జీవన రమణీయం-181

2
7

[box type=’note’ fontsize=’16’] టీవీ, సినీరంగాలలో తనదైన ప్రత్యేక స్థానాన్ని ఏర్పర్చుకున్న సుప్రసిద్ధ రచయిత్రి బలభద్రపాత్రుని రమణి నిజజీవితంలోని అనుభవాల రమణీయమైన కథనం ‘జీవన రమణీయం‘ ఈ వారం. [/box]

[dropcap]ఆ[/dropcap] రోజు నుండీ తను నన్ను ప్రత్యేకంగా చూడటం నేనూ గమనించాను కానీ, ఇంత త్వరగా పెళ్ళి చేసుకుంటానని అంటాడని అస్సలు వూహించలేదు!

ఇంక పెళ్ళి సందడిలో, నేను మాత్రం నా లోకంలో నేను వున్నాను. సినిమా అయితే, ఓ పక్క కూర్చుని మల్లె పందరి చూసుకుని, ‘మదిలో వీణలు మ్రోగే’ అని పాడుకునేదాన్నేమో (నాకు వీణ పట్టుకోవడం కూడా రాదు! కానీ సినిమాల్లో కూడా హీరోయిన్ వీణా, సంగీతం, నృత్యం నేర్చుకున్నట్టు ఎక్కడా చూపించరుగా!).

ఆ విధంగా ‘కళ్ళకి పూసే కాటుకా, బుగ్గకి పూసేస్తుందనీ…’ అన్న తీరుగా వుండగా, “వచ్చాడు, వచ్చాడు” అంటూ మా వదిన మళ్ళీ నవ్వుతూ పరిగెత్తుకు వచ్చి నా చెవిలో గుసగుసగా “వచ్చీ రావడంతోనే మీ అమ్మని రమణి ఏదీ? అని అడిగాడు” అని చెప్పింది! నాకు ఎదురు వెళ్ళాలనీ వుందీ… వద్దూ అని వుంది… ఇప్పటిదాక నేను తనని నానీ వాళ్ళతో కలిసి ఏడిపించడం, తను సిగ్గుపడ్తున్నా, నేనే ముందుకెళ్ళి పలకరించడం తప్ప, నేను సిగ్గుపడ్డది ఎన్నడూ లేదు! ఇదంతా జరుగుతున్నప్పుడు మా అన్నయ్య అస్సాంలో గౌహతిలో వున్నాడు.

చివరికి అతి కష్టం మీద, ముందుకెళ్ళి “కాఫీ తాగుతారా?” అని అడిగాను. “నువ్విస్తే ఏమైనా తాగుతాను” అన్నాడు చిలిపిగా. నేను సిగ్గుల మొగ్గనయి వుంటాను. పెద్దగా ఈ సిగ్గు అన్న పదం అలవాటు లేకపోవడం వలన… ఎంత పడ్డానో ఇప్పుడు చెప్పలేను! కానీ సిగ్గుపడ్డాను, అని జ్ఞాపకం వుంది. మెలికలు తిరిగి పరిగెత్తి ఎవరి వెనుకో అయితే దూరలేదు! అంతదాక గుర్తుంది. మా అమ్మ చెప్పేది, మా ఆఖరి మేనత్త సుందరి అత్తయ్య, కాబోయే భర్త రాగానే, వెళ్ళి సిగ్గుతో బాత్‌రూమ్‍లో తలుపేసుకుని కూర్చునేదిట. ఆయన వున్నంత సేపు బయటకి వచ్చేది కాదుట! మాట్లాడడం అసలే వుండేది కాదుట! “నాకు సిగ్గు బాబోయ్” అని చిందులు తొక్కేసేదట… ఇంతా చేసి చుట్టాలబ్బాయే, ఎప్పుడూ చూసేవాడే, కానీ పెళ్ళి కుదరడం చేత, ఇవన్నీ అనేది అమ్మ. మా అమ్మకి తను క్లాస్‌మేట్ కూడాను! అందుకే కాస్త ఆవిడతో చనువెక్కువ!

పెళ్ళి జరుగుతుంటే, మేమిద్దరం చూపులతో మాట్లాడుకుంటూ, తను నా స్నఫ్ కలర్ పట్టుచీరని కళ్ళతో మెచ్చుకుంటూ, నేను కళ్ళు మరల్చుకుంటూ, మొత్తానికి పక్కపక్కనే కూర్చున్నాం.

