జీవన రమణీయం-173

3
8

[box type=’note’ fontsize=’16’] టీవీ, సినీరంగాలలో తనదైన ప్రత్యేక స్థానాన్ని ఏర్పర్చుకున్న సుప్రసిద్ధ రచయిత్రి బలభద్రపాత్రుని రమణి నిజజీవితంలోని అనుభవాల రమణీయమైన కథనం ‘జీవన రమణీయం‘ ఈ వారం. [/box]

[dropcap]అ[/dropcap]క్కడ టాయ్‌లెట్స్ మీద స్త్రీలకి ‘ప్రియా’, మగవారికి ‘పురుష’ అని వుండటం చూసి నేను నవ్వుకున్నాను, స్త్రీలంతా ‘ప్రియ’నే అని. వాళ్ళది గేటెడ్ కమ్యూనిటీలా వుంది. ఎక్కువగా ఇండియా నుంచి వెళ్ళిన గుజరాతీస్ వున్నారు. పాలని ‘సుసు’ అంటారుట. వారానికి రెండు సార్లు పాల వ్యాన్ వస్తుందిట. గేట్ దగ్గరకి వెళ్ళి మా మరిది పేరు చెప్పి ‘శ్రీకాంత్ సుసు’ అంటే పాలు పోస్తారట. ఇది విని బాగా  నవ్వుకున్నాం. ఇండోనేషియన్స్ చాలా సౌమ్యులు, ముస్లిం మెజారిటీ వున్న నేషన్.

మేం బజార్‌కి వెళ్తుండగా, ఓ చిన్న ఏక్సిడెంట్ లాంటిది జరిగింది. రెండు టూ వీలర్స్ గుద్దుకున్నాయి. ఇద్దరూ ఆగారు. దిగి ఒకరికి అభిముఖంగా ఒకరు వెళ్ళారు. అదే మన హైదరాబాద్‌లో అయితే షర్ట్ స్లీవ్స్ పైకి తోసుకుని, ముష్టి యుద్ధానికి తలపడ్తారు, పెద్దగా తిట్టుకుంటూ. కానీ వీళ్ళు ఒకరికి ఒకరు రెండు చేతులూ జోడించి, నమస్కారం చేసుకొని ఎవరి దారిన వాళ్ళు వెళ్ళారు. “అదేంటో వీళ్ళు కొట్లాడుకోరు పాడు” అని మా చెల్లెలు అంటే నవ్వుకున్నాం.

నేనొచ్చాను అని శ్రీకాంత్ లీవ్ పెట్టి, మమ్మల్ని హాట్ వాటర్ స్ప్రింగ్స్‌కి తీసుకెళ్ళాడు. వాళ్ళమ్మాయి ప్రణీత ప్లస్ టూ, పిల్లాడు సిద్ధు సెవెంత్ క్లాస్ అనుకుంటా అప్పుడు. నా కాళ్ళని కొత్త చెప్పుకు కొరికెయ్యడంతో, లావణ్య వేరే చెప్పులిచ్చింది. నేను ఆ వేడి నీటి బుగ్గలో కాళ్ళు పెట్టి కూర్చుంటే ఉపశమనంగా అనిపించింది! దాని పక్కనే ఇంకో చల్ల నీటి చెలమ, చాలా ఆశ్చర్యంగా అనిపించింది.

వేడి నీటి బుగ్గల దగ్గర రచయిత్రి
లావణ్య, సిద్ధార్థ్‌లతో వేడి నీటి బుగ్గల దగ్గర రచయిత్రి

“ముందుగా ప్లాన్ చేసుకొని వస్తే, ‘బాలి’ వెళ్ళేవాళ్ళం” అని శ్రీకాంత్ అన్నాడు. ఇక్కడ కూడా చారిత్రాత్మకమైన ప్లేసెస్, బుద్ధుని స్తూపాలూ, బౌద్ధ ఆరామాలకి వెళ్ళాం. కానీ ఆ రోజు పబ్లిక్ హాలీడే కాబట్టి అవన్నీ మూసి వున్నాయి.

