జీవన రమణీయం-168

0
5

[box type=’note’ fontsize=’16’] టీవీ, సినీరంగాలలో తనదైన ప్రత్యేక స్థానాన్ని ఏర్పర్చుకున్న సుప్రసిద్ధ రచయిత్రి బలభద్రపాత్రుని రమణి నిజజీవితంలోని అనుభవాల రమణీయమైన కథనం ‘జీవన రమణీయం‘ ఈ వారం. [/box]

[dropcap]’తో[/dropcap]డూ-నీడా’ రాజేశ్వరి గారి హోమ్‍లో దసరాకి దాండియా, బోనాలు లాంటి పలు కార్యక్రమాలకి నేను హాజరయ్యాను. అందరం సరదాగా పులిహోరా, బూరెలతో తెలుగు భోజనాలు చేసేవాళ్ళం.

తోడో-నీడాలో దాండియా ఆడినప్పుడు… దివ్యజ్యోతి గారు, రచయిత్రి, రాజేశ్వరి గారు

మా ఇద్దరికీ చుట్టరికం కలవకపోయినా స్నేహం బాగా కలిసింది. ఇప్పటికీ కలిసి కబుర్లు చెప్పుకుంటూ వుంటాం. ఈ సందర్భంగా నాకు ఫ్యాన్‍గా పరిచయం అయి ఆత్మీయమైన స్నేహితురాలిగా మిలిగిన రేణుక చలిమెడ గురించి కూడా చెప్పుకోవాలి! నాకు చాలామంది నా రచనలు చదివి అభిమానంగా వుత్తరాలు, మెయిల్స్ రాస్తూ వుంటారు. ఒకసారి కౌముదిలో నా ‘కాలం దాటని కబుర్లు’కి కామెంట్స్‌లో ఒక అభిమాని “మీతో కలిసి పుల్లారెడ్డీ స్వీట్ హౌస్‍లో మిర్చీబజ్జీ తిన్నట్టు  నాకు కల వచ్చింది. నా కల ఎప్పుడు నిజం అవుతుందో ఏమో… మీరంటే నాకు చాలా ఇష్టం” అని పెట్టారు. ఆ తర్వాత ఫేస్‌బుక్‍లో మెసెంజర్ ద్వారా ఆవిడ పేరు రేణుక చలిమెడ అనీ, జగిత్యాలలో వుంటారనీ తెలిసింది. ఒకసారి “రేపు హైద్రాబాదు వస్తున్నాను, మిమ్మల్ని కలవచ్చా?” అని పెట్టారు.

ఆ రోజు నేను కాంతి కిరణ్ పాతూరిని కూడా పంజాగుట్టలో మా అన్నయ్య ఇంట్లో కలిసేది వుంది. “సరే… ఎక్కడ కలుస్తారు?” అన్నాను. “రాజ్‌భవన్ రోడ్‍లో మా కజిన్ ఇంట్లో” అన్నారావిడ.

నేను ఆ రోజు నా మిగతా ఎంగేజ్‍మెంట్స్ గబగబా పూర్తి చేసుకుని, రేణుక చెప్పిన ఎడ్రెస్‍లో హైద్రాబాద్ రాజ్‌భవన్ రోడ్ లోని ఒక అపార్టుమెంట్‍లో రేణుకని, ఆమె కజిన్ ఇంట్లో కలిసాను. “అమెరికా ఉండే నా ఇద్దరు డాటర్స్‌కీ డైమండ్స్ కొనడానికి వెళ్ళాను. లేట్ అయింది. సారీ” అందావిడ. అంతే… కలిసిన మొదటి క్షణంలోనే ఇద్దరం మంచి స్నేహితులం అయ్యాము. ఆవిడ భర్త డాక్టరు. పేరు మధుసూదనరావు గారు. వాళ్ళు జగిత్యాలలో వుంటారు. బంజారాహిల్స్‌లో ఓన్ హౌస్ వుంది. వాళ్ళకి ఇద్దరూ అమ్మాయిలే, సరితా, హర్షితా. సరిత ఒక కాలేజీ బోర్డులో పనిచేస్తుంది. ఆమె భర్త సాఫ్ట్‌వేర్ రంగంలో ఉన్నాడు. హర్షు హౌజ్ వైఫ్, ఆమె భర్త డాక్టరు. యూ.ఎస్.లో వుంటారు. ఈ వివరాలు అన్నీ విన్నాకా, కాసేపు సరదాగా మాట్లాడుకున్నాం. తర్వాత మా స్నేహం కంటిన్యూ అయింది.