“ఆ తెల్లటి పొడవాటి అబ్బాయి ఎవరూ?” అని దగ్గర బంధువులు అడిగేటంత ప్రత్యేకంగా తను కనిపించేవాడు! అసలు కళ్ళ ముందుకి రాగానే “నన్ను నలుపు అన్నావట… మా క్లాస్‍లో రాణీ టీచర్ నేనే తెలుపనేది తెలుసా? ‘బెగ్గర్ మెయిడ్’ పోయమ్ సెవెన్త్ క్లాసులో వుండేది. అందరికన్నా తెల్లగా వుంటానని నా చేతే ఆ వేషం వేయింది కూడాను! ఆ మీనింగ్ తెలియదు. “నేను బెగ్గర్ మెయిడ్… బెగ్గర్ మెయిడ్” అని ఇంట్లో ఆనందంగా చెప్తే, మా అమ్మమ్మ “ఇంతకన్నా దొరకలేదా మా మనవరాలి చేత వేయించడానికి?” అని రాణీ టీచర్‌కి క్లాస్ తీసుకుంది. కానీ నన్ను ఆవిడ అందరికన్నా తెల్లని పిల్లగా నిర్ధారించింది, అదీ ముఖ్యం! సో… ఇవన్నీ చెప్పి, “మీ ఇంట్లో అందరూ అతి తెలుపని, మమ్మల్ని నలుపు అంటావా? ఇంత రేసిజమ్ అవసరమా?” అని దులిపెయ్యాలని రాత్రి అంతా అనుకున్న మాటలు మర్చిపోయి, పాత సినిమాల్లో, ‘డాన్స్ నాటకాలు’, ‘పెళ్ళి పందిర్లో’, ‘కుచ్చెల కుమారీ, జయశ్రీ, విజయలలితా’ వాళ్ళు వేస్తుంటే, ముందు వరుసలో కూర్చుని హీరో హీరోయిన్లు ఆ పాట తమ గురించే పాడ్తున్నరని తలచి మురిసిపోయినట్లు, ముసి ముసి నవ్వులు నవ్వుకుంటూ, ఒకరి వైపు ఒకరం ‘విరి చూపులు విసురుకుంటున్నట్లు’ చూసుకుంటూ ఆనందించాం! ఆ తర్వాత “సోమవారం నాకు ఆఫ్… పొద్దుట వస్తా… మాట్లాడాలి” అన్నారు.

ఆ తర్వాత సోమవారం రానే వచ్చింది… నేను ఎదురు చూశాను… ఆయన వచ్చారు… ఒకే ఒక్క మాట డైరక్ట్‌గా అడిగారు “నన్ను పెళ్ళి చేసుకుంటావా? నాకైతే ఇష్టం” అని. కనురెప్ప కొట్టే పాటి సమయం తీసుకోకుండా ‘ఊ’ అని తల నిలువుగా వూపాను. ‘పెళ్ళంటే పందిళ్ళు… తప్పెట్లు తలంబ్రాలు… మూడే ముళ్ళూ ఏడే అడుగులూ…. మొత్తం కలిపి నూరేళ్ళూ’ అన్న పాటలా… సందడిగా జరిగింది, కానీ మిగతావి ఏవీ లేవు మా పెళ్ళిలో. మా అత్తగారికి ఇష్టం లేకపోవడం వల్ల, మేము పెళ్ళికి ముందు ఏడాదిన్నర వెయిట్ చేసిన పీరియడ్‍లో చాలా సందళ్ళు జరిగాయి. పద్ధతిగా, మా నాన్నగారు వూళ్ళో లేరని, మా బాబయ్‌ని వెంట పెట్టుకు వెళ్ళి, మా అత్తగారూ, మామగారూతో మాట్లాడడానికి వెళ్ళిన అమ్మ, కాసేపటికే బాగా ఏడుస్తూ, బ్రేక్ అయి ‘ఆడపిల్లను కనడమే మహా పాపం!’ అన్నట్లు ఇంటికొచ్చింది. కళ్ళు తిరిగి పడిపోయింది. మా నాన్నగారొచ్చి “మా ఆవిడని ఎవరూ ఇన్ని మాటలనలేదు బాబూ” అని మా ఆయనతో నిష్ఠూరమాడారు! మా సాయి బాబాయ్ నాతో “కాఫీ ఇవ్వవే” అని, నేను కన్నీళ్ళతో కాఫీ ఇస్తే తాగి, “మీ అత్తగారు రచయిత్రి అయివుంటే, రంగనాయకమ్మ గారూ, మాదిరెడ్డి సులోచనగారి మాదిరి పెద్ద పెద్ద నవలలు రాసి వుండేది… ఏమా వాక్ప్రవాహమూ? ఆ పెద్ద పెద్ద వాక్యాలూ? వదినా?” అని నవ్వాడు. ఆవిడ మాదిరెడ్డి సులోచనకి క్లోజ్ ఫ్రెండ్. ఆ విషయం బాబాయ్‌కి అప్పుడు తెలీదు! నాకు మాత్రం ఆవిడకి అంత ఇష్టం లేదు మా పెళ్ళి అని తెలిసినా, వెనక్కి వెళ్ళిపోవాలనీ, ప్రభాకర్‍ని ఎందుకింత గొడవలు పడి, పెద్దల ఇష్టాలకి వ్యతిరేకంగా పెళ్ళి చేసుకోవడం? అనిపించలేదు. మా బాబాయ్ ‘మీ అత్తగారు’ అని ప్రభాకర్ తల్లిని సంబోధించగానే ఆవిడే నా అత్తగారు అని సెటిల్ అయిపోయాను.