బౌద్ధ ఆరామం గేటు ముందు లావణ్యగారితో రచయిత్రి

స్టార్‌బక్స్‌లో కాఫీ తాగాం. నాకు ఇండోనేషియా లోకల్ ఫుడ్ టేస్ట్ చెయ్యాలని చాలా అనిపించింది. శ్రీకాంత్ “మనం వెళ్దాం వదిన గారూ” అన్నాడు కానీ, మన ‘తాజ్ హోటల్’ లోనే మా బాబాయ్ దోశా, ఇడ్లీ తినడానికి మొహం అదోలా పెట్టి “ఏం తినను” అని కూర్చున్నాడు. మేం దోశలూ, వడలూ తిని, రాత్రి ఇంటికొచ్చాకా, పిన్ని మళ్ళీ స్టౌ వెలిగించి, చపాతీ కూరా చేసి పెట్టింది! మళ్ళీ ఒకే చపాతీ, రెండు కూడా తినడు రాత్రి పూట.

పిన్ని, బాబాయ్, శ్రీకాంత్‌లతో స్టార్‌బక్స్ వద్ద రచయిత్రి

ఆయన ఈటింగ్ హాబిట్స్ చెప్పుకోవలసినవే! పొద్దుట ఎంత మంచి, అపురూపమైన ఐటమ్స్ చేసినా, రాత్రికి వుంచకూడదు. ఫ్రిజ్‍లో పెట్టి తినడం, ఇంటిల్లిపాదికీ నిషిద్ధం. పనిమనిషికి ఇచ్చేయాల్సిందే. లేదా ఎవరికైనా దానం చేసి రావాలి.

రెండవది కొత్తిమీర తినడు. సహించదు. అందుకని ఆయనకి కూరా, పచ్చడీ తీసేసి, కొత్తిమీర వేస్తుంది పిన్ని. ఇక్కడ లావణ్య కూడా అద్భుతంగా పావ్ భాజీ చేసింది. వాళ్ళ నాన్నకి కొత్తిమీర లేకుండా తీసి, అప్పుడు కొత్తిమీర జల్లింది. ఎప్పుడూ మా అందరినీ, నవ్విస్తూ వుండే బాబాయ్‌కి కోపమూ ఎక్కువే. తన మాట కాదంటే అలుగుతాడు.

మా లావణ్యని ఏవో మనవల కోసం చేసిన పోస్టల్ సేవింగ్స్ సర్టిఫికెట్స్, మెచ్యూర్ అయిపోయాయి అని, తియ్యమన్నాడు బయటకి. దానికీ నాలాగే మతిమరపు, ఒకంతట గుర్తు రాలేదు ఎక్కడ పెట్టిందో. భయం, నవ్వూ దానికి. “నాన్నా… ఎందులో పెట్టానో గుర్తు రావడం లేదు… ఎలా వుంటాయి?” అని అతి కష్టం మీద అడిగితే, “నేను చెప్పను” అంటాడీయన. అప్పటికే కోపం వచ్చి మొహం ఎర్రబడిపోయింది! దాని భయం. నాకూ, శ్రీకాంత్‌కీ నవ్వు! ఆ ఘట్టంలో మా పిన్ని మందులు వేసుకుని వెళ్ళి నిద్రపోయింది.

మొత్తానికి ఆ సర్టిఫికెట్స్ దొరికాయి కనుక ఆ రోజు ప్రశాంతంగా గడిచింది. ఆయనా నవ్వేసాడు మాతో కలిసి.

అలాంటి పరిస్థితుల్లో, నన్ను ఇండియా నుండీ, మలేషియా అంతా కూడా తెలుగు భాషని ఖూనీ చేస్తూ వెంటాడిన, రవి గారు ఫోన్ చేసారు… మా బాబాయ్ తీసాడు లాండ్‌లైన్.

“హలో” అనగానే, తన పేరు చెప్పి “రమణీ వస్తుంది నిన్న జకార్తా” అన్నాడుట.

