నిజాలు ఎన్నో! భయపడింది పాపం” అంది.

(సశేషం)

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here