రేణుక చలిమెడ గారితో రచయిత్రి

నేను అమ్మని తీసుకుని 2014లో జగిత్యాల వెళ్ళాను. ఆ రోజు హోరున వర్షం! మా కారులోనే డ్రైవర్ కుమార్‌తో వెళ్ళాం. నాకు కొండగట్టు హనుమాన్ దేవాలయం, ధర్మపురీ చూడాలని వుంది చాలా కాలంగా. రేణుక అన్నీ చూపిస్తాను రమ్మని ఆహ్వానించింది.

వెళ్ళాక తెలిసింది, ఆ దంపతులు పలు సంఘ సేవా కార్యక్రమాలలో పాలుపంచుకుంటూ బిజీగా వుంటారనీ, ఆ డాక్టరు గారు పేదల పాలిటి పెన్నిధి లాంటి వారనీ, మేం వెళ్ళిన ధర్మపురి దేవాలయంలో పూజారి “అమ్మా డాక్టరు గారు నా బిడ్డని రక్షించిన దేవుడు అమ్మా” అని ఆయన గొప్పతనం, కరుణా, దాతృత్వం గురించి మెచ్చుకుని మాట్లాడి, మాకు పూజలు జరిపించారు. అప్పుడు నేను మా అబ్బాయిల వివాహ విషయంగా ధర్మపురిలో లక్ష్మీనరసింహస్వామి కళ్యాణం జరిపిస్తానని మొక్కుకున్నాను.

సంతోష్ కుమార్ అనే అబ్బాయి, జ్యోతిష్యుడు నాకు ఫేస్‌బుక్ ద్వారా పరిచయం. ఆ అబ్బాయి గురించి టీ.వీ.లో కూడా చూపించారు. రెండు కాళ్ళూ పోలియో వలన కోల్పోయినా, అతను శాస్త్రాన్ని నమ్ముకుని కృషి చేసి మంచి పేరు తెచ్చుకున్నాడు. అతని వల్ల కూడా నేను ఈ పుణ్యక్షేత్రం గురించి తెలుసుకుని, వెళ్ళాలనుకున్నాను. ఈ అబ్బాయి వర్చస్సు చూస్తేనే సుబ్రమణ్యేశ్వర స్వామిలా వుంటాడు! ఆ రోజు సంతోష్ ఇంటికి ఎడ్రస్ అడిగితే, ఊళ్ళో ప్రతివాళ్ళూ చెప్పారు. అతనంత ఫేమస్. అక్కడ బ్రాహ్మణ అగ్రహారం వుంది. వారు తెలంగాణా బ్రాహ్మలు! మహారాష్ట్ర నుండి ఇక్కడకి వలస వచ్చి సెటిల్ అయిన వాళ్ళు ఇక్కడ ఎక్కువ. వాళ్ళ అమ్మగారు గోచీ పోసి చీర కట్టుకుని పార్వతీదేవిలా వున్నారు. “అమ్మా, మీరు ఈ పూట ఇక్కడ భోం చేసి వెళ్ళాలి” అన్నారు. రేణుక ఇంట్లో హెల్పర్స్‌ని… రేణుక పనిచేసే వాళ్ళని అలాగే అంటుంది… వంట చెయ్యమని చెప్పి రావడం వల్ల, “వద్దు, ఇంకోసారి వస్తాం” అన్నాము. అతను సుమ, ఝాన్సీ లాంటి టీ.వీ. – సినిమా వాళ్ళు తన దగ్గర జ్యోతిష్యం చెప్పించుకోడానికి వస్తారు అని చెప్పాడు.