“నిన్నకీ… వస్తుందికీ ఏమైనా సంబంధం వుందా? నిన్న పాస్ట్, వస్తుంది ఫ్యూచర్ టెన్స్” అని క్లాస్ పీకాడు అతనికి. “ఇంతకీ ఎవరు మీరు?” అన్నాడు.

“రమణీ చెప్పాడు 17th కి టికెట్ కావాలి” అని అన్నాడు అతను.

“రమణీ చెప్పిందో, చెప్పాడో తెలీని వాడివి, నీకు సరిగ్గా వచ్చిన భాషలో చెప్పి ఏడు… తెలుగుని ఖూనీ చెయ్యకు” అని మా బాబాయ్ మండిపడ్డాడు. అతనికి తెలుగు నేర్పాడు.

అతని వ్యాకరణం బాధ వదిలించుకునేందుకు, నేను మా గణేష్‌కి ఫోన్ చేసి, టికెట్ బుక్ చేయించుకుని స్వంత డబ్బుతో, ఇండియాకి వచ్చేసాను. మా మెమెంటోలు “నేను తెచ్చి ఇస్తాను” అన్నాడు. ఇప్పటి దాక అవి చేరనే లేదు! మళ్ళీ ఎప్పుడూ నాకు అతను ఇంతదాకా జీవితంలో తారసపడలేదు. మా బాబాయ్ ‘ఏం తెలుగు’ నేర్పాడో.

ఇండోరమా కాలనీలోని రామమందిరం వద్ద

ఇండోనేషియాలో ప్రసిద్ధంగా చెప్పుకోవలసివి, వాళ్ళు కలపతో చేసే బొమ్మలు. ‘అంగోర్‍వాట్స్’ దేవాలయాల నమూనాలు. ఇంక పళ్ళు అయితే రకరకాలు. సముద్ర తీర ప్రాంతాలన్నింటిలోనూ అంతేనేమో. రాంబూటాన్, డ్రేగన్ ఫ్రూట్, లిజీ, స్ట్రాబెర్రీస్, ఈత పళ్ళ లాంటివి తెగ తిన్నాం. తపన్‍మునియా లాంటి మంచి, శిల్ప సంపద వున్న ప్లేసెస్‌కి వెళ్ళాం. పెద్ద పెద్ద మాల్స్‌కి వెళ్ళాం. పెర్ఫ్యూమ్స్, షర్ట్స్ కొన్నాను మా అబ్బాయికి. అక్కడ నోట్ల మీద 100,000, 250,000 లాంటి సంఖ్యలున్నవి ఖర్చు పెడ్తూ తిరిగితే, కోటీశ్వరురాలిగా ఫీల్ అయ్యాను. ఇంటర్నేషనల్ కార్డు ఎందుకో పనికి రాలేదు. కానీ HDFC కార్డ్ మీదే షాపింగ్ దివ్యంగా చేసాను. అప్పుడు మా చెల్లెలు కొడుకు ‘సిద్ధూ’ పదేళ్ళవాడు. అఖండంగా మాట్లాడేవాడు. నేనూ బాబాయ్ తీరుబడిగా కూర్చుని, తను ఇండియా వదిలిపెట్టి వచ్చాకా, ఎవరెవరు బంధుగణంలో పోయారో, ఏకరువు పెడ్తూ శ్రద్ధాంజలి ఘటిస్తున్నాం. ఈ చిచ్చర పిడుగు మధ్యలో “ఖుషీకా మౌకా మే క్యో ఏ టాపిక్స్?” అన్నాడు. ‘నిజమే’ అనుకుని, నేను ఎవరెవరికి పెళ్ళిళ్ళు అయ్యాయ్యో, పిల్లలు పుట్టారో ఏకరువు పెట్టాను.

అంగోర్‌వాట్స్ ఆలయ నమూనాలు

ఈ చిచ్చర పిడుగు ఎదురింటిగికి స్లీప్ ఓవర్‌కి వెళ్ళొచ్చాకా, “ఆంటీ ఏం చేసి పెట్టిందిరా?” అని అడిగాం. “చోలే బతూరా” అన్నాడు. “ఏలా చేసిందీ?” అని అడిగాను. “ఏజ్‌కి తగ్గట్టే చేసిందిలే” అన్నాడు. అంతటితో ఆగకుండా, “ఆంటీకి ఈ మధ్య ఇల్లు డెకరేట్ చెయ్యాలన్న పిచ్చ పట్టుకుంది” అన్నాడు.