ఆ తర్వాత మేం ఇద్దరం పెద్దలని నొప్పించక, మేం నొవ్వక, ఓపిగ్గా ఆవిడ మనసు మారేదాకా వెయిట్ చేద్దాం అని ఏడాదిన్నర వెయిట్ చేసాం. కానీ ఆవిడ మనసు మార్చలేకపోయాను.

నేను నాగపూర్ మా పెద్దమ్మగారి ఇంటికి వెళ్ళినప్పుడు, ప్రభాకర్ నా కోసం డిగ్రీలో చేర్పించడానికి కస్తూరిబా గాంధీ కాలేజీలో, అప్లికేషన్ ఫార్మ్ తీసుకుని, తనకి నచ్చిన సబ్జెక్ట్స్ వ్రాసి సబ్‍మిట్ చేసాడు. పొలిటికల్ సైన్స్, పబ్లిక్ అడ్మినిస్ట్రేషన్, ఎకనామిక్స్, సెకండ్ లాంగ్వేజ్ సాన్‌స్క్రిట్ అని! తెలుగు స్కోరింగ్ సబ్జెక్ట్ కాదని ఎవరూ తీసుకునేవారు కాదు!

మా ఉమక్క, మా ఇంట్లోనే వుండి కంప్యూటర్ సైన్స్‌లో ఎం.టెక్ చేస్తూ వుండేది. దాని క్లాస్‍మేట్స్, వాళ్ళతో సినిమాలు, ప్రభాకర్‍తో షికార్లూ, చాలా కొద్ది జీవితం… పెళ్ళి కాక ముందు వుండే లంగా ఓణీ సరదా రోజులు అనుభవించాను. నాకు బాల్యం తర్వాత పెళ్ళి… పిల్లలూ లా వుంటుంది తలచుకుంటుంటే. పెళ్ళికి ముందు ‘రెండేళ్ళు’ అని ఆయన అడిగిన గడువు మాత్రమే యవ్వనంలో నేను గడిపిన ‘కేర్ ఫ్రీ’ జీవితం!

నేను నాగపూర్ నుండి వచ్చి, ఆయన రాసిన ప్రకారం సబ్జెక్ట్సు తీసుకున్నా, తెలుగు మేడం కిళాంబి జ్యోతిర్మయి గారు పాఠం చెప్తుంటే, విని కదలలేక, వెంటనే వెళ్ళి సెకండ్ లాంగ్వేజ్ సాన్‍స్క్రిట్ నుండి తెలుగుకి మార్పించుకున్నాను… అక్కడే జీవితం నాకు తెలీకుండానే ఒక మలుపు తిరిగింది. నవలలు, క్లాసు పుస్తకాల కన్నా ఎక్కువ ఇంట్రెస్టింగ్‌గా కనిపించాయి. మా కాలేజీ లైబ్రరీ అందుకు సాయం చేసింది. అక్కడి నుండి నారాయణ రావు, కోనంగీ, మహాశ్వేతా, శ్రీకాంత్, గృహదహనం, పల్లీయులూ, చెలియలి కట్టా, చివరికి మిగిలేదీ; ఆ తర్వాత యద్దనపూడీ, యండమూరీ, మల్లాదీ, అద్దె పుస్తకాల షాపులూ, జీవితాన్ని చూపించాయి! రష్యా మొత్తంలో  రాజ్ కపూర్ అన్న నటుడూ, ‘రామయ్యా వస్తావయ్యా’ అనే ఒకే ఒక భారతీయ సినిమా పాటా ఫేమస్ అయినట్లు, అప్పట్లో, యండమూరి వీరేంద్రనాథ్ ఒక్కరే, బి.ఎ.లో మా క్లాస్ అమ్మాయిలందరికీ అభిమాన రచయిత! ఆయన నవలలు తెగ చదివాం. తర్వాత మల్లాది గారి నవలలు రియాలిటీస్ కూడా చూపించాయి. ‘పడమటి సంధ్యారాగం’, ‘మందాకిని’, ‘అందమైన జీవితం’ లాంటివి…

బి.ఏ. రెండో సంవత్సరం ఫైనల్ ఎగ్జామ్స్ మధ్యలో, పబ్లిక్ ఎడ్మినిస్ట్రేషన్ ఎగ్జామ్ ముందు రోజు, మా ఇద్దరికీ అశోక్ నగర్ రిజిస్ట్రార్ ఆఫీసులో, సివిల్ మేరేజ్ జరిగింది, చాలా సింపుల్‍గా! ఆ సాయంత్రం సారస్వత పరిషత్‍లో రిసెప్షన్! నా ఫ్రెండ్స్ వచ్చారు.

రచయిత్రి పెళ్ళి ఫోటో

మొహం కడుక్కుని, పౌడర్, కాటుకా, కళ్యాణం బొట్టూ, ప్రభాకర్ కొన్న పసుపు బోర్డర్ ఆకుపచ్చ పట్టు చీరా, మా ఉమ జడకి చుట్టిన పూలదండతో పూలజడా! ఇప్పట్లా బ్యూటీషియన్స్, వీడియో కవరేజే ఏవీ లేవు! ఫొటోగ్రాఫర్ తీసిన ఫొటోలు తప్ప!

(సశేషం)

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here