జ్యోతిష్యుడు సంతోష్ కుమార్‌తో రచయిత్రి

రేణుక, ఆమె భర్త డాక్టర్ మధుసూదనరావు గారికేం తీసిపోలేదు! ఒక అనాథ శరణాలయం కూడా నిర్వహిస్తోంది. అందులో పిల్లలకి  విద్యాబుద్ధులు నేర్పించి, సమాజానికి పనికివచ్చే ఉత్తమ పౌరులుగా తీర్చిదిద్దుతున్నారు. ఆ పిల్లలను చూసి నా మనసు నిండిపోయింది.

రేణుక చలిమెడ నిర్వహించే బాలికల ఆశ్రమంలో రచయిత్రి

అంతే కాదు, తన డ్రైవర్ బద్రీ అనే అబ్బాయికి ఇంట్లోనే ఔట్ హౌస్ కట్టించి, అందులో వుంచి, పెళ్ళి చేయడమే కాకుండా, ఆ దంపతులను స్వంత వాళ్ళతో సమానంగా చూసుకుంటూ, అతని పిల్లలని తన మనవలలా అంత ప్రేమగా చూసుకోవడం చూసి, మేం ఆశ్చర్యపోయాం. ఆ బద్రీ పాపని తనే తయ్యారు చెయ్యడం, తన పక్కన పడుకోపెట్టుకోవడం, మాతో పాటు భోజనం పెట్టడం… ఇంత పెద్ద మనసు వుండడం అరుదు!

తర్వాత రోజు మేం కొండగట్టు వెళ్ళి ఆంజనేయస్వామిని దర్శించుకున్నాం. మారేడ్‍పల్లిలో మా సాయిబాబా గుడిలో పూజారి గారు ఆంజనేయస్వామి మాల వేసుకుని “కొండగట్టు వెళ్ళి ఈ మాల తియ్యాలి” అని నాతో చాలాసార్లు చెప్పారు. ఆ విధంగా కొండగట్టు పేరు నేను చాలా సార్లు ఆయన నోటివెంట విన్నాను.

కొండగట్టు ఆలయంలో రేణుకగారితో రచయిత్రి

కొండగట్టులో బోలెడు కోతులున్నాయి! స్వామికి ప్రియం కదా! ఓ అబ్బాయి సెల్‍ఫోన్ తీసుకొని ఓ కోతి పారిపోవడంతో, మేం చాలా జాగ్రత్తగా, సెల్‍లు బయటకి తియ్యకుండా వున్నాం. రేణుకని గుర్తు పట్టి, అక్కడ కూడా బాగా పూజలు జరిపించారు! మా హనుమంతు అన్నయ్య గుంతకల్‍లో వున్నప్పుడు ఇలాగే ‘కసాపురం’ వెళ్ళి నేను రెండుసార్లు ఆంజనేయుడిని దర్శించుకున్నాను. నాకు చిన్నప్పటి నుండీ ఆంజనేయ స్వామి ఇష్టదైవం! ‘ఆయనని పూజిస్తే మీతో పెళ్ళి జరిపించాడు’ అని మా ఆయన్ని దెప్పుతుంటాను. మా పిల్లలిద్దరూ కూడా ఆ స్వామికి ఇష్టమైన మంగళవారం నాడే పుట్టడం ఓ విశేషం!

మా రెండవ వాడికి ‘అనంత’ అని పేరులో ఆయన పేరు కూడా కలిపాను. ఇప్పుడు మా ఇంటికి దగ్గిర అని ‘తాడుబందు’ ఆంజనేయస్వామి గుడికి ఎక్కువగా వెళ్తూ వుంటాను. అలా వెళ్ళినప్పుడు మా కస్తూరిబా గాంధీ కాలేజ్, తెలుగు లెక్చరర్ కిడాంబి జ్యోతిర్మయీ మేడం‍ని చాలాసార్లు కలుస్తుంటాను. ఇటీవలే మనకి దూరం అయిన సినీ కమేడియన్ జయప్రకాష్ రెడ్డి గారినీ ఓసారి కలిసాను. అక్కడ ఆకుపూజ చేయిస్తే గండాలు తప్పిపోతాయని నా నమ్మకం! కోరిన కోరికలన్నీ ఫలిస్తాయని నేను గుడికి వెళ్ళను. కొత్తగా గండాలేం రాకూడదని గుడికి వెళ్తాను!