వాడి మాటలకి నేను నవ్వి, “డెకరేట్ చేస్తే పిచ్చి ఏం వుందిరా పాపం!” అన్నాను.

“కమోడ్‍కి ఒక పూల పూల కవర్ వేసింది. పైన ఒక స్టికర్ అంటించింది” అన్నాడు. నేను “ఔనా” అని ఆశ్చర్యపోయాను నిజంగానే.

వచ్చేటప్పుడు మా చెల్లెలు ఓ ఇండోనేషియా క్రాఫ్ట్స్ షాప్‌లో నన్నే సెలెక్ట్ చేసుకోమని ఓ బొమ్మ కొనిపెట్టింది. షో కేస్‍లో పెట్టుకోవడానికి. సంక్రాంతి పండుగ నాడు పిన్ని చేసిన ఆవడలూ, పులిహోరా, పాయసంతో, మా ‘అంకరాజు’ (పుట్టింటి పేరు) సిగ్నేచర్ డిష్ వంకాయ కారం పెట్టిన కూరతో, సాంబారుతో దిగ్విజయంగా గడిచింది.

ఇండోనేషియా క్రాఫ్ట్స్ బొమ్మ

ఫీనిక్స్‌లో నేను మా బాబు మావయ్య (మా  అమ్మ కజిన్ బ్రదర్) మణి అత్తయ్యతో  గడిపిన మూడు రోజూలూ, ఇక్కడ సాయి బాబాయి రామలక్ష్మి పిన్నితో గడిపిన మూడు రోజులు నేను నిజంగా చాలా ఆనందంగా గడిపినవి. బాబాయ్‌తో కాలనీలో గుడికి వెళ్ళడం; “మా అమ్మాయికి పెట్టవే” అని పిన్నికి రకరకాల వంటలు పురమాయించడం; స్ట్రాబెరీస్ తోటలో ఆవకాయ అన్నం కలిపి నా నోట్లో పెట్టడం; చిన్నప్పటి విషయాలన్నీ తోడుకుంటూ, పోయిన నాన్ననీ, బాబాయిలనీ, అత్తలనీ తలచుకుంటూ కబుర్లు చెప్పుకోవడం… అనీ భలేగా గడిచాయి. మళ్ళీ హైదరాబాదు వచ్చాకా, మేం కలిసింది తక్కువే. ఈ రోజుల్లో ఎవరింటికి వెళ్ళి ఎవరం వుంటాం చెప్పండీ! అందరం హైదరాబాద్‌లోనే స్థిరపడ్డాం. ఎక్కడికి వెళ్ళినా కొన్ని గంటలే వుండి ‘ఇంటికెళ్ళాలి’ అని తొందరపడ్తూ వచ్చేస్తాం. అప్పుడప్పుడూ మన పెదనాన్నలు, పెద్దమ్మలు, బాబాయ్‌లూ; వుంటే అమ్మమ్మా తాతయ్యలతో గడపాలి! మనం చిన్నపిల్లలం అవుతాం. అపురూపాలు చేయించుకుంటాం! ఎంతో ఆనందంగా గడుపుతాం.

ఇండోనేషియా నుండి నేను వచ్చే ముందు రోజే మూడు నెలల కోసం శ్రీకాంత్ నైరోబీ వెళ్ళాడు ఆఫీసు పని మీద.  నన్ను బాబాయ్ మళ్ళీ నాలుగు గంటలు ప్రయాణం చేసొచ్చి జకార్తా ఎయిర్‌పోర్ట్‌లో దింపాడు. శ్రీకాంత్ ఎయిర్‌పోర్ట్ ఫీజ్ తమ కరెన్సీలో నాకు ఇచ్చి వెళ్ళాడు!

(సశేషం)

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here