రేణుకే కాదు, రేణుక భర్త డాక్టర్ మధుసూదనరావు గారు కూడా మమ్మల్ని ఆప్యాయంగా చూసారు. అమ్మ ఈ ప్రయాణంలో చాలా సంతోషించింది. కార్తీకమాసం కదా, గోదావరీ పాయ ధర్మపురి వచ్చింది. అందులో దీపాలు వదిలాం. అంతేకాదు, అతి పురాతనమైన దేవాలయాలు చాలా చూసాం. రావణాసురుడు స్వయంగా శివలింగాన్ని అభిషేకించి, పూజలు చేసిన శివాలయాన్ని కూడా చూసాం!

రేణుకా, డా. మధుసూదనరావు దంపతులతో… వారింట్లో… రచయిత్రి

రేణుక చలిమెడ ఇంట్లో మేము రెండు రాత్రుళ్ళున్నాము. చాలా బాగా చూసింది. రేణుక వంట చాలా బాగుంటుంది. వచ్చేటప్పుడు నాకు మంచి చీర పెట్టి పంపించింది.

అక్కడ కాళ్ళకి పెట్టుకునే వెండి, పంచలోహాల పట్టీలు ఫేమసట! ఆసలు ఆ విషయం నాకెలా తెలిసిందంటే, అసలు నేను మొదట మొదలుపెట్టిన రాజేశ్వరి గారే కారణం!

‘తోడూ-నీడా’ సంస్థ గురించీ, రాజేశ్వరి గారి గురించీ నేను ఫేస్‌బుక్‌లో పోస్ట్ చేసినప్పుడు చూసి, రేణుక చలిమెడ, “ఆ రాజేశ్వరి గారు మాకు బంధువులు… ఆవిడ ఇటీవల పెళ్ళి చేసుకున్న ఆమె భర్త దామోదరరావు గారు, మా వారికి మేనత్త కొడుకు” అని నాకు మెసేజ్ చేసింది. ఆ విధంగా మా రాజేశ్వరి గారూ, రేణుకా బంధువులు అన్నమాట. నేనెంతో సంతోషించాను. రాజేశ్వరి గారు “జగిత్యాలలో పంచలోహాల పట్టీలు, రకరకాల రంగురాళ్ళతో, అక్కడ ఫేమస్” అని చెప్పారు. ఆ విషయం రేణుకని అడిగితే, “ఔను!” అని చెప్పి, రేణుక గుర్తుపెట్టుకుని, ఈ మధ్య నా కోసం కొని, కోవిడ్ టైం‍లో తన హైద్రాబాద్ ఇంటికి పంపిస్తే మా డ్రైవర్ కుమార్ వెళ్ళి తీసుకొచ్చాడు. చాలా బావున్నాయి.

అన్నట్లు మర్చిపోయాను, మా కుమార్‍కీ వాళ్ళ డ్రైవర్ బద్రీకీ చాలా స్నేహం అయ్యింది జగిత్యాల వెళ్ళినప్పుడు. రాజేశ్వరి గారూ, నేనూ బంజారాహిల్స్ లోని రేణుక ఇంట్లో ఓసారి కలిసాం. అందుకే కుమార్‍కి ఆ ఇల్లు తెలుసు!

నేనూ రాజేశ్వరి గారూ, రేణుకా లంచ్‍కి కూడా ఒకటి రెండు సార్లు వెళ్ళాం. అలా మా స్నేహ బృందం విస్తరిస్తూ వుంటుంది. ఇలా డాక్టర్ మధుసూదనరావు గారూ, రేణుకా, రాజేశ్వరి గారూ, దామోదరరావు గారూ లాంటి మంచి మనుషులు నా జీవన ప్రయాణంలో భాగస్తులౌతూనే వుంటారు.

(సశేషం)

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here